Archive

Archive for the ‘లోక్‌సత్తా’ Category

చారిత్రిక అవసరం

అధికారమనేది లక్ష్యం కాకూడదు, అదొక మార్గం అంతే! అంటున్నాడు లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ. జాతినిర్మాణం, బిడ్డల భవిష్యత్తూ లక్ష్యాలు కావాలి. అధికారం -దాన్ని సాధించే మార్గం కావాలి. కానీ సాంప్రదాయిక రాజకీయ పార్టీలు అధికారాన్ని లక్ష్యంగా చూస్తున్నాయి అని అంటున్నాడు.

పేదరికాన్ని తొలగిస్తాం, నిరుద్యోగాన్ని నిర్మూలిస్తాం, ఆరోగ్య సిరులు అందిస్తాం అని చెప్పుకునేవాళ్ళు చాలామందే ఉన్నారు. చాలా పార్టీలే ఉన్నాయి. కానీ, పేదరికాన్ని తొలగించవచ్చు, నిరుద్యోగాన్ని నిర్మూలించవచ్చు, ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సౌభాగ్యాన్ని అందించవచ్చు అని చెబుతోంది లోక్‌సత్తా. అవి ఎలా సాధించవచ్చో కూడా చెబుతోంది. ప్రతీ సమస్యకూ నిర్దుష్టమైన పరిష్కార మార్గాలున్నాయని చెబుతోంది. ఈ లక్ష్యాలను సాధించడం కోసం అధికారమిమ్మంటోంది.

ఎన్నోసార్లు ఎంతోమందిని నమ్మాం. ఎంతోమంది దొంగలకు, వెధవలకూ వోటేసాం. వాళ్ళు దొంగలని తెలిసీ వేసాం. మనకు మరో అవకాశం లేక, వేసాం. ఉన్న వెధవల్లోనే కాస్త మంచివాణ్ణి ఎంచుకుని వోటేసాం. ఫలానావాడికి వోటేస్తే మనలను దోచుకుతింటాడని తెలిసీ వేసాం.

ఇప్పుడు మనకు లోక్‌సత్తా రూపంలో చక్కటి అవకాశం వచ్చింది. ఏం చెయ్యాలో తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. కానీ లోక్‌సత్తాకు ఎలా చెయ్యాలోకూడా తెలుసు. అన్నిటికంటే ముఖ్యం.. అనుకున్నది చేసే చిత్తశుద్ధి, నైతికత, నిబద్ధత  ఆ పార్టీకి ఉన్నాయి.

లోక్‌సత్తా అంటే అభిమానం ఉండీ, వోటు వెయ్యడానికి వెనకాడేవారికి ఈ విజ్ఞప్తి:

నేనొక్కడిని వేసినంత మాత్రాన లోక్‌సత్తా గెలుస్తుందా అని అనుకోకండి. నేను వేస్తేనే గెలుస్తుంది అని అనుకోండి. పరీక్షలో “ఆఁ ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం రాయనంత మాత్రాన తప్పబోయామంటలే” అని వదిలేసామా?

పట్నాల్లోనే కాదు, చదువుకున్నవారిలోనే కాదు, పల్లెటూళ్ళలో కూడా, చదువుకోనివారిలో కూడా లోక్‌సత్తాకు అభిమానులున్నారు. (కొత్తగూడెంలో నా స్నేహితుడి భార్య కూరగాయలు కొనేందుకు మార్కెట్టుకు వెళ్తే, అక్కడికి ఓ పార్టీవాళ్ళు ప్రచారానికి వచ్చి, వోటెయ్యమని అడిగారట. వాళ్ళు వెళ్ళగానే కూరగాయలు అమ్ముకునే ఆమె పక్కామెతో “వీళ్ళకెందుకు వేస్తాం, ఈ సారి లోక్‌సత్తాకు వేద్దాం” అని అందంట!)

వాళ్లకున్న తెలివితేటలు, భవిష్యత్తు పట్ల వాళ్లకున్న జాగ్రత్త మనకు మాత్రం లేవా? రండి, మనమూ లోక్‌సత్తాకు వోటేద్దాం.

మనం కోరుకునే భవిష్యత్తు ఒక్క వోటు దూరంలో ఉంది.

