Archive

Archive for the ‘చిరంజీవి’ Category

సాయంకాలమైంది!

November 2, 2009 7 comments

అప్పుడే సాయంకాలమైంది. సూర్యాస్తమయం చేరువైంది.  సంవత్సరం కిందట ఉజ్వలంగా ఉదయించిన ప్రజారాజ్యం సూర్యుడు, కాంగ్రెసు తుప్పల్లో కుంకబోతున్నాడు.

పాపం చిరంజీవి! హీరో కావాలనుకున్నవాడు మొన్నటి ఎన్నికల్లో జీరో అయ్యాడు. ఇప్పుడు కాంగ్రెసు పంచన చేరి, నిదానంగా వంత పాత్రలు వేసి, ఎప్పుడోకప్పుడు హీరో కాకపోతానా అని చూస్తున్నట్టున్నాడు. కాంగ్రెసుతో పెట్టుకుంటున్న ఈ పొత్తు కారణంగా ఒక్కటి మాత్రం స్పష్టం.. ఒకవేళ ఈ పొత్తే గనక 2014 ఎన్నికలలోనూ కొనసాగినా, లేక ఈలోగా ప్రజారాజ్యం కాంగ్రెసులో మునిగిపోయినా.. కాంగ్రెసు చేస్తే తప్ప ఇక అతడు హీరో కాలేడు. పాపం చిరంజీవి!

నిరుడు ఆగస్టులో బంతిలా పైకెగసింది ప్రజారాజ్యం. పార్టీ స్థాపనే దానికి ఉచ్ఛస్థితి! -ఎంత దుస్థితి! అక్కడి నుండి పతనం మొదలై గురుత్వ త్వరణంతో వేగం పుంజుకుని, ఇప్పుడు వినాశకర వేగానికి (టర్మినల్ వెలాసిటీ) చేరుకుంది. – ..పెక్కు భంగులు వివేకభ్రష్ట సంపాతముల్!

అయితే, 2012 డిసెంబరు 21 నాడు ప్రపంచం అంతమైపోద్దని చెబుతున్నారు కాబట్టి, చిరంజీవి కొంచెం తొందరపడి, పార్టీని వెంటనే కాంగ్రెసులో కలిపేసి, సోనియాను బతిమాలుకుని ముఖ్యమంత్రి అయితే మంచిది. యుగాంతంలోగా బులపాటం తీరుతుంది. లేకపోతే.., వ్రతమెలాగూ చెడింది, ఫలం కూడా దక్కకుండా పోతుంది.

———————

కానీ కాంగ్రెసు చెయ్యందుకోవడం తప్ప చిరంజీవికి వేరే మార్గం కూడా ఏమీ లేనట్టుంది. నానాటికి తీసికట్టు అయిపోతున్న పార్టీ పరిస్థితిని కాస్త బాగు చేసుకోడానికి కాంగ్రెసు ఆసరా అవసరమే ప్రస్తుతం. తన డజనున్నర శాసనసభ్యులను కాంగ్రెసు నుండి రక్షించుకున్నట్టే. ఇక వాళ్ళకు కాపలా కాయనక్కరలేదు.

పొత్తు కారణంగా గ్రేటరు ఎన్నికల్లో ప్రజారాజ్యానికి ఎంత ఉయోగముంటుందో గానీ, కాంగ్రెసుకు మాత్రం ఎంతో లాభం. గ్రేటరు ఎన్నికల్లో గెలిపించగల మొనగాడెవడో చూస్తామన్న అసమ్మతి వర్గానికి ఇప్పుడు మంచి సమాధానమే చెప్పింది. ఇప్పటికే దిక్కుతోచని స్థితిలో ఉన్న జగన్ను కట్టుగొయ్యకు కట్టేసింది. కాంగ్రెసు గొప్ప ఎత్తే వేసింది.

రోశయ్య సామాన్యుడు కాడు సుమండీ!

Advertisements

ఏం తేడా లేదు!

ఇన్నాళ్ళూ ప్రజారాజ్యాన్ని రాజ్యేతరులే విమర్శించారు. ఆ పార్టీలో ప్రత్యేకత ఏమీ లేదన్నారు. మిగతా పార్టీల కంటే కొత్తదనం, వైవిధ్యత ఏదీ లేదన్నారు. డబ్బులు తీసుకుని టిక్కెట్లిస్తున్నారనీ అన్నారు. చిరంజీవి పైకి కనబడేంత సౌమ్యుడు, అమాయకుడూ కాదన్నారు. అతడిది నటన అని అన్నారు. అది అతివినయం అనీ అన్నారు.

కానీ ఇప్పుడు.. రాజ్య పౌరులే అంటున్నారు. మన్నికైన వారని ఎన్నిక చేసి తెచ్చుకున్న వారే అంటున్నారీ మాటలు. ఇవిగాదు, వీటి తాతల్లాంటి మాటలన్నారు.

 • “అదో విషవృక్షం” అని అన్నాడు పరకాల ప్రభాకర్. ఇంతవరకూ ప్రత్యర్థి పార్టీలు కూడా అనలేదింత మాట.  టిక్కెట్టులమ్ముకున్నారనే మాట నిజమే అన్నట్టుగా కూడా మాట్లాడాడు. చిరంజీవికి ఈ సంగతులు తెలుసా అని అడిగాడో విలేకరి. తెలీదని ఒక్కరిని చెప్పమనండి అని అన్నాడు ప్రభాకర్.
 • “మిగతా పార్టీలకూ ప్రజారాజ్యానికీ తేడా లేద”ని తేల్చేసాడు ఆంజనేయరెడ్డి. 
 • సమరం కూడా దాదాపు ఇలాంటి మాటే ఏదో అన్నాడు. కార్యకర్తలకు గుర్తింపు లేదని చెప్పేసాడు. (టిక్కెట్టు రానివాళ్ళ బాధ ఇలాగే ఉంటుంది. ఏ పార్టీవాడైనా సరే, కార్యకర్తలకు గుర్తింపు లేదు అని అన్నాడంటే తనకు టిక్కెట్టు రాలేదని ఏడుస్తున్నాడన్నమాటే! పాపం కొంతమంది మాత్రం సూటిగానే చెప్పేస్తారు) చిరంజీవి సేవా సంస్థ నుండి కూడా రాజీనామా చేసాడీయన.

