Archive

Archive for the ‘తెలుగు’ Category

పుస్తక ప్రదర్శనలో e-తెలుగు వెలుగు!

December 29, 2009 10 comments

పదునైన ఆలోచనాశక్తి, ఆలోచనలను ఆచరణలో పెట్టే నేర్పూ కలిగిన నాయకత్వం ఏ సంస్థనైనా విజయవంతంగా నడిపిస్తుంది. స్వచ్ఛంద సంస్థల నాయకత్వాలకు ఈ లక్షణాలు మరింత ముఖ్యం. పని మీదే శ్రద్ధ పెట్టి, కార్యకర్తలను ఏకోన్ముఖంగా నడిపించగలగడం స్వచ్ఛంద సంస్థల నాయకత్వానికి ఒక సవాలు. e-తెలుగు అలాంటి స్వచ్ఛంద సంస్థే! e-తెలుగు కార్యవర్గం అటువంటి సవాలును స్వీకరించిన నాయకత్వమే!

అంతర్జాలంలో తెలుగు వెలగాలి అనే లక్ష్యం e-తెలుగును నడిపించే చోదకశక్తి. కేవలం రెండు మూడు పదుల సభ్యులు, మరో రెండు మూడు డజన్ల ఔత్సాహికులు దాని ఆస్తి. ఈ ఆస్తిని పెట్టుబడిగా పెట్టి, అద్భుతాలు చేయబూనిన సంస్థ e-తెలుగు. అద్భుతాలు చేసింది కూడా. పదిరోజుల పాటు పుస్తక ప్రదర్శనలో స్టాలును నిర్వహించి, వేలాది కరపత్రాలను, వందలాది సీడీలను ప్రజలకు పంచి, అంతర్జాలంలో తెలుగును వేలాదిమందికి పరిచయం చేసింది. ఈ పనిలో శక్తివంచన లేకుండా కృషిచేసిన e-తెలుగు కార్యకర్తల కార్యకుశలత  వేనోళ్ళ కొనియాడదగినది. నిస్వార్థంగా కేవలం తెలుగుపై అభిమానంతో ఈ యజ్ఞంలో పాల్గొన్న ఔత్సాహికులందరినీ పేరుపేరునా అభినందిస్తున్నాను.

ఈ కార్యక్రమం మొత్తాన్ని జయప్రదంగా నడిపించడానికి, నేపథ్యంలో ఒక యంత్రం రేయింబవళ్ళూ పనిచేసింది. అదే e-తెలుగు కార్యవర్గం. అనుకున్న పనిలో అనేక అడ్డంకులను ఎదుర్కొని కూడా దేన్నీ బయటకు కనబడనీయకుండా, అంతా సజావుగా నడిపిన e-తెలుగు కార్యవర్గ సభ్యులను అభినందిస్తున్నాను. కార్యవర్గ సభ్యులు కలసికట్టుగా ఓ చక్కటి విజయగాథను రచించారు.

e-తెలుగు కార్యవర్గానికి చక్కటి ఆలోచనాపటిమతో పాటు, చురుకైన కార్యాచరణశక్తి కూడా ఉందని ఈ స్టాలు విజయంతో నిరూపించారు. ఈ ఊపుతో 2010లో మరిన్ని కార్యక్రమాలను చేపట్టి, మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుంటున్నాను.

Advertisements
Categories: తెలుగు

మన హితము గోరి పెద్దలిందరు పలుకుచుండగా..

November 5, 2009 27 comments

అసలూ.. తెలుగులో మాట్లాడొద్దని చెప్పినా ఆ పిల్లలు తెలుగులోనే మాట్లాడి పలకలు తగిలించుకునేదాకా ఎందుకు తెచ్చుకున్నారంటారూ?

మనమంటే పెద్దాళ్ళం, బోలెడు భేషజాలుంటై, బడాయిలుంటై, తెలుగులో మాట్టాడాలంటే నామోషీలుంటై.. అంచేత ఎన్ని తిప్పలు పడైనా,.. ఇంగ్లీషులోనే మాట్టాడతాం. కానీ ఇంగ్లీషొచ్చినట్టు నటించాల్సిన ఖర్మ పిల్లలకేంటి? హాయిగా తెలుగులో మాట్టాడుకుంటారు. తెలీని భాషలో మాట్టాడగలిగే తెలివితేటలు కూడా వాళ్ళకు లేవు! పైగా, తమదిగాని భాషలో మాట్టాడాలంటే పడే తిప్పలు మామూలువి కావు మరి. అంచేత పాపం తెలుగులో మాట్టాడి పలక మెడలో వేయించుకున్నారు.

ఐదో తరగతి దాకా చదువు తెలుగులో చెప్పకుండా, పరాయిభాషలో చదువు చెప్పడం వాళ్ళకు వేస్తున్న అసలు శిక్ష అనేది మనం గమనించాలి. దానికితోడు తెలుగులో మాట్టాడినందుకు ఈ శిక్ష!

ఓ సంగతి చూడండి.. సాఫ్టువేరు ఉద్యోగాలు చేసే మన కుర్రాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎంతలేదన్నా కనీసం ఓ మూణ్ణాలుగు లక్షల మందైనా ఉంటారు. “మన కుర్రాళ్ళు” అంటే 20-30 సంవత్సరాల మధ్య ఉండే తెలుగు వాళ్ళు! దాదాపుగా అంతా ఇంగ్లీషు మీడియములో చదివినవాళ్ళే! ప్రతీ రోజూ కనీసం ఏడెనిమిది గంటలు జాలంలో ఉంటారు. ఇంతమంది తెలుగువాళ్ళు జాలంలో తిరుగుతూంటే తెలుగు బ్లాగులను చూసేవాళ్ళు ఎంతమంది ఉండాలండి? ఏనాడన్నా మీ బ్లాగుకు వెయ్యి మంది వచ్చారా? బ్లాగులకు సందర్శకులను సరఫరా చేసే కూడళ్ళకు కూడా వెయ్యిమంది రారు నా ఉద్దేశంలో! ఈ కుర్రాళ్ళలో బ్లాగులున్నాయని తెలవనివాళ్ళు, బ్లాగులంటే ఆసక్తి లేనివాళ్ళు కొంతమంది పోయినా, కనీసం ఒక్..క శాతం కూడా బ్లాగులను చదవడం లేదెందుకు?