Advertisements

పోస్టాఫీసుల్లో వోటరు నమోదు కేంద్రాల ప్రయోగాత్మక ఏర్పాటు

September 27, 2008 6 comments

పోస్టాఫీసుల్లో వోటరు నమోదు కేంద్రాలనేర్పాటు చెయ్యాలనే విషయమై లోక్‌సత్తా ఎప్పటినుండో అడుగుతోంది కదా… దీనిమీద ఈమెయిలు గోల కూడా చేసాం. ఈమధ్య జయప్రకాష్ నారాయణ ఎన్నికల ప్రధాన కమిషనరుతో జరిపిన చర్చల తరవాత దీన్ని ప్రయోగాత్మకంగా హై. లో అమలు చెయ్యాలని నిర్ణయించారని తెలిసింది. 

శభాష్ ఎన్నికల సంఘం, జయప్రకాష్ నారాయణ!

దీనికి సంబంధించి సెప్టెంబరు 27న ఈనాడులో వచ్చిన వార్త ఉన్నదున్నట్టుగా ఇక్కడ:

తపాలా కార్యాలయాలద్వారా శాశ్వతంగా ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచిస్తోంది. ఇందులో మొదటి అడుగ్గా హైదరాబాద్‌లో ప్రయోగాత్మక ప్రాజెక్టు చేపట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ తపాలాశాఖ నుంచి అధికారిక ప్రతిపాదనలు అందిన వెంటనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణకు ఎన్నికల సంఘం హామీ ఇచ్చింది. 

ఓటర్ల జాబితాలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న తప్పులను సరిదిద్దడానికి తపాలా కార్యాలయాలద్వారా నమోదు చేపట్టాలంటూ జయప్రకాశ్ ఇదివరలో ఈసీకి ప్రతిపాదనలు పంపారు. వాటిని పరిశీలనలోకి తీసుకున్న ఈసీ శుక్రవారం ఆయనను ఢిల్లీకి పిలిపించి చర్చించింది. ఈ భేటీలో ప్రధాన ఎన్నికల కమిషనరు ఎన్.గోపాలస్వామి, కమిషనర్లు నవీన్ చావ్లా, ఖురేషీతోపాటు ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు పాల్గొన్నారు. సుమారు గంటన్నరసేపు దీనిపై చర్చ జరిగినట్లు జయప్రకాశ్ తెలిపారు. దేశవ్యాప్తంగా 1.50 లక్షల తపాలా కార్యాలయాలున్నాయని, ఆంధ్రప్రదేశ్‌లో 12వేల పైచిలుకు ఉన్నాయని వివరించారు. ఇప్పుడున్న విధానంలో హైదరాబాద్‌లో కేవలం ఏడుగురు ఎన్నికల నమోదు అధికారులు మాత్రమే ఉన్నారని, అదే తపాలా కార్యాలయాలద్వారా చేపడితే నగరవ్యాప్తంగా 150 మంది పోస్టుమాస్టర్లు నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించవచ్చని ఆయన సూచించారు.
 
ప్రస్తుత ఓటర్ల నమోదు ప్రక్రియలో జరుగుతున్న తప్పులకు జయప్రకాశ్ ఓ ఉదాహరణ చూపారు. హైదరాబాద్ పరిసరాల్లో నివాసముంటున్న మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్ జె.ఎం.లింగ్డోకు ఓటరు గుర్తింపుకార్డు రావడానికి మూడున్నరేళ్లు పట్టిందని తెలిపారు. ఈ మధ్య ఓ పెళ్లిలో కలిసినప్పుడు మాటల మధ్యలో ఆయన భార్యే ఈ విషయం చెప్పి వాపోయారని జయప్రకాశ్ వెల్లడించారు.

వోటరు నమోదు కేంద్రాలను పోస్టాఫీసుల్లో ఏర్పాటు చెయ్యండి!

September 22, 2008 13 comments

మీకు వోటు హక్కుందా? ఉండే ఉంటుంది. మరి, వోటరుగా నమోదయ్యారా? అయ్యుండకపోతే, నమోదు చేయించుకోండి. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. మన భవితను నిర్ణయించుకునే అవకాశమది -ఎలాగోలా నమోదు చేయించుకోవాలి మరి. అయితే, ఈ నమోదు వ్యవహారం పెద్ద తతంగంగా కనిపిస్తోంది. కుప్పుసామయ్యర్ మేడ్డిఫికల్టు లాగా వీలైనంత కష్టతరంగా చేసిపెట్టారు ఈ కార్యక్రమాన్ని. నమోదు చేయించుకోడానికి ఎక్కడికెళ్ళాలో తెలీదు, ఎప్పుడు చేయించుకోవాలో తెలీదు, ఏవేం కాగితాలు తీసుకెళ్ళాలో తెలీదు. దీన్ని సులభం చేస్తూ.. ‘పోస్టాఫీసుల్లో నమోదు కేంద్రాల నేర్పాటు చెయ్యండి మహప్రభో’ అంటూ లోక్‌సత్తా ఎన్నేళ్ళుగానో గోల పెడుతోంది.

