Archive

Archive for the ‘పుస్తకాలు’ Category

ది ఫౌంటెన్ హెడ్ – ఎ కొయ్యగుర్రం రైడ్!

January 14, 2010 24 comments

ఆమధ్య, అదేదో ఇంగ్లీషు పుస్తకాలమ్మే కొట్టుకెళ్ళాం. అక్కడ తెలుగు పుస్తకాలు పెద్దగా దొరకవ్. దాని పేరు క్రాస్‌వర్డు అనుకుంటా.  పిల్లలు వెళ్దామన్నారు గదాని వెళ్ళాం. అక్కడ  అయన్ ర్యాండ్  (ఐన్ ర్యాండ్?) రాసిన పుస్తకాలు చూస్తున్నా. అయన్ ర్యాండ్ అని చనువుగా పేరు రాసాను గదా అని నేను ఆవిడ రాసిన పుస్తకాలన్నీ చదివేసి ఉంటానని అనుకునేరు.  ఒక్కటి కూడా చదవలేదు. కానీ నాకావిడ పేరు బాగా తెలుసు -యండమూరి  మనందరికీ ఆవిణ్ణి బాగా పరిచయం చేసాడు గదా! ఆయన రాసిన  కథ ఒకదానిలో  ఒక పాత్ర మరో పాత్రతో అంటుంది.. ‘అయాన్ రాండా.. ఆడి కథలు నేను చాలానే చదివాను, నాకు భలే నచ్చుతాయవి’ అని అంటాడు. అవతలోడు పెదాలు కాదుగదా, కనీసం ఒంట్లోని ఒక్క అణువు కూడా కదిలించకుండా ‘అయన్ రాండంటే ఆడు కాదు, ఆవిడ ‘ అని అంటాడు. అలా నాకు అయన్ ర్యాండు పరిచయం!

ర్యాండు గారి పుస్తకాలు చూడాలన్న కుతూహలం కలగడానికి ఇంకో కారణం కూడా ఉంది. జాలజనుల ప్రొఫైళ్ళు చూడండి.. ఒక వంద ప్రొఫైళ్ళు చూస్తే ఓ ఇరవై ముప్పై దాకా అభిమాన పుస్తకం స్థానంలో ది ఫౌంటెన్ హెడ్ గానీ, అట్లాస్ ష్రగ్‌డ్‌గానీ ఉంటది. జాలజనులంటే.. తెలుగు జాలజనుల సంగతే నేఁజెబుతున్నది, ఇంగ్లీషోళ్ళు కాదు! ‘ఏంటి, త్రివేణీ వక్కపొడికి ఇంత డిమాండా’ అనే స్థాయిలో నేను ఆశ్చర్యపడిపోతూ ఉండేవాణ్ణి. ఈ పుస్తకం పేరును నా ప్రొఫైల్లో కూడా పెట్టుకుంటే, కుసింత తూకంగా ఉంటది గదా, సమకాలికుల్తో సమానంగా ఉంటాం గదా అని ఆశపడేవాణ్ణి.

‘ఓహో, అయితే ఈడసలు ఇంగ్లీషు పుస్తకాలేమీ చదవలేదన్నమాట ‘ అని గబుక్కున తీసిపారెయ్యకండి. ఎప్పుడో పాతికేళ్ళ కిందటే ఓ రెండు పుస్తకాలను – సిడ్నీ షెల్డన్ రాసిన బ్లడ్‌లైన్, ఎ స్ట్రేంజర్ ఇన్ ది మిర్రర్ (లేక ఎ మిర్రర్ ఇన్ ది స్ట్రేంజరా?)  – జయప్రదంగా చదివేసాను. ఆ తరవాత ఎక్కడ ఇంగ్లీషు పుస్తకాల చర్చ వచ్చినా, ఈ రెండు పేర్లనూ విరివిగా వాడేవాణ్ణి. సిడ్నీ షెల్డన్ ఏదో మావాడే అన్నట్టు మాట్టాడేవాణ్ణి. అయితే మన మైనంపాటి రామ్మోహనరావులు, సూర్యదేవర భాస్కరులు, మల్లాది వీరేంద్రనాథులు, యండమూరి వెంకట కృష్ణమూర్తులూ ఆయన్ని తమవాడిగా చేసేసుకుని ఆయన పుస్తకాలను బాగానే వాడేసారంట. మా సిడ్నీ షెల్డన్ రాసిన ఆ రెండు పుస్తకాలనూ నా ప్రొఫైల్లో పెట్టుకోవచ్చు. అయితే, పాతికేళ్ళ కిందటెప్పుడో చదివినవేమో.., కథ కూడా  కొద్దికొద్దిగానే  గుర్తుంది, అదీ ఒక పుస్తకంలోదే! ఒకవేళ ఆ పుస్తకాలు నచ్చినవాడెవడైనా బ్లాగులోకొచ్చి, అందులో నీకు ఏ పాత్ర నచ్చింది? ఫలానా విలియమ్స్ అలా చెయ్యడంపై నీ అభిప్రాయమేంటి? అంటూ ప్రశ్నలేసాడనుకోండి.. అసలుకే మోసం వస్తది. అంచేత ఆ పని పెట్టుకోలేదు.

