Archive

Archive for the ‘మాధ్యమాలు’ Category

మే..ధావుల ’వర్గవివక్ష’

తెలంగాణ వాదులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చి, తమకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యమని డిమాండుతున్నారు. అంటే వేరు పడతామంటున్నారు. వేర్పాటువాదులన్నమాట! కానీ, ’దాన్ని ప్రత్యేకవాదమని అనాలిగానీ, వేర్పాటువాదమని అనకూడదు’ అని పాత్రికేయుడొకాయన చెబుతున్నారు. ఈ ముక్క గతంలో కొందరు రాజకీయులూ అన్నారు. సమాధానం చెప్పాల్సిన వాళ్ళు చెప్పారు. బ్లాగుల్లోనూ అన్నారు, అప్పుడూ తగు సమాధానాలే చెప్పారు. కాకపోతే ఇప్పుడు అంటున్నది, మేధావి వర్గానికి చెందిన పాత్రికేయుడు. ఏప్రిల్ 4, ఆదివారం నాడు హెచ్చెమ్ టీవీలో పాల్గొన్న పాత్రికేయులకు ‘వేర్పాటువాదం’ అనే మాట తప్పనిపించింది. ఆ మాటను దేశం నుండి విడిపోవాలని కోరితేనే అనాలంట. తెలంగాణ డిమాండును ఆ పేరుతో పిలిస్తే ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల్ని అవమానించినట్టేనంట!! ఈ ముక్కలన్నది ఎ.శ్రీనివాసరావు. 
 
ఓ పాత్రికేయ మేధావీ.. మీ తెలంగాణ పక్షపాతం చూపించుకోడానికి పదాల అర్థాలను కూడా మార్చేస్తారా? ఇదిగో, బ్రౌణ్యం ఏం చెబుతోందో చూడండి.. http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F%E0%B1%81&table=brown. వేర్పాటు అంటే ప్రత్యేకపడటమే! దేశం నుంచి విడిపోతారా, రాష్ట్రం నుంచి విడిపోతారా, తండ్రి ఆస్తిని విడగొట్టుకుంటారా,.. అనేవి ఆ పదానికి అనవసరం, దానికి వివక్షలేమీ లేవు. అంచేత, మీ తె.వాద పక్షపాతాన్ని చూపించుకోడానికి మరో పద్ధతిని – మరే పద్ధతినైనా – ఎంచుకోండి. భాషకు కొత్తర్థాలు చెప్పకండి.

’అన్నల్దమ్ముల్లాగా విడిపోదాం’ అనే మాట వినని ఆంధ్రుడున్నాడా ఇవ్వాళ?  ఇది తె.వాదుల ఊతపదం కాబట్టి, దాన్ని వాళ్ళు విచ్చలవిడిగా వాడతారు కాబట్టి ఇప్పుడే పుట్టిన పసిపిల్లాడు కూడా ఈ మాట బారిన పడకుండా తప్పించుకోలేడు. అన్నల్దమ్ములు విడిపోయి ఆస్తులు అప్పులూ పంచుకోడాన్ని ఏర్లు పడటం / వేర్లు పడటం / వేరు పడటం అనే అంటారు.వేరు పడటం అనే మాట తప్పేమీ కాదు, గౌరవహీనమైనదేమీ కాదు. కాకపోతే వేరుపడటం అనే పని ఏమంత ఉదాత్తమైనదేమీ కాదు, అంచేత ఆ మాట ఈ పాత్రికేయుడికి తప్పుగా అనిపించి ఉండొచ్చు.
 
ప్రత్యేకరాష్ట్రం కావాలని అడగడం వేర్పాటే. అలా అడిగేవాడు వేర్పాటువాదే! తె.వాదుల కోసం దాన్ని మార్చనక్కర్లేదు. ఈ మేధావులు తమ నూత్న తె.వాద మహా విజ్ఞానంతో టీవీ కెమెరాల ముందుకొచ్చి నిష్పాక్షికులమంటూ పోజు కొడుతూ అబద్ధాలు చెప్పుకుపోతూంటారు. మనకు జ్ఞానదానం చేసేద్దామని చూసేస్తుంటారు. పాత్రికేయుడు, ప్రొఫెసరు, ఆచార్యుడు,.. అంటూ తమకో ట్యాగు తగిలించుకు తిరుగుతూంటారు. వీళ్ళు చెప్పే అబద్ధాలు వింటూ, టీవీల లంగర్లు కొందరు పళ్ళికిలించి ఆహా ఓహో అని అంటూంటారు. 

ఈ కార్యక్రమంలో ఆ లంగరు ’అదేంటండీ ఆ మాట తప్పెలా అవుతుంది’ అని అడగలేదు. లంగరు పని వాళ్ళ చేత వాగించడం వరకేను, సొంత అభిప్రాయాలు చెప్పడం కాదు అని అంటారా.. అది నిజమే, లంగరు వాళ్ళ చేత వాగించాలిగానీ తాను వాళ్ళ అభిప్రాయాలను ఖండించడం లాంటివి చెయ్యకూడదు. మరి అదే లంగరు ఓ పక్కన తిరపతి నుండి ఒక ప్రొఫెసరు గారితో కూడా మాటలు కలిపాడు. మాటల్లో ఆయనేదో చెప్పబోగా, ఈయన కలిగించుకోని ఆయన అభిప్రాయాలను తోసిపుచ్చాడు. ఈ లంగరుకెందుకంత పక్షపాతం?
…………….
 
