Archive

Archive for the ‘ముంబైపై దాడి’ Category

ప్రధానికో లేఖ

November 30, 2008 61 comments

కంథమాల్లో జరిగినదాని గురించి తలెత్తుకోలేకపోతున్నామని, బయటి దేశాల్లో పరువు పోయిందని, ఫ్రాన్సు అధ్యక్షుడో మరొహడో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేకపోయానని వాపోయిన ప్రధానమంత్రి గారూ..

ముంబైలో మూడురోజుల పాటు, వందలాది మందిని ఖైదీలుగా పట్టుకుని, 195 మందిని పొట్టనబెట్టుకుని, బీభత్సం సృష్టించిన ఈ సంఘటన మీకు లజ్జాకరంగా అనిపించలేదా? మూడు రోజులపాటు నగరాన్ని కిడ్నాపు చేసి, దేశం మొత్తాన్నీ హడలగొట్టిన సంఘటన అవమానకరం కాదా?  పాకిస్తాన్నో, మరొకణ్ణో నిందించి చేతులు దులిపేసుకుంటే సరిపోద్దా? గతంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు, వాళ్ళను పోషించిన ఇంటిదొంగలూ, దేశద్రోహులను -ముస్లిములైనా సరే- వెనకాడకుండా, మట్టుబెట్టి ఉంటే ఈ అవమానకరమైన దాడి జరిగేదా? ఇవ్వాళ 195 మంది బలయ్యేవారా? ఇన్నాళ్ళుగా మీ నాయకత్వం పాటిస్తూ వచ్చిన మైనారిటీ బుజ్జగింపు కార్యక్రమం ఎంతకు దారితీసిందో చూసారా? అదే ఉగ్రవాదుల ముఠా మంత్రాలయ వైపు పోయి, అక్కడున్న మంత్రులూ, ఎమ్మెల్యేలను పట్టేసి, చేతులు కట్టేసి, తలలు కొట్టేసి ఉంటే మీకెలా ఉండేది? (పీడా బోయిందని సంతోషించి ఉండేవాళ్ళం అని ఈ దేశంలో కనీసం 80 శాతం మంది చెబుతారు స్వామీ! రాజకీయ నాయకత్వానికున్న పరపతి అంతటిది మరి!!)

మైనారిటీ వాదులకు, మైనారిటీ పక్షపాతులకు ఎందుకు ప్రభుత్వమంత లోకువైపోయింది? ఉగ్రవాదులపై కర్కశంగా ఎందుకు వ్యవహరించలేకపోయాం? కర్కశత్వం ఒక్కరి సొత్తేనా? మనకు లేవా కరకు గుండెలు? మాటల్లో ఉక్కుపాదాలు మోపడం కాదు చేతల్లో చేవ చూపించాలి, ఉక్కులాంటి దృఢచిత్తం చూపెట్టాలి. ఉగ్రవాదులు ముస్లిములన్న కారణమ్మీద వెనకేసుకురాబోయిన మంత్రులు మీ మంత్రిమండలిలో ఇంకా ఎందుకున్నారు? దేశాన్ని ఉగ్రవాదం నుండి కాపాడ్డానికి మతం ఎందుకు అడ్డు రావాలి? పార్లమెంటు మీద దాడి చేసినవాడికి ఖరారైపోయిన ఉరిశిక్షను ఎలా తప్పించాలా అని ఆలోచించే సమయంలో కొంత భాగాన్ని ఇలాంటి దాడులను ఎలా తప్పించాలనే ఆలోచనకు కేటాయించలేకపోయా రెందుకు? ఈ నిష్క్రియాపరత్వంతో దేశభద్రత విషయంలో సమాధానపడ్డారా లేదా?

2001 లో అమెరికా మీద ఘోరమైన దాడి జరిగింది. ఆ తరవాత ఇంతవరకూ ఉగ్రవాద దాడి జరగలేదు. మన పార్లమెంటు మీద దాడి జరిగిన తరవాత, ఈ ఏడేళ్ళలోను ఎన్ని మార్లు దాడులు జరిగాయో గమనించారా? ఒక టైమ్‌టేబులు పెట్టుకుని, ఓ షెడ్యూలు ప్రకారం దాడులు చేస్తున్నారు సార్! ఏంటి వాళ్లకీ మనకీ ఉన్న తేడా?

పౌరులకు భద్రత కల్పించాలనే చిత్తశుద్ధి మీకుందా? ఫలానా సమయానికల్లా దేశంలో ఉగ్రవాదుల మహారాజ పోషకులను లేకుండా చేస్తాననే ఆత్మవిశ్వాసం, మరొక్ఖ ఉగ్రవాద ఘటన కూడా జరగనీయననే ఆత్మ విశ్వాసం -ఉందా మీకు? అవున్లే.. మీ హోమ్‌మంత్రి పైన మీకు విశ్వాసం లేదు -అయినా ఆయన్ని తీసెయ్యలేరు. ఇక మాకేం ధైర్యం చెప్పగలరు?

