నిష్పాక్షికతను కోరే పక్షపాతులు!

చంద్రబాబు బాబ్లి యాత్ర నేపథ్యంలో, కొందరు మీడియా మీద పడ్డారు.  మీడియా అనవసరంగా చంద్రబాబుకు ప్రాధాన్యతనిచ్చి, ఉపఎన్నికల్లో  తెరాస ఓడేందుకు పని చేస్తోంది – ఇదీ వారి ఆరోపణ. చాలా అసంబద్ధమైన ఆరోపణ అది. అసలీ నాలుగైదు రోజుల్లో బాబ్లి యాత్రకు మించిన ప్రాధాన్యత కలిగిన మరో సంఘటన లేదు, అంతకంటే పెద్ద వార్తా లేదు. అంచేత, సహజంగానే బాబ్లి యాత్ర  మీడియాలో బాగా ఫోకసైంది.  

జూలై  16 , 20 ల మధ్య చంద్రబాబు తన ఎమ్మెల్యేలు, ఎంపీలందరితో కలిసి బాబ్లి యాత్ర  చేసాడు. ఆనాటి నుండీ మీడియా దృష్టి అంతా వారిమీదే!  ఆ నాలుగైదు రోజుల్లోనూ జరిగిన అతి ముఖ్యమైన సంఘటన అది. రాష్ట్రానికి చెందిన డెబ్భై ఎనభై మంది ప్రతిపక్ష నాయకులు మహారాష్ట్రలో అరెస్టైతే, అది ప్రధాన వార్త కాకపోతే మరింకేంటి? అంతకు మించిన వార్త ఏముంది ఆ రోజుల్లో? సహజంగానే మీడియా అంతా ఈ వార్త చూట్టూతానే తిరిగింది. అయితే కొందరికి మాత్రం ఇది పక్షపాత ధోరణిలో కనిపించింది. వాళ్ళు ఇలా తీర్మానించారు:

ఈ యాత్రను, అక్కడ అరెస్టైనవారి ఇక్కట్లనూ, ఉన్నవీ లేనివీ కల్పించి,  కళ్ళక్కటినట్టుగా వర్ణించి, చూపించి  ప్రజల్లో సానుభూతి పెంచి, తద్వారా ఉపఎన్నికల్లో తెరాస ఓడేలా చేసి, తెలంగాణవాదాన్ని ఓడించాలనేది మీడియా కుతంత్రమంట. కోస్తా, సీమ వాళ్ళ అధీనంలో ఉన్న మీడియా సంస్థలన్నీ కలిసి ఆడుతున్న నాటకమంట.  అంటే, చంద్రబాబు చేసిన యాత్రకు అస లేమాత్రం  ప్రాధాన్యత లేదు, అదంతా అతడూ, మీడియా వాళ్ళూ కలిసి ఆడిన నాటకమేనని ఈ తెలంగాణావాదులు చెబుతున్నారా?

చంద్రబాబు చేపట్టిన యాత్ర ఎన్నికల కోసం చేసాడని అన్నారు. ప్రచారాన్ని తప్పించుకోవచ్చనే  నాటకమని అన్నారు. ఔన్నిజమే, ఎన్నికల ప్రచారం కోసమే చేసాడు.  అయితే తప్పేంటి? ఒక్కొహడు ఒక్కో రకంగా ప్రచారం చేసుకుంటన్నాడు. ఒహడు చర్చికెళ్ళి మైనారిటీ కార్డు వాడతాడు -మీరు మైనారిటీయే నేను మైనారిటీయే అంచేత నాకు ఓటెయ్యండి అంటూ. ఇంకొహడెళ్ళి నేను బీసీని, ఈసారి బీసీవాడు ముఖ్యమంత్రి కావాల్సిందే అంచేత నాకే ఓటెయ్యండి అంటాడు. ఇంకొహడు డిసెంబరు తరవాత తెలంగాణలో రక్తం పారిద్దాం, నన్ను గెలిపించండి అంటాడు. ఎవడి దారిన వాడు ఓట్లడుక్కుంటన్నాడు. చంద్రబాబూ ఒహదారి కనుక్కున్నాడు. మిగతావాళ్ళ దారితో పోలిస్తే, చంద్రబాబు దారి ఎంతో మెరుగు. ఎంచేతంటే, ఒక చిరకాల సమస్యకు జాతీయ స్థాయి ప్రాధాన్యత తీసుకొచ్చాడు. రాష్ట్రానికి ఎంతోకొంత ఉపయోగపడింది.

