Archive

Archive for the ‘జాలం’ Category

తెలుగులో వెతకటం అంత వీజీ కాదు గురూ!

(ఈ వ్యాసంలో కొన్ని పదాల పక్కన బ్రాకెట్లలో అంకెలు చూపించాను. అవి – ఆగస్టు 2 రాత్రి ఆయాపదాల కోసం గూగిలించినపుడు వచ్చిన ఫలితాల సంఖ్య. మళ్ళీ వెతికితే ఈ ఫలితాలు కొద్దిగా అటూఇటూ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ రాసినదంతా గూగుల్లో వెతకడాన్ని దృష్టిలో పెట్టుకుని రాసినదే. గూగిలించడం అంటే google.com లో వెతకడం.) 

—————————–

జాలంలో ఏదైనా సమాచారం కోసం వెతకాలంటే సెర్చింజనే గతి. సెర్చింజనుకు మారోపేరు గూగులైపోయింది కాబట్టి, గూగులే గతి అన్నమాట. ఆ గూగులుకేమో తెలుగు రాదు. పదం తప్పుగా ఇచ్చినా దానికి తెలీదు. పైగా తెలుగు పదాలను రకరకాలుగా రాస్తూంటాం. (రాస్తూ ఉంటాం, రాస్తూ ఉంటాము, రాస్తూంటాం, రాస్తుంటాం, రాస్తుంటాము, ఇలా రకరకాలు, కొన్ని ఒప్పులు, కొన్ని తప్పులూను. ఇది కాకుండా ’వ్రా’సే గోల ఒకటుంది. దాని జోలికిపోతే బుర్ర ఖరాబౌద్ది కాబట్టి నే బోను). ఇహ, పదబంధాలను రాసే విధానాలు కొల్లలు. ఇతర భాషల నుంచి తెచ్చుకున్న పదాలూ అంతే. ఫలానాది రైటనీ మరో ఫలానాది తప్పనీ అంటానికి లేదు. ఇన్ని బాధలకు తోడు, ఆయా పదాల కోసం వెతికేవాడి బాధ చూడండిక! ఈమధ్య కొత్తపాళీ గారు ఒక వ్యాఖ్యలో రాసిన ఒక పదబంధం కోసం వెతికాను. ఆ కథ చెబుతాను, చిత్తగించండి. అసలా కథ కోసమే ఈ ఉపోద్ఘాతం.

మాలతిగారి బ్లాగులో కొత్తపాళీగారు వ్యాఖ్య రాస్తూ ’కుప్పుస్వామయ్యరు మేడ్దిఫికల్టు’ అని రాసారు.  అది చాలా ప్రసిద్ధమైన  చెతురు, గురజాడ కన్యాశుల్కంలో రాసినది.  గూగుల్లో వెతకబోయాను దాని కోసం. వెతికాక, జాలంలో అదేమంత ప్రసిద్ధమైనది కాదని తెలిసింది. ఎందుకంటే, దీనికి రెండంటే రెండే ఫలితాలొచ్చాయి. ఫలితాలు రెండైనా, రెంటిలోనూ  టెక్స్టు ఒకటే -ఆయన రాసినదే!  ఒకటి ఒరిజినలు, రెండోది దాన్ని చూపించిన అగ్రిగేటరు.

ఇదేంటి, ఇంత ప్రసిద్ధమైన ప్రయోగాన్ని మనవాళ్ళు అసలు వాడటం లేదా అని అనుమానం వచ్చి,  కొద్దిగా మార్చి,  కుప్పుసామయ్యరు, కుప్పుసామయ్యర్, కుప్పుస్వామయ్యరు, కుప్పుస్వామయ్యర్ ఇలా వివిధ వికల్పాలతో వెతికితే, కింది ఫలితాలొచ్చాయి:

కుప్పుసామయ్యరు మేడ్డిఫికల్టు — 1
కుప్పుసామయ్యర్ మేడ్డిఫికల్టు — 2
కుప్పుస్వామయ్యరు మేడ్డిఫికల్టు — 2
కుప్పుస్వామయ్యర్ మేడ్డిఫికల్ట్ — 2
ఆశ చావక, మళ్ళీ కొద్ది మార్పుచేర్పులతో వెతికాను.  ఇంకోటి దొరికింది.
“కుప్పుసామయ్యర్ మేడ్ డిఫికల్ట్” – (ముందు 109 అని చెప్పింది, తరవాత 10 అని చూపించింది. ఏంటో మరి!)