బయటి దేశాధినేతలకు మొహం చూపించడం సంగత్తరవాత.. మీ స్వంత దేశ పౌరులకు ఎదురుపడి, తలెత్తుకుని, సిగ్గు పడకుండా, కళ్ళలోకి చూసి మాట్టాడగలరా?

Advertisements

దిగులుగా ఉంది

November 28, 2008 24 comments

మనం రోడ్డు మీద వెళుతూంటేనో, రైలు టిక్కెట్టు కొనేందుకు వరసలో నుంచుంటేనో, ఏ కూరగాయలు కొనుక్కుంటున్నపుడో మనకు అటుగానో, ఇటుగానో నిలబడి తుపాకీతో టపటపా పిట్టల్ని కాల్చినట్టు కాల్చేసి, తాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు.

నువ్వు ఫలానా మతం వాడివి కదా.. ఐతే ఇదిగో నీకిదే గతి అంటూనో, నువ్వు ఫలానా దేశం వాడివి కదా అయితే అనుభవించు అంటూనో మన కణతలోకి గుండేసి చంపేస్తారు ఆ తరవాత ఓ ఇద్దర్నో ముగ్గుర్నో పట్టుకుని పక్కనున్న ఇంట్లో దూరి, ఆణ్ణొదలండి, ఈణ్ణొదలండి అంటూ డిమాండ్లు పెడతారు.

లక్ష్యాలను ముందే ఎంచుకుని, చక్కగా ప్లానేసి, రెక్కీలు చేసి, వీలైతే రిహార్సళ్ళు వేసుకుని, తీరుబడిగా పడవల్లోనో, ఓడల్లోనో దిగబడి, ఓ నగరాన్ని చుట్టుముట్టగలరు, దాడి చెయ్యగలరు. మొత్తం నగరాన్నే బందీగా పట్టుకోగలరు. గంటా రెండు గంటలు కాదు, ఒకటి రెండు రోజుల పాటు దేశంలోని అత్యున్నత స్థాయి భద్రతా దళాలను కూడా ఎదుర్కొని పోరాడగలరు. అందుకు తగ్గ ఆయుధ సంపత్తిని చేరేసుకోగలరు కూడా. ఏకకాలంలో పది చోట్లకు పైగా దాడి చేసి వందల మందిని బలి తీసుకోగలరు.

దాడుల తీవ్రత ఎలా పెరుగుతోందో చూస్తే భయమేస్తోంది. బాంబులెయ్యడం, చాటుమాటుగా బాంబులు పెట్టడం పోయింది. ఇప్పుడిక నేరుగా దాడే! సాక్షాత్తూ యుద్ధమే!!

  • ఈ దాడులు మనమెంత చవటలమో చూపిస్తున్నాయి. 
  • మన నాయకుల నేలబారు నాయకత్వమెంత సిగ్గుమాలినదో చూపిస్తున్నాయి. చొక్కాల కాలర్లను ఏకే 47 తుపాకీల మొనలతో పట్టి పైకెత్తి ఈ నాయకులను దేశానికీ, ప్రపంచానికీ చూపిస్తూంటే, ఆ తుపాకీలకు వేళ్ళాడుతూ, తలకాయలు వేళ్ళాడేసుకుని, భుజాలు జారేసుకుని, కళ్ళు వాల్చేసుకుని, కాళ్ళు మడతేసుకుని, దీనంగా, చవటల్లాగా, సన్నాసుల్లాగా మనల్నేలే నేతలు కనిపిస్తున్నారు. 
  • ఈ దాడులు మన భద్రత లోని డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి. బయటకు పోతే, రాత్రికి తిరిగి ఇంటికి చేరుకోగలమో లేదోననే భయం కలుగుతోంది. 

కానీ ఈ భయానికి మించి… ముందుముందు మరిన్ని దాడులు జరక్కుండా ఈ వెన్నెముక లేని నాయకుల నాయకత్వంలో కాచుకోగలమని మనం నమ్మగలమా?

నాకా నమ్మకం కలగడంలా! అదే నాకు బెంగగా ఉంది. గుండెల్లో దిగులుగా ఉంది. నోరు చేదుగా ఉంది. ఊపిరాడనట్టుగా ఉంది. ధైర్యం అడుగంటి, ఆలోచనల్లో దైన్యం ఊరుతూ, ఒళ్ళంతా వ్యాపిస్తోంది.
——————————————————————————
ముంబై దాడుల్లో బలైనవారి కుటుంబాలకు నా శ్రద్ధాంజలి. ఈ పోరులో ముష్కరులను ఎదుర్కొని, తమ ప్రాణాలొడ్డి, వందల మంది ప్రజలను కాపాడిన ధీరోదాత్తులైన సైనికులకు, పోలీసులకు ఈ పనిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నా సెల్యూట్!