Archive

Archive for the ‘ట్రాఫిక్కు’ Category

కారు చౌక, చవక కారేం కాదు!

January 11, 2008 1 comment

టాటా నానో! లక్ష కారు వచ్చేసింది. లక్షణంగా ఉందట. వెలకే నానో గానీ, ఆకారానికి నానో కాదట! భేష్, టాటా!

——————

ఈ కారు ప్రభావం హై.లో ఎలా ఉండబోతోందని ఆలోచిస్తున్నారు. హై.లో మొదటేడు ఇరవై వేల నానోలు కొంటారని ఓ అంచనా అట. కార్ల రద్దీని తట్టుకునేందుకు గాను, రవాణాశాఖ వాళ్ళేవో ప్రణాళికలు వేస్తున్నారని ఈనాడు రాసింది. ఇవీ అవి:

  • కొన్ని దారుల్లో ఆటోలను రానివ్వరట.
  • నంబరులో బేసి సంఖ్య కలిగినవి కొన్ని దారుల్లోనూ సరి సంఖ్య కలిగిన వాటిని కొన్ని దారుల్లోనూ అనుమతిస్తారట.

ఇలాంటి పథకాలను రోడ్లుండే ఊళ్లలో పెట్టుకోవచ్చుగానీ, హై.లో పెడితే జోకనుకునే ప్రమాదం ఉంది. అసలు దార్లంటూ ఉంటే అనుమతించనూ వచ్చు, మూసెయ్యనూ వచ్చు. అవి లేకే గదా మనకిన్ని తిప్పలు!!

———————-

ఈ కారు గురించి టాటాలు చేసిన హైవోల్టేజీ ప్రచారం మాత్రం కళ్ళకు మిరుమిట్లు గొల్పింది. పత్రికల్లో రెండ్రోజులనుండీ కారు గురించి వార్తలొస్తూ ఉన్నాయి. కారును ఆవిష్కరించాక, ఇవ్వాళ పేపర్లలో ఆ కారుకిచ్చిన ప్రాముఖ్యత చూస్తే అది టాటాల ప్రచారంలో భాగమేనని అనిపించింది. ఈనాడులో ఒక పూర్తి పేజీ ప్రకటనే కాక, ఒక పేజీ నిండా దాని వార్తలే, మొదటి పేజీలో అన్నిటికంటే పైయెత్తున వార్త! పైగా సంపాదకీయం. ఇంకా ఇతర పేజీల్లోనూ ఆ కారు వార్తలున్నాయి. ఆంధ్రజ్యోతిలో కాస్త తక్కువైనా అందులోనూ చాలా ప్రాముఖ్యత ఇచ్చారు.

Advertisements

రహదారులు, రహగొందులు, రహసందులు

November 24, 2007 6 comments

కర్ణుడి చావుకు కారణాలివీ అంటూ ఒక పద్యం ఉంది. గూగులునడిగాను గానీ దొరకలేదు. నాకు గుర్తున్నంత వరకు రాస్తున్నాను. మొదటి పాదం మొదటి పదం సరైనదో కాదో తెలీదు..

నరు(?) చేతను నాచేతను
వరమడిగిన కుంతి చేత పారుని చేతన్
ధరచే భార్గవు చేతన్
నరయంగా కర్ణుడీల్గె నార్వురి చేతన్

హై.లో దిక్కుమాలిన, నత్తనడకల ట్రాఫిక్కుక్కూడా తలమాసిన కారణాలు బోలెడున్నాయి. ఆ కారణాల్లో కొన్ని.., కందాల్లో

రహగొందులు, రహసందులె!
రహదారులు లేనెలేవు రాచనగరునన్
అహరహమిట ప్రవహిస్తూ
సహియించే నాగరికులు సాహసులు సుమీ!

నలుడే అచ్చెరువొందగ
తొలుచుచు, మెలికెలు తిరుగుచు, దూరుచు, తోలున్
తలచిన, బైకుల తిలకులు
తల దూరెడి కంతలోన ధర దూర్చు జుమీ!

తోపుడు బళ్ళకు తోడుగ
ఆపిన యాటో లటునిటు, యాచక గుంపుల్!
దాపునె మొలిచిన యాడులు*
ట్రాఫికు నాపుట కదనపు టమరిక లవియే!

*యాడులు:- ప్రకటనలు (Ads). (ఇలాంటి మ్లేచ్ఛ పదాలు, అందునా పొట్టిపదాలు, పొడిపదాలూ రాసి, ‘అయ్యో అదేంటో చెప్పుకోవాల్సి వచ్చిందే’ అని అనుకుంటే ఎలా? అంచేత నేనలా అనుకోను.)

