Archive

Archive for the ‘తెలంగాణ’ Category

వంచన దినం! వంచకుల దినం!!

September 18, 2010 13 comments

ఈయేడు సెప్టెంబరు 17 నాడు ఏం చేసుకోవాలో తెలీలేదు మన రాజకీయ నాయకులకు.  పదిహేను రోజుల ముందుదాకా ఒక్కోడు పెద్దపెద్ద కబుర్లు చెప్పారు. వీర తెవాదులు విమోచనమన్నారు. అంత వీరులుకానివారు విలీనమన్నారు. సరే.., కొందరు మూర్ఖవాదులు విద్రోహమన్నారు – వీళ్ళని పక్కన పెట్టెయ్యొచ్చు ప్రస్తుతానికి.  వీళ్ళంతా ఇట్టా పోసుకోలు కబుర్లు చెబుతూ ఉన్నప్పుడు ముస్లిములు అడ్డు చెప్పలేదు, వాగనిచ్చారు. తరవాత ఒక ఇఫ్తారు పార్టీ పెట్టారు.  వీళ్ళు తమను ముస్లిములు అని పిలుచుకోరు మూవ్‍మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అనో మరోటో పిలుచుకుంటారు తమను.  రాజకీయ నాయకులు  కొందరు రూమీ టోపీలు పెట్టేసుకుని ఇఫ్తారుకెళ్ళారంట. అక్కడ ఆ ముస్లిములు తమ (అభి)మతాన్ని బైటపెట్టారు.  అంథే…! అప్పటి దాకా ఓ.. థెగ మాట్టాడేసిన పోసుకోలు రాయుళ్ళ నోళ్ళకు తాళాలు పడ్డాయి. నోటమాట రాలేదు.  కొందరు ద్రోహులైతే అసలు పదిహేడో తేదీన  బైటికే రాలేదు.

1948 సెప్టెంబరు 17న  హైదరాబాదు సంస్థానం భారత్ లో విలీనమైపోయింది. నిజాము, రజాకార్ల దుష్కృత్యాల నుంచి ప్రజలు విముక్తులయ్యారు.  ఈ సందర్భాన్ని తెలంగాణ విమోచన దినంగానే ఇన్నాళ్ళుగా జరుపుకుంటూ వస్తున్నారు. ఈయేడు మాత్రం మొత్తం అన్ని పార్టీలవాళ్ళూ మాట మార్చేసి విమోచన దినం కాదు, విలీనదినం అని పేరు మార్చారు – భాజపా,  లోక్ సత్తాలు తప్ప. ప్రభుత్వమే అధికారికంగా విమోచన దినాన్ని జరపాలని డిమాండిన తెరాస ఇప్పుడు గప్ చుప్ ఐపోయింది.

ఇక కేసీయారు సంగతి.. ఈయన  నాయకులందరి తల్లోంచి దూరెళ్ళినవాడు.  దంచుటకైనా, ముంచుటకైనా..  సారు  చాలా పెద్దవారు. గతంలో విమోచన దినమంటూ దంచిన కేసీయారు ఈసారి విలీనదినంగా చేసుకోవాలని మాటమార్చాడు. పాపం, మార్చక ఏం చేస్తాడులే – నిజామంటే భయభక్తులు ఉన్న వాడు, నిజాము కీర్తిగానం చేసేవాడూ గదా!  ముస్లిములు ఇచ్చిన షాకుతో  కేసీయారు మాట మార్చడమే కాదు, అసలు తమ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉత్సవానికి హాజరే కాలేదు.  వంచన ఎరిగిన తన మనసునకు ముంచుట యన్నది సహజమెగా!

తెరాస వారి తోక ఐన తెలంగాణ రాజకీయ జేయేసీ కూడా మాటమార్చేసి ఇది విమోచన కాదు, విలీనమని ప్రకటించింది. ఎందుకు విలీనమో, విమోచనమెందుక్కాదో వివరించి చెప్పేందుకు పాపం కోదండరామ్ కు తలప్రాణం తోకలోకొచ్చింది.  సారు గూడా ఆ ఇఫ్తారు పార్టీలో ఉన్నాడని భోగట్టా!

నవంబరు 1 నాడు రాష్ట్రావతరణ దినోత్సవం కదా!  ఆరోజున వీళ్ళేం చేస్తారో చూడాలి. రాష్ట్రావతరణకు ఏం పేరు పెట్టడానికైనా వీళ్ళు ఎనకాడరు. ఎంత గొడవ చెయ్యడానికైనా తయారు. ’ఆంద్రోళ్ళ’ మీద విషం గక్కడమే కదా వాళ్ళ లక్ష్యం. కోస్తా సీమల ప్రజలను  తిట్టడమే వాళ్ళ ధ్యేయం.  ఇలాంటి అవకాశాన్ని ఎందుకొదులుకుంటారు? ముస్లిముల మనోభావాలంటే బయ్యంగానీ ఆంద్రోళ్ళ మనోభావాలంటే వాళ్ళకేం పట్టింది?

మరో సారుండారు.. వరవరరావు!  వీరు అసలు మాట మాత్రమైనా విమోచన దినం గురించి చెప్పినట్టు లేదు. ముస్లిములకు వ్యతిరేకమైన విషయంపై మాట్టాడ్డమంటే అది దేశద్రోహమే గదా! అంచేత వారు మాటాడ్రు. కానీ రేపు సెప్టెంబరు 24  న అయోధ్య వివాదంపై కోర్టు తీర్పొచ్చాక మాత్రం బైటికొస్తారు.  అయోధ్యలో  మసీదు కట్టించాల్సిందేనని డిసెంబరు 6 న డిమాండేందుకు మాత్రం  నోళ్ళొస్తాయ్, ఉద్యమాలు చేసేందుకు కాళ్ళొస్తాయ్! ఇస్లామిక్ మార్క్సిజమ్  ప్రత్యేకతే అంత మరి!  ముస్లిము మార్కు మార్క్సిస్టుల వ్యవహారశైలే అంత!

 మొత్తమ్మీద విమోచనం , విలీనం అంటూ మాటలు మార్చి వీళ్ళంతా ఆత్మవంచన చేసుకున్నారు, జనాన్ని వంచించారు.

Advertisements
Categories: తెలంగాణ

మబ్బులు చూపించి.. ముంత ఒలకబోయించి..

September 6, 2010 14 comments

కొందరు తెవాదుల అకృత్యాలు ఉండేకొద్దీ వికృత రూపాన్ని తీసుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. డిసెంబరు తరవాత ’అలజడి సృష్టించడానికి’ ఇప్పటినుండే రిహార్సళ్ళు చేసుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. మొన్న ఉస్మానియాలో తెవాదులు పేపర్లు దిద్దే పంతుళ్ళను వెంటబడి మరీ దాడి చేసి కొట్టారు.  అప్పుడు చేసిన తప్పును కప్పిపుచ్చే అవకాశం గ్రూప్ వన్ పరీక్షల రూపంలో ఇప్పుడు వచ్చింది. వెంటనే అవకాశాన్ని అందుకున్నారు. ప్రజలకు అబద్ధాలు చెప్పి, వాళ్ళ మనసులను విషపూరితం చేసే ఏ అవకాశాన్నీ ఈ దుష్ట తెవాదులు ఒదులుకోరు. గ్రూప్ వన్ పరీక్షలు ఆపెయ్యాల్సిందేనంటూ గోల చేసారు.

అసలు ఏ కారణంతో ఈ పరీక్షలు ఆపాలనే ప్రశ్నకు తెవాదుల దగ్గర సరైన సమాధానం లేదు. ఆ ఉద్యోగాల్లో తమకు 42% రిజర్వేషన్లు కావాలని వాళ్ళ డిమాండు. గ్రూప్ వన్ ఉద్యోగాలకు ప్రాంతీయ రిజర్వేషన్లు లేవు.  అయినా  అడుగుతున్నారు.  అలా మొదలుపెట్టినప్పటికీ, తమ వాదనలో పస లేదని గ్రహించాక, దాన్ని మార్చారు. కమిషను చైర్మను వెంకట్రామిరెడ్డిని తీసేసాక మాత్రమే పరీక్షలు పెట్టాలంట.  ఎందుకూ? అతడు ఇంటర్వ్యూల్లో తెలంగాణ వాళ్ళకి అన్యాయం చేసాడంట,  ఇప్పుడూ చేస్తాడంట.

వెంకట్రామిరెడ్డికి అన్యాయం చేసే అవకాశం ఎప్పుడొస్తది? ఈ మొదటి అంచె  ఫలితాలు రావాలి, ఆ తరవాత రెండో అంచె జరగాలి, వాటి ఫలితాలు రావాలి, ఆ పైన ఇంటర్వ్యూలు జరగాలి. ఇవన్నీ జరిగేటప్పటికి అతడెలాగూ ఉండడు. ఒకవేళ ఉన్నా, ఈ లోగా అతణ్ణి తప్పించమని వత్తిడి చెయ్యొచ్చు.  ఇదంతా  దాచిపెట్టేసి,  పరీక్షలను అడ్డుకోవాలని, రాసేవాళ్ళను చెల్లాచెదురు చెయ్యాలని ప్రయత్నించారు. ఉస్మానియా బియ్యీడీ కాలేజీ సెంటరులో పరీక్షలను రద్దు చేయించడంలో విజయులయ్యారు కూడాను. (అసలు రౌడీమూకల మధ్య పరీక్ష పెట్టి, వాళ్ళ నుండి రక్షణ కోసం వందల మంది పోలీసులను పెట్టడం ఎందుకు?)

