Archive

Archive for the ‘సినిమాలు’ Category

తెలుగు సినిమా పరిశ్రమలో "ఆ నలుగురు" ఎవరు?

September 27, 2010 7 comments

తెలుగు సినిమా దశ దిశ గురించి శనివారం నాడు హెచ్చెమ్ టీవీ ఒక చర్చా కార్యక్రమం చేసింది. అనేకమంది నిర్మాతలు, దర్శకులు ఇతర సాంకేతికులూ ఈ అమావేశంలో పాల్గొని తమ గోడు వెళ్ళబోసుకున్నారు.  పరిశ్రమ గురించి చర్చ పెడితే, పెద్ద నటులెవరూ రాలేదు. పెద్ద నిర్మాతలు, దర్శకులూ కూడా ఎవరూ రాలేదు.  -వాళ్ళను పిలవలేదో, పిలిచినా రాలేదో, వాళ్ళకు లాభం కలిగే సంగతులు ఇక్కడ లేవో, మరింకేంటో!  రామచంద్రమూర్తి  మన ఉద్దేశం ఫాల్ట్ ఫైండింగు కాదు ఫ్యాక్ట్ ఫైండింగ్! అని చెప్పాడు.  పాల్గొన్నవాళ్లలో కొందరు:  ప్రసన్న కుమార్,  సాగర్, విజయచందర్, విజేందర్ రెడ్డి, ఏవీయెస్.

అనేక విషయాలు చర్చకు వచ్చాయి.  ముఖ్యమైనవివి:

 1. ఆ నలుగురు:  థియేటర్ల గుత్తాధిపత్యం గురించి మాట్టాడడంతో చర్చ మొదలైంది. ప్రసంగాలు ఆటోమాటిగ్గా ఆ నలుగురి చుట్టూరా తిరిగాయి. ఎవరు ఏ విషయం గురించి మాట్టాడినా, విషయం ఆ నలుగురి మీదుగా పోకుండా ప్రసంగం ముగియలేదు.   కొందరు మృదువుగా చెప్పారు. కొందరు కుసింత ఘాటుగా చెప్పారు. కొందరు జాగర్తగా, వాళ్ళకి కోపం రాకుండా  ఉండేట్టుగా మాట్టాడారు. కానీ చాలామంది ఈ విషయాన్ని మాత్రం కదిలించారు. 
 2. డబ్బింగు సినిమాల నిషేధం: ఇది కూడా అందరి అభిమాన  టాపిక్కే! 
 3. చిన్న సినిమాలకు తొలి మూడు నాలుగు వారాలకు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలి: ఇది కొందరు అడిగారు. 
 4. నటీనటుల రెమ్యునరేషన్స్ తగ్గించుకోవాలి.
 5. నిర్మాణ ఖర్చు తగ్గించాలి
 6. సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గించాలి/పెంచాలి
 7. టెక్నాలజీని పెంపొందించాలి
 8. అవార్డులొచ్చిన సినిమాలకు సబ్సిడీ ఇవ్వాలి
 9. తెలుగు నటులకు ప్రాముఖ్యత ఇవ్వాలి

ఎక్జిబిటర్ల నాయకుడు విజేందర్ రెడ్డి ’నిర్మాతలు ఖర్చులు తగ్గించుకోవాలి, వాళ్ళు ఈ పని చెయ్యాలి, ఆ పని చెయ్యాలి’ అంటూ సలహాలు ఇచ్చాడు.  సినిమా హాళ్ళ వాళ్ళు మాత్రం టిక్కెట్ల రేట్లు  పెంచాలని కోరబోతున్నట్టు చెప్పాడు.  బెంగాలు, కర్ణాటక, తమిళనాడు,..  వగైరా చోట్ల రేట్లు మనకంటే చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు. ఇక, ఆ తరవాత మాట్టాడినవాళ్ళు ఆయన్ను విమర్శించారు. ఈమధ్యే రేట్లు పెంచారు మళ్ళీ ఎందుకు పెంచాలి అని ప్రశ్నించాడొకాయన. అసలు రేట్లు పెంచాల్సిన అవసరం మీకేముంది అన్నాడొకాయన. సినిమా విడుదలైన మొదటి రెండు వారాల్లో టిక్కెట్లను పెంచే జీవోను ఎక్జిబిటర్లే తెచ్చారని ఎవరో అన్నారు. విజేందర్ రెడ్డి  అబ్బే, అది అడిగింది నిర్మాతలేగానీ, మేం కాదని చెప్పాడు. ఛాంబర్లో నిర్మాతలే కాదు మీరూ ఉన్నారు అంటూ ఎదురు వాదన వచ్చింది. ఇలా కాసేపు వాళ్ళ వాదన సాగింది.

తెలుగు నటులకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదని చెప్పారు కొందరు.  ఇతర భాషా నటుల్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ప్రకాష్ రాజ్ ను బహిష్కరించాలని అనుకున్న తరవాత కూడా ఎందుకు అతడికి పాత్రలు ఇస్తున్నారు? అని అడిగాడు. “ఈ మాటే ప్రకాష్ రాజ్ ను ఎవరో అడిగితే, తెలుగు నిర్మాతలకు నన్ను బహిష్కరించేంత దమ్ము లేదు అని చెప్పాడంట” అని అతడే అన్నాడు.

ఒక అవార్డు సినిమా తీసిన దర్శకుడొకాయన, తన సినిమాకు ప్రభుత్వ సబ్సిడీ ఇవ్వలేదు, మంత్రి, అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం కానీ పనికాలేదు.  సబ్సిడీలను వెంటనే విడుదల చెయ్యాలని కోరాడాయన.  తెలంగాణ సినిమా జెయేసీ ప్రస్తావన తెచ్చాడొకాయన. తెలంగాణ ఉద్యమాన్ని ఇందులోకి దూర్చడానికి ఇది సమయం కాదు అని రెండు మూడు సార్లు వారించాక, ఊరుకున్నాడు.

