Archive

Archive for the ‘ఎన్నికలు’ Category

కాంగ్రెసు గెలిచింది

రాజశేఖరరెడ్డి గెలిచాడు.

రాజశేఖరరెడ్డి ఐదేళ్ళ అద్భుతమైన పాలనకు మురిసి ప్రజలు వోట్లేసారని కాదు, ప్రతిపక్షాలు ఈ ఐదేళ్ళలో అద్భుతమైన పనితీరేమీ కనబరచలేదు కాబట్టి. ‘ఇదిగో వీళ్ళకు వోటేస్తే మంచి, సమర్ధవంతమైన పాలనను అందిస్తారు‘ అనే నమ్మకాన్ని ప్రజలకు కలిపించలేకపోయారు కాబట్టి కాంగ్రెసు గెలిచింది. ప్రభుత్వ వ్యతిరేక వోట్లను ప్రతిపక్షాలు చీల్చుకోడంతో కాంగ్రెసు గట్టెక్కింది. గతంలో కంటే సీట్లు తగ్గడాన్ని బట్టి తెలుస్తోంది, ప్రజలు కాంగ్రెసు పట్ల వ్యతిరేకతతో ఉన్నారని. వోట్ల శాతాలు వెల్లడైతే అప్పుడు పూర్తి సంగతులు తెలుస్తాయి.

కాంగ్రెసు గెలవడానికి గల కారణాల్లో నాకు తోచినవివి:

 1. చేతకాని ప్రతిపక్షం. ఇది అన్నిటికంటే పెద్ద కారణం. ప్రతిపక్షమంటే ఇక్కడ నా ఉద్దేశం మహాకూటమి. రాష్ట్రానికి సమర్ధమైన పాలనను అందించగలవాళ్ళమనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించలేకపోయారు. రాజశేఖరరెడ్డి మొండివాడు, మంచో చెడో.. అనుకున్నది చేసేస్తాడు, వీళ్ళు అలాంటివాళ్ళు కాదు అనే భావన ప్రజల్లో ఉంది. ఐదేళ్ళపాటు తెదేపా కాంగ్రెసును ఏమీ చెయ్యలేకపోయింది – బాబు రాజశేఖరరెడ్డిని ఏ..మీ చెయ్యలేకపోయాడు – రాజశేఖరరెడ్డి బలవంతుడు, బాబు బలహీనుడు అనే భావన ఏర్పడింది. పైగా రాజశేఖరరెడ్డితో పోలిస్తే బాబుకు విశ్వసనీయత తక్కువ. దానికి తోడు మహాకూటమి ఎన్నికల్లో పోరు చెయ్యలేదు, పోరు చేసుకుంది. కాంగ్రెసుతో కంటే దాంతో అదే  ఎక్కువ పోట్టాడుకుంది. పొత్తులు పొత్తులంటూనే కత్తులు దూసుకున్నారు, స్నేహపూర్వక యుద్ధాలు చేసుకున్నారీ విరోధాభాసానికి నమూనాలు, శత్రుత్వంతో కూడిన స్నేహితులు, ముత్తైదువు ముండలు.
 2. ప్రతిపక్షపు వోట్లు చీలిపోయాయి. ప్రరాపా, లోక్‌సత్తా కలిసి, తెదేపా వోట్లను చీల్చుకున్నాయి. ప్రజారాజ్యం కాంగ్రెసు వోట్లను కూడా చీల్చుకున్నప్పటికీ దెబ్బ తెదేపాకు బాగా తగిలినట్టు కనిపిస్తోంది.

అవినీతి ఆరోపణలను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ఖచ్చితంగా చెప్పాలంటే అవినీతినే పెద్దగా పట్టించుకోలేదనాలి. ప్రజలకు అవినీతి అలవాటైపోయింది, సహజమై పోయింది. అందరూ అవినీతిపరులే గదా.. అనే నిర్లిప్తత కూడా దీనికి కారణం కావచ్చు. చాలా ప్రమాదకరమైన సంగతిది. ఇదిగో ఈ కారణంగానే మనకు లోక్‌సత్తా లాంటి పార్టీలు మరిన్ని కావాలి.

ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలిసి రాజశేఖరరరెడ్డిని హీరోగా చేసాయి. తన పార్టీ గెలుపోటములకు తానే బాధ్యుణ్ణని చెబుతూ, ఆ బాధ్యత మొత్తాన్నీ తన భుజాలపై పెట్టుకు మోసాడు. కాంగ్రెసు విజయంలో దోహదపడిన ప్రతీ పాజిటివు అంశానికీ ఆయనే కర్త. అంచేత కాంగ్రెసు విజయానికి ఆ పార్టీ తరపున పూర్తి శ్రేయస్సు ఆయనకే!

అయితే తామే స్వయంగా హీరోలైనవాళ్ళు ఇద్దరు..
ఒకరు బీజేపీ కిషన్‌రెడ్డి! కేవలం తన వ్యక్తిగత ప్రతిభతో, తాను చేసిన పనులతో ప్రజల మనసులను గెలిచినవాడాయన. జయప్రకాశ్ నారాయణ మరో హీరో. మార్పు తెస్తానని చెప్పిన నాయకుడిగా, తేవలసిన బాధ్యత ఉన్న నాయకుడిగా ఆయనమీద చాలా పెద్ద బాధ్యత ఉన్నది. అంతకన్నా పెద్ద బాధ్యత – పార్టీని ప్రజలకు మరింత చేరువగా తీసుకువెళ్ళాల్సిన బాధ్యత – కూడా ఆయనపై ఉన్నది. వచ్చే ఐదేళ్ళలో ఆ పని ఎంతవరకు చేస్తాడో చూడాలి. వీళ్ళిద్దరూ గెలవడం ఈ ఎన్నికల్లో మంచి కబురు.

