Archive

Archive for the ‘బ్లాగు’ Category

తెలుగులో వెతకటం అంత వీజీ కాదు గురూ!

(ఈ వ్యాసంలో కొన్ని పదాల పక్కన బ్రాకెట్లలో అంకెలు చూపించాను. అవి – ఆగస్టు 2 రాత్రి ఆయాపదాల కోసం గూగిలించినపుడు వచ్చిన ఫలితాల సంఖ్య. మళ్ళీ వెతికితే ఈ ఫలితాలు కొద్దిగా అటూఇటూ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ రాసినదంతా గూగుల్లో వెతకడాన్ని దృష్టిలో పెట్టుకుని రాసినదే. గూగిలించడం అంటే google.com లో వెతకడం.) 

—————————–

జాలంలో ఏదైనా సమాచారం కోసం వెతకాలంటే సెర్చింజనే గతి. సెర్చింజనుకు మారోపేరు గూగులైపోయింది కాబట్టి, గూగులే గతి అన్నమాట. ఆ గూగులుకేమో తెలుగు రాదు. పదం తప్పుగా ఇచ్చినా దానికి తెలీదు. పైగా తెలుగు పదాలను రకరకాలుగా రాస్తూంటాం. (రాస్తూ ఉంటాం, రాస్తూ ఉంటాము, రాస్తూంటాం, రాస్తుంటాం, రాస్తుంటాము, ఇలా రకరకాలు, కొన్ని ఒప్పులు, కొన్ని తప్పులూను. ఇది కాకుండా ’వ్రా’సే గోల ఒకటుంది. దాని జోలికిపోతే బుర్ర ఖరాబౌద్ది కాబట్టి నే బోను). ఇహ, పదబంధాలను రాసే విధానాలు కొల్లలు. ఇతర భాషల నుంచి తెచ్చుకున్న పదాలూ అంతే. ఫలానాది రైటనీ మరో ఫలానాది తప్పనీ అంటానికి లేదు. ఇన్ని బాధలకు తోడు, ఆయా పదాల కోసం వెతికేవాడి బాధ చూడండిక! ఈమధ్య కొత్తపాళీ గారు ఒక వ్యాఖ్యలో రాసిన ఒక పదబంధం కోసం వెతికాను. ఆ కథ చెబుతాను, చిత్తగించండి. అసలా కథ కోసమే ఈ ఉపోద్ఘాతం.

మాలతిగారి బ్లాగులో కొత్తపాళీగారు వ్యాఖ్య రాస్తూ ’కుప్పుస్వామయ్యరు మేడ్దిఫికల్టు’ అని రాసారు.  అది చాలా ప్రసిద్ధమైన  చెతురు, గురజాడ కన్యాశుల్కంలో రాసినది.  గూగుల్లో వెతకబోయాను దాని కోసం. వెతికాక, జాలంలో అదేమంత ప్రసిద్ధమైనది కాదని తెలిసింది. ఎందుకంటే, దీనికి రెండంటే రెండే ఫలితాలొచ్చాయి. ఫలితాలు రెండైనా, రెంటిలోనూ  టెక్స్టు ఒకటే -ఆయన రాసినదే!  ఒకటి ఒరిజినలు, రెండోది దాన్ని చూపించిన అగ్రిగేటరు.

ఇదేంటి, ఇంత ప్రసిద్ధమైన ప్రయోగాన్ని మనవాళ్ళు అసలు వాడటం లేదా అని అనుమానం వచ్చి,  కొద్దిగా మార్చి,  కుప్పుసామయ్యరు, కుప్పుసామయ్యర్, కుప్పుస్వామయ్యరు, కుప్పుస్వామయ్యర్ ఇలా వివిధ వికల్పాలతో వెతికితే, కింది ఫలితాలొచ్చాయి:

కుప్పుసామయ్యరు మేడ్డిఫికల్టు — 1
కుప్పుసామయ్యర్ మేడ్డిఫికల్టు — 2
కుప్పుస్వామయ్యరు మేడ్డిఫికల్టు — 2
కుప్పుస్వామయ్యర్ మేడ్డిఫికల్ట్ — 2
ఆశ చావక, మళ్ళీ కొద్ది మార్పుచేర్పులతో వెతికాను.  ఇంకోటి దొరికింది.
“కుప్పుసామయ్యర్ మేడ్ డిఫికల్ట్” – (ముందు 109 అని చెప్పింది, తరవాత 10 అని చూపించింది. ఏంటో మరి!)

అంటే ఏంటనమాటా..? వెతికేటపుడు ఆయా పదాలకు సంబంధించిన  ఇతర రూపాల కోసం కూడా వెతకాలి. అప్పుడే మనకు అవసరమైన దాన్ని పట్టుకోగలుగుతాం. అలాగే, రాసేవాళ్ళు కూడా పదాలను రాసేటపుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సందేహం వచ్చినపుడు ఒకసారి గూగులించి చూస్తే, తప్పులను నివారించవచ్చు.

(ఇలా వెతుకుతూండగా.. నా బ్లాగులోనే నేను దీన్ని రెండుచోట్ల రెండు రకాలుగా – కుప్పుసామయ్యర్ మేడ్డిఫికల్టు అనీ, కుప్పుసామయ్యరు మేడ్డిఫికల్టు అనీ –  రాసినట్టు గ్రహించాను. అసలందుకే ఈ వ్యాసం రాయాలనిపించింది. నేను చేసిన తప్పును మనందరం చేస్తున్నట్టుగా కతల్జెబుతున్నాను చూసారా? తెల్లోడి తెలివితేటలు!)

సరే, వెతికేటపుడు మనక్కావల్సిన పదం కోసమే కాక, దానికి కాస్త అటూ ఇటూగా ఉండే తప్పొప్పుల కోసం కూడా వెతకాలన్నమాట. స్థూలంగా, కొన్ని సూత్రాలు గుర్తెట్టుకోవాలి:

 1. పరాయిభాష – ముఖ్యంగా ఇంగ్లీషు – లోని మాటకోసం వెతుకుతూంటే,  ఆ పదం యొక్క అజంత, హలంత రూపాలు రెండింటి కోసమూ వెతకండి. ఉదాహరణకు, డిఫికల్ట్ (136) కోసం వెతుకుతూంటే డిఫికల్టు (1) కోసం కూడా వెతకండి.
 2. అనుస్వారంతో అంతమయ్యే పదాల కోసం వెతుకుతున్నపుడు, ’ము’ తో అంతమయ్యే రూపం కోసం కూడా వెతకండి. ’భయం’ (2,21,000)  కోసం వెతికేటపుడు, ’భయము’ (9,010)  కోసం కూడా చూడండి.
 3. పదబంధం కోసం వెతుకుతున్నపుడు, అందులోని పదాలను విడదీసి, కలిపేసి -రెండు రకాలుగానూ వెతకండి.  ఉదాహరణకు  బట్టతల  (4,790) కోసం వెతకబోయినపుడు “బట్ట తల”  (2,020) కోసం కూడా వెతకండి (డబులు కోట్‍లు పెట్టండి, లేకపోతే బట్టల్నీ తలల్నీ కూడా చూపించేస్తది)
 4. ఇహ మధ్యలో పొల్లు వచ్చే పదాలుంటాయి. వాటి కథ భిన్నంగా ఉంటది. అది మరోసారి.

 కంప్యూటరు కీబోర్డు మీద ఎడాపెడా వాయించేటపుడు ఒక అక్షరం బదులు మరో అక్షరం పడుతూంటుంది.  ఇది అందరికీ పడదులెండి,  వేళ్ళు మందంగా ఉన్న నాబోటి వాళ్ళకి మాత్రమే ఇది జరుగుతుంది. ముఖ్యంగా తెలుగు టైపించేటపుడు గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘమూ తప్పులు పడుతూంటాయి. ’కు’ బదులు ’కి’, ’కీ’ బదులు ’కూ’ ఇలాంటి టైపాట్లు పడుతూంటాయి.  ఏం చేస్తాం, మనిషికో వైకల్యం మహిలో సుమతీ!