టెక్నాలజీని మనవాళ్ళు సరిగ్గా వాడుకోవడం లేదు, అసలు టెక్నాలజీ గురించిన అవగాహన కూడా సరిగ్గా లేదు అని మరొకాయన  అన్నాడు. డిజిటల్ ప్రింట్లు రావాలి అని గుడివాడకు చెందిన డిస్ట్రిబ్యూటరు ఒకతడు అన్నాడు.

వెంకటేశ్వరరావనే ఒక ప్రేక్షకుడు చక్కగా మాట్టాడారు. అసలు తెలుగు సినిమాకు ఎందుకెళ్ళాలని అడిగారు.. చక్కటి తెలుగు భాష వాడుతున్నారని వెళ్ళాలా? తెలుగు సంస్కృతిని చక్కగా చూపిస్తున్నారని వెళ్ళాలా? అంటూ ప్రశ్నించాడు. 

ఒకాయన, చిన్న నిర్మాత అనుకుంటాను, “ఆ నలుగురు” మారితే తప్ప, చిన్న నిర్మాతలకు మనుగడ లేదు అని చెప్పాడు. వాళ్ళు మారాలి, లేదా “మనలోంచి నక్సలైట్లు ఎవరో పుట్టుకొచ్చి ..” అని మాట్టాడుతూ, తమాయించుకుని, మామూలుగా చెప్పుకుపోయాడు. 

విజయచందర్ ఘాటుగా మాట్టాడాడు..  ఆ నలుగురినీ గట్టిగా విమర్శించాడు. పేర్లు చెప్పొద్దని రామచంద్రమూర్తి గారు ముందే చెప్పారని ఆగాను గానీ, వాళ్ళ పేర్లు చెప్పేందుకు నేనేమీ వెనకాడను అని అన్నాడు. చిన్న సినిమాలను విడుదల చేసేందుకు థియేటర్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని చెబుతూ, “కరుణామయుడు” సినిమాను ఆ రోజుల్లో కాబట్టి, దాన్ని విడుదల చెయ్యగలిగాను గానీ, ఇవ్వాళ అది నా తరం కాదు, అన్నాడు.చిన్న సినిమాకు రోజులు కావివి అని ఆవేశంగా ప్రసంగించాడు.

చర్చలో కులం గురించిన  ప్రస్తావన ఎవరూ తేలేదుగానీ, ఒకాయన మాత్రం కులం పొలిమేర దాకా వెళ్ళి వచ్చినట్టనిపించింది.

చర్చ జరుగుతున్నంతసేపూ “ఆ నలుగురూ” ఎవరో ఎవరూ చెప్పలేదు. ఒకతను చెప్పాడుగానీ సరిగ్గా వినబడలేదు. ఎవరా నలుగురు ఏరా నలుగురు అంటూ మథన పడిన నాబోటిగాళ్ళు హమ్మయ్య అనుకునేలా, చివర్లో  ఆ నలుగురు ఎవరో చెప్పారు. ఆ పేర్లు చెప్పిన  వ్యక్తి త్రిపురనేని చిట్టి అనే దర్శకుడు. పేర్లు చెప్పాక, వీళ్లపై మనకు వ్యతిరేకత ఏమీ లేదు, కేవలం చిన్న సినిమాలను బతికించాలనే చెబుతున్నాం అని చెప్పాడు. ఆ పని చేసేలా దేవుడు వాళ్ళకు మంచి మనసు ఇవ్వాలని కోరుకుంటున్నాం  అని కూడా అన్నాడు.

 1. దగ్గుబాటి సురేష్
 2. అల్లు అరవింద్
 3. సునీల్
 4. దిల్ రాజు

ఇందులో ముగ్గురు తెలిసినవారే. ఆ సునీల్ ఎవరో మాత్రం నాకు తెలీలేదు. మీకు తెలుసా?

Advertisements

తెలుగు సినిమా – 75 ఏళ్ళ పండుగ

January 29, 2007 5 comments

మొదటి తెలుగు సినిమా నిర్మించి 75 ఏళ్ళయిన సందర్భంగా పడుగ చేసారు. బాగానే చేసారు. మూడు రోజుల పాటు అట్టహాసంగా జరిగిన పండుగలో మూడోనాడు వాళ్ళలో వాళ్ళకి ఉన్న విభేదాలు వికటాట్టహాసం చేసాయి.

పండుగలో కొన్ని విశేషాలు:

కాలనాళిక:
మరో పాతికేళ్ళ తరువాత, తెలుగు సినిమా ఎలా ఉండబోతోందన్నది ఎవరి ఊహకు తగినట్లుగా వాళ్ళు ఓ కాగితంపై రాసి ఓ పెట్టెలో వేస్తారు. అలా అందరూ రాసాక, ఆ పెట్టెకు సీలేసి, పాతికేళ్ళ తరువాత, అంటే తెలుగు సినిమా వందేళ్ళ పండుగ రోజున తీస్తారు. ఆనాటి పరిస్థితిని ఇప్పటి వాళ్ళు ఎంతవరకు ఊహించగలిగారు అనేదాన్ని అంచనా వేస్తారన్నమాట. చక్కటి ఆలోచన! ఈ కాలనాళికను ఓ పదిహేను రోజుల పాటు చాంబరులో ఉంచి సినిమా వాళ్ళందరి ఊహలను సేకరించి ఆపై పదిలపరుస్తారు.