సరే.. ఇక జీరోల సంగతికొస్తే..  చిరంజీవి అందరికంటే పెద్ద జీరో! తరవాత కేసీయారు. వీళ్ళిద్దరూ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ చక్కటి ప్రదర్శన ఇచ్చారు. కేసీయారుది మరీ విచిత్రం.. ఎంతో కృషి చేసినా ఓడిపోయినవాళ్ళు ఉంటారెక్కడైనా. కానీ, ఓడిపోవడం కోసం ఇంత కృషి చేసినవాళ్ళు ఎక్కడా ఉండరేమో!.

ఈ ఎన్నికల్లో లోక్‌సత్తా ఉదయించడం ఒక మంచి విశేషం. ప్రజలు చెయ్యాల్సింది చేసారు.. ‘ఇదిగో మీకీ అవకాశం ఇస్తున్నాం, పనిచెయ్యండి. మీ పనితీరు చూసాక, వచ్చే ఎన్నికల్లో మిగతా సీట్ల సంగతి చూద్దాం‘ అని చెప్పారు. ఇక మాట నిలుపుకోవాల్సింది లోక్‌సత్తాయే!

ఈసారి శాసనసభ కాస్తంత అర్థవంతంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. జయప్రకాశ్ నారాయణ, కిషన్‌రెడ్డి లాంటి ఒకరిద్దరు చేసే ప్రసంగాలు కాస్త ప్రయోజనకరంగా ఉండొచ్చు. వీళ్ళని చూసైనా తెదేపా తన పద్ధతి మార్చుకుంటుందా..? ఏమో, అంత నమ్మకం కలగడంలేదు. కాంగ్రెసు ఎలాగూ మార్చుకోదు. రేవంత్‌రెడ్డి, పయ్యావుల కేశవ్ వంటి కొందరు తెదేపాలోనూ ఉన్నప్పటికీ వారికి మాట్టాడే అవకాశం ఎంతవరకు వస్తుందో చూడాలి.

ఫలితాలొచ్చాక, ఓడినవాళ్ళ పట్ల టీవీ ఛానెళ్ళ ప్రవర్తన చాలా జుగుప్సాకరంగా ఉంది. ఓడినవాళ్ళను ఎంతలా చులకన చేసాయో చూస్తే వాటిమీద ఏవగింపు కలిగింది. పోరులో గెలుపోటములు సహజం. వారి వ్యూహాలను, ప్రచారాలను, చెప్పిన మాటలను, పోయిన పోకడలను విమర్శించవచ్చు. ఎత్తిపొడవొచ్చు. కానీ వాళ్ళమీద సినిమా పాటలు కట్టి వాళ్ళను ఎగతాళి చెయ్యడం మాత్రం చవకబారుతనంగా అనిపించింది. ముఖ్యంగా చిరంజీవిని, కేసీయారునూ చితక్కొట్టేసారు. ఐన్యూసువాడి ఆ పిన్‌కౌంటరు దానయ్య మరీ బజారువెధవ లాగా మాట్టాడాడు. మామూలుగానే నాకది నచ్చదు, ఇప్పుడు మరీను.

Advertisements

చారిత్రిక అవసరం

అధికారమనేది లక్ష్యం కాకూడదు, అదొక మార్గం అంతే! అంటున్నాడు లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ. జాతినిర్మాణం, బిడ్డల భవిష్యత్తూ లక్ష్యాలు కావాలి. అధికారం -దాన్ని సాధించే మార్గం కావాలి. కానీ సాంప్రదాయిక రాజకీయ పార్టీలు అధికారాన్ని లక్ష్యంగా చూస్తున్నాయి అని అంటున్నాడు.

పేదరికాన్ని తొలగిస్తాం, నిరుద్యోగాన్ని నిర్మూలిస్తాం, ఆరోగ్య సిరులు అందిస్తాం అని చెప్పుకునేవాళ్ళు చాలామందే ఉన్నారు. చాలా పార్టీలే ఉన్నాయి. కానీ, పేదరికాన్ని తొలగించవచ్చు, నిరుద్యోగాన్ని నిర్మూలించవచ్చు, ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సౌభాగ్యాన్ని అందించవచ్చు అని చెబుతోంది లోక్‌సత్తా. అవి ఎలా సాధించవచ్చో కూడా చెబుతోంది. ప్రతీ సమస్యకూ నిర్దుష్టమైన పరిష్కార మార్గాలున్నాయని చెబుతోంది. ఈ లక్ష్యాలను సాధించడం కోసం అధికారమిమ్మంటోంది.

ఎన్నోసార్లు ఎంతోమందిని నమ్మాం. ఎంతోమంది దొంగలకు, వెధవలకూ వోటేసాం. వాళ్ళు దొంగలని తెలిసీ వేసాం. మనకు మరో అవకాశం లేక, వేసాం. ఉన్న వెధవల్లోనే కాస్త మంచివాణ్ణి ఎంచుకుని వోటేసాం. ఫలానావాడికి వోటేస్తే మనలను దోచుకుతింటాడని తెలిసీ వేసాం.