ఇవీ, ఇలాంటి ఇతర తప్పులనూ అలాగే ఉంచి ప్రచురించడం వలన, అవి జాలంలోకి చేరుకుంటున్నాయి. బద్ధకించి కొందరు, తప్పులు కనబడక కొందరు, అవి తప్పులని తెలీక కొందరూ వదిలేస్తారు. కొందరుంటారు, ’ఏఁ, తప్పు రాస్తే ఏంటంట? కొంపలంటుకుంటాయా? ’అని వదిలేస్తారు . ఎలాగన్నా వదిలెయ్యనీండి, తప్పులు జాలంలోకి దొర్లుకొస్తాయి. 

మరి గూగులు తెలివైన దంటారే…? 
నిజమే, గూగులు తెలివైనదే. ఒక్కోసారి మనం పదాన్ని కొద్దిగా అటూ ఇటూగా, స్పెల్లింగులు తేడాగా  ఇచ్చినా, ’ఏంటి బాబూ, నువ్వు అడగదలిచింది ఇదిగానీ కాదు గదా : ’అంటూ అసలుదాన్ని చూపిస్తుంది. అయితే ఇంగ్లీషు భాషకో, మరోదానికో చూపిస్తుందిగానీ, తెలుక్కి చూపించదు.  పాపం దానికింకా పూర్తిగా తెలుగు రాదు.

పదబంధాల్లోని పదాలను కలిపి రాయాల్సిన చోట విడదీసి, విడదీసి రాయాల్సిన చోట కలిపీ రాస్తూంటాం కదా.. ఉదాహరణకు వేటగాడు అనే మాట చూడండి, దీనిలోని వేట గాడు అనేవి మాటలను విడిగా రాయకూడదు. కానీ వీటిని విడదీసి రాస్తూంటారు.  వెతుకులాటలో తేడాలొస్తాయి. వేటగాడుకు 5,390 ఫలితాలొస్తే, “వేట గాడు”కు 4 ఫలితాలొచ్చాయి.  ఇలాంటి మాటలు రాసేటపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. విశేషమేంటంటే, వేటకాడు అని కూడా కొన్నిచోట్ల రాసారు. వెతుకులాటలో దీనికి 29 ఫలితాలొచ్చాయి.

మనుషుల పేర్లను కూడా రకరకాలుగా రాస్తూంటాం. ఉదాహరణకు నందమూరి తారకరామారావు, నందమూరి తారక రామారావు, నందమూరి తారక రామా రావు అని రకరకాలుగా రాస్తూంటాం. అంతెందుకు.., ఉత్త నందమూరి అనే పేరును నంద మూరి అని విడగొట్టి రాస్తున్నారని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. నందమూరికి  2,71,000 ఫలితాలొస్తే, “నంద మూరి” కి 123 ఫలితాలొచ్చాయి.  చిత్రమేంటంటే, క్షమాపణ (87,700)ను “క్షమా పణ ” (47) అని కూడా రాస్తున్నారు.

ఇంకో చిన్న పరిశీలన. తెలంగాణ ను ఎన్ని రకాలుగా రాస్తామో చూడండి:

 • తెలంగాణ (4,37,000)
 • తెలంగాణా (4,34,000)
 • తెలంగానా (26,300)
 • తెలంగాన (14,400)
 • తెలింగాణా (47)
 • తెలింగాణ (7)
 • తెలింగానా (44)
 • తెలింగాన (2)
 • తెలగాణ (2,230) 
 • తెలగాన (6)
 • తెలగానా (3)
 • తెలగాణా (59)

తెలంగాణ కోసం వెతికేవాళ్ళు, తెలగాన  కోసం కూడా వెతికే అవకాశం చాలా తక్కువ.  మనం మన వ్యాసంలో  తెలగాన అని రాసి ఉంటే, గూగులు ద్వారా అది చదువరులకు అందే అవకాశం దాదాపు లేనట్టే – ఇహ,  ప్రత్యేకించి లింకులిచ్చుకుంటూ ప్రచారం చేసుకోవాల్సిందే.

ఒక్కమాట – ’ఆ, ఇప్పుడు నేను రాసే బోడి రాతలు వెతుకులాటలో కనబడకపోతే మాత్రమేంటిలెండి ’ అని మాత్రం అనకండి.  ఎక్కడినుంచో కాపీకొట్టి, దించిపారెయ్యనంతవరకు ఏదీ బోడిరాత కాదు. అన్నీ అవసరమే!  కాదేదీ సెర్చి కనర్హం!  ఇంకోటి – మనం రాసేది, పాఠకులను చేరటానికి.  పాఠకుణ్ణి చేరాలంటే జనం గూగిలించినపుడు మనమూ ఫలితాల్లో కనబడాలి.

మనం తప్పులు దిద్దుకోవాలని చెప్పకుండా గూగులుకు తెలుగు నేర్పమంటావేంటయా అని నన్నడగొద్దండి. ఆ రెండోదే తేలిక.  ఎందుకంటే,  తెలుగు ఎట్టా ఏడ్చినా ఫర్లేదులెమ్మని మనలో చాలామందిమి అనుకుంటాం. అదే.., ఇంగ్లీషులో చిన్నవెఁత్తు తప్పు దొర్లితే భ్రూణహత్య చేసినంత పాపంగా భావించి, తల్లడిల్లిపోతాం.

————————————————–

(బ్రాకెట్లలో ఇచ్చినవి – ఆగస్టు 2 న ఆయాపదాల కోసం గూగిలించినపుడు వచ్చిన ఫలితాల సంఖ్య. మళ్ళీ వెతికితే ఈ ఫలితాలు కొద్దిగా అటూఇటూ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ రాసినదంతా గూగుల్లో వెతకడాన్ని దృష్టిలో పెట్టుకుని రాసినదే. గూగిలించడం అంటే google.com లో వెతకడం.)

Advertisements

కొత్త సంవత్సరానికి పాత టపాలు!

నచ్చిన బ్లాగుల గురించి, టపాల గురించీ ఈ మధ్య టపాలొస్తున్నాయి. ఆ స్ఫూర్తితోనే ఈ టపా!

సాధారణంగా నాకు హాస్యం చిప్పిల్లే టపాలు నచ్చుతాయి. అసలు హాస్యం నచ్చందెవరికిలెండి!! హాస్యం తరవాత, జ్ఞాపకాల టపాలు కూడా నాకెంతో నచ్చుతాయి. ఎవరి జ్ఞాపకాలు వాళ్ళకు ముద్దేననుకోండి. నాకు మాత్రం ఎవరి జ్ఞాపకాలైనా ముద్దే! చదవడానికి ఆహ్లాదకరంగా, చదివాక హాయిగా ఉండే ఏ టపాలైనా బావుంటాయి. ఎప్పటికప్పుడు గుర్తుకొస్తూ ఉండే టపాలు కొన్నిటి గురించి ఇక్కడ కొంత…

ఇటీవలి కాలంలో బ్లాగులోకంలోకి వచ్చినవారికి ఆపాతమధురాలైన ఆ పాత మధురాలను పరిచయం చేద్దామనే వంకతో మరోసారి ఆ బ్లాగరులకు నేను చేస్తున్న నమస్కారం ఇది! ఏంటి.. నాలుగేళ్ళ బ్లాగు ప్రయాణంలో నచ్చిన టపాలు ఇవేనా అని అడగొచ్చు.. నిజమే, నచ్చినవాటిలో కొన్నిటి గురించే ఇక్కడ రాసాను. ఇలాంటివి, ఇంతకంటే మంచివీ ఇంకా మరెన్నో ఉన్నాయి, ఇదొక అసంపూర్ణ జాబితా! ఇందులో కొన్ని అన్‌సంగ్ టపాలు, కొన్ని వెల్‌సంగ్, కొన్ని ఆల్వేస్ సంగ్!

