Archive

Archive for the ‘వ్యంగ్యం’ Category

ఎంత ఘోరం! ఎంత అవమానం!!

జాతి సిగ్గుతో తలదించేసుకోవాల్సిన సంగతి మరొకటి దొరికేసింది మనకు. అద్భుతమైన సినిమాలెన్నింటిలోనో నటించి, అమెరికాతో సహా అనేక దేశాల ప్రజలను ఆనంద డోలికల్లో ఓలలాడించిన షారుఖ్ ఖాన్‌ను పేరొందిన నటుడని కూడా చూడక అమెరికా ఇమ్మిగ్రేషనువాళ్ళు రెండు గంటల సేపు ప్రశ్నించారంట. తన పేరును బట్టే తనకీ అవమానం జర్గిందని చెబుతున్నాడతడు. [మై నేమ్ ఈస్ ఖాన్ అనేది ఖాన్ కొత్త సినిమా పేరంట 🙂 ] ఎంత అవమానం! రండి, సిగ్గుతో తలొంచేసుకుందాం.

అంబికాసోనీ అని మనకో మంత్రి ఉందంట. షారుఖ్ ఖానుకు జరిగిన ‘అవమానా’న్ని యావజ్జాతికీ జరిగిన అవమానంగా భావించి, రండి దెబ్బకు దెబ్బ తీద్దామని ఈబిడ సందేశమిచ్చింది. అంటే, ఇన్నాళ్ళూ మనం మంచివాళ్ళం కాబట్టి అమెరికావాళ్ళని ఇమ్మిగ్రేషను చెక్ సరిగ్గా చెయ్యడం లేదు, ఇక నుండి సరిగ్గా చెక్ చేస్తామన్నమాట! ఆహా, మనకెంత గొప్ప మంత్రిణుందో కదా! రండి ఇలాంటి ‘మహా’ మంత్రి ఉన్నందుకు మనందరం సగర్వంగా తలెత్తుకు తిరుగుదాం.

”అమెరికాకు ఎందుకొచ్చావు.. నీ ఫోన్‌ నంబరు ఏమిటి.. ఎక్కడ ఉండబోతున్నావు.. హోటల్‌ నంబరేమిటి..” అంటూ చిల్లర ప్రశ్నలతో వాళ్ళు షారుక్కును విసిగించారంట. మన అధికారులు ఈ చిల్లర ప్రశ్నలడగరు. బహుశా ఇలాంటి చిల్లర ప్రశ్నలు అడగరాదని అంబికా సోనీ వంటి నేతాగ్రగణ్యులు, నేతా శిరోమణులు మన అధికారులకు చెబుతారు కాబోలు. లేకపోతే మనవాళ్ళూ ఇలాంటి చిల్లర నేరాలు చేసుండేవారు. గర్వపడాల్సిన సంగతే!

షారుక్కుకు కోపం వస్తే నీ హడావుడేంటి అంటారా.. నా సొంతగోడొకటుందిక్కడ. షారుక్కుకు జరిగిందే నాకూ జరిగింది, నాలుగైదేళ్ళ కిందట. డిట్రాయిట్లో దిగ్గానే ఆ ఇమ్మిగ్రేషను కౌంటరులో ఉన్నవాడు ‘పద ఆ పక్క గదిలో కూచ్చో’ అని అన్నాడు. ‘అక్కర్లేదులే, తీరిగ్గా కూచ్చుని కాఫీ బోఫీలు తాగేంత సమయం నాకిప్పుడు లేదు, ఈసారొచ్చినప్పుడు వస్తాలే’ అని చెబుదామనుకున్నా. ఇంగ్లీషొచ్చినవాళ్ళకి నా ఇంగ్లీషు అర్థం కాదని గుర్తొచ్చి, ‘తప్పదు కాస్త ఆలస్యమైనా కాస్సేపు కూచ్చొని ఆ కాఫీయో మరోటో తాగేసి పోదామ’నుకుని పొయ్యి ఆ గదిలో కూచ్చున్నా. గంటా గంటన్నరైనా, కాఫీ కాదుగదా.. కనీసం పలకరించినవాడైనా లేకపోయె.

నాలాంటోళ్ళు ఇంకో ఇద్దరు ముగ్గురున్నారక్కడ. వాళ్ళలో ఒకడికి వాడి మాతృభాష తప్ప మరోటి రాదు. సిరియాలోనో జోర్డానులోనో మాట్లాడే అరబిక్కు లాంటి భాష వాడిది. వాడితో సతమతమైపోతున్నారు వాళ్ళు. అతగాడు గతంలో ఓసారి అమెరికా వచ్చి, వీసా తీరాక కూడా ఉండిపోతే బలవంతాన పంపించేసారంట. ఇప్పుడు కెనడా పోయి, అక్కడి నుండి మళ్ళీ వచ్చాడు. ‘అప్పుడలా ఎందుకు చేసావు? ఇప్పుడెందుకు వస్తున్నావు?’ లాంటి ప్రశ్నలు ఇంగ్లీషులోను, అరబిక్కులో చేతులు తిప్పుతూను అడుగుతున్నారు. వాడుకూడా !@$!@$%, %$ &@$%!; %$@ !@$!%! అంటూ అరబిక్కులోను, ఇంగ్లీషులో చేతులు తిప్పుతూను సమాధానం చెబుతున్నాడు. ఆ చేతులభాష ఒకళ్ళదొకళ్ళకి అర్థమౌతున్నట్టు లేదు. ఓ గంటపైగా కష్టపడ్డారు. ఇహ ఆ అమెరికావాళ్ళకి విరక్తి కలిగి, వాడి భాష మాట్టాడగలిగేవాణ్ణి కనుక్కోవడానికి దేశమ్మీదకి కొందర్ని, గూగులు మీదకి కొందర్నీ పంపించి, వాణ్ణి పక్కన కూచోమని, నన్ను రమ్మన్నారు.

నాకిక కాఫీ ఇవ్వరనీ, నన్నూ ఇట్టాగే ఏదిచ్చుకు తింటారనీ అప్పటికే నాకు అర్థమైపోయింది.  కాకపోతే ఆ సిరియా/జోర్డాను వాణ్ణి చూసాక, నాకు ధైర్యమొచ్చేసింది. నాకూ చేతులున్నాయి కాబట్టి ప్రయత్నం చేద్దామనుకున్నాను. ఆపైన నాకూ ఆ అమెరికా నల్లావిడకీ సంభాషణ ఇలా జరిగింది. అవిడడిగిన ప్రతీ ప్రశ్నకీ నాదో విజ్జ్ఞప్తి ఉండేది, పదేపదే రాయడమెందుకని అది నేనిక్కడ రాయడం లేదు. అదేంటంటే ‘సారీ నాకర్థం కాలా, ఏదీ మళ్ళీ అడుగు ‘ అని.

“ఎందుకొస్తున్నావ్, అమెరికాకి?”
“ఫలానా పని మీద”

“ఎన్నాళ్ళుంటావ్”
“ఫలానా ఇన్నాళ్ళు”

“ఈ పనికి అన్ని రోజులెందుకు”
“అక్కర్లేదు, ఇదిగో ఇన్ని రోజులిస్తే చాలు” (నే తెచ్చిన పచ్చళ్ళూ అప్పచ్చులూ మావాళ్ళకిచ్చేందుకు ఈ మాత్రం సమయముంటే చాలు నాకు)

“నిన్నిక్కడికి ఎవరు పిలిచారు? వాడి నంబరివ్వు”
“ఇదిగో”

(ఫోనులో మాట్టాడాక..) “అతగాడు చెప్పిన పనీ నువ్వు చెప్పిన పనీ తేడాగా ఉన్నాయే! నాకు నిన్ను నమ్మబుద్ధి కావడం లేదు”
(నేను పచ్చళ్ళూ అప్పచ్చులూ మావాళ్ళకిచ్చేందుకొస్తున్నానని నిజం చెప్పేసినట్టున్నాడు!! ఇక లాభం లేదు, మరింత బాగా నటించాలి) “అదేంటి, అలా ఎందుకు చెప్పాడు చెప్మా?”