ఇప్పుడు మనకు లోక్‌సత్తా రూపంలో చక్కటి అవకాశం వచ్చింది. ఏం చెయ్యాలో తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. కానీ లోక్‌సత్తాకు ఎలా చెయ్యాలోకూడా తెలుసు. అన్నిటికంటే ముఖ్యం.. అనుకున్నది చేసే చిత్తశుద్ధి, నైతికత, నిబద్ధత  ఆ పార్టీకి ఉన్నాయి.

లోక్‌సత్తా అంటే అభిమానం ఉండీ, వోటు వెయ్యడానికి వెనకాడేవారికి ఈ విజ్ఞప్తి:

నేనొక్కడిని వేసినంత మాత్రాన లోక్‌సత్తా గెలుస్తుందా అని అనుకోకండి. నేను వేస్తేనే గెలుస్తుంది అని అనుకోండి. పరీక్షలో “ఆఁ ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం రాయనంత మాత్రాన తప్పబోయామంటలే” అని వదిలేసామా?

పట్నాల్లోనే కాదు, చదువుకున్నవారిలోనే కాదు, పల్లెటూళ్ళలో కూడా, చదువుకోనివారిలో కూడా లోక్‌సత్తాకు అభిమానులున్నారు. (కొత్తగూడెంలో నా స్నేహితుడి భార్య కూరగాయలు కొనేందుకు మార్కెట్టుకు వెళ్తే, అక్కడికి ఓ పార్టీవాళ్ళు ప్రచారానికి వచ్చి, వోటెయ్యమని అడిగారట. వాళ్ళు వెళ్ళగానే కూరగాయలు అమ్ముకునే ఆమె పక్కామెతో “వీళ్ళకెందుకు వేస్తాం, ఈ సారి లోక్‌సత్తాకు వేద్దాం” అని అందంట!)

వాళ్లకున్న తెలివితేటలు, భవిష్యత్తు పట్ల వాళ్లకున్న జాగ్రత్త మనకు మాత్రం లేవా? రండి, మనమూ లోక్‌సత్తాకు వోటేద్దాం.

మనం కోరుకునే భవిష్యత్తు ఒక్క వోటు దూరంలో ఉంది.

రెండు చర్చలు

ఇవ్వాళ టీవీ ఛానళ్ళలో రెండు చర్చలు చూసాను.  రోజూ చూస్తాననుకోండి, ఎందుకో ఈ రెంటి గురించీ రాయాలనిపించింది. కాస్త సమయమూ చిక్కింది. ముందుగా..

ఓటరును అవమానపరచిన క్షణం
భిక్కనూరులో ముఖ్యమంత్రి ప్రచారంలో ఉండగా, శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి,  2004 లో తెలంగాణా ఇస్తామని నమ్మించి ఎందుకు మోసం చేసారని. ఆయన్ను ప్రశ్నించాడు. ఆ మాట అడిగినందుకు శ్రీధర్ రెడ్డిని పక్కకు  లాగిపడేసారు. ఆ తరవాత కాంగ్రెసు కార్యకర్తలు ఆయనపై చెయ్యిచేసుకున్నారట కూడాను. నేను చెబుతున్న అవమానం ఇది కాదు; ఇది చిన్నది. అసలు అవమానం ఇవ్వాళ – ఏప్రిల్ 2న – ఐన్యూస్ ఛానల్లో జరిగిన చర్చలో జరిగింది.

ఈ చర్చలో కమలాకర్ (కాంగ్రెసు), చంద్రశేఖర్ (తెదేపా), శ్రవణ్ (ప్రారాపా), ఘంటా చక్రపాణి (స్వతంత్ర పరిశీలకుడు) పాల్గొన్నారు. మామూలుగానే అరుపులూ కేకలు జరిగాయి. ఈ చర్చలో విశేషమేంటంటే, చర్చ సగంలో ఉండగా ఐన్యూస్ నిజామాబాదు స్టూడియోకి శ్రీధర్ రెడ్డిని పిలిచి ఆయన్నూ మాట్టాడించారు. చక్కగా మాట్టాడాడాయన.

“ముఖ్యమంత్రి మా ఊరు వచ్చారు, మాకే వోట్లు వెయ్యమని అడిగారు. తెలంగాణా ఇస్తామని 2004 లో మీరు చెప్పారు కాబట్టి, నేను మీకు వోటేసాను. ఈ ఐదేళ్ళూ మీరు ఏమీ చెయ్యలేదు. మళ్ళీ ఇప్పుడొచ్చి, వాళ్ళు దొంగలు, వీళ్ళు మోసగాళ్ళు అని చెబుతున్నారు, అసలు మీరేంచేసారు?” అని నేను ముఖ్యమంత్రిని అడిగాను, నాయకుణ్ణి ఒక వోటరుగా ప్రశ్నించాను.” అని చక్కగా చెప్పాడాయన.

దానికి కమలాకర్, కాంగ్రెసు వాళ్ళు మామూలుగా చెప్పేదే చెప్పాడు. “ఎస్సార్సీ వేస్తామని చెప్పాము, కేసీయారు వద్దన్నాడు. పైగా అన్ని పార్టీలు కలిసి రాలేదు. సొంతంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేంత బలం మాకు లేదు. ఈసారి మాకు వోటేస్తే ఏర్పరుస్తాం” అని చెప్పాడు. అక్కడితో ఆగలేదు, “అసలు ఈ వ్యక్తి ఏదో పార్టీకి చెందినవాడిలాగా ఉన్నాడు ఎవరో ప్రేరేపిస్తే అలా మాట్టాడాడు”, అని ఆరోపించాడు. శ్రీధర్ రెడ్డి, నేను మహాకూటమికి వోటేస్తాను అని నిజాయితీగా చెప్పాడు. 