 1. జ్ఞాపకాల టపాలు తలచుకోగానే మనకు గుర్తొచ్చేవాళ్ళలో రానారె ప్రథముడు. తన చిన్ననాటి కబుర్లు చెప్పేందుకే ఒక బ్లాగును ప్రత్యేకించారాయన. సీమ మాండలికంలో (అది కడప మాండలికం అని సరిదిద్దుతారాయన) రాసిన ప్రతీ టపా గుర్తుంచుకోదగ్గదే. వాటిలో నేనెంచినది ఇది. ఒక పుస్తకంలాగా వెయ్యదగిన బ్లాగు – బ్లాగు, టపా కాదు సుమండీ! – “యర్రపురెడ్డి రామనాధరెడ్డి”. రామనారెడ్డి, రామనారెడ్డి కాదు! చదువరుల దురదృష్టం కొద్దీ ఈ బ్లాగు ఇప్పుడు ఆహ్వానితులకు మాత్రమే!
 2. పప్పు నాగరాజు గారనే ఒక బ్లాగరి ఉన్నారు. సాలభంజికలు అనే బ్లాగు ఉండేది. అందులో వాక్యం రసాత్మకం కావ్యం అనే టపాల శృంఖల వచ్చింది. ఆ టపాలను చదివి అప్పటి బ్లాగరులు ఆనందించారు. కొందరు కొత్త సంగతులను నేర్చుకున్నారు. ఆ టపాలను చదవని, ఈ వ్యాసం చదివే చదువరులను ఊరించడం తప్ప మరేమీ చెయ్యలేకపోతున్నాను. నాగరాజు గారు తన బ్లాగును ప్రస్తుతం దాచి ఉంచారు.
 3. మనసు దోచుకున్న తెలుగు కీచకుడు అంటూ గుజరాతీయుల మనసును దోచుకున్న మన కూచిపూడి కళాకారుల ప్రదర్శన గురించి రాసి నువ్వుశెట్టి సోదరులు నా మనసును దోచుకున్నారు. నాకు బాగా నచ్చేసిన టపాల్లో ఇదొకటి. టపాలో చివరన గిరిచంద్ గారు రాసిన కొన్ని వాక్యాలు నాకు ఆనందబాష్పాలు తెప్పించాయి. నేను నెలకో రెణ్ణెల్లకో ఓసారి పోయి చదువుకుంటూండే టపాల్లో ఇదొకటి.
 4. వేణూ శ్రీకాంత్ తన జ్ఞాపకాల గురించి రాసిన ఈ టపా నాకు ఎప్పుడూ గుర్తొచ్చే టపాల్లో ఒకటి. ఆ టపాకోసం ఆయన అతికినట్టుగా సరిపోయే బొమ్మ ఒకటి పెట్టారు. ఆ టపా చదవండి, ఆ బొమ్మ చూడండి.
 5. తేటగీతి! వ్యంగ్యం (సెటైరు) రాయడంలో ఆ బ్లాగును మించినది తెలుగు బ్లాగుల్లో మరోటి లేదు. రిచంజీవి, రె.కాఘవేంద్రరావు లాంటి పేర్లు పెట్టడంలో ఆయనకాయనే సాటి. ఆయన ధోరణిలో చెప్పాలంటే ఈ బ్లాగును ‘తీటగేతి’ అనాలి. సీనియర్ అని ఒక సీరియల్ రాసారాయన. తప్పక చదవాల్సిన సీరియలది.
 6. బ్లాగాడిస్తా అనే బ్లాగొకటుంది. అందులో మలయాళంకారం అనే పోస్టొకటుంది. ఇది చదివితే ఈయన నిజంగానే బ్లాగాడిస్తున్నారే అని అనుకుంటాం.
 7. క్షవర కల్యాణం పేరుమీద తనకు జరిగిన ఘోరావమానాన్ని దిగమింగుకోలేక, బ్లాగులో చెప్పుకున్నారు తోటరాముడు -మనల్ని మురిపించడానికి! అసలు తోటరాముణ్ణి తలుచుకోకుండా ఇలాంటి జాబితా రాయగలమా!!
 8. ఇదే క్షుర ఖర్మ వ్యవహారంపై అబ్రకదబ్ర అనే తెలుగోడి గోడు కూడా చదివితీరాల్సిందే! ఈయన రాజకీయాలంటారు, సినిమాలంటారు, కథలంటారు, హాస్యమంటారు, వ్యంగ్యమంటారు, సామాజిక విషయాలంటారు,.. ఇంకా చాలా అంటారు. అయితే ఇది మాత్రం ఈ బ్లాగులో తలమానికమంటాను!
 9. చక్కటి అర్థవంతమైన మాటలను పదేపదే వాడి వాటికి అగౌరవాన్ని ఆపాదించిన వాస్తవాలను చూస్తూంటాం. ఉదాహరణకు “డిఫరెంట్” అనే ఇంగ్లీషు ముక్కను రేప్ చేసి ఆ మాటంటేనే విరక్తి కలిగేలా చేసిన మన సినిమావాళ్ళ సంగతి మీకందరికీ తెలిసిందే! సరిగ్గా దానికి వ్యతిరేకంగా చేసిన వ్యక్తి ఒకాయన బ్లాగుల్లో ఉన్నారు. ఊకదంపుడు అనే ఫక్తు ఊకదంపుడు మాటకు ఒక గౌరవాన్ని ఆపాదించిన వ్యక్తి గురించే నేను చెబుతూంట! ఇంగ్లీషు యూ లివ్ లాంగా అంటూ ఈయన రాసిన ఇంగ్లీషు పాఠాలను మీరింకా చదివి ఉండకపోతే మించిపోయిందేమీ లేదు.. ఇప్పుడు చదవండి. ఒకవేళ ఈసరికే చదివేసి ఉన్నా మళ్ళీ చదవండి, ఇంకోసారి నవ్వుకుంటే పోయేదేమీలేదు. ఇదొక్కటే కాదు, ఆ శృంఖలలో అన్నీ చదవండి. నా సార్వకాలిక అత్యుత్తమ (దీన్ని ఇంగ్లీషులో ఏమనాలో ఊదం గారు చెప్పకపోవడం చేత నాకు తెలీలేదు) టపాల్లో ఒకటి. ఇంగ్లీషు పాఠాల్ని అర్థంతరంగా ఆపేయడం ఏం న్యాయమో ఊదంగారే చెప్పాలి. అన్నట్టు ఊదంగారు బహు పన్‌డితులు కూడాను. పైన చెప్పిన రెండు క్షుర ఖర్మలకు తోడుగా ఈయన కూడా తన ఖర్మను తలుచుకున్నారో టపాలో. ఆయన బ్లాగులో ఎక్కడుందో వెతుక్కోని చదూకోండి.
 10. ఒక దళారీ పశ్చాత్తాపం చదివారా? ఆ పుస్తక కర్త తెలుగు బ్లాగరే -కొణతం దిలీప్! సామాజిక రాజకీయ విషయాలను ఒక ఉపాధ్యాయుడిలా వివరించే ఈ బ్లాగులో మాతాతలు పండించుకుని తిన్నారంటూ తన వ్యక్తిగత జ్ఞాపకాల గురించి ఒక టపా రాసారు, దిలీప్. చదివితీరాల్సిన టపా అది!
 11. ఊసుపోక – నసాంకేతికాలు అంటూ నిడదవోలు మాలతి గారు రాసిన ఈ టపా నాకు చాలా ఇష్టం. చెయ్యితిరిగిన రచయిత్రి రాసిన ‘ఊసుపోక ‘ రాతలు కూడా మనల్ని అలరిస్తాయి. ఆ సంగతి తన వ్యాఖ్యలో రానారె చెప్పారు కూడాను. ఊసుపోక టపాల్లోని ఉత్తమమైన వాటిలో ఇదొకటి.
 12. సుజాత గారు ఏదైనా పుస్తకాన్ని చదవలేదని చెబితే, ఆ పుస్తకాన్నే గనక నేను చదివి ఉంటే ఆ సంగతిని నా బ్లాగులో ఓ టపా రాసి పడేద్దామని చూస్తూ ఉన్నాను. ఆ అవకాశం ఎప్పుడొస్తుందో మరి! ఆమె ఎంత వొరేషియస్ రీడరో మనసులోమాట అంత మోస్ట్ ప్రాలిఫిక్ ‘రన్’ గెట్టరు. ప్రజలు మెచ్చిన ఈ బ్లాగులో పిల్లల చదువుల గురించి రాసిన ఈ టపాకు ఓ ప్రత్యేకత ఉంది.
 13. గడ్డిపూలు బ్లాగులో వచ్చిన వీరగాధ మొదటి భాగం ఇది. Sujatha గారి స్ఫూర్తిదాయకమైన పోరాట గాధ ఇది. చదివి తీరాల్సిందే ఈ శృంఖల!
 14. సునిశితమైన హాస్యానికి చిరునామా సత్యశోధన బ్లాగు. కొవ్వలి వారి గుర్తింపుకార్డు ప్రహసనం చదవాల్సిన టపా. మరింత చురుగ్గా రాయాల్సిన ‘బ్లాగుసామాజిక బాధ్యత’ ఉందని ఆచార్యుల వారికి నా ఈ టపా ద్వారా తెలియజేస్తూ..
 15. చరసాల ప్రసాదు గారి ధీరత్వం గురించి చదవండి. ఒకప్పుడు విరివిగా రాసిన ప్రసాదు గారు ఇప్పుడు అరుదుగా రాస్తున్నారు. ఈయన రాసే పోలికలు వైవిధ్యంగా ఉండి, ఆకట్టుకుంటూంటాయి.
 16. ఈయన గురించి ఒక బ్లాగరి ఎక్కడో చెప్పారు – “ఈయన్ని అభిమానించొచ్చు, ఏవగించుకోవచ్చు, ఈయన అభిప్రాయాలను తీవ్రంగా వ్యతిరేకించవచ్చు, గాఢంగా అభిమానించనూవచ్చు.. కానీ పట్టించుకోకుండా మాత్రం ఉండలేం.-” అని. సరైన మాట! కత్తి మహేష్ తనగురించి తాను కాస్త ఎమోషనల్‌గా చెప్పుకున్న విశేషాలు చదవండి.
 17. “పప్పు” మాటెత్తగానే పరిగెట్టుకుపోయి చేతులు కడుక్కోని విస్తరేసుకుని కూచ్చునే బ్లాగరు లెంతమంది ఉన్నారో చూడాలనుకుంటే మాకినేని ప్రదీప్ గారి ఈ టపా చూడాల్సిందే! కేవలం పప్పు అయిపోయింది కాబట్టి భోజనం ముగించాల్సి వచ్చిన పప్పు ప్రేమికుడి విశేషం చదివి ఆనందించండి. నా సార్వకాలిక అత్యుత్తమాల్లో ఒకటి! మీరూ పప్పు అభిమానులైతే అక్కడ పప్పుకు మీ ఓటు వెయ్యండి.
 18. చిల్లర శ్రీమహాలక్ష్మి గురించి కొత్తపాళీ గారు రాసిన టపా నా సార్వకాలిక అత్యుత్తమాల్లో ఇంకోటి. ఇలాంటి మరికొన్ని మధురమైన జ్ఞాపకాలను కూడా ఈ బ్లాగులో చదవొచ్చు. మరెన్నో రాయాల్సిన అవసరం ఉందని ఈ బ్లాగరి గుర్తించినట్టుగా తోచదు.
 19. అప్పుడేం జరిగిందంటే అంటూ ఎన్నో విశేషాలు చెప్పి అలరించిన క్రాంతి గారు తన రహస్య ఎజెండా గురించి చెప్పి జనాన్ని భయపెట్టాలని చూసారుగానీ, చదువరులు అది చదివేసి, హాయిగా నవ్వేసి, కానీండి ప్రొసీడైపోండని ప్రోత్సహించారు. బ్లాగుసామాజిక బాధ్యతగురించి క్రాంతిగారికి కూడా ఎవరైనా చెబితే బాగుండు.
 20. కరకరలాడే చేగోడీలు, వేయించిన వేరుశనక్కాయలు, కారపప్పచ్చులు – వీటి ప్రాశస్త్యం గురించి నాకో అభిప్రాయం ఉంది.. మొట్టమొదటి చేగోడీయో, వేరుశనక్కాయో, కారపప్పచ్చో తినడం వరకే మానవ ప్రయత్నం అవసరమౌతుంది. ఆ తరవాత అవే మనచేత తినిపిస్తాయి. తింటూనే ఉంటాం. ఆపడం అనేది మనవల్ల కాదు -అవి అయిపోతే తప్ప! ఈ చేగోడీలు అనే బ్లాగు కూడా అలాంటిదే! ఇదిగో, ఒక చేగోడీ తిని చూడండి, నామాట అబద్ధమైతే చెప్పండి. ‘అందరూ రాస్తున్నారు గదా, మనమూ రాద్దాం’ అని రాయడం మొదలుపెట్టారు రిషి. కానీ, అందరూ రాస్తూనే ఉన్నా, తాను మాత్రం రాయడం తగ్గించేసారు, ఎంచేతో! మాట మీద నిలబడకపోతే ఎలా మాస్టారూ!!
 21. కలగూరగంప! బ్లాగరి ఆసక్తుల్లాగే ఈ బ్లాగులోని టపాల దత్తాంశాలు కూడా బహుళం! నిరుద్యోగం పురుషలక్షణం అనే శీర్షికన రాసిన వ్యాస శృంఖల ఆయన పరిణిత ఆలోచనాధోరణిని తెలుపుతాయి. చక్కటి తెలుగులో తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు రాసే టపాలకు పరిశోధనాస్థాయి ఉందని చదువరులు భావిస్తూంటారు.