ఈ డ్రామాలో  విలన్లే కాదు, జోకర్లూ ఉన్నారు -కాంగ్రెసు ఎంపీలు! వాళ్ళు బియ్యీడీ కాలేజీని ముట్టడించడానికి పోతూంటే పోలీసులు అరెస్టు చేసి వానులో తీసుకెళ్తుండగా, టీవీల్లో చూపించారు. ఆ పిచ్చి సన్నాసులను  చూస్తే నవ్వొచ్చింది. తోలుబొమ్మలాటలో బొమ్మల్లాగా ఉన్నారు. కోతులాటలో కోతుల్లాగా ఉన్నారు. అయ్యగారికి దణ్ణంపెట్టూ అని ఆడించేవాడు అనగానే నెత్తిన చేతులు పెట్టుకునే కోతిలాగా అనిపించారు. ఈ చవటాయిల్ని, ఈ తోలుబొమ్మల్ని ఒక ఆట ఆడిస్తున్నాడు కేసీయారు. అతడాడిస్తూంటే ఈ కేతిగాళ్ళు తైతక్కలాడుతున్నారు.  ఒకళ్ళిద్దరు కాదు..,  నలుగురో ఐదుగురో ఎంపీలు.  ఒకవేళ కేసీయారు చెప్పినట్టు వీళ్ళు ఆడలేదనుకోండి.. ’చూడండి,  మనమంటే వీళ్ళకు లెక్ఖలేదు, తెలంగాణ పట్ల వీళ్లకి  శ్రద్ధలేదు’ అని తిట్టి, ప్రజలచేత తిట్టిస్తాడేమోనని ఈళ్ళ భయం!

ఆ ఎంపీల్లోనే ఒకతడు మొన్నొక నాటకం కూడా ఆడాడంట.. ఈ పరీక్షల అక్రమం గురించి సోనియాతో మాట్టాడాను, అహ్మద్ పటేలుతో మాట్టాడాను, వీరప్పతోటీ, దారిన పోయే దానప్పతోటి మాట్టాడాను అంటూ టీవీ వాళ్ళకి అబద్ధాలు చెప్పాడంట. వెంటనే ఆ దానప్పలు అబ్బెబ్బే , మాతో టెవడూ మాట్టాడలేదు, అసలు మాకు ఆ పరీక్షలతో సంబంధమేమీ లేదు అంటూ తేల్చేసారు.

ఇలా అబద్ధాలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆ ఎంపీకి? ఇలా తోలుబొమ్మల్లాగా తైతక్కలాడాల్సిన ఖర్మ ఎందుకు పట్టింది వీళ్ళకి? తమ డిమాండు తెలివితక్కువదనీ, దాన్ని అడ్డం పెట్టుకుని ఇలా పరీక్షను అడ్డుకుంటే  కుర్రాళ్ళకు నష్టమనీ తెలిసి కూడా వీళ్ళీ దౌష్ట్యానికి ఎందుకు ఒడిగట్టినట్టు?  ’నీకంటే పెద్ద తెవాదిని నేనూ, ఒట్ఠీ తెవాదిని నేనూ’  అని చెప్పుకోవాలనే దురద కాకపోతే ఇంకేంటి?

కేసీయారు చూడండి ఏమంటున్నాడో..  ఇప్పటికైనా ప్రభుత్వం ’చెంపలేసుకుని, పరీక్షను రద్దు చేసి మళ్ళీ పెట్టాలం’ట!  తప్పు చేసింది తామైతే, ప్రభుత్వం ఎందుకు చెంపలేసుకోవాలి?  ’ఈ రకంగా పరీక్ష పెట్టడం ప్రపంచంలో ఇంకెక్కడా జరగలేదం’ట.  ఇలాంటిది ప్రపంచంలో ఇంకెక్కడైనా జరిగి ఉంటుందో ఉండదో తెలవదు గానీ, ఈ తెవాదుల వంటి ఉద్యమకారులు మాత్రం ప్రపంచంలో ఎక్కడా ఉండి ఉండరు.   వీళ్ళలాగా ప్రజల గుండెల్లో విషం గక్కినవాళ్ళు, వీళ్ళలాగా మబ్బుల్ని చూపించి, ముంతలో నీళ్ళను ఒలకబోయించేవాళ్ళు మాత్రం ఇంకెక్కడా ఉండరు.  వస్తదో రాదో తెలీని, వచ్చినా ఎప్పుడొస్తదో తెలీని, తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పి, ఇవ్వాళ కుర్రాళ్ళ నోట మట్టిగొట్టారు.

తెలుగు  ప్రజలకు పట్టిన  చీడ, ఈ దుష్ట తెవాద రాజకీయ నాయకులు.  తమ రాజకీయ ప్రయోజనాల కోసం  వీళ్ళు అమాయక ప్రజలకు చేస్తున్న అన్యాయం  అనన్య సామాన్యం!

Categories: తెలంగాణ

శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణ ప్రజల అభిప్రాయం

తెలంగాణ ప్రజలు తమకు తెలంగాణ కావలసిందేనంటూ తమ అభిప్రాయం స్పష్టంగా చెప్పారు. వివిధ వేదికల మీద ఇన్నాళ్ళుగా చెబుతూ వచ్చిందే ఇప్పుడు అది ఓటేసి – ఒట్టేసి – మరీ చెప్పారు.

దాదాపుగా అందరూ ఊహించిన ఫలితమే ఇది. ఎన్నికలు పూర్తిగా తెలంగాణ వాదం ప్రాతిపదికగానే జరిగాయి. ప్రజలు తెలంగాణ కావాలని బలంగా కోరుకుంటున్నారనేది సర్వవిదితం. కాబట్టి, మొత్తమన్ని స్థానాల్లోనూ తెరాస, బీజేపీలే గెలుస్తాయని అనుకున్నదే. అయితే ఈ స్థాయిలో గెలుస్తారని, మెజారిటీలు ఇంత ఎక్కువగా ఉంటాయనీ, మిగతా పార్టీలను ఇలా ఊడ్చవతల పారేస్తారనీ ఊహించలేదు. ఆ విధంగా ఈ ఎన్నికల ఫలితాలు కొంత ఆశ్చర్యం కలిగించేవే!

ఈ ఫలితాల ద్వారా కొత్తగా తెలంగాణ వాదానికి ఒనగూడిందేమీ లేదు. వచ్చే డిసెంబరు దాకా పరిస్థితిలో కొత్తగా వచ్చే మార్పులేమీ లేవు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చేంతవరకూ తెలంగాణ సమస్యలో కొత్తగా వచ్చే మలుపులేమీ ఉండవు. ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెసు, తెదేపాలు తమతమ విధానాలను సమీక్షించుకుని, కొత్త విధానాలను అనుసరిస్తారనో, మరేదైనా మార్పుచేర్పులు చేస్తారనో నాకైతే అనిపించడం లేదు. అయితే ఎంతో కొంత మథనం ఉండే అవకాశం లేకపోలేదు.

అన్ని స్థానాలనూ గెల్చుకున్నందుకు తెరాస, బీజేపీలు సంతోషిస్తున్నారు. ప్రజలు తెలంగాణ పట్ల ఇంత తీవ్ర పట్టుదలతో ఉన్నారన్నది వాళ్లకు సంతోషం కలిగించవచ్చు. అయితే, ఈ గెలుపుకు వాళ్ళ సొంత బలమేమీ కారణం కాదు. ప్రజల్లో తెలంగాణ పట్ల ఉన్న బలమైన ఆకాంక్షే, అద్బుతమనిపించే మెజారిటీలతో వాళ్లను గెలిపించింది. వాళ్ళ స్థానంలో వేరే ఎవరున్నా గెలిచేవారే. ఆ సంగతి అందరితో పాటు వాళ్లకూ తెలుసు.

నేపథ్యంలో ఉండి, ఈ గెలుపు కృషి చేసినవాళ్ళు ఉన్నారు. తెలంగాణ వాదాన్ని గెలిపించడం ఎంత కీలకమో ప్రచారం చేసి, ప్రజలకు ఉద్బోధించిన ఉద్యమకారులు వాళ్ళు -ఉద్యోగులు, లాయర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు వగైరాలు.

ఈ ఎన్నికల ఫలితాల శ్రేయస్సులో సింహభాగం ప్రజలకే చెందుతుంది. తెలంగాణను కోరుకున్నారు కాబట్టే.. డబ్బు, మందులాంటివి ఈ ఎన్నికల్లో పనిచెయ్యలేదు. తెలంగాణ ఏర్పడితే అతి తక్కువ లాభపడే వర్గం ఈ ఓటర్లలోని దాదాపు 80 శాతం మంది. లాభమంతా పై రెండువర్గాల వాళ్లకే. ఈ వర్గమే, పై రెండువర్గాలకూ బలం.

ఏదెలాగైనా ఉణ్ణీండి.., ఈ ఫలితాల ద్వారా శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణ ప్రజలు తమ అభిప్రాయం చెప్పేసినట్టే!

Categories: తెలంగాణ

హై.లో మతకలహాలు ఏనాటివి?

ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు హైదరాబాదులో మతసామరస్యం వెల్లివిరిసేదంట. ఎప్పుడైతే ’ఆంద్రోళ్ళు’ ఇక్కడికి చేరుకున్నారో.. అప్పుడే ఇక్కడ మతకలహాలు మొదలయ్యాయని చెబుతున్నారు ఘనతవహించిన తె.వాదులు! చరిత్రను చాప కిందకు తోసేసి, అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. నాలుగురోజుల కిందట ఓ టీవీలో ఘనత వహించిన విశ్లేషకుడొకరు, వెంటనే శనివారం నాడు కేసియారూ ఈ అబద్ధాన్ని చెప్పారు. 

వీళ్లు చెప్పుకుంటున్న మత సామరస్యం హైదరాబాదులో లేదు. ఇవ్వాళ కాదు, ఎప్పటినుండో లేదు. ఎప్పుడో ఇరవయ్యో శతాబ్దపు రెండవ మూడవ దశకాల నుండీ కూడా ఇక్కడ మతగొడవలు జరుగుతున్నాయి. ఒకర్నొకరు చంపుకున్నారు. జావీద్ ఆలమ్ అనే ప్రొఫెసరు, 19 వ శతాబ్దంలో మాత్రం ఇక్కడ హిందూ ముస్లిముల మధ్య గొడవలేమీ జరగలేదని అంటూ, అయితే “వాళ్ళు పక్కపక్కనే నివసించేవాళ్ళు, కానీ వాళ్ళ మధ్య అంత సామరస్యమేమీ ఉండేది కాదు” అని చెప్పారని ఒక వెబ్‍సైటులో చదివాను. రెందు మతాల ప్రజల మధ్య సామరస్యం ఇలా ఉందని ఓ ప్రొఫెసరు చెబుతోంటే ఇంకో వక్రవాణి ప్రొఫెసరు ’మేమూ చదువుకున్నామండీ..’ అంటూ కెమెరా ముందు చేరి, అబద్ధపు కథలు అల్లాడు. ఆయన చెప్పిన “హైదరాబాదులో మతకలహాలు సమైక్య రాష్ట్రం ఏర్పడ్డాకే మొదలయ్యాయి” అనే ముక్క ఎంత అబద్ధమో, అయనది వక్రవాణి ఎందుకయిందో చూద్దాం..