అంటే ఏంటనమాటా..? వెతికేటపుడు ఆయా పదాలకు సంబంధించిన  ఇతర రూపాల కోసం కూడా వెతకాలి. అప్పుడే మనకు అవసరమైన దాన్ని పట్టుకోగలుగుతాం. అలాగే, రాసేవాళ్ళు కూడా పదాలను రాసేటపుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సందేహం వచ్చినపుడు ఒకసారి గూగులించి చూస్తే, తప్పులను నివారించవచ్చు.

(ఇలా వెతుకుతూండగా.. నా బ్లాగులోనే నేను దీన్ని రెండుచోట్ల రెండు రకాలుగా – కుప్పుసామయ్యర్ మేడ్డిఫికల్టు అనీ, కుప్పుసామయ్యరు మేడ్డిఫికల్టు అనీ –  రాసినట్టు గ్రహించాను. అసలందుకే ఈ వ్యాసం రాయాలనిపించింది. నేను చేసిన తప్పును మనందరం చేస్తున్నట్టుగా కతల్జెబుతున్నాను చూసారా? తెల్లోడి తెలివితేటలు!)

సరే, వెతికేటపుడు మనక్కావల్సిన పదం కోసమే కాక, దానికి కాస్త అటూ ఇటూగా ఉండే తప్పొప్పుల కోసం కూడా వెతకాలన్నమాట. స్థూలంగా, కొన్ని సూత్రాలు గుర్తెట్టుకోవాలి:

 1. పరాయిభాష – ముఖ్యంగా ఇంగ్లీషు – లోని మాటకోసం వెతుకుతూంటే,  ఆ పదం యొక్క అజంత, హలంత రూపాలు రెండింటి కోసమూ వెతకండి. ఉదాహరణకు, డిఫికల్ట్ (136) కోసం వెతుకుతూంటే డిఫికల్టు (1) కోసం కూడా వెతకండి.
 2. అనుస్వారంతో అంతమయ్యే పదాల కోసం వెతుకుతున్నపుడు, ’ము’ తో అంతమయ్యే రూపం కోసం కూడా వెతకండి. ’భయం’ (2,21,000)  కోసం వెతికేటపుడు, ’భయము’ (9,010)  కోసం కూడా చూడండి.
 3. పదబంధం కోసం వెతుకుతున్నపుడు, అందులోని పదాలను విడదీసి, కలిపేసి -రెండు రకాలుగానూ వెతకండి.  ఉదాహరణకు  బట్టతల  (4,790) కోసం వెతకబోయినపుడు “బట్ట తల”  (2,020) కోసం కూడా వెతకండి (డబులు కోట్‍లు పెట్టండి, లేకపోతే బట్టల్నీ తలల్నీ కూడా చూపించేస్తది)
 4. ఇహ మధ్యలో పొల్లు వచ్చే పదాలుంటాయి. వాటి కథ భిన్నంగా ఉంటది. అది మరోసారి.

 కంప్యూటరు కీబోర్డు మీద ఎడాపెడా వాయించేటపుడు ఒక అక్షరం బదులు మరో అక్షరం పడుతూంటుంది.  ఇది అందరికీ పడదులెండి,  వేళ్ళు మందంగా ఉన్న నాబోటి వాళ్ళకి మాత్రమే ఇది జరుగుతుంది. ముఖ్యంగా తెలుగు టైపించేటపుడు గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘమూ తప్పులు పడుతూంటాయి. ’కు’ బదులు ’కి’, ’కీ’ బదులు ’కూ’ ఇలాంటి టైపాట్లు పడుతూంటాయి.  ఏం చేస్తాం, మనిషికో వైకల్యం మహిలో సుమతీ!

ఇవీ, ఇలాంటి ఇతర తప్పులనూ అలాగే ఉంచి ప్రచురించడం వలన, అవి జాలంలోకి చేరుకుంటున్నాయి. బద్ధకించి కొందరు, తప్పులు కనబడక కొందరు, అవి తప్పులని తెలీక కొందరూ వదిలేస్తారు. కొందరుంటారు, ’ఏఁ, తప్పు రాస్తే ఏంటంట? కొంపలంటుకుంటాయా? ’అని వదిలేస్తారు . ఎలాగన్నా వదిలెయ్యనీండి, తప్పులు జాలంలోకి దొర్లుకొస్తాయి. 

మరి గూగులు తెలివైన దంటారే…? 
నిజమే, గూగులు తెలివైనదే. ఒక్కోసారి మనం పదాన్ని కొద్దిగా అటూ ఇటూగా, స్పెల్లింగులు తేడాగా  ఇచ్చినా, ’ఏంటి బాబూ, నువ్వు అడగదలిచింది ఇదిగానీ కాదు గదా : ’అంటూ అసలుదాన్ని చూపిస్తుంది. అయితే ఇంగ్లీషు భాషకో, మరోదానికో చూపిస్తుందిగానీ, తెలుక్కి చూపించదు.  పాపం దానికింకా పూర్తిగా తెలుగు రాదు.

