Archive

Archive for the ‘భాష’ Category

పేర్ల పురాణం

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, డాక్టర్, పద్మశ్రీ  నందమూరి తారక రామారావు నటించిన.. ” అని మన రాష్ట్ర విఖ్యాత సినిమారిక్షా వాడు చెప్పుకుంటూ పోతూంటే, అది వింటూ, వాడు పంచే కరపత్రాల కోసం ఆ బండెనకాలే పరిగెడుతూ -ఆహా, తలుచుకుంటూంటేనే మైకం కమ్ముతోంది. ఆ మైకువాడు ప్రతీసారీ ఆ ముందరి బిరుదులన్నీ వరసాగ్గా చదివేవాడు, అదంతా రామారావు ఇంటిపేరైనట్టు! రామారావు భక్తులైన కొందరు నాబోటిగాళ్ళు కూడా ఉత్త రా. మా. రా. వు. అని అంటే పాపం తగులుద్దేమో అన్నట్టు మొత్తం బిరుదులన్నీ చదివి మరీ పేరు చెప్పేవాళ్ళు.

కానీ మనకో మహత్తరమైన విద్యుంది. ఎంత పొడుగాటి పేరునైనా తెగ్గొట్టి, ఇరగ్గొట్టి, ముక్కల్జేసి, మళ్ళీ అతికించి మహామహా పొడుగాటి పేర్లను కూడా నాలుగైదు అక్షరాలకు కుదించేస్తాం. అంచేత “విశ్వ విఖ్యాత..” -ఈ మొత్తాన్ని కుదించేసి ఎన్టీవోడు అని అనేసాం. పేరులో వాడు ఉందిగదా అని తేలిగ్గా తీసుకోకండి సుమా, మూడు తరాల తెలుగుప్రజలకు ఎన్టీవోడంటే  “విశ్వవిఖ్యాత..’ యేగానీ మరోటి కాదు, మరోలా కాదు.  అయితే, సదూకున్నోళ్ళంగదా, ఎన్టీవోడనే మాట మాకు నోరు తిరక్క, ఎన్టీయారనేవాళ్ళం.

నాగ్గాడికి (నాగిగాడు అనే పేరుకు) ఎన్టీవోడికున్నంత పవిత్రత లేదు. ఈ మాట పలకడంలో కాస్త తేలికదనం ధ్వనిస్తుంది. ఆ రోజుల్లో నాయేస్రావును నాగ్గాడు అని అనడంలో మంచి సరదా ఉండేది. రాజబాబును రాజబాబనీ, పద్మనాభాన్ని పద్మనాభం అనీ పిలిచిన గుర్తే లేదు నాకు. రాజబాబుగాడనీ, పద్దనాబంగాడనీ అనేవాళ్లం. రాజనాల గాడు, నాగబూషణంగాడు,  ప్రబాకర్రెడ్డిగాడు,.. ఇదీ వరస!

ఇహ కృష్ణ సంగతి చెప్పే పనే లేదు -ఔనౌను, సూపర్‌స్టారే! కిట్టిగాడనేవాళ్ళం.  గూనప్పడు అనాలని యమా ఉత్సాహంగా ఉండేదిగానీ, ఫ్యాన్సు ఏడిచ్చస్తారని అనేవాళ్లం కాదు.  చాటుమాటుగా అనుకునేవాళ్ళం.  శోన్‌బాబు మాకసలు ఒక లెక్కలోవాడేగాదు..,  (ఆడికేఁవన్నా ఫైటింగొచ్చా, పాడా?) కృష్ణంరాజు జోలిక్కూడా పొయ్యేవాళ్ళంగాదు.  అస్సలునేను కృష్ణంరాజును ఒక హీరోగా చూట్టం మొదలెట్టింది కటకటాల రుద్రయ్యతోటే!

సినిమావాళ్ళ సంగతి పక్కనబెడితే..
లక్ష్మిని లక్షణంగా లక్ష్మీ అని అంటామా? అనం. లష్వీఁ అంటాం. ఇంకాస్త అందంగా పలకాలంటే లచ్చిఁవి అంటాం. మహాలక్ష్మి అనే చక్కటి పేరును మరింత అందంగా మాలష్విఁ, మాలచ్చివిఁ అని అంటాం. సచ్చినాణ అనో, కొద్ది తేడాతో సచ్చినాడ అనో అంటే తప్పు పట్టకూడదు సుమా.. సత్యనారాయణకు అది పొట్టిపేరు మరి. సచ్చెం గూడా అలాటిదే!  లష్నాణ కూడా ఆ పద్ధతిలో వచ్చిందే! వెంకటేశ్వరరావును ఎంకటేస్వర్రావనో, ఎంక్టేస్రావనో పిలవాలి. 

పాసార్ది అనే పేరు వినే ఉంటారు..  చాన్నాళ్ళ కిందట ఒక కథ చదివాను. రాసిందెవరో, కథేంటో ఏమీ గుర్తు లేదుగానీ..  ఒకడు పాసార్దీ.. పాసార్దీ.. పాసార్దీ.. అంటూ కేకేస్తూండగా కథ మొదలౌతుంది.  చెప్పొద్దూ.. ఈ పాసార్దీ  ఏంటో నాకు వెంటనే అర్థం కాలేదు. నాలుగు వాక్యాలు చదివాక తెలిసింది, పార్థసారథిని అలా పిలుస్తున్నాడని. ఆ రోజుల్లో కాబట్టి సరిపోయిందిగానీ, ఇప్పుడైతేనా… “పాసార్ది అనగా పార్థసారథి” అని ఠక్కున తట్టనందుగ్గాను, హిందువుగా పుట్టినందుకు సిగ్గుతో తలవంచుకుని ఉండేవాణ్ణి. తలొంచుకోడమేంటి హఠాత్తుగా? అసలు హిందువుకూ దీనికీ సంబంధవేంటీ? అని అడగబాకండి.. అదంతే, అదిప్పుడు ఫ్యాషను!