హైదరాబాదు నగరంలో మతకలహాలు 1938 లోనే జరిగాయి. 1938 ఏప్రిల్ 5న మొదలైన మతకలహాలు ఏప్రిల్ 9 దాకా కొనసాగాయి. ముస్లిములు తలపెట్టిన ఒక ఊరేగింపుపై హిందూ ’లోథా’లు దాడి చేస్తారనే అనుమానంతో పదివేల మంది ముస్లిములు కత్తులతో సహా ఆ ఊరేగింపులో పాల్గొన్నారు. అనుకున్నట్టుగానే గొడవలు జరిగి నలుగురు చనిపోయారు. నాలుగైదు రోజుల పాటు ఏడెనిమిది ప్రాంతాల్లో గొడవలు జరిగాయి.

ఈ గొడవలు జరిగాయి సరే, దానికంటే దారుణమైనది.. ప్రజల మధ్య ఎంత హార్మొనీ ఉందో తెలియచెప్పే సంగతి ఒకటుంది.. ఆ గొడవల తరవాత పద్మజా నాయుడు గాంధీకి రాసిన ఒక ఉత్తరంలో ’..హిందూ ముస్లిము మేధావులలోని పరస్పర అపనమ్మకాన్ని, ఒకరిపై ఒకరికి ఏర్పడిన అనుమానాలనూ చూసి నేను దిమ్మెరపోయాను’ అని రాసింది.

From autocracy to integration: political developments in Hyderabad State (By Lucien D. Benichou) పుస్తకంలో ఈ సంగతులను చదవొచ్చు.

అసలు దీనికంటే ముందే – 1923 లోనే- హై.లో ఆర్యసమాజ్ ఏర్పడి, ముస్లిములను పునర్మతాంతరీకరణ చెయ్యబూనినపుడే హైదరాబాదు సంస్థానంలో మతకలహాలు జరిగాయి. ఇదిగో, ఈ వ్యాసం కూడా అదే ముక్క చెబుతోంది. హైదరాబాదు సంస్థానంలో గిరిజనులను, దళితులను ఇస్లాములోకి మార్చే ధ్యేయంతో బహదూర్ యార్ జంగ్ అనేవాడు ఒక సంస్థను స్థాపించాడు. అలా మారినవాళ్ళను తిరిగి హిందూమతంలోకి మార్చే లక్ష్యంతో ఆర్యసమాజ్ ఏర్పడింది. ఒక్క హైదరాబాదులోనే ఆర్యసమాజ్ కు 20 శాఖలుండేవట. ఇదంతా 1938 నాటి లెక్కలు.

ఓ మూడేళ్ళ కిందట ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసంలో వరవరరావు ఇలా రాసాడు: “..కాబట్టి మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు తాను స్వతంత్ర రాజ్యంగా హైదరాబాద్ సంస్థానాన్ని పాలించాలనో లేదా పాకిస్తాన్‌లో కలపాలనో అనుకున్నప్పుడు ఒక రజాకారు సేనను తయారు చేసుకోవాల్సి వచ్చింది. అది తయారుచేసి, మత విద్వేషాన్ని రెచ్చగొట్టి, దాడులు, హత్యలు, అత్యాచారాలు నిర్వహించిన వాడు కాశీం రజ్వీయే ఐనా అందుకు తన పోలీసులతో, పాలనతో ప్రోత్సాహించినవాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఆ బలమే లేకపోతే హైదరాబాద్ నగరంలో షోయబుల్లాఖాన్ వంటి ఉత్తమ సంపాదకుణ్ని బర్కత్‌పురాలో రజాకార్లు చంపగలిగేవాళ్లు కాదు“. రజాకార్లు మతవిద్వేషాలు రెచ్చగొట్టారనేది స్పష్టం. నిజాము వాళ్ళను పెంచి పోషించాడన్నదీ స్పష్టం. రజాకార్లు ఎప్పటివారు? ఈ ఆంధ్రప్రదేశు, ఆంధ్ర రాష్ట్రము, హైదరాబాదు రాష్ట్రమూ ఇవేవీ ఏర్పడటానికి ముందే.. మతం పేరిట ప్రజలను అణగదొక్కటానికి స్వయంగా పాలకుడి ప్రోద్బలంతో ఏర్పరచిన సేన అది. ఇప్పుడు పాతబస్తీలో ఉన్న మతతత్వ పార్టీల వారసత్వం ఎక్కడిది? – ఆ రజాకార్లదే! రజాకార్ పార్టీ అసలు పేరు మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్!

మతం పేరిట ప్రజలను అణగదొక్కటానికి స్వయంగా పాలకుడి ప్రోద్బలంతో సేన ఏర్పాటు, మెజారిటీ మతస్తుల మతమార్పిడి కోసం ఒక సంస్థ, వాళ్ళను తిరిగి వెనక్కి తెచ్చేందుకు మరో సంస్థ -మతసామరస్యం ఎంత గొప్పగా ఏడిచిందో చెప్పేందుకు ఇది చాలు. తె.వాదులు చూపిస్తున్న హార్మనీ అనే మేడిపండును విప్పిచూస్తే కనబడ్ద పురుగులివి!

———————————–

ఈ తె.వాద ప్రొఫెసర్లు బళ్ళలో ఏం పాఠాలు చెబుతున్నారో ఏమోగానీ టీవీల వేదికలెక్కి మాత్రం ఇలా అబద్ధాలను అల్లేస్తూ ప్రచారంలో పెడుతూ ఉంటారు. మతకలహాల పట్ల అబద్ధాలు గుప్పించబడిన ఈ చర్చలో కూడా ప్రొఫెసరుగారు ఘంట కొట్టినట్టుగా వక్రవాణి వినిపించారు. (పక్కనే ఉన్న కోడెల శివప్రసాదరావు ప్రొఫెసరుగారి వక్రవాణిని అడ్డుకోలేదు.) దేరీజె మెథడ్ ఇన్ హిస్ మ్యాడ్‍నెస్ అని అంటూంటారు. (మ్యాడ్‍నెస్సులో మెథడున్నా లేకున్నా మెదడు మాత్రం ఉండదనుకోండి.) ఈ వక్రవాది అబద్ధపు ప్రచారాల్లో కూడా మెథడేదో ఉన్నట్టుంది. 

టీవీ కెమెరాల ముందు చేరి లేనిపోని అబద్ధాలను వ్యాప్తి చేసే ఈ మేధావులు ఏ చరిత్రను చదువుకున్నారోగానీ, ప్రొఫెసర్లుగా బళ్ళో కుర్రాళ్ళకు కూడా ఇలాంటి అబద్ధపు చదువులే చెబుతున్నారేమో!

గత డిసెంబరులో విరజాజి బ్లాగులో ఇదే విషయమై ఒక చర్చ జరిగింది. ’అద్భుత మతసామరస్యానికి రాజధాని’ అయిన హైదరాబాదులో ఆంద్రోళ్ళొచ్చి మతకలహాలు రేపారు అంటూ ఒక వ్యాఖ్యాత వ్యాఖ్య రాస్తే, దానిపై జరిగిందా చర్చ.

Categories: తెలంగాణ

మే..ధావుల ’వర్గవివక్ష’

తెలంగాణ వాదులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చి, తమకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యమని డిమాండుతున్నారు. అంటే వేరు పడతామంటున్నారు. వేర్పాటువాదులన్నమాట! కానీ, ’దాన్ని ప్రత్యేకవాదమని అనాలిగానీ, వేర్పాటువాదమని అనకూడదు’ అని పాత్రికేయుడొకాయన చెబుతున్నారు. ఈ ముక్క గతంలో కొందరు రాజకీయులూ అన్నారు. సమాధానం చెప్పాల్సిన వాళ్ళు చెప్పారు. బ్లాగుల్లోనూ అన్నారు, అప్పుడూ తగు సమాధానాలే చెప్పారు. కాకపోతే ఇప్పుడు అంటున్నది, మేధావి వర్గానికి చెందిన పాత్రికేయుడు. ఏప్రిల్ 4, ఆదివారం నాడు హెచ్చెమ్ టీవీలో పాల్గొన్న పాత్రికేయులకు ‘వేర్పాటువాదం’ అనే మాట తప్పనిపించింది. ఆ మాటను దేశం నుండి విడిపోవాలని కోరితేనే అనాలంట. తెలంగాణ డిమాండును ఆ పేరుతో పిలిస్తే ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల్ని అవమానించినట్టేనంట!! ఈ ముక్కలన్నది ఎ.శ్రీనివాసరావు. 
 
ఓ పాత్రికేయ మేధావీ.. మీ తెలంగాణ పక్షపాతం చూపించుకోడానికి పదాల అర్థాలను కూడా మార్చేస్తారా? ఇదిగో, బ్రౌణ్యం ఏం చెబుతోందో చూడండి.. http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F%E0%B1%81&table=brown. వేర్పాటు అంటే ప్రత్యేకపడటమే! దేశం నుంచి విడిపోతారా, రాష్ట్రం నుంచి విడిపోతారా, తండ్రి ఆస్తిని విడగొట్టుకుంటారా,.. అనేవి ఆ పదానికి అనవసరం, దానికి వివక్షలేమీ లేవు. అంచేత, మీ తె.వాద పక్షపాతాన్ని చూపించుకోడానికి మరో పద్ధతిని – మరే పద్ధతినైనా – ఎంచుకోండి. భాషకు కొత్తర్థాలు చెప్పకండి.