సరే, ఆ కొట్లో ర్యాండు గారి పుస్తకాలు చూసాక, కొనెయ్యాల్సిందే, కొని చదివెయ్యాల్సిందే, చదివి నా ప్రొఫైల్లో కూడా పెట్టేసుకోవాల్సిందే అని నిశ్చయించుకున్నాను. అయితే, మమ్మాయి ‘ఎందుకైనా మంచిది నానా, ఒక్కటి కొనుక్కో, అది చదివాక రెండోది కొన్నుక్కుందూగాన్లే’  అని చెప్పింది. అదీ నిజమేలే అని బాలవాక్కును మన్నించి, ఫౌంటెన్ హెడ్డొక్కటే కొన్నాను.

ఇంగ్లీషు పుస్తకాలు అంతంత లావుగా ఎందుకుంటాయో అర్థం కాదు. పైగా, వాటి పొడవు వెడల్పులు ఆ లావుకు సరిపడా సరైన నిష్పత్తిలో ఉండవు. మనిషికి ఏనుగు చెవులు తగిలించినట్టో.. ఎలాగో ఉంటై. ఫౌంటెన్ హెడ్డూ అంతే!  (మన “కోతికొమ్మచ్చి” చూడండి, ఎంత ముచ్చటగా ఉంటదో!) అంత లావు పుస్తకాన్ని కూడా చదివెయ్యాల్సిందే అని కృతనిశ్చయంతో మొదలెట్టాను.

అసలు ఫిక్షనంటే నాకు గభాలున ఎక్కదు. దానికి తోడు ఇంగ్లీషు! ఇక చెప్పేదేముంది. ఇంగ్లీషు నవల్లు మామూలుగా ఒకసారి చదివితే గబుక్కున అర్థం కావు. అర్థం కాలేదుగదా అని ముందుకు పోకుండా ఉండలేం గదా. పేజీ చదివేసి పక్క పేజీకి పోగానే పాత పేజీకీ దీనికీ లంకె తెగుతుంది. అంచేత మళ్ళీ వెనక పేజీకి పోయి ఓసారి నెమరు వేసుకొస్తూ ఉంటాను. ఒక్కోసారి ఇంకా వెనక పేజీలక్కూడా పోవాల్సి వచ్చేది. ఉదాహరణకు రోర్కు క్వారీ పనిలో ఎందుకు చేరాడో గుర్తుకు కావాలంటే మళ్ళీ ఓ నాలుగైదు పేజీలు వెనక్కి పోవాల్సొచ్చేది (రోర్కంటే ఎవరో తెలీనివాళ్ళు తెలుగు బ్లాగరుల్లో ఉన్నారని  నేననుకోను). దానికితోడు, కొన్ని పాత్రలు ఒక్కోసారి యాభై అరవై పేజీల దాకా అసలు కనబడేవే కావు. హఠాత్తుగా టూహే అనో పోహే అనో కనబడితే ఈడెవడ్రా బాబూ అనుకోని మళ్ళీ ఎనక్కెక్కడికో పోయి, ఆ శాల్తీ ఆచూకీ కనుక్కుని తిరిగి రావాల్సొచ్చేది.