తెలుగు చదవడం, రాయడం రాకే! ఇంగ్లీషు మీడియమ్ చదువులు వీళ్ళకు తెలుగును నేర్పనివ్వకుండా చేసాయి. (ఇప్పుడు బ్లాగులు చదివేవాళ్ళలో కూడా ఇంగ్లీషు మీడియములో చదివినవాళ్ళు బాగా తక్కువ మంది ఉండొచ్చు.) చిన్నప్పుడు తెలుగులో చదవడం, పెద్దయ్యాక (కనీసం ఇంటరుదాకా) తెలుగు చదవడం – ఈ రెండు పనులు చేస్తే తెలుగు చదవలేక/రాయలేకపోవడం అనేది ఉండదు. 

తెలుగులో మాట్టాడితేనే తప్పయ్యే పరిస్థితి బడుల్లో ఉంటే, మన పిల్లలకు తెలుగు చదవడం రాయడం వస్తుందా? వాళ్ళ పిల్లలకు మాట్టాడ్డం వస్తుందా? అంచేతే.. ఐదు దాకా పిల్లలకు చదువు తెలుగులోనే చెప్పాలి. పునాదిలో తెలుగుంటే ఆ పైన ఏ భాషలో చదివినా నెగ్గుకొస్తారు. ఆరో తరగతి నుంచి ఇంటరు దాకా ఏ భాషలో చదివినా, తెలుగు సబ్జెక్టు మాత్రం చదివి తీరాలి. ఈ పనులు చేసిన ముఖ్యమంత్రి మరో రాయలే!

~~~~~~~~~~~~~~~~~~~

సరే..
పెద్దలు కొందరు (మేధావులు) అసలు సంగతిని పక్కనబెట్టి, దీనికి సామాజిక కోణాన్ని ఆపాదిస్తూంటారు.  కులాన్ని, మతాన్ని సమస్యలోకి లాక్కొస్తారు. లాక్కొస్తున్నారు కూడా. ‘పిల్లలకు శిక్ష వెయ్యడమనేది అసలు సమస్య. అంతేగానీ, తెలుగులో మాట్లాడొద్దనడం కాదు‘ అంటూ ఉపదేశాలిస్తున్నారు. ఆ శిక్ష వేసినవాళ్ళకు తగు శిక్ష విధించాలి అని వాదిస్తున్నారు. నిజమే ఆ పంతుళ్ళను బడినీ శిక్షించాల్సిందే, అందులో మరో అభిప్రాయం ఉండటానికి లేదు. కానీ, అదేనా పరిష్కారం? మెడలో పలక వేసిన సంగతి మనకు తెలవగానే నోరెళ్ళబెడుతున్నాంగానీ, అంతలా కాకపోయినా.. ఇంగ్లీషులోనే మాట్లాడాలనే నిబంధన మాత్రం అనేక బడుల్లో ఉంది. ఫైన్లు వేస్తారు. ఒక పీరియడ్లో నిలబెడతారు, ఐడోంట్ స్పీక్ తెలుగు అనీ వంద సార్లు రాయిస్తారు.. ఇలా ఎవరి పద్ధతుల్లో వాళ్ళు శిక్షలు విధిస్తూనే ఉన్నారు. మరి వీళ్ళను ఏంచేస్తాం? 30 యేళ్ళ కిందటే నెల్లూరులో ఒక బడిలో “అయామె తెలుగు డాంకీ” అని రాసున్న పలకలు మెడలో తగిలించేవారని ఓ డాక్టరు గారు చెప్పారు, చూడండి. “తెలుగులో మాట్టాడకూడదనే ఆంక్షలు ఏ ఇంగ్లీషు బడిలోనైనా ఉంటాయి, ఇక్కడేదో పెద్ద హింస జరిగిపోయినట్టు చేస్తున్నారేంటి ” అని కంచె అయిలయ్య అన్నాడు. నిజమే చెప్పాడు. కానీ, అందులో తప్పేమీ లేదన్నట్టు మాట్టాడ్డమే ఆయన ప్రత్యేకత!

కంచె అయిలయ్య ఇంకా ఏమన్నాడో చూడండి..
తెలుగు భాష మాట్లాడొద్దని అన్నందుకు, ఆ ప్రిన్సిపల్‌ను పిలిచి అఫిషియల్సు ఎంత హ్యుమిలియేట్ చేస్తున్నారో చూడండి.  పిల్లలకు ఆహారం లేకపోతే అఫిషియల్సు పట్టించుకోట్లేదు, మీడియా పట్టించుకోట్లేదు, సోషల్ వెల్ఫేరు స్కూల్స్ నడవకపోతే పట్టించుకోట్లేదు. బోర్డులు కట్టారనే కారణంతో ఇం..త పెద్ద నన్‌ను, ప్రిన్సిపల్‌ను హెరాస్ చేసే ప్రక్రియ మనం చేస్తున్నామే!
అని బాధపడిపోయాడాయన!

ఇంకోమాట కూడా .. ఇదేదో పెద్ద నేరమైనట్టు ఆ బడిమీద చర్య తీసుకోవడం లాంటివి చెయ్యకూడదు. పిలిచి ఓమాట చెప్పి వదిలేస్తే సరిపోద్ది అని అన్నాడు. ఆయన ప్రాథమ్యాలు ఎక్కడున్నాయో మనకు తెలుస్తోంది గదా!  మరికొందరు మేధావులు కూడా ఇలాగే సమస్యను ఏదో ఒకరకంగా పక్కదారి పట్టించాలని చూస్తున్నారు.

~~~~~~~~~~~~~~~~~~~

ఇంతకీ.. అయిలయ్య ఈ సమస్యకో పరిష్కారం చూపించాడు.. దేశవ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి ఇంటరు  దాకా పిల్లలందరికీ మూడు సబ్జెక్టులు మాతృభాషలోను, మూడు ఇంగ్లీషులోను చెప్పాలంట. అలాగైతే రెండు భాషలూ వస్తాయంట.  ఉన్న సబ్జెక్టులు ఆరు – తెలుగు, ఇంగ్లీషు, హిందీ, లెక్కలు, సైన్సు, సోషలు – ఇవేగా?
అందులో మూడు తెలుగులో చెప్పమంటున్నాడు. మాతృభాషలో చదువు చెప్పడమంటే అదే కదా ! -లెక్కలు, సైన్సు, సోషలు తెలుగులో చెబుతారు. ఈయన లెక్కేంటో అర్థం కాలేదు అని అనుకుంటూండగా, ఇంకో ముక్క అన్నాడు..
– ‘సగం సిలబస్సు మాతృభాషలోను, సగం ఇంగ్లీషులోను చెప్పాలి, ఆ దెబ్బతో రెండు వచ్చేస్తాయం’ట. ఇంకోటేంటంటే.. ఇలా చదివిన పిల్లకాయలు దేశంలో ఏ రాష్ట్రానికి పోయినా చక్కగా చదివెయ్యగలరంట !!!

