Archive

Archive for the ‘సాంకేతికం’ Category

బియ్యెస్సెన్నెల్ బ్రాడ్ బ్యాండు వాడుకరులారా..

..అనురాగ దేవతలారా!

ఇలా ధర్మవరపు సుబ్రహ్మణ్యం శైలిలో పిలవడానికి కారణమేంటంటే.. కుసింత జాగర్తగా ఈ టపా చదివి ఇందులో చెప్పిన సూచన పాటించాలని. 

నేను బియ్యెస్సెన్నెల్లు వారి బ్రాడ్ బ్యాండు వాడుతున్నాను. పని చేసినన్నాళ్ళూ అది చక్కగా పని చేస్తుంది. ఏదైనా సమస్య వస్తే మాత్రం నానా తిప్పలూ పడాలి దాన్ని బాగు చేయించుకొనేందుకు. అదృష్టవశాత్తూ నాకు ఈమధ్య కాలంలో సమస్యలేమీ రాలేదు. అంచేత నేను బియ్యెస్సెన్నెల్లు వారిని పిలవనూ లేదు.

ఈవిధంగా హాయిగా జీవిస్తూండగా రాత్రి కంప్యూటరు మొదలెట్టగానే, http://www.motive.bsnl.co.in/ అనే సైటు తెరుచుకుంది. మీ మోడెమును చక్కగా పనిచేయించేందుకు, సమస్య వచ్చినపుడు బియ్యెస్సెన్నెల్లు వాడిచేత రిమోటుగా రిపేరు చేయించుకొనేందుకు, ఇదిగో ఈ లింకు నొక్కి, సాఫ్టువేరును దించుకోండి అని ఉంది. చక్కగా బియ్యెస్సెన్నెల్లు వాడి సైటులాగానే ఉందా పేజీ. ఓహో మన బియ్యెస్సెన్నెల్లేగదా అని ఆత్రంగా వాడిచ్చిన  డౌనులోడు లింకును నొక్కి motiveactivation.zip అనే, చిన్నాచితకా కాదు, 138 ఎంబీల ఫైలును దించుకున్నాను. అయితే, వెంటనే నా యాంటీవైరసు తెరమీదకు దూసుకొచ్చింది.. ఇందులో Click2kUns.exe అనే వైరసుంది అంటూ! వెంటనే ఆ ఇన్‍స్టాలును ఆపుజేసేసాను. జాలంలో Click2kUns.exe కోసం వెతికితే నాలాంటి ఆత్రగాళ్ళు ఇంకా ఉన్నారని తెలిసింది. 

అంచేత మీరు గ్రహించాల్సింది ఏంటంటే.. మీరూ నాలాగా ఆత్రపడకండి, ఆ ఫైలును డౌనులోడు చేసుకోకండి. అది బియ్యెస్సెన్నెల్లు పేరుతో ఎవడో వైరసుగాడు పంపిస్తున్నట్టున్నాడు. దీని గురించి మరింతగా తెలిసినవాళ్ళుంటే చెప్పగలరు. మరిన్ని వివరాలు తెలిసేదాకా  దాని జోలికి వెళ్ళకపోతే మంచిది.  

Advertisements

బీయెస్సెన్నెల్ బ్రాడ్ బ్యాండు వాడుకరులారా..

ఈ మధ్య నా పాత జాల కనెక్షను తీసవతల పారేసి, బీయెస్సెన్నెల్ కనెక్షను తెచ్చి నెత్తిన పెట్టుకున్నాను. కొన్నాళ్ళు బానే పని చేసిందిగానీ, ఆ తరవాత ఏడిపించడం మొదలెట్టింది. హఠాత్తుగా DNS లోపం దొర్లిందని చెప్పేది. ఓ పక్క కొన్ని సైట్లు బానే వస్తూండేవి. కొన్ని సైట్లు వచ్చేవి కావు.  ఇదిగో ఈ బొమ్మ చూడండి:

ఈ బొమ్మ నా కంప్యూటరులో ఇలా వచ్చిందిగానీ మీ కంప్యూటరులో అచ్చు ఇలాగే ఉండకపోవచ్చు. బొమ్మ ఎలాగన్నా ఉండనీండి.. లోపం మాత్రం..బొమ్మలో కుడి, పై మూలన ఉన్నట్టుగా

DNS error – cannot find server అనే ఉంటుంది. మీక్కూడా ఈ బాపతు లోపం వచ్చిందా?  ఏం చెయ్యాలో తెలీలేదు కదూ? బీయెస్సెన్నెల్లు వాడికి ఫోను చేస్తే, ‘కొన్ని సైట్లు పనిచేసి, కొన్ని పని చెయ్యడం లేదంటే దానర్థం ఆ సైట్లలో లోపం ఉందిగానీ, మా సర్వర్లలో ఇబ్బందేమీ లేద’ని ఫోను పెట్టేసాడా? ఇప్పుడేంచెయ్యాలిరా బాబూ అని దిగులు పడుతున్నారా? నేనూ ఈ పనులన్నీ చేసాను. బీయెసెన్నెలును, దాని చుట్టాల్నీ బూతులు తిట్టుకున్నా పనికాకపోయేసరికి ఇహ జాలంలో వెతకటం మొదలుపెట్టాను. చిన్న కిటుకుతో పనయ్యింది. ఏంలేదు.. ఓపెన్ డీయెన్నెస్ సర్వర్లను వాడాలి,అంతే! ఎలా చెయ్యాలో వివరించేదే ఈ నసాంకేతిక టపా. మీరూ ఈ DNS సర్వరు లోపంతో బాధపడుతున్నట్టైతే (చేలకు జింకు లోపం లాగా) ఈ మందు పనిచెయ్యవచ్చనే ఉద్దేశంతో రాస్తున్నాను. ముందుగా నేను చెప్పుకోవాల్సిన సంగతులు కొన్నున్నాయి, వాటిని చదివి, ముందుకు పోండి.