పైగా ఎన్ని పేజీలు చదివేసాను అనే ఉత్సుకతొకటి.. పేజీ చదవడానికి ముందొకసారి, చదవగానే ఇంకోసారీ పేజీనంబరును చూస్తూంటాను. స్పీడుగా పేజీలు తరక్కపోయేసరికి (అసలు పేజీలు తిరిగితేగా తరగడానికి) తిక్క వచ్చేసేది. ఒక్కోసారి పేజీలు తరక్క పోగా, పేజీ నంబర్లు తగ్గేవి. ప్రస్తుతం నూటనాలుగో పేజీలో ఉన్నాననుకోండి, నిన్న నూట పదకొండో పేజీలో ఉండేవాణ్ణన్నమాట! అదిచూసి, నీరసమొచ్చేది. ఇలా రెండు పేజీలు ముందుకీ, మూడు పేజీలు ఎనక్కీ పోతూ ఉండటంతో, రోజులు వారాలై, వారాలు నెలలైపోయాయిగానీ పుస్తకమింకా పూర్తి కాలేదు. చిన్నప్పుడు చిక్కులెక్క ఒకటి చెప్పేవాళ్ళు.. ఒక కోతి ఓ 30 అడుగుల బావిలో పడిపోయింది.  బావి వరలు పట్టుకుని పైకి ఎక్కాలని ప్రయత్నిస్తోందిగానీ, అవి పాచి పట్టి ఉండటం చేత కాళ్ళు జారిపోతున్నాయి. కష్టపడి రోజుకు ఓ మూడడుగులు ఎక్కితే, కష్టపడకుండా రెండడుగులు కిందకి జారుతూ ఉండేది. ఈ లెక్కన అది ఎన్ని రోజులకు బైట పడుతుంది? అనేది ప్రశ్న. కోతి ఇరవయ్యెనిమిదో రోజునో ఎప్పుడో బైటపడుద్ది గానీ..,  నాకీ పుస్తకం అసలు ఏనాటికైనా పూర్తవుద్దో లేదో తెలీడంలా. కొయ్యగుర్రమ్మీద స్వారీ చేస్తున్నట్టైపోయింది నా పని. (మాలతిగారి తూలిక నుంచి కాపీ కొట్టేసానీ పోలికను). ఈ పుస్తకం చదువుతూ మధ్యలో అప్పుడప్పుడూ ఏ శ్రీరమణ పేరడీలో, మిథునమో, అమరావతి కథలో చదూతూంటే, మాంఛి ఎండన పడి వచ్చాక, చల్లటి కుండలోనీళ్ళు తాగినట్టుండేది. 

పుస్తకం కొని ఏడాదిన్నర పైనే అయింది. కొయ్యగుర్రపుస్వారీ ఆపేసి కూడా ఇప్పటికే ఏడెనిమిది నెల్లైపోయింది. ఈలోగా ఎన్నికలు, రాశేరె చచ్చిపోడం, వాళ్ళబ్బాయి ముఖ్యమంత్రి కాకపోడం, వరదలు, తెలంగాణ ఉద్యమం.. వీటన్నిటితోటీ నేను బాగా బిజీ అయిపోయాను. 😉  ముఖ్యమంత్రి రోశయ్యకంటే కూడా బిజీ (రాష్ట్రంలో సగం మంది రోశయ్య కంటే బిజీయే ననుకోండి). పుస్తకాన్ని మళ్ళీ మొదట్నుంచీ మొదలెట్టాల్సొచ్చేట్టుంది. ఈసారి మాత్రం “ఆరంభింపరు నీచమానవులు..” అనే పద్యాన్ని మననం చేసుకుని మరీ మొదలెడతాను.

ఏంటో.. ‘కోతికొమ్మచ్చి’ చదివేసినంత చులాగ్గా ఇంగ్లీషు పుస్తకాలు కూడా ఎప్పటికి చదువగలనో!

Advertisements

కాటమరాజు కథ – ఆరుద్ర నాటకం

August 28, 2009 6 comments
కాటమరాజు కథ
-స్టేజీ నాటకం
  • రచన: ఆరుద్ర
  • వస్తువు: ఆంధ్ర చారిత్రిక గాథ
  • రాసిన సంవత్సరం: 1961
  • ముద్రణ: 1999
  • ప్రచురణకర్త: స్త్రీశక్తి ప్రచురణలు, చెన్నై
  • ఆసక్తులు: చరిత్ర, ఛందోబద్ధ పద్యాలు
  • 130 పేజీలు, 55 రూపాయలు.
  • దొరుకుచోటు: విశాలాంధ్ర, కె.రామలక్ష్మి

కాటమరాజు కథ – 13 వ శతాబ్దం చివరిలో నెల్లూరుసీమలో జరిగిన ఒక వాస్తవ వీరగాథ. పలనాటి వీరచరిత్ర లాగా కాటమరాజు కథ కూడా మన రాష్ట్రంలో సుప్రసిద్ధం.

కాటమరాజు గొల్లప్రభువు. వేలాది పశువులు అతడి ఆస్తి. శ్రీశైలం ప్రాంతంలో తమ ఆవులను మేపుతూంటారు. ఓ సంవత్సరం ఆ ప్రాంతంలో కరవు కారణంగా గ్రాసం లేక వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దక్షిణంగా ప్రయాణించి పాకనాడుకు చేరి అక్కడి పాలకుడు నల్లసిద్ధిరాజుతో ఒక ఒడంబడికకు వచ్చి ఆ రాజ్యంలో పశువులను మేపుకుంటూంటారు. ఒక సంవత్సరం పాటు పశువులను మేపుకోనిస్తే ఆ ఏడాదిపాటూ పుట్టే కోడెదూడలన్నిటినీ నల్లసిద్ధికి అప్పగించాలి. ప్రతిగా నల్లసిద్ధి వారికి తమ రాజ్యంలో రక్షణ కల్పిస్తాడు. ఇదీ కౌలు ఒడంబడిక. అయితే, నల్లసిద్ధి ఉంపుడుకత్తె కారణంగా నల్లసిద్ధికీ కాటమకూ తగవు వస్తుంది. అది యుద్ధానికి దారితీస్తుంది.