హలీము అమ్మడం లాంటి అనేక మంచి పనులను ఈ పోస్టాఫీసుల్లో చేయిస్తున్నారు గదా, వాటితో పాటు ఈ పనిని కూడా చేయించడానికేం ఇబ్బంది? ఎందుకన్నాగానీ ఎన్నికల సంఘం ఇంకా ఈ చర్య తీసుకోలేదు. అంచేత, వారికి ఉత్తరాలు రాసి, ఎన్నికల సంఘంపై వత్తిడి తెచ్చే కార్యక్రమాన్ని లోక్‌సత్తా చేపట్టింది. మనందరం ఎన్నికల ప్రధాన కమిషనరు వారి సమ్ముఖమునకు ఓ మెయిలు పంపాలన్నమాట! ఆ మెయిల్లో ఏం పంపాలన్నది లోక్‌సత్తా వారు తయారు చేసి పంపారు. ఆ మెయిలుకు తెలుగు అనువాదాన్ని కింద ఇస్తున్నాను. మీరూ ఓ మెయిలు కొట్టండి. మెయిలైడీ: gopalaswamin@eci.gov.in

———————————–

ప్రియమైన గోపాలస్వామి గారూ,

వోటరు నమోదు కార్యక్రమం ఎక్కడ జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో, ఎలా చేసుకోవాలో తెలీకపోవడం వలన ఎందరో యువ భారతీయులు వోటర్లుగా నమోదు చేయించుకోలేక పోతున్నారు.

అంచేత పోస్టాఫీసులను శాశ్వత వోటరు నమోదు కేంద్రాలుగా చెయ్యండి. అప్పుడు సులువుగా నమోదు చేయించుకోవచ్చు, నిర్ధారించుకోవచ్చు, దొంగ వోటర్లను తొలగించడంలో సాయపడనూ వచ్చు.

దీనికవసరమైన చర్యలను ఎన్నికల సంఘం వెంటనే చేపడుతుందని ఆశిస్తాను. కోట్లాది యువ భారతీయుల వోట్లు, ప్రజాస్వామ్యపు భవితా మీ చేతుల్లో ఉన్నాయి.

నమస్కారాలతో,

———————————–

గోపాలస్వామి గారికి తెలుగు అర్థమౌతుందో లేదో తెలీదు కాబట్టి, పై ముక్కలను ఇంగ్లీషులో రాసి పంపించవచ్చు. ఇదిగో ఇలాగ!

————————————
Dear Mr Gopala Swamy,

Most young Indians like me, are not able to register as voters, because we don’t know where this (Voter Registration) is happening, when it is Happening and how we can Register.

So, please make POST OFFICES as PERMANENT CENTERS for VOTER REGISTRATION. Then we can Easily verify our vote, get registered as voters if needed and help remove bogus Voters.

We hope Election Commission will take all necessary steps at the earliest. The Votes of Millions of young Indians and the future of democracy are in your hands.

Regards,
——————————————–
నేను పంపించాను. మీరూ పంపించండి. మీరు వోటరుగా నమోదై ఉన్నా సరే పంపించండి. ఎన్నికల సంఘం ఈ పని చేస్తే ఎంతోమందికి ప్రయోజనం కలుగుతుంది. కానీ, ఆ ప్రయోజనం పొందబోయే వారందరికీ ఈ ఉత్తరాల సంగతి తెలుసో లేదో మరి! అంచేత మనం రాద్దాం. వీలైతే ఈ ముక్కలను మీ మీ బ్లాగుల్లో కూడా పెట్టండి.

నేను లోక్‌సత్తాకు వోటెందుకేస్తానంటే..

కాంగ్రెసూ, తెలుగుదేశం, భాజపా, తెరాస, అదీ, ఇదీ – అన్నీ పాలించడంలో విఫలమయ్యాయి.

