Archive

Archive for the ‘ఉగ్రవాదం’ Category

మన భద్రతే మనకు ముఖ్యం

December 6, 2008 73 comments

దేశానికి నాయకుల ప్రాణాలు ఎంత ముఖ్యమో, సామాన్యుడి ప్రాణాలు కూడా అంతే ముఖ్యం -తేడాయే లేదు. ఆఫ్టరాల్ నాయకుడికే జెడ్లూ, జెడ్‌ప్లస్సులూ ఉంటే అతణ్ణి తయారుచేసిన సామాన్యుడికెన్ని ఉండాలి? ముందు మనమీ సంగతిని ఒప్పుకుంటే ఇక ముందుకు పోవచ్చు.

———————————————

నిఘా వర్గాల నివేదికలను బట్టి, విమానాశ్రయాలను, ఓడరేవులను, భవనాలను, నేలను, నీటిని, గాలిని, కాపలా కాసి, దాడి చేసే ఉగ్రవాదులను ఎదుర్కొని, యుద్ధాలు చేసి, బాంబులను నిర్వీర్యం చేసి, వాళ్ళను చంపి, లేదా పట్టుకుని, జైల్లో పెట్టి, కేసులుపెట్టి,..
ఈ పద్ధతిలో ఉగ్రవాదాన్ని అరికట్టడం అసంభవం – కనీసం మన దేశంలో!

ఉగ్రవాదులకు ముఖ్యమైన అవసరాలు – మనుషులు, డబ్బులు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు. వీటిని అందకుండా చేస్తేనే ఉగ్రవాదాన్ని అరికట్టగలం. కింది చర్యలు తీసుకోవాలని నా ఉద్దేశ్యం..