“పోనీ ఇంకెవరైనా కాంటాక్టు పర్సనున్నారా?”
“ఆ, ఉన్నారు, ఇదిగో ఈ నంబరు. (దేవుడా, దేవుడా కనీసం ఈ సారన్నా నిజం చెప్పనీకుండా చూడు)”

(ఫోనులో మాట్టాడాక) “ఏంటో.. ఈసారి ఈయన చెప్పిందీ నువ్వు చెబుతున్నదీ సరిపోయింది. కాస్సేపలా కూచ్చో, నీ సంచులు చెక్ చెయ్యాలి.”
(హమ్మయ్య) “అలాగే!”

సంచులంటే మామూలు సంచులనుకునేరు, అమెరికా సూట్‌కేసులవి. ఒక్కోదానిలో రెండు సంసారాలను పెట్టెయ్యొచ్చు. అర్భకుడొకడొచ్చి సూట్‌కేసులను తెరవమన్నాడు. నన్ను తెరవమంటాడేంటి, వాడే తెరుచుకోవచ్చుగా. ఒక తెలుగువాడికి, హిందువుకీ ఎం..థ అవమానం!! కానీ పరిస్థితి గుర్తొచ్చి, తలెత్తి ‘జై ఆంజనేయం ప్రసన్నాంజనేయం’ అనుకుంటూ ఒకదాన్ని తెరిచాను. అందులో సగభాగం ప్యాంట్లూ, చొక్కాలు, లుంగీలు వగైరాలున్నాయి. మిగతా సగం అప్పచ్చులు!

“ఇదేంట”న్నాడు 
(నాకు మావాళ్ళు ముందే చిలక్కి చెప్పినట్టు చెప్పారు. ‘ఇదేంట’ని ఎవడైనా అడిగితే కుక్‌డ్ ఫుడ్ అనమని. చిత్రం, వాడు సరిగ్గా అదే ప్రశ్న అడిగాడు, ఇహజూడండి.. నేనా ఊరుకునేది..?) “కుక్‌డ్ ఫుడ్”

“ఇదేంటీ?”
“కుక్‌డ్ ఫుడ్”

“మరిది?”
“కుక్‌డ్ ఫుడ్”

“ఇదేంటి మరి?”
“కుక్‌డ్ ఫుడ్ “

“ఇదో?”
“కుక్‌డ్ ఫుడ్ “

“ఇదీ?”.. “నాకు తెలుసు నువ్వు చెప్పొద్దు, ఇది కూడా కుక్‌డ్ ఫుడ్డే, కదూ?”
“ఔను!”

ఇహ తట్టుకోలేక, రెండో సంచి తెరవమన్నాడు. తీసాను. అందులో కొన్ని ఎర్రటివి, కొన్ని ఎర్ర్..ర్హటివి, కొన్ని పసుపువి, కొన్ని ఆకుపచ్చవి, కొన్ని తెల్లనివి, కొన్ని గులాబీవి – ద్రవాలు కొన్ని, ఘనాలు కొన్ని, పొడులు కొన్ని, జెల్లీలు కొన్నీ ఉన్నాయి. సంస్కృతంలో చెబుతారు చూసారూ.. భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, చోష్యాలు.. అవన్నీ ఉన్నాయందులో! పాలిథీన్ సంచుల్లో మెరుస్తూ, ఊరిస్తూ ఉన్నాయి.

మళ్ళీ ఆ అర్భకుడు-
“ఏంటివన్నీ !!!!?”
“కుక్‌డ్ ఫుడ్”

వాడికిక ఓపిక నశించి, ఆ నల్లావిడని పిలుచుకొచ్చాడు. ఆవిడొచ్చి, చూసి.. తేరుకున్నాక, అడిగింది.

“నువ్వొచ్చిన పని ఇన్ని రోజులకే నన్నావ్, అన్ని రోజులకు ఇం..థ తిండా?”
(ఒక నవ్వు నవ్వి) “నాకొక్కడికే కాదు, ఇక్కడ మా టీములో జనం ఇంకా ఉన్నారు, పాపం వాళ్ళు తిండిలేక అలమటించిపోతున్నారు. అందుకనీ..”

టీమంటే ఆఫీసుల్లో ఊంటాయే.. ఆ టీమనుకున్నట్టుంది ఆవిడ పాపం. వాడితో ఇంగ్లీషులో ఏదో చెప్పింది. తెలుగులో చేతులూపలేదు కాబట్టి నాకర్థం కాలా. ఎవడో ఇండియా స్పెషలిస్టును పిలిపిస్తున్నారని లీలగా తెలిసింది.

కాస్సేపటికి మరొకడొచ్చాడు. చురుకైనవాడని చూడగానే తెలిసిపోయింది. “ఇండియానుంచొచ్చావా?” అంటూ బయటపెట్టిన సరుకు మొత్తాన్నీ ఒకేసారి చూసాడు. నల్లావిడ కూడా పక్కనే ఉంది.

“ఇవన్నీ కుక్‌డ్ ఫుడ్సేగా” అన్నాడు. ఒకే ఒక్ఖ చూపులో విషయాన్ని పసిగట్టేసరికి అతడి మీద ఎంతో గౌరవం కలిగింది. అతణ్ణి ఆరాధనగా చూస్తూ అవునన్నాను. ‘ఎర్ర్..ర్హటిదొకదాన్ని పుచ్చుకుంటారేంటి’ అందామనుకున్నాను. ఆనక నాక్కూడా ఒకటివ్వమని ఆ నల్లావిడ కూడా అడుగుద్దేమోనని సందేహించి అనలేదు. ‘సర్సరే, ఇక సూట్‌కేసులు సర్దేసుకో’ అనేసి, ఆవిడతో ‘నో ప్రాబ్లెమ్’ అని చెప్పేసాడు. అప్పటిదాకా ఇలాంటి సూట్‌కేసులు ఎన్ని చూసాడో అతగాడు -ఛక్‌మని తేల్చేసి వెళ్ళిపోయాడు. ఆవిడ కూడా ఏదో అంటూ అతడెనకాలే పోయింది.

ఇంతకీ ఈ ఉదంతాన్ని ఏదో ప్రహసనం లాగా చెప్పాను గదాని తేలిగ్గా తీసుకునేరు, నాకు జరిగిన అవమానాన్ని నేనేమీ తేలిగ్గా తీసుకోలేదు సుమండీ! ఒక తెలుగువాడిగా, ఓ హిందువుగా నాకు జరిగిన హ్యుమిలియేషనుకూ (దీన్నలా అనాలని షారుక్కే చెప్పాడిప్పుడు) మనసులో కుమిలిపోతూనే ఉన్నానిన్నాళ్ళూ. ఇప్పుడు షారుక్కును చూసాక, ‘ఓహో ఇలాటి అవమానాలు జరిగినపుడు ఊరుకోకూడదు, గొంతెత్తి అరవాలన్నమాట’ అని తెలిసొచ్చింది.

నాకూ, షారుక్కుకూ జరిగిన ఈ అనుభవాల దృష్ట్యా అంబికా సోనీకి ఒక సలహా పారేద్దామనుకుంటున్నాను. డిట్రాయిట్ విమానాశ్రయంలో మూడున్నర గంటలు గడిపిన భారతీయుడికి, తెలుగువాడికి, హిందువుకూ సలహా ఇచ్చే హక్కుంది కూడాను. పైగా షారుక్కు లాగా నేను కూడా ‘ఫెల్ట్ యాంగ్రీ అండ్ హ్యుమిలియేటెడ్‘! -కాకపోతే తెలుగులో!