స్థూలంగా ఇదీ కథ. ఈ కథను ఆరుద్ర నాటకంగా రాసారు. లభించిన చారిత్రిక ఆధారాల నేపథ్యంలోనే నాటకాన్ని రాసారు. యుద్ధఫలితం ఏమైందనే విషయమై చరిత్రలో సరైన వివరం లేనందువల్లనో ఏమో.. నాటకం యుద్ధఫలితాన్ని సూచించకుండా ముగుస్తుంది. యుద్ధంలో కాటమరాజు మరణించి ఉండవచ్చని పుస్తకానికి పీఠిక రాసిన పరిశోధకుడు రాసారు. ఈ యుద్ధంలోనే, ఖడ్గతిక్కన పాల్గొని మరణించింది. కవి తిక్కన (తిక్కన సోమయాజి) ఖడ్గ తిక్కనకు పినతండ్రి కొడుకు.

ఆరుద్ర ఈ నాటకాన్ని 1961 లో రచించారు. ఏ సందర్భంలో ఎవరి ప్రోద్బలంతో రాసారో ‘రచన గురించి ‘లో  కె.రామలక్ష్మి చెప్పారు. ఈ నాటకాన్ని మొదట ఎక్కడాడారో, ఎవరెవరు నటించారో కూడా తొలి పేజీల్లో ఇచ్చారు. ఆ నాటకం చదివాక నాకు కలిగిన అనుభూతి ఇది.

నాటకం చదవడానికి హాయిగా ఉంది. నేను ఏకబిగిని చదివేసాను. నాటకం ముక్కుసూటిగా సాగిపోతుంది. కథ వేగంగా నడుస్తుంది. అనవసరమైన సాగతీత లేదు. అనవసరమైన సన్నివేశాలు లేవు, సంభాషణలూ లేవు.  ఒక సన్నివేశం.. నల్లసిద్ధి కాటమరాజుకు రాయించిన కౌలుపత్రం నల్లసిద్ధికి అతడి దూత వినిపిస్తూండగా ముగుస్తుంది. వెంటనే వచ్చే సన్నివేశంలో కౌలుపత్రంలోని మిగతా భాగాన్ని అదే వ్యక్తి కాటమరాజుకు వినిపిస్తూండగా మొదలౌతుంది. సినిమాలో సీను మారినట్టుగా అనిపిస్తుంది. -సినిమావేత్త రాసిన నాటకం మరి!

చారిత్రిక కథల్లో సహజంగా ఉండే అతిశయోక్తులు ఈ నాటకంలో చాలా తక్కువగా ఉన్నాయి. నాకు అగుపడ్డ ఒక అతిశయోక్తి కాటమరాజు వద్ద ఉన్న పశువుల సంఖ్య. అది పదిలక్షలని కాటమరాజు దూత ఖడ్గతిక్కనకు చెబుతాడు. పది లక్షలంటే చాలా ఎక్కువగా అనిపించడం లేదూ!!

సంభాషణల్లో ఓ చమక్కు – సిరిగిరి అనే పాత్ర తన భర్తతో సరస సంభాషణలు చేస్తూండగా మాటల్లో భర్త, ‘నేను శ్రీశైలం వెళ్ళిపోతాను’ అని అంటాడు. సిరిగిరి అయ్యో నన్నొదిలి వెళ్ళిపోతావా అని కలత చెందుతుంది. ఓసి పిచ్చిదానా ‘శ్రీ శైలం’ అన్నా, ‘సిరి గిరి’ అన్నా ఒకటే గదా.. నేను నిన్ను చేరుకుంటాననే గదా చెబుతున్నది అని చమత్కరిస్తాడు.