 1. పౌరుడి భద్రత తరవాతే – కులం, మతం, సామాజిక వ్యవస్థ, రాజకీయాలు, విదేశాలతో సంబంధాలు,.. – ఏ అంశమైనా సరే! ఇక్కడో సంగతి చెప్పుకోవాలి: ఈ మధ్య మనదేశానికి చెందిన ఓ ప్రభుత్వేతర సంస్థ నుండి కెనడాకు వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరిని పారిస్‌లో ఎయిర్ కెనడా విమానం ఎక్కకుండా దింపేసారు. పాస్‌పోర్టులో ఏదో అనుమానాస్పదంగా ఉందని కారణంగా చెప్పారు – కానీ, ఖచ్చితంగా అదేంటో చెప్పలేదు. రెండో వ్యక్తిని పోనిచ్చారు -అతని పేరు దినేష్ మిశ్రా, ఆపేయబడ్ద వ్యక్తి కమాల్ హుస్సేన్. కమాల్ అదే పాసుపోర్టుతో భారత్ నుండి పారిస్‌దాకా ఇబ్బందేమీ లేకుండానే వెళ్ళాడు, అక్కడ మాత్రం తేడా కనిపించింది. వాళ్ళు చెప్పిన కారణం ఏమైనప్పటికీ (అసలు కారణమేంటో ఊహించలేనంత కష్టమేమీగాదు) – వాళ్ళకు అనుమానం వచ్చింది, మొహమాటాలేమీ లేకుండా దింపేసారు, ఎవ్వరూ మాట్టాడలేదు. “ముస్లిము కాబట్టి దింపేసారు” అని గోల చేస్తారేమో అని వాళ్ళు ఆలోచించలేదు, దింపేసారంతే! అంత గట్టిగా మనమూ ఉండాలి. భద్రత విషయంలో సర్దుకుపోయే ప్రసక్తే ఉండకూడదు.. హిందువైనా ముస్లిమైనా, మరొకరైనా కటువుగా ఉండాల్సిందే! మంత్రిగా అమెరికా వెళ్ళిన జార్జి ఫెర్నాండెజ్‌ను ఎలా శోధించారో మనకు తెలిసిందే. అంచేత భద్రత తరవాతే ఏదైనా.
 2. దేశం సంతబజారేమీ కాదు, ఎవడుబడితే వాడు వచ్చిపోయేందుకు.. పాకిస్తాను నుండి, బంగ్లాదేశు నుండి ఎట్టాబడితే అట్టా వచ్చేస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ చక్కగా ఉంటానికీ తింటానికీ సకలసౌకర్యాలూ సమకూరుతున్నాయి. ముందీ ఆశ్రయం ఇచ్చే ఇంటిదొంగలను లోపలెయ్యాలి. బయటినుండి వచ్చినవాళ్ళని వెతికి పట్టుకుని నిర్మొహమాటంగా వెనక్కి పంపాలి. పోనివాణ్ణి జైల్లో వెయ్యాలి (ఈ దేశాలు ఎలాగూ వాళ్ళని రానివ్వవు; శత్రు (కిరాయి) సైనికుల శవాలకు కూడా శాస్త్రోక్తంగా శ్రాద్ధకర్మలు నిర్వహించే సంస్కారం మనకుందిగానీ, తమవాళ్ళను తమవాళ్ళేనని చెప్పుకునే ధైర్యం లేని దేశాలవి) జన సమూహపు భద్రత ముఖ్యం, ఎవరో కొందరి – అందునా దొంగల, ఉగ్రవాదుల – మానవహక్కులు కాదు. మానవహక్కుల గురించి మాట్టాడినవాణ్ణి, ముందు గ్వాంటనామో బే గురించి తెలుసుకో బే అనాలి. 
 3. కొందరు రాజకీయనాయకులు నేరస్తులకు వత్తాసుగా నిలబడుతూంటారు. మన రాష్ట్రంలోనే ఒక మంత్రి ఒక నేరస్తుడి ఇంటికెళ్ళి పరామర్శించాడు. ఆ సంగతి ఇప్పటికి అనేకసార్లు పేపర్లలో వచ్చింది కూడాను. అటువంటి వాళ్ళని వ్యవస్థలో ఏ పదవినీ చేపట్టకుండా అనర్హులుగా ప్రకటించాలి. అందుగ్గాను..
 4. రాజకీయాల్లో నేరస్తులను ఏరెయ్యడానికి సుప్రీమ్ కోర్టు చేసిన సూచనలను పాటించి, తగు చట్టం చెయ్యాలి. ఇది చెయ్యకపోతే ఈ రాజకీయ నాయకులకు భద్రతాచర్యలపై చిత్తశుద్ధి లేనట్టే. ఈ చట్టాన్నే గనక కట్టుదిట్టమైన రూపంలో తెస్తే, కాంగ్రెసు ఎంత వెధవాయి పార్టీ అయినా సరే.. ఈ ఒక్క పని చేసినందుకు నా వోటేసేస్తాను.
 5. భద్రతావ్యవస్థలో రాజకీయాల జోక్యం కూడదు. లేదా రాజకీయాల జోక్యం లేని భద్రతావ్యవస్థ ఉండాలి. అంత తేలికైన సంగతి కాదిది.. కానీ మనకు ఎన్నికల కమిషను, విజిలెన్సు కమిషను వంటి రాజ్యాంగ వ్యవస్థలున్నాయి. ఇవి మిగతా ప్రభుత్వ విభాగాల్లాంటివి కావు. వీటి మీద ప్రభుత్వ ఆజమాయిషీ ఉండదు. అలాగే రాజకీయ జోక్యం ఉండకూడని ప్రతిపత్తి కలిగిన జాతీయ భద్రతాసంస్థ ఒకటి ఉండాలి.
 6. పోలీసు వ్యవస్థను సంస్కరించాలి. ప్రస్తుతం పోలీసు శాఖ అంటే మనం దూరందూరంగా ఉంటాం. వాళ్ళకు ప్రజలతో అనుబంధం తక్కువ. బహుశా పోలీసు శాఖకు అనుబంధంగా ప్రజలతో మమేకమై ఉండే ఒక పారా పోలీసింగు వ్యవస్థ ఉంటే బాగుంటుందనుకుంటా. స్థానికంగా సమాజంలో జరుగుతూండే మార్పులను ఈ వ్యవస్థ మరింత చురుగ్గా పసిగట్టగలుగుతుంది. సున్నితమైన ప్రాంతాల్లో ఈ వ్యవస్థ మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ముంబై దాడికి సంబంధించి అనుమానం మీద తిరువూరులోని ఒక జాలకేంద్రపు స్వంతదారును అదుపులోకి తీసుకున్నారట. పారాపోలీసుల వలన ఈ సంగతి సంఘటనకు ముందే తెలిసి ఉండేదేమో!
 7. భద్రతలో కన్నాలు ఏర్పడేందుకు ముఖ్యకారణం… ఫెటీగ్! అనుమానితుల కోసం, అనుమానాస్పద వస్తువు లేదా అంశం కోసం చూస్తూంటారు. రోజూ దొరుకుతాయా? దొరకవు. పదేపదే బాంబులు పెట్టారన్న ఫోన్లొస్తూంటాయి.. అన్నీ నాన్నా పులి కథలే! కానీ ఎక్కడో ఒకదాన్లో నిజముంటుంది. ఆ సరికి పోలీసులకు ఈ వెతుకులాట మామూలైపోతుంది.. అలసత్వం ఏర్పడుతుంది. నిజంగా దాడి జరిగే సమయానికి ఎదుర్కోలేని పరిస్థితిలో ఉండవచ్చు. ఏ షాపులోనో చూస్తూంటాం.. అక్కడొక ద్వారం పెట్టి ఉంటుంది, మనం అందులోంచి వెళ్తాం, అది కీబామని అరుస్తూనే ఉంటుంది, కానీ ఎవ్వరూ పట్టించుకున్నట్టుండరు. అసలు ఆ తోరణం లోంచి వెళ్ళకపోయినా అడిగేవాడుండడు. బహుశా దీనికి కారణం ఈ ఫెటీగేననుకుంటా. సరైన శిక్షణ పొందిన సిబ్బంది, సరిపడినంతమంది, సరైన పరికరాలూ ఆయుధ సంపత్తితో భద్రత కోసం సిద్ధంగా ఉండాలి..
 8. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతూంటారు. భద్రతలో మీరూ భాగస్వాములే అని అంటారు. చెప్పేందుకు బానే ఉంటాయి గానీ, మన సామాజిక వ్యవస్థలో ఇవి సాధ్యమవుతాయా? ఫుట్‌పాతుల మీద నిద్రపోయేవాళ్ళు, బాంబులకు భయపడితే ఎక్కడ పడుకుంటారు? నిరుపేదలు, కేవలం చెత్త కుండీలు, చెత్త కుప్పలలో దొరికే ఇనుప, ప్లాస్టిక్కు వ్యర్థాలను సేకరించి, అమ్ముకుని, జీవనం గడిపేవారు అక్కడ బాంబులుంటాయేమోనని వాటి జోలికి వెళ్ళకపోతే వారి జీవనం గడిచేదెలా? ఇవి కేవలం ఉదాహరణలే! ఇలాంటివి మరెన్నో! కేవలం బాంబులు పేల్చడమే, మనుషులను చంపడమే, ప్రజలను భీతావహులను చెయ్యడమే ఉగ్రవాదుల ధ్యేయమైతే, మనమెన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే.., వాళ్ళు ఆ పనులు చెయ్యగలరు – ఆ అవకాశం వాళ్ళకు ఉంటూనే ఉంటుంది. అంచేత ఉగ్రవాదానికి మందు ఉగ్రవాదులు, వాళ్ళ పోషకులు లేకుండా చెయ్యడమే! వాళ్ళకు బాంబులు, ఆయుధాలు దొరక్కుండా చెయ్యడమే!
 9. బాంబుల కోసం పేలుడు పదార్థాలు ఎంత తేలిగ్గా దొరుకుతాయో మనదేశంలో! పేలుడు పదార్థాలు వాడే సంస్థలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు గనుల కంపెనీలు! వాళ్ళకు అనేక నిబంధనలుంటాయి.. ఎంతబడితే అంత పేలుడు పదార్థాల నిల్వలు పెట్టుకోకూడదు, వాటి వాడకానికి సంబంధించిన అన్ని వివరాలనూ ప్రభుత్వానికి తెలియబరచాలి,.. ఇలాగ. ఇన్ని నిబంధనలున్నా, ఈ సంస్థలనుండి పేలుడు సరంజామా మాయమౌతూంటుంది. నక్సలైట్లు ఇలా కూడా పేలుడు పదార్థాలను సేకరిస్తూంటారు. జనాలను లోభపెట్టో భయపెట్టో ఈ సంస్థలనుండి సరంజామా సేకరించడం తేలిక. ఈ వ్యవస్థను, సదరు సంస్థల వ్యవహారాలను కట్టుదిట్టం చెయ్యాలి.
 10. ‘అతడికి ఫలానా విధంగా అన్యాయం జరిగింది. అంచేత పాపం అతడు ఉగ్రవాది అయ్యాడు, తప్పేముంది?‘, ‘ముస్లిము ఉగ్రవాదులు కల్లోలం సృష్టిస్తున్నారు కాబట్టి, హిందువులూ తుపాకులు పట్టొచ్చు‘, ‘గుజరాతులో జరిగినదానికి స్పందనగానే ముస్లిములు ఉగ్రవాదులౌతున్నారు‘ – లాంటి వాదనలు వింటూ ఉన్నాం. ఈ వాదనలు ఉగ్రవాదుల పనులను అన్యాపదేశంగా సమర్ధిస్తూంటాయి. వీటిని ఆపాలి.
 11. అవినీతి, లంచగొండితనం – కనీసం భద్రతావ్యవస్థల్లోనైనా – అరికట్టాలి.
 12. ప్రతీ పౌరుడికీ ఏకీకృత వ్యక్తిగత గుర్తింపు కార్డు ఉండాలి. మన దేశంలో ఇది ప్రవేశపెట్టడం, దాన్ని నిర్వహించడం కష్ట సాధ్యమే. కానీ దీర్ఘకాలిక దృష్టిలో ఇది అవసరం.
 13. ముందే మన సమాజంలో అనేక భేదభావాలున్నాయి. ఉన్నవాటితోటే సతమతమౌతూంటే, అది చాలవన్నట్టు కొత్తవి పుట్టుకొస్తున్నాయి. ఇలాంటివాటిని అరికట్టాలి. ఉదాహరణకు, మత మార్పిళ్ళు. 

