Archive

Archive for the ‘అవినీతి’ Category

ఇడుపులపాయ ఎస్టేటు – ఆంధ్రప్రదేశ్ ఎస్టేటు

November 1, 2008 10 comments

ఈ రెండూ శివదేవుడివే!

ఇడుపులపాయలో ఆసామికి తెలవకుండా ఒక్ఖ మొక్కజొన్న కండెను కాపలావాడు తెంపుకెళ్ళగలడా? నాలుగు మామిడికాయలను కోసుకెళ్ళి ఆవకాయ పెట్టుకోగలడా? ఆ సంగతి ఆసామికి తెలిస్తే వాడి కథేమవుతుంది? “అయ్యా ఫలానా మునిరత్నం దొంగతనంగా మామిడికాయలు కోసుకెళ్ళాడు” అని మరో వెంకటప్ప ఆరోపిస్తే ఏం జరుగుతుంది? పంచాయితీ జరుగుతుంది నిజమేమిటో తేలుతుంది. దొంగ అని తేలితే మునిరత్నం, ఆరోపణ తప్పని తేలితే వెంకటప్పల సంగతి తేలిపోతుంది. వాళ్ళిక పని చాలించి ఎస్టేటు బయటికి నడవాల్సిందే!

కానీ, అయ్యవారి ఆంధ్రప్రదేశ్ ఎస్టేటులో మాత్రం అలా జరగలా!

తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక పన్ను కింద ప్రభుత్వానికి రావలసిన డబ్బులోంచి ఏడు కోట్లు తినేసారని మంత్రి గొల్లపల్లి సూర్యారావు (మొదటి సూర్యుడు) ఆరోపించాడు. తిన్నది మంత్రి దివాకరరెడ్డి (రెండో సూర్యుడు) అట. అదొక్కటే కాదు.. తాను జిల్లా పర్యటనకు వచ్చినపుడు తిరిగేందుకుగాను ఒక కొత్త కారు కొనిపించాడట. ఎవరెవరో తిరిగిన కారులో తిరగను, కొత్తకారు కావాల్సిందే అని చెప్పి మరీ కొనిపించాడట – స్వయంగా సూర్యారావు చెప్పిందే ఇది. వీళ్ళిద్దరికీ ఈ వివాదం విషయంలో ఉన్న తక్షణ సంబంధం ఏంటంటే.. దివాకరరెడ్డి తూగోజీకి ఇన్‌ఛార్జి మంత్రి. గొల్లపల్లి ఆ జిల్లాకు చెందినవాడు. మనకు తెలిసిందిది.., తెరమాటున ఇద్దరికీ ఎన్నున్నాయో ఆ శివదేవుడికే ఎరుక!

సరే వీళ్ళ గొడవిలా ఉంటే, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించవలసిన ముఖ్యమంత్రి ఏంచేసారు? దాని మీద విచారణ కోసం ఓ మంత్రుల కమిటీ వేసి నాటకమాడారు. వాళ్ళు విచారణ చేసిందేమిటి? నీ ఆరోపణలను ఉపసంహరించుకోమని మొదటి సూర్యుడికి చెప్పారు, నచ్చజెప్పారు. లేకపోతే నీ సంగజ్జూస్తామని బెదిరించి ఉంటారు. నీ నలుపును కూడా బయటపెడతాం గురివింద గింజా అని తర్జని చూపించి ఉంటారు. దెబ్బకి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి రెండో సూర్యుని మనసు నొప్పించినందుకు చింతించాడు. బయటికొచ్చాక, బయటపడ్డ చేపలాగా కాస్త గింజుకోజూసాడుగానీ, చివరికి లొంగిపోయాడు.

ఇంతకీ ఆ ఏడుకోట్లు ఉన్నట్టా, పోయినట్టా? మంత్రి తిన్నట్టా తిననట్టా? తిన్నట్టైతే రెండో సూర్యుడు ఇంకా మంత్రివర్గంలో ఎందుకున్నట్టు? తిననట్టైతే ఆ సొమ్ము ఎక్కడికి పోయినట్టు? ఆరోపణలు చేసిన మొదటి సూర్యుడు ఇంకా మంత్రివర్గంలో ఎందుకున్నట్టు? సాధారణ మానవుడికి తెలిసిందొకటే -ఇద్దరిలో ఎవరో ఒకరే మంత్రివర్గంలో ఉండాలి. ముఖ్యమంత్రి చెయ్యాల్సిందల్లా ఉండాల్సిందెవరో, బయటికి పంపాల్సిందెవర్నో తేల్చడం -అంతే! కానీ ఇదేమీ జరగకుండా అందరూ కలిసి ఏదో ఒప్పందానికొచ్చినట్టు కనబడుతోంది. ఏంటా ఒప్పందం?