అయిలయ్య చెప్పినది ఇలా ఉండగా..

~~~~~~~~~~~~~~~~~~~

ఏ తికమకా లేకుండా కొందరు పెద్దలు ఇలా చెబుతున్నారు..
“ప్రాథమిక స్థాయిలోనే ఇంగ్లీషు చదువు ప్రవేశించి, తెలుగును మరణశయ్య మీదకి ఎక్కిస్తోంది” ఈ ముక్క ఎవరన్నారో తెలుసా.. రంగనాయకమ్మ!

“అధికార భాషగా తెలుగును అమలుచెయ్యని ప్రభుత్వానికి తెలుగు ప్రాచీనతను అడిగే నైతిక హక్కు లేదు.” జ్వాలాముఖి

“గత ఇరవై యేళ్ళుగా ఇంగ్లీషు మాధ్యమ చదువులు విపరీతంగా పెరిగాయి. దాదాపు రెండు తరాల విద్యార్థులు తెలుగు రాకుండానే తెలుగును నామమాత్రంగ చదువుతూనో, అసలు చదవకుండానో పాఠశాల చదువులు, కాలేజీ చదువులూ వెలగబెట్టారు. డాక్టర్లు, ఇంజనీర్లూ అయ్యారు. వీళ్ళంతా పరభాషా సంస్కృతులకు పరాయీకరణం చెంది ఇంట్లో తెలుగు పత్రికను కనబడనీయరు, కనబడ్డా ముట్టరు. వీళ్ళు తెలుగుకు దూరమైతే వీళ్ళ పిల్లలకు రానిస్తారా? ఇలా మరో రెండు తరాలు గడిస్తే వీళ్ళంతా తెలుగు మాటకు కూడా దూరమవుతారు. ఓ సమాజంలో 20 శాతం మంది ఆ భాషను చదవకుండా చదువు ముగిస్తే ఆ భాష మృతభాష అయ్యే ప్రమాదముంది అని యునెస్కో హెచ్చరించింది.”- కాలువ మల్లయ్య. ఈయన రాసిన వ్యాసం పూర్తిగా చదివి తీరాలి. మనం చూస్తున్న కొందరు ఇంగ్లీషు భక్తుల నైజాన్ని ఆ పేజీల్లో పరిచాడాయన.

వీళ్ళే కాదు, వేలమంది పెద్దలు – విద్యావేత్తలు, భాషావేత్తలు, రచయితలు, పాత్రికేయులు, ఉపాధ్యాయులు –  తెలుగులో బోధన చెయ్యాలనీ, తెలుగును విధిగా నేర్పాలనీ చెబుతున్నారు. వీళ్ళు మనకు రాజకీయ నాయకులు కాకపోవచ్చు, కానీ నాయకులే -సాంస్కృతిక నాయకులు!

మనమంతా కలసికట్టుగా ప్రభుత్వాన్ని నిలదీసి, పనిచేయించుకోవాల్సిన అవసరం ఉంది.

~~~~~ ~~~~ ~~~~ ~~~~ ~~

ఈ విషయంపై పొద్దులో జరుగుతున్న చర్చ చూడండి.

పేర్ల పురాణం

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, డాక్టర్, పద్మశ్రీ  నందమూరి తారక రామారావు నటించిన.. ” అని మన రాష్ట్ర విఖ్యాత సినిమారిక్షా వాడు చెప్పుకుంటూ పోతూంటే, అది వింటూ, వాడు పంచే కరపత్రాల కోసం ఆ బండెనకాలే పరిగెడుతూ -ఆహా, తలుచుకుంటూంటేనే మైకం కమ్ముతోంది. ఆ మైకువాడు ప్రతీసారీ ఆ ముందరి బిరుదులన్నీ వరసాగ్గా చదివేవాడు, అదంతా రామారావు ఇంటిపేరైనట్టు! రామారావు భక్తులైన కొందరు నాబోటిగాళ్ళు కూడా ఉత్త రా. మా. రా. వు. అని అంటే పాపం తగులుద్దేమో అన్నట్టు మొత్తం బిరుదులన్నీ చదివి మరీ పేరు చెప్పేవాళ్ళు.

కానీ మనకో మహత్తరమైన విద్యుంది. ఎంత పొడుగాటి పేరునైనా తెగ్గొట్టి, ఇరగ్గొట్టి, ముక్కల్జేసి, మళ్ళీ అతికించి మహామహా పొడుగాటి పేర్లను కూడా నాలుగైదు అక్షరాలకు కుదించేస్తాం. అంచేత “విశ్వ విఖ్యాత..” -ఈ మొత్తాన్ని కుదించేసి ఎన్టీవోడు అని అనేసాం. పేరులో వాడు ఉందిగదా అని తేలిగ్గా తీసుకోకండి సుమా, మూడు తరాల తెలుగుప్రజలకు ఎన్టీవోడంటే  “విశ్వవిఖ్యాత..’ యేగానీ మరోటి కాదు, మరోలా కాదు.  అయితే, సదూకున్నోళ్ళంగదా, ఎన్టీవోడనే మాట మాకు నోరు తిరక్క, ఎన్టీయారనేవాళ్ళం.

నాగ్గాడికి (నాగిగాడు అనే పేరుకు) ఎన్టీవోడికున్నంత పవిత్రత లేదు. ఈ మాట పలకడంలో కాస్త తేలికదనం ధ్వనిస్తుంది. ఆ రోజుల్లో నాయేస్రావును నాగ్గాడు అని అనడంలో మంచి సరదా ఉండేది. రాజబాబును రాజబాబనీ, పద్మనాభాన్ని పద్మనాభం అనీ పిలిచిన గుర్తే లేదు నాకు. రాజబాబుగాడనీ, పద్దనాబంగాడనీ అనేవాళ్లం. రాజనాల గాడు, నాగబూషణంగాడు,  ప్రబాకర్రెడ్డిగాడు,.. ఇదీ వరస!

