Archive

Archive for the ‘ఆటలు’ Category

శతకోటికొక్కడు !

August 13, 2008 4 comments

2012 ఒలింపిక్ పోటీల్లో మువ్వన్నెల జండాని చేబట్టి భారత జట్టుకు ముందు నడిచేదెవరో తేలిపోయింది. అతడే, వందకోట్ల మందిలో అతనొక్కడే -అభినవ్ భింద్రా!

భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు సురేష్ కల్మాడి ఒలింపిక్సుకు ముందు “అక్కడేదో అద్భుతాలు జరిగిపోతాయని ఆశలు పెట్టుకోకండి.” అని అన్నాడు. ఒలింపిక్ చరిత్రలో మన మొట్టమొదటి వ్యక్తిగత బంగారు పతకాన్ని గెలుచుకొచ్చిన అభినవ్ భింద్రా మాత్రం అద్భుతమే సాధించాడు. అతనికి నా అభినందనలు కూడా!

వందకోట్ల మంది ఉన్న దేశంలో బంగారాన్ని గెలుచుకు రాగల మొనగాడి కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొదటి బంగారం తెచ్చుకోడానికి వందేళ్ళు పట్టింది. కానీ.. జనాభాకీ ఆటల్లో పతకాలకీ సంబంధం ఉందా అనేది ప్రశ్న. లేదని కొన్ని వాస్తవాలను చూస్తే అనిపిస్తోంది. జనసంఖ్యలో మనతో పోలిస్తే పిపీలికాలనిపించుకునే దేశాలకు కూడా బోలెడన్ని పతకాలు వస్తూంటాయి. అర్మేనియాలు, అజర్బైజాన్లూ, బుర్కినాఫాసోలు, ఇంకా బోలెడు పేర్లు వినని దేశాలు కూడా బంగారు, వెండి పతకాలు పట్టుకుపోతూ ఉంటాయి. బయటి దేశాల సంగతే ఎందుకు.. మన దేశంలోనే జాతీయ ఆటల పోటీలు పెడితే కేరళ, హర్యానా, పంజాబులే ముందు! ఇంకా విశేషమేంటంటే మణిపూరు, అసోంలు, వాటి మిగతా సోదరీమణులు కూడా కొన్నిసార్లు మనకంటే ముందే ఉంటాయి. (చంద్రబాబు హయాంలో జరిగిన జాతీయ ఆటల పోటీల్లో బయటి రాష్ట్రాల నుండి ఆటగాళ్ళను పట్టుకొచ్చి, మనల్ని బాగా ముందుకు తీసుకుపోయాడు, అది వేరే విషయం!) అంచేత..

తేడా జనాభాలో లేదు, మరెక్కడో ఉంది.

ఆటలకు అవసరమైన ఆధునిక సౌకర్యాలు కల్పించాలి. మనం హాకీలో వెనకబడిపోవడానికి ఒక ముఖ్య కారణం చాన్నాళ్ళపాటు మనకు ఏస్ట్రో టర్ఫు లేకపోవడమేనని చెబుతారు (తరవాత్తరవాత గిల్లుడు కూడా కారణమని తేల్చారనుకోండి). అలాగే ఆటగాళ్ళకు ఆటమీద ఏకదీక్ష, తాదాత్మ్యం ఉండాలంటే వాళ్లకు జీవిక గురించిన చింత ఉండకూడదు. రేపెలా గడుస్తుందా అనే ఆలోచన ఉంటే ఆటలేం ఆడతారు!? వాళ్లకు అలాంటి సదుపాయాలు కల్పిస్తున్నామా? ఉద్యోగాలిచ్చినా, మరోటిచ్చినా.. మన ప్రభుత్వాలు ఇచ్చే సౌకర్యాలన్నీ ఆటల్లో ఒక స్థాయికి వచ్చినవారికే! తగు చేయూతనిస్తే ఆ స్థాయికి చేరగలవాళ్ళు అనేకమంది ఉంటారు. తన స్మృతి బ్లాగులో ప్రవీణ్ ఇదేమాట చెప్పారు. పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళను చేరదీసి, ఆటగాళ్ళుగా తీర్చిదిద్దే ప్రణాళికలుండాలి. వాళ్ళకు జీవన భద్రత కల్పించాలి. ఆటల సంస్కృతి ఒకటి అవసరం మనకు!

ఆటల్లో రాజకీయుల ప్రత్యక్ష జోక్యం ఉండకూడదు. ఎంతటి గొప్ప సంస్థనైనా తెల్లారేలోగా గబ్బు పట్టించగల సామర్థ్యం వాళ్ళ సొత్తు. వాళ్ళు లేకపోతే ఈ సంస్థల్లో రాజకీయాలు కూడా తగ్గుతాయి. (రాజకీయాలు అసలే లేకుండా ఉండవనుకోండి).
ఇంతటితో ఈ జాబును ముగించి..