అల్లు అరవిందు ఏమన్నాడూ..

అరవిందుకు బాగా కోపం వచ్చినట్టే ఉంది. కోపం అతడిముఖంలో కనబడింది. మాటల్లో కనబడింది. అతడి నవ్వులోనూ కనబడింది. ప్రభాకర్ గట్టిదెబ్బే కొట్టాడు. విషవృక్షం అనేది చిన్నమాట కాదు.  అంచేతే అరవిందు విరుచుకుపడ్డాడు, పరకాల మీద. పరకాలను తిట్టడం ఒక్కటే కాదు, తన నిర్దోషిత్వాన్నీ, తన నైతికతనూ, పార్టీ పట్ల – అనగా చిరంజీవి పట్ల – తన నిబద్ధతను నిరూపించుకునే ప్రయత్నం చేసాడు. చాలా చాకచక్యంగా పరకాల తిట్టిన తిట్లన్నిటినీ చిరంజీవి మీదకే -అన్యాపదేశంగానే – మళ్ళించాడు. పరకాల చిరంజీవిని అనలేదని కాదు, అన్నాడు. కానీ చిరంజీవితో పాటు అందరినీ అన్నాడు.

అరవిందు ఇలా అన్నాడు:

చిరంజీవి మీదకు గురి పెట్టిన తూటా, ముందు నా గుండెల్లోంచి దూసుకుపోవాలి  లాంటి, సినిమా డైలాగు లాంటిదేదో చెప్పాడు. ఇంకోమాట అన్నాడు..  స్వయంగా చిరంజీవిగారు అంటే తప్ప, ఇక ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను. అనీ అన్నాడు. ఈ ముక్క మాత్రం, ఈ మధ్య తనమీద వస్తున్న ఆరోపణలన్నిటికీ కలిపి సమాధానం చెబుతున్నట్టు ఉంది.

ఈ ముక్కలు చెప్పి, రెండు ప్రయోజనాలు సాధించజూసాడు.

 1. పరకాల ఏకంగా చిరంజీవినే తిడుతున్నాడు. ఎంత ఘోరమో, ఎంత అన్యాయమో చూడండి అని చెప్పడం. చిరంజీవి తప్పు చెయ్యడు, ఆరోపణలకు అతీతుడు అనుకునే కొందరికి ఇది చెవుల్లో బడి, గుండె కలుక్కుమంటుందని అరవిందుకు తెలుసు. వాళ్ళ కోపాన్ని ప్రభాకరు మీదకు గురిపెడుతున్నాడు.
 2. ఇది చాలా ముఖ్యం.. నేను చిరంజీవి కోసం పని చేస్తున్నాను. నేను ఆయన అనుచరుణ్ణి. నేను చేసే పనులు ఆయనకూ తెలుసు. నేను చేసే పనులకు చిరంజీవి ఆశీస్సులున్నాయి అని చెప్పడం.

ఇంకా..
పరకాల నర్సాపురం (నర్సపూర్ అంట దానిపేరు!) టిక్కెట్టు ఆశించాడు, ఇస్తే ఆయనేమో గెలవలేడు, అందుకే ఇవ్వలేదు. ఆశాభంగం చెంది, ఇప్పుడు బయటికి పోతున్నాడు అని అన్నాడు.

నన్ను కూడా కోవర్టు అని అంటారు చూడండి అని పరకాల చెప్పాడు. అరవిందు అమాట అననే అన్నాడు. (ఈ కోవర్టును కలవడం కోసం అతడి ఇంటికి ఎందుకు వెళ్ళినట్టో?) 

ఇంకా కొంతమంది కోవర్టులున్నారు అని గతంలో ప్రకటించి, బయటకు వెళ్ళబోయే వాళ్ళ ముందరి కాళ్ళకు బంధాలు వెయ్యబూనింది ఆ పార్టీ. కానీ ఆ బంధాలేవీ ఆపలేకపోతున్నాయి వెళ్ళేవాళ్ళను. ఆ మధ్య అభిమాన సంఘాల నాయకులు కూడా కొంతమంది వెళ్ళిపోయారంట.

ఎంచేతో ఆంజనేయరెడ్డి గురించి మాత్రం అరవిందు మంచిగానే చెప్పాడు..
ఆంజనేయరెడ్డి అలా కాదు, ఆయన టిక్కెట్టేమీ ఆశించలేదు. ప్రత్యేకమైన ఒక పని చేసేందుకు వచ్చారు, ఆ పని పూర్తి చేసారు. ఆ సంతృప్తితో తప్పుకున్నారు అని చెప్పాడు. అదేంటి, మిగతా పార్టీలకూ ప్రరాపాకూ తేడా లేదని తెగేసి చెప్పేసాడు గదా అని విలేకరులడిగితే. “ఓ అలాగన్నారా? నాకు తెలీదులెండి” అని చెప్పాడు అరవిందు. క్యామిడీ!!

