Archive

Archive for the ‘ప్రభుత్వం’ Category

హిందూమతంపై దాడి

August 24, 2009 8 comments

* ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి, ‘ హిందూ దేవాలయాల్లో పనిచేసేవారు హిందువులే అయ్యుండాల్సిన అవసరం లేదు. ఏ మతస్తులైనా పనిచెయ్యవచ్చు ‘ అని చెప్పాడు.

* మనదేశంలో మతమార్పిడి చెయ్యడం ఎంత చురుగ్గా జరుగుతోందో మనకు తెలుసు. ఈ మతబేహారులు చాపకింద నీరులాగా సమాజమంతా పాకి ఉన్నారు. డబ్బులు ఎరవేసి, ప్రజల మతం మారుస్తారు. కానీ మతం మార్చాక కూడా వాళ్ళను హిందువులుగానే చెలామణీ చేయిస్తారు. హిందువులకుండే రిజర్వేషనులు అనుభవించాలిగదా మరి! హిందువులుగా చెలామణీ అవుతున్న కొందరు హిందువులు కారు. హైందవం వద్దనుకుని బయటికిపోయినవారు .

~~~~~~~~~

కోదండరామస్వామి గుడిలో పూజారి దేవుడి నగలను తాకట్టు పెట్టుకున్నాడు. పూజారి చేసినది తప్పే. అందుకు తగిన శిక్ష పడాల్సిందే. ఇంకా అలాంటి తప్పులెక్కడెక్కడ జరిగాయో అవన్నీ కూడా తేలాలి, శిక్షలూ పడాలి. తప్పు చేసినది పూజారైనా పడాలి, ప్రభుత్వ అధికారైనా పడాలి. అడ్డదారినో దొడ్డిదారినో గుడుల్లోకి జొరబడ్డ రాజకీయులైనా సరే శిక్ష పడాల్సిందే! గతంలో తప్పులుచేసినవాళ్ళకు ఏం శిక్ష వేసారో కూడా చెప్పాలి. హైదరాబాదులోని తితిదే సత్రంలో తాగి తందనాలాడినవాళ్ళను ఏంచేసారో చెప్పాలి. ఆ తాగుబోతుల నాయకుణ్ణి ఏంచేసారో చెప్పాలి. తితిదే పాలక సంస్థలోకి ప్రత్యేక ఆఫీసరు పేరిట అర్హత లేనివాళ్ళు ఎలా వచ్చారో చెప్పాలి.గుడుల్లో అన్యమతప్రచారం చేసినవాళ్ళకు ఏం శిక్ష వేసారో కూడా చెప్పాలి.

~~~~~~~~~

కానీ వీళ్ళందరినీ శిక్షించినంత మాత్రాన పరిస్థితులు చక్కబడతాయా? హైందవ ద్వేషులు అక్కడితో ఆగుతారా? అసలు కథ ఇంకోటుంది. ఈ సంఘటనను ఆసరాగా చేసుకుని గుడులమీద ప్రభుత్వ పెత్తనాన్ని విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. ‘చ్చొ..చ్చొ..చ్చొ చూసారా.. దేవుడి సొమ్ముకు భద్రత లేకుండా పోయింది. దీనిమీద ప్రభుత్వ ఆజమాయిషీ మరింతగా పెరగాలి’ అంటారు. నగల సంగతి చూట్టానికి ఇంకో అధికారిని వెయ్యాలంటారు. ఆ తరవాత ఆ నగలు, డబ్బులన్నిటినీ ఒకచోటికి తరలించి ప్రభుత్వ నియంత్రణలో పెడదామంటారు.  అసలు పూజారులందరూ అధికారుల పర్యవేక్షణలోనే మంత్రాలు చదవాలంటారు. గుడులను, ఆచార వ్యవహారాలను పూర్తిగా ప్రభుత్వ ఆజమాయిషీలోకి తెచ్చేందుకు కుటిల యత్నాలు చేస్తారు. ప్రభుత్వం మనదే కదా, మనమెందుకు వద్దనాలి?

~~~~~~~~~~

  1. దేవాదాయశాఖ మంత్రి ‘హిందూ దేవాలయాల్లో పనిచేసేవారు హిందువులే అయ్యుండాల్సిన అవసరం లేదు. ఏ మతస్తులైనా పనిచెయ్యవచ్చు’ అని చెప్పాడు. ఇలాంటివాళ్ళు మనకు మంత్రులుగా ఉన్నప్పుడు హిందూమతానికి రక్షణ ఏముందిక? హైందవమంటే ఏమీ తెలవనివాడు గుడిలో కార్యక్రమాలను నిర్వహిస్తాడు. హిందవమంటే ద్వేషం కలిగినవాడూ గుడిలో పనులు చేస్తాడు. ఎంత నీచమైన ఆలోచనో చూడండి. పైగా దేవాలయాల వ్యవహారాలను చూడాల్సిన మంత్రి ఆలోచన ఇది.