ఆంధ్ర ప్రదేశ్ ఎస్టేటుతో ఒక సౌలభ్యం ఉంది. ఆస్తి ఆసామీది కాదు, జనాలది! ఆస్తి పరిరక్షణ మాత్రం ఆసామి పని. తనవాళ్ళు, తనకిష్టమైనవాళ్ళు ఆ ఆస్తిని నంజుకు తిన్నా.. ఆసామికి పోయేదేమీ లేదు. పరిరక్షుకుడుగా తాను ఉండాలి, అంతే!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఇడుపులపాయ ఎస్టేటులో కొంత ముక్క జనాలదే అని రాజావారు గతంలో చెప్పారు. మా పూర్వీకులు కలిపేసుకున్నారు అని ఆయనే చెప్పుకున్నారు. పెద్ద ఎస్టేటులోంచి చిన్నదాని లోకి మార్చుకున్నారన్నమాట!

Advertisements

ఏప్రిల్ 1 వచ్చింది.. పోయింది!

ఎమ్మెల్యేల ఆర్జనలపై విచారణ అన్నారు. ఇప్పటి వాళ్ళే కాదు.., 1978 నుండి ఎన్నికైన వారందరిపైనా అని అన్నారు. ఏప్రిల్ 1 న తేల్చేస్తామని అన్నారు. ఏప్రిల్ 1 వచ్చింది.., పోయింది కూడా! కానీ ఏం జరగలేదు. ఒక్కళ్ళు కూడా దాని గురించి ఎత్తలేదట.

స్పీకరు గారింకో మాటన్నారట.. ఆంధ్రజ్యోతిలో రాసారు..

అటు న్యాయ వ్యవస్థ, ఇటు పాలనావ్యవస్థ – రెండూ సరిసమానమైనవేనట,
అందువల్ల ఒకరిని ఒకరు గౌరవించుకోవాలట,
ఇప్పుడు ప్రజా ప్రతినిధుల ఆస్తిపాస్తుల గురించి విచారణ జరపవలసిందిగా తీర్మానం చేసి కోర్టును ఆశ్రయించడం అంత ఉచితం కాదట

తప్పులున్నాయేమోనని వెతకబోతే గౌరవానికి భంగమెలా అవుతుంది? చట్టం తనపని తాను చేసుకుపోనివ్వటమే గదా వీళ్ళు చేస్తోంది! కాబట్టి ఈ సందేహాలను పక్కనబెట్టి, శాసనసభ తీర్మానం చేసి, కోర్టుకు ఉత్తరం రాయాలి.

చూద్దాం.., ఇవ్వాళైనా ఆ తీర్మానం సంగతి తేలుస్తారేమో!

మరోసారి తలంటు!

November 22, 2007 3 comments

ప్రాజెక్టుల్లో తప్పులు జరిగాయని సియ్యేజీ అంటోంది. పత్రికలు, ప్రతిపక్షాలూ పెడుతూ వస్తున్న గోల నిజమేనని తేలిపోయింది. గోదావరి జల వినియోగ అథారిటీ పై తన నివేదిక (cag.nic.in/html/cag_reports/andhra/rep_2007/civil_chap_3.pdf) 70 వ పేజీలో సియ్యేజీ ఇలా అంది:

“There were serious deficiencies in the efficient, economic and effective implementation of the projects undertaken under GWUA. The schemes were undertaken without proper care in finalizing the ayacut, source and availability of assured power supply…”


“..The agreements were one sided in favour of the contractors and suitable provisions were not incorporated to protect Government interest. The consultants were not made responsible for any deviations in quantities, designs and drawings during execution. The contractors enjoyed huge undue benefits due to incorrect projection of materials required, preparation of unrealistic estimates, etc. Despite being monitored at all levels, the rate of progress in the works under SSP and JCRDLIS is not as per the milestones fixed.”