ఇంకో చిత్రమేంటంటే, పరకాల గెలవడని టిక్కెట్టు ఇవ్వలేదు అని అరవిందు అంటే, ఉపేంద్రేమో పరకాల ఆ సీటుకు తగినవాడే, కానీ సామాజిక సమీకరణాలు కుదరక ఇవ్వలేకపోయాం అని అన్నాడంట.

—————-

ప్రజారాజ్యానికీ మిగతా పార్టీలకూ తేడా ఏమీ లేదు. మిగతా పార్టీలన్నిటికీ ఉండే అవలక్షణాలు అన్నీ ఈ పార్టీకి ఉన్నాయి. అవినీతి, దొంగ మాటలు చెప్పడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. మిగతావాటికి లేనిదీ దీనికి ఉన్నదీ ఒకటుంది.. బలహీనమైన, అసమర్థ నాయకత్వం.

చిరంజీవికి విగ్రహం పుష్టి ఉందంతే! సినిమా హీరోగా తాను సంపాదించుకున్న అపారమైన అభిమానం ఒక్కటే అతడి సానుకూలత. నాయకత్వ పటిమ లేదు. ప్రజారాజ్యంపై గల అంచనాల్లో ఇప్పటికే తేడాలు కనబడుతున్నాయి. కింగు అవుతాడన్నవారు, కాస్త తగ్గి, కింగు మేకరవుతాడంటున్నారు. కింగయితే పరవాలేదు.. కింగుమేకరే గనక అయితే, ఐదేళ్ళ పాటు, తన నాయకత్వాన్ని కాపాడుకోవడం చిరంజీవి వల్ల అవుతుందని నేను అనుకోను. ఎందుకంటే, రాజకీయం అంటే సినిమా నటన అంత వీజీ కాదు. సినీ అభిమానులు నటుణ్ణి హీరో చేస్తారు,  హీరోని దేవుడు గానూ చూ(చే)స్తారు. దేవుడు దేవుడుగానే ఉండాలి, తాను అభిమానిగానే ఉండాలి అనుకుంటాడు, సగటు అభిమాని. చిరంజీవిని వదిలేసి, మరో హీరోకి అభిమానిగా మారడు. కాబట్టి హీరో ఏంచేసినా చెల్లుతుంది, అసలేం చెయ్యకపోయినా కూడా చెల్లుతుంది. కానీ రాజకీయాల్లో అలాక్కాదు.. సరుకున్నవాడే నాయకుడు అవుతాడు. నాయకత్వం చూపిస్తేనే అనుచరులు వెంట ఉంటారు. లేకపోతే మరో నాయకుడికి జై అంటారు. ఈ మధ్య ప్రరాపాను వదిలేసి, కాంగ్రెసులో చేరిపోయిన వీరాభిమాని దీనికో ఉదాహరణ. పైగా ప్రతీవాడూ నాయకుడు కావాలనుకుంటాడు.

బ్లాగుల్లోనే ఎక్కడో చదివాను.. అల్లు అరవిందు అమర్‌సింగు లాగా కనిపిస్తున్నాడేంటీ అని. భలే చక్కగా చెప్పారాయన. పనితీరులో ఇద్దరికీ దగ్గరి పోలికలున్నాయి.కానీ చిరంజీవికీ ములాయంకూ పోలికలున్నాయా?

వంశ గర్జన

November 14, 2008 33 comments

యువగర్జన అంటూ తెదేపా మంచి హడావుడే చేసింది. బహిరంగ సభలకు, రోడ్డు షోలకు జనం రావడమే బలానికి కొలబద్దైతే తమ బలాన్ని బహు చక్కగా ప్రదర్శన చేసింది. ఇతర పార్టీల్లో తమ పట్ల విశ్వాసాన్ని, తమ శక్తియుక్తుల పట్ల గౌరవాన్నీ కలిగించేలా బలనిరూపణ చేసుకుంది. అయితే, ఆ వేదిక మీద బాలకృష్ణ చెప్పిందేమిటి?

అతడి ప్రసంగం నేను కొంతే విన్నాను. ఏ ధోరణిలో అది ఉంటుందని అనుకున్నానో అలాగే ఉందది. రామారావు గురించీ, ఆయన చేసిన పనుల గురించీ చెప్పుకుంటే బాధేం లేదు. మా నాన్న, మా వంశం, లాటి వెగటు కలిగించే మాటలే ఉన్నాయా ప్రసంగంలో -అదేదో మనల్నేలడానికే వీళ్ళ వంశం ఉన్నట్టు, మనం వీళ్ళ ఏలుబడిలో పడుండే సత్రకాయలమైనట్టు! ఎవడిక్కావాలి వీళ్ళ వంశం, వంశగౌరవం? చిరాకొస్తది ఈ కబుర్లు వింటుంటే. వీటికి తోడు తన సినిమా డైలాగులు కాసిని! తన అభిమానుల కోసం చెప్పుకున్న సొంత డబ్బా ఆ ప్రసంగం! ఎటొచ్చీ తన సొంత డైలాగులు కాక, ఎవరో రాసిచ్చిన డైలాగులు చెప్పాడు కాబట్టి, ప్రసంగం ఒక పద్ధతిలో నడిచిపోయింది. అతడు కూడా ఆ ప్రసంగానికి తగు మసాలా జోడించి రక్తి కట్టించాడు.