  2. మతబేహారుల చేతుల్లో మతమార్పిడికి గురై అస్తిత్వం కోల్పోయి, కొత్త ముఖాలు, కొత్తపేర్లు  తెచ్చుకుంటారే.. వీళ్ళు హిందువుల్లాగానే చెలామణీ అవుతూంటారు. ప్రభుత్వ లెక్కల్లో తమను హిందువులుగానే రాయించుకుంటారు. ఈ దొంగ హిందువులు కూడా మిగతావాళ్ళలాగానే ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరతారు. అందుకు ఆక్షేపణేమీ లేదు. వాళ్ళు దేవాదాయ ధర్మాదాయ శాఖలోనూ చేరతారు. వాళ్ళే గుడుల్లో అధికారులూ అవుతారు. వాళ్ళే గుడి రోజువారీ వ్యవహారాల్లో కలగజేసుకుంటారు. హిందువుకానివాళ్ళు హిందూ దేవాలయ వ్యవహారాలు చూస్తూ ఉంటారు! పైకి వాళ్ళు హిందువులే, కానీ కేవలం ప్రభుత్వ లెక్కల్లోనే హిందువులు, అంతే! దేవాలయ వ్యవస్థను కూలగొట్టడానికి ఇది చాలదా?

వీటి పర్యవసానాలు హిందూమతానికి, మత కేంద్రాలైన గుడులకూ చేటు. మనందరం ఈ ప్రభుత్వ జోక్యాన్ని వ్యతిరేకించాలి. గుడుల్లో ఏ పని ఏ కులస్తుడు పనిచేసినా తప్పులేదు. కానీ ఏ మతస్తుడైనా చెయ్యొచ్చనడం మాత్రం తప్పు! అసలా మాట అనడమే హిందువులకు అవమానం! అసలు రాజకీయ నాయకులు గుడి వ్యవహారాల్లోకి ఎందుకు రావాలి? గుడుల నిర్వహణకు ధార్మిక సంస్థలతో కూడిన వ్యవస్థ ఒకటి ఉండాలి. ప్రభుత్వానికి గుడి సంగతి అనవసరం! లౌకికరాజ్యం అని చెప్పుకుంటున్నాం గదా.. గుడి సంగతి రాజ్యానికెందుకు?

హైందవాన్ని అణచేద్దామని మాటేసి ఉన్న కేటుగాళ్ళ పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. మతమార్పిళ్ళను వ్యతిరేకించాలి. మతమార్పిళ్ళను, మతం పేరిట దేశంలోకి డబ్బు రాకడను నిషేధించాలి. మతమార్పిడి రానున్న కాలంలో మనమెదుర్కోబోతున్న అతిపెద్ద సామాజిక సమస్య. హిందువులెందరో, దొంగ హిందువులెందరో, ఇతర మతస్తులెందరో సరిగ్గా లెక్కతేల్చాలి. ఇతర మతాలను వ్యతిరేకించడం కాదు, ఇతర మతాలు హిందూమతమ్మీద చేస్తున్న గుట్టుచప్పుడు దాడిని ఎదుర్కోవాలి.

———————-         ———————          ——————–
Advertisements

ఇడుపులపాయ ఎస్టేటు – ఆంధ్రప్రదేశ్ ఎస్టేటు

November 1, 2008 10 comments

ఈ రెండూ శివదేవుడివే!

ఇడుపులపాయలో ఆసామికి తెలవకుండా ఒక్ఖ మొక్కజొన్న కండెను కాపలావాడు తెంపుకెళ్ళగలడా? నాలుగు మామిడికాయలను కోసుకెళ్ళి ఆవకాయ పెట్టుకోగలడా? ఆ సంగతి ఆసామికి తెలిస్తే వాడి కథేమవుతుంది? “అయ్యా ఫలానా మునిరత్నం దొంగతనంగా మామిడికాయలు కోసుకెళ్ళాడు” అని మరో వెంకటప్ప ఆరోపిస్తే ఏం జరుగుతుంది? పంచాయితీ జరుగుతుంది నిజమేమిటో తేలుతుంది. దొంగ అని తేలితే మునిరత్నం, ఆరోపణ తప్పని తేలితే వెంకటప్పల సంగతి తేలిపోతుంది. వాళ్ళిక పని చాలించి ఎస్టేటు బయటికి నడవాల్సిందే!