ఇహ కృష్ణ సంగతి చెప్పే పనే లేదు -ఔనౌను, సూపర్‌స్టారే! కిట్టిగాడనేవాళ్ళం.  గూనప్పడు అనాలని యమా ఉత్సాహంగా ఉండేదిగానీ, ఫ్యాన్సు ఏడిచ్చస్తారని అనేవాళ్లం కాదు.  చాటుమాటుగా అనుకునేవాళ్ళం.  శోన్‌బాబు మాకసలు ఒక లెక్కలోవాడేగాదు..,  (ఆడికేఁవన్నా ఫైటింగొచ్చా, పాడా?) కృష్ణంరాజు జోలిక్కూడా పొయ్యేవాళ్ళంగాదు.  అస్సలునేను కృష్ణంరాజును ఒక హీరోగా చూట్టం మొదలెట్టింది కటకటాల రుద్రయ్యతోటే!

సినిమావాళ్ళ సంగతి పక్కనబెడితే..
లక్ష్మిని లక్షణంగా లక్ష్మీ అని అంటామా? అనం. లష్వీఁ అంటాం. ఇంకాస్త అందంగా పలకాలంటే లచ్చిఁవి అంటాం. మహాలక్ష్మి అనే చక్కటి పేరును మరింత అందంగా మాలష్విఁ, మాలచ్చివిఁ అని అంటాం. సచ్చినాణ అనో, కొద్ది తేడాతో సచ్చినాడ అనో అంటే తప్పు పట్టకూడదు సుమా.. సత్యనారాయణకు అది పొట్టిపేరు మరి. సచ్చెం గూడా అలాటిదే!  లష్నాణ కూడా ఆ పద్ధతిలో వచ్చిందే! వెంకటేశ్వరరావును ఎంకటేస్వర్రావనో, ఎంక్టేస్రావనో పిలవాలి. 

పాసార్ది అనే పేరు వినే ఉంటారు..  చాన్నాళ్ళ కిందట ఒక కథ చదివాను. రాసిందెవరో, కథేంటో ఏమీ గుర్తు లేదుగానీ..  ఒకడు పాసార్దీ.. పాసార్దీ.. పాసార్దీ.. అంటూ కేకేస్తూండగా కథ మొదలౌతుంది.  చెప్పొద్దూ.. ఈ పాసార్దీ  ఏంటో నాకు వెంటనే అర్థం కాలేదు. నాలుగు వాక్యాలు చదివాక తెలిసింది, పార్థసారథిని అలా పిలుస్తున్నాడని. ఆ రోజుల్లో కాబట్టి సరిపోయిందిగానీ, ఇప్పుడైతేనా… “పాసార్ది అనగా పార్థసారథి” అని ఠక్కున తట్టనందుగ్గాను, హిందువుగా పుట్టినందుకు సిగ్గుతో తలవంచుకుని ఉండేవాణ్ణి. తలొంచుకోడమేంటి హఠాత్తుగా? అసలు హిందువుకూ దీనికీ సంబంధవేంటీ? అని అడగబాకండి.. అదంతే, అదిప్పుడు ఫ్యాషను!

పైన చెప్పిన  పేరుమార్పులు, మార్పిడి పేర్లూ అన్నీ మనకు నచ్చేవే. ఇక నచ్చనివి కొన్ని..
ముందుగా కీరవాణి చేసిన ఒక దౌర్జన్యం గురించి చెప్పుకోవాలి -అవును ఎమ్మెమ్ కీరవాణే! “శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం..”  అనే శ్లోకాన్ని, శ్రీరామదాసులో కాబోలు, పాడాడు. ఎలా పాడాడూ.. అరవిందదళాయతాక్షం అనాలి గదా.. అరవిందదళాయతాచ్షం అన్నాడు.  (చాలామంది అంటారలా.) తెలుగు సినిమాల్లో ఇలాంటివి కొల్లలుగా ఉంటై, నువ్వు ఊరికే కోడిగుడ్డుకు ఈకలు పీకొద్దు అని అనకండి.. తెలుగైనా సంస్కృతమైనా ఇలా పదికాలాలు నిలిచే పాటల్లో, సినిమాల్లో  తేడాల్లేకుండా పలకాలి, అంతే!  ఇలా తప్పులు పాడితే, అది భాష మీద దౌర్జన్యం చేసినట్లే.  పైగా- పాడింది ఏ ముక్కు గాయకుడో అయితే, మనసులోనే చిరాకుపడి ఒదిలేద్దుం. కానీ ఇక్కడ పాడింది కీరవాణి గదా, సరిగ్గా పలకాలా, లేదా? ఇప్పుడూ.. ఆడు, ఈడు, అడ, ఈడ,..  అంటూ నేను రాస్తున్నా గదా, రాసేది నేనైతే ఎవరూ పట్టించుకోరు. అదే ఏ భైరవభట్లగారో, తాడేపల్లిగారో రాసారనుకోండి.. “ఏంటిది, వీళ్ళు గూడా ఇట్లా రాసారు, చదువరి లాగా ” అని అనుకోరూ? మరదే తేడా అంటే!   అయినా..

అంత పలకలేనివాడు తాను పాడటం ఎందుకు? గానకళాప్రపూర్ణ, డాక్టర్, పద్మశ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం  – అనగా మన బాలు – ఉండనే ఉన్నాడు గదా! అతనిచేత పాడించొచ్చుగా, అసలతడు పుట్టిందే అందుక్కదా !! అలాగే, అదే సినిమాలో తండ్రీ ని తన్రీ అని ఓ ఆడగొంతు అలా పాడుకుంటూపోతే, తప్పు సవరించకుండా అలాగే మనమీదికి వదలినందుకు కూడా కీరవాణిని నేను క్షమించను. సినిమాల్లో ఇలాంటివాటి గురించి పట్టించుకోడం గొంగట్లో తింటూ వెంట్రుకలేరుకోవడం లాంటిదే, కాదన్ను. అయినా సరే, క్షమించదలచుకోలేదు. మన సినిమాల్లో తెలుగురాని నటీనటులను పెట్టుకుంటాం. చాలా భాషలవాళ్ళు చేస్తారాపని. కాకపోతే, వాళ్ళకు చక్కగా డబ్బింగు చెప్పిస్తారు. కానీ మన దరిద్రం ఏంటంటే, డబ్బింగుకు కూడా తెలుగు రానివాళ్ళమే పెట్టుకుంటాం. తెలుగును ఇంగ్లీషులానో, హిందీలానో మాట్లాడ్డం వాళ్ళకో అర్హత!