ప్రభుత్వం మాత్రం తనకు అలవాటైన పద్ధతిలోనే రాజ్యాంగ సంస్థ, సియ్యేజీ మీద కూడా ఎదురుదాడి చేస్తోంది. ప్రాజెక్టుల అంచనాలు పెంచేశారంటూ ‘కాగ్‌’ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని మంత్రి పొన్నాల లక్ష్మయ్య కొట్టిపారేసాడంట! మరీ చిత్రమేంటంటే “తన హయాంలో ‘కాగ్‌’ ఇచ్చిన నివేదికలన్నింటినీ చంద్రబాబు అంగీకరిస్తారా?” అని అడిగాడంట. బాబొప్పుకుంటే ఈయనొప్పుకుంటాడు గామోసు!

ఇలాంటి నివేదికలు వచ్చాక, బాధ్యుల మీద చర్యలేమీ లేకపోతే ఇట్టాగే మాట్టాడతారు.

బస్సు దోపిడీ!

October 16, 2007 4 comments

ప్రైవేటు బస్సుల అరాచకాన్ని అరికట్టేందుకు దసరా సమయాన ఒక దుర్గమ్మ పూనుకోవలసి వచ్చింది. ప్రైవేటు బస్సుల ఆగడాల గురించి మనకు తెలిసిన విషయాలు చాలానే ఉన్నాయి. ప్రభుత్వానికీ ఇవి తెలుసు. ఇవిగో కొన్ని..

 1. ప్రభుత్వానికి జెల్ల కొట్టడంలో వీళ్ళది అందె వేసిన చెయ్యి. టూరిస్టు క్యారేజిగా తిరగాలవి.. కానీ స్టేజి క్యారేజిగా తిరుగుతాయి. ఆంధ్ర దేశంలో ఉన్నవాళ్ళందరికీ తెలుసా సంగతి, సంబంధిత అధికారులకు తప్ప!
 2. హై. నుండి మీ ఊరికి ఒక బస్సూ, అట్నుండి ఇటొకటీ ఒకే సమయానికి బయలుదేరుతాయి. ఒక్కో బస్సుకు ఒక్కో ప్రత్యేక రిజిస్ట్రేషను నంబరుంటుంది (కదా!). రెంటికీ పన్ను కడతారని మనబోటి అమాయకులం అనుకుంటాం (కదా!). పాపం ప్రభుత్వమూ అలాగే అనుకుంటుంది. (ఔనా! ఏమో?) కానీ వాళ్ళు ఒకదానికే కడతారు.. ఆ నంబరు పెట్టుకునే రెండు బస్సులూ తిరుగుతాయి.
 3. రాత్రి ఎనిమిది నుండి పదింటి దాకా కూకట్‌పల్లి నుండి దిల్‌సుఖ్ నగరు దాకా చూడాలి.. మాఊరు, మీ ఊరని లేదు.. మొత్తం రోడ్డంతా వాళ్ళదే. రోడ్డు మీంచి ఒక్క అంగుళం కూడా దిగరు. మన హై. ముష్టి రోడ్లకు తోడు వీళ్ళ ఆగడం జతై మనకు నరకమే కనిపిస్తుంది.
 4. బస్సుపైన బస్సెత్తున సామానేస్తారు. హై. దాటేటప్పటికి పన్నెండు దాటుద్ది. ఇక ఆపైన ప్రయాణం మేఘాల్లో తేలిపోతూ సాగుతుంది. పైప్రాణాలు పైనే పోతాయి. మొన్న ఈనాడులో చూసాం కదా ఏం జరిగిందో!
 5. ప్రజలను దోచడంలో వీరు ఎమ్మెన్సీలకు పాఠాలు చెప్పగలరు. ప్రతి శుక్రవారం హై. నుండి గుంటూరు వెళ్ళే కొన్ని (అన్నీనా.. ఏమో?) బస్సుల్లో టిక్కెట్టు వెల పెరుగుతుంది. ఆది వారం అటునుండి వచ్చే టిక్కెట్లు వాస్తాయి. వీకెండుకు ఇంటికెళ్ళే సాఫ్టువేరు శ్రీమంతుల స్పెషలది. ఇది వారాంతపు స్పెషలు దోపిడీ. టిక్కెట్ల నల్లబజారు! సినిమా హాళ్ళ వాళ్ళు కొత్త సినిమాలకు టిక్కెట్లను పెంచేసినట్టు!!
 6. మీ ఊరి నుండి కూకట్‌పల్లి వెళ్ళాలని ఎక్కుతారు. పొద్దున్నే ఎస్సారు నగర్లో ఆపేసి, ఇకపోదు, అదిగో ఆ బస్సెక్కండి.. ఇదుగో ఈ ఆటోలో వెళ్ళండి అని అంటారు.

