Archive

Archive for the ‘బాల్యం’ Category

పత్రికలూ నేనూ

(గత టపా తరువాయి)

వీటన్నిటికంటే ముందు యువ వచ్చేది. వడ్డాది పాపయ్య బొమ్మలు తప్ప మరింకేవీ గుర్తు లేవు నాకు.  వపా బొమ్మల వేళ్ళు ఎలా ఉండేవి.. సన్నగా, కోసుగా, చివర్లు నైసుగా వంపు దిరిగి ఉండేవి.  ఎంత హొయలు బోయేవి ఆ బొమ్మలు!! యువలో నాకు అవే నచ్చేవి.  అలాగే చందమామ బాలమిత్ర కూడా వచ్చేవి. కొన్నాళ్ళు బొమ్మరిల్లూ చదివాను. వాటికి నేను ఏకైక పాఠకుణ్ణి అవడం చేత, మాయింట్లో అంత ఆదరణ ఉండేది గాదు. తరవాత్తరవాత కొన్నాళ్ళకి వాటిని మానిపించారు. ఇహబోతే వనిత కూడా వచ్చేది. మిగతా పత్రికలన్నీ మానేసాక కూడా వనిత చాన్నాళ్ళు వచ్చింది. విజయచిత్ర కూడా కొన్నాళ్ళు తెప్పించారు. చందమామ అనగానే నాకు వపా బొమ్మలు, శంకర్ బొమ్మలు, రామాయణంలో ఆంజనేయుడి సముద్ర లంఘనం సీను (శంకర్ బొమ్మతో) గుర్తుకొస్తాయి. అలాగే, సౌధోపరి అనేమాట కూడా గుర్తొస్తది.  సౌధ ఉపరి అని తెలీకపోయినా  ఆ మాట తెగ నచ్చేసింది.   “..ఆకాశమార్గాన వచ్చి సౌధోపరి భాగాన దిగింది”,  “రాకుమారి సౌధోపరి భాగాన విహరిస్తూండగా”,.. ఇలాంటి వాక్యాల్లో ఈ సౌధోపరి అనేమాట ఎంతో బావుండేది. అద్దం ముందు మహారాజు ఏకపాత్రాభినయం వేసేటపుడు సౌధోపరి లాంటి గంభీరమైన మాటలు వాడేవాణ్ణి. బాగా  హుందాగా ఉండేవి, మరి. “సౌధోపరీ! ఎం..థటి అహంకారమే నీకు” -ఇలాగ!

చందమామలో సిరిసిల్లా రశీద్ శిక్షక్ అనే రచయిత కథలు రాస్తూండేవాడు. ఆయన కథలన్నీ శిళ్ళంగేరి అనే ఊళ్ళోనే జరుగుతాయి. శిళ్ళంగేరి  అనే ఊళ్ళో ఫలానావాడు ఉండేవాడు అంటూ కొన్ని డజన్ల కథలొచ్చుంటాయి. ఎక్కువగా అరపేజీ కథలే. అర పేజీలో కథ, మిగతా సగం బొమ్మ!

చందమామ పేరు చక్కటి అక్షరాలతో చూడముచ్చటగా ఉండేది. ఈమధ్య ఆ అక్షరాలను మార్చి కొత్త రూపునిచ్చారు – ఏంటో కత్తుల్లాగా ఆ అతలకట్లూ, అవీ.. అస్సలు బాలేదు. చందమామ లాంటి ప్రజాభిమానం పొందినవాటిని, అవి ఎవరి సొంతమైనాకావచ్చుగాక, వాళ్ళిష్టమొచ్చినట్టు మార్పులు చెయ్యకూడదు.