చదువరులకు కనబడనీయకుండా చేసిన తమ బ్లాగులను, తిరిగి ప్రజలకందివ్వమని బ్లాగ్వరులను అభ్యర్ధిస్తూ..

————————

పై బ్లాగుల్లో కొన్నిటిలో పాత టపాలను తేలిగ్గా పట్టుకునే సౌకర్యాలు లేవు. పాత టపాలను తేలిగ్గా పట్టుకోవాలంటే కింది మూడు అంశాలు ప్రతీ బ్లాగుకూ తప్పనిసరి..

 1. ఒక వెతుకుపెట్టె.
 2. నెలవారీగా పేర్చిన పాత టపాల భోషాణం. నెలల్ని తీసుకెళ్ళి ఏ డ్రాప్‌డౌను పెట్టెలోనో పడెయ్యకూడదు. చక్కగా సంవత్సరం పేరు, దాని కింద నెలల పేర్లు, ఒక్కో నెల కింద ఆ నెలలో వచ్చిన టపాల శీర్షికలు ఉండాలి. సంవత్సరాన్ని నొక్కగానే దానికింద నెలలు జారుతూ తెరుచుకోవాలి. నెలను నొక్కగానే ఆ నెలలో వచ్చిన టపాలు జారుతూ కనబడాలి. నాలుగేళ్ళ కిందటి టపాను కూడా ఠక్కున పట్టుకోవచ్చు.
 3. ట్యాగులు / వర్గాల జాబితా ఉండాలి.
Categories: బ్లాగు

ప్రమదావనం.. భేష్!

February 25, 2009 3 comments

సామాజికంగా సేవ చెయ్యాలనే ఆసక్తి ఎంతో మందికి ఉంటుంది. ఉత్సాహమూ ఉంటుంది. వీటికి మించి సాటివారి కష్టం, బాధ, వేదనల పట్ల సహానుభూతి ఉంటుంది. కానీ అందుకు అవసరమైన ఆర్థిక, ఆర్థికేతర వనరులు లేకపోవడం వలనగానీ, మరో కారణం వలన గానీ ఆయా పనులు చెయ్యలేరు. ఎక్కడో అరుదుగా, యామినీ ఫౌండేషను పెట్టిన శ్రీనివాసు గారి లాంటివారు ఉంటారు.అలాంటి అరుదైన సేవకులను అభినందిద్దాం.

యామినివంటి సంస్థలను, శ్రీనివాసుగారివంటి వ్యక్తులను చూసినపుడు మనం కూడా ఏమైనా చేస్తే బాగుంటుందని అనిపించడం సహజం. తెలుగుబ్లాగరులే ఎక్కువగా సభ్యులుగా ఉన్న ప్రమదావనం గూగుల్ గుంపుకు కూడా అలాగే అనిపించింది. అనిపించిన వెంటనే వాళ్ళు రంగంలో దిగారు. తలా కాసిని డబ్బులు వేసుకుని యామినికి వస్తు రూపేణా సాయం అందించారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

ప్రమదావనం గతంలో కూడా ఇలాంటి సాయం చేసింది. స్త్రీలే సభ్యులుగా ఉన్న ఈ గూగుల్ గుంపు అభినందనీయమైన పని చేస్తోంది. కొందరు మగవారు కూడా వీళ్ళ పనుల్లో ఆర్థిక సాయం అందిస్తున్నారు.

ప్రమదావనం సభ్యులను, ఈ పనిలో పాలుపంచుకుంటున్న వారందరినీ మనసారా అభినందిస్తున్నాను.