పైన చెప్పిన  పేరుమార్పులు, మార్పిడి పేర్లూ అన్నీ మనకు నచ్చేవే. ఇక నచ్చనివి కొన్ని..
ముందుగా కీరవాణి చేసిన ఒక దౌర్జన్యం గురించి చెప్పుకోవాలి -అవును ఎమ్మెమ్ కీరవాణే! “శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం..”  అనే శ్లోకాన్ని, శ్రీరామదాసులో కాబోలు, పాడాడు. ఎలా పాడాడూ.. అరవిందదళాయతాక్షం అనాలి గదా.. అరవిందదళాయతాచ్షం అన్నాడు.  (చాలామంది అంటారలా.) తెలుగు సినిమాల్లో ఇలాంటివి కొల్లలుగా ఉంటై, నువ్వు ఊరికే కోడిగుడ్డుకు ఈకలు పీకొద్దు అని అనకండి.. తెలుగైనా సంస్కృతమైనా ఇలా పదికాలాలు నిలిచే పాటల్లో, సినిమాల్లో  తేడాల్లేకుండా పలకాలి, అంతే!  ఇలా తప్పులు పాడితే, అది భాష మీద దౌర్జన్యం చేసినట్లే.  పైగా- పాడింది ఏ ముక్కు గాయకుడో అయితే, మనసులోనే చిరాకుపడి ఒదిలేద్దుం. కానీ ఇక్కడ పాడింది కీరవాణి గదా, సరిగ్గా పలకాలా, లేదా? ఇప్పుడూ.. ఆడు, ఈడు, అడ, ఈడ,..  అంటూ నేను రాస్తున్నా గదా, రాసేది నేనైతే ఎవరూ పట్టించుకోరు. అదే ఏ భైరవభట్లగారో, తాడేపల్లిగారో రాసారనుకోండి.. “ఏంటిది, వీళ్ళు గూడా ఇట్లా రాసారు, చదువరి లాగా ” అని అనుకోరూ? మరదే తేడా అంటే!   అయినా..

అంత పలకలేనివాడు తాను పాడటం ఎందుకు? గానకళాప్రపూర్ణ, డాక్టర్, పద్మశ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం  – అనగా మన బాలు – ఉండనే ఉన్నాడు గదా! అతనిచేత పాడించొచ్చుగా, అసలతడు పుట్టిందే అందుక్కదా !! అలాగే, అదే సినిమాలో తండ్రీ ని తన్రీ అని ఓ ఆడగొంతు అలా పాడుకుంటూపోతే, తప్పు సవరించకుండా అలాగే మనమీదికి వదలినందుకు కూడా కీరవాణిని నేను క్షమించను. సినిమాల్లో ఇలాంటివాటి గురించి పట్టించుకోడం గొంగట్లో తింటూ వెంట్రుకలేరుకోవడం లాంటిదే, కాదన్ను. అయినా సరే, క్షమించదలచుకోలేదు. మన సినిమాల్లో తెలుగురాని నటీనటులను పెట్టుకుంటాం. చాలా భాషలవాళ్ళు చేస్తారాపని. కాకపోతే, వాళ్ళకు చక్కగా డబ్బింగు చెప్పిస్తారు. కానీ మన దరిద్రం ఏంటంటే, డబ్బింగుకు కూడా తెలుగు రానివాళ్ళమే పెట్టుకుంటాం. తెలుగును ఇంగ్లీషులానో, హిందీలానో మాట్లాడ్డం వాళ్ళకో అర్హత!

ఇహ ఊళ్ళ పేర్ల సంగతి కొచ్చేటప్పటికి మనం చేసే ప్రయోగాలు, తప్పులు కొల్లలు. తెల్లోడు ఎలాగూ కొన్ని ఊళ్ళ పేర్లు మార్చేసి పొయ్యాడు. వాటినే పట్టుకు వేళ్ళాడుతున్నామనుకోండి.  కానీ, తెలుగులో సుబ్బరంగా రాసే పేర్లను రోమను లిపిలో రాసేటపుడు మార్చి రాయటం మనం తప్ప ప్రపంచంలో మరొకడెవ్వడూ చెయ్యడని నా ఉద్దేశం. గుంటూరు తెలుగులో బానే రాస్తాం. ఇంగ్లీషులో రాసేటపుడు మాత్రం గుంటూర్ అంటాం. నెల్లూరు పరిస్థితి దీనికంటే అన్యాయం.. నెల్లోర్ అట.  తెలుగులో ఎలా రాస్తామో ఇంగ్లీషులోనూ అలానే  రాయొచ్చుకదా! అది మనకు చిన్నతనం.  కడప సంగతి మరీ దయనీయం. ఈ మధ్యెప్పుడో మార్చినట్టున్నారుగానీ లేకపోతే ఇంగ్లీషులో కుడ్డప్పహ్ అని రాసేవాళ్ళం. సుబ్బరంగా ప్రళయకావేరి అనే అద్భుతమైన పేరుండగా, పులికాట్ అని గొప్పగా చెప్పుకుంటాం.మా జిల్లాలో చుండూరు అనే ఊరుంది. దీన్ని చ లాగా కాక, ౘ (మీకీ రెండో సరిగా కనబడకపోతే, తెలుగుబ్లాగు గుంపులోని ఈ లింకు చూడండి) లాగా పలకాలి. ఇంగ్లీషులో రాసినపుడు సరిగ్గా అలాగే పలకాలనే ఉద్దేశంతో దాన్ని Tsundur అని రాసారు. ఇప్పటికీ అలాగే రాస్తారు. చుండూరుపల్లి అనే మరో ఊరుంది. దాన్ని మాత్రం మామూలుగా Chundurupalli అనే రాస్తారు.

రాయలసీమ ఊళ్ళ పేర్లలో ఎక్కువగా పల్లె అని ఉంటుంది. పల్లి అని ఉండదు. మదనపల్లె, బనగానపల్లె, కందిమల్లయ్యపల్లె,.. ఇలాగ.  మదనపల్లి అని రాసుండటం మదనపల్లెలోనే చూసాను. రారోరసం వాళ్ళు కూడా తమ బస్సుల మీద మదనపల్లి అని రాసుకున్నారు. వాళ్ళ బస్టాండు మీద కూడా అదే పేరు. ఎందుకు రాయాలీ తప్పు? ఎందుకీ అలక్ష్యం? కోస్తా జిల్లాల్లో ఊళ్ళకు పల్లి అని ఉంటుంది, పల్లె అనేది చాలా అరుదు.  భారత జనగణన అనే జనాభా లెక్కలు తీసే ప్రభుత్వ శాఖ ఒకటుంది గదా, వాళ్ళ లెక్కల్లో మన ఊళ్ళ పేర్లు ఎలా రాసారో చూస్తే, కంపరం కలుగుద్ది. పల్లిలన్నీ పల్లెలు. పేటలన్నీ పేట్‌లు!  

ఇక, యాడుల్లో (వ్యాపార ప్రకటనల్లో) తెలుగు (బైబిలు తెలుగు లాగానే ఇది కూడా ఒక ప్రత్యేకమైన తెలుగు)  గురించి చెప్పుకోవాలంటే అదో ప్రత్యేక వ్యాసమౌతుంది. అలాగే, సాఫ్టువేర్ల తెలుగీకరణలో మనం (భవదీయుడితో సహా) చేస్తున్న తప్పుల గురించి మాట్లాడుకోవాలంటే కూడా అదో టపా అవుతుంది.

అది సరే, ఈ సంగతి చెప్పండి.. ఉపలబ్ధం అనేమాటను యాడుల్లో (“ఇప్పుడు, సరికొత్త వంద గ్రాముల ప్యాకులో ఉపలబ్ధం!”) కాక ఇంకెక్కడైనా చూసారా? ఈ మధ్య బ్లాగుల్లో అక్కడక్కడా తగులుతున్నాయి. తెలుగీకరణలో కూడా తగిలితే తగలొచ్చు.