ఆ రోజుల్లో పత్రికల్లో ఒక ప్రకటన వచ్చేది ఎవడో ఢిల్లీవాడు వేసేవాడు దాన్ని.  ఒక 3 X 3 గడి ఇచ్చేవాడు. ఎటు కూడినా ఇరవయ్యొకటో ఎంతో వచ్చేలాగా అంకెలతో పూర్తి చేసి ఉండేది. పక్కనే, అలాంటిదే ఇంకో ఖాళీ గడి ఇచ్చేవాడు. అందులో ఎటుకూడినా ఇరవైనాలుగు వచ్చేలా పూర్తిచెయ్యమనేవాడు. చేస్తే అద్భుతమైన బహుమతి కూడా ఇస్తాననేవాడు. అంటే పూర్తి చేసిన గడిలోని అంకెలకు ఒకటి చొప్పున కలుపుకుంటూ పోతే ఈ ఖాళీ గడిని పూర్తి చెయ్యొచ్చన్నమాట. తేలిగ్గా ఉంది కదా!! అయితే, ఈ సంగతి అ రోజుల్లో నేను తప్ప మరెవ్వరూ కనుక్కోలేకపోయారు. మూడో కంటివాడికి తెలీకుండా పూర్తి చేసి హాజ్‌ఖాస్, ఢిల్లీకి  పంపించాను. (ఈ రకం ప్రకటనలు ఎక్కువగా ఢిల్లీ హాజ్‌ఖాస్ నుండి గానీ, మద్రాసు వళ్ళువరుకోట్టం నుండి గానీ వచ్చేవి.) ఇక అద్భుతమైన బహుమతి కోసం చూసి, చూసి, చూస్తూ ఉండగా, ఓరోజున పోస్టుమ్యానుడో పొట్లాం తెచ్చాడు. మమ్మ నాయకత్వంలో అతగాణ్ణి ఎదుర్కొన్నాను. ఏంటది అనడిగాం.  దీన్ని వీపీపీలో పంపించారు, ఇది కావాలంటే మీరు 60 రూపాయలు కట్టాలన్నాడు. ముందు అదేంటో చెప్పు, అప్పుడు కడతాం అన్నాం. అబ్బే కుదరదు, ముందు డబ్బులు కడితేగానీ ఇవ్వకూడదు, వద్దంటే చెప్పండి, వెనక్కి పంపేస్తానన్నాడు. అద్భుతమైన బహుమతిని, బోడి 60 రూపాయల కోసం వదులుకుంటామా చెప్పండి. మీరు కాబట్టి గభాలున ఒప్పుకున్నారుగానీ, మమ్మ అంత తేలిగ్గా ఒప్పుకోలా. ఎట్టాగోట్టా ఒప్పించి, అరవయ్యీ కట్టేసి, పొట్లాం తీసుకుని విప్పి చూస్తే.. అందులో ఒక చీర ఉంది. అదేదో వాయిలు చీరో, ఏదోనంట, నాకస్సలు నచ్చలేదనుకోండి.  పాపం మమ్మ మాత్రం, “బానే ఉందిలే నానా” అని చెప్పింది నాకు. ఎప్పుడూ కట్టుకున్న పాపాన పోలేదనుకోండి. ఆ తరవాత, వళ్ళువరుకోట్టం నుండి కూడా ఒక అద్భుత బహుమతి తెప్పిద్దామనుకున్నాగానీ, మమ్మ ఇక చాల్లే ఆపమని చెప్పింది. ఇలాటి అద్భుతమైన తెలివితేటలతో మమ్మను అలరిస్తూ ఉండగా…

అప్పట్లో యండమూరి విచ్చలవిడిగా రాసి పడేస్తున్న సీరియళ్ళలో మునకలేస్తూ, తరిస్తూ ఉండేవాళ్ళం.  తులసిదళమో, తులసో, యెన్నెల్లో ఆడపిల్లో చదవకపోతే అనాగరికుడి కిందే లెక్క.  యండమూరికి సీరియలును ఎలా రాయాలో తెలుసు, ఏ వారాని కా వారం దాన్ని ఎలా ముగించాలో కూడా బాగా తెలుసు. (ఇది సికరాజు నేర్పించాడట అప్పటి రచయితలందరికీ.) సీరియలును అర్థాంతరంగా ఆపేవాడు. మామూలు సస్పెన్సైతే మూడు చుక్కలతో ఆగేది. మరీ బిగించాలంటే నాలుగో పదో పదహారో, ఇంకాసినో చుక్కలు పెట్టేవాడు. ఎన్ని చుక్కలుంటే అంత బిగింపన్నమాట. ఉదాహరణకు చెబుతున్నా.. అదేదో సీరియల్లో ఒకడికి గుండు చేసి, గుంజక్కట్టేసి, వాడి తలకు సరిగ్గా పైన, నీళ్ళ కుండను వేలాడదీస్తాడు. ఆ కుండకున్న కంత లోంచి నీళ్ళు ఒక్కొక్క బొట్టే పడుతూంటాయి. టప్.. టప్... ఠప్…. ఠప్ప్….. ఠ్ఠప్ప్…… ఠ్ఠాప్ప్……. అంటూ ఆపుతాడు ఆ వారానికి. (ఇంకో నాలుగు ఠప్పులు రాస్తే కొన్ని అర్భకంగా ఉండే గుండెలు ఠాప్పుమన్నా అంటాయి.)