ఎడమ దిశనె నడపాలని
మడి గట్టుకు కూరుచుంటె మరియా దవదోయ్
కుడిఎడమల ఎడమెంచక
వడివడిగా దూసుకెళుటె మగతన మిచటన్!

బందుల రాబందులు తము
మందలుగా అడ్డగించి బాధలు పెట్టన్
బంధన మందున చిక్కడి
సందులకై ఎగబడుదురు సంకెల బిగియన్

దారికి మధ్యన కడుదురు
పౌరుల బాధలు తలపక ప్రార్థన స్థలముల్
తీరుగ దేవుడె అడ్డగ
వారలకిక రక్షణేది, భాగ్యనగరిలో?

ట్రాఫిక్కబుర్లు

September 23, 2007 19 comments

హైదరాబాదు.
మంగళవారం సాయంత్రం ఆరుంబావు.
ఆఫీసు నుండి ఇంటికెళ్తున్నా, కారులో.
నేనే నడుపుతున్నాను.

నామీద జాలిపడ్డానికి ఇంతకు మించిన కారణం మరోటక్కరలేదు. నిజానికి ఇంటికి ‘వెళ్తున్నాను’ అనేకంటే, ఇంటికి వెళ్ళే దారిలో ఆగి ఉన్నాను అని అంటే సరిగ్గా ఉంటుంది. ప్రస్తుతం ట్రాఫిక్కు ఎందుకాగిందో తెలీదు. నా కంటే ముందు అనేక కార్లు, ఆటోలు, మినీ లారీలు వగైరాలు ఆగి ఉన్నాయి. ఈ బళ్ళ సందుల్లోంచి మోటారు సైకిళ్ళు, స్కూటర్లు, సైకిళ్ళు ఒడుపుగా వెళ్ళిపోతున్నాయి.. బండరాళ్ళ సందుల్లోంచి ప్రవహించి పోయే నీళ్ళ లాగా! ఈ ముష్టికారు నవతల పడేసి స్కూటరేసుకుపోతే బాగుంటుంది అని మళ్ళీ అనుకున్నాను. అలా అనుకోవడం నాకు మామూలే!

నా ముందు ఓ కారు ఆగి ఉంది. పాపం, కొత్త కారు, ఇంకా నంబరు గూడా రాలేదు. రోజూ ఇలాంటి దరిద్రపు ట్రాఫిక్కులో కొట్టుకొని పోతూ, కారు ఉన్నవాళ్ళు ఎందుకు కొన్నామా అని ఏడుస్తుంటే.. ఇప్పుడు కొత్తగా కొనుక్కున్నవాళ్ళని పాపమనక ఇంకేమంటాం?!! ఇంకా నంబరు కూడా రాకుండానే ఆ కారుకు ఎడమ పక్కన పెద్ద సొట్ట. దాని గురించి జాలిపడాల్సిన అవసరం లేదులెండి. కాలుద్దని తెలిసీ నిప్పును పట్టుకున్నవాడిపై జాలెందుకు చెప్పండి.

ఆ కారుకు, నా కారుకు మధ్య ఖాళీ కాస్త ఎక్కువగా ఉంది – అంటే ఓ రెండు మూరలు ఉంటుంది లెండి. మామూలుగా హై.లో జానెడుకు పైన ఒక్క బెత్తెడు కూడా ఖాళీ వదలరు. ఇక్కడి బళ్ళ మూతీ, ముడ్డీ చూస్తే మీకు తెలుస్తుంది ఆ సంగతి. అదుగో, అంత ఖాళీ ఉండేసరికి ఆటోవాడొకడు ముందు చక్రాన్ని దూర్చేసాడు. ఏమయ్యా, ఏంటా దూరడం అని అడగలేను… “చుప్, సాలా, తేరా గాడీ కో లగా క్యా? ఫిర్, క్యోఁ చిల్లారా?” అని అంటాడు. అసలు జానెడు కంటే ఎక్కువ ఖాళీ వదలడం నాదీ తప్పు, వాణ్ణనుకుని ఏం లాభం? అమధ్యెప్పుడో చుట్టపు చూపుగా అమెరికా వెళ్ళాను. -డెట్రాయిట్ పక్కన ఓ శివారు నగరం. రోడ్డు మీద మనిషి కనబడ్డు, అన్నీ కార్లే! నేను మా ఆఫీసు స్నేహితుడితో పాటు అతడి బండిలో వెళ్ళేవాణ్ణి. అతడు బండి నడుపుతూంటే నాకు మహా చిరాకొచ్చేసేది. ఏ లైటు దగ్గరో ఆగాల్సి వచ్చిందనుకోండి… ముందున్న బండికి ఓ ప్ఫది మీటర్ల వెనక ఆపేవాడు. ‘ఎహె, ఇంత ఖాళీ ఉంచాడేంటి.. ఎవడన్నా వచ్చి దూరితేనో’ అని కొట్టుకులాడి పోయేవాణ్ణి. ముందు బండి బంపరు దాకా తీసుకెళ్ళి ఆపితే ఈయన సొమ్మేం పోయింది అని తహతహ లాడిపోయేవాణ్ణి. అక్కడ అలా దూరరు అని తెలిసినా ప్రాణం కొట్టుకులాడేది; అలవాటైపోయిన ప్రాణం కదా.