  1. నా కంప్యూటరులోని నిర్వాహక వ్యవస్థ (నివ్య): Windows XP  Professional Version 2002 Service pack 2
  2. మీ కంప్యూటరులోని విండోలు, తెరలు ఇక్కడ నేను చూపించిన బొమ్మల్లాగా ఉండకపోవచ్చు. ఒక్కో నిర్వాహక వ్యవస్థలో ఒక్కో రకమైన విండోలుండే అవకాశముంది. 
  3. నేను ఇక్కడ రాసినది నా బీయెస్సెన్నెల్ బ్రాడ్‌బ్యాండు కనెక్షనుకు సంబంధించిన వ్యవహారం.
  4. నేను హైదరాబాదులో ఉంటాను.
  5. నాకు ఇది పని చేసింది కాబట్టి మీకు పనిచేస్తుందని నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ మీ నివ్య, బ్రాడ్‌బ్యాండు సర్వీసు ప్రొవైడరు పైన నేను చెప్పినవే అయితే ఈ పరిష్కార మార్గం మీకూ పనిచేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని మాత్రం చెప్పగలను.

(బీయెస్సెన్నెల్లు వాణ్ణి బతిమాలడం, బూతులు తిట్టడం కంటే దీన్ని ప్రయత్నించి చూడటం మెరుగైన పనని మాత్రం చెప్పగలను. 🙂 )

మీ కంప్యూటరులో కుడివైపు అడుగున ట్రే అని ఒకటుందిగదా.. అందులో రెండు మానిటర్లు ఒకదాని వెనక ఒకటి ఉన్న బొమ్మ ఉంది చూసారా? అంతర్జాలంలో విహరిస్తున్నపుడు ఆ రెండు మానిటర్లు వెలిగి ఆరిపోతుంటాయి. గుర్తు పట్టారా? పై బొమ్మలో వృత్తం చుట్టి ఉంది చూడండి.. అదే. దాన్ని జమిలి నొక్కు నొక్కండి. అప్పుడు కింది బొమ్మలో లాగా ఒక విండో తెరుచుకుంటుంది.

పై విండోలో Properties అనే బొత్తాన్ని నొక్కండి. ఇంకో విండో, ఇలాంటిదే తెరుచుకుంటుంది.

అందులో Internet Protocol (TCP/IP) అని కనిపిస్తోంది చూసారూ దాన్ని జమిలినొక్కు నొక్కండి. అప్పుడు కింది విండో తెరుచుకుంటుంది. ఏంటో, విండోల్లోంచి విండోల్లోంచి విండోల్లోకి విండోల్లోకి పోతున్నాం, మళ్ళీ వెనక్కి తిరిగి పోగలమా అని బెంగ పడకండి. నే తీసుకెళతాగా! ఇంతా జేసి, ఇన్ని విండోలూ దాటెళ్ళాక చేసే పని మహా గొప్పదా అంటే.. ఎలక్కోసం కొండను తవ్వటంలాంటిదది. (పైగా ఈ తెరపట్లూ అవీ పెట్టేసి, నేను కాస్త ఎక్కువజేస్తున్నాను.)

 
పై బొమ్మ చూసారుగా అక్కడి డబ్బాలన్నీ ఖాళీగా ఉన్నాయి. కింద ఉన్న రెండు డబ్బాల్లో ఏవైనా అంకెలు ఉంటే వాటిని జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. ఒకవేళ ఇప్పుడు మనం చేస్తున్న పని వల్ల ప్రయోజనం కలక్కపోతే తిరిగి వీటిని పెట్టెయ్యొచ్చు. ఇక ఆ డబ్బాల్లో కింద నేను రాసిన సంఖ్యలను వేసెయ్యండి. 
208.67.222.222
208.67.220.220
ఒకటి గమనించండి.. ఆ డబ్బాల్లో ప్రతీ మూడంకెల తరువాత చుక్క ఉంటుంది. మీరు మూడో అంకె వెయ్యగానే కర్సరు దానంతటదే చుక్క దాటి అవతలకు పోతుంది. ఒకవేళ మీరు వెయ్యాల్సింది మూడు కాక రెండే అంకెలనుకోండి. ఉదాహరణకు పైన నేనిచ్చిన అంకెల్లో 67 లో రెండే అంకెలున్నాయి. 7 వేసాక అది చుక్కను దాటిపోదు, మూడో అంకె కోసం చూస్తుంది.
అంచేత మీరే దాన్ని చుక్కను దాటించాలి. అంకెలు వేసాక కింది బొమ్మలో లాగా కనిపిస్తుంది. అయిందా? హమ్మయ్య పనైపోయినట్టే. ఇహ వెనక్కి పోవడమే తరువాయి. ముందు, ఈ విండోలోని OK నొక్కండి. తరవాత ఇంతకు ముందరి విండోలోని OK నొక్కండి. ఆపైన దానిముందరి విండోలోని Close నొక్కండి. ఇహ మీ సమస్య పరిష్కారమైనట్టే!
ఈ ఓపెన్ DNS విషయమ్మీద మరింత సమాచారం కావాలంటే http://www.opendns.com/ కు వెళ్ళండి.