ఉగ్రవాదానికి అన్నిటికంటే ముఖ్యమైన ముడిసరుకు, ప్రేరేపక శక్తి – మతం!   
మతం పట్ల ముస్లిముల ధోరణి గురించి ఇక్కడ చెప్పుకోవాలి (ఇక్కడ రాస్తున్నది ఎక్కువమంది ముస్లిముల ధోరణి గురించి, ప్రతీ ఒక్ఖ ముస్లిమూ ఇలాంటివారేనని అర్థం కాదు). ముస్లిములను మత ప్రాతిపదికన ఏర్పడిన ఒకే వోటు బ్యాంకుగా రాజకీయ నాయకులు చూసే స్థాయికి ముస్లిములే తెచ్చుకున్నారు. ప్రతీదాన్నీ మతంతో ముడిపెట్టే ముస్లిముల విధానం వలననే ఈ పరిస్థితి వచ్చింది. వాళ్ళకి ఈ ప్రపంచంలో అన్నిటికంటే మతమే ప్రధానమైనది. మనమంతా భారతీయులం అనే భావన కంటే మనమంతా ముస్లిములం అనే భావన ఎక్కువ. ఒక ఉదాహరణ చూడండి..

‘ముస్లిములలో అభివృద్ధి తక్కువ’, ‘దేశ అభివృద్ధి ఫలాలు వాళ్ళకి దక్కలేదు.’, ‘సామాజికంగా బలహీనంగా ఉన్నారు’ అని చెబుతూ, వాళ్ళు ఉగ్రవాదం వైపు మొగ్గు చూపడానికి ఇదో కారణం అని లౌకికవాదులమని అనుకునే కొందరు చెబుతూంటారు. అబివృద్ధిలో వెనకబడింది ముస్లిములేనా? హిందువులు వెనకబడిలేరా? వాళ్ళు ఉగ్రవాదులుగా మారారా? దేశమ్మీదబడి సాటి దేశీయులనే చంపుతున్నారా? పరాయి దేశస్తులతో కలిసి కుట్రలు చేసి, విధ్వంసాలకు పాల్పడుతున్నారా? లేదే! మరి ముస్లిములలో ఎందుకుందా ధోరణి? ముస్లిములను బయటి దేశీయులతో కలిపే బంధం మతం తప్ప మరోటి ఉందా? లేదు!

అంటే, మన దేశం మన ప్రజలు అనే భావన కంటే మన మతం అనే భావనకే ఇక్కడ ప్రాముఖ్యత ఇచ్చారు. మతపరమైన ఐక్యతాభావన ఎంత బలంగా ఉంటుందంటే.. సద్దాం హుసేన్ను ఉరితీస్తే, మన ఊళ్ళో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేస్తారు. మన దేశంలో ఏదైనా దుర్ఘటన జరిగితే అంతలా స్పందించరు.

ముస్లిములను కేవలం ఓటుబ్యాంకుగా చూస్తారు రాజకీయులు. హిందువు, ముస్లిము, గొప్పా బీదా, అగ్రకులస్తుడు, నిమ్న కులస్తుడు – రాజకీయులకు ఎవరైనా ఓటరే! కానీ మిగతావాళ్ళతో వ్యవహరించడంలోను, ముస్లిములతో వ్యవహరించడంలోను రాజకీయుడు తేడా చూపిస్తాడు. మీ మతస్తులకు అన్యాయం చేస్తున్నారు అంటూ, ప్రతీ విషయంలోను మతాన్ని వేదికగా చేసుకునే మాట్టాడతాడు. రంజాను రోజుల్లో విందులిచ్చి, షేర్వాణీ, టోపీ పెట్టుకుని పేపర్లలో పడితే వాళ్ళు ముస్లిముల హితైషులని లెక్క. సద్దాము హత్యను విమర్శిస్తే వాళ్ళు ఆప్తులు. తస్లీమా నస్రీనుకు ఆశ్రయం ఇస్తే వాళ్ళు ముస్లిము విరోధులు, కాఫిర్లు, మతవాదులు, లేదంటే స్వచ్ఛమైన లౌకికవాదులు. అమెరికాతో అణు ఒప్పందాన్ని కూడా ముస్లిముల కోణం నుండే చూస్తారు మన నాయకులు.

ఇలా ముస్లిములను బుజ్జగిస్తూ వచ్చి, ఈ రాజకీయులు ముస్లిములకు ఎంత మంచి చేసారోగాని, ముస్లిముల మతభావనల పట్ల – జాతీయత కంటే మతమే ముఖ్యమన్న వాళ్ళ ధోరణి పట్ల – నాబోటి సామాన్యుల్లో కూడా వ్యతిరేకతను కలిగించగలిగారు. మన కుహనా లౌకికవాదులు ఎంత కాదన్నా ఇది నిజం! ముస్లిములు ఈ సంగతిని గ్రహించి తమ ధోరణిని మార్చుకుంటే వాళ్ళు మిగతా భారతీయులతో కలిసిపోగలరు. లేకపోతే ఈ రాజకీయుల క్రూర క్రీడలో పావులైపోతూనే ఉంటారు, లౌకికవాదులంటున్నట్టు పరాయీకరణకు గురవుతూనే ఉంటారు.

Advertisements

ప్రధానికో లేఖ

November 30, 2008 61 comments

కంథమాల్లో జరిగినదాని గురించి తలెత్తుకోలేకపోతున్నామని, బయటి దేశాల్లో పరువు పోయిందని, ఫ్రాన్సు అధ్యక్షుడో మరొహడో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేకపోయానని వాపోయిన ప్రధానమంత్రి గారూ..

ముంబైలో మూడురోజుల పాటు, వందలాది మందిని ఖైదీలుగా పట్టుకుని, 195 మందిని పొట్టనబెట్టుకుని, బీభత్సం సృష్టించిన ఈ సంఘటన మీకు లజ్జాకరంగా అనిపించలేదా? మూడు రోజులపాటు నగరాన్ని కిడ్నాపు చేసి, దేశం మొత్తాన్నీ హడలగొట్టిన సంఘటన అవమానకరం కాదా?  పాకిస్తాన్నో, మరొకణ్ణో నిందించి చేతులు దులిపేసుకుంటే సరిపోద్దా? గతంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు, వాళ్ళను పోషించిన ఇంటిదొంగలూ, దేశద్రోహులను -ముస్లిములైనా సరే- వెనకాడకుండా, మట్టుబెట్టి ఉంటే ఈ అవమానకరమైన దాడి జరిగేదా? ఇవ్వాళ 195 మంది బలయ్యేవారా? ఇన్నాళ్ళుగా మీ నాయకత్వం పాటిస్తూ వచ్చిన మైనారిటీ బుజ్జగింపు కార్యక్రమం ఎంతకు దారితీసిందో చూసారా? అదే ఉగ్రవాదుల ముఠా మంత్రాలయ వైపు పోయి, అక్కడున్న మంత్రులూ, ఎమ్మెల్యేలను పట్టేసి, చేతులు కట్టేసి, తలలు కొట్టేసి ఉంటే మీకెలా ఉండేది? (పీడా బోయిందని సంతోషించి ఉండేవాళ్ళం అని ఈ దేశంలో కనీసం 80 శాతం మంది చెబుతారు స్వామీ! రాజకీయ నాయకత్వానికున్న పరపతి అంతటిది మరి!!)

