Archive

Archive for the ‘వ్యక్తులు’ Category

తెలంగాణ ఉద్యమాన్ని లేవదీసే ప్రయత్నం

October 22, 2009 8 comments

సిద్దిపేటలో ఉద్యోగుల గర్జన పేరుతో అక్టోబరు 21న తెరాస నిర్వహించిన సభను టీవీలో చూసాను. హైదరాబాదును ఫ్రీజోనుగా ప్రకటిస్తూ (పోలీసు నియామకాలకు సంబంధించి) సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ తెలంగాణా ఉద్యోగ సంఘాలతో కలిసి పెట్టిన సభ ఇది.

రాష్ట్రప్రభుత్వం కోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషను వేద్దాం అని అంటోంది. మొన్న అఖిలపక్ష సమావేశంలో కూడా ఆ ముక్కే చెప్పింది. తెరాస, లోక్‌సత్తా తప్ప మిగతా అన్ని పక్షాలూ అందుకు సరేనన్నాయి. ప్రజారాజ్యం ఏంజెప్పిందో ఏంటోగానీ, విషయాన్ని కూలంకషంగా పరిశీలించేదుగ్గాను (!!!) ఒక పార్టీ కమిటీని మాత్రం వేసింది.

తెరాస ఏమంటున్నదంటే-
రివ్యూ పిటిషను వల్ల ప్రయోజనమేమీ ఉండదు. వాళ్ళిచ్చిన తీర్పును పరిశీలించండని మళ్ళీ వాళ్ళనే అడిగితే ఉపయోగమేముంది? దానికి చెయ్యాల్సిందల్లా ఒకటే.. రాజ్యాంగాన్ని మార్చాలి, హై. ఫ్రీజోను కాదని ప్రకటించాలి. 1972 లో జైఆంధ్ర ఉద్యమం తరవాత ఇలాంటి పనే చేసారు, ఇప్పుడు చెయ్యడానికేంటి బాధ?

ఎన్నికల్లో దెబ్బతిని, అచేతనంగా పడున్న ఉద్యమానికి కొత్త జవసత్వాలనిచ్చి మళ్ళీ నిలబెట్టడానికి కేసీయారుకు వచ్చిన మహదవకాశం ఈ ఫ్రీజోను తీర్పు. ముందు పెద్దగా పట్టించుకున్నట్టు కనబడని కేసీయారు ఎంచేతో కాస్త నిదానంగా మేల్కొన్నాడు. సిద్ధిపేట సభతో ఉద్యమాన్ని చైతన్యపరచే ప్రయత్నం చేసాడు.

~~~~~~~~~~~

సిద్ధిపేట సభలో మాట్టాడినవారందరి వాదన ఏంటంటే.. ఫ్రీజోను అనే ప్రకటన ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుంది. రేప్పొద్దున తెలంగాణ ఏర్పడే పక్షంలో, ఈ ఫ్రీజోను అనే భావనను మరింత ముందుకు తీసుకుపోయి, హై.ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసి, రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా నిర్ణయించమనే డిమాండు తలెత్తవచ్చు. దాన్ని అడ్డుకోవాలి.

సభకు స్వామి అగ్నివేశ్ కూడా వచ్చాడు. ఏంటో పాపం.. హిందీలో మాట్టాడుకు పోయాడు. ఏదో అగ్ని అన్నాడు, ఆగ్ అన్నాడు – మొత్తానికి అయిందనిపించాడు. సభలో తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా మాట్టాడారు. వాళ్ళ ప్రసంగాలూ చప్పగానే ఉన్నాయి.  చివరిగా కేసీయారు మాట్టాడాడు. ఆయన  చెప్పిన అంశాల్లో ముఖ్యమైనవి ఇవి:

  • ఫ్రీజోనుపై సుప్రీమ్ కోర్టు తీర్పును రద్దు చేస్తూ, రాజ్యాంగ సవరణ చెయ్యాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరాలి – అలా కోరుతూ శాసనసభ తీర్మానం చెసి కేంద్రానికి పంపాలి.
  • కేంద్రప్రభుత్వం వెంటనే రాజ్యాంగ సవరణ చెయ్యాలి.