గత టపాను అలా అర్థంతరంగా ఎందుకాపానో ఇప్పుడు మీకు అర్థమైపోయింది గదా!  నిజానికి రెంటినీ ఒక్కసారే రాసాను.  ఇలా తెగ్గొడితే సస్పెన్సేమైనా వస్తుందేమోనని చూసా. ఐతే యండమూరి చుక్కలకు యమా సస్పెన్సు పుట్టుకొచ్చేది, నా చుక్కలకు కనీసం కింకరుడి పాటి సస్పెన్సు కూడా పుట్టలేదు. సరే..

వెన్నెల్లో ఆడపిల్ల సీరియల్ను ఓ వారం ఇట్టాగే ఆపాడు. అందులో చివరి వాక్యం  -రేవంత్ యనౌన్సెస్ బ్లైండ్‌ఫోల్డ్!  ఇదో, ఇట్టాటిదో ఉంది. అతడికి ఇంగ్లీషులో రాయడం సర్దా. సరే, నా తిప్పలు జూడండి.. బ్లైండ్‌ఫోల్డు అంటే ఏంటని అడిగింది అమ్మ. ఆమాత్రం ఇంగ్లీషు రాకపోతే నామర్దా కదా.  రాకపోవడం కాదు నామర్దా, రాదని చెప్పడం నామర్దా. నేనేనాడూ నామర్దా పనులు చెయ్యలా. అందుకని బ్లైండ్‌ఫోల్డ్ అంటే గుడ్డివాళ్ళతో ఆట్టం అని చెప్పాను.  నమ్మకపోయినా పాపం నమ్మినట్టు నటించింది, మమ్మగదా! పై వారానికి నా సంగతి బయట పడిందనుకోండి. అందుకే యండమూరి అంటే నాకు చిరాకు!  (అద్భుతమైన నా ఇంగ్లీషు పాండిత్యాన్ని బిర్లా వెంకటేశ్వరస్వామి గుళ్ళో పూజారి ముందు ప్రదర్శించిన సంగతి గుర్తొస్తోంది. ఆ ముచ్చట మరోసారి.)

యండమూరి నమిలి, రసమంతా పీల్చి పిప్పిజేసి వదిలేసిన వర్ణనొ కటుంది. ఉత్కంఠ రేపడానికి వాడే ఆ వర్ణన ఇలా ఉంటుంది. “అతనికి అప్పటికింకా తెలీదు, తానెంత పెద్ద తప్పు చేస్తున్నాడో.”   లేకపోతే “దాని పర్యవసానం ఎలా ఉండబోతోందో అణుమాత్రం తెలిసినా ఈ పని చేసి ఉండేవాడు కాదు.” ఇవో, ఇలాటి అర్థం వచ్చే వాక్యాలనో కొన్ని వందల సార్లు చదివీ చదివీ చిరాకెత్తిపోయింది. ఎంతలా అంటే.. అలాంటిది చదువుతూంటే ఒంటికి దురదగుండాకు రాసుకున్నట్టు ఉంటుంది. ఈ వర్ణనను యండమూరే కాకుండా ఇంకొందరు కాపీరాయుళ్ళు కూడా వాడి దాని ప్రాణం తీసారు. ఇహ,

నేను పదో తరగతిలో ఉండగా – మా పెదనాన్న గారి ఊరు గోవాడలో – మా తమ్ముడు సతీషు ఏడో తరగతి. ఒకే ఇంట్లో ఏడొకడూ పదొకడు. ఇహనూహించుకోండి.. ఆ ఇల్లు ఎలా ఉండి ఉంటుందో!! మా పెదనాన్న మాబడి, పాఠశాల అని రెండు పుస్తకాలు తెప్పించేవాడు.  పాఠాలే ఉండేవి ఆ పుస్తకాల్లో కూడా – ఏడో తరగతి వాడికి మాబడి, పది కోసం పాఠశాల. నెలకోటి వచ్చేది. చిత్తూరు జిల్లా చౌడేపల్లెలో ఎవరో పుణ్యాత్ముడు వేసేవాడు ఆ పుస్తకాలను. ఇప్పుడున్నాయో లేదో తెలీదు.