ఇక కమలాకర్ రెచ్చిపోయి, “అదిగో, తాను మహాకూటమి మనిషినని ఆయనే చెబుతున్నాడు”, అన్నాడు. అదేదో కాంగ్రెసును విమర్శించేవాళ్ళంతా ప్రతిపక్ష పార్టీలే, వాళ్ళ కార్యకర్తలే అన్నట్టు ఆరోపించాడు. కాంగ్రెసుకు వోటు వెయ్యని వాడికి దాన్ని విమర్శించే హక్కు లేదన్నట్టు మాట్టాడాడు. శ్రీధర్ రెడ్డిని మాట్టాడనివ్వలేదు. వోటరుగా నాయకులను ప్రశ్నించడం శ్రీధర్ రెడ్డికున్న హక్కు. చర్చలో ఆయనపై ఎదురుదాడి చేసి, ఆయన్ను ఓ పార్టీకి కట్టేసి, కమలాకర్ ఆయన్ను అవమానించాడు. నాయకుల దురుసుతనానికిది నిదర్శనం.

చివరికి, “ఎదురుదాడి చెయ్యడం ముఖ్యమంత్రి మీకు బాగా నేర్పించాడు, అందుకే ఇలా ఎదురుదాడి చేస్తున్నారు” అంటూ శ్రీధర్ రెడ్డి కూడా గట్టిగానే చెప్పాడు. కాంగ్రెసువాళ్ళ ఎదురుదాడి వైఖరిని తేటతెల్లం చేసాడు.

శ్రీధర్ రెడ్డి  ఇంకోమాట కూడా అడిగాడు.. “సభలో మెజారిటీ లేకపోయినా శాసనమండలి బిల్లును, అణుఒప్పందాన్నీ నెగ్గించుకున్నారు. మరి తెలంగాణకు అడ్డేమొచ్చింది? బిల్లు పెట్టండి, మేము మద్దతిస్తాం అని బీజేపీ కూడా చెప్పిందికదా” అని అడిగాడు.

ఇది తప్పించి ఆ చర్చా కార్యక్రమంలో కొత్తగా చర్చించిందేమీలేదు, గుర్తు పెట్టుకోవాల్సిందీ లేదు. ప్రజారాజ్యపు శ్రవణ్ మాత్రం శ్రీధర్ రెడ్డిని అభినందించాడు.

శ్రీధర్ రెడ్డి గారూ, నా అభినందనలు కూడా అందుకోండి. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని, వోటర్లందరమూ అలా ప్రశ్నించిన రోజున, మన దగ్గరకొచ్చి అవాకులు చవాకులూ పేలే నాయకులు ఒళ్ళు దగ్గరపెట్టుకుంటారు.

—————————————-

ఇక, ఓ ముఖాముఖి గురించి..

రాజమండ్రి లోక్‌సభ అభ్యర్థులు మురళీమోహన్ (తెదేపా) , ఉండవల్లి అరుణ్‌కుమార్‌ (కాంగ్రెసు)ల మధ్య ముఖాముఖి చర్చ జరిగింది, ఎన్‌టీవీలో. ఈ ఎన్నికల్లో జరిగిన ముఖాముఖీల్లో నేను చూసిన మొదటిదిది. ఉండవల్లి చాలా సమర్ధవంతంగా వాదించాడు. చక్కటి వాగ్ధాటి, వాదనాపటిమ ఉన్నాయాయనకు. మురళీమోహన్‌కు వాగ్ధాటీలేదు, వాదించేందుకు విషయమూ లేదు. అసలా ప్రాంతపు సమస్యలేంటో కూడా తెలిసినట్టులేదు. ఈ చర్చకోసం సరిగ్గా తయారైనట్టు కూడా లేదు.

మురళీమోహన్ అచ్చు చిరంజీవి లాగానే మాట్టాడాడు. తానెంతో మంచివాడినన్నట్టు, సచ్ఛీలుణ్ణన్నట్టు  ప్రదర్శించుకోబోయాడు. “నేను ఉండవల్లికి ఒక ప్రతిపాదన చేద్దామనుకున్నాను – నా వోటు  ఆయనకు, ఆయన వోటు నాకూ వేసుకుందామని చెబుదామనుకున్నాను. కానీ నా వోటు హై.లో ఉండటం వలన ఆ ప్రతిపాదన చెయ్యలేదు” అని అన్నాడు. అసలీ ముక్క ఎందుకు చెప్పాడంటే, అంతకుముందు – ఎప్పుడో మరి – మనిద్దరం కలిసి, ఒకే వాహనంలో తిరిగి ప్రచారం చేద్దామని ఉండవల్లి ప్రతిపాదించాడట. దానికి ప్రతిగా నన్నట్టుగా వాడాడీ తెలివితక్కువ డైలాగు. ఉండవల్లి, “నేను మురళీ మోహనుకైతే వేసేవాణ్ణిగానీ, ఆయన వెనకాల తెదేపా ఉంది కాబట్టి, ఆయన ప్రతిపాదనను ఒప్పుకునేవాణ్ణి కాను” అని తేల్చి చెప్పేసాడు.