అంచేత అంబికా సోనీకి నా సలహా ఏంటంటే.. అమెరికావాడితో గొడవ పెట్టుకోకుండా సామరస్యంగా పరిష్కరించండి. కింది పనులపై దృష్టి పెట్టండి:

1. అమెరికాలోని ఇమ్మిగ్రేషను జనాలందర్నీ ఇక్కడికి పంపించి, మన దేశంలో ఓ ఏడాది పాటు శిక్షణ ఇవ్వాలని అమెరికాను కోరండి. సుబ్బరంగా షారుక్కు, ఆమీరు, సల్మాను, అభిషేకు, ఫరూక్‌షేకు, ఐశ్వర్య, మా తెలుగు సినిమా ‘బాబు’లు, ప్రభుత్వం లోని బాబులు, వాళ్ళ బాబులూ వగైరాలందర్నీ వాళ్లకి పరిచయం చేద్దాం. ‘ఇదిగో ఈసారి వీళ్ళెవరైనా అమెరికా వచ్చినపుడు నమష్కారో, ఆదాబో పెట్టేసి పమ్మించెయ్యాలి తెల్సిందా ‘ అని చెప్పెహేసి, ట్రైనింగిచ్చేసి పంపిచ్చేద్దాం.

లేదా..

2. అమెరికా నేతలను పిల్చి ట్రైనింగివ్వండి. ‘ఒహోరి పిచ్చి సన్నాసుల్లారా, అధికారిని వాడి పని వాణ్ణి చెయ్యనివ్వడమేంట్రా? మీరంతా ఉండి ఏం చేస్తున్నట్టు? ఫలానావాణ్ణి చెక్‌చేసేందుకు వీల్లేదు అని మీరు చెబితే వాళ్ళు చెయ్యగూడదు, లేకపోతే చేసుకోవాలి, అంతే -అలా ఉండాలిగానీ, ఇదేంటిది? ఎవడు బడితే వాడు రూల్సును పాటిస్తూపోతే ఇక మీరున్నదెందుకు?’ అంటూ ప్రైవేటు చెప్పేసి, మన పద్ధతులను నేర్పించెయ్యండి. ఈ ట్రైనింగిచ్చేందుకు ప్రపంచంలో మనాళ్ళని మించిన స్పేషలిస్టుల్లేరు.

లేదా..

3. ఆ ఇమ్మిగ్రేషన్ను మనకు ఔట్‌సోర్సు చేసెయ్యమనండి. మనాళ్ళకైతే ఎవణ్ణి చెక్ చెయ్యాలో ఎవణ్ణి చెయ్యకూడదో మీరు ఇప్పటికే బాగా ట్రైనింగిచ్చి ఉన్నారు గదా! ఆ అధికారులకి. కూడా తిక్క కుదురుద్ది. లేకపోతే షారుక్కును, నన్నూ అల్లరి పెడతారా? చిల్లర ప్రశ్నలడుగుతారా?

లేదా..

4. అమెరి’కాకి’ మన దేశమ్మీదా మన కాకి అక్కడా వాలకుండా తగువు పెట్టేసుకోండి.. ఈ పంది జరాలూ, కోళ్ళ గున్యాలు, గుర్రాల వాతాలూ రాకుండానైనా ఉంటాయి.

Advertisements

తెలంగాణపై రహస్య సమావేశం

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కల సాకారమయ్యేందుకు అవసరమైన అనుకూల వాతావరణం ఏర్పడింది.  ఎన్నికల ఫలితాలు వచ్చాక ఏర్పడిన తెలంగాణ-అనుకూల పరిస్థితులు ఇంతకు ముందెన్నడూ లేవు. త్వరలో రాష్ట్ర విభజన మొదలయ్యేందుకు రాజకీయ సమీకరణాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి.

తీర్మానం  పెడితే, రాష్ట్ర శాసనసభలో 289 -5 వోట్ల తేడాతో గెలుస్తుంది. లోక్‌సభలో కనీసం 500  వోట్లు అనుకూలంగా వస్తాయి.

 1. కాంగ్రెసు పార్టీ చూడండి. అందులోని తెలంగాణా నాయకులంతా ప్రత్యేక రాష్ట్ర అనుకూలురే, తెలంగాణ ఏర్పాటును బలంగా కాంక్షించేవారే -కనీసం అలా చెబుతున్నారు మనకు. అలా కాంక్షించనివారు కూడా మేడమ్‌గారి నిర్ణయాన్ని నెత్తిన పెట్టుకునేవాళ్ళేగానీ మరోలా ఆలోచించేవారు కాదు. ఈ ముక్కముఖ్యమంత్రి దగ్గరినుండి ప్రతీ కాంగ్రెసు నాయకుడూ చెప్పేదే.  మొన్నటిదాకా యూపీయేలోను బయటా అనేకమంది మీద ప్రభుత్వం ఆధారపడి ఉండేది. ఇప్పుడలా కాదు.. మేం మద్దతిస్తామంటే మేమిస్తామంటూ వెంటపడుతున్నారు. కాబట్టి తెలంగాణ ఇస్తామంటే వాళ్ళెవరూ కిక్కురుమనరు. ఇస్తామంటే కాదు, అమ్మేస్తామన్నా వాళ్ళు సరేనంటారు. 
 2. బీజేపీ, యానీ.. ఎన్‌డీయే:  వీళ్ళ సంగతి చెప్పేదేముంది? కిందటి సారే చెప్పారు.. మీరు బిల్లు పెట్టండి, మేం మద్దతిస్తాం అని. ఇప్పుడూ సిద్ధంగానే ఉంటారు. పైగా వంద రోజుల్లో తెలంగాణ అనే నినాదం ఒకటి ఉండనే ఉంది.
 3. తెలుగుదేశం:  సమైక్య వాదులు కాస్తా వేర్పాటువాదులయ్యారు కాబట్టి, వీళ్ళూ అడ్డు చెప్పరు.
 4. కమ్యూనిస్టులు: వాళ్ళెవరూ అని అడక్కండి.. ఉన్నారు! ఒకరు అనుకూలం, ఇంకోరు వ్యతిరేకం. (ఇంకా ఉన్నారుగానీ, వాళ్ళ లెక్క నాకు తెలవదు, తెలిసినా మనకనవసరం.) అయితే వీళ్ళ మాటను వినిపించుకునే వాడు లేడు, వాళ్ళ అభిప్రాయాలు ఎవడికీ అక్కర్లేదు.
 5. ప్రజారాజ్యం, లోక్‌సత్తా:  వీళ్ళు కూడా తెలంగాణకు అనుకూలంగా ఉన్నారనే చెప్పారు, కాబట్టి దిగుల్లేదు.
 6. ఇహ, తెరాస . తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ ఇది. కాబట్టి వ్యతిరేకించదు. 

ఇవన్నీ ఒక సాధారణ పౌరుడిగా నా అనుకోళ్ళు. “నీమొహం, తెలంగాణకు అనుకూలమని పైకి అందరూ చెప్పేవారేగానీ ఇవ్వాలని ఎవ్వడికీ లేదు, చివరికి తెరాసకు కూడా” అని మీరంటే నే చెప్పేదేమీ లేదు.