సహజంగానే చిరంజీవితో పోలిక వస్తుంది.. డైలాగుల వరకు చిరంజీవి డవిలాగులే బాగున్నాయి, బాలకృష్ణ డవిలాగులు మరీ సినిమాటిగ్గా, (కొన్ని తన సినిమాల నుండి ఎత్తి తెచ్చినవే) స్వోత్కర్షతో కూడి, వెగటు కలిగించాయి. అయితే డైలాగు డెలివరీలో మాత్రం బాలకృష్ణ చిరంజీవి కంటే చాలా నయం! చిరంజీవి మరీ కొత్త నటుడిలాగా చెప్పాడా డైలాగులు. మరొక్క తేడా ఉంది.. బాలకృష్ణ ముక్కుసూటిగా ఉన్నట్టుగాను, మనసులో ఉన్నదే చెబుతున్నట్టుగాను అనిపిస్తాడు. చిరంజీవిలో అతివినయం కనిపిస్తుంది. అతడిది బైటికి కనబడని తత్వం. పైకి కనబడేది ఒక ముసుగుగాను, లోపల మరో మనిషి ఉన్నాడనీ అనిపిస్తుంది.

 —————————

ఆపేముందు: నిన్న హై.లో జరిగిన సభలో అద్వానీ ప్రసంగించాడు. అందులో చిరంజీవి తనను ఆశీర్వదించమని కోరాడని చెప్పుకున్నాడట. ఇప్పుడు అర్జంటుగా దాన్ని ఖండించాల్సిన అగత్యం ఏర్పడింది చిరంజీవికి. (రాజకీయాల్లో కొందరిచేత తిట్టించుకుంటేనే విలువ మరి.)

కందానికో నూలుపోగు

ఏ యుగంలోనైనా అందం నాలుగు పాదాల మీదా నడిచే పద్యం, కందం. ఈ మధ్య బ్లాగుల్లో మళ్ళీ కంద పద్యం కాంతులీనింది -ముఖ్యంగా రెండు బ్లాగుల కారణంగా. కందపద్యం ఎలా చెప్పాలో రాకేశ్వరరావు సచిత్రంగా సోదాహరణంగా వివరించారు. కందపు గ్లామరును, గ్రామరునూ వివరిస్తూ చంద్రిమలో ఓ చక్కని జాబు వచ్చింది. ఈ రెండు చోట్లా బహు చక్కని వ్యాఖ్యలూ, వాటిలో అందమైన ఆశుకందాలూ వచ్చాయి. ఓపక్క అక్కడ వ్యాఖ్యలు రాస్తూనే రానారె తన బ్లాగులో ఒక సర్వలఘు కందాన్ని రాసారు. ఈ పద్యసంరంభం చూసాక నాకూ రాద్దామని ఉత్సాహం వచ్చింది. సూదీ దారం తీసుకుని పద్యాలు కుట్టేద్దామని కూచున్నా.. ఇదిగో ఇప్పటికయ్యింది. సరే, రాసిన రెండూ పద్యాలూ నా బ్లాగులోనే పెట్టేసుకుందామని, ఇదిగో ఇలా..

మరిమరి తరచిన తదుపరి
తెరతొలగెను చిరువెలిగెను, నిలిచెను బరిలో
చిరపరిచిత తెర వెలుగునె
వరముగ మలచిన.. గడుసరి మదుపరి యతడే!

పార్టీ పెడితే చాలదు
హార్టీగా మాటలాడు టార్టే కాదోయ్!
కర్టుగ తిట్టిన గానీ
హర్టవ్వక నవ్వగలుగు హార్టుండవలెన్

పద్యాలు బాగున్నాయా.. అదే మరి కందం మహిమ!
బాలేవా! ఎంచేతబ్బా, ఇవి కందాలేనే !!

ప్రజారాజ్యం కోసం చిరంజీవి ప్రజారాజ్యం తెచ్చాడు

ఎట్టకేలకు చిరంజీవి పార్టీ వచ్చేసింది. ప్రజారాజ్యం అనే చక్కని పేరు పెట్టుకుని 2008 ఆగస్టు 26 న ఈ పార్టీ పుట్టింది. జెండాను ఆవిష్కరించిన చిరంజీవి, అది ఏయే అంశాలకు ప్రతీకగా నిలవబోతోందో కూడా చెప్పాడు. లక్షల మంది ఉత్సాహవంతులైన వీరాభిమానుల కోలాహలం మధ్య తిరుపతిలో పార్టీ పేరు ప్రకటించడమే కాకుండా స్థూలంగా పార్టీ విధానాలను కూడా వివరించాడు. మొత్తం మీద ప్రజారాజ్యం ఆవిర్భావం సందడిగా జరిగింది.

తాను భిన్నమైన పనులేమీ చెయ్యననీ, ఇతరులు చేసే పనులనే విభిన్నంగా చేస్తాన‘ని ఆగస్టు 17 న తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించినపుడు చిరంజీవి చెప్పాడు. సరిగ్గా అలానే జరిగింది. పార్టీ ఆవిర్భావ సందర్భంగా చిరంజీవి చేసిన ప్రసంగంలో ఆయన విభిన్నంగా చెప్పిందేమీ లేదు. తమది పేదల పార్టీ, యువత పార్టీ, మహిళల పార్టీ, దళితుల పార్టీ,.. అంటూ అన్ని పార్టీలవాళ్ళు చెప్పే మాటలే చెప్పాడు. విధానాల సంగతి ఎలా ఉన్నా, ప్రసంగం ఉత్తేజకరంగా ఉంటుందని, మెరుపులు మెరిపిస్తుందనీ నేను అనుకున్నాను. కానీ అంతలా లేదు.

