Archive

Archive for the ‘వికీపీడియా’ Category

ఇంటర్నెట్లో తెలుగు లోతెంత?

September 16, 2007 10 comments

ఓ మూడేళ్ళ కిందటి దాకా నెట్లో తెలుగు అనేది ఉందనే నాకు తెలియదు. ఏ పని చేసినా ఇంగ్లీషులోనే చెయ్యడం. కంప్యూటరుకు తెలుగు నేర్పొచ్చని, తెలుగులో సుబ్బరంగా రాయొచ్చని ఎప్పుడైతే తెలిసిందో.. ఇక నేను ఆ వచ్చీరాని ఇంగ్లీషు రాయడం మానేసాను. తెలుగులోనే అన్నీ!

ఇవ్వాళ తెలుగులోనే ఉండే సైట్లు బోలెడన్ని ఉన్నాయి. వాటిలో కొన్ని నా జీవితంలో భాగమైపోయాయి. భుక్తి కోసం నేను చేసే పనులు ఇవ్వని ఆత్మ తృప్తి ఆయా సైట్లలో నేను చేసే పనులు నాకిచ్చాయి.

నాకు అన్నిటి కంటే ముందు పరిచయమైన తెలుగు సైటు వికీపీడియా! తెలుగు విజ్ఞానసర్వస్వం – ఎన్‌సైక్లోపీడియా. తెలుగులో ఉన్న ఆ సైటు చూసి నాకు మూర్ఛపోయినంత పనైంది. ఎంతో స్వేచ్ఛ ఉంది అక్కడ! అక్కడ ఎవరైనా రాయొచ్చు కూడా. వెంటనే రాయడం మొదలుపెట్టాను. అప్పటికే ఉన్న సభ్యులు – ముఖ్యంగా రవి వైజాసత్య, నాకు ఎంతో సాయపడ్డారు. ఆయన నాకు వికీ గురువు! ఇప్పుడంటే వికీలో చేరేవారికి సాయం చేసేందుకు అక్కడ ఎంతో మంది ఉన్నారు గానీ, ఆ రోజుల్లో రవి ఒక్కడే వికీకంతటికీ! అసలు ఇప్పటి వికీ స్వరూపం చూస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. ఇంతింతై, వటుడింతయై అన్నట్టు పెరిగిపోతోంది. రవితో పాటు, ప్రదీప్, కాజ సుధాకరబాబు, నవీన్ వంటి ఎందరో సభ్యులు వికీని పరుగులు పెట్టిస్తున్నారు. అక్కడ నేనూ రాస్తాను. నెట్లో నేను చేసే పనులన్నిటిలోకీ నాకు బాగా ఇష్టమైనది ఇదే, నా బ్లాగు కంటే కూడా! ప్రతి తెలుగువాడూ చూసి తీరాల్సిన, రాసి తీరాల్సిన సైటు ఇది.

బ్లాగులు చూడండి.. చక్కటి తెలుగులో ఉండడమే కాదు వాటి గొప్పదనం.., చక్కటి భావాలతో, మంచి భాషతో, వైవిధ్యమైన విషయాలతో మనలను అలరిస్తూ ఉంటాయి. ఈనాడు, జ్యోతి వగైరా పేపర్లు చదువుతాం. ఎన్ని చదివినా అవే వార్తలు, అవే కబుర్లు. విశ్లేషణలు మాత్రం కొద్దిగా భిన్నంగా ఉంటాయి. కానీ..