నిష్పాక్షిక విశ్లేషకులమని చెప్పుకుంటూ ’వక్రవాణి’ వినిపించే ప్రొఫెసర్లు మనకు కొంతమంది ఉన్నారు. వీళ్ళతో పోలిస్తే, ఈ పాత్రికేయ మేధావులు చాలా నయం. మీరు ఏ టైములోనైనా టీవీ పెట్టండి.. ఏదో ఒక చానల్లో మొహం గంటు పెట్టుకునో, ఎవడో ఒకణ్ణి తిడుతూనో కనిపిస్తారీ వక్రవాణులు. అసలు వీళ్ళు కాలేజీలకి పోయి పిల్లలకు పాఠాలెప్పుడు చెబుతారో అర్థం కాదు. ఇక్కడ మాత్రం లంగర్లకు, తోటి విశ్లేషకులకు క్లాసులు పీకుతూంటారు.

ఈమధ్య ఐన్యూస్ లో ఒక చర్చ చూసాను. లంగరు పేరు అంకం రవి. ప్రభాకరు అనే తెరాస నాయకుడు, చక్రపాణి అనే ప్రొఫెసరు 🙂 , ఈమధ్య కాలంలో ఉస్మానియా ఐకాసలో నాయకుడై ఆ తరవాత టీవీల్లో విశ్లేషకుడైన ఒక విద్యార్థి -ఈ ముగ్గురూ చర్చించేవారు.

తెరాస నాయకులు రాజీనామాలు చెయ్యగా ఏర్పడిన ఖాళీల్లోఆత్మహత్య చేసుకున్న కుర్రాళ్ళ కుటుంబీకుల్ని నిలబెట్టాలని ఆ కుర్రాడు (విద్యార్థి) అంటున్నాడు.  ప్రభాకరు, చక్రపాణీ కలిసి అతగాడి నోరు మూయిస్తున్నారు. ప్రభాకరు చాలా నయం.. నువ్వు అలా మాట్టాడ్డం తప్పు, ఇలా మాట్టాడ్డం తెలంగాణ ఉద్యమానికి చేటు అంటూ మాట్టాడుతున్నాడు. చక్రపాణి మాత్రం ఆ కుర్రాడి నోరు బలవంతానా నొక్కెయ్యాలనే చూసాడు (ఈయనలో తెలంగాణ పట్ల నిష్పాక్షికత ఎల్లప్పుడూ పొంగి పొర్లుతూ ఉంటుంది). ఇలాంటి వాళ్ళను ఇక్కడికి తీసుకొచ్చి చర్చలు పెట్టి తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు అంటూ లంగరు మీద ఆవేశపడి, ఆయాసపడి పోయాడు. ’ఇతణ్ణి మాట్టాడకుండా ఆపుతారా నన్ను వెళ్ళిపొమంటారా’ అని లంగరును బెదిరించాడు.

చక్రపాణి, ప్రభాకరు ఆ కుర్రాణ్ణి నానామాటలూ అన్నారు. మరో విద్యార్థి నాయకుడు ఫోనులో చెప్పిన మాటలను పట్టుకుని, నువ్వసలు ఉద్యమంలో పాల్గొననేలేదు, నువ్వు సమైక్యవాదుల తొత్తువు అనే అర్థం వచ్చేలా చిన్నబుచ్చబోయారు. ఇవన్నీ నేరుగా అతణ్ణి అనలేదు, తెలివిగా ఆ ఆర్థం వచ్చేలా మాట్టాడారు. నువ్వసలు తెలంగాణ వాడివే కాదు, ఖమ్మం జిల్లా సరిహద్దుకు చెందిన కృష్ణా జిల్లా వాడివి అనీ అన్నారు.

పాపం అతడు సమాధానం చెప్పుకోబోతే మధ్యలోనే అడ్డుపడి నోరు మూయించారు. నేను ఉద్యమంలో పాల్గొని జైలుకు పోయాను, చంద్రబాబు ఇంటిదగ్గర ధర్నా చేసి అరెస్టయ్యాను. అంటూ తన ఉద్యమ నేపథ్యాన్ని చెప్పుకోబోతే చక్రపాణి అరిచేసి నోరు మూయించాడు. ఏంమాట్టాడుతున్నావు నువ్వు అంటూ ఆ కుర్రాణ్ణి బెదిరించబోయాడు. ఆ కుర్రాడు చక్రపాణిని ఎదిరించేందుకు ప్రయత్నించాడు. అయితే చక్రపాణికి దీటుగా రౌడీతనం చెయ్యలేకపోయాడు పాపం! అంకం రవి ప్రేక్షకుడే అయ్యాడు.  ఇదే చక్రపాణి గతంలో ఒక కోస్తా ప్రాంతపు విద్యార్థిపై కూడా జులుం చేసాడు. అప్పుడు నే రాసిన టపా చూడండి.

ఇదే చక్రపాణి, నెల్లూరులో హెచ్చెమ్ టీవీ వాళ్ళ దశ దిశ కార్యక్రమంలో కూడా ఇలాంటి ‘నిష్పాక్షిక‘ వ్యాఖ్యలే చేసాడు.. తెలంగాణ రాజకీయ నాయకులు విద్యార్థులను రెచ్చగొట్టి ఉద్యమాలు చేయిస్తున్నారు అని వచ్చిన ఆరోపణను ప్రస్తావిస్తూ… ’ఎవరో రెచ్చగొట్టినంత మాత్రాన ప్రజా ఉద్యమాలు రావు. ప్రజల్లో సహజంగా ఉప్పొంగిన చైతన్యమే తెలంగాణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది.’ అని చెప్పుకుపోయాడు. కానీ, అదే లెక్క కోస్తా సీమల్లో వచ్చిన ఉద్యమానికి వర్తింపజేయడాయన. కోస్తా సీమల ఉద్యమం, కేవలం నాయకులు చేస్తున్నదేగానీ ప్రజల్లోంచి వచ్చినది కాదని టీవీల్లో చెబుతూంటాడిదే వ్యక్తి!