మైనారిటీ వాదులకు, మైనారిటీ పక్షపాతులకు ఎందుకు ప్రభుత్వమంత లోకువైపోయింది? ఉగ్రవాదులపై కర్కశంగా ఎందుకు వ్యవహరించలేకపోయాం? కర్కశత్వం ఒక్కరి సొత్తేనా? మనకు లేవా కరకు గుండెలు? మాటల్లో ఉక్కుపాదాలు మోపడం కాదు చేతల్లో చేవ చూపించాలి, ఉక్కులాంటి దృఢచిత్తం చూపెట్టాలి. ఉగ్రవాదులు ముస్లిములన్న కారణమ్మీద వెనకేసుకురాబోయిన మంత్రులు మీ మంత్రిమండలిలో ఇంకా ఎందుకున్నారు? దేశాన్ని ఉగ్రవాదం నుండి కాపాడ్డానికి మతం ఎందుకు అడ్డు రావాలి? పార్లమెంటు మీద దాడి చేసినవాడికి ఖరారైపోయిన ఉరిశిక్షను ఎలా తప్పించాలా అని ఆలోచించే సమయంలో కొంత భాగాన్ని ఇలాంటి దాడులను ఎలా తప్పించాలనే ఆలోచనకు కేటాయించలేకపోయా రెందుకు? ఈ నిష్క్రియాపరత్వంతో దేశభద్రత విషయంలో సమాధానపడ్డారా లేదా?

2001 లో అమెరికా మీద ఘోరమైన దాడి జరిగింది. ఆ తరవాత ఇంతవరకూ ఉగ్రవాద దాడి జరగలేదు. మన పార్లమెంటు మీద దాడి జరిగిన తరవాత, ఈ ఏడేళ్ళలోను ఎన్ని మార్లు దాడులు జరిగాయో గమనించారా? ఒక టైమ్‌టేబులు పెట్టుకుని, ఓ షెడ్యూలు ప్రకారం దాడులు చేస్తున్నారు సార్! ఏంటి వాళ్లకీ మనకీ ఉన్న తేడా?

పౌరులకు భద్రత కల్పించాలనే చిత్తశుద్ధి మీకుందా? ఫలానా సమయానికల్లా దేశంలో ఉగ్రవాదుల మహారాజ పోషకులను లేకుండా చేస్తాననే ఆత్మవిశ్వాసం, మరొక్ఖ ఉగ్రవాద ఘటన కూడా జరగనీయననే ఆత్మ విశ్వాసం -ఉందా మీకు? అవున్లే.. మీ హోమ్‌మంత్రి పైన మీకు విశ్వాసం లేదు -అయినా ఆయన్ని తీసెయ్యలేరు. ఇక మాకేం ధైర్యం చెప్పగలరు?

బయటి దేశాధినేతలకు మొహం చూపించడం సంగత్తరవాత.. మీ స్వంత దేశ పౌరులకు ఎదురుపడి, తలెత్తుకుని, సిగ్గు పడకుండా, కళ్ళలోకి చూసి మాట్టాడగలరా?

దిగులుగా ఉంది

November 28, 2008 24 comments

మనం రోడ్డు మీద వెళుతూంటేనో, రైలు టిక్కెట్టు కొనేందుకు వరసలో నుంచుంటేనో, ఏ కూరగాయలు కొనుక్కుంటున్నపుడో మనకు అటుగానో, ఇటుగానో నిలబడి తుపాకీతో టపటపా పిట్టల్ని కాల్చినట్టు కాల్చేసి, తాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు.

నువ్వు ఫలానా మతం వాడివి కదా.. ఐతే ఇదిగో నీకిదే గతి అంటూనో, నువ్వు ఫలానా దేశం వాడివి కదా అయితే అనుభవించు అంటూనో మన కణతలోకి గుండేసి చంపేస్తారు ఆ తరవాత ఓ ఇద్దర్నో ముగ్గుర్నో పట్టుకుని పక్కనున్న ఇంట్లో దూరి, ఆణ్ణొదలండి, ఈణ్ణొదలండి అంటూ డిమాండ్లు పెడతారు.

లక్ష్యాలను ముందే ఎంచుకుని, చక్కగా ప్లానేసి, రెక్కీలు చేసి, వీలైతే రిహార్సళ్ళు వేసుకుని, తీరుబడిగా పడవల్లోనో, ఓడల్లోనో దిగబడి, ఓ నగరాన్ని చుట్టుముట్టగలరు, దాడి చెయ్యగలరు. మొత్తం నగరాన్నే బందీగా పట్టుకోగలరు. గంటా రెండు గంటలు కాదు, ఒకటి రెండు రోజుల పాటు దేశంలోని అత్యున్నత స్థాయి భద్రతా దళాలను కూడా ఎదుర్కొని పోరాడగలరు. అందుకు తగ్గ ఆయుధ సంపత్తిని చేరేసుకోగలరు కూడా. ఏకకాలంలో పది చోట్లకు పైగా దాడి చేసి వందల మందిని బలి తీసుకోగలరు.

దాడుల తీవ్రత ఎలా పెరుగుతోందో చూస్తే భయమేస్తోంది. బాంబులెయ్యడం, చాటుమాటుగా బాంబులు పెట్టడం పోయింది. ఇప్పుడిక నేరుగా దాడే! సాక్షాత్తూ యుద్ధమే!!

 • ఈ దాడులు మనమెంత చవటలమో చూపిస్తున్నాయి. 
 • మన నాయకుల నేలబారు నాయకత్వమెంత సిగ్గుమాలినదో చూపిస్తున్నాయి. చొక్కాల కాలర్లను ఏకే 47 తుపాకీల మొనలతో పట్టి పైకెత్తి ఈ నాయకులను దేశానికీ, ప్రపంచానికీ చూపిస్తూంటే, ఆ తుపాకీలకు వేళ్ళాడుతూ, తలకాయలు వేళ్ళాడేసుకుని, భుజాలు జారేసుకుని, కళ్ళు వాల్చేసుకుని, కాళ్ళు మడతేసుకుని, దీనంగా, చవటల్లాగా, సన్నాసుల్లాగా మనల్నేలే నేతలు కనిపిస్తున్నారు. 
 • ఈ దాడులు మన భద్రత లోని డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి. బయటకు పోతే, రాత్రికి తిరిగి ఇంటికి చేరుకోగలమో లేదోననే భయం కలుగుతోంది. 

కానీ ఈ భయానికి మించి… ముందుముందు మరిన్ని దాడులు జరక్కుండా ఈ వెన్నెముక లేని నాయకుల నాయకత్వంలో కాచుకోగలమని మనం నమ్మగలమా?

