Archive

Archive for the ‘క్రికెట్టు’ Category

రికార్డు డ్యాన్సులు, క్రికెట్టు కాంట్రాక్టర్లు

అదసలు క్రికెట్టేనా అని!!
– అదే అయితే ఈ ఛీర్‌లీడర్లెందుకు?
– సరే.. ఉండాలీ అంటే, ఆడాళ్ళే ఎందుకు?
– సరే.. వాళ్ళే కావాలీ అంటే, ఆ కురచగుడ్డలెందుకు?

అన్నీ ఒకందుకే..
డబ్బుల కోసం! వందల కోట్లు పెట్టి ఆటలాడిస్తున్నది డబ్బుల కోసం. జనాలు రావాలి, టీవీల్లో చూడాలి – లేకపోతే డబ్బులెక్కడి నుంచొస్తాయ్? జనాలూ, తద్వారా డబ్బులూ ఇబ్బడిముబ్బడిగా రావాలంటే ఇలాంటి రికార్డింగు డ్యాన్సుల్లాంటివి పెట్టాలి. ఇలాంటి వేషాలేస్తే ఎక్కడైనా జనం పోగవుతారు. అలా పోగౌతారనేగా.. వీటిని పెడుతున్నది! పోగైనప్పుడు మనిషి లోని అసలు మనిషి బయటికి వస్తాడు. మంద మనస్తత్వం (మాస్ మెంటాలిటీ) గురించి తెలియనిదేముంది!

బజాట్టో బట్టలిప్పుకుని తిరుగుతూ “నన్నట్టాగన్నాడు”, “మీదచెయ్యేసాడు” అంటూ ఏడవటంలో అర్థం లేదు. ఏఁ.., ఆట చూట్టానికి వచ్చిన వందలాది మంది స్త్రీల తోటి అలా అసహ్యకరంగా ఎందుకు ప్రవర్తించడం లేదు, వాళ్ళు? స్త్రీని గౌరవించటానికీ, ఈరకం జనాలతో వ్యవహరించడానికీ సంబంధముందని నేననుకోను.

కొత్త సంవత్సరం రోజున ముంబైలో గత రెండేళ్ళు జరిగినది విన్నాం కదా.. అర్ధరాత్రి, చిత్తుగా తాగి, రోడ్లమీద చిందులేస్తూ తిరిగే మూకల మధ్యకి (వందలాది మంది; పైగా ఆ సమయానికి వాళ్ళు పశుప్రాయులు) తామూ పోతే, తప్పు చేసేందుకు సిద్ధంగా ఉన్న ఆ తాగుబోతులూరుకుంటారా? బట్టలు లాగెయ్యడాన్ని నేను సమర్ధించడం లేదు.. పిచ్చి కోతితో కలిసి కల్లు తాగి, ఆనక అది మీద పడి రక్కిందని ఏడవగూడదు అని చెబుతున్నాను. ఎవరి హద్దుల్లో వాళ్ళుండాలి. స్త్రీ పట్ల భారతీయులకున్న గౌరవానికీ దీనికీ సంబంధం ఉందని నేననుకోను!

హై.లో బీచి వాలీబాలు చూసేందుకు జనం ఎగబడ్డారట. ఎల్బీ స్టేడియమ్ లో జరిగే మామూలు వాలీబాలు చూసేందుకు ఎగబడతారా? ఆట కోసమనేనా ఆ తహతహ? ఆ రకంగానైతే జనం బాగా వస్తారనేగదా, డబ్బులు బాగా వస్తాయనే కదా.. ఇసకపోసి మరీ హై.లో ఆ ఆటాడించింది!

కోరికలుండటం సహజం. హద్దుల్లో ఉంచుకోలేకపోవడం, ఉత్సుకత చూపించడం సహజమైన బలహీనత. ప్రజల్లోని ఈ బలహీనతను సొమ్ము చేసుకుందామనే.. వాళ్ళీపని చేస్తున్నారు. ఇంకా ఈ దొంగ ఏడుపులెందుకు? ఈ వ్యాఖ్యానించే బలహీనత ఆ కొందరిదే కాదు.., చాలామందిది, మెజారిటీది. అవకాశం దొరక్క కొందరు, గుర్తుపడతారేమో, దొరికిపోతానేమో లాంటి భయాలతో మరి కొందరు,.. ఇలా రకరకాలు.