Advertisements

దశావతారం

ఆ పేరేంటి? దశమావతారమన్నా అనాలి లేదా దశావతారాలు అనన్నా అనాలి. దశావతారం అనొచ్చా? “పది అవతారం” !!!

మర్యాదకరమైన మాటలు

November 29, 2007 14 comments

ఈ జాబు ఎవరిని ఉద్దేశించీ రాసింది కాదు. ఇది ఏ కొందరికో మాత్రమే పరిమితమైన విషయమూ కాదు. నాకూ అటువంటి భావనే ఉంది, దాదాపుగా అందరూ అలానే భావిస్తారనుకుంటా.

……..

కొన్ని మాటల విషయంలో తక్కువతనాన్ని (నిమ్నత్వాన్ని), అమర్యాదను తెలియజేయడానికి తెలుగు పదాలను వాడుతూ, గొప్పతనాన్ని, ఉచ్ఛతను, మర్యాదను తెలియజేసేందుకు సంస్కృతాన్ని వాడతాం. దాని గురించే ఈ జాబు.
 • ఆయన గుడ్డివాడు ” – “ఆయన అంధుడు.”
 • ఆమె చెవిటిది” – “ఆమె బధిరురాలు.”
 • అతడు కుంటివాడు” – “అతడు వికలాంగుడు” (ఈ మాటను ఎక్కువగా కాలూ చేతులకే వాడుతూ ఉంటారు, అందుకే ఇక్కడ రాసాను)
 • అవిటివాళ్ళు – వికలాంగులు

పై వాక్యాల్లో బొద్దుగా ఉన్నవి అచ్చ తెలుగు మాటలు. అచ్చ తెలుగు మాటలు వాడినపుడు మనకు అమర్యాదకరంగా తోస్తున్నాయి. ఎక్కిరించడానికీ, ఎటకారం చెయ్యడానికీ అవే మాటలు వాడడం వలన ఆ మాటలను ఎక్కడ వాడినా అమర్యాదే ధ్వనిస్తోందనుకుంటాను. ఇంగ్లీషులో సందర్భాన్ని బట్టి మాట విలువను అర్థం చేసుకునేలా ఉంటే బాగుండేదేమో! అలా లేకపోవడం వల్లనే, మర్యాదగా ధ్వనించాలంటే సంస్కృతం వాడాల్సి వసోంది.

ఇవి చూడండి:

 • చెవిటిదీ, గుడ్డిదీ అయిన ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
 • “చెవిటీ, గుడ్డీ అయిన ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.”
 • “బధిరురాలూ, అంధురాలూ అయిన ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.”

బొద్దుగా ఉన్న మొదటి వాక్యంలో అచ్చతెలుగు పదాలు వాడాం. మూడోదానిలో సంస్కృత పదాలు వాడాం. ఇక మధ్యది.. అసలీ వాక్య నిర్మాణమే తప్పుగా తోస్తోంది నాకు. మొదటి వాక్యం అమర్యాదకరంగా ఉన్నట్టనిపిస్తే దానిలో మర్యాద ధ్వనించేలా చేసేందుకు ఇలా మార్చొచ్చు:

చెవిటి వారూ, మూగ వారూ, గుడ్డి వారూ అయిన ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.” -నాకైతే కృతకంగా అనిపిస్తోందిది.

వికీలో చూస్తూ ఉంటాం.. (నేను రాస్తూ ఉంటాను కూడా) “ఆయన ఫలానా తేదీన జన్మించాడు, ఆమె ఫలానా చోట జన్మించింది” అంటూ. అవే వాక్యాలను “ఆయన ఫలానా తేదీన పుట్టాడు”, “ఆమె ఫలానా చోట పుట్టింది” అని రాస్తే అంతగా నచ్చదు. మరీ ముఖ్యంగా ఆడవారి విషయంలో! (వికీలో ఇదివరలో ఒక చర్చ జరిగింది. సావిత్రి వ్యాసంలో అనుకుంటాను.. ఏకవచనంలో రాసారని అభ్యంతరం వచ్చింది -వికీ పద్ధతది, మరి! ఒక సభ్యునికి అది నచ్చలేదు, అమర్యాదకరంగా ఉందన్నారు.) అంతెందుకు, ‘ఆడది‘ అనే మాట కూడా అమర్యాదకరమైనదే! స్త్రీ, మహిళ, వనిత ఇలాంటి అనేకానేక పేర్లు వాడొచ్చు కానీ ‘ఆడది’ వాడకూడదు!! ‘ఆడవాళ్ళు’ అనే మాట పర్లేదు మళ్ళీ.

చచ్చిపోయాడు, చచ్చిపోయింది అనే బదులు మరణించాడు, మరణించింది అని వాడుతూ ఉంటాం. అచ్చ తెలుగులో ఉండటం తప్పించి ఆ వాక్యాల్లో తప్పేమన్నా ఉందా!?

ఇలాంటివే ఇంకా ఎన్నో ఉండుంటాయి. ఇలాగ..
బ్రతుకు/బతుకు – జీవితం
బొక్క/చిల్లు/కంత – రంధ్రం
ఆమె ప్రసవించింది – గేదె ఈనింది. (ప్రసవించింది, ఈనింది లను అటూ ఇటూ మార్చి చూడండి.)
ప్రసవించింది అనే మాట కూడా ఎక్కడ వాడుతున్నాం లెండి, డెలివరీ అయింది అంటున్నాం గాని.

http://sameekshaclub.blogspot.com/2007/11/blog-post_27.htmlఈ జాబులో జరిగిన చర్చ చూసాక ఇది రాయాలనిపించింది. (నేనిది ఎవరిని ఉద్దేశించీ రాసింది కాదు. ఇది ఏ కొందరికో మాత్రమే పరిమితమైన విషయమూ కాదు. నాకూ అటువంటి భావనే ఉంది, దాదాపుగా అందరూ అలానే భావిస్తారనుకుంటా.)

పైవన్నీ ఒక స్థాయికి చెందినవి. మరికొన్ని మాటలుంటాయి.. వాటిని పలకడం కూడా అసభ్యతగా భావిస్తాం. (ట్యాబూ మాటలంటారేమో!) కొండొకచో బూతుమాటలు కూడా అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు..

ఉచ్చ/ఒంటేలు – మూత్రం

ఇక శరీర అవయవాల్లో కొన్నిటి పేర్లను అప్రాచ్యులు పలికినంత స్వేచ్ఛగా మనం పలకలేం. ఒకవేళ పలకాలంటే ఇంగ్లీషులో మాట్టాడ్డమో, లేదా సంస్కృతం చాటున దాక్కోవడమో చేస్తాం. ఉదాహరణకు చెప్పాల్సి వస్తే చాలానే ఉన్నాయి.. కానీ రాయలేను (చెబుతున్నాగా, తెలుగులో పలకాలంటే సభ్యతగా ఉండదన్న ఆలోచన! అసలీ జాబే దాని గురించి!!)