కింది చర్చ చూడండి .  రాత్రి నాకొచ్చిన కలలో జరిగిందిది. నాకొచ్చిన కల కాబట్టి నాకు నమ్మాలనిపిస్తోంది. మీరు నమ్మకపోతే మీ ఇష్టం. తెలంగాణ ఎప్పుడిద్దామా అని వీళ్ళంతా ఎంతో ఆత్రంగా ఉన్నారు. ఖచ్చితంగా త్వరలో తెలంగాణ వస్తది.
————————————————

 ఎన్నికల ఫలితాలు రాగానే తెలంగాణ అంశాన్ని ఎలా తేల్చాలనే విషయంపై ఒక రహస్య సమావేశం జరిగింది. అన్ని పార్టీలూ ఈ సమావేశంలో పాల్గొన్నాయి. వాళ్ళ సంభాషణ ఇది:

పాల్గొన్నవారు:

 1. రాజశేఖరరెడ్డి
 2. కేవీపీ
 3. రోశయ్య
 4. చంద్రబాబు నాయుడు
 5. కె నారాయణ
 6. రాఘవులు
 7. కేసీయారు

ప్రధాన ఎజెండా: తెలంగాణ వెంఠనే ఇవ్వడం ఎలా?
ముఖ్య నిబంధన: శాసనసభలో లాగా మాట్టాడుకోరాదు. రహస్య సమావేశం కాబట్టి పెద్దగా అరవరాదు.

రోశయ్య, నారాయణ, రాఘవులు కూచ్చుని మాట్టాడుకుంటున్నారు. మిగతావాళ్ళు ఇంకా రాలేదు. ఏంటీ వీళ్ళింకా రాలేదు అని నారాయణ అడిగాడు.

రోశయ్య: వచ్చారు. బాబు రాజశేఖరరెడ్డి గారితోటీ, కేసీయార్ గారు కేవీపీగారితోటీ విడిగా సమావేశమయ్యారు. వచ్చేస్తార్లెండి.

రాఘవులు: వాళ్ళూ వాళ్ళూ మాట్టాడుకునేదానికి ఇక మేమెందుకిక్కడ? నారాయణా పద పోదాం.

రోశయ్య: ఆగండాగండి, వచ్చేస్తున్నారు. వాళ్ళకీ వాళ్ళకీ సవాలక్ష ఉంటాయి. ఇలాటప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మాట్టాడుకుంటారు?

అంటూండగానే ఓ గదిలోంచి బాబు, రాజశేఖరరెడ్డి, మరో గదిలోంచి కేసీయారు, కేవీపీ వచ్చారు. అందరూ కూచ్చున్నాక,
నారాయణ: ప్రజారాజ్యాన్ని పిలవలేదేంటండి?
రోశయ్య: పిలిచామండి. మాకు తెలంగాణ గురించి పెద్దగా తెలీదు, రామని చెప్పారు. తెలిసిన వాళ్ళు ఒకళ్ళిద్దరున్నారుగానీ, వాళ్ళ మెదళ్ళకు తాళాలేసి, అరవిందు పట్టుకుపోయాడు, అ సంగతేదో మీరే చూచుకోండని చెప్పారు.

నారాయణ: మరి లోక్‌సత్తాయో?
రోశయ్య: వాళ్ళనీ పిలిచాం. “తెలంగాణ ఇచ్చేందుకు మీరెవరు? మీరేమన్నా దేవుళ్ళా? మీరెవరండీ ప్రజలపై మెహర్బానీ చూపించడానికి? ఏఁ మీ జేబులోంచి ఇస్తున్నారా? అసలు మీరివ్వడమేంటి, చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే పరిపాలన బాగుంటుందని ప్రజలు అనుకుంటే వాళ్ళే తీసుకుంటారు,..”  అంటూ ఇంకా ఏంటో చెప్పారు, నాకు అర్థం కాలేదు. సరే రారు కాబోలని అనుకున్నాను.

రోశయ్య: సరే ఇక ఆ సంగతులను పక్కకు పెట్టి మనపని చూచుకుందాం. తెలంగాణను ఇచ్చే విషయాన్ని చర్చించేందుకు  మేం మిమ్మల్ని పిలిచాం.ఇప్పుడూ..
కేసీయారు: నువ్వు తెలంగాణ ఇచ్చెటోనివి, నేను తీసుకునెటోన్నా? గట్లని చెబితే వచ్చెటోన్ని కాదుగదా. రాజశేఖర్, ఏందయా మాట్టాడవ్?
రాజశేఖరరెడ్డి: రోశయ్యగారూ, పాయింటుకు రండి!
రోశయ్య: సరే.. తెలంగాణ ఇచ్చే విషయంలో మనందరం అనుకూలమే కాబట్టి ఎలా ఇవ్వాలనే విషయంపై మాట్లాడుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసాము.   
రాఘవులు: మేం తెలంగాణకు వ్యతిరేకమని చెప్పాం గదా, నన్నెందుకు పిలిచినట్టు?

రోశయ్య: మీరు లేకపోతే ఈ పని సానుకూలపడదండి, అందుచేత పిలిచాము. కాస్త ఓపిగ్గా వినండి.

అని చెప్పి రోశయ్య కొనసాగించాడు..

రోశయ్య: మనందరం తెలంగాణకు అనుకూలమే కాబట్టి, వెంటనే ఆ దిశగా చర్య తీసుకోకపోతే మనమీద వత్తిడి వస్తుంది. జాప్యమెందుకవుతోంది అని అడుగుతారందరూ. దానికి సమాధానం చెప్పటం అంత తేలిక కాదు. బాబూ,  నువ్వు చెప్పు అవునా కాదా?

బాబు: అవును.
రోశయ్య: తెలంగాణ ఇచ్చేందుకు కేంద్రంలో ఇప్పుడు మాకు అడ్డేమీ లేదు. రాష్ట్ర శాసనసభలో 288 మంది తెలంగాణకు అనుకూలం. అర్జెంటుగా తెలంగాణ ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టాలి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించడం గురించి ఇప్పుడు మనం చర్చించాలి.

వెంటనే బాబుకు ప్రణబ్ ముఖర్జీ కమిటీ గుర్తుకొచ్చింది. “మళ్ళీ ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేయిద్దామా?” అని అడిగాడు.

రాఘవులు: ఇంతకీ అసలు సంగతేంటో చెప్పండి, ఇలా డొంకతిరుగుడు మాటలెందుకు?
రాజశేఖరరెడ్డి: ఇదిగో రాఘవులూ, చెబుతున్నాం గదా, కాస్తాగు, రోశయ్య గారూ, మీరు కానీండి.
రోశయ్య:  ప్రణబ్ ముఖర్జీ కమిటీ పాతది. మళ్ళీ అలాటి కమిటీ వేస్తే మనం జాప్యం చేస్తున్నామని తెలిసిపోతుంది. అందుచేత మనం వేరే మార్గమేదైనా కనుక్కోవాలి.
నారాయణ: ఏముంది, ఇద్దామనుకున్నాం, ఇచ్చేద్దాం. అంతే!
రాఘవులు: ఏంది ఇచ్చేది, మీ ఇష్టమేనా?
నారాయణ: నా అభిప్రాయం చెప్పడం కూడా నా ఇష్టం కాదా? ఇలా మాట్లాడితే ఎలాగండీ రాఘవులు గారూ?
రాఘవులు: రాష్ట్రం ఏర్పాటు చెయ్యడమంటే మంగళగిరిలో పోటీ చేసినట్టు కాదు.
నారాయణ: ఓహో.. అయితే ఖమ్..
రాజశేఖరరెడ్డి: అబ్బబ్బ..బాబూ ఏంటయ్యా ఇది? నువ్వన్నా చెప్పు వీళ్ళకి.

బాబు: ఏంటి రోశయ్య గారు? కూటమి అన్నాక ఆ మాత్రం తగువులు ఉండవా ఏంటి? మీకివన్నీ కొత్తైనట్టు మాహాడుతున్నారేంటి? రాఘవులూ, నువ్వాగు. నారాయణా, ఆయన చెప్పేది విను ముందు.

రోశయ్య:  ఇవ్వొచ్చు, ఇవ్వాలి కూడా. కానీ ఆ ఇచ్చే పద్ధతే ఎలాగా అని మనం తేల్చుకోవాలి.