మనమిక్కడ అనాల్సింది అలా అసభ్యంగా వ్యాఖ్యలు చేసేవాళ్లని కాదు.. ఆ డ్యాన్సర్లనీ, ఆ వేషాలేయించే వ్యాపారస్తులనీ! స్త్రీని గౌరవించంది వాళ్ళు – ఆ స్త్రీలు, ఆ వ్యాపారస్తులే! డబ్బుల కోసం నైతికంగా దిగజారిపోయింది వాళ్ళే! మహారాష్ట్ర, బెంగాలు మంత్రులు చేస్తున్నది రైటే! ఆ గంతులు మన సభ్యతకు, మర్యాదకు భంగకరం. పబ్లిక్ న్యూసెన్స్!

Advertisements

బీసీసీఐ నిర్వాకం

August 22, 2007 5 comments

భారత్ లో క్రికెట్టు నియంత్రణ కోసం బీసీసీఐ ఉంది. కానీ..

బీసీసీఐ నియంత్రించేది క్రికెట్టును కాదు, దానిలో వచ్చిపడుతున్న డబ్బులను.
ఏ పోటీ ఐనా, ఎక్కడ జరిగినా మన జట్టంటూ పాల్గొంటే చాలు.. డబ్బులే డబ్బులు!
మనం ఓడినా, గెలిచినా మన జట్టు ఆడే మాచిల ప్రసార హక్కులు కోట్లు కురిపిస్తాయి.
– అంచేత జట్టును ఆడించడమే ముఖ్యం.. గెలుపు కాదు.
– అంచేత జట్టును ఎంపిక చేస్తే చాలు.. మంచి జట్టే కానక్కర్లేదు.
– అంచేత ఆటగాళ్ళంటూ ఉంటే చాలు.. మంచి ఆటగాళ్ళను తయారు చెయ్యాల్సిన పని లేదు.

బీసీసీఐ ఎక్కువగా తప్పుడు విషయాలకే వార్తల్లో ఉంటుంది. ఇవిగో ఇలాంటి వాటికి.

  • ఆటగాళ్ళ లోగోల గోల
  • ఆటగాళ్ళతో ఒప్పందాల పేచీ
  • ప్రసార హక్కుల గొడవ
  • ఎన్నికల రాజకీయాలు
  • ఐసీసీతో తగువులు

చాలా సులువుగా చెయ్యాల్సిన పనుల్ని కూడా కంపు చేస్తూ ఉంటారు వీళ్ళు, కుప్పుసామయ్యరు మేడ్డిఫికల్టు లాగా! మన జట్టుకు కోచిని నియమించడంలో బయటపడింది కదా వీళ్ళ తెలివితక్కువతనం. ఒక్కడు కాదు ముగ్గురి చేతుల్లో వెధవలయ్యారు. గతంలో వీళ్ళు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషనుతో కూడా పేచీ పెట్టుకున్నారు. కామన్వెల్తు ఆటలకు క్రికెట్టు జట్టును మా ద్వారానే పంపాలని ఐ.ఓ.ఏ చెబితే, మీద్వారా ఎందుకు, మేమే నేరుగా పంపిస్తాం అని గొడవ పెట్టుకున్నారు. ఐసీసీతో కూడ గొడవ పడ్డారా మధ్య. (ఐసీసీ కూడా తక్కువదేమీ కాదనుకోండి.)

బీసీసీఐ నిర్వాహకులు భలేగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు లేడు గానీ ఇదివరకు జయవంత్ లెలే అని ఒకాయనుండే వాడు, కార్యదర్శిగా.. మనవాళ్ళు ఆస్ట్రేలియాలో చిత్తుగా ఓడి వస్తారని పత్రికల వాళ్ళకి చెప్పాడోసారి; తరవాత దాన్ని ఖండించాడు లెండి!

పైగా బీసీసీఐ పేరెత్తితే చాలు, రాజకీయాల గబ్బు. పోయిన దాల్మియా పతాకస్థాయికి తీసుకెళ్ళాడు దాన్ని. దాల్మియాలు, నాయర్లు, భింద్రాలు.. వీళ్ళకు రాజకీయాల తోటే సరిపోయేది. వీళ్ళు రాబందుల్లాగా తయారయ్యారనుకుంటే.. ఏకంగా గుంట నక్కలు, తోడేళ్ళే రంగంలోకి దిగిపొయ్యాయి, తరవాత. మాంసం వాసనను ఈ జంతువులెలా పసిగడతాయో, రాజకీయ జంతువులు డబ్బు వాసన్నలా పసిగడతాయి.

అసలు రాజకీయులు బీసీసీఐ లోకి దిగడం ఎప్పుడో మొదలైంది. ఎన్.కె.పి.సాల్వే అధ్యక్షుడిగా చేసాడిదివరలో. తరవాత్తరవాత మాధవ్‌రావ్ సిందియా, అరుణ్ జైట్లీ, శరద్ పవార్.. ఇలా అందరూ చేరి దాన్నో రొచ్చుగుంట చేసారు. లాలూ బీహారు సంఘంలో అడుగెట్టాడు, తరువాతి మజిలీ బీసీసీఐ య్యే! (ఇతర ఏ రంగం నుండైనా రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు గానీ రాజకీయులు వేరే ఏ ఇతర రంగంలోకీ అడుగుపెట్టరాదని ఓ చట్టం చేస్తే బాగుండు. దివాలా తీసినవాడు ఇక ఎందుకూ పనికిరాడని తేల్చినట్టుగా నన్నమాట!)