ఇహ ఊళ్ళ పేర్ల సంగతి కొచ్చేటప్పటికి మనం చేసే ప్రయోగాలు, తప్పులు కొల్లలు. తెల్లోడు ఎలాగూ కొన్ని ఊళ్ళ పేర్లు మార్చేసి పొయ్యాడు. వాటినే పట్టుకు వేళ్ళాడుతున్నామనుకోండి.  కానీ, తెలుగులో సుబ్బరంగా రాసే పేర్లను రోమను లిపిలో రాసేటపుడు మార్చి రాయటం మనం తప్ప ప్రపంచంలో మరొకడెవ్వడూ చెయ్యడని నా ఉద్దేశం. గుంటూరు తెలుగులో బానే రాస్తాం. ఇంగ్లీషులో రాసేటపుడు మాత్రం గుంటూర్ అంటాం. నెల్లూరు పరిస్థితి దీనికంటే అన్యాయం.. నెల్లోర్ అట.  తెలుగులో ఎలా రాస్తామో ఇంగ్లీషులోనూ అలానే  రాయొచ్చుకదా! అది మనకు చిన్నతనం.  కడప సంగతి మరీ దయనీయం. ఈ మధ్యెప్పుడో మార్చినట్టున్నారుగానీ లేకపోతే ఇంగ్లీషులో కుడ్డప్పహ్ అని రాసేవాళ్ళం. సుబ్బరంగా ప్రళయకావేరి అనే అద్భుతమైన పేరుండగా, పులికాట్ అని గొప్పగా చెప్పుకుంటాం.మా జిల్లాలో చుండూరు అనే ఊరుంది. దీన్ని చ లాగా కాక, ౘ (మీకీ రెండో సరిగా కనబడకపోతే, తెలుగుబ్లాగు గుంపులోని ఈ లింకు చూడండి) లాగా పలకాలి. ఇంగ్లీషులో రాసినపుడు సరిగ్గా అలాగే పలకాలనే ఉద్దేశంతో దాన్ని Tsundur అని రాసారు. ఇప్పటికీ అలాగే రాస్తారు. చుండూరుపల్లి అనే మరో ఊరుంది. దాన్ని మాత్రం మామూలుగా Chundurupalli అనే రాస్తారు.

రాయలసీమ ఊళ్ళ పేర్లలో ఎక్కువగా పల్లె అని ఉంటుంది. పల్లి అని ఉండదు. మదనపల్లె, బనగానపల్లె, కందిమల్లయ్యపల్లె,.. ఇలాగ.  మదనపల్లి అని రాసుండటం మదనపల్లెలోనే చూసాను. రారోరసం వాళ్ళు కూడా తమ బస్సుల మీద మదనపల్లి అని రాసుకున్నారు. వాళ్ళ బస్టాండు మీద కూడా అదే పేరు. ఎందుకు రాయాలీ తప్పు? ఎందుకీ అలక్ష్యం? కోస్తా జిల్లాల్లో ఊళ్ళకు పల్లి అని ఉంటుంది, పల్లె అనేది చాలా అరుదు.  భారత జనగణన అనే జనాభా లెక్కలు తీసే ప్రభుత్వ శాఖ ఒకటుంది గదా, వాళ్ళ లెక్కల్లో మన ఊళ్ళ పేర్లు ఎలా రాసారో చూస్తే, కంపరం కలుగుద్ది. పల్లిలన్నీ పల్లెలు. పేటలన్నీ పేట్‌లు!  

ఇక, యాడుల్లో (వ్యాపార ప్రకటనల్లో) తెలుగు (బైబిలు తెలుగు లాగానే ఇది కూడా ఒక ప్రత్యేకమైన తెలుగు)  గురించి చెప్పుకోవాలంటే అదో ప్రత్యేక వ్యాసమౌతుంది. అలాగే, సాఫ్టువేర్ల తెలుగీకరణలో మనం (భవదీయుడితో సహా) చేస్తున్న తప్పుల గురించి మాట్లాడుకోవాలంటే కూడా అదో టపా అవుతుంది.

అది సరే, ఈ సంగతి చెప్పండి.. ఉపలబ్ధం అనేమాటను యాడుల్లో (“ఇప్పుడు, సరికొత్త వంద గ్రాముల ప్యాకులో ఉపలబ్ధం!”) కాక ఇంకెక్కడైనా చూసారా? ఈ మధ్య బ్లాగుల్లో అక్కడక్కడా తగులుతున్నాయి. తెలుగీకరణలో కూడా తగిలితే తగలొచ్చు.

రండి, రండి! Welcome

November 16, 2008 13 comments

Can’t see Telugu on this page? Is your Computer showing series of boxes after this paragraph? It is because, it is not taught how to render Telugu. You can teach a lesson to it, so that it will surrender to the sheer beauty of those magnificent letters. Follow the steps given in this Wikipedia link or this link or this and implement the suggested changes in your computer… you will find yourself in the lap of Mother Telugu. Then, please come back and read the following few lines.

కొత్తగా బ్లాగుల గురించి తెలుసుకుంటున్న వారికి, ఈ బ్లాగుపై ఆంధ్రజ్యోతి సమీక్ష చదివి ఇక్కడికి వచ్చినవారికి, బ్లాగరులకు, బ్లాగ్వరులకు స్వాగతం! నాకు తెలిసిన నాలుగు ముక్కలను కొత్తవారికి చెప్పాలని ఇది రాస్తున్నాను.