మర్యాదగా ఈ పనులు చేసారో సరే సరి.. లేదా జరగబోయే పరిణామాలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. ఇదీ ఆయన చేసిన హెచ్చరిక.  కార్యాచరణలో భాగంగా ఆయన ప్రస్తావించిన అంశాలివి:

  • ప్రభుత్వానికి సహాయనిరాకరణ చేస్తాం. 
  • జైళ్ళు నింపుతాం.
  • హింసాత్మక ఉద్యమానికి కూడా సిద్ధమే. అందులో భాగంగా అంతర్యుద్ధం (సివిల్ వార్ అని అన్నాడు) రావచ్చు. అలా అంతర్యుద్ధమే వస్తే అందుకు ప్రభుత్వాలే బాధ్యత వహించాలి.

ఇంకో హెచ్చరిక కూడా చేసాడు: కోస్తా, సీమ ప్రాంతాలకు చెందిన పత్రికాధిపతులు, ఇతర మాధ్యమాల అధిపతులు, తెలంగాణలో స్థిరపడ్డ కోస్తా, సీమలకు చెందిన పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు,.. వీళ్ళంతా కూడా ఫ్రీజోను ఉత్తర్వును రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ చెయ్యాలని డిమాండు చెయ్యాలి.

ప్రసంగంలో కేసీయారు చంద్రబాబుపై చేసిన విమర్శ ప్రత్యేక ఆకర్షణ. ముఖ్యమంత్రిగా ఉండగా నువ్వే జారీ చేసిన 124 జీవోను ఈ ప్రభుత్వం అమలు చెయ్యకపోతే అదేంటని నిలదీయలేని నువ్వేం ప్రతిపక్షనేతవు అని గద్దించి అడిగాడు. ఛి, చ్ఛీ అని ఈసడించాడు. ఫ్రీజోను గురించి గట్టిగా వ్యతిరేకించకుండా, 6 సూత్రాల ఒప్పందాన్ని కాపాడాలంటూ తీపి తీపి కబుర్లు చెబుతున్నాడని విమర్శించాడు. నీకు మగటిమి ఉంటే.. రా, జైల్‌భరోలో పాల్గొను అని సవాలు చేసాడు.

2004లో ప్రధానమంత్రి అయ్యాక విలేకరుల సమావేశంలో మన్మోహన్ సింగు చేసిన ప్రసంగాన్ని వినిపించి, ‘ఇదిగో, తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పిన నువ్వే మాట తప్పావు. నువ్వేదో సచ్ఛీలుడివని అంటారు.. నువ్వు అటువంటివాడివే అయితే, నువ్వు ఒకరి చేతిలో కీలుబొమ్మవే కనక కాకపోతే, నీకంటూ ఒక అస్తిత్వం ఉంటే.. ఇచ్చిన మాట నిలుపుకో ‘ అని హితబోధ చేసాడు. ఇదంతా హిందీలో!

రోశయ్య గురించి చాలా చెతుర్లాడాడు. అఖిలపక్ష సమావేశంలో అబద్ధాలు చెప్పాడని విమర్శించాడు. ఒక పిట్టకథ చెప్పాడు. రాశేరె చచ్చిపోయాక ఆయన్నొకరు “రాజశేఖరు పోయాడుగదా నీకు మంచిగుందా అన్నా” అని అడిగారట. తాను “ఆయనుంటేనే బాగుండేది, ఏదన్నా ఫైటింగు చెయ్యాలన్నా మంచిగుండేది. ఇప్పుడొచ్చిన ఈ పెద్దాయన్ను చూడు, ఏదన్నా అనాలంటే ఒక బాధ, అనకపోతే ఇంకో బాధ” అని సమాధానం చెప్పాడట..

కేసీయారు ప్రసంగంలో కొత్త నినాదాలూ వచ్చాయి:

  • జాగో తెలంగాణావాలే  భాగో ఆంధ్రావాలే
  • ఫ్రీజోను కాదురా, హైదరాబాదు మాదిరా!

