Archive

Archive for the ‘సొంతగోడు’ Category

పొద్దులో నేను..

September 15, 2010 5 comments

ఈమధ్య మా స్నేహితుడొకణ్ణి కలిసినపుడు, పొద్దు చూసావా అని అడిగాను.  వాడు నన్నోసారి వింతగా చూసి, ’నేను చూసేసరికి నడినెత్తిన ఉంటది, ఇంకేం చూస్తాను?’ అన్నాడు. అది కా దది కాదు..  పొద్దు, పొద్దు పత్రిక! చదివావా? అని అడిగాను. నన్నొక పిచ్చివాణ్ణి చూసినట్టు చూసాడు. వాడికి ముందే పత్రికలు, పుస్తకాలు, చదవడం లాంటివంటే ఎలర్జీ.  చిన్నప్పుడెప్పుడో చందమామ చదివితే, ఒళ్ళంతా దద్దుర్లు వచ్చాయంట. సైన్సు పుస్తకం చదవబోతే కళ్ళు వాచిపోయినై. అప్పటినుంచీ, పుస్తకాల జోలికి వెళ్ళకుండా జాగర్తగా నెట్టుకొస్తున్నాడు. అలాంటివాణ్ణి పొద్దు చదివావా అని అడిగితే, వాడు నావంక అయోమయంగా చూడ్డూ మరి!

వాడి సంగతి తెలిసీ అలా ఎందుకడిగానంటే దానికీ కారణముంది మరి.  పొద్దు పత్రికలో చిన్నదో చితకదో పని చేస్తూ ఉన్నాను కాబట్టి, ఆ ముక్క చెప్పుకోవాలన్న దురదొకటి నాకుంది కాబట్టి, అదేదో మనోళ్ళకి చెప్పుకుంటే కుసింత గౌరవంగా ఉంటదని కాబట్టిన్నీ వాడికి చెప్పుకున్నాను. దురద పుట్టినపుడు దేనితో గోక్కుంటన్నామో పట్టించుకోం గాబట్టి, పోయిపోయి మావాడితో గోక్కోబోయాను. వాడు లాబం లేదని తెలిసిపోయాక, ఇహ నా బ్లాగులో రాసేసుకుంటే మీరన్నా చదవకపోతారా అని ఇదిగో, ఇలా..

పొద్దులో వచ్చిన గొప్ప రచనల గురించి కాదీ టపా. వాటి గురించి రాస్తే నాకేమొస్తది, నా రచనల గురించి రాసుకుంటే కుసింత సమ్మగా ఉంటది గాని. 🙂 అంచేత గొప్పవాటి జోలికి పోకుండా నా రచనల గురించి నాలుగు ముక్కలు చెబుతా.

నెలకోటి చొప్పున బ్లాగుల సింహావలోకనాలు రాసేవాణ్ణి. ఈ మధ్య రాయడం లేదులెండి. వాటిల్లో అప్పుడప్పుడూ నా వ్యాఖ్యలు కూడా ఒహటో రెండో పడేసేవాణ్ణి. దాంతో ఓసారి చిన్నపాటి రభసైంది బ్లాగుల్లో. 🙂

అప్పుడెప్పుడో బ్లాగుల పేరడీ అని ఒకటి రాసాను. దాని రెండో భాగం కూడా రాసానుగానీ, అది చదవనక్కర్లేదు. 🙂 డా. కేశవరెడ్డి గారి అతడు అడవిని జయించాడు పుస్తక సమీక్ష కూడా రాసాను. ఈ ముక్క రాస్తూంటే నాకు ఆ నవల మళ్ళీ చదవాలనిపిస్తోంది. మీరు నా సమీక్ష చదువుతారో లేదోగానీ, ఆ నవల చదివి ఉండకపోతే మాత్రం, తప్పక చదవండి. 

ఒకటో రెండో సంపాదకీయాలు రాసాను. ఇస్రో గురించి ఒకటి, ప్రాథమిక విద్య మీదొకటీ రాసాను. ఈ మధ్య ఒక గళ్ళనుడికట్టు కూడా కూర్చి, మిగతా సంపాదకుల కళ్ళుగప్పి ప్రచురించేసాను కూడా. 🙂

ఇవేగాక మంచి రచనలు కూడా వచ్చాయి పొద్దులో, వీలైనప్పుడు చదవండి. నే రాసినవాటిని మాత్రం వీల్లేకపోయినా చదవండి.

——————————-

పొద్దు పొడిచిన నాలుగేళ్ళ తరవాత, దానికి ఒక కొత్త రూపాన్ని ఇస్తే బాగుంటుందని తలచాం. ప్రస్తుత రూపానికి తెచ్చాం. ముఖ్యమైన విశేషమేంటంటే.. పాత వ్యాసాలు చక్కగా అందుబాటులో కొచ్చాయి. మమ్చిమమ్చి రచనలను చప్పుచప్పున వెతికి పట్టుకుని చదివేసెయ్యొచ్చు. పొద్దును క్రమం తప్పకుండా చదువుతూండే పాఠకులు కూడా కొన్ని పాత వ్యాసాలు చదివి ఉండరు. పాతరూపంలో ఆ వసతి సరిగ్గా ఉండేది కాదు మరి.