ముఖ్య విశేషాలు:

 1. తన మొట్టమొదటి రాజకీయ ప్రసంగంలో చిరంజీవి ఏ ఒక్క నాయకుడినీ, పార్టీనీ విమర్శించలేదు. ఈ రోజుల్లో ఇది ఆశ్చర్యకరం, అభినందనీయం. అశేషంగా ఉన్న తన అభిమానులను తన శైలిలో అలరించాడు.
 2. ప్రసంగం రెండు భాగాలుగా ఉంది. తాను చెప్పినది, తాను చదివినదీ. తన జీవితం గురించి తాను చెప్పుకున్నది మొదటి భాగం. చదవడం కాక, చెప్పడం కాబట్టి కృతకంగా కాక, బాగుంది. అయితే, నేనూ నా పేదరికం, నేనూ నా వ్యవసాయం లాంటి విషయాల గురించి అంతలా ఎందుకు చెప్పుకున్నాడో అర్థం కాలేదు. ఒకపూట తిండి లేక అర్థాకలితో పడుకున్నానని చెప్పుకొచ్చాడు.
 3. తన పార్టీ విధానాలను ప్రకటించే రెండో భాగాన్ని చదివిన విధానం బావోలేదు. దాన్ని ముందే బాగా చదువుకుని ఉంటే తడబాట్లు లేకుండా సాగేది. వాక్యం మధ్యలో తాను చదివే అంశపు ప్రాశస్త్యం అర్థమై, దానికి కొంత ఆవేశాన్ని జోడించాల్సిన అవసరాన్ని గ్రహించి, ఆఫళాన గొంతులో అవేశంతెచ్చుకునే ప్రయత్నం చేసాడు. ఆ సీన్లు అంతగా పండలేదు. ప్రసంగ పాఠాన్ని ముందే బాగా చదివి జీర్ణించుకోవాల్సింది.
 4. ఏ వర్గాన్నీ విదలిపెట్టకుండా అందరినీ స్పృశిస్తూ సాగిపోయింది ప్రసంగం. ఏ పార్టీవారైనా చేసే పనే ఇది. కాకపోతే మధ్యతరగతి వారి గురించి ఓ పేరా ఎక్కువ రాయించినట్టు కనబడింది.
 5. ప్రధానమైన అంశాలపై చిరంజీవి దాటవేసాడు. తెలంగాణా గురించి, ఎస్సీ వర్గీకరణ, కాపులకు రిజర్వేషను గురించి తమ విధానాన్ని మేధావులతో చర్చించాక నిర్ణయిస్తాడట. ఇలాంటి ప్రధాన సమస్యలపై ఒక విధానం కలిగి ఉండటం ఒక రాజకీయ పార్టీకి ప్రధాన ఆవశ్యకం. కాంగ్రెసు తెదేపాలు దాటేసినట్టే ప్రజారాజ్యం తన పద్ధతిలో తానూ ఈ సమస్యలను దాటేసింది.
 6. తెలంగాణాపై కాంగ్రెసుకూ, తెదేపాకు కూడా ఇదమిత్థమైన అభిప్రాయం లేదు. కాంగ్రెసుదేమో మోసం చేసే ధోరణి. తెదేపాది సరైన-సమయంలో-సరైన-నిర్ణయం తీసుకునే దొంగ ధోరణి, గోడమీది పిల్లి వాటం. చిరంజీవిది వీటికంటే మెరుగైన ధోరణేమీ కాదు. మేధోమథనం జరిపి, ఆపై తన విధానాన్ని బయటపెడతాడట. ఎప్పుడు జరుగుతుందది? ఎన్నికలకు ముందా, అవి అయ్యాకా? తొమ్మిది నెల్లకు పైగా పార్టీ పెట్టే విషయమై చర్చ జరుగుతున్నపుడు, ఇలాంటి ప్రధాన విషయాలపై ఎందుకు చర్చ జరపలేదు? రెండు మూడు నెలలుగా కార్యకర్తల శిక్షణ, సమాజంలోని వివిధ వర్గాల సమీకరణ జరుపుతున్నపుడే ఈ మేధోమథనమేదో జరిపి, వీటిపై ఒక విధానం ఎంచేత ఏర్పాటు చేసుకోలేదు? ఒకే కారణం కనిపిస్తోంది.. ఎన్నికలలోపు వివాదాస్పద విషయాల జోలికి పోకుండా, ఎవరినీ వ్యతిరేకం చేసుకోకుండా ఎన్నికలను గడుపుకోవడం! మిగతా రెండు పార్టీల లాగానే ప్రజారాజ్యం కూడా! ఎస్సీ వర్గీకరణ సంగతి కూడా మేధోమథనం జరిగాకేనట! అలాగే, కాపులను బీసీల్లో కలిపే విషయం కూడా!
 7. ఇవన్నీ ఎలా ఉన్నా, అవినీతి మీద విస్పష్టమైన విధాన ప్రకటన ఉంటుందని ఆశించాను. అయితే అలాంటిదేమీ చెయ్యలేదు.
 8. మద్య నియంత్రణ అట! నిషేధం గురించి మాట్టాడలేదు, నియంత్రిస్తారట. ఎలాగో చెప్పలేదు. బెల్టుషాపులను తీసెయ్యడమా? నియంత్రించడమంటే ఏంటో చెప్పలేదు.