అంతేకాదు, చర్చలో కనీసం నాలుగైదు సార్లు మురళీ మోహన్ అవగాహనాలేమిని బయటపెట్టాడు, ఉండవల్లి. చుట్టూ చేరిన ప్రేక్షకులతో (అంతా వివిధ పార్టీల కర్యకర్తల్లాగానే ఉన్నారు) “ఈయనకు ఈ రంగం కొత్త, ఇలాంటి ప్రశ్నలడిగి ఇబ్బంది పెట్టకండి” అంటూ చెణుకులూ విసిరాడు. మీరు నియోజకవర్గానికి కొత్త, మీకు సంగతులు తెలీవు,  అంటూ అన్యాపదేశంగాను, సూటిగాను కూడా అన్నాడు.

మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు అని ఇద్దరినీ అడిగాడు నిర్వాహకుడు. ఉండవల్లి, రెండు గోదావరి జిల్లాల్లోను పోలింగు రోజుదాకా ఎవరనేది చెప్పలేం, మిగతా రాష్ట్రంలో మాత్రం తెదేపానే నన్నాడు. మురళీ మోహనేమో, నేను కొత్తవాణ్ణి, ఉండవల్లి, కృష్ణంరాజు (ప్రరాపా అభ్యర్థి. చర్చలో ఈయన ఎందుకు పాల్గొనలేదో మరి!) ఇద్దరూ సీనియర్లు.. అంటూ ఏదేదో చెప్పాడు.

చివర్లో ప్రేక్షకుల్లోంచి ఓ పాత్రికేయుడు అడిగాడు, “మరి మీరిద్దరూ కలిసి ప్రచారం చేసే సత్సంప్రదాయాన్ని మొదలుపెడతారా” అని. మురళీమోహన్ కృష్ణంరాజు గారిని కూడా అడిగి అప్పుడు చూద్దాం అని అన్నాడు. ఉండవల్లి, “నాకేం అభ్యంతరం లేదు, నేను ఇంకా వాహనాల కోసం పురమాయించలేదు కూడా. మురళీమోహన్ గారి పసుపు బండిలో ఎక్కి ప్రచారం చేద్దామంటే నేను సిద్ధమే” అని అన్నాడు.

ఉండవల్లి, చర్చ రూపంలో వచ్చిన ఈ అవకాశాన్ని చక్కగా వాడుకున్నాడు. అంబేద్కరును విమర్శించిన ఘటనకు సంబంధించి, తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేసాడు, అందుకు బాగా సిద్ధమై వచ్చాడు కూడాను. తాను గత ఐదేళ్ళలో ఏమేం చేసాడో చక్కగా చెప్పాడు. తెదేపాను గట్టిగా విమర్శించి, కాంగ్రెసుపై మురళీమోహన్ చేసిన పేలవమైన విమర్శలను సమర్ధవంతంగా తిప్పికొట్టాడు.

ఉండవల్లి వాదనాసమర్ధతా, మురళీమోహన్ అవగాహనాలేమి, అనుభవలేమి, వాక్చాతుర్యలేమి -రెండూ కలిసి, చర్చ ఏకపక్షమైంది. అది చూసిన తటస్థ వోటరెవరైనా ఉండవల్లి వైపుకే మొగ్గుతారు.

ఎన్నిక లెన్నిక లెన్నిక లెండిక!

ఎన్నికల తేదీలు ఖరారయ్యాయి. పార్టీలు, నాయకులు మన ముందు చేతులు కట్టుకు నిలబడే రోజు వస్తోంది. 2009 సార్వత్రిక ఎన్నికల కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం ప్రకటించింది.

 • మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు
  • మొదటిదశ: ఏప్రిల్ 16. 124 లోక్‌సభ నియోజక వర్గాలు. మన రాష్ట్రంలో తెలంగాణ, ఉత్తరాంధ్రల్లో 21 ని.వల్లో ఎన్నికలు జరుగుతాయి.  
  • రెండోదశ. ఏప్రిల్23. 141 లోక్‌సభ నియోజక వర్గాలు. మన రాష్ట్రంలోని మిగతా ని.వల్లో  ఎన్నికలు జరుగుతాయి.  
  • మూడోదశ: ఏప్రిల్ 30. 107 నియోజక వర్గాలు
  • నాలుగోదశ : మే 7. 85 నియోజక వర్గాలు
  • అయిదో దశ: మే 13. 86 నియోజక వర్గాలు
  • మే 16న ఓట్ల లెక్కింపు
 • ఆంధ్ర ప్రదేశ్‌లో లోక్‌సభతో పాటు శాసనసభకూ ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. 
 • దాదాపు నెలరోజుల పాటు ఎన్నికలు జరుగుతాయి. మొదటిదశలో వోట్లేసాక, ఫలితాల కోసం సరిగ్గా నెలరోజులు ఆగాలి.

ఎన్నికల క్రమశిక్షణావళి వెంటనే అమల్లోకి వచ్చింది కాబట్టి, ఇక మనకు కొన్ని తలకాయనెప్పులు తగ్గొచ్చు. అవి..