ఈనెల 5న మా అమ్మానాన్నా పొన్నూరు నుండి ప్రైవేటు బస్సులో వచ్చారు. రాత్రి రెండున్నరకి మా నాన్న ఫోను చేసారు.. “బస్సు బోల్తా పడింది, చీకటిగా ఉంది, ఎక్కడున్నామో తెలీదు, అంతా క్షేమమే, కంగారు పడొద్దు” అని. కాస్సేపటి తరవాత ఏదో ఆర్టీసీ బస్సులో ఎక్కి, పొద్దున తొమ్మిదిన్నరకు ఇంటికి చేరారు. ఇంతకీ, బస్సు డ్రైవరు పారిపోయాడు! వాడు అసలు డ్రైవరు కాదు.. అసలు డ్రైవరు గారి బావమరిదో మరొకడోనంట. అంతకు ముందు అక్కడెక్కడో ఆపి, దిగిపోయి, కాస్సేపాగాక మళ్ళీ ఎక్కాడంట.. అక్కడ మందేసి ఉంటాడని ప్రయాణీకుల అనుమానం!

ప్రైవేటు బస్సులని ఎత్తెయ్యాలని కాదు.. వాటిని అదుపు చెయ్యాలి. ప్రజలను వాళ్ళు పెట్టే ఇబ్బందుల నుండి రక్షించాలి. టిక్కెట్టు రేట్లు అదుపు చెయ్యాలి (ఆర్టీసీ వాళ్ళను చేసినట్టుగా). ప్రయాణీకుల బళ్ళు ప్రయాణీకుల కోసమే నడవాలి. సరుకు రవాణా కోసం వాడరాదు.

ప్రస్తుతానికి పూనం మాలకొండయ్యదే పైచేయి. చూద్దాం, ప్రభుత్వమామెను ఎన్నాళ్ళు పనిచెయ్యనిస్తుందో!

ఎవరెవరి సంపాదనలెంతెంత?

October 9, 2007 7 comments

నాయకుడు, ప్రతినాయకుడుల సంపాదనలు ఎవరెవరివి ఎంతెంతో తేల్చడానికి విచారణ కమిషను వేసేందుకు సిద్ధమట! ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. మంచిది. ఏం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారో చెబితే సుఖమేముంది? చేస్తే గదా ప్రయోజనం!?

కాబట్టి ముఖ్యమంత్రి గారూ! వెంటనే ఆ కమిషనేదో వెయ్యండి. మీరిద్దరేగాదు, రాజకీయులంతా ఎవరెవరు ఎంతెంత మెక్కారో తేల్చండి.

మీరిద్దరూ అవినీతిపరులని తేలిందనుకోండి.. మీ సొమ్ములు గుంజేసుకుంటే ఒక్క గజం భూమి కూడా అమ్మకుండా మొత్తం ప్రాజెక్టులన్నిటినీ కట్టి పారెయ్యొచ్చు. (మీరే చెప్పుకున్న మీమీ ఆస్తుల వివరాలను బట్టి చెబుతున్నాను) మాకు రెండిందాలా లాభం.. మీరు కొట్టేసిన మా డబ్బులు మాకు తిరిగొచ్చేస్తాయి. మిమ్మల్నెలాగూ జైల్లో తోసేస్తారు కాబట్టి మాకు మీ పీడ విరగడౌతుంది. ఇంకో లాభం కూడా ఉంది.. మీ గతి చూసాక మీ తరవాత వచ్చేవాళ్ళు మీలాగా బరి తెగించరు.

అలాకాక, మీరు అవినీతిపరులు గాదనీ, స్వచ్ఛమైన తెల్ల చొక్కాల్లాంటి వాళ్ళనీ తేలిందనుకోండి.. మా ఖర్మ ఇంతేలే అని సరిపెట్టుకుంటాం. ఎన్ని దర్యాప్తు ప్రహసనాలు చూళ్ళేదు గనక!

మీ నిర్వాకం సంగతి చూడ్డానికి వేరే రాష్ట్రానికి పోవాలా ముఖ్యమంత్రీ?