నారాయణ: ఏముంది, శాసనసభలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపిద్దాం. లోక్‌సభ కూడా ఒక తీర్మానం పెట్టి ఆమోదిస్తుంది, అంతే!
రోశయ్య: అబ్బ, ముఖ్యమంత్రి గారూ నారాయణ గారికి చెప్పడం నావల్ల కాదిక. మీరే చెప్పండి.

రాజశేఖరరెడ్డి: నారాయణా,  ముందు మన చర్చ కానివ్వు. తరవాత.. నీ ప్రశ్నలు, సలహాలు, సూచనలు. సూరీడూ, భోజనాలు తీసుకురా!

రాజశేఖరరెడ్డి: కేవీపీ , నీ అభిప్రాయం చెప్పు
కేవీపీ: అందరికీ పనికొచ్చే ఉపాయం ఒకటుంది.. వెంటనే రెండో ఎస్సార్సీ వేద్దాం
కేసీయార్ ఉలిక్కిపడ్డాడు. “అదేంటి, మాకది పనికి రాదు. మేం ఎస్సార్సీకి వ్యతిరేకం”
కేవీపీ: సరే అయితే, నారాయణ చెప్పినట్టు తీర్మానాలు చేసేద్దాం, పనైపోద్ది.
కేసీయారు: ఒద్దొద్దు.. ఎస్సార్సీయే వేద్దాం.
నారాయణ: కేసీయార్ గారూ అదేంటండి.. తీర్మానం చేస్తే మంచిదేగదా మీకు, వెంటనే మీ డిమాండు నెరవేరుద్ది గదా!
కేసీయారు: (ఆ తరవాత నేనేం చెయ్యనూ? ) ఎస్సార్సీ వేస్తే పని జర స్పీడుగైతదండి.
నారాయణ: అదెలాగ?

కేవీపీ: నేజెపుతా. ఇప్పుడూ.. రాష్ట్రాన్ని చీల్చేటపుడు ఆస్తి పంపకాల దగ్గర గొడవలౌతాయి కదా.. వాటిని పరిష్కరించుకోడానికి ఒక కమిషను ఎలాగూ వెయ్యాల్సి ఉంటుంది. అదేదో ఎస్సార్సీ వేస్తే పనిలోపనిగా ఆ పని కూడా అయిపోద్ది గదా, దాంతోటి తెలంగాణ రెట్టింపు వేగంగా వచ్చేస్తుంది.

రాఘవులు: తెలంగాణ వచ్చీ రాగానే తెరాసలో ఆ ఏడెనిమిదిమందిని కూడా మీరు లాగేస్తారు గదా. ఇక అందులో కేసీయారు, ఆయన కొడుకూ అల్లుడే మిగులుతారు.
కేసీయారు: సూరీడూ, దూపయితాంది, నీల్లియ్యి. రాగవులు గారూ, గిదేం మంచిగ లేదు. ఈ మీటింగుకు ముందె గద, కేవీపీతో మాట్టాడిన.. గట్ల జెయ్యనని చెప్పిండు!
రాఘవులు:నువ్వు నమ్మేసావు! సరే కానివ్వు. అయినా నువ్వు చేసిన పనికి మీవాళ్ళు నీమీద తిరుగుబాటైనా చేస్తారు చూడు.
కేవీపీ : రాఘవులూ కాస్త ఆపుతావా? …అంచేత, ఎస్సార్సీ వేద్దాం.

బాబు: కానీ ఆ ఎస్సార్సీ తన నివేదికను వెంటనే ఇవ్వాలి కదా?
కేవీపీ: కమిటీ తన నివేదికను ఆగమేఘాల మీద ఇచ్చే ఏర్పాటు మనం చేద్దాం, మన చేతిలోని పనేకదా
నారాయణ: ఎలా?
కేవీపీ: ఆ కమిషనులో మా లగడపాటినీ, సర్వే సత్యనారాయణనీ వేద్దాం.
రోశయ్య (చప్పట్లు కొడుతూ): భలే, భలే! చక్కటి కాంబినేషను.

బాబుకు రాఘవులుకు ఆసక్తి కలిగింది. ఉత్సాహంగా చర్చలో పాల్గొన్నారు.
బాబు: మా యనమల రామకృష్ణుణ్ణి కూడా వేద్దాం.
రాఘవులు: గాదె వెంకటరెడ్డినీ, టీజీవెంకటేషును కూడా వెయ్యండి.
రాజశేఖరరెడ్డి: కేవీపీ, అవునయ్యా, టీజీవెంకటేషును కూడా వెయ్యి. కమిటీ పని వేగవంతం అవుతుంది. అవునూ మధు యాస్కీని, గోనె ప్రకాశరావును కూడా వేస్తే బాగుంటుందేమో!?
కేవీపీ: బ్రహ్మాండం, కమిటీ మంచి తూకంగా ఉంటుంది. చంద్రశేఖర్రావ్, మీవాళ్ళ పేరేదైనా చెప్పు.
కేసీయారు: ఎవరో ఎందుకూ? నేనే ఉంటా.

రాఘవులు: మా పార్టీ తరపున తమ్మినేని వీరభద్రాన్ని పెడదాం.

నారాయణ: ఎస్సార్సీలో రాజ్యంగ నిపుణులు ఉండాలేమో కదండీ. రాజకీయ నాయకులను వేసేస్తున్నారేంటి?
రాజశేఖరరెడ్డి: అదేమంత గొప్ప సంగతేమీ కాదులేవయ్యా. నేను చూసుకుంటాలే!.
రోశయ్య: మా లగడపాటి రాజ్యాంగ నిపుణుడేగా. ఆయన కంటే ఎక్కువ రాజ్యాంగం తెలిసినవాళ్ళున్నారా? పైగా మొదటి ఎస్సార్సీ నివేదికను క్షుణ్ణంగా చదివాడు కూడాను.

నారాయణ:  కమిటీ చేస్తున్న పని గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు స్పష్టంగా చెప్పేందుకు మంచి అధికార ప్రతినిధి ఉండాలండి.
రాజశేఖరరెడ్డి: ఒక్కడు కాదయ్యా, ఇద్దర్ని వేద్దాం. మా జానారెడ్డి, కేశవరావు ఉన్నారు గదా!  వాళ్ళైతే అన్ని వివరాలనూ ప్రజలకు అర్థమయ్యేలా చక్కగా చెబుతారు.

బాబు: బావుంది. సభ్యులు ఎంత చురుకైన వాళ్ళున్నా.. అధ్యక్షుడు స్పీడుగా లేకపోతే పని చకచకా సాగదు. దానికి సరైన వ్యక్తి ఎవరో?
కేవీపీ: ఇంకెవరు, మా ప్రణబ్ ముఖర్జీ ఉన్నాడు గదా. ఆయనే దీనికి సరైన వ్యక్తి.

నారాయణ:
ఏమోనండి, ఈ ఎస్సార్సీ అదీ.. అంత తొందరగా తేలే వ్యవహారంగా అనిపించడం లేదు. నేరుగా సభల్లో తీర్మానాలు పెట్టి తేల్చేయకుండా ఎస్సార్సీ అంటున్నారు.
కేసీయారు: నారాయణ గారూ.. ముందు మీ పళ్ళెం దిక్కు చూడండి.. రాగవులు మీ చికెను ముక్కల్ని తీసుకుంటాండు.
నారాయణ: బాబు గారూ ఏంటండీ ఇది? నేనసలు రాఘవులు గారి పక్కన కూచ్చోనని చెప్పాను. మీరేమో బర్దన్‌తో చెబుతానని భయపెట్టి బలవంతాన ఇక్కడ కూచ్చోబెట్టారు. ఇప్పుడు చూడండి.. నాలుగు ముక్కలు తగ్గాయి.
బాబు: ఇక ఆపవయ్యా నారాయణా. పోదాం పదండి. మనం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ సుడిగాలి వేగంతో ముందుకు పోతుంది.  
కేవీపీ: ఇంకో సంగతి.. ఎస్సార్సీ పని అనుకున్నంత వేగంగా జరగడం లేదని ఎప్పుడైనా మనకు అనిపిస్తే, దాన్ని బలోపేతం చేసేందుకు కొందరు రిజర్వులను కూడా ఆలోచించి పెట్టుకున్నాం.
బాబు: ఎవరు?
కేవీపీ: మమతా బెనర్జీ, సుబ్రహ్మణ్యం స్వామి
రాజశేఖరరెడ్డి: బాగుంది, బాగుంది. ఇక తెలంగాణ ఏర్పడకుండా అడ్డుకోవడం ప్రపంచంలో ఏ శక్తికీ సాధ్యం కాదు.