బ్లాగుల్లో దొంగలు పడ్డారు

February 14, 2009 17 comments

..పడి, మన ఐడీలను కొట్టేస్తున్నారు. మన వేషాలేసుకుని, మన పేర్లతో దొంగ వ్యాఖ్యలు రాసేస్తున్నారు. ఇది ఎవరి పనో చెప్పనక్కర్లేదు, ఈ మధ్య కాలంలో జరుగుతున్న సంఘటనలను పరిశీలించినవారికెవరికైనా, ఈ పనులు చేస్తున్నది ఎవరో తెలిసిపోయి ఉంటుంది.

ఇప్పుడు మనం చెయ్యాల్సిన పనులు రెండు..

మొదటిది… ఈ ముచ్చులు మన బ్లాగులో ఇలాంటి రాతలు రాయకుండా చూసుకోవాలి. ముందుగా చెయ్యాల్సిన పని, మన బ్లాగులోకి అనామక వెధవల్ని రానివ్వకపోవడం. దీనితో ఈ కన్నం దొంగలకు కాస్త అడ్డం పడినట్టే! అలాగే వ్యాఖ్యల మోడరేషను కూడా పెట్టుకోండి. ఈ విషయానికి సంబంధించి కింది టపాలను చూడండి:

కొత్తపాళీ రాసిన ఈ టపా
నల్లమోతు శ్రీధర్ రాసిన ఈ టపా

పై టపాల్లోని సూచనలను పాటించండి.

ఇక రెండోది.. మీ బ్లాగుకు ఎవరెవరు వస్తున్నారో గమనించండి. ఇది చాలా తేలిక.. ఒక హిట్‌కౌంటరు లాంటిదాన్ని మీ బ్లాగులో పెట్టుకోండి. మీ బ్లాగుకు వచ్చే సందర్శకులు ఏయే ఐపీ అడ్రసుల నుండి  వస్తున్నారో, అది గమనిస్తూంటుంది. ఈ కన్నం దొంగలు వ్యాఖ్యలు రాసినపుడు, ఈడెవడో దొంగలాగున్నాడే  అని మీరు అనుమానించినపుడు, (వ్యాఖ్యను ఎలాగూ ప్రచురించరనుకోండి) అది ఏ ఐపీ అడ్రసునుండి వచ్చిందో గమనించి రికార్డు చేసిపెట్టుకోండి. దీని వలన తక్షణ ప్రయోజనం ఉండకపోవచ్చు.. కానీ ఈ కన్నం దొంగలు పెద్ద దొంగతనమేదైనా చేసినపుడు, మన దగ్గర ఉన్న ఈ సమాచారం, మిగతావారి దగ్గర ఉన్న సమాచారంతో పోల్చి చూసుకునేందుకు అక్కరకు రావచ్చు. గతంలో ఇది అక్కరకు వచ్చింది కూడా!

పై సూచనలను పాటిస్తే ఈ కన్నం దొంగలను కొంతవరకైనా అడ్డుకోవచ్చు. ఇది తక్షణావసరమని మనం గ్రహించాలి. 

—————————————————————–

ఒకటి మాత్రం ఖాయం.. నేను బ్లాగడం మానను, వ్యాఖ్యలు రాయడం మానను, నా బ్లాగును కూడళ్ళతో సహా అందరికీ – అం… థరికీ – అందుబాటులో ఉంచడం ఖాయం. [నేను చేస్తున్న పనుల్లోని మంచిచెడుల పట్ల నాకు స్పష్టత ఉంది. నేనెవ్హడికీ భయపణ్ణు. తాలుమాటలు మాట్టాడే సవట సన్నాసులను అసలు లెక్కే చెయ్యను.]

కానీ..,

పైన చెప్పిన జాగ్రత్తలు మాత్రం తీసుకుంటాను. నన్నూ నా తోటి బ్లాగరులనూ ఈ దొంగల బారిన పడకుండా చేసే మార్గాలు ఇవని నేను గ్రహించాను.

Categories: బ్లాగు

సరికొత్త బ్లాగుల పరిచయం

February 1, 2009 26 comments

బ్లాగు మూతల కార్యక్రమంలో తెలుగు బ్లాగరులు తలమునకలుగా ఉండగా.. ప్రసిద్ధులైనవాళ్ళు తమ తెలుగు బ్లాగులను మొదలుపెట్టారు. బ్లాగరి పేరు, బ్లాగు పేరు (బొద్దు అక్షరాల్లో), వాళ్ళ బ్లాగులలోని ప్రధాన విశేషాలు మొదలైనవాటితో కూర్చిన టపా ఇది. అవధరించండి.

మన్మోహన్‌సింగ్: “గడ్డాల్లో బిడ్డ”: భలే చక్కగా, విషయపుష్టితో, చిక్కటి తెలుగులో రాసేస్తూంటాడీయన. కాకపోతే ఈయన లాగిను, సంకేతపదమూ  సోనియాగాంధీ దగ్గర కూడా ఉన్నాయి. ఈయన రాసిన టపా కూడలిలో రాగానే, వెంటనే ఆవిడ లాగినైపోయి, తనకు తోచిన మార్పులు చేసేసి, టపాను తిరగరాసేస్తూ ఉంటుంది.  మొదట్లో “ఇదేటిది? నేనిలా చెత్తగా రాయలేదే! ఎలా మారిపోయిందబ్బా”,  “ఈ భాషేంటి ఇలా ఉంది!!” అని ఆశ్చర్యపోయేవాడుగానీ, ఇప్పుడలవాటైపోయింది.  ఈ బ్లాగులోని వ్యాఖ్యలు దాదాపుగా అన్నీ కూడా జాలి చూపిస్తూ ఉంటూంటాయి. “అయ్యో పాపం”, “ఐ పిటీ యూ”, “ప్చ్”, “పోన్లెండి, మీరు మాత్రం ఏంచేస్తారు పాపం” లాంటివే అన్నీ!


సోనియాగాంధీ: “చిన్ని నా కన్నకూ.. ప్రాధాని పదవీ..ఇఇఇ, ఇఇఇ, ఇఇఇఈ…”

ఇదో పాడుకాస్టు -పాటల బ్లాగన్నమాట. బ్లాగు శీర్షికనే పాటగా వివిధ రాగాల్లో వినిపిస్తూ ఉంటారీ బ్లాగులో. అయితే పాట పాడేది బ్లాగరి కాదు. ఈమెకు కొందరు నిలయ విద్వాంసులున్నారు, వాళ్ళు పాడుతూ ఉంటారు.  ఒకడు పాడుతూ ఉంటే, కొందరు తాళాలేస్తూ, కొందరు కోరస్ పాడుతూ, ఇంకొందరు డప్పులు మోగిస్తూ.. భలే సందడిగా ఉంటదిలెండి బ్లాగు. రాగాలు వేరైనా పాట ఒకటే కావడంతో, రోజూ అదే పాట వినాల్సి రావడంతో మరీ వీరాభిమానులకు తప్ప మామూలు మానవులకు నచ్చదు.

అద్వానీ: “నా పార్టీ, నా పదవీ” కొత్త కొత్త పదాలు, నినాదాలు కాయిస్తూ ఉంటాడీ బ్లాగరి. “అన్నా జిన్నా!” లాంటి పాతవాటిని మళ్ళీ పెడుతున్నాడు. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త కొత్త నినాదాల కోసం చూస్తూనే ఉండండి..

రాజశేఖరరెడ్డి: “సీతయ్య” ట్యాగులైను అక్కరలేని బ్లాగిది. ఈ బ్లాగులో ఉండే ప్రధానమైన అంశాల్లో ఒకటి – “మా సర్వే ఫలితాలు” ఈ క్షణంలో ఈ శీర్షిక కింద ఉన్న స్కోరు – 258/294″  జీమెయిల్లో నిల్వ సామర్థ్యం క్షణక్షణానికీ పెరిగిపోతున్నట్టు ఈ స్కోరు కూడా పెరుగుతూ ఉంటది.  అయితే 294 దాటే వీలు లేదే అని బ్లాగరి హృదయం క్షోభిస్తూ ఉంటుంది.
ఇంతకీ, ఈ సర్వేలో మనం పాల్గొనేందుకు లింకుండదు, ఉత్త ఫలితాలు చూట్టం వరకే!

“షార్ట్ సర్కిట్”: బ్లాగు సందర్శకులకు, వచ్చిన ప్రతీసారీ రెండ్రూపాయలు ఇస్తూంటాడీ బ్లాగరి. పైగా ఇలా మిగతా బ్లాగరులు చెయ్యడం లేదని రోజూ వాళ్ళను తిట్టిపోస్తూంటాడు. బ్లాగరి ఎవరో తెలీడం లేదు. మనమే కనుక్కోవాలి.