రచయిత కాటమరాజు పట్ల, అతని పక్షం పట్లా ఒకింత పక్షపాతం చూపించాడని అనిపిస్తుంది. కాటమరాజును శ్రీరామచంద్ర సముడిగా చూపిస్తాడు. రాముడితో పాటు, భరతుడు, కైక పాత్రలు కూడా కనిపిస్తాయి. ఆవులను తోలుకొని దక్షిణాదికి పొమ్మని కాటమరాజుకు సిరిదేవి (కైక) చెప్పడం, అందుకు కోపించి అమె కన్నకొడుకు అయితంరాజే (భరతుడు) ఆమెపై కత్తియెత్తడం, ఖండఖండాలుగా నరికేస్తాననడం.. అంతా మరీ నాటకీయంగా ఉంది. అలాగే, యుద్ధానికి దారితీసిన కారణాల్లో నల్లసిద్ధితో పాటు కాటమరాజుది కూడా తప్పు ఉండి ఉండవచ్చు అని నాకు అనిపించింది. చరిత్రలో కూడా ఒక పక్షం వైపు పూర్తిగా మంచే ఉండి, ఎదరి పక్షం పూర్తిగా విలనీని ప్రదర్శించిందా అనేది సందేహాస్పదమే! అయితే ఇది శాస్త్రీయంగా రాసిన చరిత్ర పుస్తకం కాదు, కేవలం చరిత్ర ఆధారంగా రాసిన నాటకం. కాబట్టి, కొంత నాటకీయత సహజం, అవసరం కూడానేమో!

కాటమరాజు పాత్ర అచ్చు బొబ్బిలియుద్ధం సినిమాలో రంగారాయుడి పాత్ర (రామారావు వేసాడు) లాగానే అనిపించింది. ఆ సినిమాలో లాగానే ఈ నాటకంలో కూడా అనుచరులు చీటికీ మాటికీ కత్తులు దూస్తూ ఉంటారు. కాటమరాజు శాంతి వచనాలు చెబుతూ వాళ్ళను చల్లబరుస్తూ ఉంటాడు. ఇక, మనకు బాగా పరిచయమైన ఖడ్గతిక్కన పాత్ర మీద రచయిత ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు అనిపించింది. యుద్ధభూమి నుండి వెనుదిరిగి వచ్చినపుడు భార్యా తల్లీ అతడికి చేసిన ‘సన్మానం‘ ఇందులోనూ ఉంది. కానీ అతడెందుకు వెనుదిరిగి రావాల్సి వచ్చిందో కారణం చూపించాడు ఆరుద్ర. నాకు నచ్చిందది. ఖడ్గ తిక్కనకు సంబంధించి ఉద్వేగభరితమైన మరో సన్నివేశాన్ని సృష్టించి సెంటిమెంటును కూడా పండించాడు రచయిత.

కాటమరాజుతో పోరాడిన రాజు మనుమసిద్ధి అని మనం చదూకున్నాం.  ఈ నాటకంలో మాత్రం నల్లసిద్ధిరాజు అనే పేరు ఉంది.  నల్లసిద్ధి, మనుమసిద్ధి ఒక్కరేనా? ఈ సందేహాన్ని తీరుస్తూ, పీఠిక రాసిన తంగిరాల వేంకట సుబ్బారావు గారు ఈ ఇద్దరూ వేరువేరని తేల్చిచెప్పారు.  కాబట్టి ఆ రాజు నల్లసిద్ధి అని స్థిరపరచుకుందాం.  కానీ, నాటకమంతా నల్లసిద్ధి అనే వాడారు గానీ..,  పుస్తకంలో మొదట్లో ఇచ్చిన ‘నటీనటులు’ అనే పేజీలో రాజు పేరును మనుమసిద్ధి అని రాసారు.  నాటకంలో కూడా ఒక పద్యంలో ‘మనుమసిద్ధి’ అనే పేరు వస్తుంది. చదువరులకు ఇది అయోమయం కలిగిస్తుంది.

నాటకానికి ముందే పాత్రల పరిచయపట్టిక ఉంటే బాగుండేది. పాత్రలు చదువరికి ముందే పరిచయమైపోవాలి. లేకపోతే కొంత అయోమయంగా అనిపిస్తుంది. మొదటి రంగంలో ఓ రెండు పేజీలు కాగానే ఒక్కసారిగా నాలుగైదు పాత్రలు ప్రవేశిస్తాయి. వాటిలో ఒకపాత్ర పేరు ‘అగుమంచి ‘ -ఎప్పుడూ వినని పేరు!  అంతకుముందు ‘ఆడంగులొస్తున్నారు’ అనే సూచన ఉంది కాబట్టి ఆ పాత్ర ఆడమనిషి అని అనుకుంటాం, లేకపోతే ఆ పాత్ర ఆడో మగో కూడా తెలీదు. ఆ తరవాత తెలుస్తుందనుకోండి.  పీఠిక రాసిన తంగిరాల వారు కథను, అందులోని పాత్రలను పరిచయం చేసారు. అయితే పరిచయంలో కాటమరాజు వంశవృక్షం మొత్తాన్నీ చెప్పడంతో అది కొంచెం పెద్దదైపోయింది. నాటకం చదవబోయేముందు వివిధ పాత్రల గురించి తెలుసుకోవడం కోసం పీఠిక చదవడం తప్పనిసరి.