సన్మానాలు: పాత తరం నటులను సన్మానించే కార్యక్రమం. నిర్మలమ్మ, అంజలీదేవి, కాంతారావు వంటి వారిని గౌరవించడం సముచితంగా ఉంది. ఆ జాబితాలో ఉండాల్సిన వారు కొందరు కనిపించలేదు, ఎంచేతో? రావి కొండలరావును మిస్సయ్యారు. (లేక నేను మిస్సయ్యానా?)

వేదిక నిర్వాహకులు: మూడోరోజు కార్యక్రమాన్ని రాజేంద్రప్రసాదు సరిగ్గా నిర్వహించలేదు. సన్మానం జరిగేదొకరికైతే ఈయన చెప్పేదింకొకరి పేరు. మధ్యలో అక్కడక్కడా వెకిలి చేష్టలు కూడా జోడించి వీలయినంతగా చెడగొట్టాడు. చప్పట్లు కొట్టమంటూ బతిమిలాట్టం ఈయనకో అలవాటులా ఉంది.

ఆటాపాటా: వెకిలి పాటలని కాస్త తగ్గించి మంచి పాటలను మరిన్ని కూర్చాల్సింది.

హుందాతనం: – అనగా జయసుధ! తనకు సన్మానం జరిగాక మాట్లాడమంటే ఆమె మాట్లాడింది మూడే మాటలు. నన్ను పరిచయం చేసిన కృష్ణ, విజయనిర్మలలకు, దర్శకులు దాసరి, రాఘవేంద్రరావులకు, తోటి నటీనటులు, దర్శకులు, సాంకేతికులు అందరికీ నా ధన్యవాదాలు.- ఇంతే! కొందరు మాట్లాడిన సోది విన్న తరువాత ఇది చాలా హాయిగా అనిపించింది.

మెరుపులు:

 • పద్మనాభం పాడిన పాట. పాట విడిగా విని తరువాత వ్యక్తిని చూస్తే “పాడిన వ్యక్తి ఇంత ముసలివారా” అని అనుకోక మానరు. చాలా చక్కగా పాడారు.
 • నిర్మలమ్మ చక్కగా మాట్లాడింది.
 • సునీల్ చేసిన మైము. చక్కగా చేసాడు.
 • తలకు మాసిన సన్మానం స్కిట్: ఇందులో గుండు హనుమంతరావు హావభావాలు బాగున్నాయి.
 • సుమ కబుర్లు: ప్రేక్షకుల్లో కూర్చున్న సినిమా వాళ్ళతో మాట్లాడుతూ సుమ కొన్ని మంచి కబుర్లు చెప్పించింది.

ఆశాభంగం: హీరోల పాట. పాటా బాలేదు, చిత్రీకరణా బాలేదు. తెలుగు సినిమా చరిత్రను పాటలో పొదుగుతారనుకున్నాను. బహుశా ఎక్కువ ఊహించడం వలన అలా అనిపించేదేమో! తరువాత మీరు చూడబోయే హీరోలందరి పాట ఎంతో అద్భుతంగా వచ్చింది అని కె.ఎస్.రామారావు అన్నపుడే నేను అనుమానించాను. అదే అయింది. సినిమా వాళ్ళకే ప్రత్యేకించిన ఈ డైలాగుతో జాగ్రత్తగా ఉండాలి.

(యాంటీ) క్లైమాక్సు: తెలుగు సినిమా ప్రముఖులను, లెజెండ్లను సన్మానించే కార్యక్రమాన్ని గొప్ప ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక, పరిశీలనాత్మక కార్యక్రమంగా మార్చేసారు మన తెర వేల్పులు. అసలు లెజండు, సెలెబ్రిటీ అనగానేమి అంటూ అర్థాలు అడగడం మొదలు పెట్టి ప్రేక్షకులకు ఎంతో విజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేసారు. ఎంతో ఉద్వేగాన్ని అభినయించారు. కళ్ళనీళ్ళు కూడా పెట్టుకున్నారు. ఆపై కాలనాళికలో శాలువాలు, జ్ఞాపికలనూ వేసి మొత్తం నాటకాన్నంతటినీ రక్తి కట్టించారు. మొత్తమ్మీద సరదాగా సంతోషకరంగా జరగాల్సిన కార్యక్రమంలో మెలోడ్రామాను చొప్పించి, కార్యక్రమాన్ని తమ సినిమాల స్థాయికి దిగజార్చారు.

పంపిణీదారు: మాటీవీ బాగానే డబ్బులు చేసుకుని ఉండాలి. దురదృష్టవశాత్తూ ప్రకటనల మధ్య అప్పుడప్పుడు కార్యక్రమాన్ని చూపించాల్సి వచ్చింది గానీ లేకపోతే డబ్బుతో దిబ్బేసుకు పోయేవారే!

పండుగ డైలాగు: “ఇంత పెద్ద ఏర్పాట్లలో కొన్ని లోపాలు దొర్లడం సహజం” (చట్టం తనపని తాను చేసుకు పోతుంది అనే డైలాగు పదే పదే గుర్తొచ్చింది.)