  కొత్త పొద్దును ఇంకా చూసి ఉండకపోతే ఓసారి చూసి, ఓ మాట అనండి.

   Advertisements

   లోకలు వార్మింగు

   కొత్తపాళీ గారు అదిలించడంతో గ్లోబలు వార్మింగు పట్ల నేనూ కాస్త హడావుడి పడదామని త్వరపడ్డాను. నిజం చెప్పొద్దూ.. ఈ దీపాలార్పడంలో (ప్రతిపదార్థంలోనే తీసుకోండి సుమా!) నాకంత నమ్మకం లేదండీ. కానీ ప్రజల్లో అవగాహన కలిగించడం దీని ముఖ్య ఉద్దేశ్యం అని తెలిసాక, ఇలా అవగాహన కలిగించడం కోసం నేనూ ఏదైనా చెయ్యాలని తలపోసాను. పోసాక, ఏం చెయ్యాలో నిశ్చయించుకున్నాను. కున్నాక, పని మొదలెట్టాను. ఇక్కడో ముక్క చెప్పాలి:

   గ్లోబలు వార్మింగు గురించి చెప్పడమే నా పని, చేసేదేమీ లేదు అని నేను అనుకున్నాను. అసలు నన్ను కర్తవ్యోన్ముఖుణ్ణి చేసిందే ఇది.

   ముందుగా ఆఫీసులో జనాన్ని ఒకచోట కూలేసి, క్లాసు తీసుకున్నాను.

   “చూడండీ, మీ పిల్లలకు ఆహార భద్రత, పర్యావరణ భద్రత, ఆరోగ్య భద్రత, వగైరాలను ఎలా ఇస్తారూ?” అని అడిగాను. వాళ్ళ తెల్లమొహాలను తనివితీరా చూసుకున్నాక, గ్లోబలు వార్మింగు గురించి చెప్పి “మీరూ లైట్లు ఆర్పండి, ఈ సంగతిని మీరు మరో పదిమందికి చెప్పండి. నేను కూడా మా అపార్టుమెంటులో పన్నెండు మందికి చెబుతున్నాను.” అని అన్నాను.

