Archive

Archive for the ‘చెతురు’ Category

ఒక్కడే మహానుభావుడు..

మహానటుడు ఎస్వీరంగారావు గురించి బాపు రమణలు ఒక స్కెచ్చి రాసారు ఒకప్పుడు. రంగారావు మనస్తత్వాన్ని, అభిరుచులను, అలవాట్లను, నటన తీరునూ విశ్లేషిస్తూ అనేక రంగారావులను ఆవిష్కరిస్తారు -కంగారం’గారావు, ’చతురం’గారావు,.. -ఇలాగ.

ఆ స్కెచ్చిని సిగ్గులేకుండా అనుకరించే ఇంకో స్కెచ్చి ఇది. అయితే తాము ఎవరి గురించి రాస్తున్నారో బాపురమణలు హెడ్డింగు పెట్టి మరీ చెప్పేసారు. నేను మాత్రం ఎవరి గురించి రాస్తున్నానో చెప్పడం లేదు. అది అత్యంత రహస్యం. సుమన్ సినిమాలో విలనెవడో హీరోయెవడో కనుక్కోవచ్చేమోగానీ, ఈ స్కెచ్చెవరిదో కనుక్కోడం మాత్రం దేవుడికే కాదు, సాక్షాత్తూ ఆ సుమనుకైనా సాధ్యం కాదని నా నమ్మకం. ఇక చదవండి..

 • మంత్రివర్గ విస్తరణ మేడమ్మ ఇష్టమంటూ బాధ్యతను అటేపు తోసేసేటపుడు త్రోశయ్య
 • ’జగనుడి విమర్శలపై ఒక్కరూ నోరు తెరవరే? నాకేనా, మీకు లేదా బాధ్యత?’ అని మంత్రులను అనేటపుడు ఆక్రోశయ్య
 • ’నేనేమైనా ఖాళీగా ఉన్నానా? మంత్రివర్గ సమావేశం నుండి ఇప్పుడే గదా బైటికి వస్తున్నాను.. రాష్ట్రంలో తుపాను వచ్చిందని, కేసీయారు నిరాహారదీక్షకు కూచ్చున్నాడనీ, కర్నూలు మునిగిపోయిందనీ.. మీటింగుల్లో ఉన్నవాడికి ఎలా తెలుస్తుందయా? అసలేమీ తెలియనిదాని గురించి వ్యాఖ్యానించమంటావేంటి? మాట్టాడేదానికి అర్థముండక్కర్లా?’ అంటూ విలేఖరిపై బక్కకోపం చూపించేటపుడు ఉక్రోశయ్య
 • సంక్షేమ పథకాలకు నిధులను అడ్డంగా, నిలువుగా, ఐమూలగా కోసిపారేసేవేళ ’కట్ కరో’శయ్య, ’మరోమారు మారో’శయ్య
 • ’ఏమయ్యా అరుణ్ కుమారూ, నువ్వేం పెద్దమనిషివయ్యా?’ అంటూ ఉగ్రమూర్తి ఐనపుడు ఉగ్రోశయ్య
 • పరిపాలన గురించి గవినీరు దొర ఇంకో కొత్త కామెంటు విడుదల చేసినపుడు మూగ’రో’శయ్య
 • మేడమ్మ మంత్రివర్గ విస్తరణను మరోసారి వాయిదా వేసినపుడు ఢిల్లీ నుంచి తిరిగొస్తూ ’ఈసురో’శయ్య
 • బాబును ఎగతాళి చేస్తూ ఎడాపెడా బ్యాటింగు చేసేవేళ సిక్సరోశయ్య
 • నాగం జనార్దనుడి చెయ్యి తీసేస్తానని అనుచుండ, ఆతడు రోశయుండ!
 • తప్పనిసరై హెలికాప్టరు ఎక్కాల్సినవేళ ’డరో’శయ్య
 • రెణ్ణెల్లకొకటి చొప్పున ఏదో ఒక సమస్య వచ్చిపడి, జగనుడికడ్డంపడి, తాను తెరపినపడి, మనసులోనే ఆనందపడి.. హుషారోశయ్య
 • ఆయా సందర్భాల్లో ఆయా విధాలుగా కాక, ఇంకేయే విధాలుగా ఉన్నా.., ఆయన ’అన్’రోశయ్య, ’మరో’శయ్య