గొంతు విప్పిన బాలసుబ్రహ్మణ్యం

November 17, 2006 3 comments

తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలదే రాజ్యం అయిపోయింది. అక్కడ హీరో మేరునగధీరుడు. మిగతా వారంతా పిపీలికాలే.. చివరకు వాళ్ళకు తిండి పెట్టే నిర్మాతతో సహా! ఈ విషయంపై ఓ పెద్దమనిషి నోరు విప్పాడు. తెలుగు సినిమా దిగ్గజమూ, గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాతా అయిన గానగంధర్వుడు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏదో టీవీకి చెప్పిన మాటలను దట్స్ తెలుగు వెబ్సైట్లో పెట్టారు. దాన్ని ఇక్కడ చూడొచ్చు: http://thatstelugu.oneindia.in/cinema/avi/spb-on-telugu-heroes.html

బాలు చేసిన కొన్ని వ్యాఖ్యలు: “నిర్మాత తర్వాతే ఎవ్వరైనా అనే స్ప­ృహ పోయిందిప్పుడు. సినిమా కేవలం హీరోల మాధ్యమమే కాదు. ఒక లైటుబాయ్ లేకపోయినా ఆ రోజు షూటింగ్ నడవదు. సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ ఒక నిర్దిష్టమైన బాధ్యత ఉంటుంది. కేవలం తమ వల్లనే సినిమాలు ఆడుతున్నాయి అని ఈ హీరోలు అనుకుంటే అది భ్రమే అవుతుంది.”

బాలు ఇంకా ఇలా అన్నారు: “అక్షరం ముక్క రాయలేని వారు సైతం రచయితలు అయిపోతున్నారు. ఉచ్చారణ లేనివాళ్లు నటులవుతున్నారు. భాష తెలియని వారు, పరభాషా నటీనటులు ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషించేస్తున్నారు. సరిగమలు రానివారు సంగీత దర్శకులైపోతున్నారు. శ్రుతి శుద్ధి లేనివారు గాయకులవుతున్నారు.”

తామేం చెయ్యాలో తెలియని వారేం కాదు మన నిర్మాతలు; చెయ్యరంతే! డబ్బింగు సినిమాలను నిషేధిస్తేనో, సినిమా ఎలా ఉన్నా చూసి చావాల్సిందేనని నిర్బంధిస్తేనో సినిమాలు ఆడవు. మంచి సినిమాలు తీసేందుకు మంచి రచయితలు, దర్శకులు, సాంకేతికులు, కళాకారులు కావాలి.. స్టారులు, రత్నాలు, సామ్రాట్టులూ కాదు. మన నిర్మాతలు ఎప్పుడు ఆచరిస్తారో!

శభాష్ బాలూ! హిపోక్రసీకి నెలవైన సినీపరిశ్రమలో ఈ మాత్రం మాట్టాడ్డమంటే ఓ రకంగా సాహసమే!

తెలుగు సినిమాలను ఆడించేందుకు కొన్ని చిట్కాలు

November 11, 2006 2 comments

డబ్బింగు సినిమాలు తియ్యకూడదట! తెలుగు సినిమా నిర్మాతలు ఆంక్షలు పెడుతున్నారు. పాపం వీళ్ళు తీసే అద్భుత చిత్ర రాజాలు దిక్కు లేకుండా పోతున్నాయట! మీరొప్పుకోరేమో గానీ నేను మాత్రం వాళ్ళతో ఏకీభవిస్తాను. ఎందుకంటే మురికి వెధవలైనా, గబ్బు కొడుతున్నా మనవాళ్ళన్నాక మనం వాటేసుకోవాలి మరి. మనమే వద్దనుకుంటే అనాధలై పోరూ పాపం!

అంచేత తెలుగు సినిమా నిర్మాతలూ! తెలుగు జనం మీ ముష్టి సినిమాలు తప్ప మరోటి చూసే అవకాశమే లేకుండా చెయ్యడానికి నేను మరికొన్ని ఉపాయాలు చెబుతాను, హాయిగా కాపీ కొట్టుకోండి. (మీకలవాటేగా!) డబ్బింగు నిషేధం డిమాండు కూడా కాపీయే కదా – కన్నడిగులు పరభాషా సినిమాలు వద్దని ఒకప్పుడు గోల చేసారు, దాన్నే కాపీ కొట్టి, మరింత ముందుకు తీసుకుపోతున్నారు, మీరు. భేషో! ఇక నా అవిడియాలు..

 1. ఈ తమిళ, మలయాళ సినిమాల వాళ్ళని “మీరిలా మంచి సినిమాలు తీస్తే కుదరదు, మాలా అణాకానీ సినిమాలే తియ్యాల”ని డిమాండు చెయ్యండి. లేకపోతే తగువేసుకోండి. తప్పేంలేదు, మన ప్రయోజనాలు మనకు ముఖ్యంగానీ, ఎవ్వడేమనుకుంటే మనకెందుకు?
 2. ప్రతి తెలుగు వాడూ కనీసం వారానికో తెలుగు సినిమా చూసి తీరాలని డిమాండు చెయ్యండి.
 3. ఎవరైనా “తీరిక లేని పనుల్లో ఉన్నాను”, లేక “సినిమా చూసి తలనెప్పి తెచ్చుకోలేను, వదిలెయ్యండ”ని సిగ్గువిడిచి బతిమాలుకున్నా, వదలొద్దు. అలాంటి వారి కోసం రోడ్ల కూడళ్ళ వద్ద చందా డబ్బాలుపెట్టండి.. టిక్కెట్టు డబ్బులు అందులో వేసిపోతారు. తీరిగ్గా అది మీరంతా పంచుకోవచ్చు. తప్పేం లేదు.., వినాయకచవితి చందాల దందా లాంటిదే ఇదీను.

కొంత మంది ఉచిత సలహాలు పారేస్తా ఉంటారు.. “మీరూ మంచి సినిమాలు తియ్యొచ్చు కదా” అని, అదేదో తేలికయినట్లు. అలాంటివేమీ పట్టించుకోకండి. అయినా మంచి మంచి సినిమాలనే కదా మీరు కాపీ కొడుతున్నది? కాకపోతే మన ఫార్ములాలోకి మారుస్తున్నారు, అంతే. అవి జనానికి నచ్చకపోతే మీరేం చేస్తారు?