కేసీయారు ప్రసంగంపట్ల ప్రజలనుంచి అంతగా స్పందన వచ్చినట్టు కనిపించలేదు. బహుశా టీవీలో చూస్తుంటే తెలియలేదేమో! నాకు మాత్రం ప్రసంగం చాలా నచ్చింది. ఆయనలాగా ప్రసంగించగలిగిన నాయకుడు రాష్ట్రంలో మరొకరు లేరని ఇంకోసారి తేల్చిచెప్పిన ప్రసంగం ఇది. చంద్రబాబు మీద నిప్పులు చెరిగినా, మన్మోహను సింగును నిలదీసినా, రోశయ్యను చమత్కార ధోరణిలో విమర్శించినా, రచ్చబండమీద కూచ్చుని కబుర్లు చెప్పిన చందంగా మాట్టాడినా,.. కేసీయారుకు సాధ్యపడినట్టుగా ఇంకో నాయకుడికి కుదరదు. చక్కటి తెలంగాణా యాసలో ఓ గంటసేపు చెడుగుడు ఆడుకున్నాడు. పేరుకు ఉద్యోగుల గర్జన ఐనా, ఇది కేసీయారు గర్జన.

Advertisements

మన ప్రాధాన్యతలెక్కడున్నాయి

లక్కు అనితారెడ్డి ఎవరో మీకీ పాటికి తెలిసే ఉంటుంది. బీచి వాలీబాలు ఆటలో బరి నుండి బంతి బయటికి పోయినపుడు దాన్ని తిరిగి ఆటకత్తెలకు అందించటానికి ప్రత్యేకించి కొందరిని నియమించారు – బాల్‌గర్ల్స్, బాల్ బాయ్స్. అక్కడ బంతి అందించే వ్యక్తిగా అనిత పనిచేస్తోంది. ఏప్రిల్ 5 నాటి ఈనాడు ఆమె గురించి రాసింది. ఈనాడు ఇలా అంటోంది..

“…నిజానికి ఆ అమ్మాయి సాధించిన విజయాలతో పోల్చితే ఆ బీచి వాలీబాలు క్రీడాకారిణులు లెక్కలోకి రారు. అక్కడున్నవాళ్లలో ఎవరికీ తెలియదు ఆమె జిమ్నాస్టిక్స్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించిందని…”

జిమ్నాస్టిక్స్‌లో అంతర్జాతీయపోటీలు ఆడి కూడా, సరైన ప్రోత్సాహం లేదని గ్రహించి ఆ తరువాత వాలీబాలు ఆడటం మొదలుపెట్టి, జాతీయ స్థాయికి ఎదిగింది. అలాంటి అనితారెడ్డి ఇక్కడ, ఈ ఆటలో.. బంతులందిస్తోంది. జాతీయ స్థాయికి చెందిన ఒక క్రీడాకారిణికి మంచి గుర్తింపే!!! వాలీబాలు, బీచి వాలీబాలుల పట్ల మన ప్రాధాన్యతలవి.

అయినా అనితారెడ్డి దాన్ని చిన్నతనంగా భావించటం లేదు.. అది ఆమె హుందాతనం.

శభాష్ అనితా!

"మహాకవి శ్రీశ్రీ" జీవిత చరిత్ర

December 9, 2007 24 comments

1983లో అతడు భౌతికంగా మరణించినా మరికొన్ని సహస్రాబ్దాల పాటు అతడి కవిత్వం బతికే ఉంటుంది. తన జీవిత కాలంలోనే చరిత్ర ప్రసిద్ధుడైన శ్రీశ్రీ అనంతర కాలంలోనూ అలాగే జీవిస్తాడు. కవిత్వమున్నంత కాలం, కవిత్వ రసాస్వాదన ఉన్నంత కాలం కవితానుభూతి ఉన్నంత కాలం అతడు ఉంటాడు. ” శ్రీశ్రీ జీవిత చరిత్ర పుస్తకాన్ని ముగిస్తూ రచయిత రాసిన వాక్యాలివి.

కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి, ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవి లేనే లేడు. ఇదే అతణ్ణి సాహితీ శిఖరాగ్రాన నిలిపింది“. శ్రీశ్రీ కవిత, “కవితా ఓ కవితా” గురించి రాస్తూ ఆ పుస్తకంలోనే రచయిత అన్న మాటలివి.

ఎన్నోసార్లు నిరీశ్వరవాదినని బడాయి మాటలు చెప్పిన శ్రీశ్రీ తిరుమల కొండ మీద శాస్త్ర సంప్రదాయానుగుణంగా తన కొడుకు ఉపనయనం చేశాడు. ఢిల్లీ కన్నడ సాహిత్య పరిషత్తు వారు బహూకరించిన మురళీ కృష్ణుడి చందన విగ్రహాన్ని ఆత్రంగా పొట్లాం విప్పి, బహిరంగంగా కళ్ళకద్దుకున్నాడు.” ఇవీ ఆ పుస్తకంలోని వాక్యాలే!