పోతే, బాపురమణలను ఇలా ఎందుకు అనుకరించావని అడిగితే.. నిజాయితీగా ఓ మాట చెప్పుకోవాలి. అనుకరిద్దామని మొదలెట్టలేదు, ఓ మూణ్ణాలుగు  రాసాక, అది గుర్తొచ్చింది. నాకే గుర్తుకు రాగా లేంది, మీకు మొదటిది చదవగానే గుర్తొచ్చేస్తదని నాకు తెలుసు. అంచేత కాపీ కొట్టేసానని మీరు అనకముందే నేనే అనేసుకుంటన్నానన్నమాట.
————–
అన్నట్టు, భారతీయ అమెరికనులు చేసిన యజ్ఞం వివరాలు చదివారా?

Advertisements

ది ఫౌంటెన్ హెడ్ – ఎ కొయ్యగుర్రం రైడ్!

January 14, 2010 24 comments

ఆమధ్య, అదేదో ఇంగ్లీషు పుస్తకాలమ్మే కొట్టుకెళ్ళాం. అక్కడ తెలుగు పుస్తకాలు పెద్దగా దొరకవ్. దాని పేరు క్రాస్‌వర్డు అనుకుంటా.  పిల్లలు వెళ్దామన్నారు గదాని వెళ్ళాం. అక్కడ  అయన్ ర్యాండ్  (ఐన్ ర్యాండ్?) రాసిన పుస్తకాలు చూస్తున్నా. అయన్ ర్యాండ్ అని చనువుగా పేరు రాసాను గదా అని నేను ఆవిడ రాసిన పుస్తకాలన్నీ చదివేసి ఉంటానని అనుకునేరు.  ఒక్కటి కూడా చదవలేదు. కానీ నాకావిడ పేరు బాగా తెలుసు -యండమూరి  మనందరికీ ఆవిణ్ణి బాగా పరిచయం చేసాడు గదా! ఆయన రాసిన  కథ ఒకదానిలో  ఒక పాత్ర మరో పాత్రతో అంటుంది.. ‘అయాన్ రాండా.. ఆడి కథలు నేను చాలానే చదివాను, నాకు భలే నచ్చుతాయవి’ అని అంటాడు. అవతలోడు పెదాలు కాదుగదా, కనీసం ఒంట్లోని ఒక్క అణువు కూడా కదిలించకుండా ‘అయన్ రాండంటే ఆడు కాదు, ఆవిడ ‘ అని అంటాడు. అలా నాకు అయన్ ర్యాండు పరిచయం!

ర్యాండు గారి పుస్తకాలు చూడాలన్న కుతూహలం కలగడానికి ఇంకో కారణం కూడా ఉంది. జాలజనుల ప్రొఫైళ్ళు చూడండి.. ఒక వంద ప్రొఫైళ్ళు చూస్తే ఓ ఇరవై ముప్పై దాకా అభిమాన పుస్తకం స్థానంలో ది ఫౌంటెన్ హెడ్ గానీ, అట్లాస్ ష్రగ్‌డ్‌గానీ ఉంటది. జాలజనులంటే.. తెలుగు జాలజనుల సంగతే నేఁజెబుతున్నది, ఇంగ్లీషోళ్ళు కాదు! ‘ఏంటి, త్రివేణీ వక్కపొడికి ఇంత డిమాండా’ అనే స్థాయిలో నేను ఆశ్చర్యపడిపోతూ ఉండేవాణ్ణి. ఈ పుస్తకం పేరును నా ప్రొఫైల్లో కూడా పెట్టుకుంటే, కుసింత తూకంగా ఉంటది గదా, సమకాలికుల్తో సమానంగా ఉంటాం గదా అని ఆశపడేవాణ్ణి.