 • సభను రాజకీయాలమయం చేసారు: ఒకరిపై మరొకరు నిందారోపణలు చేసుకోవడం, ఎత్తులూ పైయెత్తులు వేసుకోవడం తప్ప, సభలో అర్థవంతమైన చర్చ జరపరు.
 • రాజకీయాలను నేరమయం చేసారు: తుపాకులతో పోలింగు కేంద్రాలకెళ్ళి బెదిరించేవాడొకడు, దొంగ బిల్లులు పుట్టించి డబ్బులు కొట్టెయ్యబోయేదొకడు, వాణ్ణి రక్షించేందుకు జీవోలే పుట్టించేసే ప్రభుత్వాధినేతలు, క్షమాపణ పేరుతో హత్యానేరాల్లో శిక్ష అనుభవిస్తున్న తమ అనుంగు అనుచరులను విడిపించేవాడొకడు, కాసిని డబ్బులకోసం ఎవత్తికో మొగుడుగా నటించి విదేశాలకు చేరవేసే త్రాష్టులు, డబ్బులు తీసుకుని సభలో ప్రశ్నలడిగే ముష్టి వెధవలు.. అంతే లేని జాబితా ఇది.
 • పరిపాలనను అవినీతిమయం చేసారు: అవినీతి, అక్రమార్జన పరిశ్రమలుగా మారిపోయాయి. రాష్ట్రంలోని మొదటి పాతిక అవినీతి పందికొక్కులను పట్టి వాళ్ళ బొక్కసాలను వెలికితీస్తే దొరికే మన డబ్బుతో జలయజ్ఞపు ప్రాజెక్టులు కట్టెయ్యొచ్చు. ఇది అతిశయోక్తి కాదు, నా నమ్మకం.
 • ఎన్నికలను డబ్బు మయం చేసారు: డబ్బు పంచి, సారా పోయించి వోట్లు కొంటున్నారు. తరువాతి కాలంలో తమ సంపాదనకు అదే వారి పెట్టుబడి (ఇటీవల జరిగిన ఎన్నికలలో – 2004 లోను, ఆ తరువాత కరీంనగరు ఉప ఎన్నికలోనూ – పోలీసులు డబ్బుకట్టలను పట్టుకున్నారన్న సంగతి నాకింకా గుర్తుంది). ఎన్నికవగానే ఆ ఖర్చును పూడ్చేందుకు సంపాదన మొదలు.
 • ప్రజాజీవితాన్ని తిట్లమయం చేసారు: తిట్లూ, ఆరోపణలు – ఇవే వాళ్ళ దినచర్య. ప్రజాసమస్యల గురించి ఆలోచించడం మానేసి చాలా ఏళ్ళైంది. వాళ్ళకు మన వోట్లు కావాలి గానీ మన పాట్లు పట్టవు.

ఇన్నాళ్ళూ ఇలాంటి వెధవలకు ప్రత్యామ్నాయం లేదు కాబట్టి వాళ్ళకే వోటేసా, తప్పలేదు. కానీ ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయం ఉంది. అది లోక్‌సత్తా పార్టీ. అవినీతిని నిర్మూలించాలన్న, రాజకీయాలను బాగుచెయ్యాలన్న నిబద్ధత కలిగిన పార్టీ. ప్రజలను రాజకీయాల్లో – ముఖ్యంగా ఎన్నికల్లో – చురుగ్గా పాల్గొనాలని కోరుతూ అందుకు ఉద్యమిస్తున్న పార్టీ.

 1. లోక్‌సత్తాకు నేను వోటేసినంత మాత్రాన అది గెలుస్తుందా, అధికారంలోకి వస్తుందా?
 2. జయప్రకాశ్ నారాయణకు ప్రజాకర్షణ లేదుగదా, వోట్లెలా సంపాదిస్తాడు?
 3. తానొక్కడూ మంచివాడైతే చాలా, చుట్టూ ఉన్నవాళ్ళు వెధవలైతే ఒక్కడే ఏం చెయ్యగలడు?
 4. ఇప్పుడిలాగే కబుర్లు చెబుతాడు, రేపు తానూ సైతానే, ఆ తానులోని ముక్కే.. ఈ మాత్రానికి వోటెందుకెయ్యడం?