చిరంజీవి ప్రసంగంపై నేను చూసిన ఒక స్పందన గురించి రాస్తాను. ఆగస్టు 27న మాజీ అయ్యేయెస్ అధికారి డీసీ రోశయ్య చేత తొమ్మిదో టీవీ వాళ్ళు కొన్ని మాటలు చెప్పించారు.. దళిత బలహీన వర్గాల గురించి ఎక్కువగా మాట్లాడలేదు. గుండెలో లేంది పెదవి మీద ఎందుకుంటుందిలే అని విమర్శించాడాయన. ఈ రోశయ్యే ఒకప్పుడు చిరంజీవిని ఆకాశానికి ఎత్తేసిన వాడు. అందుకు పశ్చాత్తాపం చేసుకుంటానంటూ ఆవేశపడిపోతున్నాడు. ఈ రోశయ్యే – పదవీ విరమణ చేసేందుకు కొద్దిరోజుల ముందు వందల కోట్ల విలువ చేసే కాందిశీకుల భూమిని అప్పనంగా కొందరికి అప్పజెప్పాడు. ఆ భూపందేరంలో బెంగళూరు బుల్లినేతకు అనగా భావినేతకు లాభం చేకూరిందని కథనం!

చిరంజీవి ప్రసంగం తన అభిమానులను ఉద్దేశించి మాత్రమే చేసినట్టు అనిపించింది. గతంలో చిరంజీవి ఏం మాట్లాడినా చెల్లేది. ఎందుకంటే వాటికి శ్రోతలు వీరాభిమానులే కాబట్టి! ఇప్పుడలా కాదు. ఒక రాజకీయ నాయకుడిగా ఆయన చెప్పేమాటలు తన అభిమానులే కాక మొత్తం ప్రజలందరూ వింటారు. ఈ మేధో మథనాల కోసం, తమ విధివిధానాల విపులీకరణ కోసం, చిరంజీవి చెయ్యబోయే ప్రసంగాల కోసం చూద్దాం.

అన్నయ్యల పోటీ

August 18, 2008 8 comments

రాజకీయాలంటే అనేకానేక నిర్వచనాలతో పాటు భావోద్వేగాల ఆట అనే ఒక వ్యుత్పత్తి కూడా ఉండుంటుంది. ఏదో రకంగా ప్రజల సెంటిమెంటు మీద ఆటాడాలి, వోట్లను వేటాడాలి. (ఆ పైన ప్రజలను చెండాడాలి). అందుకోసం అనేకానేక పద్ధతులను మనవాళ్ళు కనిపెట్టారు. అన్నయ్యను మించిన సెంటిమెంటలు వస్తువు మరోటి లేదని మన రాజకీయులు నమ్మడమే కాదు నిరూపించారు కూడాను. అఖిలాంధ్ర ఆడపడుచులకు అన్నను అంటూ ఎన్టీవోడు వచ్చినపుడు కాంగ్రెసోళ్ళు ‘ఏడిసాడు, ఈ నాటకాలు మన ముందా’ అనుకున్నారు. ‘ఈడు రామారావు కాదు, డ్రామారావు’ అన్నారు. ఆనక జరిగిన ఎన్నికల్లో ఏం జరిగిందో తెలిసి, కాంగ్రెసు తేరుకునేలోపు రామారావు ముఖ్యమంత్రి అయిపోయాడు.

అన్న మహాప్రస్థానం తరవాత, మరొక అన్న రాలేదు. ఇప్పుడు అన్నయ్యగా చిరంజీవి వస్తున్నాడు. చిరంజీవి అసలు పేరు వేరే ఏదో ఉంది. ఆ పేరుతో ఎవరూ పిలవరు, తానే చిరంజీవిగా పేరు మార్చుకున్నాడు కాబట్టి. చిరంజీవి అనే కాకుండా చిరు అనీ, సినిమా నటుడు కాబట్టి మెగాస్టారు అనీ పిలుస్తున్నారు. అదే కాకుండా, ఆయన వీరాభిమానులు అన్నయ్య అని పిలుస్తూంటారు. రాజకీయాల్లో దిగాక, బహుశా వోటున్నవారందరికీ ఈ పెట్టుడు బంధుత్వాన్ని విస్తరించే ఆలోచన ఉండొచ్చు. ఎన్‌టీవీ లాంటి కొన్ని వార్తా ఛానెళ్ళు కూడా అన్నయ్య అంటూ ఉంటాయి.

ఈ పేర్లన్నిటిలో ఏది పనికొచ్చినా లేకున్నా.. అన్నయ్య అనేది మాత్రం రాజకీయాల్లో బాగా పనికొస్తుంది. అయితే ఈ పెట్టుడు బంధుత్వం మీద పోటీ నెలకొందేమోనని అనిపిస్తోంది.

పాపం, కాంగ్రెసోళ్ళకు సొంత బంధువులంటే ఉన్న సెంటిమెంటు ఈ పెట్టుడు బంధుత్వాలంటే ఉండదని అని నేను అనుకుంటూ ఉండేవాడిని. అయితే మన ముఖ్యమంత్రి వేరు -పురుషులందు కాపురుషులు, ఉత్తపురుషులు, పుణ్యపురుషులు వేరయా అన్నట్టు! ఆయనకు పెట్టుడు బంధుత్వాల పట్ల కూడా సెంటిమెంటున్నట్టు తోస్తోంది. అన్నయ్య హోదాలోని మహత్తును గ్రహించినవాడు కాబట్టే, ఆయన చెల్లెమ్మ సబిత నియోజకవర్గానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చాడు. ఏ కొత్త కార్యక్రమమైనా చేవెళ్ళ నుండి మొదలుపెట్టాల్సిందేననే సంప్రదాయాన్ని ఆచరిస్తూ తానెంత సెంటిమెంటలు వ్యక్తినో ప్రజలకు చెప్పకనే చెప్పాడు. అయితే, ఎంచేతోగానీ తెలుగాడపడుచులు ఆయన్ను అన్నయ్యగా భావించినట్టు కనబడలేదు. మీసాల సైజు కాస్త తగ్గించుకుని, నవ్వును కాస్త కత్తిరించుకుని ఉంటే సత్ఫలితాలుండేవేమోనని నా అనుమానం. ఏదో ఒకటి చేసి, తెలుగాడపడుచులచేత అన్నయ్యా అని నోరారా పిలిపించుకోవాల్సిందే అని రాజశేఖరుడు అనుకున్నట్టుంది.