కాస్త పెద్దయ్యాక, నేను కొన్ని ఇంగ్లీషు పత్రికలు కూడా చదివాను. (ఇంగ్లీషుతో ఉన్న సౌకర్యమే అది -రాకపోయినా చదివి పారెయ్యొచ్చు.) అప్పట్లో మా బాబాయొకాయన దగ్గర ఇండియా టుడే పత్రికను చూసాను. అది నే జదివిన మొదటి ఇంగ్లీషు పత్రిక. నాకది బాగా నచ్చింది. ఆ తరవాతి కాలంలో చాలా పత్రికలు చదువుతూ ఉండేవాణ్ణి.  ది వీక్ మొదలుపెట్టిన కొత్తలో చాన్నాళ్ళు చదివాను. ఫ్రంట్‌లైన్ చదివేవాణ్ణి.  అన్ని పత్రికలు కూడా ఏ అంశం గురించి రాసినా, ప్రభుత్వాలపై విమర్శలే ఎక్కువగా ఉండేవి.  దేశ దౌర్భాగ్యం గురించి తెగ రాసేవాళ్ళు. ఏది బాగోలేదో, వాటి గురించే ఎక్కువగా రాసేవాళ్ళు.  ఒక్కసారి మాత్రం ఇండియా టుడేలో స్వాతంత్ర్యం తరవాత భారత్ సాధించిన ఘనకార్యాలు అంటూ, స్వాతంత్ర్య స్వర్ణోత్సవం సందర్భంగా అనుకుంటా, వేసారు. చాలా బాగుందా సంచిక.

తరవాత్తరవాత పత్రికలు చదవడం తగ్గిపోయి, కొన్నాళ్ళకు ఆగిపోయింది.  రచన మాత్రం అప్పుడప్పుడూ చదివేవాణ్ణి. ఇప్పుడు మాత్రం పూర్తిగా సున్నా.  బ్లాగుల్లోకి వచ్చాక, పత్రికలు చదవడం లేదు, బ్లాగులు చదవడమే! లేదా రాయడం!   పత్రికలు చదవడం మానేసినా, పుస్తకాలు చదవడం మొదలెట్టాను. -అదో మంచి పని.

————-
ఇహనుంటానండీ!

Advertisements
Categories: బాల్యం

నేను చదివిన పత్రికలు

చిన్నప్పుడు మాయింటికి ఈనాడు, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి పేపర్లతో పాటు, వారపత్రికలు కూడా వచ్చేవి. ఈనాడు విజయవాడలో ముద్రణ పెట్టినప్పటి నుండి ఇప్పటిదాకా మాయింటికి ఈనాడు వస్తూనే ఉంది. జ్యోతి మధ్యలో కొన్నాళ్ళు ఆపారుగానీ, ఈనాడు మాత్రం ఎప్పుడూ మానలేదు.  అప్పటినుండి ఇప్పటిదాకా మా కుటుంబమంతా కాంగ్రెసు పార్టీవారైనా , నేను మాత్రం ఈనాడు పార్టీనే.  🙂  (అనగా కాంగ్రెసు వ్యతిరేకిని). ఇప్పుడు మావాళ్ళు తమ అభిమాన, ముష్టిపార్టీ పత్రికను కూడా వేయించుకుంటున్నారు (పార్టీ ముష్టిది, పత్రిక వీరముష్టిది). ఏం చేస్తాను, ఆళ్ళ రాజకీయాలు ఆళ్ళవి.
ఆగండాగండి.. ఇకముందు రాజకీయాల్లేవీ టపాలో, ఒట్టు!

మాయింట్లో దినపత్రికలతో పాటు వారపత్రికలు కూడా తెప్పించేవాళ్ళు. నా అభిమాన పత్రిక ఆంధ్రజ్యోతితో పాటు, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక  కూడా వచ్చేవి. కొన్నాళ్ళకి ఆంధ్రపత్రికను ఆపేసారు. యండమూరి వీరుడి గాలికి ఆంధ్రభూమి కూడా కొట్టుకొచ్చింది మా యింట్లోకి. పత్రికల్లో నాకస్సలు నచ్చనిది భూమే! సికరాజు ఆంధ్రభూమిలోంచి బయటికిపోయి, సొంతంగా పల్లకి పెట్టుకొన్నాక, దాన్నీ మోసాం.  ఆంధ్ర ప్రభ కాగితం మిగతా పత్రికల కంటే నాణెంగా ఉండేది. అట్టలు నున్నగా జారిపోతూ ఉండేవి. జ్యోతి, పత్రిక అలా ఉండేవి కావు.  పల్లకి మిగతావాటి కంటే వెడల్పుగా ఉండేది. ఆంధ్రజ్యోతి అనగానే సన్నగా తీగలా ఉండే అమ్మాయి మనసులో తడుతుంది నాకు (అవును అప్పట్లోనే నండి! అప్పుడే కాదు, ఇప్పుడు కూడా) ప్రభ అనగానే కాస్త బొద్దుగా ఉండే అమ్మాయి తలపుకొస్తుంది. ఎందుకో చెప్పలేను. ధ్ర, ప్ర, భ ల తలకట్లు కూడా బొద్దుగా సీమచింత కాయల్లాగా (విత్తులున్నచోట లావుగానూ, మిగతా చోట్ల సన్నగానూ ఉంటాయి గదా, అలాగ)  ఉండేవి. ఆ ఆంధ్రప్రభ చేతులు మారి, పద్ధతులు మారి, విధానాలు మారి, నాణ్యత జారి, రూపం మారి,.. పోయిందిగానీ అప్పట్లో బానే ఉండేది. చందమామ, బాలమిత్రలు కూడా అంతే -జ్యోతి, ప్రభల పోలిక లాగా.