 • మీకు కంప్యూటర్లో తెలుగు ఎలా రాయాలో తెలీకపోతే లేఖినికి వెళ్ళండి. మీరు రోమను లిపిలో రాసుకుంటూ పోతుంటే అది తెలుగు లిపి లోకి మార్చేస్తూ ఉంటుంది. నేను తెలుగులో రాయగలగుతున్నాను అని రాయాలనుకున్నారనుకోండి.. “nEnu telugulO raayagalagutunnaanu” అని అక్కడ రాస్తే చాలు.. మిగతా పని అదే చూసుకుంటుంది. కొత్తవారికి దీని కంటే మంచి గురువు మరోటి లేదు. కొన్ని ఆసక్తికరమైన లింకులివిగోండి:
 • తెలుగు విజ్ఞాన సర్వస్వ నిర్మాణం అనే ఒక బృహత్తర కార్యక్రమం నడుస్తోంది. తెలుగువారు తమకో విజ్ఞాన భాండాగారాన్ని తయారుచేసుకుంటున్నారు. మనలాంటి వాళ్ళంతా అందులో భాగస్తులే! ఆంధ్ర దేశంలోని ప్రతి ఒక్క ఊరి గురించి వివరాలు పొందుపరచాలనేది అక్కడి ఆశయాల్లో ఒకటి. అక్కడ మా ఊరి గురించి ఉంది, నేనే రాసాను. మీ ఊరి గురించి వ్యాసం ఉందో లేదో చూడండి. లేకపోతే మీరే రాయండి. ఉంటే.. దానిలో మార్పులు చెయ్యండి, కొత్త విషయాలు చేర్చండి
 • ఇక, బ్లాగులు ! బ్లాగులు రాసేందుకు పైసా ఖర్చు పెట్టక్కర్లేదు – నేను పెట్టలేదు. మీకు కావాల్సిందల్లా కంప్యూటరు, జాలంలో జొరబడేందుకు ఓ కనెక్షను -అంతే! ఇక మీ మనసులో ఉన్నదంతా బైటపెట్టడమే. చంద్రబాబును, రాజశేఖరరెడ్డిని, చిరంజీవిని, బాలకృష్ణను.. ఎవ్వర్నీ వదలొద్దు. ఛందోబద్ధమైన పద్యాలు, కథలు, కవితలు, వ్యాసాలు.. దేన్నీ వదలొద్దు. హాస్యం, వ్యంగ్యం, సీరియస్, విషాదం, వేదన, రోదన.. ఏదైనా సరే! పుస్తక సమీక్ష, సినిమా సమీక్ష, మీ చిన్ననాటి స్మృతులు, నిన్నామొన్నటి జ్ఞాపకాలు, కాలేజీ కబుర్లు.. ఆఫీసు కబుర్లు.. అన్నిటినీ మీ బ్లాగులో పరవండి. అంతా వచ్చి చదూకుంటారు.. మీ బ్లాగు గురించి ఏమనుకుంటున్నారో కూడా చెబుతారు.
 • బ్లాగుల్లో కనబడేవి.. వినూత్నమైన ఆలోచనలు, స్వంత భావాలు, చక్కటి భాష, నిర్మొహమాటంగా, నిర్మోహంగా సాగే రచనలు. కొన్ని చక్కటి బ్లాగుల్లోని కొన్ని మంచి టపాలను ఏరి కూర్చిన ఈ పుస్తకాన్ని చూడండి. (ఇదో పీడీయెప్ఫు పుస్తకం.. దించుకోడానికి కాస్త ఎక్కువ సేపే పడుతుంది.)
 • బ్లాగు ఎలా మొదలుపెట్టాలనే సంగతి నుండి.. బ్లాగుల విషయంలో ఏ సాయం కావాలన్నా.. తెలుగుబ్లాగు గుంపునడగండి.
 • బ్లాగుల్లో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమేం రాస్తున్నారో తెలుసుకునేందుకు కూడలి, జల్లెడలను చూస్తూ ఉండండి. బ్లాగుల్లో కొత్త రచనలు రాగానే వీటికి ఉప్పందుతుంది. కొత్తగా ఏయే రచనలు వచ్చాయో తెలిసికొనేందుకు తెలుగు బ్లాగరులు ఈ సైట్ల వద్దే తారట్లాడుతూ ఉంటారు.
 • చక్కటి ఛందోబద్ధమైన పద్యాలు రాసేవారు ఇప్పటి కుర్రకారులోనూ ఉన్నారు తెలుసా? అంతర్జాలంలో అభినవ భువనవిజయాలు జరిగాయి కూడాను. ఛందస్సునూ, పద్యాల లక్షణాలనూ నేర్పే గురు బ్లాగులు బ్లాగురువులూ కూడా ఉన్నారు.
 • ఈమాట జాల పత్రికను చూడండి. అలాంటి ఉత్తమ సాహితీ విలువలున్న పత్రికను అచ్చులో చూసి ఎన్నాళ్ళైందో గుర్తుకు తెచ్చుకోండి.
 • గళ్ళ నుడికట్టు అంటే ఇష్టమా? అయితే పొద్దు దిక్కుకు తిరగండి. తెలుగులో మొట్టమొదటి ఆన్‌లైను గళ్ళ నుడికట్టు ఇది.
 • కొత్త సినిమాల దగ్గర మైకులు పట్టుకుని, జనాల చేత అబ్బో, బెమ్మాండం, సూపరు, వందరోజులు, వెయ్యిరోజులు అంటూ చెప్పిస్తున్నపుడు “ఆంధ్రదేశంలో ఒక్ఖడు కూడా.. సినిమా బాలేదనేవాడే వీళ్ళకి కనపడడు..ఛి..చ్ఛీ..దరిద్రం.” అని టీవీల వాళ్ళను చీదరించుకున్నారా? అయితే నవతరంగపు తాజా గాలి పీల్చండి. నిష్పాక్షిక సమీక్షలే కాదు, సినిమాల గురించిన బోలెడు కబుర్లు తెలుసుకోవచ్చు. 
 • తెలుగును చూపించే విషయంలో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరరు కాస్త మొహమాటపడుతుంది. పక్కనున్న స్క్రాల్ బారును పట్టుకుని పైకీ కిందకీ జరపబోతే మహా బద్ధకంగా కదులుతుంది. (మరి ఈ సమస్య నాకేనో ఇతరులకూ ఉందో తెలీదు.) ఈ సందర్భంలో ఫైరుఫాక్సు అనే బ్రౌజరును మనం స్మరించుకోవాలి. దానిలో ఈ ఇబ్బంది కనబడలేదు. అది తెలుగుతో చెలిమి చేసింది. మంటనక్కపై తెలుగు సవారీ నల్లేరుపై నడకే! అన్నట్టీ మంటనక్క అనేది ఫైరుఫాక్సు బ్రౌజరును మనాళ్ళు ముద్దుగా పిలుచుకునే పేరు. 
 • మంటనక్కలాంటి ముద్దుపేర్లే కాక, మనం నిత్యం వాడే అనేక ఇంగ్లీషు పదాలకు సమానార్థకమైన తెలుగు మాటలను వెలికితీస్తూ, నిష్పాదిస్తూ, కనిపెడుతూ, చెలామణీ చేస్తూ ఉన్నారు. మీరూ ఓ చెయ్యెయ్యండి. ఉదాహరణకు ఇంటర్నెట్‌లో ఉండే జనులను ఇంగ్లీషులో నెటిజెన్స్ అంటారు. మనాళ్ళు నెజ్జనులు అన్నారు. జాలజనులు అన్నారు. నెటిజనులు అన్నారు. మీరేమంటారో చెప్పండి.

