Archive

Archive for the ‘దివిటీలు’ Category

మేటి దివిటీలు – 2

బాపు

బామ్మ (బాపు బొమ్మ) గురించి తెలీని తెలుగువారుండరు. మన మేటి చిత్రకారుడు బాపు. మన మేటి సినిమా దర్శకుడు బాపు. మేటి కార్టూనిస్టు బాపు. మేటి రామభక్తుడు బాపు. మేటి దివిటీల్లో బాపు ఒకడు.

స్నేహానికి మేటి ప్రతీకల్లో బాపు ఒకడు. బాపు, రమణల స్నేహం జగద్విదితం. వీరిద్దరి స్నేహాన్ని పురస్కరించుకుని వీరిని ద్వంద్వ సమాసమని ప్రేమగా పిలుచుకుంటాం. ఆ
ద్వంద్వ సమాసాన్ని ఇక్కడ విడదీసిన పాపం నాదే! బాపు తన సినిమాలకు గాను అనేక మంది సాంకేతికులతో కలిసి పనిచేసాడట. ఒక్క మాటలు కుట్టే పనికి మాత్రం రమణను తప్పించుకోలేకపోయాడు. “ఆ సంకెళ్ళకూ జై” అంటూ స్వయంగా ముళ్ళపూడి వెంకట రమణ చెప్పిన మాటే అది. రచనలోని గొప్పదనాన్ని తన బొమ్మలతో బాపు మింగేస్తాడని రావిశాస్త్రి వాపోయాడట.

బాపు బొమ్మల గురించి చెప్పిన మాటల్లో చిరస్మరణీయమైనది మరొకటుంది..

కొంటెబొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె ఊయలలూపు
ఓ కూనలమ్మా!

ఇలా కూనలమ్మ పదం రాసి, ఆరుద్ర బాపుకు ఎప్పుడో పద్యాభిషేకం చేసాడు. బొమ్మలే కాదు, బాపు చేతిలో తెలుగు అక్షరాలు కూడా హొయలు పోయాయి. ఇప్పుడు ఆ చేతిరాత ఒక ఫాంటై అలరిస్తోంది

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


ఆ మేటి దివిటీకి నా హారతి..

బాపు గీసిన బొమ్మ
చూసినంతనె బ్రహ్మ
కండ్ల మెరిసెను చెమ్మ
తెలుగు బిడ్డా!

ఎనిమిది కళ్ళు చెమ్మగిల్లిన కారణం..

మహిమలున్నను చెంత
మలచలేనని సుంత
ఈర్ష్య తోడను కొంత
ఓ తెలుగు బిడ్డా!

ఈర్ష్యతోనట! కానీ ఆ కారణం కొంతే.. మరి మిగతా కారణమేంటో…

అం..త బాపును కూడ
తానె చేసినవాడ
ననెడి గర్వము తోడ
తెలుగు బిడ్డా!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ఆ మహానుభావుడికి, ఆ సత్తిరాజు లక్ష్మీనారాయణకు, ఆ బాపుకు పద్మ పురస్కారాన్ని ప్రదానం చేసే అవకాశాన్ని, తద్వారా తమ్ము తాము గౌరవించుకునే అవకాశాన్నీ పొందలేని అజ్ఞానులపై నాకు సానుభూతి కలుగుతోంది.

ప్రజల గుండెల్లో పటం కట్టుకుని ఉన్నవాడికి ఏ పురస్కారాలూ అవసరం లేదులే!

Advertisements

మేటి దివిటీలు – 1

తెలుగు వారి చరిత్ర రెండువేల యేళ్ళ నాటిది. ఐతరేయ బ్రాహ్మణంలో మొట్టమొదటి సారిగా మన ప్రసక్తి వచ్చిందట. ఎన్ని వేల యేళ్ళవాళ్ళమో ఖచ్చితంగా తెలీకపోయినా మొత్తానికి కొన్ని వేల యేళ్ళ వాళ్ళమే!

కొన్ని వేల యేళ్ళలో కొన్ని కోట్ల మంది పుట్టి, బ్రతికి, పోయారు. కొన్ని లక్షల మంది పుట్టి, బ్రతికి, బ్రతికించి, పోయారు. కొన్ని వందల మంది మాత్రం.. పుట్టి, బ్రతుకుతూ ఉన్నారు. ప్రజల మనసుల్లో వీరు చిరంజీవులు. తెలుగు జాతి ఉన్నంత కాలం వాళ్ళు ఉంటారు. అలాంటి వారిలో నుండి నాకు నచ్చిన పది దివిటీల పేర్లు ఇక్కడ రాయదలచాను. వాళ్ళు మనకు ప్రాతస్మరణీయులు. పదే రాయదలచాను కాబట్టి పదే ఉన్నాయి. పదిలో ఉండాల్సినవయ్యుండీ ఇక్కడ పేర్లు లేకపోతే.. అది నా తెలివితక్కువతనమే తప్ప చిరస్మరణీయులను తక్కువ చెయ్యడం కానే కాదు. ఆ సంగతి మీకు తెలియనిదేం కాదు!

అ వెలుగు దివిటీల గురించి రాయగలిగేంత విషయం ఉన్నవాడినేం కాదు నేను. నాకు తోచినంతలో ఒకటో రెండో పద్యాలు రాసి పూజ చేస్తున్నాను. పనిలో పనిగా నా పద్య కండూతి కూడా తీరుతోంది.

ఇక నేనెంచుకున్న వరస.. ఇది వారి జీవిత కాలాలను బట్టి తీసుకున్న వరస కాదు. వారి గొప్పతనాన్ని బట్టి నేనిచ్చిన ర్యాంకింగూ కాదు. దీనికో వరస లేదు. ఎవరిపై పద్యం సిద్ధమైతే వారి పేరు పెట్టేస్తానన్నమాట!
———————————————

వేమన:
తెలుగు వాడికి వేమన తొలిగురువు. మనకో వేదాన్ని ఇచ్చి, మన గుండెల్లో నిలిచిపోయాడు. ఉప్పు కప్పురాల తేడాయైనా, అల్పుడెలా పలుకుతాడన్నా.. వేమన వేదంలో మనకు దొరుకుతుంది! తెలుగుజాతికి ప్రాతస్మరణీయుడైన వేమన చరిత్ర అస్పష్టంగా ఉండటం మన దురదృష్టం. రెండేళ్ళ కిందనుకుంటా.. రాతప్రతుల సేకరణ అనే యజ్ఞం చేస్తే కొన్ని లక్షల పత్రాలు పోగుపడ్డాయట కేంద్ర ప్రభుత్వం దగ్గర. అలాంటి బృహత్ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వమూ చేస్తే వేమన గురించిన మరిన్ని వివరాలు తెలియవచ్చేమో!

వేమనకో నూలుపోగు:

అరటిపండునొలిచి అరచేతిలోనుంచి
ఆరగింపుమంటి వాదరమున
ఆంధ్ర జాతికీవె ఆదిగురుడవయ్య
అఖిలజనులవినుత అమర వేమ


వేమ నీతి యదియె వేమగీత యదియె
వేదసమముగాని వేరు గాదు
వేయిగళములెత్తి వేమారు పాడరా
వేద స్ఫూర్తి తోడ వేమ సూక్తి