ఇహ, ప్రజల దగ్గరకు వెళ్ళలేకపోవడం – అదీ నిజమే. జనాన్ని ఆ రకంగా రెచ్చగొట్టిపెట్టారు. బాబ్లి లాంటి సమస్యల గురించి మాట్టాడితే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం అంటూ ఊదరగొట్టి వాళ్ళు నోళ్ళు మూసుకునేలా చేసారు. వినోదం సినిమాలో ననుకుంటా.., హీరో, ఆడి సత్రకాయలూ కలిసి, కోట శ్రీనివాసరావుకు తనకో కవల తమ్ముడున్నాడనే భ్రమను కల్పిస్తారు . ఆ భ్రమలో నుంచి బైటకి వస్తున్నాడనే అనుమానం రాగానే, అందరూ కమ్మేసి, అతడికి వేరే ఆలోచనలు రానివ్వకుండా, జై సుబ్బారావనో మరోటో నినాదం చేసి ఊదరగొట్టేసి, అతడికి అయోమయం వీడకుండా చేస్తారు.  ఇవ్వాళ తెలంగాణ  నాయకుల పరిస్థితి కూడా అలాగే ఐంది .  ఏ నాయకుడైనా  బాబ్లి గురించి మాట్టాడబోతే, ఠక్కున జై జై తెలంగాణ అని నినాదాలు చేసి, డిసెంబరునుంచి రక్తం పారుద్ది, ముందున్నది అంతర్యుద్ధమే.. అంటూ ఊదరగొట్టేస్తున్నారు. మరి చంద్రబాబు బాబ్లి గురించి ఆందోళన చేస్తే వాళ్ళకు కారం రాసుకున్నట్టుండదూ!!?

ఓట్లొస్తాయా రావా అనేది పక్కనుంచండి, చంద్రబాబు సరైన సమస్యనే తీసుకుని గొడవ చేసాడు, సమర్ధవంతంగా చేసాడు.  అసలు ప్రతిపక్ష నాయకుడిగా అతడు ఇంత ప్రభావవంతంగా  ఎప్పుడూ వ్యవహరించలేదని నా ఉద్దేశం.  తెదేకు ఈ ఎన్నికల్లో ఓట్లు ఎన్నొచ్చినా ఫలితంలో పెద్ద తేడా ఉండకపోవచ్చు. కానీ చంద్రబాబు సమస్యను వెలుగులోకి తెచ్చాడు. దేశం దృష్టిని అటువైపు తిప్పాడు. నాల్రోల పాటు ఇటు మన రాష్ట్రానికి,  అటు మహారాష్ట్రకీ, కొంతవరకు సోనియాకీ ఎజెండాను నిర్దేశించాడు.  రేప్పొద్దున ప్రధాని దగ్గర జరిగే అఖిలపక్ష సమావేశం కుసింత సీరియస్సుగా తీసుకోవచ్చీ సమస్యను.

అన్యాపదేశంగా చంద్రబాబు ఇంకోటి కూడా చేసాడు – కొందరు తె.వాదుల డొల్లతనాన్ని కూడా బైటపెట్టాడు.  చంద్రబాబుకు ఎక్కడ సానుభూతి వచ్చేస్తదో, ఓట్లు కొట్టెస్తాడోనని తె.వాదులు అల్లాడి పోయారు.  అతణ్ణి వదిలెయ్యగానే హమ్మయ్య ఇప్పటికైనా వదిలేసారు అని సంతోషించారంటే ఈ తె.వాదులు ఎంతలా భయపడ్డారో అర్థమౌతోంది.  ఎందుకంటే..  బాబ్లీ అనేది తెలంగాణ ప్రజల తక్షణ సమస్య అని, దానికి ప్రజల మనసులను ప్రభావితం చేసే శక్తి ఉన్నదనీ వాళ్ళకు తెలుసు.  ఇంకొందరు తెదేపా గెలవకపోయినా, ఓట్లు చీల్చేసుకుని, కాంగ్రెసు గెల్చేలా చేస్తుందేమోనని కూడా భయపడిపోయారు. 