కానీ, అయ్యవారి ఆంధ్రప్రదేశ్ ఎస్టేటులో మాత్రం అలా జరగలా!

తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక పన్ను కింద ప్రభుత్వానికి రావలసిన డబ్బులోంచి ఏడు కోట్లు తినేసారని మంత్రి గొల్లపల్లి సూర్యారావు (మొదటి సూర్యుడు) ఆరోపించాడు. తిన్నది మంత్రి దివాకరరెడ్డి (రెండో సూర్యుడు) అట. అదొక్కటే కాదు.. తాను జిల్లా పర్యటనకు వచ్చినపుడు తిరిగేందుకుగాను ఒక కొత్త కారు కొనిపించాడట. ఎవరెవరో తిరిగిన కారులో తిరగను, కొత్తకారు కావాల్సిందే అని చెప్పి మరీ కొనిపించాడట – స్వయంగా సూర్యారావు చెప్పిందే ఇది. వీళ్ళిద్దరికీ ఈ వివాదం విషయంలో ఉన్న తక్షణ సంబంధం ఏంటంటే.. దివాకరరెడ్డి తూగోజీకి ఇన్‌ఛార్జి మంత్రి. గొల్లపల్లి ఆ జిల్లాకు చెందినవాడు. మనకు తెలిసిందిది.., తెరమాటున ఇద్దరికీ ఎన్నున్నాయో ఆ శివదేవుడికే ఎరుక!

సరే వీళ్ళ గొడవిలా ఉంటే, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించవలసిన ముఖ్యమంత్రి ఏంచేసారు? దాని మీద విచారణ కోసం ఓ మంత్రుల కమిటీ వేసి నాటకమాడారు. వాళ్ళు విచారణ చేసిందేమిటి? నీ ఆరోపణలను ఉపసంహరించుకోమని మొదటి సూర్యుడికి చెప్పారు, నచ్చజెప్పారు. లేకపోతే నీ సంగజ్జూస్తామని బెదిరించి ఉంటారు. నీ నలుపును కూడా బయటపెడతాం గురివింద గింజా అని తర్జని చూపించి ఉంటారు. దెబ్బకి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి రెండో సూర్యుని మనసు నొప్పించినందుకు చింతించాడు. బయటికొచ్చాక, బయటపడ్డ చేపలాగా కాస్త గింజుకోజూసాడుగానీ, చివరికి లొంగిపోయాడు.

ఇంతకీ ఆ ఏడుకోట్లు ఉన్నట్టా, పోయినట్టా? మంత్రి తిన్నట్టా తిననట్టా? తిన్నట్టైతే రెండో సూర్యుడు ఇంకా మంత్రివర్గంలో ఎందుకున్నట్టు? తిననట్టైతే ఆ సొమ్ము ఎక్కడికి పోయినట్టు? ఆరోపణలు చేసిన మొదటి సూర్యుడు ఇంకా మంత్రివర్గంలో ఎందుకున్నట్టు? సాధారణ మానవుడికి తెలిసిందొకటే -ఇద్దరిలో ఎవరో ఒకరే మంత్రివర్గంలో ఉండాలి. ముఖ్యమంత్రి చెయ్యాల్సిందల్లా ఉండాల్సిందెవరో, బయటికి పంపాల్సిందెవర్నో తేల్చడం -అంతే! కానీ ఇదేమీ జరగకుండా అందరూ కలిసి ఏదో ఒప్పందానికొచ్చినట్టు కనబడుతోంది. ఏంటా ఒప్పందం?

ఆంధ్ర ప్రదేశ్ ఎస్టేటుతో ఒక సౌలభ్యం ఉంది. ఆస్తి ఆసామీది కాదు, జనాలది! ఆస్తి పరిరక్షణ మాత్రం ఆసామి పని. తనవాళ్ళు, తనకిష్టమైనవాళ్ళు ఆ ఆస్తిని నంజుకు తిన్నా.. ఆసామికి పోయేదేమీ లేదు. పరిరక్షుకుడుగా తాను ఉండాలి, అంతే!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఇడుపులపాయ ఎస్టేటులో కొంత ముక్క జనాలదే అని రాజావారు గతంలో చెప్పారు. మా పూర్వీకులు కలిపేసుకున్నారు అని ఆయనే చెప్పుకున్నారు. పెద్ద ఎస్టేటులోంచి చిన్నదాని లోకి మార్చుకున్నారన్నమాట!