– ఇలాంటి ప్రశ్నలు నన్నాపలేవు. ఎందుకంటే..

 1. నేను వోటెయ్యకపోతే లోక్‌సత్తా గెలవదేమోనన్న భయం నాకుంది. అంచేత నేను తప్పకుండా వోటు వేస్తాను. వేసి తీరతాను.
 2. లోక్‌సత్తా నన్ను ఆకర్షించింది, అంచేత వోటేస్తాను. ఇతరులను ఆకర్షించడం, వోట్లు సాధించడం వాళ్ళ పని – అది వాళ్ళు చూసుకుంటారు. వోటెందుకెయ్యాలో, నేనెందుకేస్తున్నానో ఇదుగో.. ఇలా చెబుతాను.
 3. సమాజంలో ఉన్న కుళ్ళును ఎలా కడుగుతాడో జేపీ చెబుతున్నాడు, వోటు అడుగుతున్నాడు. ‘ఇల్లు ఊడ్చిపెడతాను, చీపురివ్వండి’ అంటే ఇవ్వడానికేం బాధ, ఇస్తాను. ‘మీ ఇల్లూడుస్తాం, అంట్లు తోముతాం, బట్టలుతుకుతాం’ అని చెప్పి ఇల్లంతా దోచుకుపోతున్న వెధవలతోటి విసిగిపోయాను నేను. (ఇదివరకు గిన్నెలూ, గరిటెల్లాంటివి ఎత్తుకుపోయేవారు.. ఇప్పుడు ఏకంగా ఇల్లే అమ్మేసుకుపోయే రకాలు తయారయ్యాయి.) అందుకని లోక్‌సత్తాకు వోటేస్తాను.
 4. ఇప్పటికైతే లోక్‌సత్తా బాగానే ఉంది. రేపు సైతాను కావచ్చేమోనని భయపడితే, ఇప్పటి రాబందులూ రక్తపిశాచాల నుండి కాచుకోవడమెలా?

ఇంకా…

 • లోక్‌సత్తా పార్టీ సభ్యుడు ఒక్కరు శాసనసభలో ఉన్నారనుకోండి. అప్పుడు మనకు 293 మందే వెధవలు ఉంటారు. ఆ మేరకు మురికిని శుభ్రపరచినట్టే! రామారావు రాజకీయాల్లోకి రాకముందు, ప్రతిపక్షమనేదే లేదు. కాంగ్రెసు ప్రభుత్వాన్ని సభలో ప్రశ్నించేందుకు శాసనసభలో జైపాల్ రెడ్డి, ఎమ్.ఓంకార్, వెంకయ్యనాయుడు.. వీళ్ళే ఉండేవారు. కానీ వాళ్ళు ఇప్పటి ప్రతిపక్షాల కంటే ఎంతో సమర్థవంతంగా పనిచేసేవారు.
 • అయ్యో నేను కూడా వోటేసి ఉంటే బావుండేదే అని పశ్చాత్తాపపడటం నాకిష్టం లేదు.

అంచేత నా వోటు లోక్‌సత్తాకే!

లోక్‌సత్తా పార్టీ అవసరమా?

September 5, 2006 4 comments
అవసరమే!

లోక్ సత్తా పార్టీ ఏర్పడబోతోంది. పార్టీ పెట్టే విషయంపై రకరకాల అభిప్రాయాలు వినవచ్చాయి. నాకూ నా అభిప్రాయం రాయాలనిపించింది. ఓటేసే ప్రతీ ఒక్కరికీ ఈ విషయంపై అభిప్రాయం ఉండి తీరుతుందని నా ఉద్దేశ్యం.

లోక్ సత్తాకు వ్యతిరేకంగా వినవచ్చిన అభిప్రాయాలు : (నీలాలు నా వ్యాఖ్యలు)