చంద్రబాబును తిట్టారు సరే, వాళ్ళు మీడియానూ వదల్లేదు. 

ఫలానావాళ్ళు గెలవాలి, ఫలానావాళ్ళు గెలవకూడదు అనే కోరిక ఉండటం సహజం. అందుకు పనిచెయ్యడమూ తప్పేం కాదు. కానీ మీడియా అందుకు సాయపడతల్లేదని ఆడిపోసుకోవడం మాత్రం హాస్యాస్పదంగా ఉంది.  అరెస్టైన ఫోటోలు, లాఠీలతో కొట్టిన ఫొటోలూ వేసి, టీవీల్లో చూపించి, సానుభూతి వచ్చేలా చేసారని మీడియా మీద అక్కసు వెళ్ళగక్కుతున్నారు.   మీడియా నిష్పాక్షికంగా ఉంది అని నేను చెప్పడం లేదు. కానీ,  బాబ్లి యాత్రకు ప్రాధాన్యత ఉందనీ, ఈ ఐదు రోజులూ దానికి ప్రాధాన్యత  ఇవ్వకపోతేనే అది పక్షపాతమయ్యేదనీ అంటున్నాను. 2009 డిసెంబరులో ఒక్క మనిషి చేసిన నిరాహారదీక్ష మీడియా మొత్తాన్ని తనవైపుకే తిప్పుకుందన్న సంగతి వీళ్ళు మర్చిపోయారా? ఆ ఒక్క మనిషి వైపుకే కెమెరాలన్నీ నిలిపి ఉంచారనీ, కొన్ని వారాల పాటు ఆ వార్త, ఆ వాదనా తప్ప మరోటి వినబళ్ళేదనీ మనకు తెలుసు. అలాంటిది, ఇప్పుడు డెబ్బై ఎనభై మంది నాయకులు – ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు, శాసనసభలోని యావత్ ప్రధాన ప్రతిపక్షం అంతా పక్క రాష్ట్రంలో అరెస్టైతే, ఆ వార్తలు రాయడం, ఆ ఫొటోలు వెయ్యడం, ఆ వీడియోలు చూపించడం తప్పా? అది పక్షపాతమా? మన గురించి బాగా రాస్తే మన శ్రీనివాసు, లేకపోతే వేమూరి గాడు -ఇదీ వరస!  మనకు నచ్చినవి వేస్తే  నిష్పాక్షికత, లేకపోతే అబద్ధాలు, కుట్రలు!!  ఏం వింతరా నాయనా!!?


ఇహపోతే, వాళ్ళక్కడ రాజభోగాలనుభవించారు, ఏసీ గదుల్లో ఉన్నారు అంటూ చెప్పుకొస్తున్నారు, కొందరు. వీళ్ళు చెప్పే మాటలు కూడా మీడియాలో వచ్చినవే, వీళ్ళు చూసినవి కావు.  ఆ వార్తలు మాత్రం సమ్మగా ఉంటై, చంద్రబాబుకు అనుకూలంగా ఉండే వార్తలు చూస్తే మాత్రం దురదగుండాకు రాసుకున్నట్టుగా ఉంటది.  ఏఁ, మహా ఘనత వహించిన నిరాహారదీక్షాదక్షుడు సుబ్బరంగా రోజూ ఇడ్లీలు మింగేవాడనీ, ఆ గదంతా పచ్చడి వాసనొచ్చేదనీ అప్పుడు జనం చెప్పుకోలా? అవి పత్రికల్లో ఎక్కడా ప్రముఖంగా రాలేదు. ఈ నిష్పాక్షికులెవరూ అప్పుడు మాట్టాడలేదు. మనకనుకూలంగా ఉన్నప్పుడు నిష్పాక్షికత ఉన్నట్టూ, లేనప్పుడు పరమ పక్షపాతం వహిస్తున్నట్టూనా?