ప్రభుత్వ భూ కబ్జాను ఎదుర్కోవడం ఎలా?

September 5, 2008 3 comments
ప్రత్యేక ఆర్ధిక మండలాలు, కోస్టల్ కారిడార్, ఇంకా ఇతర ప్రాజెక్టుల కొరకు మన రాష్ట్ర ప్రభుత్వం ఎడాపెడా రైతుల భూములు సేకరిస్తోంది. ఒక పద్ధతీ పాడూ లేకుండా జరుగుతున్న ఈ భూసేకరణ వల్ల రైతులు దారుణంగా మోసపోయి రోడ్డున పడుతున్నారు. 
ఇక ముందైనా అలా జరగకూడదనే సదుద్దేశ్యంతో మానవ హక్కుల వేదిక (HRF) వారు ఇటీవల “ప్రభుత్వం మీ భూమి కోసం వస్తే…” అనే ఒక చక్కని పుస్తకాన్ని ప్రచురించారు. పోలేపల్లి సెజ్ వ్యతిరేక ఐక్య సంఘటన వారు తమ బ్లాగులో కూడా దీన్ని ప్రచురించారు.

మరోసారి తలంటు!

November 22, 2007 3 comments

ప్రాజెక్టుల్లో తప్పులు జరిగాయని సియ్యేజీ అంటోంది. పత్రికలు, ప్రతిపక్షాలూ పెడుతూ వస్తున్న గోల నిజమేనని తేలిపోయింది. గోదావరి జల వినియోగ అథారిటీ పై తన నివేదిక (cag.nic.in/html/cag_reports/andhra/rep_2007/civil_chap_3.pdf) 70 వ పేజీలో సియ్యేజీ ఇలా అంది:

“There were serious deficiencies in the efficient, economic and effective implementation of the projects undertaken under GWUA. The schemes were undertaken without proper care in finalizing the ayacut, source and availability of assured power supply…”


“..The agreements were one sided in favour of the contractors and suitable provisions were not incorporated to protect Government interest. The consultants were not made responsible for any deviations in quantities, designs and drawings during execution. The contractors enjoyed huge undue benefits due to incorrect projection of materials required, preparation of unrealistic estimates, etc. Despite being monitored at all levels, the rate of progress in the works under SSP and JCRDLIS is not as per the milestones fixed.”

ప్రభుత్వం మాత్రం తనకు అలవాటైన పద్ధతిలోనే రాజ్యాంగ సంస్థ, సియ్యేజీ మీద కూడా ఎదురుదాడి చేస్తోంది. ప్రాజెక్టుల అంచనాలు పెంచేశారంటూ ‘కాగ్‌’ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని మంత్రి పొన్నాల లక్ష్మయ్య కొట్టిపారేసాడంట! మరీ చిత్రమేంటంటే “తన హయాంలో ‘కాగ్‌’ ఇచ్చిన నివేదికలన్నింటినీ చంద్రబాబు అంగీకరిస్తారా?” అని అడిగాడంట. బాబొప్పుకుంటే ఈయనొప్పుకుంటాడు గామోసు!

ఇలాంటి నివేదికలు వచ్చాక, బాధ్యుల మీద చర్యలేమీ లేకపోతే ఇట్టాగే మాట్టాడతారు.

బస్సు దోపిడీ!

October 16, 2007 4 comments

ప్రైవేటు బస్సుల అరాచకాన్ని అరికట్టేందుకు దసరా సమయాన ఒక దుర్గమ్మ పూనుకోవలసి వచ్చింది. ప్రైవేటు బస్సుల ఆగడాల గురించి మనకు తెలిసిన విషయాలు చాలానే ఉన్నాయి. ప్రభుత్వానికీ ఇవి తెలుసు. ఇవిగో కొన్ని..

  1. ప్రభుత్వానికి జెల్ల కొట్టడంలో వీళ్ళది అందె వేసిన చెయ్యి. టూరిస్టు క్యారేజిగా తిరగాలవి.. కానీ స్టేజి క్యారేజిగా తిరుగుతాయి. ఆంధ్ర దేశంలో ఉన్నవాళ్ళందరికీ తెలుసా సంగతి, సంబంధిత అధికారులకు తప్ప!