‘ఓహో, అయితే ఈడసలు ఇంగ్లీషు పుస్తకాలేమీ చదవలేదన్నమాట ‘ అని గబుక్కున తీసిపారెయ్యకండి. ఎప్పుడో పాతికేళ్ళ కిందటే ఓ రెండు పుస్తకాలను – సిడ్నీ షెల్డన్ రాసిన బ్లడ్‌లైన్, ఎ స్ట్రేంజర్ ఇన్ ది మిర్రర్ (లేక ఎ మిర్రర్ ఇన్ ది స్ట్రేంజరా?)  – జయప్రదంగా చదివేసాను. ఆ తరవాత ఎక్కడ ఇంగ్లీషు పుస్తకాల చర్చ వచ్చినా, ఈ రెండు పేర్లనూ విరివిగా వాడేవాణ్ణి. సిడ్నీ షెల్డన్ ఏదో మావాడే అన్నట్టు మాట్టాడేవాణ్ణి. అయితే మన మైనంపాటి రామ్మోహనరావులు, సూర్యదేవర భాస్కరులు, మల్లాది వీరేంద్రనాథులు, యండమూరి వెంకట కృష్ణమూర్తులూ ఆయన్ని తమవాడిగా చేసేసుకుని ఆయన పుస్తకాలను బాగానే వాడేసారంట. మా సిడ్నీ షెల్డన్ రాసిన ఆ రెండు పుస్తకాలనూ నా ప్రొఫైల్లో పెట్టుకోవచ్చు. అయితే, పాతికేళ్ళ కిందటెప్పుడో చదివినవేమో.., కథ కూడా  కొద్దికొద్దిగానే  గుర్తుంది, అదీ ఒక పుస్తకంలోదే! ఒకవేళ ఆ పుస్తకాలు నచ్చినవాడెవడైనా బ్లాగులోకొచ్చి, అందులో నీకు ఏ పాత్ర నచ్చింది? ఫలానా విలియమ్స్ అలా చెయ్యడంపై నీ అభిప్రాయమేంటి? అంటూ ప్రశ్నలేసాడనుకోండి.. అసలుకే మోసం వస్తది. అంచేత ఆ పని పెట్టుకోలేదు.

సరే, ఆ కొట్లో ర్యాండు గారి పుస్తకాలు చూసాక, కొనెయ్యాల్సిందే, కొని చదివెయ్యాల్సిందే, చదివి నా ప్రొఫైల్లో కూడా పెట్టేసుకోవాల్సిందే అని నిశ్చయించుకున్నాను. అయితే, మమ్మాయి ‘ఎందుకైనా మంచిది నానా, ఒక్కటి కొనుక్కో, అది చదివాక రెండోది కొన్నుక్కుందూగాన్లే’  అని చెప్పింది. అదీ నిజమేలే అని బాలవాక్కును మన్నించి, ఫౌంటెన్ హెడ్డొక్కటే కొన్నాను.

ఇంగ్లీషు పుస్తకాలు అంతంత లావుగా ఎందుకుంటాయో అర్థం కాదు. పైగా, వాటి పొడవు వెడల్పులు ఆ లావుకు సరిపడా సరైన నిష్పత్తిలో ఉండవు. మనిషికి ఏనుగు చెవులు తగిలించినట్టో.. ఎలాగో ఉంటై. ఫౌంటెన్ హెడ్డూ అంతే!  (మన “కోతికొమ్మచ్చి” చూడండి, ఎంత ముచ్చటగా ఉంటదో!) అంత లావు పుస్తకాన్ని కూడా చదివెయ్యాల్సిందే అని కృతనిశ్చయంతో మొదలెట్టాను.

అసలు ఫిక్షనంటే నాకు గభాలున ఎక్కదు. దానికి తోడు ఇంగ్లీషు! ఇక చెప్పేదేముంది. ఇంగ్లీషు నవల్లు మామూలుగా ఒకసారి చదివితే గబుక్కున అర్థం కావు. అర్థం కాలేదుగదా అని ముందుకు పోకుండా ఉండలేం గదా. పేజీ చదివేసి పక్క పేజీకి పోగానే పాత పేజీకీ దీనికీ లంకె తెగుతుంది. అంచేత మళ్ళీ వెనక పేజీకి పోయి ఓసారి నెమరు వేసుకొస్తూ ఉంటాను. ఒక్కోసారి ఇంకా వెనక పేజీలక్కూడా పోవాల్సి వచ్చేది. ఉదాహరణకు రోర్కు క్వారీ పనిలో ఎందుకు చేరాడో గుర్తుకు కావాలంటే మళ్ళీ ఓ నాలుగైదు పేజీలు వెనక్కి పోవాల్సొచ్చేది (రోర్కంటే ఎవరో తెలీనివాళ్ళు తెలుగు బ్లాగరుల్లో ఉన్నారని  నేననుకోను). దానికితోడు, కొన్ని పాత్రలు ఒక్కోసారి యాభై అరవై పేజీల దాకా అసలు కనబడేవే కావు. హఠాత్తుగా టూహే అనో పోహే అనో కనబడితే ఈడెవడ్రా బాబూ అనుకోని మళ్ళీ ఎనక్కెక్కడికో పోయి, ఆ శాల్తీ ఆచూకీ కనుక్కుని తిరిగి రావాల్సొచ్చేది.