చంక‘ అనే మాటను పలకడం కూడా కొందరు తప్పుగా భావిస్తారు!!

——–

‘అంతా రాసావు బానే ఉందయా, ఇంతకీ ఇప్పుడు నువ్వనేదేంటి’ అని మీరడిగితే..
“నా ఆలోచనలను రాసాను, అంతే. నేననేదేం లేదండి, మీరేమన్నా అంటే వింటాను.” అని మాత్రం అంటాను.

ఉంటాను.

వ్యాఖ్యోపాఖ్యానం

October 11, 2007 23 comments

తెలుగు బ్లాగుల రాసి బాగా పెరుగుతోంది, ఇక బ్లాగరులు ‘వాసి’పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అంటూ వింజమూరి విజయకుమార్ గారు మధ్యంతర మార్గ నిర్దేశనం లాంటిది చేసారు. బ్లాగు నాణ్యతకై బ్లాగరులంతా పునరంకితం (అమంగళం ప్రతిహతమగుగాక 🙂 ) కావాలని వారి ఉద్దేశ్యం కాబోలు.

బ్లాగుల వాసిని వింజమూరి వారికి వదిలేసి, వ్యాఖ్యల వాసి గురించి రాయదలచాను. నాకెందుకో జాబుల కంటే వ్యాఖ్యలే ఇష్టం, అసలు కంటే కొసరు ముద్దు లాగా. వాసి విషయం చూస్తే మన బ్లాగు వ్యాఖ్యలు మరీ నాసిగా లేవని నా ఉద్దేశ్యం. నేనైతే కూడలిలో ముందు వ్యాఖ్యల పేజీకే వెళతాను. వ్యాఖ్యల తీగలను పట్టుకునే బ్లాగు డొంకలను కదిలిస్తూంటాను. మంచి మంచి వ్యాఖ్యలు రాసే వ్యాఖ్యాతలున్నారు మనకు. వీరి వ్యాఖ్యలు సదరు బ్లాగరికే కాక, ఇతర చదువరులకూ మేళ్ళు (మళ్ళీ అమంగళం ప్రతిహతమగుగాక 🙂 ) చేస్తూంటాయి. కొత్తపాళీగారు ఈ జాబు గురించి ఏమన్నారబ్బా, చరసాల ఏం మాట్లాడారు, ఫలానావారు ఏమంటున్నారో.. ఇలా చూస్తూంటాను.

వ్యాఖ్యలను గమనించారో లేదో.. కొన్ని విపులంగా, కొన్ని ముక్తసరిగా, కొన్ని జోకొడుతూ, కొన్ని రెచ్చగొడుతూ, కొన్ని వాదిస్తూ, కొన్ని బోధిస్తూ.. ఇలా రకరకాలుగా ఉంటాయి. వ్యాఖ్యాతల్లో కొన్ని రకాలు..

 1. బోళాశంకరులు: వీరికి మనమేం రాసినా నచ్చుతుంది. భలే రాసారు, అదిరిందండి, గొప్పగా రాసారు, చాలా చక్కగా రాసారు.. ఇలాంటివి వీరు ఎక్కువగా రాస్తూ ఉంటారు. (నేనీబాపతు వ్యాఖ్యలు రాయడం ఎక్కువే!) ఈ మాటలు ఎక్కువగా నిజాయితీ గానే ఉంటాయి. కాకపోతే, ఎందుకు నచ్చిందో, ఏది నచ్చిందో లాంటివి రాయరు వీళ్ళు. బద్ధకం అంతే! లేదా ఆ సమయానికి ఏమి రాయాలనేది తట్టక కావచ్చు. లేదా.. ఏమి రాస్తే ఏమొస్తుందోనన్న బెరుకు చేత కావచ్చు. ఏదన్నా గానీండి.. చిన్న మెప్పుదలతో సరిపెడతారు వీళ్ళు, తమ వ్యాఖ్యతో బ్లాగరిని సంతోషపెడతారు. బ్లాగరికి తదుపరి జాబు కోసం ఉత్సాహాన్నిస్తారు.
 2. విశ్లేషక శేఖరులు: బ్లాగును చక్కగా విశ్లేషిస్తారు వీళ్ళు. జాబు ఎందుకు బాగుందో చెబుతారు. ఏది నచ్చిందో చెబుతారు. నచ్చకపోతే ఎందుకు లేదో కూడా చెబుతారు. సద్విమర్శకులవలన సాహితీకారులకు కలిగే ప్రయోజనాలు ఈ వ్యాఖ్యాతల వల్ల బ్లాగరికి కలుగుతాయి. (శ్లేషక శిఖామణులు కూడా ఉన్నారు. అదేదో సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాసు అన్నట్టు, వీరి ఒక్క వ్యాఖ్యలో లక్ష అర్థాలు వెతుక్కోవచ్చు!)
 3. దిశా నిర్దేశకులు: వీరు విశ్లేషకులే కాక దిశా నిర్దేశం కూడా చేస్తారు. ముందేం రాయాలో కూడా చెబుతారు. మన తరువాతి జాబుకు వీరు ప్రేరణనిస్తారు.
 4. ఇక మిగిలిన వాళ్ళు – రాయని భాస్కరులు. వీరు వ్యాఖ్యలు పెద్దగా రాయరు.. లేదా అసలే రాయరు. కానీ జాబులు చదువుతూ ఉంటారు.

వ్యాఖ్యాతలందరూ ఏదో ఒక కోవకు చెందుతారని కాదు. ఒక్కోసారి ఒక్కో రూపంలో ఉంటారు.

రెండ్రోల కిందట ఈ వ్యాఖ్య చూసాను.. నాకు నచ్చింది. వైజాసత్య జ్యోతి గారి బ్లాగులో రాసిన వ్యాఖ్య ఇది. అసలు ఈ వ్యాఖ్య చూసే ఈ జాబు రాసాను.
అడగంది అమ్మైనా పెట్టదు అన్న సామెత ఎంతవరకూ నిజమో కానీ అడగంది మగాడు ఇవ్వడు అన్నది మాత్రం అక్షరాలా నిజమేమో. పెళ్ళితో భార్యను సాధించాము. ఇంక అక్కడితో ఆ సమస్యా పూరణం అయిపోయింది. ఇంక దాని (సమస్య) గురించి ఆలోచించమెందుకు అనుకుంటారు మగాళ్ళు. మైండ్ లో ఒక ఓపెన్ ప్రాసెస్ తో మగాళ్ళు నిద్రపోలేరు. దాన్ని బలవంతగా బజ్జో పెట్టాలి లేకపోతే ఆ ప్రాసెస్ కు ముగింపైనా పాడాలి. ఒక జన్మదినము కంటిన్యువస్ గా గుర్తుపెట్టుకోవటమనేది మగాడి బుర్రని తినేస్తుంది. ఆడాళ్ళకి టిప్: మీకు ముఖ్యమైన రోజుకు ముందు దాన్ని గుర్తుచేస్తూ మీ ఆయనకి SMS కొట్టండి. ఆ గిఫ్టుకంటే గుర్తు పెట్టుకోవటమే ముఖ్యం అని అడాళ్ళంటారు (అదేకదా మరి తంటా)