 1. సంఘ సేవ అంటూ మొదలెట్టి ఇప్పుడు రాజకీయాల్లోకి దిగడం ఏంటి? పైకి కబుర్లు చెబుతున్నారు గానీ, వీళ్ళు పైనుంచి దిగివచ్చిన వారేం కాదు. నిజమే సంఘసేవ అంటూ మొదలెట్టారు. కాని వాళ్ళ కార్యక్షేత్రం మాత్రం మొదట్నుండీ రాజకీయాలే గదా! అయినా.. సంఘసేవ చేస్తామని మొదలెట్టి ఇప్పుడు రాజకీయాల్లోకి దిగితే తప్పేంటి?
 2. జయప్రకాశ్ నారాయణా, ఆయన చుట్టూ ఉన్నవారు అంతా ఒక కులానికే చెందిన వారు. ఇది ఒక కుల పిచ్చి పార్టీ కాబోతోంది. జయప్రకాశ్ నారాయణ చుట్టూ ఉన్నవారు ఆయన కులస్తులే అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఆ పార్టీ నడవడికను గమనించేందుకు, వారి విధానాలను పరిశీలించేందుకు ఆపై నిర్ణయం చేసుకునేందుకు మనకింకా దాదాపు మూడేళ్ళు సమయముంది. చూద్దాం ఎలా ఉండబోతున్నారో! ఇప్పుడే వద్దనడమెందుకు?
 3. డబ్బు లేని రాజకీయాలు, అవినీతి లేని రాజకీయాలు, నేర మరకలు లేని రాజకీయాలు అంటూ ఉపదేశాలు చెప్పిన వాళ్ళు వీళ్ళు. నిజంగా అలాగే రాజకీయాలు నడపబోయినపుడు, వీళ్ళకు తెలిసి వస్తుంది, అవి లేకుండా రాజకీయాలు నడపడం ఈ రోజుల్లో కుదరదని. నిజమే, కష్టమే! కానీ నడుపుతానంటున్నాడు గదా, ఎలా చేస్తాడో చూద్దాం. చేస్తే అంతకంటే కావలసిందేముంది? చెయ్యలేకపోతే మనకు పోయేదేమీ లేదు కదా!
 4. రామారావు లాంటి సమ్మోహకుడు ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ జయప్రదం అయింది. అంతటి ప్రజానాయకుడు లోక్ సత్తాకు లేరు కాబట్టి అది విఫలమౌతుంది. అది లోటే! కానీ అంతమాత్రాన రాజకీయాలకు పనికిరారని కాదు గదా!
 5. ఏసీ గదుల్లో కూర్చున్న వాళ్ళకు సామాన్యుల బాధలు తెలవ్వు ఇలాంటి వ్యాఖ్య ఒకే ఒక్కరు చెయ్యగా విన్నాను. ఆయన పీసీసీ అధ్యక్షుడు. మరెవరూ ఇటువంటి విమర్శ చెయ్యగా నేను వినలేదు. (అందుకే ఆయన కేశవరావు అయ్యారు.) దీని గురించి మాట్లాడ వలసిన అవసరం లేదు. ఇదొక పసలేని వాదన.
 6. స్వయంగా తనే రాజకీయాల్లోకి దిగి, జయప్రకాశ్ నారాయణ తన విశ్వసనీయతను పోగొట్టుకుంటున్నాడు. “రాజకీయాలనేవి మంచివారు ఉండదగినవి కావు, అదో మురుగ్గుంట, పందులకు మాత్రమే అనుకూలం” అనే భావనతో మనమున్నాం. అంచేతే ఈ విశ్వసనీయత విషయం తలెత్తింది.

నా ఉద్దేశ్యంలో అన్నిటి కంటే ముఖ్యమైన అంశం ఒకటుంది..
ప్రస్తుతం మనకు రెండే శక్తులున్నాయి.. అయితే కాంగ్రెసు, లేదంటే తెలుగుదేశం. విధానాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం లాంటి అవలక్షణాల్లొ ఈ రెంటికీ పెద్ద తేడా లేదు. ఇక కాస్తో కూస్తో నిబద్ధత కలిగిన కమ్యూనిస్టులు బలమైన శక్తి కాదు. ఈ పరిస్థితుల్లో మనకు ఒక మూడో శక్తి కావాలి. మూడో పార్టీ కాదు, ఒక శక్తి కావాలి. ఓటేసేందుకు మనకు మరో వికల్పం కావాలి.

నువ్వు అవినీతి పనులు చేస్తున్నావని ఒకపక్షమంటే, ఏఁ, నువ్వు చెయ్యలేదా అని రెండోది అంటున్న రోజులివి. కాదు అని ఖండించాల్సిన అవసరం కూడా వాళ్ళకు కనిపించడం లేదు. అంతలా బరితెగించి పోయారు. వీళ్ళకు ప్రజలంటే లెఖ్ఖేలేదు. ‘ఈ ఐదేళ్ళ తరువాత మనమెలాగూ ఉండము, ఆపై ఐదేళ్ళ తరువాత ఎలాగూ తిరిగి వస్తాము’ అనే ధీమా అధికార పక్షానిది కాగా, ఈ ఐదేళ్ళ తరువాత మనదే రాజ్యం అనేది ప్రతిపక్షం ధీమా! మూడో శక్తి ఉంటే ఆ ధీమా ఉండదు, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు.