సమావేశం ముగించి అందరూ వెళ్ళిపోయారు.

అన్నయ్యల పోటీ

August 18, 2008 8 comments

రాజకీయాలంటే అనేకానేక నిర్వచనాలతో పాటు భావోద్వేగాల ఆట అనే ఒక వ్యుత్పత్తి కూడా ఉండుంటుంది. ఏదో రకంగా ప్రజల సెంటిమెంటు మీద ఆటాడాలి, వోట్లను వేటాడాలి. (ఆ పైన ప్రజలను చెండాడాలి). అందుకోసం అనేకానేక పద్ధతులను మనవాళ్ళు కనిపెట్టారు. అన్నయ్యను మించిన సెంటిమెంటలు వస్తువు మరోటి లేదని మన రాజకీయులు నమ్మడమే కాదు నిరూపించారు కూడాను. అఖిలాంధ్ర ఆడపడుచులకు అన్నను అంటూ ఎన్టీవోడు వచ్చినపుడు కాంగ్రెసోళ్ళు ‘ఏడిసాడు, ఈ నాటకాలు మన ముందా’ అనుకున్నారు. ‘ఈడు రామారావు కాదు, డ్రామారావు’ అన్నారు. ఆనక జరిగిన ఎన్నికల్లో ఏం జరిగిందో తెలిసి, కాంగ్రెసు తేరుకునేలోపు రామారావు ముఖ్యమంత్రి అయిపోయాడు.

అన్న మహాప్రస్థానం తరవాత, మరొక అన్న రాలేదు. ఇప్పుడు అన్నయ్యగా చిరంజీవి వస్తున్నాడు. చిరంజీవి అసలు పేరు వేరే ఏదో ఉంది. ఆ పేరుతో ఎవరూ పిలవరు, తానే చిరంజీవిగా పేరు మార్చుకున్నాడు కాబట్టి. చిరంజీవి అనే కాకుండా చిరు అనీ, సినిమా నటుడు కాబట్టి మెగాస్టారు అనీ పిలుస్తున్నారు. అదే కాకుండా, ఆయన వీరాభిమానులు అన్నయ్య అని పిలుస్తూంటారు. రాజకీయాల్లో దిగాక, బహుశా వోటున్నవారందరికీ ఈ పెట్టుడు బంధుత్వాన్ని విస్తరించే ఆలోచన ఉండొచ్చు. ఎన్‌టీవీ లాంటి కొన్ని వార్తా ఛానెళ్ళు కూడా అన్నయ్య అంటూ ఉంటాయి.

ఈ పేర్లన్నిటిలో ఏది పనికొచ్చినా లేకున్నా.. అన్నయ్య అనేది మాత్రం రాజకీయాల్లో బాగా పనికొస్తుంది. అయితే ఈ పెట్టుడు బంధుత్వం మీద పోటీ నెలకొందేమోనని అనిపిస్తోంది.

పాపం, కాంగ్రెసోళ్ళకు సొంత బంధువులంటే ఉన్న సెంటిమెంటు ఈ పెట్టుడు బంధుత్వాలంటే ఉండదని అని నేను అనుకుంటూ ఉండేవాడిని. అయితే మన ముఖ్యమంత్రి వేరు -పురుషులందు కాపురుషులు, ఉత్తపురుషులు, పుణ్యపురుషులు వేరయా అన్నట్టు! ఆయనకు పెట్టుడు బంధుత్వాల పట్ల కూడా సెంటిమెంటున్నట్టు తోస్తోంది. అన్నయ్య హోదాలోని మహత్తును గ్రహించినవాడు కాబట్టే, ఆయన చెల్లెమ్మ సబిత నియోజకవర్గానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చాడు. ఏ కొత్త కార్యక్రమమైనా చేవెళ్ళ నుండి మొదలుపెట్టాల్సిందేననే సంప్రదాయాన్ని ఆచరిస్తూ తానెంత సెంటిమెంటలు వ్యక్తినో ప్రజలకు చెప్పకనే చెప్పాడు. అయితే, ఎంచేతోగానీ తెలుగాడపడుచులు ఆయన్ను అన్నయ్యగా భావించినట్టు కనబడలేదు. మీసాల సైజు కాస్త తగ్గించుకుని, నవ్వును కాస్త కత్తిరించుకుని ఉంటే సత్ఫలితాలుండేవేమోనని నా అనుమానం. ఏదో ఒకటి చేసి, తెలుగాడపడుచులచేత అన్నయ్యా అని నోరారా పిలిపించుకోవాల్సిందే అని రాజశేఖరుడు అనుకున్నట్టుంది.

శనివారం నాటి పత్రికలు చూసినవాళ్ళు ప్రభుత్వం – అనగా ముఖ్యమంత్రి – ఇచ్చిన ఖరీదైన ప్రకటనను గమనించే ఉంటారు. ముఖ్యమంత్రినైనా మీకు అన్నయ్యనే అంటూ రాజశేఖరరెడ్డి ఈ ప్రకటనల్లో ఆడపడుచులందరికీ గుర్తు చేసాడు. చిరంజీవిని అన్నయ్య అని ఎక్కడ అనేస్తారోనని సెంటిమెంటుతో ముందస్తు బంధాలు వేసేసాడు. చాలా ఉద్వేగంగా “అమ్మా, అన్నయ్యను నేనున్నా. మీకు ఏ లోటూ రానివ్వను.” అన్నాడు. ఇంకా “మీ సోదరుడిగా జీవితాంతం తరిస్తానని మాటిస్తున్నా. రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా మీకు అన్నయ్యనేనని మరోసారి స్పష్టం చేస్తున్నా” అని మరోసారి గుర్తు చేసాడు. మరి ఆడపడుచులు ఈ బంధాలకు కట్టుబడతారో లేక ఈయన్ని పెద్దన్నయ్య ఆయన్ని చిన్నన్నయ్య అని అనుకుంటారో చూడాలి.

అయితే ఈనాడులో ఒక చమక్కు మెరిసింది. సుబ్బరంగా డబ్బుల్దీసుకోని, ప్రకటన అచ్చేసి, అదే పేజీలో కింద, ఇదీ సంగతంటూ ఓ కార్టూనేసాడు. ఆ కార్టూనులో ఉన్నది రాజశేఖరరెడ్డి కాదులెండి, పదవిలో ఉన్న ఓ రాజకీయుడు, అంతే! (సూరీడు లేడు కాబట్టి) అయితే ఆ రెంటికీ లింకు కలిపి చూస్తే సర్దాగా అనిపించింది, అంతే!