రాసిన కాసిని వాక్యాలు కూడా చక్కటి అర్థాన్ని చెబుతున్నాయి. వ్యాఖ్యలో చమత్కారమూ ఉంది.. (సమస్యా పూరణం). అసలు ‘విషయం ఇదీ’ అని చెప్పే నేర్పరితనమూ ఉంది (ఆడాళ్ళకి టిప్). ‘మర్చిపోకుండా జాగ్రత్తపడరు, మర్చిపోయే దాకా చూసి, ఆపై విమర్శిస్తారు. అంత శ్రమ పడే కంటే గుర్తే చెయ్యొచ్చు కదా!’ ఎంత చక్కగా చెప్పారు!రవీ, శెభాష్!

వ్యాఖ్యలు రాసి తప్పుల్లో కాలేసిన సంఘటనలు నాకు జరిగాయి.. అవీ-ఇవీ లో ఓ వ్యాఖ్య రాసి, మరీ దురుసుగా ఉందని పెద్దలు తిడితే తుడిచెయ్యాల్సి వచ్చింది. నేను తుడిచేసిన నా వ్యాఖ్య అదొక్కటే. (నా బ్లాగులో ఇంతవరకు ఒక్క వ్యాఖ్యను కూడా తుడిచెయ్యలేదు.. వ్యాఖ్యాత తుడిచేస్తే తప్ప.) అలానే రెండు రెళ్ళ ఆరు లోనూ ఒక వ్యాఖ్య చేసాను.. జాబు బాగుంది, కానీ నేనాశించినంత బాలేదు. ఆ ముక్కే రాసాను. ఎటొచ్చీ అది తీసికెళ్ళాల్సిన అర్థం తీసికెళ్ళినట్టు లేదు. తరవాత అబ్బెబ్బే అది కాదు నా ఉద్దేశ్యం అని చెప్పుకోవాల్సి వచ్చింది. అలానే తెలంగాణ ఉత్సవంలో కూడా;ఒక పదం పడలేదు.. దాంతో అర్థం మారిపోయింది. దాన్నీ సరి చేసుకోవాల్సి వచ్చింది. ఈ తత్తరబిత్తర పనులు చూసేనేమో.. కృష్ణదేవరాయలు ఇలా అన్నారు!

ఇదీ సంగతి!

గురు లఘువులు

September 20, 2007 42 comments

తెలుగు బ్లాగరుల్లో పద్యాలు రాసేవారు కొందరున్నారు. వారివలన పద్య చాపల్యం అంటుకున్న వారిలో నేనూ ఒకణ్ణి. అదే చెబుతున్నానిక్కడ.

బ్లాగున పద్యములను బహు
బాగుగ రాయుట
గని, జన బాహుళ్యమునన్
మోగెను పద్దెపు ఖ్యాతియు
బ్లాగురుడును వారి శిష్యబ్లాగరులు గనన్!

సమస్యలిచ్చెద రొక్కరు
సమముగ పూరింతు రొకరు సతతము, శాస్త్రీ
యముగన్
రాసెద రొక్కరు
క్రమముగ చదువరులు కూడ రయమున రాయన్!

తు, చ ల లాగా పద్యాల్లోనూ గణ పూరకాలు ఉంటాయి. పత్రికల్లో ఖాళీ పూరకాల లాగా. రెండో పద్యంలోని “రయమున” అలాంటిదే!
తెలుగు బ్లాగరుల్లో పద్యాలు రాసేవాళ్ళు ఎక్కువైపోతున్నారనడానికిదో ఉదాహరణ.

—————-

ఛందస్సు గురించి వికీపీడియాలో చదవొచ్చు.

తప్పటడుగులు

February 20, 2007 17 comments

చిన్నప్పుడు మనం నేర్చుకున్న తప్పులను తరువాత్తరువాత సరిదిద్దుకుంటాం. కానీ ఆ తప్పులు మన మనసులనలాగే అంటి పెట్టుకుని ఉంటాయి, పుట్టుమచ్చల్లాగా. నేను నేర్చుకున్న అలాంటి కొన్ని తప్పులు ఇక్కడ వివరిస్తాను. ఫెయిల్యూరు కథల్లాగా ఇది నా తప్పుల చిట్టా!

అతిశయోక్తి: ఏ వయసులో మొదటిసారిగా ఈ మాటను చూసానో గుర్తు లేదుగానీ.. బహుశా చందమామ, బాలమిత్ర లేదా ఆంధ్రప్రభ.. ఈమూడింట్లో ఓ దాని ద్వారా పరిచయమయ్యుంటుంది, నాకామాట. ఖచ్చితంగా బళ్ళో మాత్రం కాదు. నా బుర్ర ఆ మాటను అతియోశక్తి గా అచ్చేసుకుంది. కళ్ళు చూసేదాన్ని బుర్ర పట్టించుకోలేదు. అతియోశక్తిని అదో రకమైన శక్తి అని అనుకుని ఉంటాను. అప్పటికి శక్తి తెలుసుగానీ ఉక్తి తెలిసి ఉండదు.

మదాంధ్రం: ఆరో తరగతిలో.. ఏదో చుట్టం చూపుగా మా ప్రిన్సిపాలు గారు మాకు తెలుగు పాఠం చెప్పేందుకు వచ్చారు. (మా బడి జూనియరు కాలేజీతో కలిసి ఉండేది, అంచేత ప్రిన్సిపాలే ఉండేవారు, హెడ్మాస్టరు కాదు.) శ్రీమదాంధ్రమహాభారతం అనే మాటను చెప్పించాలి మాతో. శ్రీమత్+ఆంధ్ర అనే అర్థంలో ఉచ్చరింపజేయాలి, శ్రీమదాంధ్ర ను -అదీ ఆయన లక్ష్యం ఆరోజున. మేమేమో శ్రీ ‘మదాం’ధ్ర అని అంటున్నాం తప్ప, కవి హృదయాన్ని గ్రహించడం లేదు. ఆ గంటంతా ప్రయత్నించి కూడా, మా మదాంధతను తొలగించి, మమ్మల్ని వెలుగు లోకి తేలేకపోయారాయన! ఆ తరువాత ఆయన మళ్ళీ మాజోలికి రాలేదు, ఇంకెప్పుడూ మాతో పెట్టుకోలేదు.