September 15, 2007 14 comments

ఏ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో లాగా అభివృద్ధి జరగడం లేదట. ముఖ్యమంత్రి అంటున్నాడు. ఈ సంగతి తేల్చేందుకు ఏ రాష్ట్రానికైనా సరే వెళ్ళి చూద్దామని సవాలు కూడా చేసాడు. ఇద్దరం కలిసి వెళ్ళి చూసొద్దామని చంద్రబాబును ఆహ్వానించాడు కూడా.

మన అభివృద్ధి సంగతి తెలుసుకుని మూర్ఛబోదామని నాకూ ఉంది. కానీ అంతకంటే ముందు చంద్రబాబు, ఇతర ప్రతిపక్షాలు అలా దేశం తిరిగొస్తే ప్రయోజనమేమైనా కలుగుతుందా అని ఆలోచించ దలచాను. ఈమధ్య ఈ జనాలు ఓబులాపురం చూసొచ్చారు. సింగడు అద్దంకి వెళ్ళొచ్చాడు అన్నట్టు.. వీళ్ళూ వెళ్ళారు, వచ్చారు. తెదేపా ‘ఏమీ బాలేదు’ అని అంది.. ఏంబాలేదో, ఎందుకు బాలేదో చెప్పలేకపోయింది, మామూలుగానే! మిగతావాళ్ళు ‘ఏంలేదు అంతా బానే ఉంది’ అంటూ జేజేలు కొట్టొచ్చారు. ఆ మాత్రపు ముష్టి పని కోసం ఈ నాయకులంతా పాంట్లు ఎగలాక్కోని ఓబులాపురం దాకా పొయ్యొచ్చారు. అవునులే జీవితంలో మరో రకంగా ‘గాలి’మిషను (హెలికాప్టరు) ఎక్కగలిగే వాళ్ళా!? ‘గాలి’ అబ్బాయి వీళ్ళని చూసి ముష్టి వెధవలని అనుకొని నవ్వుకొని ఉంటాడు. హై. లో కూచ్చుని గనులు లీజుకెలా ఇచ్చారో పరిశీలిస్తే ఇక్కడే తెలిసిపోయేది ఆ లీజు భాగోతం; కోర్టుకు తెలిసిపోలా!!?

వీళ్ళింత చేతకాని వాళ్ళని తెలిసే ముఖ్యమంత్రి వెళ్ళొద్దాం వస్తారా అని చిటికెలేస్తున్నాడు. అసలు మన గొప్ప తెలుసుకొనేందుకు ఎక్కడికన్నా పొయ్యి రావాలా, అనేది నా సందేహం.

ముఖ్యమంత్రీ.. అక్కడికెళ్ళి ఏంచేస్తారు?