Advertisements

బాబ్లి సమస్య – చంద్రబాబుది ఉత్తమ స్వార్థం, మిగతావాళ్లది నీచ స్వార్థం!

గోదావరి మీద మహారాష్ట్ర కడుతున్న బాబ్లి ప్రాజెక్టు గురించి తెదేపా గొడవ చేస్తూ సమస్యను రాష్ట్రాన్ని దాటించి మహారాష్ట్రకు, అక్కడినుంచి ఢిల్లీకీ చేర్చింది. ప్రాజెక్టు చూస్తామంటూ బస్సు యాత్ర చేపట్టి అక్కడి ప్రభుత్వం చెరలో పడ్డారు. ప్రాజెక్టు చూడకుండా తిరిగి పొయ్యేది లేదని చెప్పి, చంద్రబాబు సమస్యను చాలా చక్కగా వెలుగులోకి తెచ్చాడు.

కానీ, ఈ ఆందోళనపై ప్రభుత్వమూ, మిగతా పార్టీల ధోరణి మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల లబ్ధి కోసం బాబు ఈ యాత్ర చేస్తున్నాడని విమర్శించారు. నిజమే, ఎన్నికల లబ్ధి కోసమే చేపట్టి ఉండొచ్చు. కానీ, ఆలోచించాల్సింది -అసలు సమస్య ఉందా, లేదా అనేది. అది మనకు ఎంత నష్టం కలిగిస్తుంది అనేది మనం ఆలోచించాలి. ఆ ప్రాజెక్టుల వలన మనకెంతో నష్టమని అందరూ అంగీకరించే విషయమే. కాని, సమస్యలోకి పార్టీల, ఎన్నికల గొడవను చొప్పించి, సమస్యను పలచన చేసి, మన వాదనను బలహీనం చేసి, రాష్ట్రం మొత్తాన్నీ పలచన చేసుకుంటున్నాం.  తెదేపాతో కలిసి ఆందోళన చెయ్యకపోతే మానె, ఆ ఆందోళనను సమర్ధించకపోవడం మాత్రం సమర్ధనీయం కాదు. పార్టీల సంగతి ఎట్టాగన్నా ఉండనీండి, కనీసం మన ప్రభుత్వం తన ఆందోళన చెప్పి ఉండాల్సింది. ముఖ్యమంత్రి గట్టిగా మాట్టాడి మన నాయకులను బాబ్లీకి వెళ్ళనివ్వకపోవడం తప్పని మాట్టాడి ఉండాల్సింది. అలాంటిది ఆయన కూడా చంద్రబాబును తప్పు పట్టటం తప్పు. తెదేపాకు లాభమేదో జరిగిపోతుందని ఈ సమస్యలో ఆయన మహారాష్ట్ర పక్షాన్ని సమర్ధిస్తాడా? లేక, రాష్ట్ర ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని, మహారాష్ట్ర చర్యను నిరసిస్తాడా?

బాబ్లితో పాటు కడుతున్న 13 ప్రాజెక్టులు పూర్తైతే మనకు నీళ్ళు హుళక్కేనని అంటున్నారు.  రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు ఈ సమస్య మీద గొంతెత్తాలి. అందరూ కలిసి, సమస్య మీద కేంద్రంపై వత్తిడి తేవాలి. తెదేపాతో కలిసి చెయ్యకపోయినా, కనీసం ఎవరి దారిన వాళ్ళైనా గొడవ చెయ్యాలి. తెదేపాను విమర్శించడం మానాలి. ఎన్నికల్లో చంద్రబాబు ఏదో బాగుపడిపోతాడని అసలు సమస్యను పక్కనబెట్టి తెదేపాను విమర్శించడం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నట్టే! ఇంకోటేంటంటే, బాబ్లి మీద ఏ ఇతర రాజకీయ పార్టీ కంటే కూడా తెదేపాయే ఎక్కువ ఆందోళన చేసింది.