కంద పద్యం గురించి, కర్ణాటక సంగీత మాధుర్యం గురించి, రాయలసీమ వ్యావహారికంలో చిన్ననాటి కథలు, విశేషాలు, విదేశాల కబుర్లు, నిజమైన, నిష్పాక్షికమైన సినిమా సమీక్షలు, కడుపుబ్బ నవ్వించే గల్పికలు, నిర్మొహమాటంగా ఉండే రాజకీయ విశ్లేషణలు, వంటలు, సామాజిక సమస్యలు మొదలైన వాటిపై వ్యాసాలు.. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? సమకాలీనమైన ఈ విశేషాలు మనబోటి సామాన్యుడి మాటల్లో ఎక్కడ చూడగలం? బ్లాగుల్లో చూడగలం! అసలు మన పత్రికలపైనా, టీవీల పైనా, సినిమాల పైనా నిష్పాక్షికమైన విమర్శ కావాలంటే బ్లాగులు చూడాల్సిందే! మరోచోట దొరకవు. ఎవరైనా, ఏ విషయం గురించైనా రాయగలగడమే ఈ బ్లాగుల విశిష్టత! ఈ పేజీకి ఎడమ పక్కన ఉన్న బ్లాగుల లింకులకెళ్ళి చూస్తే, బ్లాగుల గురించి నేను చెప్పింది బహు తక్కువని తెలిసిపోతుంది. కూడలికి వెళ్తే బ్లాగుల పూర్తి జాబితా చూడవచ్చు.

వికీకి, బ్లాగులకు, ఆమాటకొస్తే తెలుగును ఇంటర్నెట్ వ్యాప్తం చెయ్యడానికి దోహదం చేసినవి కొన్నున్నాయి. తెలుగు నెజ్జనులకు అవి ప్రాతఃస్మరణీయాలు. ఓసారి బ్లాగుముఖంగా వాటిని స్మరించుకుంటాను.

మొదటిదాని కర్త చావా కిరణ్ కూ, లేఖిని కూడలి ల కర్త వీవెన్ కు, పద్మను సృష్టించిన నాగార్జునకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పాలి. వీటిని పెంచి పోషించిన తెలుగువారికందరికీ అభినందనలూ తెలపాలి.

తరువాతి కాలంలో వెలసిన కిందిసైట్లు కూడా ఇతోధికంగా సేవ చేస్తున్నాయి.

ఈనాడులోను, ఇతర పత్రికల్లోను వచ్చిన వ్యాసాలు ప్రజలను పై సైటుల వైపుకు పంపిస్తే తెలుగువారు తెలుగులో చదివేందుకు, రాసేందుకు పై సైటులు ఎంతో దోహదం చేసాయి.

కొత్తవారి కోసం

నెట్లో తెలుగుకు మీరు కొత్తవారైతే, అసలెక్కడ మొదలుపెట్టాలబ్బా అని అయోమయంగా ఉంటే తెలుగుబ్లాగు గూగుల్ గుంపుకు వెళ్ళండి. అక్కడి సభ్యులు మీకు దారి చూపిస్తారు. నేను పైన రాసిన విశేషాలు చాలా తక్కువ -సింధువులో బిందువంత! ఓసారి గుంపులో చేరాక, ఇంకా బోలెడు సంగతులు తెలుస్తాయి. అంతర్జాలానికే ప్రత్యేకించిన పత్రికల దగ్గరనుండి, తెలుగు భాష అభివృద్ధి కోసం మనవాళ్ళు పాటుపడుతున్నారన్న విషయం దాకా ఎన్నో విషయాలను మీరు చూడాల్సి ఉంది. ఆయా పనుల్లో మీరూ పాల్గొనాల్సి ఉంది. రండి!

Advertisements

ఉరుకుల పరుగుల వికీపీడియా

September 24, 2006 Leave a comment

ఆన్‌లైనులో విజ్ఞాన వనరులలో వికీపీడియా మొదటి స్థానం ఆక్రమించింది. ఇప్పటికే పాతుకుపోయిన విజ్ఞాన గనుల్ని వెనక్కు నెట్టేసి ప్రజాదరణలో చాలా ముందుకు దూసుకుపోయింది. లక్షలాది మంది స్వచ్ఛందంగా అక్కడ కృషి చేస్తారు. వీరు కొత్త కొత్త వ్యాసాలు రాస్తూ, ఉన్నవాటికి మెరుగులు పెడుతూ ఉంటారు కాబట్టే లక్షలాది పేజీల, వందల గిగాబైట్ల సమాచారం ఉంది అక్కడ. క్షణక్షణానికీ పెరిగిపోతున్న విజ్ఞాన సర్వస్వమిది, నిరంతరం మెరుగుపడుతూ ఉంటుంది.