ఆంధ్ర ప్రభ వారపత్రికలో రాము శ్యాము అనే కామిక్ వస్తూండేది. అనంతపాయ్ మోహన్‌దాస్ దాని కర్తలు. పేజీలో నిలువుగా కాక, అడ్డంగా వేసేవాళ్ళు దాన్ని. దాని పక్క పేజీలోనే మరో శీర్షిక ఉండేది. అదేదో గుర్తు రావడం లేదుగానీ, దాన్ని కూడా ఇష్టంగా చదివేవాణ్ణి. రాము శ్యాము కవలలు. చొక్కా లాగూ తొడుక్కోని చక్కగా తల దువ్వుకొని ఉండేవారు. తలవెనక, సరిగ్గా సుడి ఉండేచోట, రెండే రెండు వెంట్రుకలు లేచి ఉండేవి ఇద్దరికీ. అవి వాళ్ళ ట్రేడుమార్కు.  నేను చదివిన మొదటి కామిక్ అదే అయ్యుంటుంది. లేదా ఈనాడులో ఆదివారం నాడొచ్చే మాంత్రికుడు మాండ్రేక్ అయ్యుండొచ్చు. మాంత్రికుడు మాండ్రేక్ నా అభిమాన కామిక్.  చక్కగా కోర మీసాలతో, మన రాజులకు ఉన్నట్టు వెనక దుప్పటొకటి వేలాడుతూ భలే ఉండేవాడు మాండ్రేక్. అన్నట్టు, మీరు అలా దుప్పటో తుండుగుడ్డో భుజాల మీద చొక్కాకు  పిన్నీసులతో  పెట్టుకొని, ఎనక్కి వేలాడేసుకుని, ఏకపాత్రాభినయం చేసేవారా? దాన్ని ఒక్క ఊపులో ఈడ్చి ముందుకు లాగి ఎడమ ముంజేతి మీద వేసుకుని “ఏయ్” అంటూ రాచరికం చెలాయించారా? ఆ పోజులో అద్దం ముందుజేరి, కళ్ళెర్రజేసి, మీసమ్మీద చెయ్యేసి నిలుచుంటే, నా సామిరంగా… నన్ను జూసి నాకే భయమేసేదండి. ఇక మా అమ్మనగా ఎంత, అల్లాడిపోయేదనుకోండి!

నా అంత కాకపోయినా మాండ్రేక్ కూడా బానే ఉండేవాడు. లీఫాక్, సైబరీ లు వేసేవాళ్ళు దాన్ని.  తరవాత్తరవాత హై.లో మా మామయ్య వాళ్ళింట్లో హిందూలో డెనిస్ ది మెనేస్ చూసేవాణ్ణి. టీవీలొచ్చాక, టామ్ అండ్ జెర్రీ యానిమేషను చూసాను.  ఇవ్వాళ్టి దాకా డెనిస్‌ను మించిన గడుగ్గాయినిగానీ, టాము, జెర్రీలను మించిన ఆకతాయి, అమాయక, మోసకారి, స్నేహితుల/వైరుల జంటనుగానీ చూళ్ళేదు. ఇహ ముందు చూడలేమేమో కూడా! డెనిస్‌కు సరిజోడులాంటి బుడుగును చూసాను.  బుడుగు కామిక్కాకపోయినా, డెనిస్ లాంటి పిడుగే! బుడుగు ఎక్కడ వెనకబడిపోయాడంటే, మువెంర ఆణ్ణి అక్కడే, అరవైల్లోనే (యాభైల్లోనా?) వదిలేసి వచ్చేసాడు, తనతో ఇరవయ్యొకటో శతికి తీసుకురాలేదు.