ఎన్నికల ప్రయోజనం కోసం చంద్రబాబు చేస్తున్నది స్వార్థమే, కానీ అది తన పార్టీతో పాటు రాష్ట్రానికీ ప్రయోజనం కలిగించేది. కాబట్టి అది మంచి స్వార్థమే. తెదేపాను విమర్శించే పార్టీలదీ స్వార్థమే. కానీ వాళ్ళది నీచ స్వార్థం. ఎన్నికల్లో చంద్రబాబు లాభం పొందకుండా చెయ్యడం తమకు లాభం కలిగించే స్వార్థం. దాంతోపాటు వీరి ధోరణి రాష్ట్రానికి  నష్టం కలిగిస్తోంది. అంచేతే వాళ్ళది నీచ స్వార్థం! వీళ్ళందరికంటే చంద్రబాబే నయం! పార్టీలకతీతంగా ప్రజలు తెదేపా నాయకుల యాత్రను సమర్ధించాలి, వాళ్ల అరెస్టును ఖండించాలి, సమస్య పరిష్కారానికై కేంద్రంపై వత్తిడి తేవాలి. 

మాకూ ఉపశమనం కావాలి!

కేంద్ర మంత్రి శరద్ పవారుకు పనెక్కువైపోయిందంట, కాస్త రిలీఫు కావాలంట. అవును మరి, బీసీసీఐ, ఐసీసీల్లో పనిచెయ్యడం చేత ఇక్కడ మంత్రిగా పని చెయ్యడానికి టైము దొరకడం లేదు, తీరికా దొరకడం లేదు పాపం. అందుగ్గాను, కేంద్రమంత్రిగా పని తగ్గించాలంట.  మంత్రి పదవిని ఈడి బాబు ఈడికి వారసత్వంగా ఇచ్చినట్టు, పన్నులేసుకుని ఈణ్ణి పోషించండని మన నెత్తిన కూచ్చోబెట్టినట్టూ, ఈ పనీ పాటా చెయ్యని సన్నాసికి కంచిగరుడసేవ చేస్తూ పని చేసేందుకు ఇంకోణ్ణి పెట్టుకోవాలంట. ఈడేమో క్రికెట్టు సంఘాల్లో సమావేశాల్లో తలమునకలుగా ఉంటాడు.

పని భారం తగ్గించాలంట సారుకు.. పని అంత భారంగా ఉన్నవాడు, బీసీసీఐలోను, ఐసీసీలో పని ఎందుకు నెత్తిన పెట్టుకున్నట్టు? అది మానెయ్యొచ్చుగా. లేదా ఆ పని అంత ముద్దుగా ఉంటే ఇక్కడ మంత్రి పదవికి రాజీనామా చేసి పారేసి అవతలికి పోవచ్చు. తేరగా ఇక్కడ పదవీ భోగాలు అనుభవిద్దామని కాకపోతే, పదవిని పట్టుకు ఏలాడటం ఎందుకు? పనులనుండి ఉపశమనం కావాలిగానీ, డబ్బులూ, భోగాలూ మాత్రం వదులుకోడంట.

కొంతమంది  ముష్టెదవలుంటారండీ, మన చూరు పట్టుకు వేలాడుతూనే ఉంటారు, పొమ్మన్నా పోరు! మన ఇంటి వాసాలు లెక్కెడుతూనే ఉంటారు. అలాటెదవల్ని ఎన్నుకుంటున్నందుకు మనల్ని మనం చెప్పెట్టుక్కొట్టుకోవాలి.

ఏమయ్యా ప్రధానమంత్రీ! 
మేం చెప్పెట్టుక్కొట్టుకుంటాం సరే, నువ్వేం చేస్తావ్?
అసలు కేంద్రమంత్రి పదవంటే అదేమైనా పార్ట్‍టైము ఉద్యోగమా? ఒక పక్క ఈ పని చేస్తూ అసలు దీనికేమీ సంబంధం లేని మరో పని చెయ్యడమేంటి? ఆపైన, మంత్రి పని చేసేందుకు తీరిక లేకుండా ఉంది, ఇంకో మంత్రిని వేసి నా భారాన్ని తగ్గించండి అని అడగడమేంటి? సిగ్గుందా అసలా అడిగినాడికి? ఆణ్ణి ఇంకా మంత్రిగా ఉంచుకున్న నిన్నేమనుకోవాలసలు? ఆడికి నీతి లేదు సరే, నీ నీతేమయింది? నీకేదో నీతీ నిజాయితీ ఉన్నాయంటారే.. ఉన్నాయా, లేక ఉండేవా?