లోక్‌సత్తా చెబుతున్న సిద్ధాంతాలను ఆచరణలో పెడితే అది మూడో శక్తి కాగలదనే నా నమ్మకం. అప్పుడు మన రాజకీయాలు మంచికి మళ్ళుతాయి. చూద్దాం, లోక్‌సత్తా మూడో శక్తిగా ఏర్పడుతుందేమో!

ప్రజలతో జయప్రకాష్ నారాయణ ఫోనాఫోని

ఇవ్వాళ – ఆగస్టు 6 ఆదివారం – సాయంత్రం 6 నుండి 7 వరకు టీవీ9 లో జయప్రకాష్ నారాయణతో ఫోను లో మాట్లాడే కార్యక్రమం జరిగింది. ప్రజలు నేరుగా టీవీ9కి ఫోను చేసి ఆయనతో మాట్లాడే కార్యక్రమం ఇది. మంచి వాగ్ధాటి కలిగిన ఆయన ప్రజల ప్రశ్నలకు చక్కగా సమాధానమిచ్చారు. తమ పార్టీ ప్రసక్తిని ప్రజల్లోకి తీసుకుపోయేందుకు ఆయన దీన్ని బాగా వాడుకున్నారు.

జేపీ చెప్పిన ముఖ్యమైన విషయాలివి.

 • పార్టీపై ప్రజల స్పందన చాలా బాగుంది.
 • ప్రజాస్వామ్యంలోను, పార్టీలోను నాలుగు విషయాలకు ప్రాధాన్యం..
  • యువత
  • మహిళలు
  • చదువు పొందలేని వర్గాలు
  • మధ్యతరగతి
 • ప్రజల చుట్టూ రాజకీయం తిరగాలి.
 • విద్య, ఆరోగ్యం కేంద్రంగా పాలన జరగాలి. సమాజంలో ఉపాధ్యాయుడు, ఆరోగ్య కార్యకర్త ముఖ్యమైన వారు.
 • పార్టీకి మూలాధార సూత్రాలు..
  • అతర్గత ప్రజాస్వామ్యం
  • చందాలు కేవలం చెక్కుల ద్వారానే
  • ఎన్నికల ఖర్చు కమిషను నిర్దేశించిన దానికంటే పైసా కూడా ఎక్కువ పెట్టం
  • ఎన్నికల్లో సారా, డబ్బూ వంటి అవినీతికర పద్ధతులకు పాల్పడం
  • ఒకవేళ మావాళ్ళే ఎన్నికల అవినీతికి పాల్పడితే, వాళ్ళను ఓడించమని మేమే ప్రచారం చేస్తాం.
 • అయ్యేయెస్సులూ, మంత్రులూ, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రీ వీళ్ళు కాదు పెద్దవాళ్ళు.., ప్రజలు పెద్దవాళ్ళు. వీళ్ళంతా ప్రజలు చెప్పినపని చెయ్యాలి, చెయ్యమన్నప్పుడు చెయ్యాలి, వద్దన్నప్పుడు మానెయ్యాలి. రాజకీయాలను ప్రజల చుట్టూ తిప్పాలన్నదే లోక్సత్తా ఉద్దేశ్యం.
 • రిజర్వేషన్లు: కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు మరి కొన్నాళ్ళపాటు ఉండాలి. అయితే వాటిని క్రమబద్ధీకరించాలి. కుల, వర్గ విచక్షణ లేకుండా అందరికీ నాణ్యత గల చదువును ఇవ్వాలి.
 • అక్టోబరు మొదటి వారంలో పార్టీ ఏర్పాటు.
 • ఆగస్టు 9 పార్టీ విధానాల ప్రకటన.
 • పార్టీలో చేరాలన్న ఔత్సాహికులు ఆగస్టు 9 తరువాత, కింది చోట్ల సంప్రదించవచ్చు
  • ఉచిత ఫోను: 1 800 425 2979
  • ఈ అడ్రసుకు ఉత్తరాలు రాయవచ్చు: పోస్టుబాక్సు: 100, హైదరాబాదు– 4
 • జయప్రకాష్ నారాయణ ఇంకా ఇలా అన్నారు…
  • పాలకులు సేవకులే.
  • రాజకీయాల్లో మార్పు రావాలని ప్రజలందరికీ తెలుసు. కానీ అది వస్తుందనే నమ్మకమే వారికి లేదు.
  • చెడ్డవాళ్ళ దుర్మార్గం కన్నా మంచివాళ్ళ మౌనం ప్రమాదకరం.
  • చర్చలిక ఆపేసి, చర్యలు మొదలుపెడదాం.
 • కార్యక్రమం చివర్లో రాష్ట్ర ఎన్నికల కమిషనరు ఏవీయెస్ రెడ్డి ఫోను చేసారు. ఎన్నికల కమిషను చేతకానిది అంటూ నిర్దాక్షిణ్యంగా అనేక అభాండాలు నాపైన వేసారు కదా, మీకది భావ్యమా? అని అడిగారు. దీనికి జయప్రకాష్ నారాయణ సూటిగా సమాధానం ఇవ్వలేదు. అయితే వోటరు పేర్లపట్టిక తయారీలో రాష్ట్ర ఎన్నికల కమిషను అధికారాలు పరిమితం అని మాత్రం చెప్పారు.