 • ప్రజల పట్ల ఇంత బాధ్యతారాహిత్యంగా, ఇంత నిష్పూచీగా ఉండే ప్రభుత్వం మరోటుందేమో చూసొస్తారా?
 • కోర్టులు మీ ప్రభుత్వాన్ని తిట్టినట్టు ఇంకెవరినైనా తిట్టారో లేదో తెలుసుకుంటారా?
 • తరాల తరబడి ప్రభుత్వ భూములను కాజేసి, వాడేసుకొని ఇవ్వాళే తెలుసుకున్నట్టు, ప్రభుత్వానికి అప్పజెప్పినట్టూ నాటకాలాడే పత్తిత్తుల కోసం వెతుకుతారా?
 • రాష్ట్రం మొత్తాన్ని ప్లాట్లు చేసి లాట్లుగా అమ్మేసే ప్రభుత్వం ఇంకెక్కడైనా ఉందేమోనని చూసొస్తారా?
 • ఫైళ్ళు చూడకుండానే సంతకాలు పెట్టేసే ముఖ్యమంత్రులు, తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టిచ్చేసే మంత్రులు ఇంకా ఎక్కడెక్కడున్నారో చూసొస్తారా?
 • నేరస్తులతో చెట్టాపట్టాలేసుకు తిరిగే పాలకుల కోసం వెతుకుతారా?
 • పర్సనల్ కార్యదర్శి నుండి ప్యూను దాకా అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిన మరో పేషీ ఎక్కడన్నా ఉందేమోనని చూసొస్తారా?
 • బినామీ పేర్లతో కంపెనీలే పెట్టిపారేసే మంత్రులు ఇంకా ఎక్కడైనా ఉన్నారో లేదో చూసొస్తారా?
 • ఒకదాని తరవాత ఒకటి బాంబులేసినోడెవడో నీకు తెలీదు. గుజరాతులో నేరం జరిగితే, వాళ్ళు, మీ పోలీసుల్లోనే దొంగ వెధవలున్నారంటూ ఇక్కడికొచ్చి మరీ చెప్పి పోయారు. ఈ మాత్రం తెలుసుకొనేందుకు పైరాష్ట్రానికెందుకు పోయి రావడం డబ్బు దండగ కాకపోతే! వాళ్ళే ఇక్కడికొచ్చి చెబుతున్నారు గదా!
 • సబ్ కాంట్రాక్టులు పొందే కుట్రతో, కాంట్రాక్టులు పెద్ద కంపెనీలకు ఇప్పించి, వాటి నుండి పొందిన సబ్ కాట్రాక్టులతో నాసి రకం కట్టుబడులతో రాజకీయులు కోట్లు పోగేస్తున్న వైనం ఇంకా ఎక్కడుందో చూసొస్తారా?
 • కడుతూ ఉండగానే కూలిపోయే వంతెనలు, పైదారులు, కిందారులు దేశంలో ఎక్కడున్నాయో వెతుక్కుంటూ పోతారా?
 • 11 కోట్లు అప్పనంగా ఇచ్చి పారేసి, ఎవడికిచ్చామో కూడా తెలీని పరిస్థితి ఇంకా ఎక్కడైనా ఉందో లేదో చూసొస్తారా?
 • రాజీవు, ఇందిర, సోనియా అంటూ చెక్కభజన చేస్తూ సొంత రాష్ట్రపు నాయకులను విస్మరించే జాతి ఇంకా ఎక్కడైనా ఉందేమోనని చూసొస్తావా?
 • గత సీవీసీ రామచంద్ర సమాల్ ఏమంటున్నారో వినబడిందా? ఇన్నాళ్ళూ ఆయన చెప్పినవన్నీ పెడచెవినబెట్టావు. ఇప్పుడు ఆయన చెప్పే మాటలు మాకూ వినబడుతున్నాయి. ఆయనిలా అంటున్నాడు..

  “ఆంధ్రప్రదేశ్ భూగర్భాన్ని సముద్రంలోపల, సముద్రం బయట ఇంత వ్యవస్థీకృతంగా దోపిడి చేయటం ఎప్పుడూ చూడలేదు.”

  “..అన్ని ఇంజినీరింగ్ విభాగాల్లో ప్రస్తుత నాణ్యత నియంత్రణ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ప్రత్యామ్నాయం ఒక భ్రమ. అందరూ కాంట్రాక్టర్లుగా మారిపోయారు.”

పై రెండు మాటలూ చాలవా మీ బాగోతాలు తెలిసేందుకు? మీ నిర్వాకాలు ఇట్టా ఏడుస్తున్నాయి. ఈ మాత్రపు బోడి సంగతి తెలుసుకునేందుకు దేశం తిరిగిరావాలా? ఏమక్కరలేదు!! అవినీతి, అక్రమాలు ఎలా చెయ్యాలో తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాలు, దేశాల వాళ్ళే ఇక్కడికి వస్తారేమో కనుక్కోండి.. ఆ రకంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు.

మీ బాగోతాలు బయట పెట్టేంతటి తెలివి ఈ చేతకాని ప్రతిపక్షానికి లేదు. ఉంటే, ఇన్నాళ్ళూ మీ ఆటలిలా సాగేవా?

రామోజీరావు x రాజశేఖరరెడ్డి

November 11, 2006 7 comments

ఈనాడుపై వ్యతిరేకతను ముఖ్యమంత్రి ఓ మెట్టు పైకెక్కించారు. ఈ సారి తన అనుంగు అనుచరులను రంగంలోకి దింపి పత్రిక ఆయువుపట్లపై దెబ్బ కొట్టే ప్రయత్నం చేసారు. ఈ దాడి వెనుక అసలు కారణం లీలగా కాదు, స్పష్టంగానే తెలుస్తూ ఉంది. తమపై వస్తున్న విమర్శలకు జవాబివ్వాల్సిన అవసరం లేదని కాంగ్రెసు వాళ్ళేనాడో నిర్ణయించేసుకున్నారు, అమలూ జరుపుతున్నారు. విమర్శించేవాళ్ళ నోరు మూయించడమే వాళ్ళ లక్ష్యం. తమవాళ్ళే విమర్శిస్తే క్రమశిక్షణా రాహిత్యం అంటారు. తెలుగుదేశం విమర్శిస్తే.. ఏం మీరేమన్నా తక్కువ తిన్నారా అని అంటారు. పత్రికలు విమర్శిస్తే.. కక్ష, పక్షపాతం, అసహనం, ఇలాంటివి అంటగడతారు. ఈనాడు-మార్గదర్శిది సరికొత్త అంకం. ఇందులో ఎవరి పాత్ర ఎంత..