మళ్ళీ పత్రికల్లోకి..
ఓ వారం ప్రభలో “రంబ మరికొళందు సెంటు” (‘బ’కారం నాది కాదు, వాడిదే. అరవ సెంటు మరి.) అనే ఒక సెంటు ప్రకటన వచ్చింది. ప్రకటనతో పాటు, అట్టలకు సదరు సెంటు పూసి పంపించాడా సెంటువాడు. పుస్తకం ఘుమఘుమలాడిపోయిందనుకోండి. అలాంటి ప్రాక్టికలు ప్రకటన ఈమధ్య ఏదో షాంపూ విషయంలో కూడా చూసిన గుర్తు.. ఈనాడు ఆదివారం పుస్తకానికి ఆ షాంపూ పొట్లాన్ని అతికించి పంపించారు.

బొద్దు భామ తరవాత ఇక మెరుపుతీగ ఆంధ్రజ్యోతి గురించి. జ్యోతంటే పురాణం సుబ్రహ్మణ్యశర్మ ఇల్లాలిముచ్చట్లు. జ్యోతంటే పప్పు వేణుగోపాలరావు స్వగ’తంబు’. నాకు కథల కంటే ఇలాంటి శీర్షికలే నచ్చేవి. చందమామ కథలు చూడండి, ఎంచక్కా, అనగనగా ఒక ఊరు, ఆ ఊళ్ళో రామయ్య ఉండేవాడు -ఇలా మొదలౌతాయి హాయిగా. ఈ పత్రికల్లో కథలేమో –“అయితే రానంటావు, ఇదే నీ చివరి మాటా” అని అడిగాడు రాజారావు కోపంగా – ఇలా హఠాత్తుగా మొదలైపోయేవి. (ఈ టపా మొదలైనట్టు)  ఏదో సీరియల్ని మధ్యలో మొదలుపెట్టి చదూతున్నట్టుండేది. ఆ రోజుల్లో విశ్వనాథ సత్యనారాయణ రాసిన హాహాహూహూ అనే సీరియల్ జ్యోతిలో వచ్చేది. అది మొదలైన వారం ఓ పేద్..ద బొమ్మ వేసారు. ఒకడు ఈ పేజీనుంచి పక్క పేజీ దాకా పరచుకోని, పడుకోని ఉంటాడు.  అదీ ఆ బొమ్మ. ఆ బొమ్మ గుర్తుండిపోయింది. 

ఆంధ్ర పత్రికలోగామోసు హైదరాబాదు డైరీ అని వచ్చేది, తిరుమల రామచంద్ర రాసేవారు. ఉప్పల లక్ష్మణరావు కథేదో (ఆయన ఆత్మకథ “అతడు ఆమె” కావచ్చు) జ్యోతిలో వచ్చేది, అదీ చదివేవాణ్ణి.  ఈయన రష్యా అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు.  రష్యా అనగానే సోవియట్ యూనియన్ పుస్తకాలు – నిత్యజీవితంలో భౌతిక శాస్త్రం  వగైరాలు – గుర్తుకొస్తున్నాయి. వాటి సంగతి మరోసారి.

అన్నట్టు జ్యోతి మాసపత్రిక కూడా వచ్చేది. వారపత్రిక్కీ దీనికీ సంబంధం లేదు. వేదాంతం రాఘవయ్య నడిపేవారు. మిగతా వాటి సంగతేమోగానీ, ఆరుద్ర గళ్ళ నుడికట్టు కోసం దాన్ని కొనేది మమ్మ.  ఆ గడి పనిబట్టేది.  నేనూ ఊరుకునేవాణ్ణి గాదు. బానే నింపేవాణ్ణి. అయితే, ఒక్కసారి కూడా పూర్తిగా నింపలేకపోయాను. గళ్ళ నుడికట్టు వ్యసనాన్ని మమ్మే కలం చేతబట్టించి, నాకు అలవాటు చేసింది.  ఆ గడి కారణంగానే జ్యోతి మాసపత్రికంటే నాకు చాలా ఇష్టం.

వీటన్నిటికంటే ముందు…….