నేనివి అడగాలనుకున్నాను. ఎంత ప్రయత్నించినా లైను దొరకలేదు.

 1. అధికార భాషగా తెలుగు అమలు విషయంలో, మాతృభాషలో విద్యాబోధన, తెలుగు భాషాభివృద్ధి విషయాల్లో మీ విధానం ఏమిటి?
 2. అవినీతి విషయమై మీ అభిప్రాయాలు సుస్పష్టం. అయితే అవినీతి అంటని పార్టీలు ఇప్పటి రాజకీయాల్లో లేనే లేవు. మరి, ప్రస్తుత సంకీర్ణ యుగంలో మీ పార్టీ పొత్తుకు వెళ్ళాల్సి వస్తే.., ఈ అవినీతిమయ పార్టీలతో పొత్తు విషయంలో మీ విధానం ఏమిటి?

జయప్రకాష్ నారాయణ రాజకీయ ప్రవేశంపై తమ అభిప్రాయాలు ఎస్సెమ్మెస్సుల ద్వారా పంపమని టీవీ9 వాళ్ళు ప్రజలను అడిగారు. 93% మంది అనుకూలంగా స్పందించారు.

మంచి కార్యక్రమం. టీవీ9 కు అభినందనలు.

లోక్‌సత్తా రాజకీయ ప్రణాళికలు

లోక్‌సత్తా రాజకీయ పార్టీ స్థాపించనుంది. నూతన రాజకీయ సంస్కృతి ఆవశ్యకత కు సంబంధించిన వారి చర్చా పత్రాన్ని ఇక్కడ చూడొచ్చు. ఈ పత్రం చివర్లో ఉన్న కొన్ని వాక్యాలు..

-ఏ సమాజంలో అయితే నీతి తప్పిన వారు విజయం సాధిస్తారో,
-ఎక్కడైతే నేరస్తులు ఆరాధ్యులుగా మారతారో,
-ఎక్కడైతే విలువలు పతనమై అవకాశవాదం రాజ్యమేలుతుందో,
-ఎక్కడైతే అసమర్థ పాలన, ప్రజల ఉదాసీనత రాజ్యమేలుతుందో,
-ఎక్కడైతే అవినీతి సర్వత్రా తాండవిస్తున్నా కూడా పట్టించుకోకుండా తమకు కావల్సిన వాటా కోసం ప్రజలు అర్రులు చాస్తుంటారో

అక్కడ..

“వ్యవస్థకు సంబంధించిన పునస్సమీక్షకు సమయం ఆసన్నమైందని అర్థం”

అప్పుడు
తమ గురించి – తమకు సంబంధించిన వారి గురించి
తమ చుట్టూరా ఉన్నవారి గురించి – తమ కార్యకలాపాలకు సంబంధించి
అక్కడి పౌరులు అంతర్ముఖులు కావాలి

-క్లిట్‌గార్డ్, ప్రఖ్యాత సామాజిక శాస్త్రవేత్త.