శనివారం నాటి పత్రికలు చూసినవాళ్ళు ప్రభుత్వం – అనగా ముఖ్యమంత్రి – ఇచ్చిన ఖరీదైన ప్రకటనను గమనించే ఉంటారు. ముఖ్యమంత్రినైనా మీకు అన్నయ్యనే అంటూ రాజశేఖరరెడ్డి ఈ ప్రకటనల్లో ఆడపడుచులందరికీ గుర్తు చేసాడు. చిరంజీవిని అన్నయ్య అని ఎక్కడ అనేస్తారోనని సెంటిమెంటుతో ముందస్తు బంధాలు వేసేసాడు. చాలా ఉద్వేగంగా “అమ్మా, అన్నయ్యను నేనున్నా. మీకు ఏ లోటూ రానివ్వను.” అన్నాడు. ఇంకా “మీ సోదరుడిగా జీవితాంతం తరిస్తానని మాటిస్తున్నా. రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా మీకు అన్నయ్యనేనని మరోసారి స్పష్టం చేస్తున్నా” అని మరోసారి గుర్తు చేసాడు. మరి ఆడపడుచులు ఈ బంధాలకు కట్టుబడతారో లేక ఈయన్ని పెద్దన్నయ్య ఆయన్ని చిన్నన్నయ్య అని అనుకుంటారో చూడాలి.

అయితే ఈనాడులో ఒక చమక్కు మెరిసింది. సుబ్బరంగా డబ్బుల్దీసుకోని, ప్రకటన అచ్చేసి, అదే పేజీలో కింద, ఇదీ సంగతంటూ ఓ కార్టూనేసాడు. ఆ కార్టూనులో ఉన్నది రాజశేఖరరెడ్డి కాదులెండి, పదవిలో ఉన్న ఓ రాజకీయుడు, అంతే! (సూరీడు లేడు కాబట్టి) అయితే ఆ రెంటికీ లింకు కలిపి చూస్తే సర్దాగా అనిపించింది, అంతే!

టీవీ తొమ్మిది వాడేమైనా తక్కువ తిన్నాడా? రజనీకాంతున్నాడు కదా (యాక్టరు కాదు యాంకరు).. మొన్నోరోజు ఓ ఇద్దరిని పిలిచి అన్న గొప్పా, అన్నయ్య గొప్పా అని చర్చ పెట్టాడు. (అన్నంటే ఎన్టీయారు, అన్నయ్యంటే చిరంజీవి — రాజశేఖరరెడ్డి అప్పటికింకా పోటీలో లేడు) ఎట్టైనా గానీ, అన్నయ్య అన్నకు సాటిగాదు అని వాళ్లచేత చెప్పించాలని నానా ప్రయాస పడ్డాడు. ‘చెప్పండి… అన్నయ్య అన్నంతటి డైనమిక్కు కాదుగదా‘ అని అడుగుతాడు. ‘అప్పుడే ఎలా చెబుతాం, అన్నయ్య ఇంకా రాజకీయాల్లో దిగనే లేదు కదా‘ అంటూ ఇలాంటిదేదో చెప్పి వాళ్ళిద్దరూ తప్పించుకుంటారు. ‘నిఝెం చెప్పండి.. అన్నకున్నంతటి ఊపు అన్నయ్యకు లేదు కదా‘ అని మళ్ళీ అడుగుతాడు. వాళ్ళూ తక్కువ వాళ్ళేం కాదు,  ఏదో అర్థం పర్థం లేని లాజిక్కేదో లాగి, తప్పించుకుంటారు. ఇలా ఓ అరగంటో ఏమో ప్రయత్నం చేసి ఇహ వాళ్లచేత అవుననిపించలేక ఆ కార్యక్రమం ముగించాడు. ఆ అతిథులిద్దరిలో ఒకరు లక్ష్మీ పార్వతి, మరొకరు రామ్మోహన నాయుడు. ఈయనెవరో నాకు తెలీలేదు.

తెలుగువారి అన్నయ్య ఎవరో మరి!
——————————-

ఈ పేజీలోని బొమ్మలను ఈనాడు వెబ్‌సైటు నుండి తీసుకున్నాను. కేవలం సూచనామాత్రంగానే వాడుకున్నాను, పైగా వారి సైటుకు లింకు ఇచ్చాను కాబట్టి అనుమతి అవసరం లేదని అనుకున్నాను. వారికి ఇబ్బంది కలిగితే తక్షణం తీసేస్తాను.

చిరంజీవి చెప్పిందేమీ లేదు, అంతా బహిరంగ సభలోనే నట!

చిరంజీవి పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసాడు. ఏవో చాలా చెబుతాడనుకున్నా; పార్టీ గురించి, మౌలిక విధానాల గురించీ. అవేమీ చెప్పలేదు. కనీసం పార్టీ పేరు కూడా చెప్పలేదు. అన్నీ 26 న జరగబోయే బహిరంగ సభలోనే చెబుతాడట. ఈ సమావేశం ద్వారా ఏం సాధించదలచాడో తెలీలేదు. బహూశా ఈ రోజేదో మంచి రోజు లాంటిదేమైనా ఉండుంటుంది.. అందుకే ఈ సమావేశం పెట్టాడేమో!