—————————————

పతకాలపై పెద్దగా ఆశలు పెట్టుకోవద్దన్న సురేష్ కల్మాడి గురించి రెండు ముక్కలు.. అతడో కాంగ్రెసు ఎంపీ! ఎన్నేళ్ళుగా ఉంటున్నాడో తెలీదుగానీ చాన్నాళ్ళుగా – కొన్ని ఒలింపిక్కులుగా – అతడే భారత ఒలింపిక్ సంఘానికి అధ్యక్షుడు. ఆటల పేరెత్తగానే గుర్తొచ్చేది గడ్డం పెంచుకున్న కల్మాడియే! అతని అర్హతలేమిటో తెలీదుగానీ, ఆటల పోటీలంటే చాలు ఆ పేరే వినిపిస్తుంది. ఒలింపిక్, కామన్‌వెల్త్, ఏషియన్, ఆఫ్రో ఏషియన్,ఏషియో ఆఫ్రికన్, ఏషియో అమెరికన్, అమెరికో ఏషియన్, ఏషియో ఆర్కిటిక్, ఆర్కిటికో ఏషియన్,.. ఇలా ఎన్ని రకాల ఆటలుంటే అన్నిట్లోనూ అతడే! (ఒకవేళ నేనిక్కడ రాసిన ఆటల పోటీలు లేకపోతే.. వాటిని మొదలుపెట్టినపుడు మాత్రం అధ్యక్షుడుగా అతడే ఉంటాడని చెప్పగలను) భారత అథ్లెటిక్ సమాఖ్యకు అతడు జీవితకాల అధ్యక్షుడు కూడా! 2010లో కామన్‌వెల్తు ఆటలు జరుగుతాయట.. దానికీ నేత ఆయనే! ఇన్నేళ్ళుగా ఒలింపిక్ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నవాడు చెప్పేమాట ఏంటంటే.. “ఓ.. పతకాలు వచ్చేస్తాయనీ, అద్భుతాలు జరిగిపోతాయనీ భ్రమ పడకండి” అని. ఇదీ ఇతగాడి నిర్వాకం! ఇలాంటివాడే క్రికెట్టుకి జయవంత్ యశ్వంత్ లెలే అని ఉండేవాడు. మనాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళేముందు “చిత్తుగా ఓడిపోయి తిరిగొస్తారు” అని అన్నాడు. ఇలా ఉన్నారు మన ఆటల నిర్వాహకులు!

Advertisements

మన ప్రాధాన్యతలెక్కడున్నాయి

లక్కు అనితారెడ్డి ఎవరో మీకీ పాటికి తెలిసే ఉంటుంది. బీచి వాలీబాలు ఆటలో బరి నుండి బంతి బయటికి పోయినపుడు దాన్ని తిరిగి ఆటకత్తెలకు అందించటానికి ప్రత్యేకించి కొందరిని నియమించారు – బాల్‌గర్ల్స్, బాల్ బాయ్స్. అక్కడ బంతి అందించే వ్యక్తిగా అనిత పనిచేస్తోంది. ఏప్రిల్ 5 నాటి ఈనాడు ఆమె గురించి రాసింది. ఈనాడు ఇలా అంటోంది..

“…నిజానికి ఆ అమ్మాయి సాధించిన విజయాలతో పోల్చితే ఆ బీచి వాలీబాలు క్రీడాకారిణులు లెక్కలోకి రారు. అక్కడున్నవాళ్లలో ఎవరికీ తెలియదు ఆమె జిమ్నాస్టిక్స్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించిందని…”

జిమ్నాస్టిక్స్‌లో అంతర్జాతీయపోటీలు ఆడి కూడా, సరైన ప్రోత్సాహం లేదని గ్రహించి ఆ తరువాత వాలీబాలు ఆడటం మొదలుపెట్టి, జాతీయ స్థాయికి ఎదిగింది. అలాంటి అనితారెడ్డి ఇక్కడ, ఈ ఆటలో.. బంతులందిస్తోంది. జాతీయ స్థాయికి చెందిన ఒక క్రీడాకారిణికి మంచి గుర్తింపే!!! వాలీబాలు, బీచి వాలీబాలుల పట్ల మన ప్రాధాన్యతలవి.

అయినా అనితారెడ్డి దాన్ని చిన్నతనంగా భావించటం లేదు.. అది ఆమె హుందాతనం.

శభాష్ అనితా!