నాకా నమ్మకం కలగడంలా! అదే నాకు బెంగగా ఉంది. గుండెల్లో దిగులుగా ఉంది. నోరు చేదుగా ఉంది. ఊపిరాడనట్టుగా ఉంది. ధైర్యం అడుగంటి, ఆలోచనల్లో దైన్యం ఊరుతూ, ఒళ్ళంతా వ్యాపిస్తోంది.
——————————————————————————
ముంబై దాడుల్లో బలైనవారి కుటుంబాలకు నా శ్రద్ధాంజలి. ఈ పోరులో ముష్కరులను ఎదుర్కొని, తమ ప్రాణాలొడ్డి, వందల మంది ప్రజలను కాపాడిన ధీరోదాత్తులైన సైనికులకు, పోలీసులకు ఈ పనిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నా సెల్యూట్!

మరో ‘పిరికి’ చర్య

September 14, 2008 23 comments

ఇంకోసారి ఉగ్రవాదులు తెగబడ్డారు. ఈ సారి ఢిల్లీ. ఊరు మారింది, స్థలాలు మారాయి.  బాంబులేసినవాళ్ళు వాళ్ళేనట -మేమేనని బోర విరుచుకుని మరీ చెబుతున్నారు.

మరో ‘పిరికి’ చర్యను ఖండించి పారేసారు భారత హోమ్ మంత్రి. ఢిల్లీలో జరిగిన దానికి నాకు చాలా విచారంగా ఉంది. మనకు ఇబ్బందులు కలగజేయాలనుకునేవారి కుట్ర ఇది. వాళ్ళ దుష్ట పన్నాగాలను పారనీయకుండా చెయ్యాలి. మనందరం ఐక్యంగా వీళ్ళను ఎదుర్కొందాం. సరిగ్గా ఇదేకాదు, ఇలాంటిదే ఏదో చెప్పేసాడు. ఖచ్చితంగా ఏం చెప్పాడో తెలుసుకునేంత ప్రాముఖ్యతేమీ లేదు. వాటిలో అంత పసేమీ ఉండదు. ఉత్త ఊకదంపుడు, ఉత్త పనికిమాలిన బుస, ఒఠ్ఠి చేతకాని కబుర్లు అంతే!  ప్రభుత్వ ప్రతినిధిగా, ఇలాంటివి జరక్కుండా నిరోధించాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆయనీ ముక్కలు చెబుతున్నపుడు మూర్తీభవించిన అసమర్ధతగా కనిపించాడు. శాంతి భద్రతలు రాష్ట్రప్రభుత్వ విషయంగా చెప్పి తప్పించుకునే ఈ మంత్రి, ఢిల్లీలో, తన ఆఫీసుకు కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ పేలుళ్ళకు ఏం జవాబు చెబుతాడు?  ఒకవైపు ఈ అసమర్ధ ప్రేలాపనలు సాగుతూండగా, అక్కడే..

ఒక్ఖ ముక్క కూడా మాట్టాడకుండా తాము చెయ్యాల్సిన దాన్ని చేతల్లో చూపించిన సమర్ధుల గురించి మనం చెప్పుకోవాలి. గాయాలపాలైన వారిని ఆస్పత్రులకి తీసుకెళ్ళడంలో చురుగ్గా పనిచేసినవారు.. వాళ్ల గురించి మనం చెప్పుకోవాలి. అంత గందరగోళంలోనూ పేలుడు శకలాలను తొలగించి సరైన ఆధారాల కోసం అణువణువూ గాలించిన వారు.. వాళ్ల గురించి మనం చెప్పుకోవాలి. పేలకుండా ఉన్న బాంబులను వెతికి, వాటిని పేలకుండా చేసిన వారు.. ఆ బాంబులు పేలితే తమ ప్రాణాలు ఎగిరిపోతాయని తెలిసీ వాటిని నిర్వీర్యం చేసినవారు.. వాళ్ల గురించి మనం చెప్పుకోవాలి.  వాళ్ళు ధీరోదాత్తులు, హీరోలు. చేతకాని వాళ్ళ నాయకత్వంలో ‘పిరికి’వాళ్ళను ఎదుర్కొంటున్న ధీరోదాత్తులు, హీరోలు.

ఎన్నో కష్టాలకోర్చి, తాము పట్టుకున్న ముష్కరుల్ని మతం పేరుతో వదిలేసే రాజకీయులు, ఆ నేరస్తుల ఇళ్ళకెళ్ళి విందులు కుడిచే నాయకులు వాళ్ళకి బాసులు. ఉరిశిక్ష పడిన వాణ్ణి ఎలా వదిలెయ్యాలా అని ప్లాన్లేసే నాయకులు వాళ్ళ బాసులు. తమ వోట్ల కోసం, ఫలానా మతానికి చెందిన వాళ్ళు కాబట్టి, నేరస్తుల్ని ఏమీ చెయ్యకూడదనే కుచ్చితమైన ఆలోచనలు చేసే నేతలు వాళ్ళకి బాసులు.  ఈ రకం బాసుల కింద, ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న ఆ పోలీసులు, ఆ భద్రతా దళాలు హీరోలు కాక మరేంటి! ధీరోదాత్తులు కాక మరేంటి!!

శివరాజ్ పాటిల్ అక్కడికొచ్చి చెప్పింది అలా ఉంటే… ఇది ‘పిరికి’చర్య అంటూ సోనియా చెప్పింది. ఈ పనికి పాల్పడిన వారికి సమాజంలో స్థానంలో లేదని కూడా చెప్పేసింది. మన్మోహన్ ఈ సంఘటనపై విచారం తెలిపి, ప్రజలను శాంతంగా ఉండాలని కోరాడు. అవే మాటలు, అదే మేకపోతు గాంభీర్యం. చేతకానితనమే చుక్కానిగా పరిస్థితులు ఎటేపు తీసుకుపోతే అటేపు, కాలంలో పడి కొట్టుకుపోతున్నారు వీళ్ళు. మనల్ని లాక్కుపోతున్నారు.

రేపణ్ణుంచి మాత్రం వాళ్ళే మళ్ళీ సిమీపై నిషేధం ఎలా ఎత్తేయాలా అని ఆలోచిస్తారు. మనం మాత్రం తరవాత జరిగే పేలుళ్ళ కోసం ఎదురుచూస్తూంటాం.

హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు… ముస్లిము సోదరులు

హైదరాబాదు జంటపేలుళ్ళపై నా గతజాబు, దానిపై వచ్చిన వ్యాఖ్యలు దీనికి నేపథ్యం. ఆ వ్యాఖ్యలకు సమాధానమే ఈ జాబు.