ముందుగా మార్గదర్శి: దీన్ని ప్రతిదాడిగా భావించక ప్రజా ప్రయోజనాలను ఆశించి సదుద్దేశంతోటే చేసారనుకుంటే, ఈ ఆరోపణల్లో మనం గ్రహించాల్సిన విషయాలు కొన్నున్నాయి.

 1. మార్గదర్శి ఫైనాన్సు నష్టాల్లో ఉందని వాళ్ళే చెబుతున్నారు.. అయితే ప్రజల డబ్బుకు భరోసా ఏమిటి? నాదీ పూచీ అని రామోజీరావు అంటే సరిపోదు, ఆ అప్పులు తీర్చగలిగినంత ఆస్తి (నెట్‌వర్తు) తనకుందని ఆయన చూపించాలి. అది ఇంకా చెయ్యలేదు.
 2. ఇక, అసలాయన జనం దగ్గర అప్పులు తీసుకోవచ్చా, లేదా అనే విషయం – ఇది రిజర్వు బ్యాంకే తేల్చాలి.
 3. సర్వసాధారణంగా తలెత్తే సందేహం.. అసలే లోపమూ లేకపోతే కాంగ్రెసు వాళ్ళు ఇంత యాగీ చెయ్యరు, నిప్పు లేందే పొగ రాదు కదా. ఈ సందేహాన్ని పటాపంచలు చెయ్యవలసిన బాధ్యత మార్గదర్శిదే.

కాంగ్రెసు పార్టీ, ముఖ్యమంత్రి, ఆయన అంతేవాసులు:

 1. తమ అక్రమాల లీలల గురించి, ప్రాజెక్టుల అవినీతి గురించి, భూభోజనాల గురించి ఈనాడులో వస్తున్న విమర్శలను తట్టుకోలేక, పత్రికను కట్టడి చెయ్యడంలో భాగమే ఈ దాడి అని తెలిసిపోతూనే ఉంది. విమర్శలను ఎదుర్కోవడానికి సరైన మార్గం తప్పులు చెయ్యకపోవడమే. అయితే తప్పులు చెయ్యకుండా ఉండడం వీళ్ళ వల్ల కాదని మరోసారి తెలియజెప్పారు.
 2. ముఖ్యమంత్రి అసహనానికి ఇది మరో సూచిక. విమర్శించే పత్రికల పట్ల కూడా ప్రతిపక్షాల పట్ల వ్యవహరించినట్లే ప్రవర్తించడం మనం చూస్తూనే ఉన్నాం. నేనా పత్రికను (ఆంధ్రజ్యోతి) అసలు చదవనే చదవనని అలిగిన వ్యక్తి ఆయన. తనవారిని కాపాడుకునేందుకు (ఉదా:సూరి), కానివారిని కాలరాచేందుకు (ఉదా:కోట్ల విజయభాస్కరరెడ్డి వర్గం) ఏ స్థాయికైనా వెళ్ళగల వ్యక్తి. ఈ వ్యవహారం మొత్తంలో ఆయన చెయ్యి లేదంటే నమ్మశక్యం కాదు.
 3. అవినీతిని వాసన పసిగట్టే కుక్కలు మరి రాంగురోడ్డు విషయంలోను, కాందిశీకుల భూమి విషయంలోను, ఘటకేసర్ భూమి విషయంలోను మొరగలేదేంటి? భూభోక్తలు బిస్కట్లేసారా? లేక, భూభోజనాల బంతిలో తమకూ కాసిని ఎంగిలి విస్తర్లు దొరికాయా?
 4. రాంగురోడ్డుపైన, ఘటకేసరు ట్రస్టు స్థలంలో ఇంటిపైన, కాందిశీకుల భూములపైన, ప్రాజెక్టుల్లో ప్రవహిస్తున్న అవినీతి పైన, ఇంటి ముందు స్థలాన్ని కాజేసిన వైనంపైనా ఈనాడు తమపై విమర్శలు చెయ్యకుండా ఉండి ఉంటే ప్రజల ఆస్తుల రక్షణకు నడుం కట్టేవారేనా వీళ్ళు?