టీవీ తొమ్మిది వాడేమైనా తక్కువ తిన్నాడా? రజనీకాంతున్నాడు కదా (యాక్టరు కాదు యాంకరు).. మొన్నోరోజు ఓ ఇద్దరిని పిలిచి అన్న గొప్పా, అన్నయ్య గొప్పా అని చర్చ పెట్టాడు. (అన్నంటే ఎన్టీయారు, అన్నయ్యంటే చిరంజీవి — రాజశేఖరరెడ్డి అప్పటికింకా పోటీలో లేడు) ఎట్టైనా గానీ, అన్నయ్య అన్నకు సాటిగాదు అని వాళ్లచేత చెప్పించాలని నానా ప్రయాస పడ్డాడు. ‘చెప్పండి… అన్నయ్య అన్నంతటి డైనమిక్కు కాదుగదా‘ అని అడుగుతాడు. ‘అప్పుడే ఎలా చెబుతాం, అన్నయ్య ఇంకా రాజకీయాల్లో దిగనే లేదు కదా‘ అంటూ ఇలాంటిదేదో చెప్పి వాళ్ళిద్దరూ తప్పించుకుంటారు. ‘నిఝెం చెప్పండి.. అన్నకున్నంతటి ఊపు అన్నయ్యకు లేదు కదా‘ అని మళ్ళీ అడుగుతాడు. వాళ్ళూ తక్కువ వాళ్ళేం కాదు,  ఏదో అర్థం పర్థం లేని లాజిక్కేదో లాగి, తప్పించుకుంటారు. ఇలా ఓ అరగంటో ఏమో ప్రయత్నం చేసి ఇహ వాళ్లచేత అవుననిపించలేక ఆ కార్యక్రమం ముగించాడు. ఆ అతిథులిద్దరిలో ఒకరు లక్ష్మీ పార్వతి, మరొకరు రామ్మోహన నాయుడు. ఈయనెవరో నాకు తెలీలేదు.

తెలుగువారి అన్నయ్య ఎవరో మరి!
——————————-

ఈ పేజీలోని బొమ్మలను ఈనాడు వెబ్‌సైటు నుండి తీసుకున్నాను. కేవలం సూచనామాత్రంగానే వాడుకున్నాను, పైగా వారి సైటుకు లింకు ఇచ్చాను కాబట్టి అనుమతి అవసరం లేదని అనుకున్నాను. వారికి ఇబ్బంది కలిగితే తక్షణం తీసేస్తాను.

దేశం తలపట్టుకుంది

నారదుడు లోకసంచారం చేస్తూ, భారతం మీదుగా పోతుంటే ఢిల్లీ కనిపించింది. ‘చాన్నాళ్ళైంది ఢిల్లీ చూసి, ఓసారెళ్ళొద్దాం’ అనుకుని కిందికి దిగి జనపథాల వెంటా, రాజపథాల వెంటా నడుస్తూ పోతూంటే అనేక మంది నాయకులు కనిపించారు. అందరూ కూడా తలపట్టుకుని కూచ్చుని ఉన్నారు. ఏదో దిగులుగా ఉన్నట్టున్నారు. ఏం జరిగిందో తెలుసుకుందామని ఆగాడు.

ప్రధాని తన ఇంట్లో, తన గదిలోనే తలపట్టుకుని కూచ్చుని ఉన్నాడు. ఆఫీసుకు పోలేదు. యావైందని అడిగాడు, నారదుడు.

“అయ్యా నారదుడు గారూ, ఏం చెప్పమంటారు, ఏనాడన్నా కుర్చీలో కూచ్చుని ఉంటే తెలిసేది మీకు, గమ్మెంట్ నడపడం ఎంత కష్టమో! బాధ్యతలను మాత్రం తనకప్పజెప్పి, అధికారాలన్నిటినీ ఇంద్రుడికిస్తే యమధర్మరాజు పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు! ప్రస్తుతం నా పరిస్థితీ అలానే ఉంది. బుష్షేమో పొద్దునోసారి, రాత్రికోసారీ ఫోను చేసి, ‘వాట్ మ్యాన్, మీటింగుకు వస్తన్నావా’ అని అడుగుతున్నాడు. ఎర్రదొరలేమో నా కాల్జేతులు కట్టేసారు. ప్చ్! ఏంజెయ్యాలో అర్థం కావడం లేదు” అని చెప్పి మన్మోహన్ సింగు తన రెండు అరచేతుల వెనక భాగాలతో రెండు కళ్ళను తుడుచుకున్నాడు.

నారదుడు ఆయనపై జాలిపడుతూ, సోనియా ఇంటికేసి వెళ్ళాడు. ఆమె కూడా తలపట్టుకుని ఉంది. హామెక్కూడా అంత అవసరం ఏమొచ్చిందని హాశ్చర్యపోయాడు నారదుడు. ఏంటి సంగతని అడిగాడు. హిందీ ఇంగ్లీషుల్లో ఏదో చెప్పిందిగానీ, అర్థం కాలేదు. ‘పోన్లే ఇటాలియనులో చెప్పమ్మా’ అని ఇటాలియనులో అడిగాడు. గండి పడిన చెరువు పరిస్థితి ఐపోయింది ఆమెది. ప్రవాహంలా మాట్టాడేసింది. దానర్థం తెలుగులో ఇది:

“మీరెవరో నాకు తెలీదుగానీ, గత ఐదేళ్ళలోనూ ఈ ముక్క నన్నడిగినవాడే లేడు. అందుకు మీకు నా గ్రేజీ! ఈ ఎర్రపార్టీ వాళ్ళని చూసారుగా.. ఇంత మొండిఘటాలను నేనెక్కడా చూళ్ళేదండి. ప్రతీ పనికీ అడ్డం పడతన్నారు. ఏ మాట మాట్టాడాలన్నా, ఏ పని చెయ్యాలన్నా వాళ్ళ అనుమతి తీసుకోవాలంట. మొన్న మా మనవరాలి పుట్టినరోజునాడు గౌను కొందామని చాందినీ చౌకుకు వెళ్ళాను. మమ్మల్నడక్కుండా ఎందుకెళ్ళావని ఏచూరి సీతారామ్ గారి పియ్యే గారి పియ్యే ఫోనుచేసి అడిగాడు. ఆ సంగతి మాట్టాడేందుకు రేపు యూపీయే సమావేశం పెట్టాం, అక్కడికొచ్చి సమాధానం చెప్పుకొమ్మని కూడా చెప్పాడు. ఇది చాలదన్నట్టు బర్దన్, మ్యాన్‌మోను మళ్ళీ బెదిరించాడట.”

బర్దన్ అనగానే ఎవరో నారదుడికి అర్థమైంది గానీ, ఈ మ్యాన్‌మో ఎవరో అర్థం కాలేదు. “మ్యాన్‌మో నా? ఆయనెవరూ?”

“అదేనండీ మా మ్యాన్‌మోహన్ సింగ్! నిన్న సంతకాల రిపోర్టు పంపడం మర్చిపోయాడట.”

‘ఓహో, మన్మోహన్ సింగు పేరుకొచ్చిన బాధలా ఇవి!!’ అని నారదుడు మనసులో అనుకుని “సంతకాల రిపోర్టా? అదేంటి?” అని ఆమెను అడిగాడు.

“అదేనండి, ప్రతిరోజూ ఎన్నెన్ని సంతకాలు ఎక్కడెక్కడ పెడుతున్నాడో చెప్పే రిపోర్టు. కమ్యూనిస్టుల కోసం ప్రతిరోజూ ఆ రిపోర్టు తయారుచేసి, పంపించాలి. అది పంపించకపోయేసరికి బర్దన్‌కు కోపమొచ్చింది. తనకు ఫోను చెయ్యమని పియ్యేతో చెప్పించాడట. పాపం మ్యాన్‌మో ఫోను చేస్తే ‘మీ ప్రభుత్వం ఎన్నాళ్ళుంటుందో చెప్పలేనుగానీ ఈ రోజు సాయంత్రం ఆరు గంటల కల్లా నిన్నటిదీ, ఇవ్వాళ్టిదీ, రేపటిదీ సంతకాల రిపోర్టులు గనక రాకపోతే.. ఆరూ ఒకటికి మేం రాష్ట్రపతి దగ్గరకు బయల్దేరతాం’ అని అన్నాడట.”