వికీపీడియాలో ఎవరైనా రాయవచ్చు. ఒకరు రాసినదాన్ని ఎవరైనా మార్చవచ్చు. అక్కడ ఉన్న విషయాన్ని ఎవరైనా తమ ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా 38 లక్షల పైచిలుకు సభ్యులు, 229 భాషల్లో రాసిన వ్యాసాలెన్నో తెలుసా! 52 లక్షల 37 వేలు!!
ఆ 229 భాషల్లో మన తెలుగూ ఒకటి
ఆ 38 లక్షల మందిలో మనమూ ఓ 600 మందిమి ఉన్నాం
వ్యాసాల్లో మన వాటా 10 వేలు!
ఇది రాసే సమయానికి వ్యాసాల సంఖ్యలో భారతీయ భాషల్లోకెల్లా మనమే ముందంజలో ఉన్నాం. ఈ గణాంకాల పూర్తి వివరాలు చూడండి. కంప్యూటరు తెలుగు నేర్చుకున్న తరువాత నెట్లో ఎన్నో తెలుగు సైట్లు వచ్చాయి. వాటిలో కూడా వికీపీడియా మొదటి వరుసలో ఉంటుంది!

కానీ సభ్యుల సంఖ్య విషయంలో మనం వెనకబడే ఉన్నాం. తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల వికీపీడియాలలో సభ్యుల సంఖ్య మనకంటే ఎక్కువగా ఉంది. సభ్యుల్లో చురుగ్గా పాల్గొనే వారి సంఖ్య కూడా తక్కువే!

తెలుగు వికీపీడియాలో వస్తున్న వ్యాసాలు ప్రధానంగా తెలుగువారికి సంబంధించినవి గానే ఉంటున్నాయి. ఇది సహజం. వివిధ రంగాలకు సంబంధించిన వ్యాసాలు వస్తూ ఉన్నాయి. మంచి మంచి వ్యాసాలు చాలా వచ్చాయి. ప్రతిఒక్కరూ తమతమ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా వ్యాసాలను రాయవచ్చు. చరిత్ర, గ్రామాలు, పట్టణాలు, సినిమాలు, ప్రసిద్ధులు, పుణ్యక్షేత్రాలు, కంప్యూటర్లు, జలవనరులు, రాజ్యాంగ వ్యవస్థ, భాష, సామెతలు, నుడికారాలు.. ఇలా ఎన్నో రకాల వ్యాసాలపై పని చెయ్యవచ్చు.

మీరూ మీ అభిరుచి మేరకు అక్కడ రచనలు చెయ్యండి. ఓ మొక్క నాటడం ఎలాగో వికీపీడియాలో రచనలు చెయ్యడమూ అంతే! మీరు నాటిన మొక్క ఫలాలు మీ బిడ్డలకు, వారి బిడ్డలకు ఉపయోగపడతాయి. అలాగే వికీలో మీరు రాసిన వ్యాసం మీ బిడ్డలకు, మా బిడ్డలకు, వాళ్ళ బిడ్డలకు, తరతరాలకు కూడా ఉపయోగపడుతుంది. అంతేకాక మీకూ కింది విధంగా ఉపయోగపడుతుంది.
1. వ్యాసం రాయడానికి మీరు వికీకి వచ్చినపుడు ఇతర వ్యాసాలు చదివి కొత్త విషయాలు తెలుసుకుంటారు.
2. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నపుడో, లేక డబ్బులకోసం నాన్నకు ఉత్తరం రాసినపుడో రాసిన తెలుగు.. దానికి మెరుగులు పెట్టి, మీ కలానికి పదును పెట్టుకోవచ్చు. మీ పిల్లలకు తెలుగు నేర్పేందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవచ్చు.

‘అయ్యో నాకు తెలుగు రాయడం సరిగా రాదు కదా.. తప్పులు పోతాయి కదా ఎలాగా’ అని అనుకోవద్దు, సిగ్గుపడొద్దు, వెనకాడొద్దు. భాషా దోషాలు సహజం.. వాటిని సరిదిద్దేందుకు ఇతర సభ్యులు ఎలాగూ ఉంటారు. రాస్తూ ఉంటే క్రమంగా మీ దోషాలు తగ్గిపోతూ ఉంటాయి. ఒక సంవత్సరంగా వికీపీడియాలో రచనలు చేస్తూ నేనేంతో నేర్చుకున్నాను. నా తెలుగు ఎంతో మెరుగు పడింది. మీరూ రాయండి. మీ ఊరి గురించి రాయడంతో మొదలు పెట్టండి. జరుగుతున్న చరిత్రను రాయండి (ప్రస్తుత ఘటనలు). మీకు నచ్చిన సినిమా గురించి రాయండి. మీరభిమానించే ప్రసిద్ధ వ్యక్తి గురించి రాయండి.