ఒక్క బీసీసీఐ మాత్రమేనా.., దేశంలోని దాదాపు అన్ని ప్రాంతీయ సంఘాలూ ఇట్టాగే ఏడుస్తున్నట్టున్నాయి. భారత క్రికెట్టు సామ్రాజ్యానికి బీసీసీఐ చక్రవర్తి, స్థానిక సంఘాలు సామంత రాజులూను. మన హైదరాబాదు సంఘం చూడండి.. రాజకీయాలకు నెలవది. శివలాల్ యాదవ్ తన కొడుక్కోసం తిరుపతి రాయుణ్ణి బలిపెట్టాడని చదివాం. ఆంధ్ర సంఘానికి ఈ మధ్య ఎన్నికలు జరిగితే బెజవాడ ఎంపీ దూరబోయాడు.. ఎలాగో బెడిసికొట్టింది. బెంగాల్లో ఓ సీపీఎమ్ నాయకుడూ ఓ పోలీసోడు పోటీ పడ్డారు అధ్యక్ష పదవి కోసం. అప్పుడు ఎవడికి మద్దతివ్వాలనే విషయమై ముఖ్యమంత్రికి చిక్కొచ్చిపడిందట! మన పేపర్ల దాకా వచ్చిందా విషయం.

ఇండియన్ క్రికెట్ లీగ్ – ఐసీయెల్ – భారత క్రికెట్లోకి మంచి మార్పులు తెస్తుందా?
తెస్తుంది. పోటీ వస్తుంది. బీసీసీఐ క్రికెట్ గురించి కూడా ఆలోచించేలా చేస్తుంది. పెద్దల అండలేని ఆటగాళ్ళ ప్రతిభా ప్రదర్శనకు వేదిక అవుతుంది. ఐసీయెల్ క్రికెట్టుకు సేవ చేసేందుకు వచ్చిందని నేననడం లేదు.. వాళ్ళకూ డబ్బు కావాలి. కానీ క్రికెట్టును పక్కనెట్టి రాజకీయాల్లో మునిగితేలరు, బీసీసీఐ లాగా.

ఐసీయెల్ లాగా మరి కొన్ని లీగులు రావాలి. అన్ని లీగుల్లోంచి ఉత్తమంగా ముందుకొచ్చేవారికి జాతీయ జట్టులో స్థానాలు కల్పించాలి. అదే బీసీసీఐకి తగిన మందు.

ఐసీయెల్ కు స్వాగతం! సుభాష్ చంద్రకు, కపిల్ దేవ్ కు శుభాకాంక్షలు.

తా.క: బీసీసీఐ వెబ్ సైటు చూస్తే, వాళ్ళకు క్రికెట్టు పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉందో మనకర్థం అవుతుంది. అసలు దాని వెబ్ అడ్రసేంటో చెప్పుకోండి చూద్దాం!

కొత్త వెస్టిండియనులు, అదే పాత ఇండియనులు

క్రికెట్టులో మనవాళ్ళు, విండీసు వాళ్ళు ఒకే రకంగా అనిపిస్తారు, నాకు. ప్రొఫెషనలిజము లేదు… అయితే ఉద్వేగ భరితంగా ఉంటారు లేదంటే నిర్వేదంగా ఆడతారు. ఉత్సాహంలో ఉంటే ఎంతటి వాణ్ణైనా కొట్టేస్తారు. (మన కామెంటేటర్ల పడికట్టు పదాల్లో దీని పేరు “తమదైన రోజున”) లేదో.. బుర్కినాఫాసో చేతిలో కూడా ఓడిపోతారు. అందులకును ఇందులకును వారు సమర్థులే! ప్రొఫెషనలిజము కొలబద్ద మీద అత్యున్నతంగా ఆస్ట్రేలియా, న్యూజీలాండు ఉంటే అట్టడుగున విండీసు, ఇండీసు ఉంటారు. ఈ ఏటి ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మనవాళ్ళు తుచ తప్పకుండా తమపద్ధతిలోనే వెళ్ళారు గానీ, విండీసు మాత్రం కాస్త పద్ధతి మార్చినట్లుగా అనిపిస్తోంది.

ఏదేమైనా నాకు ఇండీసు, విండీసే అభిమాన జట్లు!