నాటకం కాబట్టి ప్రతి సంభాషణకూ ముందు పాత్ర పేరు రాస్తారు కదా..  ‘అయితంరాజు’ అనే పాత్ర చెప్పే మొట్టమొదటి సంభాషణకు ముందు “అయి” అని రాసారు. ముందే పాత్రల పరిచయంలేదు…, కనీసం పాత్రను పరిచయం చేసే సన్నివేశంలోనైనా పూర్తిపేరు వెయ్యొద్దా? ‘అయి’ అంటే ఏం అర్థమౌతుంది? అంతకు ముందు వేరే పాత్రలు ఈ పాత్ర గురించి మాట్టాడుకుంటాయి కాబట్టి కొంత అర్థమౌతుంది.

నాటకం చూస్తే కలిగే అనుభూతి బహుశా నాటకాన్ని చదివితే కలగదు. పాత్రల ఆహార్యాన్నీ, హావభావాల్నీ ఊహించుకుంటేగానీ మనం నాటకాన్ని ఆస్వాదించలేం. ఈ నాటకాన్నే ఒక నవలగా చదివితే బహుశా నాకు మరింత తృప్తిగా ఉండేదేమో! నవలలోనైతే సంభాషణలే కాక, పాత్రల మానసిక పరిస్థితి, మనోభావాల వర్ణన కూడా ఉంటాయి కాబట్టి, రచన మరింత సమగ్రంగా ఉంటుంది. సన్నివేశానికి ముందు ఆ సన్నివేశం గురించిన వర్ణన, వివరణ మరింత విపులంగా ఉండాలేమో ననిపించింది.
పద్యాలు ఇష్టపడేవాళ్ళకి, ఈ నాటకం మరింతగా నచ్చుతుంది. చక్కటి పద్యాలను ఇందులో సందర్భోచితంగా ఇమిడ్చారు. ఇప్పటికే వ్యాప్తిలో ఉన్న చాటువులను సేకరించారు. కొన్ని రచయిత తానే రాసారట. పద్యాలు పెద్ద పెద్ద సమాసాలతో కాకుండా తేలిక పదాలతో సులభంగా అర్థమౌతూ ఉంటాయి. చక్కగా పాడుకోను వీలుగా ఉంటాయి. మచ్చుకో పద్యం చూడండి.

సీస||

మురదండ మేఘముల్ ముసిరి వచ్చుటలేదు
                  ముంతపోతగా వాన ముంచలేదు
దడదడ చప్పుళ్ళ దబ్బాటు వానలా?
                  గొర్తి పదునుదాక కురియలేదు
వర్షించు వేళలో వాగళ్ళు కనిపించి
                  సింగిణి రంగులుప్పొంగలేదు
ఎల్లంకి గాలులు ఏనాటి ముచ్చటో
                  పీచరగాలైన వీచలేదు

తే.గీ||
కన్నెపిల్లలు కావిడికట్టె త్రిప్ప
కప్పతల్లియు నోరెండి కన్నుమూసె
వరుణదేవుని గుండెలు కరుగలేదు
చేటు కాలము ప్రాప్తించె కాటభూప

తేటగీతిలోని చివరి పాదాన్ని చూడకపోతే, ఈ పద్యాలు నేటి ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితిని వర్ణిస్తూ రాసినవేమోననుకుంటాం.

నాటకంలో ‘ఠాణా’ అనే పదాన్ని వాడారు. హిందీ మాటను వాడారేంటబ్బా అనుకున్నాను -బహుశా సంస్కృతపదమయ్యుండొచ్చు.   ‘లంచం ‘ ఆ రోజుల్లోనే ఉండేదని కూడా అర్థమైంది.