మంత్రిపదవికి సంబంధించిన మరో పనేదైనా అయితే ఆలోచించాల్సిన పనిలేదు. ప్రభుత్వానికి అస లేమాత్రం సంబంధం లేని క్రికెట్లో పనేంటి? జనం ఆణ్ణి ఎన్నుకున్నదెందుకు? మంత్రివర్గంలో ఎందుకు చేర్చుకున్నట్టు? మంత్రిగా భోగాలననుభవిస్తూ, జీతం తీసుకుంటూ, పని మాత్రం క్రికెట్లో చేస్తాడా? మాడబ్బులు తింటూ, ఎవుడిదగ్గరో పని చేస్తాడా? నీ దగ్గర పనిచేసే బంట్రోతు ఇంకోడి దగ్గర ఉద్యోగం చేస్తే నియమ నిబంధనల పేరు చెప్పి తీసేస్తావు, మంత్రి కాడికొచ్చేసరికి ఏమయింది? దర్జాగా క్రికెట్టు సంఘాల్లో చేరిపోయాడు, అదేదో మామూలే నన్నట్టు.

సిగ్గూ శరాలేమైనా ఉంటే పదవుల నుంచి తప్పుకోండి. అవి లేకపోతే ఇట్టాంటి వార్తలు బైటికి పొక్కకుండానైనా జాగర్త పడేడవండి. మీరెంత మురికి సన్నాసులో మాకు తెలవకుండానైనా ఉంటది. కనీసం, సిగ్గు నటించండి. మీ కోసం కాకపోయినా, ప్రజలు చూస్తున్నారనైనా కాస్త సిగ్గు నటించండయా!

బియ్యెస్సెన్నెల్ బ్రాడ్ బ్యాండు వాడుకరులారా..

..అనురాగ దేవతలారా!

ఇలా ధర్మవరపు సుబ్రహ్మణ్యం శైలిలో పిలవడానికి కారణమేంటంటే.. కుసింత జాగర్తగా ఈ టపా చదివి ఇందులో చెప్పిన సూచన పాటించాలని. 

నేను బియ్యెస్సెన్నెల్లు వారి బ్రాడ్ బ్యాండు వాడుతున్నాను. పని చేసినన్నాళ్ళూ అది చక్కగా పని చేస్తుంది. ఏదైనా సమస్య వస్తే మాత్రం నానా తిప్పలూ పడాలి దాన్ని బాగు చేయించుకొనేందుకు. అదృష్టవశాత్తూ నాకు ఈమధ్య కాలంలో సమస్యలేమీ రాలేదు. అంచేత నేను బియ్యెస్సెన్నెల్లు వారిని పిలవనూ లేదు.

ఈవిధంగా హాయిగా జీవిస్తూండగా రాత్రి కంప్యూటరు మొదలెట్టగానే, http://www.motive.bsnl.co.in/ అనే సైటు తెరుచుకుంది. మీ మోడెమును చక్కగా పనిచేయించేందుకు, సమస్య వచ్చినపుడు బియ్యెస్సెన్నెల్లు వాడిచేత రిమోటుగా రిపేరు చేయించుకొనేందుకు, ఇదిగో ఈ లింకు నొక్కి, సాఫ్టువేరును దించుకోండి అని ఉంది. చక్కగా బియ్యెస్సెన్నెల్లు వాడి సైటులాగానే ఉందా పేజీ. ఓహో మన బియ్యెస్సెన్నెల్లేగదా అని ఆత్రంగా వాడిచ్చిన  డౌనులోడు లింకును నొక్కి motiveactivation.zip అనే, చిన్నాచితకా కాదు, 138 ఎంబీల ఫైలును దించుకున్నాను. అయితే, వెంటనే నా యాంటీవైరసు తెరమీదకు దూసుకొచ్చింది.. ఇందులో Click2kUns.exe అనే వైరసుంది అంటూ! వెంటనే ఆ ఇన్‍స్టాలును ఆపుజేసేసాను. జాలంలో Click2kUns.exe కోసం వెతికితే నాలాంటి ఆత్రగాళ్ళు ఇంకా ఉన్నారని తెలిసింది. 