అల్లూరి సీతారామరాజు సినిమా చూసిన కొత్త అది. నాకు తొమ్మిదేళ్ళుంటాయేమో! (నన్నంతలా ప్రభావితం చేసిన సినిమా మరోటి లేదు.) ఆ సినిమాతోనే సీతారామరాజు మాకు హీరో అయిపోయాడు (హీరో కానిదెవరికి!?). ఆ సినిమా పాటలను ఎలుగెత్తి పాడుకునే వాళ్ళం. “స్వాగతం దొరా.., సుస్వాగతం” ను మా స్నేహితుడు ఇలా పాడేవాడు.. “స్వాగతంధరా.. సుస్వాగతం”. ధరా అని వత్తడంలో వాడికి మరింత వీరత్వం కనిపించిందేమో! వాణ్ణి చూసి, నేనూ అలాగే పాడేవాణ్ణి. తరవాత మానేసాననుకోండి. ఈ రకంగా సినిమా పాటలలోని పదాలను అడ్డగోలుగా మార్చేసిన సంగతులు కోకొల్లలుగా ఉన్నాయి. మీకూ ఉండే ఉంటాయి లెండి! మచ్చుకొకటి..

“నరవరా, ఓ కురువరా..” పాటలో ఒకచోట “అర్జున ఫల్గుణ పార్థ కిరీటీ, ధనంజయ విజయా..” అని అర్జునుడి పేర్లన్నీ పలికిస్తాడు రచయిత. ఆ పాట విన్న కొత్తలో నాకు ధనంజయ అనే మాట అర్థం కాలేదు. పాట పాడుకోడానికి అది నాకేమన్నా అడ్డమా? “అర్జున ఫల్గుణ పార్థ కిరీటీ, నెలవు కొన్న విజయా..” అని పాడుకునే వాణ్ణి. ‘నెలవు కొన్న’ అంటే ఏంటని మీ సందేహమా? ఎవరికి తెలుసండీ.. మాట ఏదయితేనేం, పాట లయ తప్పకూడదు అంతే!

VIBGYOR తెలుసు కదా. దానికి తెలుగు – “ఊనీఆనపనార” అని చెప్పేవారు. మనకో గొప్ప పాట ఉంది – “మానూ మాకును కాను, రాయీ రప్పను కానేకాను, మామూలు మనిషిని నేను” అని. ఎలా అలవాటయిందో తెలీదు గానీ ఈ “ఊనీఆనపనార” ను “మానూ మాకును కాను” స్టైల్లో పాడ్డం అలవాటయింది. ఇప్పటికీ పాడుకుంటాను, ఎవ్వరూ వినకుండా!

‘అర్జునుడు’లో జ ఒత్తులో ‘జ’ రాయడానికి బదులు ‘జు’ రాసాను. (రు కింద జు రాసాను) మా మేష్టారు తన పద్ధతిలో 🙂 తప్పు సరిదిద్దారు. ఆ పద్ధతి కారణంగా ఆ తప్పు మరెన్నడూ చెయ్యలేదు. అన్నట్టు, కంప్యూటరు ఆ తప్పు చేద్దామన్నా చెయ్యనివ్వదు, చూసారా!!?

సుందరంబాడి శంకరాచారి / శంకరంబాడి సుందరాచారి: మనకు రాష్ట్ర గీతాన్నిచ్చిన మహానుభావుడు! ఆయన పేరుతోనూ నాకు తికమకే, ఏది సరైనదని. ఈ తికమక నాకే కాదు ప్రసిద్ధులకూ ఉంది..
సుమారు ఓ రెండేళ్ళ కిందటి సంగతి.. అయన గురించి దూరదర్శన్ లో ఓ గోష్ఠి జరిగింది. పాల్గొన్నవారిలో పులికంటి కృష్ణారెడ్డి గారొకరు. నాలాగే ఆయన కూడా తికమక పడ్డారు.. ఒకసారి కాదు, కనీసం మూడు సార్లు! మా రాయలసీమ ముద్దుబిడ్డ అంటూ ఆయన పేరును తప్పు చెప్పడం చూస్తే నవ్వొచ్చింది.

సరీసృపం! లేక సరీనృపమా? నిన్నా మొన్నటి దాకా ఏది సరైనదో నాకు తెలీదు! సరీసృపమే సరైనదని ఈ మధ్యే తెలిసింది. నాకు మాత్రం సరీనృపమే నచ్చింది.

“పల్లే కన్నీరూ పెడుతుందో కనిపించని కుట్రల..” పాట వినే ఉంటారు. చాలా విషాదం ఉందీ పాటలో. ఓ పాతికేళ్ళ నాటి పల్లెటూళ్ళనెరిగిన వారికి ఆ విషాదం మరింతగా తెలుస్తుంది. మామూలు ఏడుపు పాటల్లాగా ఏడుస్తూ, నీరసంగా సాగే పాట కాదది, మాంచి.. ఫ్లుతగతిలో (ఫ్లుతగతిలో plu / phlu -ఏది సరైనది?) సాగుతుంది; అయినా విషాదం పలికిస్తుంది. ఆ విషాదానిక్కూడా హాస్యాన్ని కలపగలిగాను నేను. మొదటి సారి ఆ పాట విన్నపుడు కుట్ర అనే మాట వేరేగా వినబడింది… కుక్క అని! మళ్ళీ విన్నాను, అలానే వినబడింది. మళ్ళీ మళ్ళీ విన్నాను, అలానే అలానే వినబడింది. ఎన్నిసార్లు విన్నా “కనిపించని కుక్కల” అనే అనిపించేది. (గోరటి వెంకన్న గారికి ఈ సంగతి తెలిస్తే, ఓ పాటుచ్చుకుని నన్ను కొడతారేమో!) అది ఖచ్చితంగా తప్పని తెలుసు. కానీ సరైన మాటేదో తెలీలేదు. అది “కుట్ర” అని తెలుసుకునే దాకా కుదురుగా ఉండలేకపోయాను.

అంతెందుకు.. ఈ మధ్యనే, ఈ బ్లాగులోనే, ఓ జాబులో ఓ గొప్ప పాటను (“సడిసేయకోగాలి సడిసేయబోకే!”) రాస్తూ శుద్ధ తప్పు రాసేసాను. కొత్తపాళీ గారు తన వ్యాఖ్యలో సరిదిద్దారు. అదేమిటో చూస్తారా.. ఇదిగో.. ఇది!

ఈ మధ్యే నేను దిద్దుకున్న తప్పులు మరికొన్ని..
స్మశానం అనేది తప్పని, శ్మశానం సరైనదనీ బూదరాజు రాధాకృష్ణ పుస్తకంలో చదివాను.
ఉచ్ఛారణ కాదు ఉచ్చారణ సరైనదని కూడా ఆయనే రాసారు.