’అన్నల్దమ్ముల్లాగా విడిపోదాం’ అనే మాట వినని ఆంధ్రుడున్నాడా ఇవ్వాళ?  ఇది తె.వాదుల ఊతపదం కాబట్టి, దాన్ని వాళ్ళు విచ్చలవిడిగా వాడతారు కాబట్టి ఇప్పుడే పుట్టిన పసిపిల్లాడు కూడా ఈ మాట బారిన పడకుండా తప్పించుకోలేడు. అన్నల్దమ్ములు విడిపోయి ఆస్తులు అప్పులూ పంచుకోడాన్ని ఏర్లు పడటం / వేర్లు పడటం / వేరు పడటం అనే అంటారు.వేరు పడటం అనే మాట తప్పేమీ కాదు, గౌరవహీనమైనదేమీ కాదు. కాకపోతే వేరుపడటం అనే పని ఏమంత ఉదాత్తమైనదేమీ కాదు, అంచేత ఆ మాట ఈ పాత్రికేయుడికి తప్పుగా అనిపించి ఉండొచ్చు.
 
ప్రత్యేకరాష్ట్రం కావాలని అడగడం వేర్పాటే. అలా అడిగేవాడు వేర్పాటువాదే! తె.వాదుల కోసం దాన్ని మార్చనక్కర్లేదు. ఈ మేధావులు తమ నూత్న తె.వాద మహా విజ్ఞానంతో టీవీ కెమెరాల ముందుకొచ్చి నిష్పాక్షికులమంటూ పోజు కొడుతూ అబద్ధాలు చెప్పుకుపోతూంటారు. మనకు జ్ఞానదానం చేసేద్దామని చూసేస్తుంటారు. పాత్రికేయుడు, ప్రొఫెసరు, ఆచార్యుడు,.. అంటూ తమకో ట్యాగు తగిలించుకు తిరుగుతూంటారు. వీళ్ళు చెప్పే అబద్ధాలు వింటూ, టీవీల లంగర్లు కొందరు పళ్ళికిలించి ఆహా ఓహో అని అంటూంటారు. 

ఈ కార్యక్రమంలో ఆ లంగరు ’అదేంటండీ ఆ మాట తప్పెలా అవుతుంది’ అని అడగలేదు. లంగరు పని వాళ్ళ చేత వాగించడం వరకేను, సొంత అభిప్రాయాలు చెప్పడం కాదు అని అంటారా.. అది నిజమే, లంగరు వాళ్ళ చేత వాగించాలిగానీ తాను వాళ్ళ అభిప్రాయాలను ఖండించడం లాంటివి చెయ్యకూడదు. మరి అదే లంగరు ఓ పక్కన తిరపతి నుండి ఒక ప్రొఫెసరు గారితో కూడా మాటలు కలిపాడు. మాటల్లో ఆయనేదో చెప్పబోగా, ఈయన కలిగించుకోని ఆయన అభిప్రాయాలను తోసిపుచ్చాడు. ఈ లంగరుకెందుకంత పక్షపాతం?
…………….
 
నిష్పాక్షిక విశ్లేషకులమని చెప్పుకుంటూ ’వక్రవాణి’ వినిపించే ప్రొఫెసర్లు మనకు కొంతమంది ఉన్నారు. వీళ్ళతో పోలిస్తే, ఈ పాత్రికేయ మేధావులు చాలా నయం. మీరు ఏ టైములోనైనా టీవీ పెట్టండి.. ఏదో ఒక చానల్లో మొహం గంటు పెట్టుకునో, ఎవడో ఒకణ్ణి తిడుతూనో కనిపిస్తారీ వక్రవాణులు. అసలు వీళ్ళు కాలేజీలకి పోయి పిల్లలకు పాఠాలెప్పుడు చెబుతారో అర్థం కాదు. ఇక్కడ మాత్రం లంగర్లకు, తోటి విశ్లేషకులకు క్లాసులు పీకుతూంటారు.

ఈమధ్య ఐన్యూస్ లో ఒక చర్చ చూసాను. లంగరు పేరు అంకం రవి. ప్రభాకరు అనే తెరాస నాయకుడు, చక్రపాణి అనే ప్రొఫెసరు 🙂 , ఈమధ్య కాలంలో ఉస్మానియా ఐకాసలో నాయకుడై ఆ తరవాత టీవీల్లో విశ్లేషకుడైన ఒక విద్యార్థి -ఈ ముగ్గురూ చర్చించేవారు.

తెరాస నాయకులు రాజీనామాలు చెయ్యగా ఏర్పడిన ఖాళీల్లోఆత్మహత్య చేసుకున్న కుర్రాళ్ళ కుటుంబీకుల్ని నిలబెట్టాలని ఆ కుర్రాడు (విద్యార్థి) అంటున్నాడు.  ప్రభాకరు, చక్రపాణీ కలిసి అతగాడి నోరు మూయిస్తున్నారు. ప్రభాకరు చాలా నయం.. నువ్వు అలా మాట్టాడ్డం తప్పు, ఇలా మాట్టాడ్డం తెలంగాణ ఉద్యమానికి చేటు అంటూ మాట్టాడుతున్నాడు. చక్రపాణి మాత్రం ఆ కుర్రాడి నోరు బలవంతానా నొక్కెయ్యాలనే చూసాడు (ఈయనలో తెలంగాణ పట్ల నిష్పాక్షికత ఎల్లప్పుడూ పొంగి పొర్లుతూ ఉంటుంది). ఇలాంటి వాళ్ళను ఇక్కడికి తీసుకొచ్చి చర్చలు పెట్టి తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు అంటూ లంగరు మీద ఆవేశపడి, ఆయాసపడి పోయాడు. ’ఇతణ్ణి మాట్టాడకుండా ఆపుతారా నన్ను వెళ్ళిపొమంటారా’ అని లంగరును బెదిరించాడు.

చక్రపాణి, ప్రభాకరు ఆ కుర్రాణ్ణి నానామాటలూ అన్నారు. మరో విద్యార్థి నాయకుడు ఫోనులో చెప్పిన మాటలను పట్టుకుని, నువ్వసలు ఉద్యమంలో పాల్గొననేలేదు, నువ్వు సమైక్యవాదుల తొత్తువు అనే అర్థం వచ్చేలా చిన్నబుచ్చబోయారు. ఇవన్నీ నేరుగా అతణ్ణి అనలేదు, తెలివిగా ఆ ఆర్థం వచ్చేలా మాట్టాడారు. నువ్వసలు తెలంగాణ వాడివే కాదు, ఖమ్మం జిల్లా సరిహద్దుకు చెందిన కృష్ణా జిల్లా వాడివి అనీ అన్నారు.

పాపం అతడు సమాధానం చెప్పుకోబోతే మధ్యలోనే అడ్డుపడి నోరు మూయించారు. నేను ఉద్యమంలో పాల్గొని జైలుకు పోయాను, చంద్రబాబు ఇంటిదగ్గర ధర్నా చేసి అరెస్టయ్యాను. అంటూ తన ఉద్యమ నేపథ్యాన్ని చెప్పుకోబోతే చక్రపాణి అరిచేసి నోరు మూయించాడు. ఏంమాట్టాడుతున్నావు నువ్వు అంటూ ఆ కుర్రాణ్ణి బెదిరించబోయాడు. ఆ కుర్రాడు చక్రపాణిని ఎదిరించేందుకు ప్రయత్నించాడు. అయితే చక్రపాణికి దీటుగా రౌడీతనం చెయ్యలేకపోయాడు పాపం! అంకం రవి ప్రేక్షకుడే అయ్యాడు.  ఇదే చక్రపాణి గతంలో ఒక కోస్తా ప్రాంతపు విద్యార్థిపై కూడా జులుం చేసాడు. అప్పుడు నే రాసిన టపా చూడండి.

ఇదే చక్రపాణి, నెల్లూరులో హెచ్చెమ్ టీవీ వాళ్ళ దశ దిశ కార్యక్రమంలో కూడా ఇలాంటి ‘నిష్పాక్షిక‘ వ్యాఖ్యలే చేసాడు.. తెలంగాణ రాజకీయ నాయకులు విద్యార్థులను రెచ్చగొట్టి ఉద్యమాలు చేయిస్తున్నారు అని వచ్చిన ఆరోపణను ప్రస్తావిస్తూ… ’ఎవరో రెచ్చగొట్టినంత మాత్రాన ప్రజా ఉద్యమాలు రావు. ప్రజల్లో సహజంగా ఉప్పొంగిన చైతన్యమే తెలంగాణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది.’ అని చెప్పుకుపోయాడు. కానీ, అదే లెక్క కోస్తా సీమల్లో వచ్చిన ఉద్యమానికి వర్తింపజేయడాయన. కోస్తా సీమల ఉద్యమం, కేవలం నాయకులు చేస్తున్నదేగానీ ప్రజల్లోంచి వచ్చినది కాదని టీవీల్లో చెబుతూంటాడిదే వ్యక్తి!

నిష్పాక్షిక విశ్లేషకులమని చెప్పుకుంటూ, టీవీల ముందు దొంగ కబుర్లు చెబుతూ, వక్రవాణి వినిపించే నిష్పాక్షికుల నోరు మూయించే రోజు ఎప్పుడొస్తుందో! ఈ మే..ధావుల వర్గవివక్ష నుండి సామాన్యులకు ఎప్పటికి విముక్తి కలుగుతుందో!!

శ్రీకృష్ణ కమిటీ – సరైన మధ్యవర్తి!

February 15, 2010 7 comments

రెండు పక్షాల వారు తమలో తాము సంప్రదింపులు చేసుకుని ఒక అంగీకారానికి వచ్చే అవకాశం కోల్పోయిన ప్రస్తుత పరిస్థితిలో మూడో పార్టీ రంగ ప్రవేశం చేసి మధ్యవర్తిత్వానికి శ్రీకృష్ణ కమిటీని సిద్ధం చేసింది. ’ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమస్యపై సమాజంలోని వివిధ పార్టీలు, వర్గాలతో విస్తృత స్థాయి చర్చలు జరిపేందుకు గాను’ ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దాని పనులేమేంటో కూడా తేల్చింది. కమిటీ విధుల జాబితా మూడు భాగాలుగా ఉంది..