(…ఏం జరిగిందో వచ్చే టపాలో)

Categories: బాల్యం

మా పున్నమ్మ బడి

October 10, 2007 9 comments

నా గత జాబొకటి రాసేటపుడు నా చిన్నప్పటి బడి జ్ఞాపకం ఒకటి రాయాల్సొచ్చింది. ఆ సందర్భంగా జ్ఞాపకాలను అలా తవ్వుకుంటూ పోతుంటే చాలా బయటపడ్డాయి. కొన్ని బయటకు చెప్పుకోగలిగేవి, కొన్ని మనసులోనే మాగేసి ఆస్వాదించాల్సినవి. చెప్పుకోగలిగేవాటిలో కొన్ని ఇక్కడ.

1974 నాటి సంగతి. మమ్మమ్మ గారి ఊరు (గుంటూరు జిల్లా గణపవరం) నుండి మా కావూరు వెళ్ళాక కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డాను. నాకు మా వూరు నచ్చేది కాదు. నాన్నంటే భయం, బజార్లో కూచ్చుని చెతుర్లాడే పెద్దాళ్ళంటే భయం, ప్రైవేటు పంతుళ్ళంటే భయం. ఇన్ని భయాల మధ్య ఏం బతుకుతాం చెప్పండి. అదృష్టం కొద్దీ బడంటే భయం ఉండేది కాదు. మా పున్నమ్మ బళ్ళో ఐదో తరగతి దాకా ఉండేది. హెడ్ మాస్టరు గారు మృదుస్వభావి. ఐదో తరగతి పిల్లలకు అన్నీ ఆయనే. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పంతులుండే బడి కాదు మాది, ఆ రోజులూ కావవి. లెక్కలు, ఇంగ్లీషు, సోషలు.. ఇలా అన్నీ ఆయనే చెప్పేవారు.

పున్నమ్మ బడి కాకుండా మా ఊళ్ళో మరో రెండు బళ్ళున్నాయి. ఒకటి జూనియరు కాలేజి -ఇక్కడ ఆరో తరగతి నుండి ఇంటరు దాకా ఉండేది. రెండోది.. తిలక్ జాతీయ పాఠశాల. జాతీయోద్యమంలో ఇంగ్లీషు చదువుకు వ్యతిరేకంగా దేశభాషల్లో దేశీయ విద్య నేర్పేందుకు వెలసినవే జాతీయ పాఠశాలలు. అలాంటి జాతీయ పాఠశాలే మా ‘తిలక్ జాతీయ పాఠశాల‘. (ఆ పేరు చూడండి.. ఎక్కడో గుంటూరు జిల్లాలో, మారుమూల కావూరులో ఓ మామూలు బడికి కూడా తిలక్ పేరు! మనవాళ్ళెవరూ లేనట్టు!! హాయిగా -“పున్నమ్మ బడి” లాంటి పేరేదో పెట్టొచ్చుగదా! 🙂 )

మా బడి గురించి ఓ ముక్క చెప్పాలి. ఊళ్ళో ఒకరి ఇంటిని బడిగా మార్చారు. పెంకుటిల్లు, అడుసుతో అలికి, ముగ్గులు పెట్టిన నేల. రెండు గదులు, బయట వరండా. ఈ మూడూ మళ్ళీ ఒక్కోటి రెండుగా విభజించబడి ఉండేవి. వరండా బయట కొద్ది ఖాళీ స్థలం.. ఆడుకునేందుకు. వెనక కొద్దిపాటి పెరడు ఉండేది. ముందు గదిలో నాలుగు, ఐదు తరగతులు, వెనగ్గదిలో రెండు, మూడు, వరండాలో ఒకటో తరగతి జరిగేవి. అలికిన నేల మీద బల్లలేసుకుని కూర్చునేవాళ్ళం. బల్లలంటే కాళ్ళుండే బల్లలు కావు.., ఉత్త చెక్కలు. ఒక్కోటీ ఐదారు అడుగుల పొడుగున, ముప్పాతిక అడుగు వెడల్పున ఉండేవి. వాటినే కింద పరుచుకుని కూర్చునే వాళ్ళం. బల్లలు కూడా అరకొరగా ఉండి, కొందరికే సరిపోయేవి. మిగతా వారు కిందే కూర్చునే వాళ్ళు. అసలు బల్ల మీద కూచ్చున్నా సగం నేల మీదే ఉండేవాళ్ళం. నేల మీద, అలికిన సాళ్ళు గరుగ్గరుగ్గా కాళ్ళకు తగుల్తూ భలే ఉండేది. ఇప్పటికీ నాకా స్పర్శ వంటి మీద ఉంది.