నిష్పాక్షిక విశ్లేషకులమని చెప్పుకుంటూ, టీవీల ముందు దొంగ కబుర్లు చెబుతూ, వక్రవాణి వినిపించే నిష్పాక్షికుల నోరు మూయించే రోజు ఎప్పుడొస్తుందో! ఈ మే..ధావుల వర్గవివక్ష నుండి సామాన్యులకు ఎప్పటికి విముక్తి కలుగుతుందో!!

Advertisements

అసలు నేరస్తులు

December 14, 2008 28 comments

వరంగల్లు విషాదంలో రెండు సంఘటనలున్నాయి: ఒకటి యాసిడు పోసిన ఘటన, అందుకు దారితీసిన పరిస్థితులు, రెండోది పోలీసులు చేసిన ఎన్‌కౌంటరు.

యాసిడు ఘటనకు సంబంధించి తల్లిదండ్రుల బాధ్యత విషయంలో ప్రసాదం గారు చెప్పినదానితో ఏకీభవిస్తాను. తల్లిదండ్రుల బాధ్యతతో పాటు మరో ముఖ్య విషయాన్ని నేను ప్రస్తావించదలచాను. అది సినిమాలు, టీవీ, పత్రికలు. ప్రజాభిప్రాయాన్ని, సామాజిక ధోరణులను ప్రభావితం చెయ్యడంలో వీటి పాత్ర ఉపేక్షించరానిది.

గత ఏప్రిల్లో రాసిపెట్టుకున్న నా జాబును కొన్ని మార్పుచేర్పులతో, జాబులోని హాస్య, వ్యంగ్య ధోరణిని సవరించి, పెడుతున్నాను. నేరాల గురించి బ్లాగుల్లో చర్చ జరిగినపుడు ఆ జాబును పెడదామనుకున్నానుగానీ పెట్టలేదు. ఇప్పటి పరిస్థితికీ సరిపోతుంది.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మన సినిమాలు, టీవీలు, పత్రికలు మనిషిలోని నేరప్రవృత్తికి ఆజ్యం పోస్తున్నాయనేదాన్ని నేను నమ్ముతాను.
పంతుళ్ళను ఎగతాళి చేసే పిల్లకాయలు. అసభ్యకరంగా, అనాగరికంగా, వెకిలిగా  ప్రవర్తించే పంతుళ్ళూ పంతులమ్మలు,  కేవలం ప్రేమించుకోడానికి మాత్రమే కాలేజీలకి పోయే పిల్లలు. (కాలేజీయే కాదు బడుల్లో కూడా!) పదో తరగతిలో ప్రేమ. ఏడో తరగతిలో ప్రేమ, ఏడో యేట ప్రేమ! ప్రేమకోసం తల్లిదండ్రులను ఎదిరించే పిల్లలు. తండ్రిపై చెయ్యెత్తే పిల్లలు. ప్రపంచంలో ప్రేమ తప్ప మరోటి లేదని, జీవితానికి ప్రేమ తప్ప మరో పరమార్థం లేదంటూ ఇచ్చే సందేశాలు, ప్రేమ కోసం పోరాటాలు -ఇవీ నేటి సినిమాలు.

టీవీలు చూద్దామా… చిన్నపిల్లలతో, యుక్తవయసులో ఉన్న ఆడపిల్లలతో, ఆడా మగా పిల్లలతో వెగటు కలిగించే డాన్సులు, వెకిలి చేష్టలు. టీవీలు రాకముందు స్టేజీలెక్కి రికార్డింగు డ్యాన్సులేసే పిల్లకాయల్ని చూసామా? కాలేజీ అంటే ప్రేమ తప్ప మరోటి కాదనీ, కుర్రాళ్ళకు మొదటి అర్హత ప్రేమించటమేనని ఎవరు నేర్పారు మనకు? మగ స్నేహితులు లేని ఆడ జన్మ, ఆడ స్నేహితులు లేని మగ బతుకూ వ్యర్థమని భావించగలిగే స్థాయికి తెచ్చిందెవరు? ఇవన్నీ రైటేననుకునే కొందరు తల్లిదండ్రులకు ఆలోచనలిచ్చిందెవరు? రేయింబవళ్ళూ మనం చూస్తున్న సినిమాలూ, టీవీ కార్యక్రమాలది సింహభాగం! అంచేత వాటి పాత్ర పతనంలో చాలా ఉంది.

కొన్ని పత్రికల మూడోపేజీ గురించి మనకందరికీ తెలుసు. (కొన్ని పత్రికల్లో పేజీలన్నీ కూడా మూడో పేజీలేననుకోండి!) అలాంటి పత్రికలూ నేరంలో భాగస్తులే! విషయం చెబుతానుడెక్కన్ క్రానికిల్ అనే (బూతు) పత్రికలో సారి వ్యాసం వచ్చింది. ఆడాళ్ళు అండర్వేరు కనబడేలా కూర్చున్నపుడు ఎలా కూర్చోవాలి, అప్పుడు అండర్గార్మెంటు రంగు, బయటి బట్టల రంగుతో పోలిస్తే ఎలా ఉండాలి అనే వ్యాసం రాసారుబొమ్మలతో సహా! సిగ్గుందా వీళ్ళకి? నేను వాళ్ళకో ఉత్తరం రాసానువెయ్యలేదు, మామూలుగానే! టైమ్స్ ఆఫ్ ఇండియా అనే మహా బూతు పత్రికను కూడా చూసే ఉంటారు.