ఉగ్రవాదులు మతం పేరు చెప్పుకునే ఈ పనులు చేస్తున్నారు. మతం పేరిటే స్లీపర్లను, తదితరులను ఏర్పాటు చేసుకుంటున్నారు. మామూలు యువకులు స్లీపర్లు గాను, మానవ బాంబులు గాను మారటానికి ప్రేరణ మతమే అని నేనంటున్నాను. వీరలా మారడానికి ఉగ్రవాదులతో చేతులు కలపడానికి మరో కారణం ఏంటో చెప్పండి. బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తూ కూడా ఉగ్రవాదులతో చేతులు కలపడాన్ని మనమేమనుకోవాలో చెప్పండి. -క్లుప్తంగా ఇదీ నా గత జాబు! దీనిపైన వచ్చిన విమర్శలోని ముఖ్యాంశాలు, నా జవాబులు:

తీవ్రవాదానికి మతం వగైరాలు లేవు: ఉగ్రవాదమంటే ఉగ్రవాదమే, దానికి మతం లేదు. ఒక మతంతో దాన్ని ముడిపెట్టరాదు. ఏ రూపంలో ఉన్నా దాన్ని అణచివెయ్యాలి. అని అన్నారు. సదాశయమే! కానీ సమస్యకు మూలమేంటో తెలీకుండా ఎలా అణచగలం? అంచేత మూలం కోసం వెతకాలి. మూలం వెతకబోతే అదేమో మతం వైపుకు పోతోంది. పాకిస్తానో, బాంగ్లాదేశో పోతోంది కదా అని అనొచ్చు.. అక్కడికి మాత్రం ఎందుకెళ్తోంది? “మన అభివృద్ధిని చూసి ఓర్వలేక“. మరి, వాళ్ళకి మనమీదే ఎందుకా ఏడుపు? చైనా మీద లేదేఁ? అది కూడా పక్కనే ఉంది, మన లాగానే వృద్ధిలో ఉంది. మిత్రదేశమనే మాటను పక్కనుంచండి.. ఓర్వలేక ఏడ్చేవాడికి తనామనా ఉండవు మరి. పోనీ, అసలు మూలాల జోలికే పోవద్దంటారా? సరే, మానేద్దాం. మన పోలీసుల చేత చేయిస్తున్నదదేగా! మనం పోకపోయినా మునిగిపోయేదేమీ లేదు.

పాతబస్తీ అభివృద్ధి: పాతబస్తీ వెనకబడడానికి ప్రధాన కారణం, ఎమ్మయ్యెమ్, దాని మతవాద భావజాలం. ఈరోజుల్లో రాజకీయుడికి కావాల్సింది ఓట్లు. మతం గురించి మాట్టాడితేనో, షరియత్ గురించి మాట్టాడితేనో, మనకు ఓట్లు వస్తాయనుకోండి.. వాళ్ళు వాటి గురించే మాట్టాడతారు. ఆ పాయింట్లకే సానపడుతూ ఉంటారు. పాతబస్తీ వెళ్ళినపుడు రూమీ టోపీ, షేర్వాణీలు పెట్టుకోని సలాములు కొడుతూ తిరిగే రాజకీయ నటులను చూళ్ళేదా మనం! ‘మతం మీద జరుగుతున్న దాడి‘ని చూపించి అభద్రతా భావాన్ని ప్రజల్లో రేకెత్తించో, ముస్లిములంతా సంఘటితంగా లేకుంటే భద్రత ఉండదనో, మరోటో చెప్పి వాళ్ళని ఆత్మరక్షణ లోకి నెడతారు. ముస్లిములను ఆకట్టుకోవాలంటే వాళ్ళ మతం గురించి గొప్పగా మాట్టాడితే చాలు అనే భావన అందరిలో ఉంది.

ఓహో, మన మతం ప్రమాదంలో ఉంది, మనం మన మతాన్ని రక్షించుకుంటేనే మనకు ఉనికి అని ప్రజలు అనుకునేలా చేసారు. ప్రజల్లో ఇలాంటి ధోరణిని జాగ్రత్తగా పెంచి పోషిస్తూ వస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఉన్నత చదువులు లేవు. కొత్త ఉద్యోగావకాశాలు లేవు. మతం గురించి మాట్టాడితే ఆర్థిక పరిస్థితులు మెరుగు పడతాయా? ఒక్కరు కాదు, దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలూ అంతే! అందరూ మతం గురించి మత సంబంధమైన కబుర్లు చెప్పి ముస్లిములను లాలించేవారే, జోకొట్టేవారే. ఈమధ్య సీపీఎమ్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ప్రజల్లోకి వెళ్తూందని గమనించి గంగవెర్రులెత్తి పోతోంది ఎమ్మయ్యెమ్ము! దానికి విరుగుడుగా ఏం చేసారు వాళ్ళు? మత భావనలను రెచ్చగొట్టేందుకు తస్లీమా మీద దాడి చేసారు. ముస్లిములను అకట్టుకోవాలంటే మతమే సమ్మోహనాస్త్రం మరి! (కనీసం రాజకీయు లనుకుంటున్నారలా! అలా అనుకుంటూ బాగానే నెట్టుకొస్తున్నారు)

పరాయీకరణ: తమ మతభావాలను బట్టి ముస్లిములు మానసికంగా దూరం అవుతున్నారేమో గానీ ఇతర మతస్తులు వారిని దూరం చేసినందువలన మాత్రం కాదు. మతానికి వారి జీవితంలో ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. షరియత్ తరవాతే రాజ్యాంగం అని చెప్పగా వినలేదా మనం. రాజ్యాంగం దృష్టిలో అందరూ సమానమే అయితే ఈ మాటలెలా వస్తాయి? నాకు రాజ్యాంగమే సర్వోన్నతమైనది. కానీ దానికంటే షరియత్తే గొప్పదనే వ్యక్తికి నేను దగ్గర కాగలనా? స్వాతంత్ర్యోద్యమ రణన్నినాదం.. వందేమాతరం. నేనది పాడను అని ఎవరైనా అంటే నాకది కష్టం కలిగించదా? నేను ఐదో తరగతిలో ఉండగా మాకు ఒక సాయిబు (“సాయిబు” మావైపు గౌరవవాచకమే. “ముస్లిము” కంటే నాకామాట ప్రియంగా తోస్తుంది. మరో విధంగా భావించరాదని మనవి) పంతులుగారు హెడ్‌మాస్టరుగా ఉండేవారు. “వందేమాతరం”తోటే బడి మొదలయ్యేది, “జనగణమన”, ఆ తరవాత “బోలో స్వతంత్ర భారత్ కీ.. జై” అనే నినాదంతోటే బడి ముగిసేది.