మనలో మనమాట! కొందరు రంధ్రాన్వేషకులుంటారు.. మీరు తీసే సినిమాల్లో కూడా హీరోయినూ, విలనూ (కొండొకచో హీరో కూడా) తెలుగు రాని వాళ్ళేగా. వాళ్ళ కోసం డబ్బింగు చెప్పిస్తున్నారు, మరి ఈ లెక్కన మీవీ సగం డబ్బింగు సినిమాలే కదా అని అడగొచ్చు. మీరలాంటివేమీ పట్టించుకోవద్దు. మంచి పనులు చేసుకునేవాళ్ళకి అడ్డంకులు ఎక్కడైనా ఉంటాయి, వెనకాడకూడదు!

సినిమా పాటలూ మన పాట్లూ

September 2, 2006 5 comments

శ్రీశ్రీ స్నేహితులతో కలిసి ఒక నాటకం చూస్తున్నారట. నటులు తమ తమ మాటలు, పాటలు, అభినయాలతో శాయశక్తులా బాదేస్తున్నారు. ఒక నటుడు పాతాళ లోకం గురించి పద్యమేదో పాడుతూ.. చెయ్యి పైకెత్తి చూపించాడట. శ్రీశ్రీని స్నేహితుడు అడిగాడు.. “ఏంటండీ, పాతాళం అని పాడుతూ చెయ్యి ఆకాశం కేసి చూపిస్తాడేమిటీ” అని. శ్రీశ్రీ ఇలా జవాబిచ్చారు.. “ఈ ప్రదర్శన స్థాయి పాతాళాని కంటే దిగువకు పడిపోయింది. అందుకే పాతాళం అంటే పైకి చూపిస్తున్నాడు”

మన తెలుగు సినిమా పాటల పరిస్థితి కాస్త అటూ ఇటూగా అదే!

పాటలెలా ఉండాలి..

మంచి సాహిత్యం ఉండాలి, బూతు కూతలు కాదు
విన సొంపుగా ఉండాలి, వాయిద్యాల హోరు కాదు
కథలో భాగంగా ఉండాలి, అతికినట్లుగా కాదు
నటులేసే గెంతుల కోసం కాదు, నటుల అభినయం కోసం ఉండాలి

పాటలెలా ఉన్నాయి:

గోల గోలగా ఉన్నాయి, భాషను చంపుతూ ఉన్నాయి.
చాలా పాటల్లో వాయిద్యాల మోతల మధ్య సాహిత్యం వినబడదు.
రచయితలు చేస్తున్న భాషా హత్యను సంగీత దర్శకులు ఇలా మోతల మాటున దాస్తున్నారా!?
ఇక గాయకులు.. ఘంటసాల, బాలు, సుశీల, జానకి లాగా చక్కగా పాడేవారేరీ? ఒకడు ముక్కుతో పాడతాడు, ఇంకోడు చెవుల్తో పాడతాడు. శ పలకమంటే ష అంటారు. అసలు తెలుగే రాదాయె, ఇవెలా వస్తాయి. “రామా చిలకమ్మ” అని రాస్తే “రామ్మా చిలకమ్మా” అని పాడేసాడో ముక్కు తిమ్మన! శ్రీ రామదాసు సినిమాలో ఓ పాటలో తండ్రీ అనమంటే తన్రీ అని పాడిందొక గాయనీమణి. ఫ్యాషననుకుందేమో మరి! మన దిగ్దర్శకులకు ఇలాంటివి ఎలా నచ్చుతాయో!?

ఎందుకిలా ఉన్నాయి:

బాగా రాసేవారు, రాయగలిగే వారు లేక కాదు.. రాయించుకునే వారు లేక! సినిమా వాళ్ళు నలిగిన బాటలో నడిచేందుకు ఇష్టపడతారు. ఓ సినిమా బాగా ఆడితే, పేరు దగ్గర్నుండి, ప్రతీ విషయంలోనూ దాన్ని అనుకరిస్తారు, విజయం తెస్తుందన్న నమ్మకంతో! అంచేతే, స్వతహాగా సృజనాత్మక మాధ్యమమైన సినిమా కేవలం చవకబారు వినోద సాధనంగా అయిపోయింది. మహా అయితే సాంకేతిక నైపుణ్య ప్రదర్శనలా ఉంటోంది. సృజనాత్మకతాలేమికి మొదటగా బలయ్యేవి మాటలూ, పాటలే!

ఎక్కడో తమ సృజనాత్మక శక్తిపై నమ్మకం ఉన్నవారి నుండి మాత్రం చక్కటి సినిమాలు వస్తున్నాయి. అలాంటి సినిమాల్లో పాటలు కూడా ఉత్తమంగా ఉండే అవకాశం ఉంది.

చెత్త పాటలకు మరో కారణం.. మన హీరోలు తమ చుట్టూ కట్టుకున్న మిధ్యా లోకం. ఇమేజీ అనే సంకెళ్ళు తగిలించుకున్న వీళ్ళ సినిమాల్లో పాటలు వాటి కథల్లాగే అదే చచ్చు పుచ్చు ధోరణిలో సాగుతాయి కాబట్టి, అవి అలాగే నేలబారుగా ఉంటాయి.

(ఇలాంటి పాటలు ఎందుకు పెడుతున్నారయ్యా అంటే, కొందరు చవటాయిలు “ప్రేక్షకులు అవే కోరుతున్నారు, మేమూ అవే ఇస్తున్నాము” అని అంటారు.)