ఇప్పుడు తెలుగు పత్రికలకు కూడా విస్తరిస్తోందీ జబ్బు .సినిమా పేజీలో ఈనాడు వాడే భాష చూసారా? మిగతా పత్రికకలో వాడే భాషకూ ఈ పేజీలోని భాషకూ చాలా తేడా ఉంటుంది. పద్ధతైన పత్రికలు వాడే భాష కాదది. స్త్రీ సౌదర్యం గురించి మాట్లాడాలంటే అందం గురించి మాట్టాడాలి. అంతేగానీ అందాల గురించి మాట్టాడితే ఒక వార్తాపత్రిక స్థాయికి అది అసభ్యమే! ఆ పేజీలో ప్రచురించే ఫోటోలూ అంతే!

సినిమాల్లో వేసుకునే వేషాలు ఇప్పుడు బయట పార్టీల్లో కూడా వేసుకు తిరుగుతున్నారు హీరోయినులు. బాపతు జనం బజాట్టోకెళ్ళినపుడు ఎవడన్నా చెయ్యట్టుకు లాగాడంటే లాగడూ మరి!? దానికి, బాధపడిపోతే ఎలా? మనం వేసుకునే డ్రస్సులు మన ఒంటితో పాటు మన వ్యక్తిత్వాన్నీ చూపిస్తాయి గదా! బట్టల్లో నన్ను మా తల్లిదండ్రులు, అన్నల్దమ్ములు, అక్కచెల్లెళ్ళు చూస్తే ఎంత నామర్దా అని అనుకోని వాళ్ళు బజాట్టో ఎవడో చెయ్యట్టుకున్నాడంటే బాధెందుకు? [ఏప్రిల్లో తిరపతిలో ఓ సినిమా హీరోయినుతో అసభ్యంగా ప్రవర్తించాడొకడు. ఈవిడగారు నేను పైన చెప్పిన దక్కనుక్రానికిలు వారి వ్యాసాన్ని అనుసరించి ఓ సినిమా పండక్కి వెళ్తే అప్పట్లో పెద్ద గోలైంది, కోర్టు కేసూ ఐంది. ఈ పేరా ఆ సందర్భాన్ని ఉదహరించి రాసినది.]
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
అసలు నేరస్తులు ఇలా స్వేచ్ఛగా సమాజంలో తిరిగేస్తూంటే ఎన్‌కౌంటరైపోయేవాళ్ళ, దాడికి గురై అసుపత్రుల్లో చేరినవాళ్ళ, అమ్మాన్నాన్నలు పాపం ఎలా అలమటిస్తున్నారో గుండెను పిండేసే ఈ వార్త చెబుతుంది:

ఎన్‌కౌంటరైపోయిన శ్రీనివాస్ తల్లిదండ్రులు అతడి శవాన్ని తీసికెళ్ళేందుకు నిరాకరించారు. 
వాళ్ళబ్బాయి చేసిన పని, అతడు తెచ్చిన అప్రదిష్ట, అతని జీవితం అంతమైపోయిన విధానానికి ఆ అమ్మానాన్నలు ఎంతగా క్షోభించారో పాపం! ఎంత కష్టం!
———————————————————————
ఇక ఎన్‌కౌంటరు గురించి: పోలీసులు చేసిన పని చట్టబద్ధంగాదు. వాళ్ళ విచ్చలవిడితనానికి నిదర్శనం. కానీ ఎన్‌కౌంటరు పట్ల నేను వ్యతిరేకంగా స్పందించలేకున్నాను. అలాంటి యాసిడు దాడి మరొకరు చెయ్యాలంటే ఈ ఎన్‌కౌంటరు తరవాత మరి కాస్త ఆలోచిస్తారు.

శిక్ష గుర్తొచ్చి నేరం చేసేవాడు ఆగుతాడా అని అనేవాళ్ళకు నాదో మనవి: క్షణికావేశంలో నేరం చేసేవాళ్ళ సంగతి పక్కనబెడదాం.. పదహారు సార్లు రిహార్సళ్ళు వేసుకుని మరీ దాడి చేసేవాడికి ఈ ఎన్‌కౌంటరు గుర్తొస్తే ఆగుతాడేమో!!

ఇక వోటరు నమోదు కొన్ని నొక్కుల్లో

October 25, 2008 5 comments

ఇక మనం ఇంట్లోంచే వోటరుగా నమోదు చేసుకోవచ్చు. మీ క్రెడిటుకార్డు వాడి జాలంలో పుస్తకం కొనుక్కున్నట్టుగా, డ్రాప్‌బాక్సు ద్వారా ఫోను బిల్లు కటినట్టుగా, కార్డు బిల్లును చెల్లించి పారేసినట్టుగా, పోస్టాఫీసులో ఉత్తరాన్ని రిజిస్టరు చేసినట్టుగా ఇక వోటరుగా నమోదు చేసుకోవచ్చు.

ఈ విషయమ్మీద ఈనాడులో వచ్చిన వార్త చూడండి. ఆ వార్త సంక్షిప్తంగా ఇది:

ఇక నుంచి ఏ కార్యాలయానికి వెళ్లకుండానే ఇంట్లో ఉండే ఓటు హక్కును నమోదు చేయించుకోవచ్చు. రాష్ట్రంలో ఈ-నమోదు ద్వారా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ కల్పించింది. గత వారం రోజులుగా ఈ నమోదు ప్రక్రియను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఐవీ సుబ్బారావు అమలులోకి తెచ్చారు. దీనికి విపరీతమైన స్పందన వస్తోందని ఆయన చెబుతున్నారు. 
ఈ-నమోదు చేసుకోవాలంటే ముందుగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వెబ్‌సైట్‌లోకి వెళ్లి అందులో ఉన్న ఈ-రిజిస్ట్రేషన్ ఫారాన్ని పూర్తి చేసి, రెండు ఫొటోలను అప్‌లోడ్ చేయాలి. ఈ దరఖాస్తులను ఎన్నికల కమిషన్ పరిశీలన చేస్తుంది. అర్హులని తేలితే వారికి నెల రోజుల్లో ఓటు హక్కును కల్పిస్తుంది. మొదటి రెండు మూడు రోజుల్లోనే ఈ-నమోదుకు మంచి స్పందన రావడంతో దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.
అలాగే.. 
 • హైదరాబాద్‌లో వచ్చే నెల 5నుంచి 212 పోస్టాఫీసుల్లో ఓటరు నమోదు ఫారాలను పెట్టి అక్కడే దరఖాస్తు పెట్టెలు (డ్రాప్ బాక్సులు) ఏర్పాటు చేస్తున్నారు. ఫారం పూర్తి చేసి రెండు ఫొటోలను జత చేసి డ్రాప్ బాక్సుల్లో పడవేస్తే నెలరోజుల్లో వారికి ఓటు హక్కును కల్పిస్తారు. 
 • జంటనగరాల్లోని ప్రధానమైన షాపింప్ బజార్ల‌లోనూ, పెట్రోల్ బంకుల్లోనూ శనివారం నుంచి దరఖాస్తు పెట్టెలను ఏర్పాటు చేస్తున్నారు. 
 • వచ్చే నెల అయిదో తేదీ నుంచి హైదరాబాద్‌లోని 48 ఈ-సేవా కేంద్రాల్లో కూడా ఓటరు నమోదు ప్రక్రియ మొదలవుతుంది. 
 • రాష్ట్ర వ్యాప్తంగా 1200 కేంద్రాల్లో శాశ్వత ఓటర్ల నమోదు కేంద్రాల(డీపీఎస్ సెంటర్లు) ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. 

రండి, నమోదు చేసుకోండి అంటూ ఇన్ని ఏర్పాట్లు చేసాక కూడా నమోదు చేసుకోకుండా ఉంటామా!? 

జై ఎన్నికల సంఘం! 

——————————————————————–

పోతే.. ఈనాడులో ఆ వార్త చూసాక, తప్పుల్లేకుండా వెబ్బు లింకులివ్వడం ఈనాడుకు ఇంకా అలవాటు కాలేదని అర్థమైంది. 
 • వాళ్ళిచ్చిన లింకు ఇది: ceoandhra.govt.in దానికి హైపరులింకు లేదు.. దాన్ని నొక్కితే సైటుకు పోదు. కాపీ చేసుకుని అడ్రసు బారులో పెట్టుకోవాల్సిందే -అదేదో ఈమెయిల్లో లాగా!
 • అసలు లింకు ఇది:http://ceo.ap.gov.in/ (మీ పేరు వోటరు జాబితాలో ఉందో లేదో చూసుకోడానికి ఈ లింకు ఉపయోగపడుతుంది) లేదా http://ceoandhra.nic.in/. చూసారుగా.. వెబ్బు అడ్రసు తప్పు! కాపీ చేసుకుని అడ్రసుబారులో పెట్టుకున్నా మన డబ్బా దాటి ఎక్కడికీ పోదది! (govt.in అట -ఇంకా నయం government. in అనలేదు.)
విశేషమేంటంటే ప్రింటులో లింకును బానే ఇచ్చారు. వెబ్బులోనే ఈ తప్పులు!

ప్చ్!

కండకావరం

నిరసన ప్రదర్శనల్లో దిష్టిబొమ్మలకు చెప్పులదండ వెయ్యనిదెవ్వరు? చెప్పుదెబ్బలు కొట్టనిదెవ్వరు? తగలబెట్టనిదెవ్వరు? నోటికొచ్చినట్టు బూతులు తిట్టనిదెవ్వరు?

శవయాత్ర నిర్వహించి, శాస్త్రోక్తంగా దహనకాండ జరిపించడం కూడా చూసామే!

మనకిది చాలా సహజమైపోయింది. సమాజంలో సర్వ సాధారణమైపోయిన వికృత చర్యలివి. ఆంధ్రజ్యోతి పాత్రికేయులు తమపై జరిగిన దాడికి నిరసనగా దాడి జరిపించిన నేత దిష్టిబొమ్మను తగలపెట్టారు. దళితులపై జరిగే అత్యాచారాలను నిరోధించే చట్టాన్ని ఉపయోగించాల్సినంతటి నేరమట అది. అసలా దాడి చేయించిన వారిపై, దాడులు మళ్ళీ చేస్తాం అని బహిరంగంగా చెప్పిన, చెబుతున్న హింసోన్మాదులపై చర్యలేవీ?

సంఘటనలో పాత్రధారులైన ఈ ఇద్దరిలో ఒకరేమో ఆ రెండు పత్రికల్లో ఒకటి –అంచేత తప్పు వాళ్ళదే -మరో ఆలోచన లేదు. కాబట్టి చర్యలు వాళ్ళ మీదే! దళితులపై అత్యాచారాల నిరోధానికి ఉద్దేశించిన చట్టాన్ని, వేరొకరిపై అత్యాచారం చేసేందుకు ఉపయోగించింది ప్రభుత్వం. తననెదిరించినవాడిని వేటాడేందుకు ఎంతకైనా తెగించగలనని మరోసారి నిరూపించాడు ముఠాకోరు.

“తప్పుల మీద తప్పులు చేసేందుకు ఈ ప్రభుత్వం ఓవర్‌టైము పని చేస్తోంద”ని ఎల్‌కే అద్వానీ కేంద్రప్రభుత్వం గురించి అన్నాడు అప్పుడెప్పుడో. ఎన్నికలు దగ్గరకొచ్చేస్తున్నాయనే ఆత్రంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రాత్రింబవళ్ళు పనిచేసి మరీ తాను చెయ్యదలచిన తప్పుడు పనులను చేసేస్తోంది. ఎన్నికల తరవాత ఇలాంటి అవకాశం రాదని కాబోలు!