ఒక్కటి గమనించండి.. ముస్లిము సోదరులు అని అంటారు. హిందూ సోదరులు, క్రైస్తవ సోదరులు, సిక్కు సోదరులు అని అనడం వింటామా? ఎందుకలా? దువ్వడం! అక్కడి నుండే మొదలవుతుంది వారిని దువ్వడం. అదొక నిరంతర ప్రక్రియ. (ఇంత సీరియస్ విషయంలో ఈ పోలిక కుదురుతుందో లేదో గానీ నాకు ఇది పదే పదే గుర్తొస్తూ ఉంటుంది.. మనవాళ్ళు సినిమాల విడుదలకు ముందూ, అయ్యాక కొద్ది రోజులూ.. ఓ తెగ వాయించేస్తూ ఉంటారు ప్రాపగాండాతో. నిర్మాతా దర్శకుల దగ్గరి నుండి చిన్నాచితకా నటుల దాకా అందరూ ఇలా అంటూ ఉంటారు.. సెట్లో చిరూ సార్ ఎంతో కో ఆపరేటు చేసారు, బాలయ్య బాబు దగ్గరి నుండి నేనెంతో నేర్చుకున్నాను, నాగార్జున గారు సెట్లో ఉంటే అసలు పని చేస్తున్నట్టే ఉండదు.. ఇలా సొల్లుతూ ఉంటారు. వాళ్ళను దువ్వుతూ ఉండడం అన్నమాట. అలాంటిదే ఇది.) ముస్లిములకు ఓ ప్రత్యేకత ఉందని తెలియజెప్పడం సోదరులు అనడంతో మొదలవుతుంది. మాధ్యమాలు, రాజకీయులూ ఎక్కువగా వాడుతూ ఉంటారు దీన్ని.

ఇరువర్గాల ఘర్షణల గురించి చదివి ఆ వర్గాలెవరో తెలీదన్నట్టు మనం నటిస్తూంటాం.. అలాగే మన మధ్య ఈ తీవ్రవాదం బలిసిపోవడానికి మతతత్వం ముఖ్య కారణమని తెలిసీ, తెలీనట్టు నటిద్దామా? తీవ్రవాదం గురించి తెలిసీ.., ఇస్లామిస్టు తీవ్రవాదం గురించి చదవని / తెలియని / తలచని వారున్నారా? అందరికీ తెలిసిన ఈ విషయాన్ని రాస్తే నేనా జాబు రాయడమే తప్పన్నట్టు వ్యాఖ్యానించారు. నేను కూడా ‘పెద్దమనిషి‘ (స్టేట్స్‌మన్ కు ఇంతకు మించిన తెలుగు పదం తట్టలేదు.) లాగా “ఒక వర్గానికి చెందిన తీవ్రవాదులు” అని రాస్తే పోయేది, నన్నేమీ అనగలిగేవారు కాదు. ఇదంతా చదివి నాకు పరమత సహనం లేదని నిందించకండి. అపరిమిత సహనం లేకపోవడం నిందార్హమంటారా.. నిందించండి!

ఇరువర్గాల మధ్య ఘర్షణకు ఒక ఉదాహరణ ఇది.. (మూణ్ణెల్లలోపే ఈ ఈనాడు లింకు చస్తుంది). ఇరవై ఇరవైలో భారత్, పాకిస్తాను మీద నెగ్గిన సందర్భంలో కర్నూల్లో జరిగింది. దీనికి కారణం ఫలానా వర్గమేనని నేననడం లేదు, రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు మోగేది. కానీ చప్పట్లకు మూలం చూసారా?

ఉగ్రవాదము, మతమూ

హైదరాబాదులో బాంబు పేలుళ్ళు జరగ్గానే “అన్ని మతాల వాళ్ళూ చనిపోయారు ఒక మతంపై ప్రత్యేకించి చేసిన దాడి కాదు” అని వ్యాఖ్యానాలు వచ్చాయి. సహజంగానే ప్రజలు కూడా ఈ పేలుళ్ళను అలా భావించలేదు. మత పరమైన పర్యవసానాలేమీ లేకుండానే ప్రశాంతంగా గడిచిపోయింది. అయితే బాధితుల్లో అన్ని మతాల వారూ ఉన్నారు. కానీ ఈ ఉగ్రవాదులెవరు? ఈ సంఘటనకు కారకులు ఎవరో ఇంకా తెలీక పోయినా, గత అనుభవాలను బట్టి ఇస్లామిక ఉగ్రవాదులని అనుమానాలు పోతాయి, సహజంగా. కానీ ఉగ్రవాదులకీ మతానికీ ముడిపెట్టకూడదని ఓ… తెగ చెప్పేస్తున్నారు, కొందరు. కానీ అలా కుదురుతుందా?

అసలు ఉగ్రవాద చర్యలను మతంతో ముడి పెట్టకుండా ఎలా చూడాలో తెలీడం లేదు. ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న ఉగ్రవాద చర్యల్లో దాదాపుగా అన్నీ మత ప్రేరితమే – మతాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం కావచ్చు, మత బోధలకు తప్పుడు భాష్యాలు చెప్పడం కావచ్చు, మరోటి కావచ్చు. మన దేశంలో జరుగుతున్న ఉగ్రవాద హింస నుండి మతాన్ని విడదీసి చూడగలమా? ఈ రెంటికీ సంబంధం లేకపోతే మరి ఈ హింసలకు కారణమేంటి? మూలమేంటి? ఈ పనులు చేసేవాళ్ళు తమ ప్రాణాలకు తెగించి మరీ ఎందుకీ పనులు చేస్తున్నారు? హై. పోలీసు కమిషనరేటు మీద దాడి చేసిన మానవబాంబు ఏమాశించి ఆ పని చేసినట్టు?

మన దేశాన్ని కల్లోలపరచాలనే ఉద్దేశమే దీనికి కారణమంటున్నారు. ఎందుకు కల్లోల పరచడం? ఉగ్రవాదులకు మనదేశమ్మీద ఎందుకంత ద్వేషం? మనం అభివృద్ధి పథంలో ఉన్నామని అంట! మన అభివృద్ధి చూసి కన్నుకుట్టి ఇక్కడి కొచ్చి బాంబులేస్తున్నారట. నవ్వొస్తది నాకా మాట వింటే. మరి మనకంటే డబ్బున్న కొన్ని గల్ఫు దేశాల్లో లేవే ఈ దాడులు? చైనాలో లేవేఁ? జపానులో లేవేఁ? దక్షిణ కొరియాలోను, సింగపూరులో ను జరగవేఁ? బ్రెజిల్లో లేదే మతవాద తీవ్రవాదం? ఎందుకంటే..

ఉగ్రవాదులకు స్థానికంగా అక్కడ సాయం దొరకదు. ఇక్కడ అది ఇబ్బడి ముబ్బడిగా దొరుకుద్ది. ఒకవేళ సాయం చేసేవాడెవడన్నా ఉన్నా, ఆయా దేశాల్లో అయితే తోలు దీస్తారు. మరి మన దగ్గర.. మత నాయకులు, రాజకీయనాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు.. అందరూ అడ్డం పడి పోతారు పోలీసులకు. ఎందుకూ? పోలీసులు ముస్లిములను పట్టుకోవాల్సే వస్తే, పట్టుకుంటే, అది రాజకీయంగా తెలివైన పని కాదు కాబట్టి. రాజకీయంగా తెలివైన పని కాదు కాబట్టే తస్లీమాపై దాడి చేసినవారిని లోపలెయ్యలేదు, వారు బయట తిరుగుతూనే ఉన్నారు. రాజకీయంగా తెలివైన పనులే చేస్తారు కాబట్టే మసీదులో బాంబుల తరువాత అరెస్టులేమీ జరగలేదు. సాక్షాత్తూ పోలీసు కమిషనరేటు మీద కొందరు స్త్రీలు గుంపుగా దాడి చేస్తే పోలీసులు ఏమీ చెయ్యలేక పోవడానికి కారణమూ ఇదే. మనకిక్కడ ప్రజల ప్రాణాల కంటే రాజకీయాలు, ఓట్లే ముఖ్యం. స్లీపరు సెల్సనీ మరోటనీ వేరు పురుగుల్లా దేశాన్ని నలుచుకు తింటున్నా వీళ్ళకేం పర్లేదు, ఓట్లు క్షేమంగా ఉంటే చాలు. వీళ్ళకు ఓట్లు వస్తాయంటే శిక్ష పడ్డ తీవ్రవాదులను కూడా వదిలిపెడతారు.. ఆ తరవాత వాడు మళ్ళీ గన్నుచ్చుకు మనమీదకే వస్తాడు కూడా. మనకు ఓట్లు పోతాయనుకుంటే ఖరారైన ఉరిని కూడా పక్కన పెడతారు.