 • టీవీల్లో వస్తున్న అడ్డగోలు, చవకబారు ప్రకటనలు. ఇకపై ఎన్నికల సంఘం అనుమతి లేనిదే ఈ రకం ప్రకటనలు వెయ్యగూడదు. అంచేత ఇక ఆ కోళ్ళూ, కుక్కల ప్రకటనలు ఉండకపోవచ్చు.
 • ప్రభుత్వం మన డబ్బుతో పేపర్ల నిండా గుప్పిస్తున్న ప్రకటనలు. ఇహన ఇవి గూడా రాకపోవచ్చు.
 • అయితే వీటికి ప్రత్యామ్నాయంగా నాయకులు బూతులు తిట్టుకోడం ఎక్కువౌతుంది. దాన్ని భరించాల్సిందే. ఎన్నికల సంఘం వీళ్ళ కూతలకు కూడా ఏదన్నా పరిమితి పెడితే బాగుంటుంది.

మనం చెయ్యాల్సిన పనులు కొన్నున్నాయి..

 1. ముందు మన పేరు వోటర్ల జాబితాలో ఉందో లేదో చూసుకోవాలి. లేనట్లైతే, ఇప్పుడైనా నమోదు చేయించుకోవచ్చు. పోస్టాఫీసులో ఒక దరఖాస్తు పడేస్తే చాలు, పని జరుగుతుంది. గుర్తింపు కార్డు లేకపోతే తీసుకోవాలి.
 2. మన ఇంట్లోవాళ్ళకు, తోటివాళ్ళకు వోటు హక్కు ఉందో లేదో కనుక్కుని, లేకపోతే నమోదు చేయించుకునేందుకు వాళ్ళను ప్రోత్సహించాలి. 
 3. వోటర్ల జాబితా రాష్ట్ర ఎన్నికల అధికారి వెబ్‌సైటులో చూడొచ్చు.  వివిధ ఫారాలు కూడా అదే సైటులో ఉన్నాయి.
 4. వోటేసేందుకు ఒక విధానాన్ని మనకు మనమే ఎంచుకోవాలి. అవినీతి లేని పాలన కోసమో, వ్యవసాయాభివృద్ధి కోసమో, పారిశ్రామికాభివృద్ధి కోసమో, ఎస్సీ వర్గీకరణ చెయ్యడం కోసమో, వర్గీకరణ చెయ్యకుండా ఉండటం కోసమో, తెలంగాణా కోసమో, సమైక్య భావన కోసమో,.. ఇలా మనకు ముఖ్యమనుకున్న విధానాలను ఎంచుకుని వాటికి న్యాయం చెయ్యగల పార్టీకి వోటేద్దాం. మన్నికైన నాయకులను ఎన్నుకుందాం. ఒక్కొక్కరి తప్పొప్పులను ఎంచి, బేరీజు వేసి వోటేద్దాం.

అసలంటూ వోటు వేద్దాం. వోటు, హక్కే కాదు, బాధ్యత కూడా!

ఇక వోటరు నమోదు కొన్ని నొక్కుల్లో

October 25, 2008 5 comments

ఇక మనం ఇంట్లోంచే వోటరుగా నమోదు చేసుకోవచ్చు. మీ క్రెడిటుకార్డు వాడి జాలంలో పుస్తకం కొనుక్కున్నట్టుగా, డ్రాప్‌బాక్సు ద్వారా ఫోను బిల్లు కటినట్టుగా, కార్డు బిల్లును చెల్లించి పారేసినట్టుగా, పోస్టాఫీసులో ఉత్తరాన్ని రిజిస్టరు చేసినట్టుగా ఇక వోటరుగా నమోదు చేసుకోవచ్చు.

ఈ విషయమ్మీద ఈనాడులో వచ్చిన వార్త చూడండి. ఆ వార్త సంక్షిప్తంగా ఇది:

ఇక నుంచి ఏ కార్యాలయానికి వెళ్లకుండానే ఇంట్లో ఉండే ఓటు హక్కును నమోదు చేయించుకోవచ్చు. రాష్ట్రంలో ఈ-నమోదు ద్వారా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ కల్పించింది. గత వారం రోజులుగా ఈ నమోదు ప్రక్రియను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఐవీ సుబ్బారావు అమలులోకి తెచ్చారు. దీనికి విపరీతమైన స్పందన వస్తోందని ఆయన చెబుతున్నారు. 
ఈ-నమోదు చేసుకోవాలంటే ముందుగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వెబ్‌సైట్‌లోకి వెళ్లి అందులో ఉన్న ఈ-రిజిస్ట్రేషన్ ఫారాన్ని పూర్తి చేసి, రెండు ఫొటోలను అప్‌లోడ్ చేయాలి. ఈ దరఖాస్తులను ఎన్నికల కమిషన్ పరిశీలన చేస్తుంది. అర్హులని తేలితే వారికి నెల రోజుల్లో ఓటు హక్కును కల్పిస్తుంది. మొదటి రెండు మూడు రోజుల్లోనే ఈ-నమోదుకు మంచి స్పందన రావడంతో దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.
అలాగే.. 
 • హైదరాబాద్‌లో వచ్చే నెల 5నుంచి 212 పోస్టాఫీసుల్లో ఓటరు నమోదు ఫారాలను పెట్టి అక్కడే దరఖాస్తు పెట్టెలు (డ్రాప్ బాక్సులు) ఏర్పాటు చేస్తున్నారు. ఫారం పూర్తి చేసి రెండు ఫొటోలను జత చేసి డ్రాప్ బాక్సుల్లో పడవేస్తే నెలరోజుల్లో వారికి ఓటు హక్కును కల్పిస్తారు. 
 • జంటనగరాల్లోని ప్రధానమైన షాపింప్ బజార్ల‌లోనూ, పెట్రోల్ బంకుల్లోనూ శనివారం నుంచి దరఖాస్తు పెట్టెలను ఏర్పాటు చేస్తున్నారు. 
 • వచ్చే నెల అయిదో తేదీ నుంచి హైదరాబాద్‌లోని 48 ఈ-సేవా కేంద్రాల్లో కూడా ఓటరు నమోదు ప్రక్రియ మొదలవుతుంది. 
 • రాష్ట్ర వ్యాప్తంగా 1200 కేంద్రాల్లో శాశ్వత ఓటర్ల నమోదు కేంద్రాల(డీపీఎస్ సెంటర్లు) ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. 