రామ సేతువు – ఎన్డీటీవి చర్చ

September 17, 2007 9 comments

రాముడు ఉన్నాడా, లేడా అనే విషయంపై కాంగ్రెసు ప్రభుత్వం ఛప్పన్నారు తప్పులు చేసి దిద్దుకొంటూండగా జరిగిన అనేకానేక చర్చల్లో ఎన్డీటీవీ వారి ఆదివారం నాటి చర్చ ఒకటి నేను చూసాను. బర్ఖా దత్ వియ్ ది పీపుల్ అనే ఈ చర్చా కార్యక్రమాన్ని చక్కగా మంచి సమయస్ఫూర్తితో చేస్తుంది. నిన్నటి రాత్రి జరిగిన చర్చలో కొన్ని విశేషాలు…

నేను టీవీ పెట్టేటప్పటికీ ఆ ప్రొఫెసరుగారు చెబుతున్నాడు.. “రాముడికీ, బ్రిడ్జికీ సంబంధం లేదు. రాజకీయాలకూ మతానికీ సంబంధం లేదు. అఫిడవిట్‌ను వెనక్కి తీసుకోవడం ప్రభుత్వపు తప్పు.”

ఈలోగా ఆర్య ద్రావిడ తగువు చర్చకి వచ్చింది. ‘రావణుడు బ్త్రాహ్మణుడు, రాముడు, వాల్మీకి బ్రాహ్మణులు కాదు అనే విషయం కరుణానిధికి తెలీదు. ఆయనకు చరిత్ర తెలీదు, కానీ మాట్లాడతాడు’ అని సుబ్రహ్మణ్యం స్వామి అన్నాడు. దీనిపై ఆయనా, రాజా కాసేపు పోట్టాడుకున్నారు. ఇహ చూడక్కరలేదనుకుంటా అని అనుకుంటూ ఉన్నాను.. ఈలోగా బర్ఖా దత్ వాళ్ళకు అడ్డం పడిపోయి పోట్లాటను ఆపేసింది.

రాజకీయులు వాళ్ళ మార్కు రిమార్కులు, వాదనలూ చేసారు. వాళ్ళ వాదన చూసి ఆశాభంగం చెందేటంత ఆశలు నాకేమీ లేవు వాళ్ళమీద. కానీ ప్రొఫెసరు మాట్లాడిన విధానం చూసి మాత్రం కష్టమేసింది..

ఆయన “రామ సేతువు” కారణంగా ప్రాజెక్టు ఆగిపోవడానికి బద్ధ వ్యతిరేకి. అసలు రామసేతువును రామ సేతువు అని అనడానికి కూడా ఆయన ఇచ్చగించలేదు. పని గట్టుకుని యాడమ్స్ బ్రిడ్జి అని అన్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది, కష్టమూ వేసింది. రాముడు కట్టాడో లేదో పక్కన బెట్టండి. ఈ జాతి సహస్రాబ్దుల కిందటి నుండీ నమ్ముతూ వచ్చిన విషయం కదా అది; దాన్ని పక్కన బెట్టి ఈ కొత్త పేరు – “యాడమ్స్ బ్రిడ్జి” అని అనడమేంటి? అది ఎక్కడినుండి వచ్చిందో వెతకబోతే ఇదట దాని కథ. ఏఁవన్నా అర్థముందండీ? చారిత్రకుడు దేన్ని నమ్ముతున్నాడో చూసారా? నాకది చిన్న విషయంగా అనిపించలేదు. మనోడు చెబితే మౌఢ్యం, పైవోడి పైత్యం పరమౌషధమా వీళ్ళకి !? ఏంటో మన వాళ్ళు..

—————————-

అక్కడితో ఈ జాబు ఉద్దేశ్యం నెరవేరింది. ఇక రామాయణంలో పిడకలవేట..

పై కార్యక్రమ నిర్వాహకురాలికి కొన్ని అభిప్రాయాలున్నాయి (ఉండొచ్చు, తప్పులేదు). ఆమె వాటినే చర్చాఫలితంగా చూపించదలచినట్టు అనిపించింది. దాని కోసం అవిరళ కృషి జరిపినట్టు కూడా అనిపించింది. ఈవిడ గారికి ఓ అలవాటుంది. ప్రశ్న అడుగుతుంది, చెప్పేవాడికి పూర్తిగా చెప్పే చాన్సివ్వదు. వాళ్ళు చెప్పేది తనకనుకూలంగా ఉంటే సరే, లేదో.. మాటమాటకీ అడ్డం పడిపోతుంటుంది.

ఇదివరలో ఆమె సహోద్యోగి -రాజ్‌దీప్ సర్దేశాయ్, ఇప్పడు CNN IBN కి కర్త, కర్మ, క్రియ- కూడ ఇలాంటి వాడే. (వీళ్ళిద్దరికీ కామనుగా రెండు ఊతపదాలున్నాయి. అవి: “ఓకే, యు మేడ్ యువర్ పాయింట్“, “ఓకే, ఫెయిరినఫ్“. ఈ మాటలను వాళ్ళు వాడేటపుడు గమనించండి.. ఆ రెండింటికీ అర్థం ఒకటే స్ఫురిస్తుంది.. “ఇప్పటికే ఎక్కువగా వాగావు, ఇక మూసుకో” అని. అంత ఫోర్సుగా వాడతారు ఆ మాటలను!) . ఇకపోతే కరణ్ థాపర్.. ప్రశ్న అడుగుతాడు, కానీ జవాబు చెప్పే అవకాశమే ఇవ్వడు – పోలీసు, ఖైదీ సంభాషణ లాగా ఉంటుంది ఇంటర్వ్యూ.