పుస్తకం రాసినవారి ప్రజ్ఞ గురించి నేను చెప్పగలిగినదేమీ లేదు. కానీ, వేసినవారి గురించి మాత్రం రెండు ముక్కలు చెప్పాలి.  బాపుబొమ్మ అట్టతో, పెద్ద అక్షరాలతో పుస్తకాన్ని ముద్రించారు. నాటకం మొత్తానికి ఒక ఖతి (ఫాంటు), పద్యాల కోసం ప్రత్యేకంగా వేరే ఖతినీ వాడారు. ఆ పద్ధతి బాగుంది. అయితే ఒక్క పద్యానికి మాత్రం మామూలు ఖతే పడింది, ఎందుకో తెలవదు. కొన్ని పద్యాల పాద విభజన సరిగ్గా లేదు. కంపోజింగు అయ్యాక, సరిచూడవలసినవాళ్ళు సరిగ్గా చూడలేదన్నది స్పష్టం. ‘ఛందస్సు సరిపోవడంలేదేమిటా’ని కూడా చూసుకోలేదు. పద్యాల్లో అచ్చుతప్పులూ దొర్లాయి. ఇతరచోట్ల కూడా అచ్చుతప్పులున్నాయి.పద్యాల కోసం వాడిన ఫాంటులో ‘ళ’ అక్షరం సరిగ్గా లేదు, అది అచ్చం ‘శ’లాగా కనిపించింది. (బొమ్మలో చూడండి) నాకు చాలా అసంతృప్తి కలిగించిన అంశమది. ఖతిలో ఆ దోషం ఉన్నపుడు వేరే ఖతి వాడి ఉండాల్సింది. ఏదో ఒకటి అచ్చేసి ప్రజల్లోకి తోసేద్దామనుకుంటే జరిగేది అచ్చుతప్పులూ అచ్చ తప్పులేకాదు, రచయితకు అపచారం కూడా.

కథకు సంబంధించి ఆకరాలను (రిఫరెన్సులు), మూలాలను కూడా ఇచ్చి ఉంటే పుస్తకానికి మరింత విలువ రావడమే కాదు, ఈ కథ గురించి మరింత తెలుసుకునేందుకు చదువరులకు అవకాశం ఉండేది. కథ జరిగిన ప్రదేశాలను సూచిస్తూ ఒక మ్యాపును పుస్తకంలో ఇచ్చి ఉంటే కూడా బాగుండేది.

చాలా తెలుగు పుస్తకాలకు ఉండే ప్రత్యేకతలు దీనికీ ఉన్నాయి. అవి:

  • మూడో పేజీలోనో నాలుగో పేజీలోనో పుస్తకం గురించి వేస్తారు చూడండి.. పుస్తకం పేరు, ముద్రించినది ఎక్కడ, ప్రచురించినది ఎవరు, ఏ సంవత్సరంలో వేసారు, ఎన్నో ఎడిషను, ప్రతులు ఎక్కడ దొరుకుతాయి వగైరా సమాచారం మొత్తం, అన్ని పుస్తకాల్లోలాగే ఇంగ్లీషులోనే ఉంది. దీన్ని ఇంగ్లీషులో వెయ్యాల్సిన అవసరం ఏంటో? మన సినిమాల్లో పేర్లన్నిటినీ తెలుగులో వేసేసి, నిర్మాత దర్శకుల పేర్లు మాత్రం ఇంగ్లీషులో కూడా వేసుకున్నట్టు, మన పాటల కాసెట్ల మీద పాటకు సంబంధించిన క్రెడిట్లన్నీ ఇంగ్లీషులో ఉన్నట్టు!
  • ISBN లేదు.

"మహాకవి శ్రీశ్రీ" జీవిత చరిత్ర

December 9, 2007 24 comments

1983లో అతడు భౌతికంగా మరణించినా మరికొన్ని సహస్రాబ్దాల పాటు అతడి కవిత్వం బతికే ఉంటుంది. తన జీవిత కాలంలోనే చరిత్ర ప్రసిద్ధుడైన శ్రీశ్రీ అనంతర కాలంలోనూ అలాగే జీవిస్తాడు. కవిత్వమున్నంత కాలం, కవిత్వ రసాస్వాదన ఉన్నంత కాలం కవితానుభూతి ఉన్నంత కాలం అతడు ఉంటాడు. ” శ్రీశ్రీ జీవిత చరిత్ర పుస్తకాన్ని ముగిస్తూ రచయిత రాసిన వాక్యాలివి.

కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి, ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవి లేనే లేడు. ఇదే అతణ్ణి సాహితీ శిఖరాగ్రాన నిలిపింది“. శ్రీశ్రీ కవిత, “కవితా ఓ కవితా” గురించి రాస్తూ ఆ పుస్తకంలోనే రచయిత అన్న మాటలివి.

ఎన్నోసార్లు నిరీశ్వరవాదినని బడాయి మాటలు చెప్పిన శ్రీశ్రీ తిరుమల కొండ మీద శాస్త్ర సంప్రదాయానుగుణంగా తన కొడుకు ఉపనయనం చేశాడు. ఢిల్లీ కన్నడ సాహిత్య పరిషత్తు వారు బహూకరించిన మురళీ కృష్ణుడి చందన విగ్రహాన్ని ఆత్రంగా పొట్లాం విప్పి, బహిరంగంగా కళ్ళకద్దుకున్నాడు.” ఇవీ ఆ పుస్తకంలోని వాక్యాలే!