 1. విధులు: కమిటీ ఏమేం పనులు చెయ్యాలి అనేది మొదటి భాగం. ఇందులో నాలుగు పాయింట్లున్నాయి
  • రెండు ఉద్యమాల నేపథ్యంలో ప్రస్తుత రాష్ట్ర పరిస్థితిని మదింపు వెయ్యడం
  • ఆంధ్రప్రదేశ్ అవతరణ నుండి ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు, వివిధ ప్రాంతాల అభివృద్ధిపై ఆ పరిణామాల ప్రభావాన్ని పరిశీలించడం
  • రాష్ట్రంలోని ప్రస్తుత పరిణామాలు సమాజంలోని వివిధ వర్గాలపై ఏవిధమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనే విషయాన్ని పరిశీలించడం
  • పై మూడు అంశాలను పరిశీలించడంలో తప్పనిసరిగా దృష్టిపెట్టాల్సిన కీలకమైన అంశాలను గుర్తించడం
 2. విధానాలు: పై మూడు పనులను ఎలా చెయ్యాలి అనేది ఈ భాగంలో చెప్పారు. ఇందులో రెండు పాయింట్లున్నాయి
  • పై అంశాలపై సమాజంలోని రాజకీయపార్టీల అభిప్రాయాలను తీసుకోవడం, పరిష్కారమార్గాలను వెతకడం, వాటి ప్రకారం ఒక కార్యాచరణ ప్రణాళికను తయారుచెయ్యడం
  • పై అంశాల విషయంలో సమాజంలోని అన్నివర్గాల ప్రజల, సంస్థల అభిప్రాయాలను సేకరించడం. (ఈ పనిలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి అనే అంశానికి ప్రాధాన్యతనివ్వాలి అనేది గమనించాల్సిన సంగతి)
 3. ఇక మూడోదానిలో ఒకటే పాయింటు.. పై పరిశీలనలను బట్టి, కమిటీ తన అభిప్రాయాలను, సలహాలు, సిఫార్సులను ఇవ్వాలి.

డిసెంబరు 9 నాటి ప్రకటనలో కొంత సందిగ్ధత ఉన్నప్పటికీ, అది తెలంగాణ ఏర్పాటుకు సానుకూలమైన ప్రకటన అనేది నిజం. కానీ తరవాత 23 న చేసిన ప్రకటనతో కేంద్రం ఒకడుగు వెనక్కు వేసింది. ఫిబ్రవరి 2 న తెలంగాణ మాట ఎత్తకుండా, రాష్ట్ర భవిష్యత్తు విషయమై విస్తృతస్థాయి చర్చల కోసం కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ఇంకాస్త వెనక్కు పోయింది. ఇప్పుడు కమిటీ విధివిధానాలను బైటపెట్టాక, పూర్తిగా వెనక్కు పోయి, 2009, డిసెంబరు 9 ప్రకటన ముందు ఉన్న పరిస్థితికి చేరుకుంది. ఆనాడు తనకు తానే వేసుకున్న సంకెళ్ళను విజయవంతంగా తొలగించుకుంది. ఇప్పుడు ఈ కమిటీ నివేదిక వచ్చాక, ఏ నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ వచ్చేసింది కేంద్రానికి. 

………………………………………

అనుకున్నట్టుగానే ఉంది తె.వాదుల స్పందన. తెలంగాణ ఎలా ఏర్పాటు చెయ్యాలి అనే సంగతిని నిశ్చయించేందుకు కమిటీ వెయ్యాలిగానీ, తె.వాదాన్ని, సమైక్యవాదాన్నీ పరిశీలించేందుకు, విస్తృత సంప్రదింపుల కోసమూ వెయ్యడమేంటని అడుగుతున్నారు వారు. దిక్కుమాలిన కమిటీ అన్నారు, పదినెలలు ఇక్కడేం జేస్తది, గడ్డి పీకుద్దా అని అడిగారు.  రాజీనామాలు చెయ్యబోతున్నారు. ఇప్పుడు వాళ్ళముందున్న లక్ష్యం ఒక్కటే -శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను మార్పించడం, లేదా దాన్ని నిర్వీర్యపరచడం. దానికోసం మళ్ళీ ఉద్యమిస్తారు. వాళ్ళలో కొందరు దుస్సాహసాలు చేసే అవకాశమూ లేకపోలేదు.

తె.వాదులతో సమస్య ఒకటుంది.. అది –“రాష్ట్రాన్ని చీల్చడం, తెలంగాణ ఏర్పాటు చెయ్యడం అనేది నిశ్చయమైపోయిన సంగతి, అది చర్చనీయాంశం కాదు. ఇప్పుడు ఆలోచించాల్సింది..  విభజన ఎలా జరగాలనేదే” అనే భావన! అందుకే కమిటీ పనులజాబితా చూడగానే అడ్డగోలుగా మాట్టాడుతున్నారు.  అసలు రాష్ట్రాన్ని చీల్చడమనేది తమకు మాత్రమే సంబంధించిన సంగతని వీళ్ళు ఎలా అనుకుంటారో అర్థం కాదు. తెలంగాణ  ఇచ్చెయ్యమనే డిమాండంటే తెలంగాణను విడదీయడం కాదు, కోస్తా సీమలను పొమ్మనడం అనేది వీళ్ళు గుర్తించరు. ఈ సమస్య పరిష్కారంలో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల వాళ్ళకు కూడా భాగముందనే సంగతిని పట్టించుకోరు వీళ్ళు.  ఆయా ప్రాంతాలవాళ్ళ అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న ఇంగితం వీళ్ళకు లేదు. పైగా ఆ వివేకం చూపినవాళ్ళను బండబూతులు తిడతారు.

తె.వాదులతో ఇంకో సమస్యుంది.. ’కమిటీ పనుల జాబితా డిసెంబరు 9 నాటి నిర్ణయానికి అనుగుణంగానే జరగాలి, కానీ ఇప్పుడు ప్రకటించిన జాబితా అలా లేదు’ అని వాదిస్తున్నారు. డిసెంబరు 9 న ప్రకటన చేసిన ఆ కేంద్రమే 23 న మరో ప్రకటన చేసిందన్న సంగతిని వీళ్ళు మర్చిపోతారు.

అన్నిటినీ మించి, తె.వాదులకు అసలు సమస్య ఒకటుంది -జాబితా లోని రెండో పాయింటుతో వచ్చిన సమస్య అది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిని పరిశీలించాలని ఆ అంశం చెబుతోంది.  కమిటీ పనిలోకి దిగి, వివిధ ప్రాంతాల్లో అభివృద్ధిని పరిశిలించడం మొదలెడితే అసలు కథంతా బైటికొస్తది. చిదంబరాలకు, సోనియాలకు, ఢిల్లీలో కూచ్చున్న ఇతర సూత్రధారులకు, సత్రకాయలకూ అసలు సంగతులు, అధికారికంగా , తెలిసిపోతాయ్. ఎంచేతంటే, అంకెలు అబద్ధాలు చెప్పవు, మనుషుల్లాగా. ఎంపీ కావడానికి ముందో మాట, తరవాతో మాటా, మంత్రి కావడానికి ముందో మాట, అయ్యాకింకో మాటా.. ఇలా ఉండదు గదా అంకెల్తో వ్యవహారం.   దీనికితోడు,  ఆత్మగౌరవం, స్వపరిపాలన  అంటూ సాగిపోయే తె.వాదుల సోదివాదనలు కమిటీ ముందు సాగవు. ఇన్నాళ్ళూ వెనకబడ్డాం వెనకబడ్డాం అంటూ వేస్తున్న దొంగ నాటకాలు కమిటీ ముందు చెల్లవు! 

వాళ్ళకు ఈ సమస్యలున్నాయిగానీ,  ‘ఒక మధ్యవర్తి ముందు  మన తెలంగాణ కష్టాలను సరిగ్గా ఎందుకు చెప్పలేకపోయారు, ఇన్నాళ్ళూ మీరు మాకు చెబుతున్నదేగా ‘ అని తెలంగాణ సామాన్యులు అడుగుతారనే భయం లేదు వీళ్ళకి. ఎందుకంటే, వీళ్ళ దగ్గర  ఒక సమాధానం తయారుగా ఉంటది.. ‘ఆంద్రోళ్ళందరూ కలిసి కమిటీని సభ్యులకు పైరవీలు చేసి, తమకు కావలసినట్టు నివేదిక ఇప్పించుకుని తెలంగాణ రాకుండా చేసారు’ అని చెప్పేస్తారు. ఇప్పుడు చెప్పటంలా.. ‘సమైక్యవాదుల కుట్ర వల్లే ఈ కమిటీ ఏర్పడింది, వాళ్ళే  కమిటీ విధివిధానాలను తయారుచేసారు’ అంటూ? (అసలీ విధివిధానాలను తయారుచేసింది కావూరి సాంబశివరావని చెప్పాడొహ జోకరు! )

తమ సోమరితనాన్ని, తమ చవటాయిత్వాన్ని, తమ స్వార్థాన్ని, తమ నిష్క్రియత్వాన్నీ ‘ఆంద్రోళ్ళ’ చాటున దాచిపెట్టడం తెలంగాణ రాజకీయ నాయకులకు అలవాటైపోయింది. తామూ, తమ సహచరులూ శాసనసభ్యులై, మంత్రులై, ముఖ్యమంత్రులై , అధికారోన్మత్తులై సకల భోగాలూ అనుభవిస్తూ, చెయ్యాల్సిన పనులు చెయ్యకుండా.. ఆ పనులు కాకపోవడానికి కారణం ‘ఆంద్రోళ్ళే’ అని తర్జని చూపిస్తారు. రేపు ఈ కమిటీ నివేదికలో ఏమాత్రం తేడా జరిగినా వాళ్ళు ఇదే పాట పాడతారు.

—————————

ఏదేమైనా ఒక్కటి మాత్రం నిజం.. కమిటీ పనులను నిశ్చయించడంలో కేంద్రం నిష్పక్షపాతంగా వ్యవహరించింది. నిష్పక్షపాతులం, తటస్థులం అని చెప్పుకుంటూ తె.వాదపు కొమ్ముకాస్తూ, మాయలమారి వంకరమాటలు మాట్టాడే వక్రవాదుల కంటే, నిష్పాక్షికంగా వార్తలనందించడం మానేసి తె.వాదాన్ని వినిపించడంలో తలమునకలుగా ఉన్న టీవీ చానెళ్ళూ పత్రికల కంటే – కేంద్రం చాలా చాలా నయం. రెండు వర్గాలు తగువులాడుకుంటున్నపుడు ఒక మధ్యవర్తి ఏమేం పనులు చెయ్యాలని భావిస్తామో ఆ పనులనే కమిటీకి అప్పగించింది.