ఇప్పటికీ నే రాసేది తప్పో కాదో తెలియనివి కొన్నున్నాయి!
వాటిలో ఒకటి.. ళ్ళ, ళ్ల ఎక్కడెక్కడ వాడాలనేది.
పెళ్ళి / పెళ్లి – (ఏకవచనం) వీటిలో ఏది సరైనది?
కాళ్ళు / కాళ్లు – (బహువచనం) – వీటిలో ఏది సరి?

ధ, థ లు వాడే విషయమై కూడా నాక్కొన్ని సందేహాలున్నాయి!

నాక్కొంత ఇంగ్లీషూ వచ్చు. అంచేత స్టేషనరీల్లో (Stationary, Stationery) ఏది స్థిరము, ఏది చరము లాంటి సందేహాలు చాలానే ఉన్నాయి.

తెలుగు, ఆంధ్రం – కనకదుర్గ గారి అబద్ధాలు, దూషణలు

November 14, 2006 16 comments

ఆంధ్రజ్యోతిలో కనకదుర్గ దంటు గారు రాసిన వ్యాసం చదివి నేనీ స్పందనను రాస్తున్నాను. ఆ వ్యాసంలో ఆమె చాలా అవాస్తవాలను రాసుకు పోయారు. తెలుగు అనే మాట తెలంగాణ వాళ్ళదనీ, ఆంధ్ర ప్రాంతం వారికి దానితో అసలు సంబంధమే లేదనీ ఆవిడ వాదించారు. ఇంత పరమ మూర్ఖపు వాదనను చదివాక నా స్పందనను రాయకుండా ఉండ లేకపోతున్నాను. ఇక ఆంధ్ర అనేమాటను ఆమె కోస్తా, రాయలసీమ ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకుని వాడారు. నా దృష్టిలో అది తప్పైనా, వాదన కోసం నేనూ అదే వాడాను.

తెలుగు మాసొత్తు అని చెప్పుకుంటున్నారు అనే విమర్శ గురించి: తెలుగు మా ఒక్కరి సొత్తు అని ఎవరూ అనలేదు. తెలుగు అందరిదీ.. భాష తల్లి లాంటిది.. అలాంటి తల్లిని దిక్కుమాలినది అని తిట్టే దౌర్భాగ్యుల గురించి మాత్రమే ప్రజల విమర్శ. అయితే, ఇప్పుడు కనకదుర్గ గారు మాత్రం “తెలుగు మాది.. మీది ఆంధ్రం” అని తమ ఆంధ్ర “సోదరు”లను అంటున్నారు. మా అమ్మను మేము తిట్టుకుంటాం, చంపుకుంటాం మీకెందుకు అని ఆమె వాదన కామోసు!

తెలుగు అనేమాట మనకు ఉర్దూ నుండి వచ్చిందని చెబుతున్నారు కనకదుర్గ గారు! ఇది తెలివైన వాదనే అనుకుందాం ప్రస్తుతానికి.. మరి ఈ ప్రాంతాన ఉర్దూ వినిపించి కేవలం కొన్ని వందల ఏళ్ళే అయింది. అంతకు ముందు తెలుగును ఏమనే వాళ్ళో ఆమె వివరిస్తే బాగుండేది.. ఆంధ్రం అనేవాళ్ళా?

మూడు క్షేత్రాల మధ్య నున్న ప్రాంతమే తెలుగు ప్రాంతమని ఆమె అంటున్నారు, మరి దీనికి బయట ఉన్న తెలంగాణ ప్రాంతమెక్కడిది? తెలుగువారిది కాదన్న మాటేగా? బయటి ప్రాంతాన్ని తెలంగాణలో కలిపేసుకున్నారా? మరి ఇక్కడి తెలుగువారు తెలుగువారా లేక మహారాష్ట్ర, కన్నడ జాతులతో కూడిన సంకర జాతా? అలాగే తెలుగు భాగవతం అనే దానికి కూడా ఆధారం ఇవ్వలేదు.


ఆంధ్ర జాతి అనేది 5 వేల ఏళ్ళ కిందటే ఉండేదని రాసారు, సంతోషం! దండకారణ్యానికి దిగువన ఉండే ప్రాంతం ఇప్పటి ఆంధ్ర ప్రాంతమని కూడా సెలవిచ్చారామె. ఇప్పటి ఖమ్మం జిల్లా, వరంగల్లు జిల్లాలోని కొంత భాగం దండకాటవికి నేరుగా దిగువన ఉన్నదని ఆమెకు తెలిసినా తన వాదనకు సౌకర్యంగా ఉంటుందని పక్కన పెట్టినట్టున్నారు. మరి.. ఖమ్మమూ, వరంగల్లులోని కొంత భాగమూ ఆంధ్ర ప్రాంతానికే చెందాలంటే ఆమె ఒప్పుతారా? ఇది మూర్ఖవాదనని నాకు తెలుసు.. ‘త్రిలింగాల మధ్యనున్నదంతా మాదే.. మేమే తెలుగులము’ అన్న ఆమె వాదన ఎంత మూర్ఖమైనదో చెప్పడం కోసమే రాసానిది.


ఆంధ్రా వాళ్ళకు తెలుగు ఊతపదమైందట.. పైగా ఎలాగయిందో చెబుతానంటూ తప్పులో కాలేసారు, దుర్గ గారు! శంకరంబాడి సుందరాచారి బాపట్ల కు చెందిన వారు కాదు, ఆయన రాయలసీమకు – తిరుపతికి – చెందిన వారు. ఆయన మొదటిసారిగా తెలుగు అనేమాటను దోపిడీ చేసి కొల్లగొట్టుకు పోయారట! కృష్ణా, గోదావరులు తెలంగాణలోనే ఎక్కువ భాగం ప్రవహిస్తున్నాయనీ, అంచేత వాటి ప్రసక్తి “మా తెలుగుతల్లికి..” పాటలో ఉండడాన్ని తప్పుబట్టారు. రాసిన మహానుభావుడికి ఆ భావనలేమీ లేవు. అందుకే రుద్రమ్మ భుజశక్తి గురించీ రాసాడు. ఆయన రాసింది యావజ్జాతి గురించీ! ఇలాంటి సంకుచిత స్వభావులకు అది అర్థం కావడం కష్టమే.

బహుశా నిజాము పాలన ప్రభావం కాబోలు.. ప్రతీవాళ్ళనూ దోపిడీదారు అని కలవరించడం అలవాటైపోయింది దుర్గ గారికి. నిజాము పాలనలో ఉండి బయటి ప్రపంచంతో సంబంధాలు లేకపోవడం వలన శంకరంబాడి సుందరాచారి గారు “తెలుగు” అనే మాటను కొట్టేసిన విషయం తెలీలేదట.. ఆ పాలన ముగిసి ఇప్పటికి యాభైఆరేళ్ళు దాటిందే.. మరి ఇన్నాళ్ళూ ఈ విషయం ఆమెకు ఎందుకు తెలీలేదో!? (హఠాత్తుగా కరీంనగర్ ఉప ఎన్నికకు ముందు తెలిసింది!) నీళ్ళూ, నిధులూ, నియామకాలతో పాటు సూర్యకాంతిని, వర్షాలను, సముద్రాన్ని, తుపానులను కూడా కొట్టేసారనలేదు, సంతోషం! ప్రాస కలవక అనలేదనుకుంటాను.