అంచేత మీరు గ్రహించాల్సింది ఏంటంటే.. మీరూ నాలాగా ఆత్రపడకండి, ఆ ఫైలును డౌనులోడు చేసుకోకండి. అది బియ్యెస్సెన్నెల్లు పేరుతో ఎవడో వైరసుగాడు పంపిస్తున్నట్టున్నాడు. దీని గురించి మరింతగా తెలిసినవాళ్ళుంటే చెప్పగలరు. మరిన్ని వివరాలు తెలిసేదాకా  దాని జోలికి వెళ్ళకపోతే మంచిది.  

మందు x మందులు

రాష్ట్రంలో మందు దుకాణాల పాటలు కోట్లలో పాడారు. ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు పోగేసుకుంది. పాటలు పాడినవాళ్ళలో ఎక్కువమంది రాజకీయులే. ఏదో ఒక కొట్టులో వాటాలేని ఎమ్మెల్యే ఎవరైనా ఉంటే అతగాడు పాపం మరీ అమాయకుడైనా అయ్యుండాలి, లేదా మరింకేదైనా డబ్బులొచ్చే యవ్వారంలో తలమునకలుగా ఉండి ఉండాలి, లేదా జయప్రకాశ్ నారాయణైనా అయ్యుండాలి!

డబ్బులకోసం జనాల జేబులను కొల్లగొడుతోంది ప్రభుత్వమంటూ ఈ వేలంపాటలమీద విమర్శలొచ్చాయి. ఇదేంటయా, మరీ ఇంతలా బరితెగించారేంటి అని అడిగితే, అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులూ ఏమంటున్నారూ.. ’ప్రజల చేతుల్లో బాగా డబ్బులాడుతున్నాయి, వాళ్ళు కూడా ఎంజాయి చేద్దామని ఆలోచిస్తున్నారు అంచేతే తాగుతున్నారు’ అని మన చెవుల్లో పూలు పెడుతున్నారు. ఎంత లెక్కలేనితనమో, ఎంత ఎటకారమో చూడండి.

గవర్నరు గారిక్కూడా ఈ పూల పంపకాలు, ఎటకారాలూ నచ్చినట్టులేదు. ఈ సన్నాసి రాజకీయులను తిట్టేందుకు మంచి సమయాన్ని, సందర్భాన్నీ ఎంచుకున్నాడు. ఆరోగ్యశ్రీ పథక పరిశీలనను ఆయుధంగా వాడుకున్నాడు.

 • రాష్ట్రంలో పేదరికం ఈ స్థాయిలో ఉందా? ,
 • ఆర్థికాభివృద్ధిలో దేశంలోనే మూడో స్థానంలో ఉన్నట్లు చెప్పుకుంటున్నాం… ఇక్కడ ఇంత పేదరికం ఎలా ఉంది? అసలు అభివృద్ధి చెందుతున్న వారెవరు?

అంటూ ప్రశ్నలడిగాడు. ఈ ప్రశ్నల ద్వారా అన్యాపదేశంగా రెండు వ్యాఖ్యలు వదిలాడాయన:

 1. తాగుడు దగ్గరకొచ్చేసరికి ప్రజల దగ్గర డబ్బులున్నాయంటున్నారు, ఆరోగ్యశ్రీ మాత్రం 82% పేదరికం ఉందని చెబుతోంది.
 2. ఓ పక్క తాగుడును విచ్చలవిడిగా ప్రోత్సహిస్తూ, మరో పక్క ఆరోగ్యశ్రీ మీద తెగ ఖర్చు చేసేస్తున్నారు