చంద్రబాబు నాయుడు: “ఒక బావ వంద బావమరుదులు”
మీకోసం వాగ్దానం అనేది ఈయన బ్లాగులోని ప్రధాన వర్గం. రోజుకో కొత్త వాగ్దానం దానంతట అదే వచ్చే ఏర్పాటుందీబ్లాగులో. 
అలాగే, మీకోసం నటవంశం  అనే వర్గంలో రోజుకో కొత్త సినిమా నటుడి పరిచయం జరుగుతూ ఉంటది.

కేసీయార్: ” అదిగో అల్లదిగో!” ఒక్కో టపాలో ఒక్కో విధానాన్ని చూపించే ఈ బ్లాగరి చాతుర్యం చూసి, మహా మహా బ్లాగరులకే మతి పోతూంటుంది. నిన్నటి టపాలో అతడు దొంగ అని తిట్టాడొకర్ని. వ్యాఖ్యాత ఒకాయన, అదేంటి కిందటి బ్లాగులో అతడు దేవుడని రాసారు గదా అని అడిగాడు పాపం. వెంటనే ఇవ్వాళ మరో టపా రాసి అందులో ఈ వ్యాఖ్యాతను “నా బ్లాగు చాయలకొచ్చావో, ఓ వెయ్యి ఐపీ అడ్రసుల కింద పూడ్చి పెడతా, ఖబడ్దార్” అని రాసాడు.

చిరంజీవి: “మెగారాజ్యం – మాకేభోజ్యం”
ఈ బ్లాగులో మామూలు బ్లాగుల్లో లాగా మొదటి పేజీగా ఇట్టీవలి టపా ఉండదు. ఒక టపా రాసి పెట్టుకున్నాడు, మొదటి పేజీగా ఏప్..పుడూ అదే వస్తుంది (స్టికీ పోస్టనమాట). ఆ టపాలో “నేను మీవాణ్ణి, మంచివాణ్ణి, అందరూ నావాళ్ళే, అందరూ మంచివాళ్ళే. రాజశేఖరరెడ్డి, చంద్రబాబు కూడా మంచివాళ్ళే. మీరు మాత్రం నాకే ఓటెయ్యండి.” అని ఉంటుంది.

జయప్రకాశ్ నారాయణ: “తామరాకు” తామరాకు నీళ్ళలో ఉంటుంది, కానీ తడి అంటదు. ఈ బ్లాగుకు వేలాదిగా హిట్లుంటాయి, కానీ వ్యాఖ్యలుండవు. (రాజకీయపు బురదలో ఉంటుంది, కానీ లోక్‌సత్తా పార్టీకి బురదంటదు. వోటర్ల మధ్యనే ఉంటుంది, కానీ వోట్లూ అంటవు, ప్చ్)

హరికృష్ణ: “నేనూ, మా నాన్న, నా తమ్ముళ్ళు, నా పెదబిడ్డ, నా చినబిడ్డ ఇంకా.. నేను!”
మొదటి పేజీలో తన నిలువెత్తు కటౌటుంటది, గజమాలతో -అంతే!

బాలకృష్ణ: “ఎంత తొడకు అంత మోత” ఇది వీడియో బ్లాగు. మొత్తమన్నీ మోత మోగి పోయే వీడియోలే!

పవన్‌కల్యాణ్: “రారా తేల్చుకుందాం @$!%&*#” ఈ బ్లాగులోకి వెళ్ళబోయే ముందు పెద్దలకు మాత్రమే అనే హెచ్చరికను దాటుకుని పోవాలి

దేవేందర్ గౌడ్: బ్రో..చే వా..........”  ఎక్కువగా విషాద గీతాలు, విరహ గీతాలు సేకరించి పెడుతూంటాడీ బ్లాగులో. కేసీయారును తిట్టిపోసి, వెలుగులోకి వద్దామనుకుని ఈ బ్లాగు పెట్టాడు. పాపం, ప్రొఫెసరొకరు అడ్డం పడ్డం కారణంగా, ఇదిగో ఇలా అయిపోయింది.

నారాయణ: ఎప్పుడెవరితో పొత్తు పెట్టుకోవాల్సి ఉంటుందో, ఎప్పుడెలా మాట్లాడాల్సుంటుందో తెలవదు కాబట్టి, ఒకటికి రెండుంటే మంచిదనే ఉద్దేశంతో రెండు బ్లాగులు పెట్టాడు. అవి చాలడం లేదు, మరో రెండుండాల్సిందేనని ఈ మధ్యే అనుకున్నాడు. అవి కూడా త్వరలో రావచ్చు

 1. “నేనొకటి తలచిన బర్దనొకటి తలచును”: ఒక టపా రాయడం, దాన్ని సమూలంగా మార్చడం,  తరవాత మళ్ళీ మార్చడం.. ఇలా జరుగుతూ ఉంటుంది. చిట్టచివరికి ఒక రూపానికి వచ్చిందనుకున్న తరవాత, దానికి పీడీయెప్ఫు కట్టేసి పక్కన పడేస్తాడు. తరవాత కొత్త టపాయణం మొదలౌతుంది.
 2. “ఏవిఁ లాఘవం!” యుద్ధ సమయాల్లో బీవీ రాఘవులును నేరుగా తిట్టడానికి, శాంతి సమయాల్లో లోపాయికారీగా ఎత్తిపొడవడానికీ పనికొస్తుందని దీన్ని పెట్టాడు. ఖమ్మంలో స్నేహపూర్వక పోటీ జరిగినప్పుడు కూడా పనికొస్తదీ బ్లాగు.

రాఘవులు: “పొ(క)త్తులాట”
పై పెద్దాయన లాగా రెండేసి, మూడేసి బ్లాగులక్కరలేదీయనకు. ఒక్కటి చాలు. టపాకో విధానం చూపించడంలో లాఘవం కలిగినవాడు. ప్రతి టపా గత టపాలో చెప్పినదాన్ని తప్పంటుంది. అయినా వ్యాఖ్యల్లో అదేంటని అడిగిన పాపాన పోరెవరూ !

సురేష్ రెడ్డి: ఈయనకు రెండు బ్లాగులుంటాయి. ఎడం పక్కవాళ్ళకొకటి, కుడివైపువాళ్ళకొకటి. ఎంతైనా నిష్పక్షపాతులు గదా.. అంచేతన్నమాట!

 1. లేదండి, విననండి, నో అండి, సారీ అండి, కూర్చోండి!” : ఇక్కడ వారానికొకటి చొప్పున శాసనసభా నియమాలను , శాసనసభ జరిగే రోజుల్లో, రాస్తూంటాడు. వ్యాఖ్యలు రాసే సౌకర్యం తీసివేయబడింది.
 2. “మీరజాలగలనా మీయానతి…” : సరిగ్గా ఆ రోజుల్లోనే ఇక్కడ కూడా వ్యాసాలొస్తూంటాయి, కానీ అవి రాసేది ఈ బ్లాగరి కాదని ప్రతీతి!  ఇక్కడ కూడా వ్యాఖ్యలు రాసే సౌకర్యం తీసివేయబడింది.

కాంగ్రెసు పార్టీలోని ఓ యాభై అరవై మంది కలిసి నిర్వహించే గుంపు బ్లాగు, “నువ్వేమన్నా తక్కువ తిన్నావా?” ఇది చరిత్రను చెప్పే బ్లాగు. ఎక్కువగా 1995-2004 మధ్య ఆంధ్ర ప్రదేశ్ చరిత్రపై పరిశోధన చేస్తూంటుంది. “వెన్నుపోటు”, “నీ చరిత్ర నాకు తెలుసులే” లాంటి మాటల కోసం గూగిల్లితే వచ్చే ఫలితాల్లో ఈ బ్లాగు మొదట కనబడుతుంది – తెలుగే కాదు, ఈ మాటలను ఇంగ్లీషులో, ఫ్రెంచిలో, అరవంలో, చైనీసులో రాసి వెతికినా సరే, వచ్చే ఫలితాల్లో ఈ బ్లాగుదే మొదటి స్థానం.

రోశయ్య: ఈయనకు కూడా రెండు బ్లాగులున్నాయి.