  2. హై. నుండి మీ ఊరికి ఒక బస్సూ, అట్నుండి ఇటొకటీ ఒకే సమయానికి బయలుదేరుతాయి. ఒక్కో బస్సుకు ఒక్కో ప్రత్యేక రిజిస్ట్రేషను నంబరుంటుంది (కదా!). రెంటికీ పన్ను కడతారని మనబోటి అమాయకులం అనుకుంటాం (కదా!). పాపం ప్రభుత్వమూ అలాగే అనుకుంటుంది. (ఔనా! ఏమో?) కానీ వాళ్ళు ఒకదానికే కడతారు.. ఆ నంబరు పెట్టుకునే రెండు బస్సులూ తిరుగుతాయి.
  3. రాత్రి ఎనిమిది నుండి పదింటి దాకా కూకట్‌పల్లి నుండి దిల్‌సుఖ్ నగరు దాకా చూడాలి.. మాఊరు, మీ ఊరని లేదు.. మొత్తం రోడ్డంతా వాళ్ళదే. రోడ్డు మీంచి ఒక్క అంగుళం కూడా దిగరు. మన హై. ముష్టి రోడ్లకు తోడు వీళ్ళ ఆగడం జతై మనకు నరకమే కనిపిస్తుంది.
  4. బస్సుపైన బస్సెత్తున సామానేస్తారు. హై. దాటేటప్పటికి పన్నెండు దాటుద్ది. ఇక ఆపైన ప్రయాణం మేఘాల్లో తేలిపోతూ సాగుతుంది. పైప్రాణాలు పైనే పోతాయి. మొన్న ఈనాడులో చూసాం కదా ఏం జరిగిందో!
  5. ప్రజలను దోచడంలో వీరు ఎమ్మెన్సీలకు పాఠాలు చెప్పగలరు. ప్రతి శుక్రవారం హై. నుండి గుంటూరు వెళ్ళే కొన్ని (అన్నీనా.. ఏమో?) బస్సుల్లో టిక్కెట్టు వెల పెరుగుతుంది. ఆది వారం అటునుండి వచ్చే టిక్కెట్లు వాస్తాయి. వీకెండుకు ఇంటికెళ్ళే సాఫ్టువేరు శ్రీమంతుల స్పెషలది. ఇది వారాంతపు స్పెషలు దోపిడీ. టిక్కెట్ల నల్లబజారు! సినిమా హాళ్ళ వాళ్ళు కొత్త సినిమాలకు టిక్కెట్లను పెంచేసినట్టు!!
  6. మీ ఊరి నుండి కూకట్‌పల్లి వెళ్ళాలని ఎక్కుతారు. పొద్దున్నే ఎస్సారు నగర్లో ఆపేసి, ఇకపోదు, అదిగో ఆ బస్సెక్కండి.. ఇదుగో ఈ ఆటోలో వెళ్ళండి అని అంటారు.

ఈనెల 5న మా అమ్మానాన్నా పొన్నూరు నుండి ప్రైవేటు బస్సులో వచ్చారు. రాత్రి రెండున్నరకి మా నాన్న ఫోను చేసారు.. “బస్సు బోల్తా పడింది, చీకటిగా ఉంది, ఎక్కడున్నామో తెలీదు, అంతా క్షేమమే, కంగారు పడొద్దు” అని. కాస్సేపటి తరవాత ఏదో ఆర్టీసీ బస్సులో ఎక్కి, పొద్దున తొమ్మిదిన్నరకు ఇంటికి చేరారు. ఇంతకీ, బస్సు డ్రైవరు పారిపోయాడు! వాడు అసలు డ్రైవరు కాదు.. అసలు డ్రైవరు గారి బావమరిదో మరొకడోనంట. అంతకు ముందు అక్కడెక్కడో ఆపి, దిగిపోయి, కాస్సేపాగాక మళ్ళీ ఎక్కాడంట.. అక్కడ మందేసి ఉంటాడని ప్రయాణీకుల అనుమానం!

ప్రైవేటు బస్సులని ఎత్తెయ్యాలని కాదు.. వాటిని అదుపు చెయ్యాలి. ప్రజలను వాళ్ళు పెట్టే ఇబ్బందుల నుండి రక్షించాలి. టిక్కెట్టు రేట్లు అదుపు చెయ్యాలి (ఆర్టీసీ వాళ్ళను చేసినట్టుగా). ప్రయాణీకుల బళ్ళు ప్రయాణీకుల కోసమే నడవాలి. సరుకు రవాణా కోసం వాడరాదు.

ప్రస్తుతానికి పూనం మాలకొండయ్యదే పైచేయి. చూద్దాం, ప్రభుత్వమామెను ఎన్నాళ్ళు పనిచెయ్యనిస్తుందో!