“రేపటి రిపోర్టు ఇవ్వాళా!!!” నారదుడు ఆశ్చర్యపోయాడు. సోనియాకు మాత్రం అది తనకు మామూలేనన్నట్టు ఆయన ఆశ్చర్యాన్ని కించిత్తు గూడా పట్టించుకోలేదు.

“ఇన్ని కష్టాలా? పాపం!” అని మళ్ళీ తనే అన్నాడు నారదుడు.

“అంతేనా.. ఇంకా వినండి. ఇప్పుడు ఇంకో కష్టమొచ్చింది. ఈ ఎరుపు బెదిరింపులు విని భరించలేక మ్యాన్‌మో మళ్ళీ అలిగాడట. అన్నం తినను, ఆఫీసుకు పోను అని ఇంట్లోనే తలుపులేసుకుని కూచ్చున్నాడట. ఎంత పిలిచినా తీయడం లేదు. కిటికీలోంచి రాజీనామా కాగితం విసిరేసాడట. ఇప్పుడే కబురొచ్చింది. నే వెళ్తున్నా మరి!” అని వెళ్ళిపోయింది.

అక్కడి నుండి బయల్దేరి, కమ్యూనిస్టుల ఆఫీసుల మీదుగా పోతూండగా అక్కడ అన్ని రకాల కమ్యూనిస్టులూ ఒకచోట చేరి తలలు పట్టుకుని ఉండడం చూసేసరికి నారదుడు చాలా ఆశ్చర్యపోయాడు. సంగతేంటయ్యలూ అని అడిగాడు వెళ్ళి. చూడగానే నారదుణ్ణి గుర్తుపట్టేసారు అక్కడివాళ్ళు. నలుగురైదుగురు తప్పించి అందరూ కాళ్ళ మీదపడిపోయారు – నన్ను దీవించండంటే, నన్నే దీవించండంటూ! అందరికీ కలిపి దీర్ఘాయుష్మాన్‌భవ అని ఆశీర్వదించి ఇప్పుడు చెప్పండని అడిగాడు. అందరూ ఒక్కసారే మాట్టాడ్డం మొదలెట్టారు. ‘అలాక్కాదు ఆగ’మని చెప్పి, ‘అందరి తరపునా నువ్వు చెప్పు కారత్’ అన్నాడు.

“అధికారం మా కనుసన్నల్లో ఉందన్నమాటేగానీ మేం అనుకున్నవేమీ చెయ్యలేకపోతున్నాం. చైనా వెళ్ళి తియానాన్మెన్ స్క్వేర్‌లో పొర్లు దండాలు పెట్టుకు రమ్మని ప్రధానమంత్రికి చెప్పాం -వెళ్లలేదు. బుస్ష్షుని ఫోన్లో పిలిచి, సాలే కుత్తే కమీనే అని తిట్టమని అడిగాం -చెయ్యలేదు. పెట్రోలు ధరలు పెంచే ముందు మాకు చెప్పనే చెప్పొద్దని చెప్పాం. మాకు చెప్పకుండా పెంచేసారని ఆ తరవాత ఉద్యమం చెయ్యొచ్చు గదా అని అనుకున్నాంలెండి. కానీ ముందే సమావేశం పెట్టి మరీ మాకు చెప్పారు. ఇలా మేమనుకున్నవి ఒక్కటీ జరగలేదు. మేమంటే అస్సలు లెక్కలేకుండా పోయింది. పైగా ఈ మధ్య సమావేశాల్లో మరీ మ్యారీ బిస్కట్లు, వన్ బైటూ చాయితో సరిపెడుతున్నారు కామ్రేడ్! ఆలోచించుకోండి మా పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో!”

“మరి ఇన్ని కష్టాలను ఎందుకు భరించాలయ్యా? ఛీ పో అని పక్కకు తప్పుకోవచ్చుగా?”

“అదేకదండీ మా బాధ! ఆ మతవాద శక్తులు బలపడతాయేమోనని కదా మేము లౌకిక శక్తులకు మద్దతు ఇస్తున్నది. ఇప్పుడు మద్దతు ఉపసంహరించుకుంటే ఎలా!!” అని, నారదుడికి బాగా దగ్గరగా జరిగి, గొంతు తగ్గించి, “బాధ్యతలేమీ లేకుండా అధికారాన్ని అనుభవించే అవకాశాన్నెవడొదులుకుంటాడు, నారదా!? నువ్వు మరీనూ!” అన్నాడు కారత్.

నారదుడు కూడా గుసగుసగానే “ఔనౌను నిజమే, నిజమే!” అని, మళ్ళీ బిగ్గరగా “అవునూ.., మతవాద శక్తులంటే ఏవి?” అని అడిగాడు.

కారత్ వెంటనే లేచి, కాస్త ముందుకెళ్ళి, వీళ్ళందరివైపు తిరిగి నిలబడి, చేతిలో మైకు పట్టుకున్నట్టు అభినయిస్తూ, “కామ్రేడ్స్, మతవాద శక్తులనగా బీజేపీ” అని అన్నాడు. అక్కడితో ఆగకుండా “అది మతవాద శక్తే కాదు, సామ్రాజ్యవాద, బూర్జువా, నయా రివిజనిస్టు..”

ఆయన మాటలను అలా వింటూంటే, నార తీసెయ్యగలడని గ్రహించిన నారదుడు కారత్ ఇలా మాట్టాడుతూండగానే మాయమై సురలోకానికి పయనమయ్యాడు.

యమధర్మరాజును కలిసి చాన్నాళ్ళైందని గుర్తొచ్చి, ఓ సారి పలకరించిపోదామని అటుగా వెళ్ళాడు. అక్కడ ఆయన కూడా తలపట్టుకు కూచ్చున్నాడు. దండధరుణ్ణి ఆ విధంగా చూసేసరికి నారదుడికి మళ్ళీ ఆశ్చర్యం కలిగింది. “యమరాజా ఏంటి సంగతి అలా ఉన్నావు?” అనడిగాడు.

“నారదా, తెలుగు సినిమావాళ్ళ కారణంగా నేను ఇప్పటికే నవ్వుల పాలయ్యాను. ఇప్పుడు రాజశేఖరు చూడు, నన్ను తన పార్టీలోకి రమ్మంటున్నాడు.” అన్నాడు యముడు.

“ఇతర దిక్పాలకులను ఇప్పటికే కబ్జా చేసాడు. కుబేరుణ్ణి ఏకంగా ఇంటోనే పెట్టుకున్నాడు. ఇప్పుడు నీతో కూడా పనిబడిందా? ఏంటో పని?” అని మనసులో అనుకున్నట్టుగా బయటికే అన్నాడు నారదుడు.

మళ్ళీ తనే “అయినా వెళ్తేనే నీకు మంచిది సమవర్తీ! తనమాట వినకపోతే ఎంతటివాడినైనా వెంటాడి, వేటాడి, హింసించే గుణముంది అతడిలో.”

“ఇప్పుడు నన్ను రమ్మంటున్నది కూడా అందుకేనయ్యా, నారదా. ఈమధ్య ఆంధ్రదేశాన ఆయనకు శత్రువులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నారట. వాళ్లందరినీ దారిలో పెట్టేందుకు నేను ఆయనతో చేరాలట. చూడు ఎంత అన్యాయమో!”

“హతోస్మి, వెళ్ళిరా!” అని చెప్పి. ‘నేనూ ఓసారి ఆంధ్ర దేశానికి వెళ్ళి అక్కడి పరిస్థితి చూసి రావాలి’ అని అనుకుంటూ సత్యలోకం వైపు సాగిపోయాడు.