Archive

Archive for the ‘విజ్ఞానం’ Category

ప్రాణాలు తీసేవాడు, ప్రాణాలు పోసేవారు

August 25, 2007 5 comments

రాజస్థానులో ఏడెనిమిదేళ్ళ కిందట కృష్ణజింకను వేటాడినందుకుగాను ఒక హిందీ సినిమా హీరోకు ఐదేళ్ళ జైలు శిక్ష వేసారు -అదీ ఏడాది కిందట. అతడు ఇంకా జైలుకు వెళ్ళలేదు. ఈ కోర్టు, ఆ కోర్టు అంటూ తిరుగుతున్నాడు. తాజాగా అతడికేసిన శిక్షను ధృవీకరించింది పైకోర్టు. దానిపై, దాని పైకోర్టుకెళతాడంట. 2007 ఆగస్టు 25 న పేపర్లలో ఈ వార్త చాలా ప్రముఖంగా వచ్చింది. గతంలోను ఈ కేసు గురించి పేపర్లలో బాగానే వచ్చింది. అతడు కారు దిగే ఫోటో, ఎక్కే ఫోటో… ఇలా.

ఇతడి వార్త వచ్చిన ఆగస్టు 25నే మరో వార్త కూడా వచ్చింది. అంతరించి పోతున్న కృష్ణజింక జాతిని (అతడు చంపేసిన జింక జాతి) కాపాడేందుకు హైదరాబాదులోని సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ – మక్కికి మక్కి అనువాదం చేస్తే.. కణ, కణజాల జీవశాస్త్ర కేంద్రం) నడుం బిగించింది. కృత్రిమ గర్భధారణ ద్వారా ఒక జింక పిల్లను భూమి మీదకు తెచ్చారు. సీసీఎంబీ శాస్త్రవేత్తలు మనోజ్‌పాటిల్, సదానంద్, ఉమాపతి దీనిపై కృషిచేసారు. వీరు అయిదు మగ కృష్ణజింకల నుంచి 85 వీర్యనమూనాలను సేకరించారు. వీటిని మూడు జింకల్లో కృత్రిమ విధానంలో గర్భధారణ చేయించగా ఒకటి విజయవంతం అయిందని సీసీఎంబీ సంచాలకులు లాల్జీసింగ్ చెప్పారు. [2007 ఆగస్టు 25 నాటి ఈనాడు వార్త -ఈ లింకు ఎన్నాళ్ళో పనిచెయ్యదు]

శభాష్, శాస్త్రవేత్తలూ!


సీసీఎమ్‌బీ,
మూలకణాలపై (స్టెమ్‌సెల్స్) పరిశోధనలు చేస్తున్న ఏకైక భారతీయ సంస్థే కాకుండా, ప్రపంచంలోని అతి కొద్ది సంస్థల్లో ఇది ఒకటని కూడా చదివిన గుర్తు. మొదలుపెట్టినకొత్తలో దాని గురించి ప్రముఖంగా వార్త వచ్చింది, అది ఎంత బాగుందో, దాని పరిసరాలెంత బాగున్నాయో అంటూ! అప్పటి సంచాలకుడు (భార్గవ అనుకుంటా) మారి, లాల్జీసింగు వచ్చాక ఆయన జీవిత విశేషాలను గురించిన వార్త వచ్చింది.

—– -x- —–


కొసమెరుపు: ఆ సినిమా హీరో ప్రాణాలు తీస్తే, శాస్త్రవేత్తలు ప్రాణాలు పోసారు. ఈనాడులో అతడి వార్త మొదటి పేజీలో ఫోటోతో సహా ప్రముఖంగా వచ్చింది, వీరి వార్త ఐదో పేజీలో వేసారు; ఫోటోలా!? భలేవారే!!

Advertisements