ఇక..
నా ఇష్టాయిష్టాలను రాస్తానిక్కడ. సినిమా పాటల్లో మంచి సాహిత్య విలువలు కలిగినవెన్నో ఉన్నాయి. పాటల్లో నేనిష్టపడే అంశాలివి, ప్రాధాన్యతానుసారం..

 1. భావం అందంగా, హృద్యంగా, గిలిగింతలు పెట్టేలా ఉండాలి: “నీ కాలి దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట.. నా నావ మీద కాలుపెడితే ఏటౌతాదో తంట” ఇలాంటి భావాలు గుండెకు హత్తుకుంటాయి. “తికమక మకతిక పరుగులు ఎటుకేసీ”.. శ్రీ ఆంజనేయం లోని పాట ఇది. ఈ పాటలోని “శ్రీరామ చందురుణ్ణీ.. కోవెల్లొ ఖైదు చేసీ, రాకాసి రావణుణ్ణీ గుండెల్లొ కొలువు జేసీ..” అనేది నాకు బాగా నచ్చిన వాక్యం.
 2. పదాలతో చమత్కారాలు నచ్చుతాయి: ఇందులో వేటూరి ఉద్దండుడు. “శంకరా నాద శరీరా పరా..” పాట రెండో చరణంలో ‘గంగ‘ తో ఆయన ఆడుకున్న అంత్య ప్రాసల ఆటలాంటివి నాకు బాగా ఇష్టం. అదిక్కడ రాసి నా ముచ్చట తీర్చుకుంటాను..

  పరవశాన శిరసూగంగ
  ధరకు జారెనా శివగంగ
  నా గానలహరి నువు మునుగంగ
  ఆనంద వృష్టి నే తడవంగ

 3. పద గాంభీర్యం నచ్చుతుంది: “చరణ కింకిణులు ఘల్లు ఘల్లు మన..” పాట, పద గాంభీర్యతకు ఓ మచ్చు తునక. నాకు నచ్చినది.
 4. సంగీతం: వీటి తరువాతి స్థానం సంగీతానిది.

ఏ రకమైన పాటలు నాకిష్టం..
భక్తి పాటలు: సినిమా పాటలే కాక కీర్తనలు, పదాలు కూడా ఇందులో చేరాయి. కొన్ని పాటలుంటాయి.. దేవుడి అనేకానేక పేర్లను ఒక పద్ధతిలో కూర్చి పాటగా రాసేస్తారు. నాకలాంటివి నచ్చవు. నాకు బాగా నచ్చిన పాటలు చాలానే ఉన్నాయి గానీ, ఇక్కడ ఒక్క రామదాసు కీర్తనను ఉదహరిస్తాను.. ” ఓ రఘువీరా.. యని నే పిలిచిన, ఓహో యనరాదా” బాలమురళీకృష్ణ పాడిన ఈ కీర్తన (శ్రీ రామదాసు ప్రాజెక్టు, ఖమ్మం వారి విడుదల) నాకమిత ఇష్టం. ఇక ఘంటసాల భగవద్గీత గురించి చెప్పేదేముంది.. నారాయణుడు చెప్పగా విని, నరుడు తరించి పోయాడు. ఘంటసాల బోధించగా విని నరులు తరించి పోతున్నారు. ప్రస్తుతం సురులను తరింప జేస్తున్నాడాయన! గీతను ఇంతకంటే బాగా ఎవరూ పాడలేరేమో! అలాగే, ఎమ్మెస్ రామారావు గారు మనయెద పలికించిన సుందరకాండము నాకు ఎంతో ఇష్టమైన గేయ కావ్యం. శ్రీకృష్ణుడు ఘంటసాల చేత భగవద్గీత చెప్పించాడు, హనుమంతుడు రామారావు గారి చేత సుందరకాండను చెప్పించాడు. తెలుగువారి లంకె బిందెలివి.

శృంగార పాటలు (దుష్ట సమాసమేమో గానీ, నాకు అలా అనడమే ఇష్టంగా ఉంది): సున్నితమైన శృంగారంతో కూడిన పాటలు ఇష్టం. “ఎంతటి రసికుడవో తెలిసెరా..” లాంటి పాటలు ఇష్టం. గుంభనంగా లేకున్నా.., వెకిలిగా లేని శృంగార రసమూ ఇష్టమే! ఉదాహరణకు.. “మన్నేల తింటివిరా కృష్ణా..” అంటూ స్మిత పాడే పాట. ఛత్రపతి సినిమా అనుకుంటాను. సినిమా చూడలేదు, పాటను మాత్రం యాదృచ్ఛికంగా విని, దానికి అభిమానినైపోయాను.

తాత్విక, విషాద గీతాలు: వీటిలో ముందు వరుసలో ఉండేవి బాలమురళీకృష్ణ తత్వాలే! వాటిలో “గూడు.. చిన్నబోయెరా!” నాకెంతో ఇష్టమైనది. “యాతమేసి తోడినా ఏరు ఎండదు” – జాలాదిని చిరస్మరణీయుడిని చేసిన ఈపాట నాకు బాగా ఇష్టం.

చివరగా..
మంచి మంచి పాటలు వినడం కంటే ఇష్టమైనది నాకొకటుంది. అది..
ఆ పాటలు పాడుకోవడం! పాడుకుంటుంటే ఉండే తృప్తి వింటే రాదు.

పీబీశ్రీనివాస్ ఇంటర్వ్యూ

జూన్ 25 ఆదివారం మాటీవీలో పీబీశ్రీనివాస్ ఇంటర్వ్యూ వచ్చింది. గుర్తుకొస్తున్నాయి అనే కార్యక్రమం అది. ఇంటర్వ్యూ చేసింది కుంచె రఘు. మధ్య నుండి చూసాను, నాకు నచ్చింది.