   ~~~~~~~~~~~~~

   ఇంటికి పోయాక, మావిణ్ణి, పిల్లల్ని సమావేశపరచి గ్లోబలు వార్మింగు గురించి ఉపన్యాసమిచ్చి, దీనిపై మనమంతా తక్షణమే స్పందించకపోతే మనకు పుట్టగతులుండవని హెచ్చరించాను. అంతటితో ఆగకుండా మా రక్షకుణ్ణి పిలిచి, ఓ కాగితం రాసిచ్చి మా అపార్టుమెంటు జనాలకు పంపించాను. అయినా నాకు తృప్తి కలగలేదు. భూతాపోద్దీపనపై పద్యాలు రాద్దామని సంకల్పించాను. కళ్ళు మూసుకుని పద్యాలు కుట్టడం మొదలెట్టాను. అప్పటికే నా హడావుడితోటి మావిడకి చిరాకెత్తి నట్టుంది. ఈ పద్యగానంతోటి వళ్ళు మండింది.. “పద్యాలు రాసుకుంటే రాసుకోగానీ, పాడకు. నాకు చిరాకు” అంది. పద్య సౌందర్యాన్ని చూసేందుకు ఈవిడ కళ్ళెప్పుడు తెరుచుకుంటాయో అని అనుకుంటూ కళ్ళు తెరిచాను. ఎప్పుడు జారుకున్నారోగానీ, పిల్లలిద్దరూ లేరు.

   సృజనాత్మకమైన పనిని ఇలా చిన్నబుచ్చిందే అని మనసులో బాధపడి “అసలు గ్లోబల్ వార్మింగు ఎంత ప్రమాదకరమో నీకింకా అర్థమైనట్టు లేదు” అని అన్నాను, కాస్త నిష్ఠూరం ధ్వనిస్తూ. వెంటనే “వార్మింగు గురించి నాకు తెలుసులెమ్మం”టూ తాను రాసిన బ్లాగు చూపించింది. గుండె కలుక్కుమంది. ముందుగా నాకొక్ఖ ముక్క చెబితే ఏంబోయింది అని మనసు మూలిగింది.

   “మరి, నువ్వు బ్లాగు రాసుకున్నావుగానీ, నేను పద్యాలు రాసి బ్లాగులో పెడదామంటే అడ్డుకుంటావే?” అని ఆక్రోశించాను.

   “గ్లోబలు వార్మింగు గురించి కాదుగానీ లోకలు వార్మింగు గురించి ఆలోచించు చాలు” అంది.

   ‘లోకలు వార్మింగా?’ విస్తుపోయాను. నేను తేరుకునేలోపే “అందరూ గ్లోబలు వార్మింగును పట్టించుకునేవారే! కనీసం నీలాంటి చైతన్యశీలురన్నా లోకలు వార్మింగును పట్టించుకోకపోతే ఎలా” అని అంది.

   అందులో ఎగతాళి ఏమైనా ఉందేమోనని సందేహించబోయానుగానీ, అయాచితంగా దొరికిన చైతన్యశీలి అనే గొప్ప మెప్పును అంత తేలిగ్గా కొట్టి పారేసేందుకు నాకు మనసు రాలేదు. కానీ ఈ లోకలు వార్మింగు ఏంటసలు? ఆమధ్య పొద్దులో భూతాపం గురించి త్రివిక్రమ్ గారు రాసినప్పుడూ, ప్రశాంతి, కొత్తపాళీ గారలు బత్తీబందు పెట్టి గ్లోబలు వార్మింగు గురించి చెప్పినప్పుడూ గ్లోబలు అని అన్నారు గానీ లోకలనలేదు. జాలంలో కూడా గ్లోబలు గురించి చాలానే సరుకు కనిపించింది గానీ ఎక్కడా లోకలు వార్మింగు గురించి కనబడిన గుర్తు లేదు. ఏంటబ్బా అది?

   “అదేంటో నాకు తెలీదు, నువ్వేచెప్పు” అని అడుగుదామంటే.. “ఆ మాత్రం తెలీదా” అని నా దగ్గర ఆశ్చర్యపోవడం మాత్రమే కాకుండా, బ్లాగులో కూడా ఆశ్చర్యపోతుందేమోనని భయమేసింది. అంచేత “ఔనౌను, లోకలు వార్మింగు గురించి కూడా మనం జాగ్రత్త వహించాలి, నేనాపనిలో ఉంటానిక” అని చెప్పి అర్జెంటుగా బైటకు పోబోయాను, అక్కడే ఉంటే దాని గురించి తరచి అడుగుద్దేమోనని.

   “అదేంటి వెళ్తున్నావ్, టీవీ ఎవరు కట్టేస్తారు, ఆ గదిలో లైట్లెవరార్పుతారు, ఫ్యానెవరు ఆపుతారు?” అని అడిగింది. నాకు జీవితంలో అస్సలు నచ్చని పని – ఈ కట్టెయ్యడాలు, ఆర్పడాలు, ఆపడాలు. చిన్నప్పుడు మానాన్న నా ప్రాణం తీసేవాడు – లైటు తియ్యి, లైటు తియ్యి అని. పెళ్ళయ్యాక మావిడ పుచ్చుకుంది ఆ బాధ్యత. నాకు చిరాకని తెలిసి కూడా అలా చెప్పడం మానదు. పైగా తీసేదాకా ప్రాణం తీస్తుంది. తప్పదు కాబట్టి, విరక్తిగానైనా టీవీ కట్టేసి, లైట్లార్పి, ఫ్యానాపి బయల్దేరాను. మావిడ తెలివైంది, ముందో రూలెట్టింది.. ఎవరేస్తే వాళ్ళే ఆర్పాలి అని. తానేమో ఫ్యాన్లూ, లైట్లూ వెయ్యదు, టీవీ పెట్టదు. నాకోసం కాచుక్కూచుంటుంది, నేనెలాగూ ఇంట్లోకి రాగానే ఓపెన్ సెసేమ్ అన్నట్టు అన్ని స్విచ్చిల్నీ టకటకా నొక్కేస్తాను గదా, అందుకోసం!

   బయటికి పోయేందుకు చెప్పులేసుకుంటూండగా వెనకనుండి అంటోంది.. “లోకలు వార్మింగును తగ్గించడమంటే ఇదే! ఏడాదికోసారి గోవాడ తిరణాల జరిగినట్టు లైట్లార్పే పండగ చెయ్యగానే సరికాదు మేష్టారూ, రోజూ జాగ్రత్తగా ఉండాలి.”

   ~~~~~~~~~~~~~

   పని చెయ్యమని నోరు పెట్టుకోని ఉపన్యాసం ఇవ్వొచ్చు, ఓ పేజీ నిండా నోటీసు రాసి పంపొచ్చు.. కానీ మనమే ఆ పని చెయ్యాలంటే ఎలా?

   చెప్పడమే నాకిష్టం, చెయ్యడం కాదు. సమాజం మాత్రం ‘చెప్పడమే కాదు చెయ్యాలి కూడా’ అంటోంది. ‘ఎవడికి ఇష్టమైన పని వాడు చెయ్యాలి. సమాజమా గాడిదగుడ్డా.., దాన్నేం పట్టించుకోనక్కరలేదు’ అని అనుకుందామనుకున్నా… నా విషయంలో మాత్రం ‘ఆర్పమని చెవటమే కాదు, ఆర్పాలి కూడా’ అనే సమాజపు ఎంగిలి విలువే చెల్లుబాటవుతోంది. ప్చ్! ఇకపై లోకలు వార్మింగును అరికట్టాలని నిర్ణయించుకున్నాను; తప్పేట్టు లేదు!