ఇక్కడ.. సరే ఈ ఆటోవాడు దూరాడు గదా.. నేనేమైనా తక్కువ తిన్నానా?! హై. లో ఓ ఆరేడేళ్ళు బండిని నడిపిన వాణ్ణే గదా.. ఓ అరడజను ఢక్కామొక్కీలు తిన్నవాణ్ణేను! నేనూరుకుంటానా? కుడిపక్కనున్న వాడికీ నాకూ మధ్య ఓ మూరెడు ఖాళీ ఉందని గమనించాను. (అంత ఖాళీ ఉండడం ఆశ్చర్యమే) వెంటనే స్టీరింగును బాగా కుడికి తిప్పి ముందుకు ఓ రెండు జానెలు పోనిచ్చి మళ్ళీ ఎడమకు తిప్పి ఇంకో రెండు జానెలు పోనిచ్చి ఆపాను. ఇప్పుడు నా బండిని ఆటోకి అడ్డం పెట్టానన్నమాట. హమ్మయ్య, మనసు చల్లబడింది. ఇహ నేను ఓ గంటైనా ఇలా ఉండగలను. విసుగు, అలసట అనేవి 90 శాతం మానసికం, మిగతాది శారీరకం అని నేను నమ్ముతాను. ఇప్పుడు మనసు చల్లబడింది కాబట్టి, విసుగు మాయమైంది.

ట్రాఫిక్కులో ఉండగా పక్క మనిషితో సఖ్యంగా ఉండడం, సుహృద్భావంతో మాట్టాడ్డం, చిరునవ్వు నవ్వడం లాంటివి జరుగుతాయంటే నేన్నమ్మను.. హై. లో ఎవడూ నమ్మడు. అదేదో లవ్వుంది గదా.. యుటోపిక్కో, ప్లేటోనిక్కో, టైటానిక్కో… దానికి సమానం అది! “హైదరాబాదు మత సామరస్యానికి గీటురాయి/ఉదాహరణ/నమూనా/బండగుర్తు/ప్రతీక” లాంటి జోకే ఇది కూడా. ఆమధ్యోరోజు నా ముందున్నవాడు బ్రేకేస్తే నేనూ బ్రేకేసాను. నా వెనకో బైకుంది. బైకుర్రాళ్ళు మామూలుగా బ్రేకు వాడరు గదా, అంచేత బ్రేకు వెయ్యలేదు. థ్థడ్ మని శబ్దం! నేనా కుర్రాడితో, “బాబూ, అప్పుడప్పుడు బ్రేకు కూడా వాడాలమ్మా” అని అన్నాను కాస్త వ్యంగ్యంగా. నేనంత సౌమ్యంగా మాట్టాడ్డం నాకే ఆశ్చర్యమనిపించింది. ఆ కుర్రాడు దానికి ఇంకొంచం ఉప్పూ కారం కలిపి “బ్రేకా? అంటే ఏంటంకుల్?” అని అడిగాడు. బండి సొట్టలకు అలవాటు పడినంతగా అంకులనిపించుకోడానికి పడలేదు. గుడ్ల నీళ్ళు కుక్కుకోని, కిక్కురుమనకుండా ముందుకు తిరిగాను. నాపైన వాడిది పైచేయి అయిపోవడంతో అంతులేని విసుగొచ్చేసింది ఆ రోజున ట్రాఫిక్కులో.

హమ్మయ్య బళ్ళు కదులుతున్నాయి. ఓ వందా రెండొందల మీటర్ల తరవాత మళ్ళీ ఆగుతాం కదా.. అప్పుడు మరి కాసిని కబుర్లు చెబుతాను. ప్రస్తుతానికి ఉంటాను.