పైగా ఎన్ని పేజీలు చదివేసాను అనే ఉత్సుకతొకటి.. పేజీ చదవడానికి ముందొకసారి, చదవగానే ఇంకోసారీ పేజీనంబరును చూస్తూంటాను. స్పీడుగా పేజీలు తరక్కపోయేసరికి (అసలు పేజీలు తిరిగితేగా తరగడానికి) తిక్క వచ్చేసేది. ఒక్కోసారి పేజీలు తరక్క పోగా, పేజీ నంబర్లు తగ్గేవి. ప్రస్తుతం నూటనాలుగో పేజీలో ఉన్నాననుకోండి, నిన్న నూట పదకొండో పేజీలో ఉండేవాణ్ణన్నమాట! అదిచూసి, నీరసమొచ్చేది. ఇలా రెండు పేజీలు ముందుకీ, మూడు పేజీలు ఎనక్కీ పోతూ ఉండటంతో, రోజులు వారాలై, వారాలు నెలలైపోయాయిగానీ పుస్తకమింకా పూర్తి కాలేదు. చిన్నప్పుడు చిక్కులెక్క ఒకటి చెప్పేవాళ్ళు.. ఒక కోతి ఓ 30 అడుగుల బావిలో పడిపోయింది.  బావి వరలు పట్టుకుని పైకి ఎక్కాలని ప్రయత్నిస్తోందిగానీ, అవి పాచి పట్టి ఉండటం చేత కాళ్ళు జారిపోతున్నాయి. కష్టపడి రోజుకు ఓ మూడడుగులు ఎక్కితే, కష్టపడకుండా రెండడుగులు కిందకి జారుతూ ఉండేది. ఈ లెక్కన అది ఎన్ని రోజులకు బైట పడుతుంది? అనేది ప్రశ్న. కోతి ఇరవయ్యెనిమిదో రోజునో ఎప్పుడో బైటపడుద్ది గానీ..,  నాకీ పుస్తకం అసలు ఏనాటికైనా పూర్తవుద్దో లేదో తెలీడంలా. కొయ్యగుర్రమ్మీద స్వారీ చేస్తున్నట్టైపోయింది నా పని. (మాలతిగారి తూలిక నుంచి కాపీ కొట్టేసానీ పోలికను). ఈ పుస్తకం చదువుతూ మధ్యలో అప్పుడప్పుడూ ఏ శ్రీరమణ పేరడీలో, మిథునమో, అమరావతి కథలో చదూతూంటే, మాంఛి ఎండన పడి వచ్చాక, చల్లటి కుండలోనీళ్ళు తాగినట్టుండేది. 

పుస్తకం కొని ఏడాదిన్నర పైనే అయింది. కొయ్యగుర్రపుస్వారీ ఆపేసి కూడా ఇప్పటికే ఏడెనిమిది నెల్లైపోయింది. ఈలోగా ఎన్నికలు, రాశేరె చచ్చిపోడం, వాళ్ళబ్బాయి ముఖ్యమంత్రి కాకపోడం, వరదలు, తెలంగాణ ఉద్యమం.. వీటన్నిటితోటీ నేను బాగా బిజీ అయిపోయాను. 😉  ముఖ్యమంత్రి రోశయ్యకంటే కూడా బిజీ (రాష్ట్రంలో సగం మంది రోశయ్య కంటే బిజీయే ననుకోండి). పుస్తకాన్ని మళ్ళీ మొదట్నుంచీ మొదలెట్టాల్సొచ్చేట్టుంది. ఈసారి మాత్రం “ఆరంభింపరు నీచమానవులు..” అనే పద్యాన్ని మననం చేసుకుని మరీ మొదలెడతాను.

ఏంటో.. ‘కోతికొమ్మచ్చి’ చదివేసినంత చులాగ్గా ఇంగ్లీషు పుస్తకాలు కూడా ఎప్పటికి చదువగలనో!