రండి, నమోదు చేసుకోండి అంటూ ఇన్ని ఏర్పాట్లు చేసాక కూడా నమోదు చేసుకోకుండా ఉంటామా!? 

జై ఎన్నికల సంఘం! 

——————————————————————–

పోతే.. ఈనాడులో ఆ వార్త చూసాక, తప్పుల్లేకుండా వెబ్బు లింకులివ్వడం ఈనాడుకు ఇంకా అలవాటు కాలేదని అర్థమైంది. 
 • వాళ్ళిచ్చిన లింకు ఇది: ceoandhra.govt.in దానికి హైపరులింకు లేదు.. దాన్ని నొక్కితే సైటుకు పోదు. కాపీ చేసుకుని అడ్రసు బారులో పెట్టుకోవాల్సిందే -అదేదో ఈమెయిల్లో లాగా!
 • అసలు లింకు ఇది:http://ceo.ap.gov.in/ (మీ పేరు వోటరు జాబితాలో ఉందో లేదో చూసుకోడానికి ఈ లింకు ఉపయోగపడుతుంది) లేదా http://ceoandhra.nic.in/. చూసారుగా.. వెబ్బు అడ్రసు తప్పు! కాపీ చేసుకుని అడ్రసుబారులో పెట్టుకున్నా మన డబ్బా దాటి ఎక్కడికీ పోదది! (govt.in అట -ఇంకా నయం government. in అనలేదు.)
విశేషమేంటంటే ప్రింటులో లింకును బానే ఇచ్చారు. వెబ్బులోనే ఈ తప్పులు!

ప్చ్!

పోస్టాఫీసుల్లో వోటరు నమోదు కేంద్రాల ప్రయోగాత్మక ఏర్పాటు

September 27, 2008 6 comments

పోస్టాఫీసుల్లో వోటరు నమోదు కేంద్రాలనేర్పాటు చెయ్యాలనే విషయమై లోక్‌సత్తా ఎప్పటినుండో అడుగుతోంది కదా… దీనిమీద ఈమెయిలు గోల కూడా చేసాం. ఈమధ్య జయప్రకాష్ నారాయణ ఎన్నికల ప్రధాన కమిషనరుతో జరిపిన చర్చల తరవాత దీన్ని ప్రయోగాత్మకంగా హై. లో అమలు చెయ్యాలని నిర్ణయించారని తెలిసింది. 

శభాష్ ఎన్నికల సంఘం, జయప్రకాష్ నారాయణ!

దీనికి సంబంధించి సెప్టెంబరు 27న ఈనాడులో వచ్చిన వార్త ఉన్నదున్నట్టుగా ఇక్కడ:

తపాలా కార్యాలయాలద్వారా శాశ్వతంగా ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచిస్తోంది. ఇందులో మొదటి అడుగ్గా హైదరాబాద్‌లో ప్రయోగాత్మక ప్రాజెక్టు చేపట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ తపాలాశాఖ నుంచి అధికారిక ప్రతిపాదనలు అందిన వెంటనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణకు ఎన్నికల సంఘం హామీ ఇచ్చింది. 

ఓటర్ల జాబితాలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న తప్పులను సరిదిద్దడానికి తపాలా కార్యాలయాలద్వారా నమోదు చేపట్టాలంటూ జయప్రకాశ్ ఇదివరలో ఈసీకి ప్రతిపాదనలు పంపారు. వాటిని పరిశీలనలోకి తీసుకున్న ఈసీ శుక్రవారం ఆయనను ఢిల్లీకి పిలిపించి చర్చించింది. ఈ భేటీలో ప్రధాన ఎన్నికల కమిషనరు ఎన్.గోపాలస్వామి, కమిషనర్లు నవీన్ చావ్లా, ఖురేషీతోపాటు ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు పాల్గొన్నారు. సుమారు గంటన్నరసేపు దీనిపై చర్చ జరిగినట్లు జయప్రకాశ్ తెలిపారు. దేశవ్యాప్తంగా 1.50 లక్షల తపాలా కార్యాలయాలున్నాయని, ఆంధ్రప్రదేశ్‌లో 12వేల పైచిలుకు ఉన్నాయని వివరించారు. ఇప్పుడున్న విధానంలో హైదరాబాద్‌లో కేవలం ఏడుగురు ఎన్నికల నమోదు అధికారులు మాత్రమే ఉన్నారని, అదే తపాలా కార్యాలయాలద్వారా చేపడితే నగరవ్యాప్తంగా 150 మంది పోస్టుమాస్టర్లు నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించవచ్చని ఆయన సూచించారు.
 