 1. “యతో గొడవస్తతో రోశయః”  ఇందులో మాటలేమీ ఉండవు  -అనగా రాతలేమీ ఉండవు . అన్నీ ఇమోటికాన్లే!  నాలుక బయటపెట్టి ఎక్కిరించేవి, కన్నుకొట్టేవి, ఎగతాళి చేసేవి,లేవుడి గొట్టేవి, రెండు బొటనవేళ్ళు కణతలకు ఆనించి మిగతా వేళ్ళు ఆడించేవి, ఎకిలిగా నవ్వేవి, తర్జని చూపెట్టేవి  -ఇలాంటి వనేకానేకం ఉంటాయిక్కడ. జాగ్రత్త సుమా.. వాటిని వాడేసుకునేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి మనం -కొన్నిటిమీద బ్లాగరికి పేటెంట్లున్నాయి.
 2. “తమలపాకుతో నువ్వొకటంటే..” : ఇందులో ఉంటాయి, రాతలు. మామూలుగా పై బ్లాగు చూసాక కూడా బ్లాగరి హృదయం అర్థం చేసుకోలేని, నాబోటి మందమతుల కోసం ఈ బ్లాగు. 

చేగొండి హరిరామజోగయ్య: “జో(రీ)గయ్యఈ బ్లాగులో రాసిన జాబులన్నిటినీ ఏదో ఒకనాటికి పుస్తకంగా వెయ్యాలని బ్లాగరి కోరిక. పుస్తకం పేరు: “చెప్పులోని రాయి, చెవిలోని జోరీగ..”

  బండారు దత్తాత్రేయ: “ఉత్తరాళ్ళు”: రోజుకో జాబు కార్యక్రమంలో భాగంగా జాబుల వాన కురుస్తూంటుందీ బ్లాగులో. కూడళ్ళలో పై మూడు స్థానాల్లో ఈయన టపా ఒకటి ఖాయంగా ఉంటుంది. ఈ కారణం చేత ఈ బ్లాగును కూడళ్ళ నుంచి తీసెయ్యాలని మిగతా బ్లాగరులు డిమాండ్లు చేస్తూండడంతో కూడళ్ళ వారికి ఇప్పుడిదో పెద్ద తలనెప్పిగా మారింది.

  రామలింగరాజు:  నాకు రెండు బ్లాగులున్నాయని ఈయన చెబుతూంటాడు. రేపు, అబ్బే ఉత్తదే,లేవని అంటాడేమో తెలీదు. అంచేత అదేంటి నువ్వు చెప్పిన బ్లాగులు లేవు కదా, మాకిలా అబద్ధాలు చెప్పావేంటని  భవిష్యత్తులో మీరు నన్నడగరాదు.

  1. “జురాగలింమరా”        ఈ బ్లాగు ప్రాశస్త్యాన్ని వివరించనక్కర్లేదు గదా! బ్లాగు పేరే చెబుతోంది.
  2. “రామ _ _ రాజు”        దీని సంగతి కూడా వివరించనక్కర్లేదు! బ్లాగు పేరు చెబుతూనే ఉంది.

  బంగి అనంతయ్య: “వేషమేరా జీవితం వేషమేరా శాశ్వతం”
  వేషమే నాకున్నదీ వేషమే నా పెన్నిధీ! అనేది ఈ బ్లాగు ట్యాగులైను. దాదాపుగా ప్రతీ రోజూ మూసను మారుస్తూ ఉంటాడు. టపాలేమీ ఉండవు. ఉత్త మూస మార్పిళ్ళే!

  సుబ్బరామిరెడ్డి: “విశాఖదత్తుడు”

  ఇది ఫోటో బ్లాగు. ప్రసిద్ధ వ్యక్తులతో తాను దిగిన ఫోటోలు, బాబాలతో తాను దిగిన ఫోటోలు, సినిమా తారలతో తాను దిగిన ఫోటోలు, తనకు జరిగిన సన్మానాలు, తాను చేసిన సన్మానాలు, తాను చేసిన వివిధ యాగాలూ యజ్ఞాల దృశ్యాలు,  వివిధ ఆల్బములుగా కొలువుదీరి ఉంటాయి.  చక్కటి అతిథి పుస్తకం కూడా ఉంటది. ఒక్కసారి ఈ బ్లాగుకు వెళ్ళారంటే ఈ పుస్తకం చూడకుండా, అక్కడ సంతకం చెయ్యకుండా, బ్లాగరి గురించి నాలుగు మంచిముక్కలు చెప్పకుండా బయటికి రాలేరు -రానీయదీ బ్లాగు.

  “శిఖండి”
  బ్లాగరి పేరు కూడా అదే. ఇదో తిట్టు బ్లాగు.  ఈ బ్లాగు ఉండవల్లిదని కొందరు, కాదని కొందరూ వాదించుకుంటూంటారు. ఆయనెప్పుడూ ఖండించలేదు. తనది కాకపోతే ఖండించేవాడేగా అని మొదటి వర్గం వారు అంటారు. తనదే అయితే మరీ ఆ పేరు పెట్టుకుంటాడా బ్లాగుకు అని రెండో వర్గం వారు అంటూంటారు. ఇదమిత్థంగా ఫలానావారిదని తెలీదు మనకు.

  దివాకరరెడ్డి, గొల్లపల్లి సూర్యారావులు బ్లాగులు తెరిచారు. చెరో టపా రాసారుగానీ, ఎంచేతో, వెంటనే బ్లాగులు మూసేసారు. ఎక్కడా వ్యాఖ్యలు కూడా రాయడం లేదు పాపం.

  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

  నందమూరి తారకరామారావు (అసలు సిసలు ఎన్టీయార్): “మ్హేమూ మా బ్లాగూ!” ఇందులో ఒకే ఒక టపా ఉంది.

  బ్రదర్స్, మన తెలుగు బిడ్డలంతా చక్కగా తెలుగులో బ్లాగుతుండడం చూసి నాకు ఎంతో సంతోషంగా ఉంది. తెలుగింటి ఆడపడుచులు కూడా బహుచక్కగా బ్లాగుతున్నారు. 

  బ్రదర్స్, మన ఆడపడుచులను మనం గౌరవించుకోవాలి, సాదరంగా, సౌమనస్యంతో మెలగాలి.!

  మనలో మనకు గొడవలొద్దు. తెలుగుజాతి మనది, నిండుగ వెలుగుజాతి మనది.

  ———————————————————

  రండి, రండి! Welcome

  November 16, 2008 13 comments

  Can’t see Telugu on this page? Is your Computer showing series of boxes after this paragraph? It is because, it is not taught how to render Telugu. You can teach a lesson to it, so that it will surrender to the sheer beauty of those magnificent letters. Follow the steps given in this Wikipedia link or this link or this and implement the suggested changes in your computer… you will find yourself in the lap of Mother Telugu. Then, please come back and read the following few lines.

  కొత్తగా బ్లాగుల గురించి తెలుసుకుంటున్న వారికి, ఈ బ్లాగుపై ఆంధ్రజ్యోతి సమీక్ష చదివి ఇక్కడికి వచ్చినవారికి, బ్లాగరులకు, బ్లాగ్వరులకు స్వాగతం! నాకు తెలిసిన నాలుగు ముక్కలను కొత్తవారికి చెప్పాలని ఇది రాస్తున్నాను.