వందేమాతరంతో బడి మొదలయ్యేది. చివరగా జనగణమన ఉండేది. ఆ తరవాత ఉండేది అసలు సీను. “బోలో స్వతంత్ర భారత్ కీ..” అని ఒకరంటే మిగతా పిల్లలంతా జై కొట్టేవాళ్ళు. ఈ “బోలో..” చెప్పడం కోసం తెగ పోటీ ఉండేది. ఎంతో ఉత్కంఠ…, జనగణమన పాడుతున్నంతసేపూ! జనగణమన అయ్యీ కాగానే ‘బోల’డానికి ఒక్కుమ్మడిగా మూణ్ణాలుగు గొంతులు లేచేవి. పోటీని తగ్గించడం కోసం మా మేష్కారు దీన్ని ఐదో తరగతి వాళ్ళకే కేటాయించారు. మిగతా వాళ్ళ పని కేవలం జై కొట్టడం వరకే! అయితే, ‘రోజుకొకరు అనండిరా’ అని మాలోమాకు వంతులు వెయ్యొచ్చుగదా… మా పోటీ అంటే ఆయనకూ ముచ్చటగా ఉండేది గామోసు, అలా వెయ్యలేదు! మూడో జయహే అయ్యీ కాకముందే “బోలో..” అంటూ తగులుకునే వాళ్ళం. బోలో చెప్పినవాడు ఆ రోజుకి హీరో అనమాట!

ఆ తరవాత మరో తంతు ఉండేది. వరండాలో ఒకటో తరగతి పిల్లలు కూచ్చునే వాళ్ళు కదా.. అక్కడేసిన బల్లలను లోపల పెట్టేపని కూడా ఐదో తరగతి వాళ్ళదే. (పొద్దున్నే బయట వెయ్యాలి కూడా) ‘బోలో’ అయిపోయాక చివరగా వెళ్ళేవాళ్ళు వాటిని లోపల పెట్టి వెళ్ళాలి. అది తప్పించుకోవడం కూడా మా దినచర్యలో ఒక భాగం. జై కొట్టగానే బయట పడ్డానికి తోపులాట జరిగేదన్నమాట!

పంతులుగారిని ‘మేష్కార’నే (లేదా మేష్షారు) అనేవాళ్ళం. సర్ అనే అలవాటు లేదు! అసలలా అంటారని కూడా తెలీదు. ఇంటర్లో కూడా మేష్కారనే అనేవాళ్ళం. సర్, సార్, సారూ అనే అలవాట్లన్నీ ఇంజనీరింగులో చేరాకే మొదలయ్యాయి.

పున్నమ్మ బళ్ళో నేను ఐదో తరగతి ఒక్కటే చదివాను. మా మేష్కారు చెంపదెబ్బలు వేయించేవారు అప్పుడప్పుడూ. ప్రశ్న అడిగి, సమాధానం చెప్పలేని వాళ్ళని చెప్పిన వాళ్ళతో చెంపదెబ్బలు వేయించడమన్నమాట. ఒకసారి టేబులు స్పెల్లింగుకు గాను చెంపదెబ్బ వేసే అవకాశం నాకు వచ్చింది. tbl లతో పాటు అచ్చులు అన్ని కాంబినేషన్లనూ మావాళ్ళు ప్రయత్నించేసాక నావంతు వచ్చినట్టుంది.. మిగిలిన దాన్ని నేను ప్రయత్నించగానే అది హిట్టైంది.

ఇప్పుడా బడి దాని స్వంత గూటికి చేరింది. పాత ఇంటిని దాని స్వంతదారులు తీసేసుకున్నారు. మా పున్నమ్మ బడిలో చదువుకున్న వారిలో గొప్ప మేథావులైనవాళ్ళు లేరేమోగానీ నా తరం పిల్లకాయలు చాలామందికి ఇంత చదువు నేర్పింది, బుద్ధులు నేర్పింది. శంకరమంచి సత్యం ఒక అమరావతి కథలో అంటాడు.. ‘ఆ పిల్లాడికి కృష్ణలో మునగ్గానే లోపలి నులివెచ్చటి నీళ్ళ స్పర్శకి అమ్మ కడుపులో ఉన్నట్టు హాయిగా అనిపించింద’ని. నా బడిని తలచుకుంటే నాకూ కాస్త అలాగే అనిపిస్తోంది! పున్నమ్మ బడి, అంతకు ముందరి ‘బసమ్మావయ్య ప్రైవేటు‘ నా తీపి గురుతులు. ముఖ్యంగా నాలుగో తరగతి దాకా నేను చదివిన మా బసమ్మావయ్య ప్రైవేటు నా బతుక్కు పునాది. ఆ కథ మరోసారి.