ప్రస్తుత ఓటర్ల నమోదు ప్రక్రియలో జరుగుతున్న తప్పులకు జయప్రకాశ్ ఓ ఉదాహరణ చూపారు. హైదరాబాద్ పరిసరాల్లో నివాసముంటున్న మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్ జె.ఎం.లింగ్డోకు ఓటరు గుర్తింపుకార్డు రావడానికి మూడున్నరేళ్లు పట్టిందని తెలిపారు. ఈ మధ్య ఓ పెళ్లిలో కలిసినప్పుడు మాటల మధ్యలో ఆయన భార్యే ఈ విషయం చెప్పి వాపోయారని జయప్రకాశ్ వెల్లడించారు.

వోటరు నమోదు కేంద్రాలను పోస్టాఫీసుల్లో ఏర్పాటు చెయ్యండి!

September 22, 2008 13 comments

మీకు వోటు హక్కుందా? ఉండే ఉంటుంది. మరి, వోటరుగా నమోదయ్యారా? అయ్యుండకపోతే, నమోదు చేయించుకోండి. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. మన భవితను నిర్ణయించుకునే అవకాశమది -ఎలాగోలా నమోదు చేయించుకోవాలి మరి. అయితే, ఈ నమోదు వ్యవహారం పెద్ద తతంగంగా కనిపిస్తోంది. కుప్పుసామయ్యర్ మేడ్డిఫికల్టు లాగా వీలైనంత కష్టతరంగా చేసిపెట్టారు ఈ కార్యక్రమాన్ని. నమోదు చేయించుకోడానికి ఎక్కడికెళ్ళాలో తెలీదు, ఎప్పుడు చేయించుకోవాలో తెలీదు, ఏవేం కాగితాలు తీసుకెళ్ళాలో తెలీదు. దీన్ని సులభం చేస్తూ.. ‘పోస్టాఫీసుల్లో నమోదు కేంద్రాల నేర్పాటు చెయ్యండి మహప్రభో’ అంటూ లోక్‌సత్తా ఎన్నేళ్ళుగానో గోల పెడుతోంది.

హలీము అమ్మడం లాంటి అనేక మంచి పనులను ఈ పోస్టాఫీసుల్లో చేయిస్తున్నారు గదా, వాటితో పాటు ఈ పనిని కూడా చేయించడానికేం ఇబ్బంది? ఎందుకన్నాగానీ ఎన్నికల సంఘం ఇంకా ఈ చర్య తీసుకోలేదు. అంచేత, వారికి ఉత్తరాలు రాసి, ఎన్నికల సంఘంపై వత్తిడి తెచ్చే కార్యక్రమాన్ని లోక్‌సత్తా చేపట్టింది. మనందరం ఎన్నికల ప్రధాన కమిషనరు వారి సమ్ముఖమునకు ఓ మెయిలు పంపాలన్నమాట! ఆ మెయిల్లో ఏం పంపాలన్నది లోక్‌సత్తా వారు తయారు చేసి పంపారు. ఆ మెయిలుకు తెలుగు అనువాదాన్ని కింద ఇస్తున్నాను. మీరూ ఓ మెయిలు కొట్టండి. మెయిలైడీ: gopalaswamin@eci.gov.in

———————————–

ప్రియమైన గోపాలస్వామి గారూ,

వోటరు నమోదు కార్యక్రమం ఎక్కడ జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో, ఎలా చేసుకోవాలో తెలీకపోవడం వలన ఎందరో యువ భారతీయులు వోటర్లుగా నమోదు చేయించుకోలేక పోతున్నారు.

అంచేత పోస్టాఫీసులను శాశ్వత వోటరు నమోదు కేంద్రాలుగా చెయ్యండి. అప్పుడు సులువుగా నమోదు చేయించుకోవచ్చు, నిర్ధారించుకోవచ్చు, దొంగ వోటర్లను తొలగించడంలో సాయపడనూ వచ్చు.

దీనికవసరమైన చర్యలను ఎన్నికల సంఘం వెంటనే చేపడుతుందని ఆశిస్తాను. కోట్లాది యువ భారతీయుల వోట్లు, ప్రజాస్వామ్యపు భవితా మీ చేతుల్లో ఉన్నాయి.

నమస్కారాలతో,

———————————–

గోపాలస్వామి గారికి తెలుగు అర్థమౌతుందో లేదో తెలీదు కాబట్టి, పై ముక్కలను ఇంగ్లీషులో రాసి పంపించవచ్చు. ఇదిగో ఇలాగ!

————————————
Dear Mr Gopala Swamy,

Most young Indians like me, are not able to register as voters, because we don’t know where this (Voter Registration) is happening, when it is Happening and how we can Register.

So, please make POST OFFICES as PERMANENT CENTERS for VOTER REGISTRATION. Then we can Easily verify our vote, get registered as voters if needed and help remove bogus Voters.

We hope Election Commission will take all necessary steps at the earliest. The Votes of Millions of young Indians and the future of democracy are in your hands.

Regards,
——————————————–
నేను పంపించాను. మీరూ పంపించండి. మీరు వోటరుగా నమోదై ఉన్నా సరే పంపించండి. ఎన్నికల సంఘం ఈ పని చేస్తే ఎంతోమందికి ప్రయోజనం కలుగుతుంది. కానీ, ఆ ప్రయోజనం పొందబోయే వారందరికీ ఈ ఉత్తరాల సంగతి తెలుసో లేదో మరి! అంచేత మనం రాద్దాం. వీలైతే ఈ ముక్కలను మీ మీ బ్లాగుల్లో కూడా పెట్టండి.