  • మీకు కంప్యూటర్లో తెలుగు ఎలా రాయాలో తెలీకపోతే లేఖినికి వెళ్ళండి. మీరు రోమను లిపిలో రాసుకుంటూ పోతుంటే అది తెలుగు లిపి లోకి మార్చేస్తూ ఉంటుంది. నేను తెలుగులో రాయగలగుతున్నాను అని రాయాలనుకున్నారనుకోండి.. “nEnu telugulO raayagalagutunnaanu” అని అక్కడ రాస్తే చాలు.. మిగతా పని అదే చూసుకుంటుంది. కొత్తవారికి దీని కంటే మంచి గురువు మరోటి లేదు. కొన్ని ఆసక్తికరమైన లింకులివిగోండి:
  • తెలుగు విజ్ఞాన సర్వస్వ నిర్మాణం అనే ఒక బృహత్తర కార్యక్రమం నడుస్తోంది. తెలుగువారు తమకో విజ్ఞాన భాండాగారాన్ని తయారుచేసుకుంటున్నారు. మనలాంటి వాళ్ళంతా అందులో భాగస్తులే! ఆంధ్ర దేశంలోని ప్రతి ఒక్క ఊరి గురించి వివరాలు పొందుపరచాలనేది అక్కడి ఆశయాల్లో ఒకటి. అక్కడ మా ఊరి గురించి ఉంది, నేనే రాసాను. మీ ఊరి గురించి వ్యాసం ఉందో లేదో చూడండి. లేకపోతే మీరే రాయండి. ఉంటే.. దానిలో మార్పులు చెయ్యండి, కొత్త విషయాలు చేర్చండి
  • ఇక, బ్లాగులు ! బ్లాగులు రాసేందుకు పైసా ఖర్చు పెట్టక్కర్లేదు – నేను పెట్టలేదు. మీకు కావాల్సిందల్లా కంప్యూటరు, జాలంలో జొరబడేందుకు ఓ కనెక్షను -అంతే! ఇక మీ మనసులో ఉన్నదంతా బైటపెట్టడమే. చంద్రబాబును, రాజశేఖరరెడ్డిని, చిరంజీవిని, బాలకృష్ణను.. ఎవ్వర్నీ వదలొద్దు. ఛందోబద్ధమైన పద్యాలు, కథలు, కవితలు, వ్యాసాలు.. దేన్నీ వదలొద్దు. హాస్యం, వ్యంగ్యం, సీరియస్, విషాదం, వేదన, రోదన.. ఏదైనా సరే! పుస్తక సమీక్ష, సినిమా సమీక్ష, మీ చిన్ననాటి స్మృతులు, నిన్నామొన్నటి జ్ఞాపకాలు, కాలేజీ కబుర్లు.. ఆఫీసు కబుర్లు.. అన్నిటినీ మీ బ్లాగులో పరవండి. అంతా వచ్చి చదూకుంటారు.. మీ బ్లాగు గురించి ఏమనుకుంటున్నారో కూడా చెబుతారు.
  • బ్లాగుల్లో కనబడేవి.. వినూత్నమైన ఆలోచనలు, స్వంత భావాలు, చక్కటి భాష, నిర్మొహమాటంగా, నిర్మోహంగా సాగే రచనలు. కొన్ని చక్కటి బ్లాగుల్లోని కొన్ని మంచి టపాలను ఏరి కూర్చిన ఈ పుస్తకాన్ని చూడండి. (ఇదో పీడీయెప్ఫు పుస్తకం.. దించుకోడానికి కాస్త ఎక్కువ సేపే పడుతుంది.)
  • బ్లాగు ఎలా మొదలుపెట్టాలనే సంగతి నుండి.. బ్లాగుల విషయంలో ఏ సాయం కావాలన్నా.. తెలుగుబ్లాగు గుంపునడగండి.
  • బ్లాగుల్లో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమేం రాస్తున్నారో తెలుసుకునేందుకు కూడలి, జల్లెడలను చూస్తూ ఉండండి. బ్లాగుల్లో కొత్త రచనలు రాగానే వీటికి ఉప్పందుతుంది. కొత్తగా ఏయే రచనలు వచ్చాయో తెలిసికొనేందుకు తెలుగు బ్లాగరులు ఈ సైట్ల వద్దే తారట్లాడుతూ ఉంటారు.
  • చక్కటి ఛందోబద్ధమైన పద్యాలు రాసేవారు ఇప్పటి కుర్రకారులోనూ ఉన్నారు తెలుసా? అంతర్జాలంలో అభినవ భువనవిజయాలు జరిగాయి కూడాను. ఛందస్సునూ, పద్యాల లక్షణాలనూ నేర్పే గురు బ్లాగులు బ్లాగురువులూ కూడా ఉన్నారు.
  • ఈమాట జాల పత్రికను చూడండి. అలాంటి ఉత్తమ సాహితీ విలువలున్న పత్రికను అచ్చులో చూసి ఎన్నాళ్ళైందో గుర్తుకు తెచ్చుకోండి.
  • గళ్ళ నుడికట్టు అంటే ఇష్టమా? అయితే పొద్దు దిక్కుకు తిరగండి. తెలుగులో మొట్టమొదటి ఆన్‌లైను గళ్ళ నుడికట్టు ఇది.
  • కొత్త సినిమాల దగ్గర మైకులు పట్టుకుని, జనాల చేత అబ్బో, బెమ్మాండం, సూపరు, వందరోజులు, వెయ్యిరోజులు అంటూ చెప్పిస్తున్నపుడు “ఆంధ్రదేశంలో ఒక్ఖడు కూడా.. సినిమా బాలేదనేవాడే వీళ్ళకి కనపడడు..ఛి..చ్ఛీ..దరిద్రం.” అని టీవీల వాళ్ళను చీదరించుకున్నారా? అయితే నవతరంగపు తాజా గాలి పీల్చండి. నిష్పాక్షిక సమీక్షలే కాదు, సినిమాల గురించిన బోలెడు కబుర్లు తెలుసుకోవచ్చు. 
  • తెలుగును చూపించే విషయంలో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరరు కాస్త మొహమాటపడుతుంది. పక్కనున్న స్క్రాల్ బారును పట్టుకుని పైకీ కిందకీ జరపబోతే మహా బద్ధకంగా కదులుతుంది. (మరి ఈ సమస్య నాకేనో ఇతరులకూ ఉందో తెలీదు.) ఈ సందర్భంలో ఫైరుఫాక్సు అనే బ్రౌజరును మనం స్మరించుకోవాలి. దానిలో ఈ ఇబ్బంది కనబడలేదు. అది తెలుగుతో చెలిమి చేసింది. మంటనక్కపై తెలుగు సవారీ నల్లేరుపై నడకే! అన్నట్టీ మంటనక్క అనేది ఫైరుఫాక్సు బ్రౌజరును మనాళ్ళు ముద్దుగా పిలుచుకునే పేరు. 
  • మంటనక్కలాంటి ముద్దుపేర్లే కాక, మనం నిత్యం వాడే అనేక ఇంగ్లీషు పదాలకు సమానార్థకమైన తెలుగు మాటలను వెలికితీస్తూ, నిష్పాదిస్తూ, కనిపెడుతూ, చెలామణీ చేస్తూ ఉన్నారు. మీరూ ఓ చెయ్యెయ్యండి. ఉదాహరణకు ఇంటర్నెట్‌లో ఉండే జనులను ఇంగ్లీషులో నెటిజెన్స్ అంటారు. మనాళ్ళు నెజ్జనులు అన్నారు. జాలజనులు అన్నారు. నెటిజనులు అన్నారు. మీరేమంటారో చెప్పండి.

  బ్లాగరులో కొత్త అంశాలు

  బ్లాగరు కొన్ని కొత్త అంశాలను ప్రవేశపెట్టింది. draft.blogger.com చూస్తున్నవారికి ఈసంగతి తెలిసే ఉంటుంది. కొత్త కొత్త అంశాలను ప్రవేశపెట్టడం బ్లాగరుకు మామూలే. ఈ సారి ప్రవేశపెట్టిన అంశాల్లో నాకు బాగా నచ్చినదొకటుంది. – వ్యాఖ్యలపెట్టె. బ్లాగరులో వ్యాఖ్యలు రాసేందుకు అంతగా వీలు ఉండదు. వ్యాఖ్య రాయాలంటే ఓ లింకు నొక్కాలి, అప్పుడు వేరే పేజీ తెరుచుకుంటుంది – అందులో రాయాల్సుంటుంది. అదొక తలనెప్పి వ్యవహారం. ఈ పద్ధతిని సంస్కరించి, వ్యాఖ్యలపెట్టె కూడా జాబు పేజీ (ఇన్‌లైను) లోనే వచ్చే ఏర్పాటు చేసారు. ఇప్పుడు వర్డ్‌ప్రెస్‌లో ఉండే వీలు బ్లాగరులో కూడా చేరింది. అయితే దీనికి కాస్త హంగు చెయ్యాల్సి ఉన్నట్టుంది. ఏదేమైనా ఇప్పుడున్న స్థితిలోనైనా ఇది బానే ఉంది. కొత్త అంశాలను చూసేందుకు draft.blogger.com లో లాగినయి, డ్యాష్‌బోర్డులో ఈ కొత్త అంశాలను చూడవచ్చు.

  ఈ అంశాన్ని వాడటంలో ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. నాకెదురైంది. అప్పుడు ఇక్కడిచ్చిన సూచనలను అనుసరించి, సాధించాను.

  Categories: బ్లాగు