వీళ్ళందరితో పోలిస్తే, మన టీవీ 9 రవిప్రకాష్ చాలా మెరుగు. ఇదివరలో జెమినీలో ఉండగా వారం వారం ఒకరిని ఇంటర్వ్యూ చేసేవాడు. వాళ్ళని చక్కగా మాట్టాడనిచ్చేవాడు. అడ్డం పడిపోయేవాడు కాదు.

–ఇవ్వాళ్టికింతే!

కంప్యూటర్ ఎరా చూసారా?

August 31, 2007 1 comment

..చూడకపోతే చూడండి. మీరు గీకువీరులైనా చూడండి. మీకు తెలీని విశేషాలు కూడా అక్కడ దొరకొచ్చు.

పత్రికంటే ఓ యాభై కాగితాలు కాదు, యాభై పేజీల విశేషాలు. రాసే వ్యక్తికి తెలిసిన విషయాలు రాస్తే కాదు.., చదువరికి తెలియని కబుర్లు రాయాలి. అప్పుడే పత్రికను కొనుక్కున్న పాఠకుడికి తృప్తి కలుగుతుంది. ఈ పత్రిక ఖచ్చితంగా డబ్బుకు తగ్గ విలువ ఇస్తుంది. ఒకే ఒక్క వ్యక్తి, నెలనెలా, అంతంత సమాచారాన్ని, అన్నన్ని విశేషాల్ని, ఒంటిచేత్తో ఇస్తూ వస్తున్నారంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. సంపాదకుడు నల్లమోతు శ్రీధర్ గారికి అభినందనలు.

పత్రికను మీరూ చదవండి.. మీ సూచనలు, సలహాలను శ్రీధర్ గారికి పంపండి.

సెప్టెంబరు సంచికలో ‘జాలంలో తెలుగు వెలుగుల’ కబుర్లు కూడా వచ్చాయి. వలబోజు జ్యోతి గారి చలవ అది. మంచి వ్యాసం రాసారు.

—-

ఓ పాఠకుడిగా తప్ప, నాకు కంప్యూటర్ ఎరాతో వేరే ఏ అనుబంధమూ లేదు. 🙂

రామోజీరావు x రాజశేఖరరెడ్డి

November 11, 2006 7 comments

ఈనాడుపై వ్యతిరేకతను ముఖ్యమంత్రి ఓ మెట్టు పైకెక్కించారు. ఈ సారి తన అనుంగు అనుచరులను రంగంలోకి దింపి పత్రిక ఆయువుపట్లపై దెబ్బ కొట్టే ప్రయత్నం చేసారు. ఈ దాడి వెనుక అసలు కారణం లీలగా కాదు, స్పష్టంగానే తెలుస్తూ ఉంది. తమపై వస్తున్న విమర్శలకు జవాబివ్వాల్సిన అవసరం లేదని కాంగ్రెసు వాళ్ళేనాడో నిర్ణయించేసుకున్నారు, అమలూ జరుపుతున్నారు. విమర్శించేవాళ్ళ నోరు మూయించడమే వాళ్ళ లక్ష్యం. తమవాళ్ళే విమర్శిస్తే క్రమశిక్షణా రాహిత్యం అంటారు. తెలుగుదేశం విమర్శిస్తే.. ఏం మీరేమన్నా తక్కువ తిన్నారా అని అంటారు. పత్రికలు విమర్శిస్తే.. కక్ష, పక్షపాతం, అసహనం, ఇలాంటివి అంటగడతారు. ఈనాడు-మార్గదర్శిది సరికొత్త అంకం. ఇందులో ఎవరి పాత్ర ఎంత..

ముందుగా మార్గదర్శి: దీన్ని ప్రతిదాడిగా భావించక ప్రజా ప్రయోజనాలను ఆశించి సదుద్దేశంతోటే చేసారనుకుంటే, ఈ ఆరోపణల్లో మనం గ్రహించాల్సిన విషయాలు కొన్నున్నాయి.

 1. మార్గదర్శి ఫైనాన్సు నష్టాల్లో ఉందని వాళ్ళే చెబుతున్నారు.. అయితే ప్రజల డబ్బుకు భరోసా ఏమిటి? నాదీ పూచీ అని రామోజీరావు అంటే సరిపోదు, ఆ అప్పులు తీర్చగలిగినంత ఆస్తి (నెట్‌వర్తు) తనకుందని ఆయన చూపించాలి. అది ఇంకా చెయ్యలేదు.
 2. ఇక, అసలాయన జనం దగ్గర అప్పులు తీసుకోవచ్చా, లేదా అనే విషయం – ఇది రిజర్వు బ్యాంకే తేల్చాలి.
 3. సర్వసాధారణంగా తలెత్తే సందేహం.. అసలే లోపమూ లేకపోతే కాంగ్రెసు వాళ్ళు ఇంత యాగీ చెయ్యరు, నిప్పు లేందే పొగ రాదు కదా. ఈ సందేహాన్ని పటాపంచలు చెయ్యవలసిన బాధ్యత మార్గదర్శిదే.

కాంగ్రెసు పార్టీ, ముఖ్యమంత్రి, ఆయన అంతేవాసులు:

 1. తమ అక్రమాల లీలల గురించి, ప్రాజెక్టుల అవినీతి గురించి, భూభోజనాల గురించి ఈనాడులో వస్తున్న విమర్శలను తట్టుకోలేక, పత్రికను కట్టడి చెయ్యడంలో భాగమే ఈ దాడి అని తెలిసిపోతూనే ఉంది. విమర్శలను ఎదుర్కోవడానికి సరైన మార్గం తప్పులు చెయ్యకపోవడమే. అయితే తప్పులు చెయ్యకుండా ఉండడం వీళ్ళ వల్ల కాదని మరోసారి తెలియజెప్పారు.
 2. ముఖ్యమంత్రి అసహనానికి ఇది మరో సూచిక. విమర్శించే పత్రికల పట్ల కూడా ప్రతిపక్షాల పట్ల వ్యవహరించినట్లే ప్రవర్తించడం మనం చూస్తూనే ఉన్నాం. నేనా పత్రికను (ఆంధ్రజ్యోతి) అసలు చదవనే చదవనని అలిగిన వ్యక్తి ఆయన. తనవారిని కాపాడుకునేందుకు (ఉదా:సూరి), కానివారిని కాలరాచేందుకు (ఉదా:కోట్ల విజయభాస్కరరెడ్డి వర్గం) ఏ స్థాయికైనా వెళ్ళగల వ్యక్తి. ఈ వ్యవహారం మొత్తంలో ఆయన చెయ్యి లేదంటే నమ్మశక్యం కాదు.
 3. అవినీతిని వాసన పసిగట్టే కుక్కలు మరి రాంగురోడ్డు విషయంలోను, కాందిశీకుల భూమి విషయంలోను, ఘటకేసర్ భూమి విషయంలోను మొరగలేదేంటి? భూభోక్తలు బిస్కట్లేసారా? లేక, భూభోజనాల బంతిలో తమకూ కాసిని ఎంగిలి విస్తర్లు దొరికాయా?
 4. రాంగురోడ్డుపైన, ఘటకేసరు ట్రస్టు స్థలంలో ఇంటిపైన, కాందిశీకుల భూములపైన, ప్రాజెక్టుల్లో ప్రవహిస్తున్న అవినీతి పైన, ఇంటి ముందు స్థలాన్ని కాజేసిన వైనంపైనా ఈనాడు తమపై విమర్శలు చెయ్యకుండా ఉండి ఉంటే ప్రజల ఆస్తుల రక్షణకు నడుం కట్టేవారేనా వీళ్ళు?

రామోజీరావుపై ఆరోపణలు చేసే అత్యుత్సాహంలో వీళ్ళో సంగతిని పక్కన పెట్టారు – ప్రజలు వీళ్ళ ఆరోపణల్ని నమ్మి, డబ్బు వెనక్కిమ్మంటూ అడిగితే ఏం జరుగుతుంది? తీసుకున్న డబ్బులను పెట్టుబడులుగా పెడతారు కాబట్టి, ఆ డబ్బులను ఇప్పటికిప్పుడు వెనక్కిచ్చియ్యాలంటే ఎంత గొప్ప సంస్థకైనా సాధ్యం కాదు. డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని తెలిస్తే ప్రజలు మరింత ఎగబడతారు, తమ డబ్బుల కోసం. అప్పుడు ప్రజల్లో కల్లోలం రేగదా? వీళ్ళాశించింది అదేనా?

మార్గదర్శి ప్రజల దగ్గరి నుండి డబ్బులు సేకరించకూడని పక్షంలో ఇన్నాళ్ళూ నియంత్రణ సంస్థలు ఏంచేస్తున్నట్లు?

ఏదేమైనా, స్వార్థ రాజకీయులు ఆడుతున్న ఈ నాటకంలో ప్రజలు బలి కాకుండా ఉండాలని కోరుకుందాం.

హరికథలో పిట్టకథల్లాగా ఈ జాబులో రెండు పిట్ట జాబులు:

మార్గదర్శి మీద రాజకీయుల దాడి ఇది మొదటిది కాదు. గతంలో నాదెండ్ల భాస్కరరావనే పెద్దమనిషి (నెల రాజు), రామారావును ముఖ్యమంత్రిగా పడదోయక మునుపు ఆయన మంత్రివర్గంలో ఆర్థికమంత్రిగా ఉండేవాడు. (అప్పట్లో ఆయన కోపైలట్ లెండి, రామారావేమో పైలట్! ఆ సంగతీ భాస్కరరావే చెప్పుకున్నాడు.) ఆయన మార్గదర్శి చిట్‌ఫండు పై శాసనసభలో దుమారం లేపి కొన్నాళ్ళు హడావుడి చేసాడు. అయితే అది ఎక్కువ దూరం పోలేదు. అప్పుడు చిట్‌ఫండు, ఇప్పుడేమో ఫైనాన్సు! అప్పుడు కోపైలట్టు.., ఇప్పుడేమో పైలట్టు, ఎయిర్‌హోస్టెస్సులు, స్టీవార్డులూ!

ఇక రామోజీరావు కూడా తక్కువవాడేం కాదు. ఆయనకు శత్రువులు కొల్లలుగా ఉన్నట్లున్నారు! (పత్రికాధిపతికి తప్పదేమో!!) రామారావు రాకముందు కాంగ్రెసు హయాంలోనే శాసనమండలి లో (అప్పట్లో ఉండేది! పెద్దలసభ అని గౌరవంగా అనేవారు, సభ్యులు ‘చిన్న’వాళ్ళైనా) జరిగిన ఒక ‘చర్చ’ గురించి “పెద్దల సభలో గలభా” అని ఈనాడులో శీర్షిక పెట్టి రాసారు. గలభా అనేమాట పెద్దలకు చిన్నతనంగా అనిపించి ఆయన్ను మందలించేందుకు, అరెస్టు చేసి సభకు తెమ్మని పోలీసు కమిషనరును పంపారు. (ఆ కమిషనరు మరెవరో కాదు, మొన్నటి తెదే ప్రభుత్వంలో మంత్రిగా చేసిన విజయరామారావట!) రామోజీరావు ముందే బెయిలు తెచ్చుకున్నాడు. ఆ తరువాత, ఆ శీర్షికలో తప్పేమీ లేదని తీర్పు వచ్చింది. మొత్తమ్మీద మండలి బోనెక్కలేదు ఆయన.

అవీ పిట్టకథలు! శ్రీమద్రమారమణ గోవిందో.. హారి!