దశావతారం

ఆ పేరేంటి? దశమావతారమన్నా అనాలి లేదా దశావతారాలు అనన్నా అనాలి. దశావతారం అనొచ్చా? “పది అవతారం” !!!

ఆయనకు తెలుగు చేసింది, ఆమెకు తెగులు సోకింది

ఇవ్వాళ ఈనాడులో రెండు వార్తలు.. పక్కపక్కనే. రెండు వార్తలూ తెలుగు గురించే కావడంతో, ఒకే పేజీలో పెట్టి వాటిలోని వైరుధ్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపింది.

మొదటిది:
తెలుగుకు ప్రాచీన హోదా విషయమై లోక్‌సభలో చర్చకు వచ్చినపుడు, ఆ ప్రశ్న లేవనెత్తిన బొత్స ఝాన్సీ సభలోనే లేదు -ఫోనొచ్చిందట! అది కావాలని చేసిన ఏర్పాటని ఈనాడంటోంది; అదేదో రాజకీయమట. తమ పార్టీవాళ్ళే ఆమెను ఆ సమయానికి సభలో ఉండొద్దని చెప్పి బయటికి పంపారంట. ఏదన్నా గానీండి.. తెలుగు నాయకులకు తెలుగు భాష పట్ల ఉన్న శ్రద్ధకు ఇదో ప్రతీక. దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతి వార్త ఇది.

ఇదంతా మనకు మామూలే. ఈ రకం రాజకీయ నాయకులు మన చుట్టూ ఉన్నారు. నడుస్తూ నడుస్తూ ఉంటే మన కాళ్ళకూ చేతులకూ తగులుతూ, అడ్డం పడేంత మంది ఉన్నారు. కానీ.., మనకు మామూలు కాని వార్తొకటుంది, చూడండి:

తమిళనాడు శాసనసభలో తెలుగు గురించి మాట్టాడుతూ గోపీనాథ్ అనే సభ్యుడు కన్నీళ్ళ పర్యంతమై పోయాడు. ఆ రాష్ట్రంలో తమిళ మాధ్యమంలోనే చదువు చెప్పాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చిందట. దాని కారణంగా తన నియోజకవర్గంలో లక్ష మందికిపైగా తెలుగు మాట్లాడే పిల్లలు ఇబ్బంది పడతారని ఆయన తన గోడు వెళ్ళబోసుకున్నాడు. ఆయన మాట్టాడుతూండగా మధ్యలో ఆపి, స్పీకరు ఇక చాలు కూచ్చోమన్నాడట. దానికి ఆయన కన్నీళ్ళ పర్యంతమైపోయాడు. స్పీకరు మళ్ళీ మాట్టాడే అవకాశం ఇచ్చాడట గానీ, దుఃఖంతో సరిగ్గా మాట్టాడలేకపోయాడట. మనకంతగా పరిచయంలేని నాయకత్వమిది. ఊహించని వ్యక్తిత్వం.

గోపీనాథ్‌తో బొత్స ఝాన్సీని పోల్చి చూడాలి మనం. మామూలుగా ఝాన్సీ అడిగిన ప్రశ్నపై సభలో చర్చ జరిగే అవకాశం లేదట. ఇతర ప్రశ్నలను అడిగినవారు ధర్నాలతో బిజీగా ఉండటంతో ఆమెకు మాట్టాడే అవకాశం వచ్చిందట; దాన్నామె కాలదన్నుకుంది. “ఏదీ ఈమె ఇప్పటిదాకా ఇక్కడే ఉందే..” అని స్పీకరు కూడా వెతుక్కున్నాడట. ఇదీ ఆమె నిర్వాకం. మరి గోపీనాథ్ ఏంచేసాడు..? స్పీకరు ఆపమన్నా మాట్టాడబోయాడు. తన వాదన అంత సమంజసం కాకున్నా.. (ఏమాటకామాటే చెప్పుకోవాలి: తమిళనాడు ప్రభుత్వం చేసిన పని ఒప్పే. అక్కడుంటే తమిళంలో చదివి తీరాల్సిందే అని అనడంలో తప్పేఁవుంది.) తన భాష మాట్టాడేవారి కోసం తన పదవినీ తద్వారా తనకొచ్చిన అవకాశాన్నీ గోపీనాథ్ సద్వినియోగం చేసాడు.

శభాష్ గోపీనాథ్!

మర్యాదకరమైన మాటలు

November 29, 2007 14 comments

ఈ జాబు ఎవరిని ఉద్దేశించీ రాసింది కాదు. ఇది ఏ కొందరికో మాత్రమే పరిమితమైన విషయమూ కాదు. నాకూ అటువంటి భావనే ఉంది, దాదాపుగా అందరూ అలానే భావిస్తారనుకుంటా.

……..