తన సమావేశ ప్రసంగానికి బాగానే తయారై వచ్చాడు. బానే చెప్పాడు. విలేకరుల ప్రశ్నలు కూడా చాలావరకు అనుకున్నవే వచ్చాయి. వాటికి కూడా తయారై వచ్చాడు. మొదట్లో కొద్దిగా నెర్వస్‌గా కనబడ్డాడు గానీ, తరవాత బానే నడిపించాడు. అన్నీ తనకనుకూలమైన ప్రశ్నలు, తాననుకున్న ప్రశ్నలే. ఉదాహరణకు ‘రాజకీయాలు మీకేం తెలుసని వస్తున్నారు?‘ అని ఎవరో అడిగితే, దానికి ‘నాకు రక్తంలో ఎన్ని గ్రూపులుంటాయో తెలీదు. సమయానికి రక్తం అందిస్తే ప్రాణాలు నిలుస్తాయని మాత్రం తెలుసు. అలాగే…’ అంటూ చక్కగా చెప్పాడు.

ఎక్కడో ఒకచోట ఒక ప్రశ్న ఎదురైంది. అది విని కాస్త కోపగించుకున్నట్టు కనబడింది. ఎటొచ్చీ సమావేశమంతా గందరగోళంగా ఉండడంతో ఆ ప్రశ్నే కాదు చాలా ప్రశ్నలు వినబడలేదు. చిరంజీవే సమాధానం చెప్పేముందు ఫలానా వాళ్ళు ఫలానా ప్రశ్న అడిగారు, దానికి నా సమాధానం ఇది అంటూ చెప్పాడు.

డబ్బులెక్కడినుండి వస్తాయి, రాజకీయాలల్లో మీకు స్ఫూర్తి ఎవరు, లాంటి కొన్ని ప్రశ్నలకు “ప్రజలే” అంటూ సమాధానం చెప్పాడు. ఇలాటి గ్యాలరీ సమాధానాలు చాలానే ఉన్నాయి. బంధువులు రాజకీయాల్లోకి రావచ్చా అనే ప్రశ్నకు ‘సత్తా, ఆసక్తి, శక్తి ఉంటే రావచ్చు, అర్హత ఉంటే పదవులూ అలంకరించవచ్చు’ అని అన్నాడు. ఇది మాత్రం గుర్తుంచుకోదగ్గ ప్రశ్న, సమాధానం అనిపించింది.

ప్రజాసమస్యలపై తన అవగాహన గురించి ప్రశ్న వచ్చింది. దానికి, ‘సమస్యల గురించి చెప్పేందుకు మీరున్నారు గదా’ అని అన్నాడు. చాలా హాస్యాస్పదమైన సమాధానం అది. సమస్యలపైన అవగాహన లేకుండా రాజకీయాల్లోకి దిగుతున్నాడా ఏంటి అనిపిస్తోంది. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలేమిటి అనేది విలేకరులు చెబితేనే తెలుసుకుంటాడా!!

ఇక, ఒకటి రెండు రొడ్డకొట్టుడు సమాధానాలు..
తెలంగాణ వంటి వివిధ సమస్యలపై మీ విధానాలు ఏమిటి అని అడిగినపుడు, అందరితోటీ చర్చింది, తగు సమయంలో, అందరికీ ఆమోదయోగ్యంగా, ప్రజాభిప్రాయాలను పరిగణన లోకి తీసుకుని, ఇలాంటి సున్నిత సమస్యలపై నిర్ణయాలు తీసుకుంటాం అని చెప్పుకుపోయాడు. ప్రస్తుతానికైతే ‘విధానం లేకపోవడమే ఆయన విధానం’ లాగా అనిపించింది.

అవినీతి రహితమైన పార్టీ అంటున్నారు కదా.. ఇతర పార్టీల నుండి అవినీతి చరితులను ఎందుకు రానిస్తున్నారు అనే ప్రశ్నకు, ‘తమ తమ పార్టీల్లో తామనుకున్న విధంగా కార్యక్రమాలు జరగడం లేదని భావించినపుడు, మా విధానాలు నచ్చితే మావద్దకు రావచ్చు’ అని అన్నాడు. ‘ఇతర పార్టీల్లో కూడా నీతిమంతులు ఉటారు గదా’ అనీ అన్నాడు.

అందరితోటీ మంచిగా ఉంటాను అంటూ తను ఎప్పుడూ చెప్పుకుంటూండే ధోరణిలోనే ఇప్పుడూ మాట్టాడాడు. విలేకరులతో స్నేహం చేసుకునే ధోరణిలో వ్యవహరించాడు. మాటలూ అలాగే చెప్పాడు, శరీర భావాలూ అలాగే ఉన్నాయి. రాజకీయాల్లో మీకు ప్రత్యర్థులెవరు అని అడిగితే నాకు శత్రువులు, ప్రత్యర్థులు లేరు. నాకు శత్రువులల్లా సమస్యలే, పేదరికమే అంటూ చెప్పాడు. గ్యాలరీ సమాధానాల్లో ఇదొకటి.

మొత్తం మీద ఈ సమావేశం ద్వారా చిరంజీవి అసలు విషయం గురించి చెప్పింది తక్కువ, చెప్పనిది ఎక్కువ అనిపించింది. తాను రాజకీయాల్లోకి వస్తున్నాననే ఒక్క మాట మాత్రం చెప్పాడు. రాజకీయాల్లోకి కొత్తదనం ఏదైనా తేదలచుకున్నాడో లేదో గానీ, సమావేశ ప్రసంగంలోగానీ, విలేకరుల ప్రశ్నలకిచ్చిన సమాధానాల్లోగానీ కొత్తదనమేమీ లేదు.