రెండు వాదాలకూ సమానమైన అవకాశాలను కల్పించింది కేంద్రం! ఇన్నాళ్ళూ కోస్తా, సీమల వాసలు తమ వాదాన్ని ఎక్కడా సరిగ్గా వినిపించిన జాడలేదు. నిజానికి వాళ్ళకు ఆ అవకాశాలు రాలేదు. టీవీలు, పత్రికలు అన్నీ కూడా తె.వాదంలో మునకలేస్తున్నాయి. ఇప్పుడు ఈ కమిటీ రూపంలో తమ గొంతు వినిపించే అవకాశం సమైక్యవాదులకూ వచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని నిజాల్ని కమిటీ ద్వారా దేశప్రజలకు తెలియజెప్పాలి. ఆ సమయం వచ్చింది.

తె.వాద విశ్లేషకుల దొంగ నిష్పాక్షికత గురించి నా గత టపాల్లో కొంత రాసాను. ఇప్పుడు ఇంకో సంగతి.. ఇది రాజకీయ విశ్లేషకుడు ఘంటా చక్రపాణి గారి ’నిష్పాక్షిక ద్వంద్వ నీతి’ గురించిన ఒక ఘటన. హెచ్చెమ్‍టీవీ వాళ్ళు నెల్లూరులో జరిపిన దశ-దిశ కార్యక్రమంలో ఆయనో గొప్ప నిష్పాక్షిక వ్యాఖ్య చేసాడు. తెలంగాణ ఉద్యమం గురించి మాట్టాడుతూ… ’ఎవరో రెచ్చగొట్టినంత మాత్రాన ప్రజా ఉద్యమాలు రావు. ప్రజల్లో సహజంగా ఉప్పొంగిన చైతన్యమే తెలంగాణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది.’ అని తెలంగాణ ఉద్యమాన్ని ఘనంగా కీర్తించాడు. సరే, బానే ఉంది, తమను తాము కీర్తించుకోవచ్చు. అది నిజమేనని కూడా అనుకుందాం. మరి, కోస్తా, సీమల్లో వచ్చిన ఉద్యమం గురించి చెప్పే సమయాన అదే నాలుక ఎన్నెన్ని వంకర్లు తిరిగిందో మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ’కోస్తా సీమల్లో జరుగుతున్న ఉద్యమం కేవలం నాయకులు చేస్తున్నదేగానీ ప్రజల్లోంచి వచ్చినది కాదు’ అంటూ ఆయన నిష్పాక్షిక తెలంగాణవాద టీవీల్లో చెబుతూండగా విన్నాం. వీరి ఉద్యమమేమో సహజ చైతన్యం కారణంగా వచ్చినదంట, వారిది నాయకులు రెచ్చగొడితే వచ్చినదంట! ఇదీ చక్రపాణి గారి వక్రవాణి! 
అన్నట్టు, ఈయన అదేదో యూనివర్సిటీలో ప్రొఫెసరంట! ఈ బాపతు మేతావులు  రేపు శ్రీకృష్ణ కమిటీ ముందు  కూడా ఇలాటి వంకరమాటల్నే వినిపించబోతారు! కోస్తా సీమల ప్రొఫెసర్లూ..  మీరేమీ వీళ్ళలాగా వంకరమాటలు చెప్పనక్కర్లేదు. ఉన్నదున్నట్టు చెప్పేస్తే చాలు, వీళ్ళ బండారాలు కమిటీ ముందు బైటపడడానికి.

Categories: తెలంగాణ

హెచ్చెమ్ టీవీ వరంగల్లు సమావేశం

January 25, 2010 3 comments

రాష్ట్ర విభజనపై హెచ్చెమ్ టీవీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశాల్లో తరువాతిది వరంగల్లులో జనవరి 24, ఆదివారంనాడు జరిగింది. సమావేశం బాగా జరిగింది. కొందరు మాట్టాడుతున్నపుడు గోల జరిగిందిగానీ, పెద్దలు శాంతపరచడంతో వెంటనే సద్దుమణిగింది. మిగతా సమావేశాల్లో లాగానే, ఇక్కడ కూడా సరుకున్న ప్రసంగాలు కొన్నే! ఎక్కువ ప్రసంగాలు బాగా నలిగిన పాత సంగతులే చెప్పగా, కొద్ది మంది చేసిన ప్రసంగాలు ఉత్త ఊకదంపుడే!

సహజంగానే అందరూ తెలంగాణకు అనుకూలంగా మాట్టాడారు. ఒకటి రెండు ఆశ్చర్యపరచే ప్రసంగాలు, ఒక అదరగొట్టే ప్రసంగం చూసాను. కొన్ని అనుచితమైన నిందలు కూడా వినబడ్డాయి. కొన్ని ముఖ్యమైన ప్రసంగాలు:

ముందుగా కోస్తా ప్రాంతం నుండి వచ్చిన  ఎమ్.సి.దాస్, (విజిటింగ్ ప్రొఫెసరు, కృష్ణా యూనివర్సిటీ) మాట్టాడాడు. ఆయన చరిత్ర గురించి మాట్టాడాడు. తెలంగాణ సాయుధ పోరాటం నిజాము వ్యతిరేకంగా మాత్రమే కాదు, జాతి ఏకీకరణ కోసం కూడానని ఆయన చెప్పినపుడు సభ్యులు గోల చేసి ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. రామచంద్రమూర్తి జోక్యం చేసుకుని శాంతపరచేందుకు ప్రయత్నం చేసాడు. తిరుపతిలో ప్రకాష్ గారిని, విశాఖలో హరగోపాలును, విజయవాడలో వేణుగోపాలును అడ్డుకోలేదు. ఇక్కడ మనం అడ్డుకుంటే, ఆయా ప్రాంతాల ప్రజలు మన గురించి ఏమనుకుంటారు? అని అడిగాడు.

హరగోపాల్ కూడా జోక్యం చేసుకుని, అల్లరి చేసి, ఆయన్ను మాట్టాడనివ్వకపోతే, తెలంగాణ ఆలస్యమౌతుందేమోగానీ తొందరగానైతే రాదు. ఆయన మటలు విని ఆయన చెప్పేదానిలో తప్పులేమైనా ఉంటే చెబుదాం. ఇలా అడ్డుకోడం మన సంస్కారం కాదు. అని చెప్పాడు.

ప్రసంగాన్ని తిరిగి కొనసాగించాక..ఆయన చెప్పిన ప్రతిపాదనలివి:

 1. ఈ రాష్ట్రానికి ఒక కొత్త రూపాన్నిచ్చి పేరు మార్చి, తెలుగునాడు అని మారుద్దాం. మూడు ప్రాంతాలకూ ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళు ఏర్పాటు చేసుకుందాం. వనరులను ఒక నిష్పత్తిలో పంచుకుందాం. రాజకీయాధికారాన్ని నిష్పత్తిలో పంచుకుందాం ఈ అంశాల అమలును ఏటా సమీక్షించుకుందాం
 2. ఒక నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి, అన్ని ప్రాంతాల అభివృద్ధినీ విశ్లేషించడం.
 3. ఇన్నాళ్ళు కలిసున్నాం. ఇంకొక్క ఏడు ఇలాగే ఉండి, ఆలోచించుకుని, అప్పుడు ఏం చెయ్యాలో నిర్ణయించుకుందాం.
 4. ఉద్యమాలను ఆపేదాం. అంతర ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేసుకుని సమీక్షించుకుందాం.

తెలుగు ప్రజల ఐక్యత వర్ధిల్లాలి అనే నినాదంతో తన ప్రసంగాన్ని ముగించాడు.

టి. పురుషోత్తమరావు – లోతట్టు ప్రాంతాల అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు. ఈ కాంగ్రెసు నాయకుడు ఈమధ్య ఎందుకో ఎక్కడా వినబడ్డంలేదు, కనబడ్డంలేదు. ఆయన చెప్పినదిది:

“తెలంగాణ ఉద్యమం, అసాధారణమైన అపూర్వమైన ఉద్యమం. పార్టీ రహిత, ప్రజాస్వామిక ఉద్యమం. అహింసాయుత ఉద్యమం. జాతి సమగ్రత కొరకు, జాతి ఐక్యతను కాపాడేందుకు, చిన్న రాష్ట్రాలు కావాలి, తెలంగాణ కావాలి. ఈ సమస్యకు ప్రత్యేక తెలంగాణ తప్ప మరో పరిష్కారం లేదు. “

రాయలసీమ నాయకుడు ఎమ్,వి రమణారెడ్డి అంత బలంగా తెలంగాణ అనుకూల వాదన వినిపించిన తెలంగాణేతర నాయకుణ్ణి నేను చూళ్ళేదు. నిజానికాయనది కోస్తా వ్యతిరేక వాదన! నా శత్రువు శత్రువు నాకు మిత్రుడే అనేది ఆయన వాదనా ధోరణి. కోస్తా ప్రాంత వాసులపై -ముఖ్యంగా కృష్ణా జిల్లా వాసులపై – ఈయనకు ఉన్న వ్యతిరేకత (ద్వేషమనొచ్చు) ఆయన ప్రసంగంలో మారుమోగింది. ఆయన అలా మాట్టాడుతూంటే సదస్యులకు బాగా నచ్చింది. ఓ సమయంలో ఇక సమయం ఐపోయిందని రామచంద్రమూర్తి చెప్పినపుడు, కాదు మాట్టాడనివ్వాల్సిందేనని సదస్యులు గోల చెయ్యగా పొడిగించారు. ఆయన మాట్టాడిందిది:

“ఆంధ్రా యూనివర్సిటీని ఎక్కడ పెట్టాలి అనే చర్చ జరిగినపుడు విశాఖలోనని, విజయవాడలోననీ తగదా పడినపుడు, రాయలసీమ వాళ్ళు ఈ గొడవంతా ఎందుకు, మా ప్రాంతంలో పెట్టొచ్చుగదా అని అడిగారు. వెంటనే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా వాళ్ళంతా కలిసిపోయారు. అది చూసిన సీమ నాయకులకు, ‘కోస్తా వాళ్లతో కలిసి బతగ్గలమా అనే అనుమానం కలిగింది.’ రాజధాని ఎక్కడుండాలి అనే విషయమై, సిద్ధేశ్వరం ప్రాజెక్టు విషయంలోనూ కోస్తా నాయకులు సీమకు అన్యాయం చేసారు”.