రామోజీరావుపై ఆరోపణలు చేసే అత్యుత్సాహంలో వీళ్ళో సంగతిని పక్కన పెట్టారు – ప్రజలు వీళ్ళ ఆరోపణల్ని నమ్మి, డబ్బు వెనక్కిమ్మంటూ అడిగితే ఏం జరుగుతుంది? తీసుకున్న డబ్బులను పెట్టుబడులుగా పెడతారు కాబట్టి, ఆ డబ్బులను ఇప్పటికిప్పుడు వెనక్కిచ్చియ్యాలంటే ఎంత గొప్ప సంస్థకైనా సాధ్యం కాదు. డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని తెలిస్తే ప్రజలు మరింత ఎగబడతారు, తమ డబ్బుల కోసం. అప్పుడు ప్రజల్లో కల్లోలం రేగదా? వీళ్ళాశించింది అదేనా?

మార్గదర్శి ప్రజల దగ్గరి నుండి డబ్బులు సేకరించకూడని పక్షంలో ఇన్నాళ్ళూ నియంత్రణ సంస్థలు ఏంచేస్తున్నట్లు?

ఏదేమైనా, స్వార్థ రాజకీయులు ఆడుతున్న ఈ నాటకంలో ప్రజలు బలి కాకుండా ఉండాలని కోరుకుందాం.

హరికథలో పిట్టకథల్లాగా ఈ జాబులో రెండు పిట్ట జాబులు:

మార్గదర్శి మీద రాజకీయుల దాడి ఇది మొదటిది కాదు. గతంలో నాదెండ్ల భాస్కరరావనే పెద్దమనిషి (నెల రాజు), రామారావును ముఖ్యమంత్రిగా పడదోయక మునుపు ఆయన మంత్రివర్గంలో ఆర్థికమంత్రిగా ఉండేవాడు. (అప్పట్లో ఆయన కోపైలట్ లెండి, రామారావేమో పైలట్! ఆ సంగతీ భాస్కరరావే చెప్పుకున్నాడు.) ఆయన మార్గదర్శి చిట్‌ఫండు పై శాసనసభలో దుమారం లేపి కొన్నాళ్ళు హడావుడి చేసాడు. అయితే అది ఎక్కువ దూరం పోలేదు. అప్పుడు చిట్‌ఫండు, ఇప్పుడేమో ఫైనాన్సు! అప్పుడు కోపైలట్టు.., ఇప్పుడేమో పైలట్టు, ఎయిర్‌హోస్టెస్సులు, స్టీవార్డులూ!

ఇక రామోజీరావు కూడా తక్కువవాడేం కాదు. ఆయనకు శత్రువులు కొల్లలుగా ఉన్నట్లున్నారు! (పత్రికాధిపతికి తప్పదేమో!!) రామారావు రాకముందు కాంగ్రెసు హయాంలోనే శాసనమండలి లో (అప్పట్లో ఉండేది! పెద్దలసభ అని గౌరవంగా అనేవారు, సభ్యులు ‘చిన్న’వాళ్ళైనా) జరిగిన ఒక ‘చర్చ’ గురించి “పెద్దల సభలో గలభా” అని ఈనాడులో శీర్షిక పెట్టి రాసారు. గలభా అనేమాట పెద్దలకు చిన్నతనంగా అనిపించి ఆయన్ను మందలించేందుకు, అరెస్టు చేసి సభకు తెమ్మని పోలీసు కమిషనరును పంపారు. (ఆ కమిషనరు మరెవరో కాదు, మొన్నటి తెదే ప్రభుత్వంలో మంత్రిగా చేసిన విజయరామారావట!) రామోజీరావు ముందే బెయిలు తెచ్చుకున్నాడు. ఆ తరువాత, ఆ శీర్షికలో తప్పేమీ లేదని తీర్పు వచ్చింది. మొత్తమ్మీద మండలి బోనెక్కలేదు ఆయన.

అవీ పిట్టకథలు! శ్రీమద్రమారమణ గోవిందో.. హారి!