అనుమానితుల్ని అరెస్టు చేస్తే మన రాష్ట్ర మంత్రివర్గంలోని ఒక మంత్రి స్వయంగా విడిపించిన సందర్భాలున్నాయట. ఆయన స్వయంగా ఓ నిందితుడి ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చాడట. ఇలాంటి రకాలు యథేచ్ఛగా సమాజంలో తిరుగుతూ ఉంటాయి, మనల్నేలుతూ ఉంటాయి. వాళ్ళు కేవలం మత ప్రాతిపదికపైనే ఈ పనులు చెయ్యొచ్చు. మనం మాత్రం మతం గురించి మాట్టాడకూడదు. వేలాదిమంది విదేశీయులు సరైన వీసా కాగితాల్లేకుండా మన ఊళ్ళో ఉన్నారట, నల్గొండలోనూ ఉన్నారట. స్వయానా ఒక ముస్లిము సంస్థే చెబుతోందీ మాటను. ఎలా ఉండగలుగుతున్నారు వాళ్ళు? ఎవరు వారికి ఆశ్రయమిచ్చింది? పోలీసులు సరైన చర్యలు తీసుకుంటే అలా ఆశ్రయమిచ్చిన వాళ్ళు పరదేశీ దొంగల్తో సహా పట్టుబడరూ? అలా చేసి ఉంటే మొన్నటి పేలుళ్ళు జరిగేవి కావేమో!!

మొన్న జరిగిన సంఘటనలో ముస్లిము తీవ్రవాదుల హస్తం ఉందనే అనుమానాల పట్ల కూడా కొందరు అభ్యంతరం చెబుతున్నారు. ముస్లిము తీవ్రవాదులే కారణమని తేల్చెయ్యడం లేదు కదా. కే్వలం అనుమానిస్తేనే తప్పా? అనుమానం కూడా ఊరికినే అలా గాల్లోంచి వచ్చిందేమీ కాదు… గత అనుభవాలను బట్టే కదా అనుమానించేది?

———————-

ఆపేముందు ఓ చిన్నమాట..: పొలిటికల్లీ కరెక్టు స్టేటుమెంట్లివ్వడం ఈ మధ్య మనబోటి సామాన్య జనానికీ అలవాటైపోయింది. ముస్లిముల పేరెత్తితే అదేదో తప్పైనట్టు మాట్టాడుతున్నారు.

బాంబుల మధ్య మనం

August 26, 2007 1 comment

హైదరాబాదులో మళ్ళీ బాంబులు పేలాయి. గుంపులుగా చేరిన ప్రజల మధ్య పేలాయి. 42 మందిని పొట్టన బెట్టుకున్నాయి. వారాంతపు సాయంత్రం సరదాగా గడిపేందుకు వెళ్ళిన అమాయకులు.. పాపం, మృత్యువును వెదుక్కుంటూ వెళ్ళినట్టైంది. ట్రాఫిక్కు సమస్య కారణంగా సమయానికి అంబులెన్సులు చేరుకోలేని పరిస్థితి. సమయానికి అవి చేరుకుని ఉంటే కనీసం ఒక్కరినైనా కాపాడగలిగే వారేనేమో! ప్చ్!

ఏ ప్రకృతి బీభత్సానికో ప్రజలు చనిపోతే శోకం, బాధ కలుగుతాయి, మనసుక్కష్టం కలుగుతుంది. కానీ ఇలాంటి దురాగతాలకు బలవుతుంటే ఆక్రోశం, క్రోధమూ కలుగుతాయి. మున్నెన్నడూ ఎరగని సంఘటనలేమీ కావివి. మనకెన్నడూ అనుభవం లోకి రానివేమీ కావీ ఘటనలు. ఇంతకు ముందు జరిగాయి, పైగా ఇలాంటివి ఇంకా జరగొచ్చని అనుమానాలూ ఉన్నాయి. అయినా ఎలా జరిగాయి?

ఎందుకిలా జరిగాయి? మే 18 నాటి మసీదు బాంబు పేలుడు నాటి నుండీ, మళ్ళీ అలాంటివి జరగొచ్చేమోనని పేపర్లలో వార్తలు చూస్తూనే ఉన్నాం. నిఘా సంస్థలకు వీటిపై సమాచారముందట. అయినా ఎలా జరిగాయీ పేలుళ్ళు? ఎందుకు వీటిని ఆపలేకపోయారు? ఇంత పెద్ద నగరంలో బాంబులెక్కడున్నాయో కనిపెట్టడం గడ్డి వామిలో సూది కోసం వెతికినట్టే కావచ్చు! కానీ మసీదు బాంబు తరవాత, ఇంకా అలాంటివి జరగొచ్చని తెలిసింతరవాత కూడా ఎవ్వరినీ అరెస్టు చెయ్యలేదెందుకని? ఒక్క అనుమానితుడిని కూడా పట్టుకోలేక పోయారేఁ? ఆర్డీయెక్సులు, బాంబుల తయారీ స్థలాలూ, దాచిన స్థలాలూ ఎందుకు దొరకలేదు? అసలు చర్యలేం తీసుకున్నారు? ఎంతమందిని అరెస్టు చేసారు? 42 ప్రాణాలు బలయ్యాక.., ఇకనైనా చెబుతారా? మమ్మల్ని సంయమనంతో ఉండమని చెవటం కాదు, మా రక్షణ కోసం మీరేం చేసారో, ఏం చేస్తున్నారో చెప్పండి.

ఒక్కటి మాత్రం బలపడుతోంది.. పొద్దుట బయటికి వెళ్ళిన వాళ్ళం మళ్ళీ రాత్రికి క్షేమంగా ఇంటికి చేరుకున్నామంటే అది కేవలం మన అదృష్టం, అంతే.. వ్యవస్థ మనకు కల్పిస్తున్న రక్షణ వలన మాత్రం కాదు! ప్రభుత్వాలు, వాటి విధానాలు చేతకానివి కావడంతో మనం మూల్యం చెల్లిస్తున్నాం. వాళ్ళకు ఓట్లిచ్చాం, పాలించే హక్కిచ్చాం, చివరికిలా ప్రాణాలూ వాళ్ళ ఎదాన పోస్తున్నాం.