కేంద్ర సాహిత్య అకాదెమీ వాళ్ళు వేసిన ఈ “మహాకవి శ్రీశ్రీ” ని రాసింది బూదరాజు రాధాకృష్ణ. ఆయన ముక్కుసూటి మనిషని, నిర్మొహమాటస్తుడని ఎక్కడో చదివాను. మరి శ్రీశ్రీ జీవిత కథను ఆయన ఎలా రాసిఉంటాడో నన్న కుతూహలం కొద్దీ ఆ పుస్తకం కొన్నాను.

జీవిత చరిత్రలను నేను చదివింది చాలా తక్కువ. చదివిన ఆ కాసిని చరిత్రలూ నాకొకలాగే కనిపించాయి. చిన్నప్పుడు ఎన్నో కష్టాలకోర్చి అనుపమానమైన కృషితో, పరిశ్రమతో పైకి రావడం, చివరికి ఏ రాష్ట్రపతో, ప్రధానమంత్రో, మంత్రో శాసనసభ్యుడో, గొప్ప సంఘసంస్కర్తో అవడం.. ఇదీ టూకీగా కథ. పుస్తకం మొత్తం ఒళ్ళు గగుర్పొడిచే గొప్పదనమే. పుస్తకం చదువుతూండగానే అంతకు ముందు చదివిన జీవితకథలు బుర్రలో రెక్కలు విప్పుకుంటూ ఉంటాయి.

అయితే ఈ పుస్తకం మాత్రం విభిన్నంగా ఉంది. రచయిత నిర్మోహంగా, నిర్మొహమాటంగా రాసాడా జీవిత చరిత్రను. వ్యక్తిగతంగా శ్రీశ్రీ లోని తప్పులను విమర్శించేందుకు ఆయన వెనకాడలేదు. “..శ్రీశ్రీ కి లేని వ్యసనం లేదు..”, “..తాగి..”, “..భగందరం అనే వ్యాధి వచ్చింది..” ఇలాంటి ఎన్నో వ్యాఖ్యలున్నాయి ఆ పుస్తకంలో. శ్రీశ్రీ వ్యక్తిత్వాన్ని మనముందు నిలబెట్టే రచన అది.. లేనిపోనివి కల్పించో, ఉన్నవాటిని దాచేసో చేసే మాయ కాదది. 8 అధ్యాయాలుగా విడగొట్టిన ఈ పుస్తకాన్ని ఇంగ్లీషు నుండి (ఇంగ్లీషులో రాసింది కూడా బూదరాజు గారే!) అనువదించారు. నాకు బాగా నచ్చిన జీవిత చరిత్ర ఇది. బహుశా శ్రీశ్రీ జీవితం ఎన్నో మలుపులూ మసాలాలతో కూడుకున్నది కావడం కూడా పుస్తకం ఆసక్తి కరంగా ఉండడానికి కారణం కావచ్చు.

“..తెలుగులో మొట్టమొదటిసారిగా పజిల్సు సృష్టించాడ”ని కూడా రాసారా పుస్తకంలో. పజిల్సంటే బహుశా గళ్ళ నుడికట్టే అయితే, తెలుగు గళ్ళనుడికట్టుకు శ్రీశ్రీయే ఆద్యుడన్నమాట! (శ్రీశ్రీ దానికి పెట్టిన పేరు పదబంధ ప్రహేళిక అనుకుంటా)

పుస్తకంలో ఆరుద్ర గురించి కూడా విమర్శనాత్మక వ్యాఖ్యలు ఉన్నాయి. ఒకచోట ఇలా రాసాడు.. “శ్రీశ్రీ షష్టిపూర్తి జరిగినప్పుడు, మదరాసులో శ్రీశ్రీ అంతిమ యాత్ర జరిగినప్పుడు ఆరుద్ర ప్రవర్తించిన తీరు కనీసం లోకందృష్టిలోనైనా హుందాగా లేదనిపించింది“. అలాగే “ఒకటి మటుకు ఖాయం. చరమదశలో శ్రీశ్రీ మానసికంగా బాధపడ్డాడు ఆరుద్ర కారణంగా. తన బహిరంగ శత్రువులెవరూ శ్రీశ్రీ నింతగా బాధించలేదు.” అనీ రాసాడు.