మొట్ట మొదటగా సుందరాచారి గారే తెలుగు అనే మాటను కొట్టేసారని ఆమె చెబుతున్నారు. “దేశభాషలందు తెలుగు లెస్స” అనే వాక్యం ఆమె విన్నారా? అందులో తెలుగు అనే మాట ఉంది గమనించారో లేదో మరి? దాన్ని రాసింది శ్రీకృష్ణదేవరాయలనీ, శ్రీనాథుడనీ రెండు వాదనలున్నాయి. మరి వాళ్ళ కాలం ఈమె అంటున్న కాలానికి కనీసం 400 ఏళ్ళ ముందు. ఇద్దరూ తెలంగాణ ప్రాంతానికి చెందినవారు కాదు. దుర్గగారికి ఈ విషయం తెలిసినట్లు లేదు.. లేకుంటే శ్రీకృష్ణదేవరాయలను, శ్రీనాథుడినీ ఏకి పారేసి ఉండేవారు.., కవిత్రయపు కవిత్వాన్ని అన్యాపదేశంగా విమర్శించినట్లు!


భాష, సంస్క­ృతి వేరైన ప్రజలు కలిసి ఉండడం సాధ్యంకాదు అని
ఈమె అంటున్నారు..మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భాషా, సంస్కృతీ వేరైన ముస్లిములను తెలంగాణ నుండి వెళ్ళగొడతారు గామోసు!


ఆంధ్రం 5 వేల ఏళ్ళ నాటిదని ఆమే స్థిరపరచారు. అలాగే “తెలుగు”కు ఆ పేరు ఉర్దూ మాట్లాడే జనం ఇక్కడికొచ్చాకే ఏర్పడిందని కూడా నిర్ణయించేసారు. అంటే కొన్ని వందల ఏళ్ళ కిందటిదన్న మాట. మరి ఆమె చెప్పుకుంటున్న “వారి భాషలో” ఆమే చెబుతున్న “ఆంధ్ర” భాషలోని అక్షరాలు, పదాలు, వ్యాకరణమే ఉన్నాయేమిటి? దుర్గగారూ, ఆంధ్రం లోని అక్షరాలను, పదాలను, వ్యాకరణాన్నీ తీసుకుని దాని క్రియల్ని మార్చి ఇవ్వాళ “మీది”గా చెప్పుకుంటున్న తెలుగుగా మార్చారా మీ పూర్వీకులు? అంటే మీ పూర్వీకులు ఆంధ్రులు లేదా ఆంధ్ర సంతతి అయినా అయి ఉండాలి. ఈ సంగతి అర్థం కాక మీరు తెలుగు నాదే, నీది కాదు, నువ్వు వేరే పేరు పెట్టుకో అంటూ తెలివి తక్కువ వాదన చేస్తున్నట్టున్నారు.

ఇక్కడో విషయం.. కనకదుర్గ గారు ఆంధ్ర ప్రాంతం వారందరినీ అంటున్నారు.. నేను మాత్రం ఆమె ఒక్కర్నే అంటున్నాను. ఎందుకంటే ఇంత తెలివి తక్కువగా, మూర్ఖంగా అందరూ ఆలోచించరు కాబట్టి. ఆమె మూర్ఖత్వానికి పరాకాష్ఠ.. ఆంధ్రులను తెలుగువారు అని అనరాదట! ఈ మాట చెప్పేందుకు ఆమె ఎవరు? నేను కూయందే పొద్దే పొడవదన్న కోడి లాగా ఏమిటీ తెలివితక్కువ వాదన?

ఇక కాళోజీ ఎకసక్కెం గురించి కొంత.. దుర్గ గారంటున్న ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఇంగ్లీషు నేర్చి తెలుగును జోకొట్టారు, అందులో సందేహం లేదు. మరి కాళోజీ సమకాలికులైన తెలంగాణ వారు స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నారా? ఆమే రాసారుగా.. సడకు, అదాలతు, ముల్జీం (ముజిలిం), షక్కరు.. ఏడికెల్లి అచ్చినయి గా మాటలు? ఉర్దులకెల్లి అచ్చినయి గావా? కాకతీయుల కాలంలో ఉన్నాయా అవి? భాష పరిణామంలో ఇవి సహజం, నేను తప్పుబట్టడం లేదు.. కానీ కాళోజీ తప్పుబట్టాడని ఆమె ఎత్తిజూపడం మర్యాద కాదు అని చెబుతున్నాను.

అసలెందుకు చేస్తున్నారీ కొత్త వాదనలు?

ఈ తెలివితక్కువ వాదనలు ఇప్పుడే ఎందుకు చేస్తున్నట్లు? కేసీయార్ దిక్కుమాలిన డైలాగుతో మొదలైందిది. ప్రస్తుతం కరీంనగర్ ఉప ఎన్నికలు దగ్గర్లో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో తెరాస ఓడిపోతే అది ఆ పార్టీకి పెద్ద దెబ్బ అవుతుంది. అంచేత ఏదో రకంగా తగువు పెట్టుకుని తెలంగాణ ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి, ఈ ఉప ఎన్నికలో గట్టెక్కాలన్న దుగ్ధ కనిపిస్తోంది ఈ తెలుగుతల్లి దూషకుల్లో, తెరాస విదూషకుల్లో! తెరాస నేత మొదలెట్టిన ఈ దూషణల పర్వాన్ని తెరాస బుర్రకథకుల గుంపుకు చెందిన వంతగాళ్ళు కొనసాగిస్తున్నారు! అందులో భాగమే ఇది. తెరాస గెలుస్తుందా, తెలంగాణ ఏర్పడుతుందా అనేది కాదు విషయం, ఈ ప్రేలాపనల్లో పస ఉందా లేక అంతా బుసేనా అని!

చివరగా..

అమ్మా! ఈ కనకదుర్గ అనే పేరు ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోవాలని ఉంది.. బెజవాడ కనకదుర్గమ్మ పేరా, లేక తెలంగాణ లోనే ఆ పేరు గల దేవత ఉందా? ఒకవేళ బెజవాడ కనకదుర్గ పేరే మీరు పెట్టుకుని ఉన్నా.., అంత మాత్రాన “కనకదుర్గ మాకే చెందుతుంది, మీరా పేరును మార్చేసుకుని వేరే పేరు పెట్టుకోండి” అని అనేంత మూర్ఖ శిఖామణులు మనరాష్ట్రంలో లేరులే!