Archive

Archive for the ‘ఇస్రో’ Category

ప్రయాణం మొదలైంది – చంద్రయాన్-1 (Chandrayaan-1)

October 22, 2008 15 comments

చంద్రయాన్ (Chandrayan) ప్రయాణం మొదలైంది, విజయవంతంగా మొదలైంది. మన గుండెలు ఉప్పొంగిస్తూ, మన కళ్ళలో ఆనంద బాష్పాలు తెప్పిస్తూ, మనపై మనకున్న నమ్మకాన్ని మరో కక్ష్యను దాటిస్తూ ఇస్రో పీయెస్సెల్వీని, దాంతోటి చంద్రయాన్‌ను ప్రయోగించింది.

శ్రీహరికోటలోని ఆ లాంచి కేంద్రంలో ఇస్రో శాస్త్రవేత్తలంతా వరసగా కూచ్చొని ఉన్నారు. అందరి దృష్టీ ఎదురుగా ఉన్న తెరలమీదే. అనుకున్న సమయానికి ఇంజన్లను మండించారు. పీయెస్సెల్వీ ఎగసింది. ఇప్పటిదాకా ఇలాంటి ప్రయోగాలన్నిటినీ ఏ వార్తల్లోనో రీప్లేలుగా చూస్తూ ఉన్నాం. వాటిలో స్లోమోషనులో చూపిస్తారు.. లాంచిప్యాడు మీంచి పైకి లెగవడం చాలా సేపు కనిపిస్తుంది. కానీ ఇది లైవు.. స్లోమోషను లాంటివి పీయెస్సెల్వీకి తెలవదు, ఇస్రోకీ తెలవదు. దూసుకుపోవడమే వాళ్ళకి తెలిసింది. ఇలా అంటుకుంది, అలా మాయమైంది. కళ్ళు మూసి తెరిచేంతలో మబ్బుల్లోకి మాయమైంది. మధ్యలో ఒక్కసారి మెరుపులా కనబడిందంతే!

పిల్లలతోటి చెప్పాను.., వీళ్ళు చప్పట్లు కొట్టి కౌగలించుకుంటూ ఉంటే అప్పుడు ప్రయోగం విజయవంతమైనట్టేనని. ప్రయోగించిన ఓ ఏడెనిమిది నిముషాల తరవాత అనుకుంటా.. మా ముచ్చట తీరింది. ఇస్రో శాస్త్రజ్ఞులు చప్పట్లు కొడుతూ లేచి ఒకరినొకరు కౌగలించుకున్నారు. పర్ఫెక్ట్ లాంచ్ అంటూ ఇస్రో అధ్యక్షుడు మాధవన్ నాయర్ చెప్పాడు. ఆ తరవాత, ఒకరి తరవాత ఒకరు తమ వంతుగా మాట్టాడారు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. మాటలు రావడం లేదంటూ ఒకాయన అన్నాడు. అవును మరి, చూసిన మనకే ఆనందంతో మాటలు రాలేదు.. ప్రయోగాన్ని స్వయంగా చేసినవాళ్ళు.. ఇక వాళ్ళకేం వస్తాయి!

ఇస్రో సాధిస్తున్న విజయాలు చూస్తుంటే విజయం వాళ్ళకి అలవాటైపోయిందని అనిపిస్తుంది. నల్లేరుపై నడక, కొట్టినపిండి లాంటి జాతీయాలు గుర్తుకు రాకమానవు. ఇస్రో ఇంకో రాకెట్టును విజయవంతంగా ప్రయోగించిందంటే ఓహో విశేషమేముంది, ఇది మామూలేగా అనుకునే పరిస్థితి.

ప్రకృతి కూడా ఇస్రోను ఆశీర్వదించింది. గత కొన్ని రోజులుగా వాన, ఉరుములు మెరుపులతో ఉన్న వాతావరణం ఇవ్వాళ మాత్రం హాయిగా, ప్రశాంతంగా ఉందట. మామూలు సమయం ప్రకారం సూర్యోదయమూ అయింది. బహుశా చంద్రయాన ప్రయోగాన్ని సూర్యుడూ చూడదలచాడేమో! వీళ్ళసాధ్యులు, రేపు సూర్యయాన్‌నూ ప్రయోగించరు గదా! అని అనుకొని ఉంటాడు.

శభాష్ ఇస్రో!

Advertisements
Categories: ఇస్రో

జయహో ఇస్రో!

ఇస్రో – భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ. స్వాతంత్ర్యం వచ్చాక భారత్ సాధించిన గొప్ప విజయాల్లో ఒకటి.

బ్రిటిషు వాళ్ళు మనదేశాన్ని పీల్చి పిప్పి చేసి వదిలాక, దేశ, జాతి పునర్నిర్మాణంలో ఎన్నో ఘనతలు.. వీటిలో ముందువరుసలో ఎత్తు పీటపై ఉండేది, మన అంతరిక్ష పరిశోధన. ఈ రంగంలో ఇవ్వాళ మనం ప్రపంచంలోనే మొదటి వరుసలో ఉన్నామంటే, ఈ ఘనత పూర్తిగా ఇస్రోదే. దాదాపు పూర్తిగా సొంత తెలివితెటల్తో, సొంత సాంకేతికతతో, కొద్దిపాటి వనరులతో మనవాళ్ళు రచించిన విజయగాధ ఇస్రో.

విక్రం సారాభాయీ సతీష్ ధావను
బెంగుళూరు, హైదరాబాదు,
తుంబా, శ్రీహరికోట
ఎస్సెల్వీ, ఏఎస్సెల్వీ,
పీఎస్సెల్వీ, జీఎస్సెల్వీ..
ఆర్యభట్ట, భాస్కర,
ఇన్‌శాటు, అయ్యారెస్సు..
ఎన్నో ఘనతలు, ఎన్నో విజయాలు, మరెన్నో రికార్డులు. జాతికి కీర్తి తెచ్చేవి, తరతరాలకు స్ఫూర్తినిచ్చేవి. ఒక్కో రాకెట్టు నింగికెగుస్తూంటే ఒక్కో రికార్డు నేల రాలుతుంది! జాతిగౌరవం మరో కక్ష్య ఎగబాకుతుంది! ఇప్పుడు చంద్రయాన్! కృత్రిమ ఉపగ్రహాల కక్ష్యలను దాటి మన అసలు సిసలు ఉపగ్రహం కక్ష్య వైపు చూపు! (చందమామా.. వస్తున్నాం!)

ఐదో తరగతి కసుగాయలకు షోలే గురించి పాఠం చెప్పించే అయ్యలారా!
ఇస్రో గురించి కూడా చెప్పించండి.. అది మన కీర్తి, మన పిల్లలకు స్ఫూర్తి!

సున్నా, సంస్కృతం, వేదాలు, భగవద్గీత, యోగసాధన, హైందవ ధర్మం, చదరంగం, బుద్ధుడు, అశోక చక్రవర్తి, గాంధీ.. మన కీర్తి కిరీటాలు. ఈ వరసలోదే.. ఇస్రో!

జయహో! ఇస్రో!! (-చదువరి తెలుగు బ్లాగు)