కొన్ని మాటల విషయంలో తక్కువతనాన్ని (నిమ్నత్వాన్ని), అమర్యాదను తెలియజేయడానికి తెలుగు పదాలను వాడుతూ, గొప్పతనాన్ని, ఉచ్ఛతను, మర్యాదను తెలియజేసేందుకు సంస్కృతాన్ని వాడతాం. దాని గురించే ఈ జాబు.
 • ఆయన గుడ్డివాడు ” – “ఆయన అంధుడు.”
 • ఆమె చెవిటిది” – “ఆమె బధిరురాలు.”
 • అతడు కుంటివాడు” – “అతడు వికలాంగుడు” (ఈ మాటను ఎక్కువగా కాలూ చేతులకే వాడుతూ ఉంటారు, అందుకే ఇక్కడ రాసాను)
 • అవిటివాళ్ళు – వికలాంగులు

పై వాక్యాల్లో బొద్దుగా ఉన్నవి అచ్చ తెలుగు మాటలు. అచ్చ తెలుగు మాటలు వాడినపుడు మనకు అమర్యాదకరంగా తోస్తున్నాయి. ఎక్కిరించడానికీ, ఎటకారం చెయ్యడానికీ అవే మాటలు వాడడం వలన ఆ మాటలను ఎక్కడ వాడినా అమర్యాదే ధ్వనిస్తోందనుకుంటాను. ఇంగ్లీషులో సందర్భాన్ని బట్టి మాట విలువను అర్థం చేసుకునేలా ఉంటే బాగుండేదేమో! అలా లేకపోవడం వల్లనే, మర్యాదగా ధ్వనించాలంటే సంస్కృతం వాడాల్సి వసోంది.

ఇవి చూడండి:

 • చెవిటిదీ, గుడ్డిదీ అయిన ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
 • “చెవిటీ, గుడ్డీ అయిన ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.”
 • “బధిరురాలూ, అంధురాలూ అయిన ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.”

బొద్దుగా ఉన్న మొదటి వాక్యంలో అచ్చతెలుగు పదాలు వాడాం. మూడోదానిలో సంస్కృత పదాలు వాడాం. ఇక మధ్యది.. అసలీ వాక్య నిర్మాణమే తప్పుగా తోస్తోంది నాకు. మొదటి వాక్యం అమర్యాదకరంగా ఉన్నట్టనిపిస్తే దానిలో మర్యాద ధ్వనించేలా చేసేందుకు ఇలా మార్చొచ్చు:

చెవిటి వారూ, మూగ వారూ, గుడ్డి వారూ అయిన ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.” -నాకైతే కృతకంగా అనిపిస్తోందిది.

వికీలో చూస్తూ ఉంటాం.. (నేను రాస్తూ ఉంటాను కూడా) “ఆయన ఫలానా తేదీన జన్మించాడు, ఆమె ఫలానా చోట జన్మించింది” అంటూ. అవే వాక్యాలను “ఆయన ఫలానా తేదీన పుట్టాడు”, “ఆమె ఫలానా చోట పుట్టింది” అని రాస్తే అంతగా నచ్చదు. మరీ ముఖ్యంగా ఆడవారి విషయంలో! (వికీలో ఇదివరలో ఒక చర్చ జరిగింది. సావిత్రి వ్యాసంలో అనుకుంటాను.. ఏకవచనంలో రాసారని అభ్యంతరం వచ్చింది -వికీ పద్ధతది, మరి! ఒక సభ్యునికి అది నచ్చలేదు, అమర్యాదకరంగా ఉందన్నారు.) అంతెందుకు, ‘ఆడది‘ అనే మాట కూడా అమర్యాదకరమైనదే! స్త్రీ, మహిళ, వనిత ఇలాంటి అనేకానేక పేర్లు వాడొచ్చు కానీ ‘ఆడది’ వాడకూడదు!! ‘ఆడవాళ్ళు’ అనే మాట పర్లేదు మళ్ళీ.

చచ్చిపోయాడు, చచ్చిపోయింది అనే బదులు మరణించాడు, మరణించింది అని వాడుతూ ఉంటాం. అచ్చ తెలుగులో ఉండటం తప్పించి ఆ వాక్యాల్లో తప్పేమన్నా ఉందా!?

ఇలాంటివే ఇంకా ఎన్నో ఉండుంటాయి. ఇలాగ..
బ్రతుకు/బతుకు – జీవితం
బొక్క/చిల్లు/కంత – రంధ్రం
ఆమె ప్రసవించింది – గేదె ఈనింది. (ప్రసవించింది, ఈనింది లను అటూ ఇటూ మార్చి చూడండి.)
ప్రసవించింది అనే మాట కూడా ఎక్కడ వాడుతున్నాం లెండి, డెలివరీ అయింది అంటున్నాం గాని.

http://sameekshaclub.blogspot.com/2007/11/blog-post_27.htmlఈ జాబులో జరిగిన చర్చ చూసాక ఇది రాయాలనిపించింది. (నేనిది ఎవరిని ఉద్దేశించీ రాసింది కాదు. ఇది ఏ కొందరికో మాత్రమే పరిమితమైన విషయమూ కాదు. నాకూ అటువంటి భావనే ఉంది, దాదాపుగా అందరూ అలానే భావిస్తారనుకుంటా.)

పైవన్నీ ఒక స్థాయికి చెందినవి. మరికొన్ని మాటలుంటాయి.. వాటిని పలకడం కూడా అసభ్యతగా భావిస్తాం. (ట్యాబూ మాటలంటారేమో!) కొండొకచో బూతుమాటలు కూడా అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు..

ఉచ్చ/ఒంటేలు – మూత్రం

ఇక శరీర అవయవాల్లో కొన్నిటి పేర్లను అప్రాచ్యులు పలికినంత స్వేచ్ఛగా మనం పలకలేం. ఒకవేళ పలకాలంటే ఇంగ్లీషులో మాట్టాడ్డమో, లేదా సంస్కృతం చాటున దాక్కోవడమో చేస్తాం. ఉదాహరణకు చెప్పాల్సి వస్తే చాలానే ఉన్నాయి.. కానీ రాయలేను (చెబుతున్నాగా, తెలుగులో పలకాలంటే సభ్యతగా ఉండదన్న ఆలోచన! అసలీ జాబే దాని గురించి!!)

చంక‘ అనే మాటను పలకడం కూడా కొందరు తప్పుగా భావిస్తారు!!

——–

‘అంతా రాసావు బానే ఉందయా, ఇంతకీ ఇప్పుడు నువ్వనేదేంటి’ అని మీరడిగితే..
“నా ఆలోచనలను రాసాను, అంతే. నేననేదేం లేదండి, మీరేమన్నా అంటే వింటాను.” అని మాత్రం అంటాను.

ఉంటాను.