కేంద్ర సాహిత్య అకాదెమీ వాళ్ళు వేసిన ఈ “మహాకవి శ్రీశ్రీ” ని రాసింది బూదరాజు రాధాకృష్ణ. ఆయన ముక్కుసూటి మనిషని, నిర్మొహమాటస్తుడని ఎక్కడో చదివాను. మరి శ్రీశ్రీ జీవిత కథను ఆయన ఎలా రాసిఉంటాడో నన్న కుతూహలం కొద్దీ ఆ పుస్తకం కొన్నాను.

జీవిత చరిత్రలను నేను చదివింది చాలా తక్కువ. చదివిన ఆ కాసిని చరిత్రలూ నాకొకలాగే కనిపించాయి. చిన్నప్పుడు ఎన్నో కష్టాలకోర్చి అనుపమానమైన కృషితో, పరిశ్రమతో పైకి రావడం, చివరికి ఏ రాష్ట్రపతో, ప్రధానమంత్రో, మంత్రో శాసనసభ్యుడో, గొప్ప సంఘసంస్కర్తో అవడం.. ఇదీ టూకీగా కథ. పుస్తకం మొత్తం ఒళ్ళు గగుర్పొడిచే గొప్పదనమే. పుస్తకం చదువుతూండగానే అంతకు ముందు చదివిన జీవితకథలు బుర్రలో రెక్కలు విప్పుకుంటూ ఉంటాయి.

అయితే ఈ పుస్తకం మాత్రం విభిన్నంగా ఉంది. రచయిత నిర్మోహంగా, నిర్మొహమాటంగా రాసాడా జీవిత చరిత్రను. వ్యక్తిగతంగా శ్రీశ్రీ లోని తప్పులను విమర్శించేందుకు ఆయన వెనకాడలేదు. “..శ్రీశ్రీ కి లేని వ్యసనం లేదు..”, “..తాగి..”, “..భగందరం అనే వ్యాధి వచ్చింది..” ఇలాంటి ఎన్నో వ్యాఖ్యలున్నాయి ఆ పుస్తకంలో. శ్రీశ్రీ వ్యక్తిత్వాన్ని మనముందు నిలబెట్టే రచన అది.. లేనిపోనివి కల్పించో, ఉన్నవాటిని దాచేసో చేసే మాయ కాదది. 8 అధ్యాయాలుగా విడగొట్టిన ఈ పుస్తకాన్ని ఇంగ్లీషు నుండి (ఇంగ్లీషులో రాసింది కూడా బూదరాజు గారే!) అనువదించారు. నాకు బాగా నచ్చిన జీవిత చరిత్ర ఇది. బహుశా శ్రీశ్రీ జీవితం ఎన్నో మలుపులూ మసాలాలతో కూడుకున్నది కావడం కూడా పుస్తకం ఆసక్తి కరంగా ఉండడానికి కారణం కావచ్చు.

“..తెలుగులో మొట్టమొదటిసారిగా పజిల్సు సృష్టించాడ”ని కూడా రాసారా పుస్తకంలో. పజిల్సంటే బహుశా గళ్ళ నుడికట్టే అయితే, తెలుగు గళ్ళనుడికట్టుకు శ్రీశ్రీయే ఆద్యుడన్నమాట! (శ్రీశ్రీ దానికి పెట్టిన పేరు పదబంధ ప్రహేళిక అనుకుంటా)

పుస్తకంలో ఆరుద్ర గురించి కూడా విమర్శనాత్మక వ్యాఖ్యలు ఉన్నాయి. ఒకచోట ఇలా రాసాడు.. “శ్రీశ్రీ షష్టిపూర్తి జరిగినప్పుడు, మదరాసులో శ్రీశ్రీ అంతిమ యాత్ర జరిగినప్పుడు ఆరుద్ర ప్రవర్తించిన తీరు కనీసం లోకందృష్టిలోనైనా హుందాగా లేదనిపించింది“. అలాగే “ఒకటి మటుకు ఖాయం. చరమదశలో శ్రీశ్రీ మానసికంగా బాధపడ్డాడు ఆరుద్ర కారణంగా. తన బహిరంగ శత్రువులెవరూ శ్రీశ్రీ నింతగా బాధించలేదు.” అనీ రాసాడు.

రాకేశ్వరుని బ్లాగులో శ్రీశ్రీ గురించి చదివాక నాకీ పుస్తకం గుర్తొచ్చింది. మళ్ళీ మొన్న బూదరాజు అశ్విన్ గారితో మాట్టాడుతూ ఉండగా ఈ పుస్తకం ప్రసక్తి వచ్చింది. శ్రీశ్రీ తన ఆత్మకథ అనంతంను కూడా ఇలాగే నిర్మొహమాటంగా రాసుకున్నారని అశ్విన్ గారు చెప్పారు. ఓ పాలి అది కూడా చదవాలి!