“పెద్దమనుషుల ఒప్పందాన్ని కూడా కోస్తా నాయకులు ఉల్లంఘించారు. తమ పని కావడం కోసం కోస్తావాసులు దేనికైనా ఒప్పుకుంటారు. శ్రీబాగ్ ఒడంబడికలో రాయలసీమ అవసరాలు తీరాకే కోస్తాకు నీళ్ళని చెప్పారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. “

ఈయన మాట్టాడినదానిలో అనుచితమైన విషయాల గురించి చూస్తే..
“అసలు సదస్సు విజయవాడలోనే ఎందుకు జరిగిందంటే.. విజయవాడ కోస్తాకే నడిబొడ్డు కాదు, రాష్ట్రానికే కాదు యావత్ ప్రపంచానికే నడిబొడ్డని అంటారు వాళ్ళు. అసలు ప్రజల మధ్య విభేదాలకు కేవలం కృష్ణా జిల్లావాళ్ళ ప్రవర్తనే కారణం. ఇంకోటి చూడండి.. సీమాంధ్ర అని అంటారు. అంటే సీమవాసులు , ఆంధ్రులూ అని వాళ్ళ అర్థం. వాళ్ళు మాత్రమే ఆంధ్రులని, మేము సీమవాసులని కృష్ణాజిల్లా వాళ్ళ ఉద్దేశం.  కేవలం ఇటు గుంటూరు వాళ్ళను, అటు గోదావరి జిల్లాల వాళ్లను మాత్రమే ఆంధ్రులని వాళ్ళు భావిస్తారు. మిగతా వాళ్ళెవరూ ఆంధ్రులు కాదు వాళ్ళ లెక్కలో.”

చుక్కా రామయ్య: ఈయనది ముఖ్యంగా ఐఐటీ గొడవ! “ఒప్పందాల ఉల్లంఘన జరిగినపుడే, తెలంగాణవారికి అన్యాయం జరిగినప్పుడే సమైక్యంధ్ర ఉద్యమాన్ని తీసుకు వచ్చి ఉంటే నేను సమర్ధించేవాణ్ణి. ”

“ఐఐటీని హైదరాబాదుకు తెచ్చి పెట్టారు. అదేమంటే అది రాష్ట్రమంతటిదీ అన్నారు. మరి వైద్య విశ్వవిద్యాలయం ఎక్కడపెట్టారు? విజయవాడలో! అది హైదరాబాదులో పెట్టనక్కరలేదా? కడపలో 400 కోట్లు పెట్టారు. నల్లగొండలో కేవలం 1.5 కోట్లు పెట్టారు.”

“మా పోరాటం ఆంధ్ర ప్రజల్తో కాదు ఆంధ్ర ప్రదేశ్‌తో అని చెబుతున్నాను. విశాలాంధ్ర స్ఫూర్తి పోయింది. ఇంకా కలిసుందామని అంటే అది మోసం చెయ్యడం తప్ప మరోటి కాదు.”

కత్తి పద్మారావు ఘాటుగా మాట్టాడాడు. ఆయన వాదన పూర్తిగా దళిత వర్గాల తరపున సాగింది. సామాజిక తెలంగాణ, సామాజిక ఆంధ్ర కావాలి అనేది ఆయన వాదన.  కారంచేడులో దళితులపై కమ్మవారు (కులం పేరు ఆయన చెప్పాడు) చేసిన దాడిని ఉటంకించాడు. భూమిపై ఆధిపత్యం కోసం ఆ దాడి జరిగిందని ఆయన వాదన. పనిలోపనిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరిల మీద విసుర్లు వేసాడు. ఆ దాడికీ వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధాన్ని సూటిగా చెప్పకున్నా తెలిసేట్టుగానే చెప్పాడు. ఆయన చెప్పిన కొన్ని మాటలు:

“ఏలూరు ఎంపీ తెలంగాణను ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? హైదరాబాదులో ఆయనకు పెట్టుబడులున్నాయి. జలయజ్ఞంలో ఆయనకు కాంట్రాక్టులున్నాయి. వ్యక్తుల గురించి చెప్పదం నా ఉద్దేశం కాదు, వాళ్ళు ఒక వ్యవస్థకు ప్రతీక.”

“ప్రాజెక్టుల కారణంగా, కోస్తాలో 48 లక్షల ఆయకట్టుకు నీళ్ళొచ్చాయి. 30 వేల ఎకరాలకు మాత్రమే దళితులకు ఉంది. అంచేత ప్రత్యేకాంధ్ర కావాలని కోరుతున్నాం.”

“తెలంగాణలో మీకు జీవించే హక్కు ఉంది. ఇక్కడ సభ పెట్టగలిగారు. మాకా అవకాశం లేదు. మా మాలలు, మా మాదిగలు, మా బెస్తలు, మా యాదవులు, మా దళితులు,.. మాకెవరికైన భూములున్నాయండి? మేము ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నడపలేము. మీరు మా వద్దకొచ్చి, మాకు మద్దతిచ్చి ఉద్యమం నడపాలని కోరుతున్నాం.”

“హైదరాబాదు మీకే ఇవ్వాలి, అది న్యాయం. దాన్నీ మీకే ఇచ్చేస్తున్నాం. అది మీరే తీసుకోండి. అయితే మాకు ముఖ్యపట్నం  కావాలి, అది కట్టుకునేదాకా, ఓ పది సంవత్సరాలపాటు మమ్మల్ని ఇక్కడ ఉండనివ్వాలి.” ఈమాట చెప్పగానే జనం గోల మొదలెట్టారు. దాంతో దాన్ని రెండు మూడేళ్ళుగా మార్చాడు.

“మేము ప్రత్యేక తెలంగాణ కోరుతున్నాం. కానీ ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రిని చెయ్యమని అడుగుతున్నాం. ఆంధ్ర ప్రదేశ్ విడిపోయాక, అక్కడా ఇక్కడా కూడా దళిత ముఖ్యమంత్రినే పెట్టుకుందాం. ఏఁ, కడియం శ్రీహరి ముఖ్యమంత్రిగా పనికిరాడా?”, అని అన్నాడు. ఆమధ్య కంచె అయిలయ్య ఈ కుల ప్రసక్తి తెచ్చినపుడు, మంద కృష్ణను ముఖ్యమంత్రిగా చెయ్యాలి అని గట్టిగా వినిపించాడు. అలాగే కడియం శ్రీహరి గురించి కూడా అన్నాడు. కత్తి మాత్రం మంద కృష్ణ మాదిగను తలవలేదు.

ప్రొఫెసరు సీతారామ్ నాయక్: ఈయన గిరిజనుల గురించి ప్రధానంగా మాట్టాడాడు. తెలంగాణ ఏర్పడితేనే తమకు న్యాయం జరుగుతుందని ఇక్కడి గిరిజనులు అనుకుంటున్నారు. తెలంగాణలో 14 % గిరిజనులున్నారు. ఆంధ్రలో 3% ఉన్నారు. ఉన్న 6% రిజర్వేషన్లలో అధికభాగం ఆంధ్ర వాళ్ళకే పోతున్నాయి. మా పిల్లలకు 3500 ర్యాంకు వచ్చినా మాకు మెడిసిన్ సీటు రాదు, కానీ అక్కడ 10500 వచ్చినవాడికి కూడా రాదు. దీనిమీద చర్చకు నేను సిద్ధం. నిరూపించలేకపోతే నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తాను. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే మాకు సామాజిక న్యాయం జరుగుతుందని మా భావన. ఇప్పుడు కలిసుండే పరిస్థితి లేదు. తెలంగాణ ఒక్కటే పరిష్కారం.

చందా లింగయ్య ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు: ప్రత్యేక గిరిజన రాష్ట్రం కావాలంటూ కోరి, ఈయన కొంత కలకలం రేపాడు. ఆదివాసీల గురించి మాట్టాడాడు. “1/70 చట్టం ద్వారా ఆదివాసీల ప్రాంతంలోని అన్ని స్థిర చరాస్తులన్నీ ఆదివాసీలకే చెందుతాయని ప్రభుత్వం చెప్పింది. కానీ ప్రభుత్వాలేవీ చట్టాలను అమలు చెయ్యలేదు. ఆదివాసీల ఆస్తులను, వనరులను తరలించి వలసవాదులు దోపిడీ చేసారు. అక్కడి ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు చేసిందేమీ లేదు.”

“ఎప్పుడైతే ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందో, వాళ్ల హక్కులు హరింపబదతాయో, అప్పుడు ప్రత్యేక రాష్త్రం ఏర్పాటు చేసుకోవచ్చని రాజ్యాంగం 6 వ అధికరణంలో చెప్పింది. తెలంగాణలో మేమూ భాగమే. తెలంగాణయే కాదు, అన్ని ప్రాంతాల్లోనూ ఆదివాసీలున్నారు. ఆదివాసీల సంక్షేమం, హక్కులను గుర్తించాలి. మీకు రాష్ట్రం కావాలంటే తెచ్చుకోండి. కానీ మా హక్కులను గుర్తించండి. ముందు మా సంగతేందో తేల్చండి. మమ్ములను విస్మరిస్తే ప్రత్యేక రాష్ట్రం కావాలని మేమూ డిమాండు చేస్తాం. మా ఆదివాసీలకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, అందుకు డిమాండు చేస్తాం. ”  ఈమాట చెప్పగానే పెద్ద గోల రేగింది. ఆ గోల మధ్యనే ఆయన ప్రసంగం ముగించి కూచ్చున్నాడు.

తరవాత రేవూరి ప్రకాష్‌రెడ్డి మాట్టాడబోగా, మంద కృష్ణ మాదిగను మాట్టాడనివ్వమని సదస్యులు గోల చేసారు. ప్రకాష్‌రెడ్డి మాట్టాడిన తరవాత ఆయన మాట్టాడతాడని కె రామచంద్రమూర్తి ప్రకటించాడు. అయినా గోల ఆపకపోయేసరికి, వాళ్ళను సమాధానపర్చమని  ఆయన మంద కృష్ణనే అడిగాడు. ఈలోగా రేవూరి తన ప్రసంగాన్ని స్వచ్ఛందంగా ఆపేసాడు. అప్పుడు మంద కృష్ణను మాట్టాడమని చెప్పాడు.