పెద్దలు, ప్రముఖులు తమ జ్ఞాపకాలను తవ్వుకుంటూ మాట్లాడుతుంటే వినడానికి నాకెంతో ఇష్టం. తాను ఏ పాటలు ఏ సందర్భంలో పాడారో, ఎవరెవరు ఏమన్నారో చక్కగా చెప్పుకూంటూ పోయారు శ్రీనివాస్ గారు. రామారావు, భానుమతి నటించిన ఓ సినిమాలో (పేరు మర్చిపోయాను) పాటలన్నీ భానుమతి గారే పాడారట, ఉన్న ఒకే ఒక్క మగ గొంతు పాట తనదట. సినిమా పేర్లలో నేపథ్య గాయకు”డు” – పీబీశ్రీనివాస్ అని వేసారట – చెప్పుకుంటూ మురిసిపోయారాయన. ఈ పాట గురించే మరో సంగతి చెప్పారు-

కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణకు సినిమాలూ,పాటలూ ఈ వ్యవహారాలంటే పడేవి కాదట. ఆయన కొడుకు విశ్వనాథ పావనిశాస్త్రి ఓసారి శ్రీనివాస్‌తో ఇలా చెప్పారట. ఆ పాట ఎలాగో విశ్వనాథ వారి చెవిలో బడింది. మగవాడు పాడితే అలా ఉండాలిరా, స్వరం నాభిలోంచి రావాలి అంటూ కొడుకుతో మెచ్చుకోలుగా మాట్లాడారట. నాకదో పెద్ద మెప్పు అని చెప్పుకున్నారు శ్రీనివాస్ గారు.

ఇలాగ మరిన్ని విషయాలు చెప్పారు. తన తర్వాత చిత్రరంగానికి వచ్చి ఎంతో ఎదిగిన బాలు గురించి ఎంతో మెచ్చుకోలుగా మాట్లాడారు. లేతమనసులు సినిమా గురించి, ఎనిమిది భాషల్లో తాను చేపట్టిన ఓ కార్యక్రమం గురించి కూడా మాట్లాడారు.

ఇంటర్వ్యూ చేసే వారూ, ఇచ్చేవారు ఇద్దరికీ లయ కుదిరింది. ఆయన అడగడం ఈయన చెప్పడం చక్కగా సాగింది. శ్రీనివాస్ గారికి వినబడ్డం కోసం ఇంటర్వ్యూ చేసిన రఘు పెద్దగా మాట్లాట్టం, వారిద్దరి మధ్యా ఆత్మీయ వాతావరణం ఉన్న భావనను కలిగించింది. రఘు కూడా గాయకుడు కావడం, శ్రీనివాస్ గారి కృషి గురించి బాగా శోధించడం బహుశా దీనికి కారణం కావచ్చు. రఘుకు అభినందనలు.

ఒక చిరు లోపం: కార్యక్రమాన్ని బాగా ఎడిట్ చేసారు. ఇష్టాగోష్ఠిగా జరిగే కార్యక్రమాన్ని యథాతథంగా చూపిస్తే బాగుంటుంది. కత్తిరింపులు తప్పనిసరైనా సాఫీగా గతుకులు లేకుండా ఉండేలా చేస్తే ఇంకా బాగుండేది. మొత్తానికి ఆదివారం నాడు మంచి కార్యక్రమం చూసాను.

ఈ కార్యక్రమం వెనువెంటే పెళ్ళిపుస్తకం పేరుతో దంపతులను ఇంటర్వ్యూ చేసే కార్యక్రమంలో డాక్టరు ఎన్.ఇన్నయ్య, కోమల దంపతుల ఇంటర్వ్యూ వచ్చింది. పర్లేదు, బానే ఉంది.

తెలుగు సినిమా హీరోలు, అభిమానులు, ఇతర పాత్రలూ

తెలుగు వారం సినిమా అభిమానులం! ఏదో రకంగా సినిమా మన జీవితాన్ని తడమని రోజే ఉండటం లేదు. సినిమా అంటే “హీరో”, హీరోయే సినిమా అయిపోయిన కాలమిది. మన హీరోలకు అపరిమితమైన ప్రాముఖ్యత ఉంది. కానీ, వాళ్ళు నిజంగా హీరోలేనా?

హీరోలు: మన తెలుగు సినిమా హీరోల పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది. గానుగకు కట్టేసిన ఎద్దు ఎలా తిరుగుతుందో వీళ్ళ సినిమా జీవితాలూ అలాగే అయిపోయాయి. ఇమేజీ అనే గానుగకు కట్టేసిన ఎద్దులు వీళ్ళు. (అయితే తెలుగు సినిమా పరిస్థితి మరింత జాలిగొలుపుతుంది.. అది ఈ గానుగెద్దుల చుట్టూ తిరుగుతోంది) ఎరుపెక్కిన కళ్ళూ, పవర్‌ఫుల్ (చంపుతా, నరుకుతా లాంటి) డైలాగులూ, ఓ నలభై యాభై మంది కండలు తిరిగిన వస్తాదులను ఒంటిచేత్తో నలగ్గొట్టడం, హీరోయిన్ తో చేసే రికార్డు డ్యాన్సులు .. ఇవి ఉంటేనే వాళ్ళ సినిమాలు ఆడతాయి. ఏ మాత్రం సహజత్వం ఉన్నా ఆడవు. (ఈ మధ్య ఎలాంటివైనా ఆడటం లేదులెండి! అదొక మంచి మార్పు.) భుజకీర్తులు, వందిమాగధులు, భట్రాజుల మోతలకు వీళ్ళు దాసోహమైపోయారు. భేషజమనే ముస్తాబు లేకుండా కనబడరు వీళ్ళు. తమను ఇంద్రుడనీ చంద్రుడనీ కీర్తించే వాళ్ళంటే వీళ్ళకు కితకితలు. తమ సినిమాలకు వీళ్ళు చెప్పినవారే దర్శకుడు, సంగీత దర్శకుడు, కథకుడు, ఇతర నటులూ, సాంకేతిక నిపుణులూను. వీళ్ళతో సినిమాలు తీసి, వీళ్ళను పోషిస్తున్న నిర్మాతలకు వీళ్ళకున్న ప్రాముఖ్యతలో శతాంశం కూడా దక్కుతున్నట్టనిపించదు.