కంప్యూటర్లో తెలుగు విప్లవానికి కొలబద్ద, వికీపీడియా!

వికీపీడియా ఎందుకు చూడాలి?

అష్టవిధ వివాహాలు ఏమేంటో మీకు తెలుసా?
దశావతారాలేమేంటి?
“చూపితివట నీనోటను.., బాపురే! పదునాల్గు భువనభాండంబుల..” పాట వినని తెలుగువాడుండడు. ఏమిటా 14 భువనాలు?
పంచభక్ష్యాలతో, షడ్రసోపేతమైన భోజనం గురించి విన్నాం, తిన్నాం. ఏమిటా పంచ భక్ష్యాలు, షడ్రసాలు?

వీటన్నిటి గురించి తెలుసుకోవడం ఇప్పుడిక బహు తేలిక! తెలుగు వికీపీడియా చూడండి. ఏకోనారాయణ దగ్గరనుండి, అష్టాదశపురాణాల దాకా, ఎనలేనివి ఎన్నదగినవీ అయిన వ్యాసాలెన్నో ఉన్నాయి అక్కడ. ఆ వ్యాసాలు చూడండి, మీకు తెలిసిన విషయాలు రాయండి. వికీ యజ్ఞంలో పాలుపంచుకోండి.

ఈ వ్యాసాలకు కర్తలు త్రివిక్రమ్ , వైఙాసత్య , కాసుబాబు లకు అభినందనలు. ఓ చెయ్యేసిన ఇతర వికీజీవులకూ అభినందనలు. వీరంతా వికీపీడియా ప్రాముఖ్యతను మరో మెట్టు ఎక్కించారు. శభాష్!

చందమామ గురించి

చందమామ చదివే ఉంటారు. కానీ చందమామ గురించి చదివారా?
లేదా!! అయితే వికీపీడియాలో చదవండి.
మీకు మరికొన్ని సంగతులు తెలిస్తే.. తప్పక అక్కడ రాయండి.

మీరిది చూసారా..?

1. మాయాబజార్ సినిమాలో జరిగేది అర్జునుడి కొడుకు పెళ్ళి. కాని పాండవులెక్కడా కనపడరు. మీరు గమనించారా?
2. రాయలసీమకు ఆ పేరు పెట్టి ఎన్నాళ్ళో కాలేదు అంతకు ముందు దాన్ని దత్తమండలం అనేవారు. ఆ పేరెవరు పెట్టారు?
3. “బావా బావా పన్నీరు” పాట వ్రాసిందెవరు?

వీటికి సమాధానాలు తెలుగు విజ్ఞాన సర్వస్వం –te.wikipedia.org. – లో ఉన్నాయి. మీరూ, నేనూ, మనవంటి వాళ్ళందరూ కలిసి సమష్టిగా రాస్తున్న సర్వస్వమిది. మనకేం తెలుసు, మనమేం రాయగలము అని అనుకోకండి. కాదేదీ కవితకనర్హం లాగా మనకు తెలిసిన ఏ విషయమూ చిన్నది కాదు. తెలుసు కాబట్టి అది మీకు చిన్నది.. కాని తెలియని నాకు…అది పెద్దదే, కొత్తదే.

ఒకసారి చూడండి. మీరూ ఓ వ్యాసం రాయండి. మీ ఊరి గురించో, మీకు తెలిసిన గొప్ప వ్యక్తి గురించో, ఓ సంఘటన గురించో, చరిత్రో, సైన్సో.. ఏదైనా రాయొచ్చు..పూర్తి తెలుగులో. మీకు దాని అవసరం ఉంది. మీ అవసరం అక్కడ చాలా ఉంది.