మంద కృష్ణ మాదిగ కులప్రస్తావనను తీసుకొచ్చాడు. తెలంగాణ ఏర్పడితే ముఖ్యమంత్రి కంటే తక్కువ పదవిని ఆశిస్తున్నటు లేదాయన. “ఇక్కడ వేదికపై కూర్చోపెట్టినవాళ్లను ఎందుకు పిలిచారో, ఏ ప్రాతిపదికతో పిలిచారో నాకు తెలవదు. వేదికపై కేవలం రెండు సామాజిక వర్గాల వాళ్లు మాత్రమే ఉన్నారు” -బ్రాహ్మలతోపాటు ఇంకోటి కూడ ఏదో చెప్పాడు. కానీ ఆ పేరు నాకు అర్థం కాలేదు. “ఇకముందు పెట్టే సభల్లో అన్ని కులాలకు గుర్తింపు నివ్వాలని కోరుతున్నాను.”, అని అన్నాడు. కొంతసేపటి తరవాత రామచంద్రమూర్తి దీనికి వివరణ ఇచ్చుకున్నాడు.

“మీరు ఇంగ్లీషోడి ప్రభుత్వంలో ఉన్నారు, కానీ మాది స్వతంత్ర రాజ్యం. మేము మా రాజు పాలనలోనే ఉన్నాం. మా రాజ్యాన్ని తెల్లోడు ఆక్రమించుకోలేదు. ఆగస్టు 15 న స్వాతంత్ర్యం వచ్చింది మీకు, మాక్కాదు. దేశానికి స్వాతంత్ర్యం ఇస్తామని, భారత్, పాకిస్తాను అనే రెండు దేశాలను ఏర్పాటు చేస్తున్నామనీ తెల్లోడు ఇంగ్లండులో ప్రకటన చేసినపుడు, 15 రోజుల్లోపే మేం ఇద్దరితోటీ కలవమని మా రాజు ఒక ప్రకటన చేసాడు. ఆ విధంగా మా రాజు మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టాడు.”

“మాకు రాజు, ప్రధానమంత్రి, సేనాధిపతి కూడా ఉన్నారు. అంచేత మాది ఒక ప్రత్యేక దేశమని నిర్ధారణ అయింది. మమ్మల్ని భారత్‌లో కలిపేసాక, మాకు దేశం పోయింది. ఇప్పుడు మీరు వచ్చి మాకు రాష్ట్రం కూడా లేకుండా చేసారు. పెద్దమనుషుల ఒప్పందం మీద సంతకాలు చేసిన కేవలం నలుగురు నాయకులు మా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు.”

అ తరవాత ఆయన మళ్ళీ కులం ప్రసక్తి తీసుకొచ్చి, సామాజిక తెలంగాణను లేవనెత్తాడు. “సోదరులారా, తెలంగాణ వచ్చాక, దొరల రాజ్యం ఏర్పడకూడదని మేం అనుకుంటున్నాం. పేదలు, అణగారిన వర్గాల కోసం తెలంగాణ ఏర్పడాలని అడుగుతున్నాం. తెలంగాణ ఉద్యమ సమావేశాలకు వచ్చేవాళ్ళు- నాయకులను చూసి రావడం లేదు, రసమయి బాలకిషన్ను చూసి, గద్దర్ను చూసి, ఇతర కళాకారులను చూసీ వస్తున్నారంతే. వాళ్లంతా మావాళ్ళే, మా దళితులే! తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తున్నది మావాళ్ళే! కానీ, ఉద్యమ నాయకత్వంలో ముందున్నది ఎవరూ..  కేసీయార్, జానారెడ్డి, దామోదరరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి,.. ఇలా అందరూ అగ్రకులాలవాళ్ళే! వీళ్ళు ఇక్కడ వేదిక మీద ఎట్టైతే ఉన్నారో, అక్కడ కూడా అలాగే ఉన్నారు.”

ప్రసంగం పెడదారి పడుతోందంటూ కె రామచంద్రమూర్తి ఆయన్ను ఆపమని చెప్పాడు. దానికాయన, ‘మేము తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేస్తూ కూడా, ఇక్కడ మాట్టాడే అవకాశం పొదలేకపోతున్నాం. దీన్నిబట్టి మాకు అన్యాయం జరుగుతున్నదని తెలుస్తూనే ఉన్నది’ అని అన్నాడు.

తెలంగాణ వస్తే అణగారిన వర్గాలకు, పేదల కోసం రావాలి అని చెబుతున్నాను అంటూ ఆయన ప్రసంగాన్ని ముగించాడు.

ఇప్పుడిక నేను నల్లగొండ నుండి వచ్చిన దుశ్చర్ల సత్యనారాయణ ప్రసంగం గురించి చెప్పాలి -అదరగొట్టేసాడాయన. నల్లగొండ ఫ్లోరోసిస్ సమస్య గురించి చాలా ప్రభావవంతంగా చెప్పాడు. అక్కడి ప్రజల వేదనను బాగా వినిపించాడు. కృష్ణ నీళ్ళు తమకు చుక్క కూడా అందకుండా పట్నానికి (హైదరాబాదు) ఎలా పోతున్నాయో వివరించాడు. నీళ్ళ కోసం తాము ఎక్కడెక్కడికి వెళ్ళామో, ఎవరెవరిని కలిసామో చక్కటి భాషలో చెప్పుకుపోయాడాయన. మానవహక్కుల కమిషన్ను, ఇద్దరు ప్రధానమంత్రులను కలిసిన సంగతి చెప్పాడు.  ఫ్లోరోసిస్ సమస్య గురించి చెప్పినప్పుడు ప్రధాని వాజపేయి జేబుగుడ్దతో కన్నీళ్ళు తుడుచుకున్నాడని చెప్పాడు.

“ప్రపంచంలో ఏ తల్లీ విష రసాయనాలతో కూడిన నీళ్లను బిడ్డకు ఇవ్వదు. కానీ నల్లగొండ తల్లి మాత్రం తన పిల్లలకు బొట్టుబొట్టుగా విషం ఇస్తోంది.”
“గుక్కెడు నీళ్ళివ్వలేని దేశమూ ఒక దేశమేనా? ఈ ప్రభుత్వం ఒక ప్రభుత్వమేనా?”
“నేరం వాళ్ళు చేసారు, శిక్షలు మాకు పడ్డాయి. తరతరాల దెబ్బ ఇది. 20 తరాల దెబ్బ, వెయ్యేళ్ళ దెబ్బ కొట్టారు.”
“మేం తిరుపతి పోయి, వెంకటేశ్వర స్వామీ, తెలుగు గంగ ద్వారా కృష్ణమ్మ నీళ్ళు నీ పాదాల దాకా వచ్చాయి. పక్కనే ఉన్న మాకు మాత్రం బొట్టు దక్కకపోయె, ఏంది స్వామీ ఈ అన్యాయం అని అడిగినం”
“ఈ దోపిడీకి దుష్పరిపాలనకు ప్రతీకారం ప్రకృతే సెప్టెంబరు 2 న, అక్టోబరు 2 నా తీసుకుంది.” అని అన్నాడు.

ఒడంబడికలు, ఒప్పందాలన్నీ ఇక రద్దు, మన రాష్ట్రాన్ని తిరిగి ఏర్పాటు చెయ్యాల్సిందేనని గట్టిగా చెప్పాడాయన.

వరవరరావు కొన్ని నిర్దుష్టమైన సూచనలు చేసాడు.
సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన చెయ్యండి. పన్నులు కట్టకండి, బిల్లులు కట్టకండి. ఈ ప్రభుత్వాన్ని గుర్తించకండి. గాంధీ చెప్పిన మాట ఇది.
అన్ని పార్టీల నాయకులూ రాజీనామా చెయ్యాలి. రాజీనామాను స్పీకరు అంగీకరిస్తాడా లేదా మీకు అనవసరం.. మీ క్వార్టర్లు ఖాళీ చేసి హై.ను వదిలేసి, గ్రామాలకు రండి. అక్కడే సభలు పెట్టండి. తెలంగాణ ఏర్పడ్డాకే తిరిగి హై.కు పోదురుగాని.

చివరగా పాండురంగారావు అనే ఆయన మాట్టాడాడు. ఈయన నల్లగొండ జిల్లాలోని ఒక గ్రామానికి ప్రెసిడెంటు (ఇప్పుడు ప్రెసిడెంటో కాదో నాకు తెలవదు). ఆదర్శ ప్రెసిడెంటుగా పేరుతెచ్చుకున్నాడు. ఓ నాలుగైదేళ్ళ కిందట ఈయన తన ఊరిలో తెలంగాణపై ప్లెబిసీట్ పెట్టాడు. 90 శాతం పైగా అనుకూలంగా వోటేసారు.  చాలా పరుషంగా మాట్టాడాడు. కోస్తా సీమల వాళ్లను మిత్రులు అని సంబోధించడానికి కూడా ఇష్టపడలేదాయన!

చివరిగా హరగోపాల్ మాట్టాడుతూ, అల్లరి చేసిన సదస్యులను మెత్తగా మందలించాడు.  “చర్చ జరిగిన విధానం నాకు బాధ కలిగించింది. నేను విశాఖలో 40 నిముషాలు మాట్టాడితే నన్నెవరూ అడ్డగించలేదు. తరువాత మాట్టాడినవాళ్ళు నన్నెవరైనా విమర్శించినపుడు అక్కడి పెద్దలు నావద్దకు వచ్చి, వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పారు. దాసు గారు మాట్టాడుతున్నపుడు, ఆయన్ను మీరు అలా అడ్డుకోవడం మన ఉద్యమంపై తప్పుడు సంకేతాలు పంపిస్తుంది. రెండోది, తెలంగాణకు చెందిన గిరిజన నాయకుడు మాట్టాడుతున్నపుడు ఆయన్ను అడ్డుకోవడం బాగాలేదు. (చందా లింగయ్యను మాట్టాడకుండా అడ్డుకున్న ఘటనను ఉద్దేశించి ఈ మాటలు చెప్పాడు)” –

Categories: తెలంగాణ