రాకేశ్వరుని బ్లాగులో శ్రీశ్రీ గురించి చదివాక నాకీ పుస్తకం గుర్తొచ్చింది. మళ్ళీ మొన్న బూదరాజు అశ్విన్ గారితో మాట్టాడుతూ ఉండగా ఈ పుస్తకం ప్రసక్తి వచ్చింది. శ్రీశ్రీ తన ఆత్మకథ అనంతంను కూడా ఇలాగే నిర్మొహమాటంగా రాసుకున్నారని అశ్విన్ గారు చెప్పారు. ఓ పాలి అది కూడా చదవాలి!

శభాష్, శ్రీరమణా!

October 25, 2007 4 comments

అక్టోబరు 25 న ఈనాడు పేపర్లో హైదరాబాదు విభాగంలో వచ్చిందీ వార్త! కూకట్పల్లి హౌసింగు బోర్డులో పద్దెనిమిదేళ్ళుగా ప్రజల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతుకుతున్న ఒక పిచ్చివాడు, ప్రజలందరికీ కృతజ్ఞతలు చెబుతూ, పనిలో పనిగా దసరా, దీపావళి పండగల శుభాకాంక్షలు కూడా చెబుతూ కాలనీ అంతటా బ్యానర్లు పెట్టాడంట.

నిజానికి ఈ బ్యానర్లు పెట్టింది పి.వి.శ్రీరమణ అనే వ్యక్తి.

***

రోడ్లమీదా, కాలనీల్లోనూ అలా శుభాకాంక్షలు చెప్పే బ్యానర్లు కొల్లలుగా చూస్తూంటాం. పెద్దకారు రాజకీయులకు చిన్నకారు వాళ్ళూ, చిన్నకారు సన్నకారు వాళ్ళకు వాళ్ళ చెంచాగాళ్ళూ పెడుతూ ఉంటారు ఇలాంటి బ్యానర్లు. ఫలానావాడి పుట్టినరోజు వచ్చిందనుకోండి.. “వారికి శుభాకాంక్షలు” చెబుతూ పెడతారు. ఆ ఫలానావాడు బ్యానరులో ఒక పక్కన నుంచోనుంటాడు. రెండో పక్కన బ్యానరు కోసం అందరికంటే ఎక్కువ డబ్బులు పెట్టినవాడు నుంచోనుంటాడు. ఇహ కింద, వాళ్ళ కాళ్ళదగ్గర, ఓ ఏడెనిమిది మంది సత్రకాయల ఫొటోలుంటాయి. ఏ బ్యానరైనా కొద్దిగా అటూ ఇటూగా ఇదే మూస! సందర్భాలు మాత్రం మారుతూ ఉంటాయి. ఫలానావాడు అయ్యప్ప దీక్ష తీసుకున్నాడనో, ఫలానా “అన్న” ముష్టి పార్టీ గల్లీ కమిటీ మెంబరైన సందర్భంగానో, మరోటో మరోటో! ఇహ పండగలప్పుడూ ఈ బాపతు జనాల హడావుడి గురించి ఎంతైనా చెప్పొచ్చు.

***

పాపం శ్రీరమణ చిర్రెత్తిపోయినట్టున్నాడు ఈ బ్యానరాసురుల గోలతో; ఆ పిచ్చివాడి పేరు మీద బ్యానర్లు తయారు చేసి కాలనీలో అంటించాడు. ఈ బ్యానరాసురుల్ని వెక్కిరించడానికే పెట్టినట్టు వాళ్ళకు వెంటనే అర్థం కాదేమోననే సంకోచంతో ఈ మాట కూడా చెప్పాడట.. “నేను ఎవర్నీ నొప్పించే ఉద్దేశ్యంతో పెట్టలేదు. నాయకులు ప్రజలకి ఇబ్బందులు కలిగించకూడదనే సందేశమిస్తూ ఇలా పెట్టాను”.

ఈ రాజకీయ సత్రకాయలకు సంగతి అర్థమవుద్దంటారా అని!!

మీ నిరసనను తెలియజేసినందుకు శభాష్ శ్రీరమణా!