Archive

Archive for the ‘ఉపద్రవం’ Category

పోటెత్తిన కృష్ణ -ప్రమాదంలో రాష్ట్రం

కృష్ణానది ఉప్పొంగుతోంది. ఊళ్ళను, నగరాలను, మండలాలను కూడా ముంచెత్తుతూ ఉరకలెత్తుతోంది. గత వంద సంవత్సరాల్లో ఎప్పుడూ రానంత వరద వచ్చిందట.  కర్నూలు నగరం నడుంలోతు నీళ్ళలో మునిగిపోయింది.  మంత్రాలయం మునిగిపోయింది. రాఘవేంద్రస్వామి మఠం మునిగిపోయింది. కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అనేక ఊళ్ళు నీళ్ళలో చిక్కుకుపోయాయి. విజయవాడ ప్రమాదపు అంచున ఉంది. పులిచింతల కాఫరు డ్యాము కొట్టుకుపోయింది.  శ్రీశైలం డ్యాము, నాగార్జున సాగరు డ్యాము పాటవ పరీక్షను, పటుత్వ పరీక్షను ఎదుర్కొంటున్నాయి.

వరద ఎంత ఉధృతంగా ఉందంటే శ్రీశైలం ఆనకట్ట భద్రతను కూడా సందేహించేంతగా! జలాశయ పూర్తి నిల్వ మట్టం 885 అడుగులు. దానిపైన మరో ఆరేడు అడుగులు పెరగవచ్చు. అది గరిష్ఠ స్థాయి అట. ఆపైన మరి కొన్ని అడుగుల వరకు పరవాలేదు, అదీ దాటితే నీళ్ళు డ్యాము పై నుండి ప్రవహిస్తాయి.  అదీ ప్రమాదం. ఈలోగా ఈ నీటి మట్టం పెరుగుతూ ఉండే క్రమంలో డ్యాముకు ఎగువన (ఫోర్‌షోర్) ఉన్న ప్రాంతాలు మునిగిపోతాయి.  కర్నూలు కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. శ్రీశైలం జలాశయంలో నీటి చేరిక పరంగా ఇప్పటివరకు ఉన్న రికార్డు 10 లక్షల క్యూసెక్కుల చిల్లర. అసలు ఆనకట్టను కట్టేప్పుడు తీసుకున్న అత్యథిక నీటిచేరిక అంచనా – 24 లక్షల క్యూసెక్కులట.  ప్రస్తుతం అది 20 లక్షల క్యూసెక్కులకంటే ఎక్కువగానే ఉంది. ఇవ్వాళ పొద్దుటి నుండి 10 లక్షలు, 12 లక్షలు, 16 లక్షలు ఇలా పెరుగుతూ ఉన్న చేరిక ఇప్పుడు మధ్యాహ్నం మూడింటికి 20 లక్షల క్యూసెక్కులకు పైగా గా ఉందని అంటున్నారు.  జలాశయం నుంచి కిందకు వదులుతున్నది 10 లక్షల క్యూసెక్కుల కంటే కాస్త తక్కువ. ఈ లెక్కన ఇప్పటికే దాదాపు నిండిపోయిన జలాశయం గరిష్ఠ స్థాయికి చేరడానికి ఎక్కువ సమయమేమీ పట్టేట్టు లేదు. జలాశయంలోకి నీటిచేరిక మరింత పెరిగితే నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీలపై కూడా వత్తిడి పెరిగే అవకాశం చాలా ఉంది.  నాగార్జున సాగర్లోకి చేరుకునే నీటిని కిందకు వదిలేందుకు అక్కడి గేట్ల సామర్థ్యం చాలకపోతే పక్కనుండే మట్టికట్ట (ఎర్త్ డ్యాము)కు గండికొట్టి, నీటిని వదిలేసే అవకాశం ఉందని టీవీవాళ్ళు చెబుతున్నారు. అదే జరిగితే విజయవాడే కాదు, డ్యాముకు దిగువన ఉండే అనేక ప్రాంతాలు ప్రమాదంలో పడినట్టే. అయితే డ్యాములకు వచ్చిన ప్రమాదమేమీ లేదని కొందరు సీనియరు ఇంజనీర్లు భరోసా ఇస్తున్నారు.

కనీవినీ ఎరుగనంత వరద వచ్చిన పరిస్థితిలో  సహజంగానే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. ప్రభుత్వమూ అంతే! కానీ అలాంటి పరిస్థితిలోనే ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తూ ప్రజలకు ధైర్యం కలిగించాలి. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటే..

  • కర్నూలు నగరం మునిగిపోయే ప్రమాదం అంచున ఉంది, జాగ్రత్తలు తీసుకోవాలి అని నిన్నటినుండి ప్రజలు ఘోషిస్తే అలాటిదేం జరగదు, ఏం పరవాలేదు అని కర్నూలు కలెక్టరు మీణా అన్నాడట. నగరం మునిగిపోయి, నడుముల దాకా నీళ్ళొచ్చిన ప్రస్తుత పరిస్థితిలో అక్కడ జనాన్ని తరలించడానికి ఇప్పుడక్కడ పడవల్లేవు, నీళ్ళలో చిక్కుకున్నవారికి అన్నం లేదు, తాగను నీళ్ళు లేవు. 
  • రాష్ట్ర ప్రభుత్వం బెంగళూరు నుంచి కర్నూలుకు హెలికాప్టర్లు పంపించిందట, అవి అక్కడ దిగాయిగానీ పనుల్లోకి దిగలేదట. ఎంచేతంటే .. -వాటికి పెట్రోల్లేదు!  హై. నుండి పెట్రోలు పంపిస్తారంట!!
—————————————————–
తాజా:
వరద బాధితులకు సహాయం అందించదలచినవారు కిందివారిని సంప్రదించవచ్చు:
హిందూ ధార్మిక సంస్థలు (మళ్ళ వాసుబాబు): 96035 49469
లోక్‌సత్తా పార్టీ (రత్నం): 93983 03029, 93910 38940
Advertisements