హీరోయినులు: తెలుగు సినిమాల్లో హీరోయిను ఓ ఆటబొమ్మ, అంగడి బొమ్మ! హీరోయిన్ల ప్రాముఖ్యత గురించి జెమినీ ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల వ్యాఖ్య చూడండి. మామూలుగా అడిగే తెలివి తక్కువ ప్రశ్నలతో పాటు ఇలా అడిగాడు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి.. మీ సినిమాల్లో హీరోయినుకు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది ఎందుకు? అని. అదేం లేదు ప్రత్యేక ప్రాముఖ్యత ఏమీ ఉండదు, మన సినిమాల్లో హీరోయినుకు పాటల్లో తప్ప ఉనికే ఉండదు. నా సినిమాల్లో కాస్త మామూలు ప్రాధాన్యత ఉండేటప్పటికి మీకు అలా అనిపిస్తున్నట్లుంది అన్నారు, శేఖర్.

విదూషకులు: ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ పవర్‌ఫుల్ హీరోలను వెధవాయిలను చేసి ఓ ఆటాడిస్తూ, తమ పబ్బం గడుపుకునే వర్గం ఒకటుంది మన పరిశ్రమలో. దాని పేరు విదూషక వర్గం . కమెడియన్లన్నమాట (అందరూ కాదు.., కానీ చాలామంది)! నటనాశక్తి పరంగా, ప్రతిభ పరంగా వాళ్ళు హీరోలకెందుకూ తీసిపోరు. అసలు వాళ్ళకంటే వీళ్ళే మెరుగు. ఈ విదూషకులు హీరోలను పొగడుతూ మాట్లాడే తీరు చూస్తుంటే మనకాశ్చర్యం వేస్తుంది. ఎందుకు వీళ్ళింతలా పొగుడుతున్నారు, ఏంటి వీళ్ళకీ ఖర్మ అని అనిపిస్తుంది. నిజానికది పొగడ్త కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. మామూలు మానవుడెవడైనా అంతటి పొగడ్తలను భరించలేడు. కానీ .. ఈ విదూషకులు వీళ్ళను తమ నాలుకల కొనలమీద నిలబెట్టి ఆటాడిస్తున్నారనీ, పొగడ్తలతో వాళ్ళను సంతోషపెట్టి తమ పనులను చేయించుకుంటున్నారనీ నిదానంగా మనకర్థమవుతుంది . (ఈ హీరోల పవరు పోయిన రోజున తుపుక్కున ఊసేస్తారేమో!)

హీరోభిమానులు: వాళ్ళ పొగడ్తలు నిజమేనని ఆ హీరోలు నమ్ముతారా అంటే.. సందేహమే! హిపోక్రసీకి పరాకాష్ఠ అయిన సినిమా లోకంలో ఎవడి మనసులో ఏముందో మరోడికి తెలీదు. పెదాలపై ఉన్న మాట హృదిలో ఉందని చెప్పలేం. కానీ ఇవి నిజమేనని నమ్మే వర్గం ఒకటుంది.. అదే వీరాభిమానుల వర్గం. చదువూ, సంధ్యల్ని గాలికొదిలేసి, ఉద్యోగం సద్యోగం చూసుకోకుండా ఈ హీరోల చుట్టూ తిరిగే వర్గమిది. తమ హీరో కోసం డబ్బులేం ఖర్మ, ప్రాణాలూ ధారపోస్తారు వీళ్ళు. హీరోలు, ఇతర నటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, పంపిణీదారులు, ప్రదర్శకులు, హీరోభిమానులు, మామూలు ప్రేక్షకులు భాగంగా ఉన్న తెలుగు సినిమా వ్యాపార వలయంలో అందరికంటే అమాయకులు హీరోభిమానులే! మామూలు ప్రేక్షకులు టిక్కెట్టు డబ్బులు మాత్రమే పెడతారు, అదీ సినిమా బాగుందంటేనే చూస్తారు. అభిమానులో.. సినిమా ఎంత చెత్తదైనా చూస్తారు (లేకపోతే వాళ్ళేం అభిమానులు?) సినిమాకూ హీరోకూ ప్రచారం కోసం పోస్టర్లూ, కటౌట్లూ, కరపత్రాలూ ఇలాంటివెన్నో! పైగా, సినిమా గురించి తమ తమ సంఘాల్లో చర్చలూ, గోష్ఠులు!

అభిమాన భారం: సినిమా విడుదలైన రోజున ఎగబడి చూసేది ఎవరు? హీరోభిమానులే! విడుదలైన మొదటి రోజుల్లో టిక్కెట్టు డబ్బులు పెంచడం మొదలెట్టారామధ్య, లాభం ఎవరికి? భారం ఎవరిపైన? హీరోభిమానులపై హీరోల అభిమానమిదీ!