పదబంధాల్లోని పదాలను కలిపి రాయాల్సిన చోట విడదీసి, విడదీసి రాయాల్సిన చోట కలిపీ రాస్తూంటాం కదా.. ఉదాహరణకు వేటగాడు అనే మాట చూడండి, దీనిలోని వేట గాడు అనేవి మాటలను విడిగా రాయకూడదు. కానీ వీటిని విడదీసి రాస్తూంటారు.  వెతుకులాటలో తేడాలొస్తాయి. వేటగాడుకు 5,390 ఫలితాలొస్తే, “వేట గాడు”కు 4 ఫలితాలొచ్చాయి.  ఇలాంటి మాటలు రాసేటపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. విశేషమేంటంటే, వేటకాడు అని కూడా కొన్నిచోట్ల రాసారు. వెతుకులాటలో దీనికి 29 ఫలితాలొచ్చాయి.

మనుషుల పేర్లను కూడా రకరకాలుగా రాస్తూంటాం. ఉదాహరణకు నందమూరి తారకరామారావు, నందమూరి తారక రామారావు, నందమూరి తారక రామా రావు అని రకరకాలుగా రాస్తూంటాం. అంతెందుకు.., ఉత్త నందమూరి అనే పేరును నంద మూరి అని విడగొట్టి రాస్తున్నారని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. నందమూరికి  2,71,000 ఫలితాలొస్తే, “నంద మూరి” కి 123 ఫలితాలొచ్చాయి.  చిత్రమేంటంటే, క్షమాపణ (87,700)ను “క్షమా పణ ” (47) అని కూడా రాస్తున్నారు.

ఇంకో చిన్న పరిశీలన. తెలంగాణ ను ఎన్ని రకాలుగా రాస్తామో చూడండి:

 • తెలంగాణ (4,37,000)
 • తెలంగాణా (4,34,000)
 • తెలంగానా (26,300)
 • తెలంగాన (14,400)
 • తెలింగాణా (47)
 • తెలింగాణ (7)
 • తెలింగానా (44)
 • తెలింగాన (2)
 • తెలగాణ (2,230) 
 • తెలగాన (6)
 • తెలగానా (3)
 • తెలగాణా (59)

తెలంగాణ కోసం వెతికేవాళ్ళు, తెలగాన  కోసం కూడా వెతికే అవకాశం చాలా తక్కువ.  మనం మన వ్యాసంలో  తెలగాన అని రాసి ఉంటే, గూగులు ద్వారా అది చదువరులకు అందే అవకాశం దాదాపు లేనట్టే – ఇహ,  ప్రత్యేకించి లింకులిచ్చుకుంటూ ప్రచారం చేసుకోవాల్సిందే.

ఒక్కమాట – ’ఆ, ఇప్పుడు నేను రాసే బోడి రాతలు వెతుకులాటలో కనబడకపోతే మాత్రమేంటిలెండి ’ అని మాత్రం అనకండి.  ఎక్కడినుంచో కాపీకొట్టి, దించిపారెయ్యనంతవరకు ఏదీ బోడిరాత కాదు. అన్నీ అవసరమే!  కాదేదీ సెర్చి కనర్హం!  ఇంకోటి – మనం రాసేది, పాఠకులను చేరటానికి.  పాఠకుణ్ణి చేరాలంటే జనం గూగిలించినపుడు మనమూ ఫలితాల్లో కనబడాలి.

మనం తప్పులు దిద్దుకోవాలని చెప్పకుండా గూగులుకు తెలుగు నేర్పమంటావేంటయా అని నన్నడగొద్దండి. ఆ రెండోదే తేలిక.  ఎందుకంటే,  తెలుగు ఎట్టా ఏడ్చినా ఫర్లేదులెమ్మని మనలో చాలామందిమి అనుకుంటాం. అదే.., ఇంగ్లీషులో చిన్నవెఁత్తు తప్పు దొర్లితే భ్రూణహత్య చేసినంత పాపంగా భావించి, తల్లడిల్లిపోతాం.

————————————————–

(బ్రాకెట్లలో ఇచ్చినవి – ఆగస్టు 2 న ఆయాపదాల కోసం గూగిలించినపుడు వచ్చిన ఫలితాల సంఖ్య. మళ్ళీ వెతికితే ఈ ఫలితాలు కొద్దిగా అటూఇటూ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ రాసినదంతా గూగుల్లో వెతకడాన్ని దృష్టిలో పెట్టుకుని రాసినదే. గూగిలించడం అంటే google.com లో వెతకడం.)

Advertisements