అసలు గవర్నరు టైమింగు చూడండి! ప్రజల దగ్గర డబ్బులున్నాయని వాళ్ళు ఓ పక్క చెబుతూండగానే, ఈయన పేదరికమ్మీద, ఆరోగ్యశ్రీ మీదా వ్యాఖ్యలు చేసాడు. కావాలని అన్నాడో అనుకోకుండా అన్నాడో గానీ, ఈ వ్యాఖ్యలు మాత్రం ప్రభుత్వానికి చురకల్లాంటివే! అయితే ఈ చురకలూ వాతలకు రాజకీయ బ్రహ్మరాక్షసులు అదిరేనా బెదిరేనా? సీయేజీ యే సూటిగా తిట్టిపోసినా కూడా చలించని జాతి వీళ్లది (గతంలో నేను రాసిన టపా ఒకటి చూడండి), ఇలా అన్యాపదేశంగా తిడితే దడుస్తారా? రాజకీయుల మీద విమర్శలు, దున్నపోతు మీద వానా, ఒకటే కాదూ!?

గవర్నరు ఇంకో ప్రశ్న కూడా అడిగాడు: “ముదిరిన జబ్బులకు చికిత్స చేయిస్తున్నారు సరే… మరి ఎక్కువ మంది ప్రజలకు వస్తున్న సాధారణ వ్యాధుల పరిస్థితేమిటి? అని. ఆరోగ్యశ్రీ పెట్టినప్పటి నుంచీ లోక్‍సత్తా అడుగుతున్నది ఇదే! ’ఈ పథకం పేరున కార్పొరేటు ఆసుపత్రుల్ని మేపుతున్నారు, ప్రజలకు ఇంతకంటే ఎంతో అవసరమైన ప్రాథమిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి’ అంటూ మొత్తుకున్నారు. అయినా అప్పటి ముఖ్యమంత్రి వినిపించుకోలేదు. స్వప్రయోజనాలు, స్వజనులప్రయోజనాలే ముఖ్యమైన మంత్రులు ఇవన్నీ పట్టించుకుంటారా? పట్టించుకున్నారా?

ఒక్కడే మహానుభావుడు..

మహానటుడు ఎస్వీరంగారావు గురించి బాపు రమణలు ఒక స్కెచ్చి రాసారు ఒకప్పుడు. రంగారావు మనస్తత్వాన్ని, అభిరుచులను, అలవాట్లను, నటన తీరునూ విశ్లేషిస్తూ అనేక రంగారావులను ఆవిష్కరిస్తారు -కంగారం’గారావు, ’చతురం’గారావు,.. -ఇలాగ.

ఆ స్కెచ్చిని సిగ్గులేకుండా అనుకరించే ఇంకో స్కెచ్చి ఇది. అయితే తాము ఎవరి గురించి రాస్తున్నారో బాపురమణలు హెడ్డింగు పెట్టి మరీ చెప్పేసారు. నేను మాత్రం ఎవరి గురించి రాస్తున్నానో చెప్పడం లేదు. అది అత్యంత రహస్యం. సుమన్ సినిమాలో విలనెవడో హీరోయెవడో కనుక్కోవచ్చేమోగానీ, ఈ స్కెచ్చెవరిదో కనుక్కోడం మాత్రం దేవుడికే కాదు, సాక్షాత్తూ ఆ సుమనుకైనా సాధ్యం కాదని నా నమ్మకం. ఇక చదవండి..

 • మంత్రివర్గ విస్తరణ మేడమ్మ ఇష్టమంటూ బాధ్యతను అటేపు తోసేసేటపుడు త్రోశయ్య
 • ’జగనుడి విమర్శలపై ఒక్కరూ నోరు తెరవరే? నాకేనా, మీకు లేదా బాధ్యత?’ అని మంత్రులను అనేటపుడు ఆక్రోశయ్య
 • ’నేనేమైనా ఖాళీగా ఉన్నానా? మంత్రివర్గ సమావేశం నుండి ఇప్పుడే గదా బైటికి వస్తున్నాను.. రాష్ట్రంలో తుపాను వచ్చిందని, కేసీయారు నిరాహారదీక్షకు కూచ్చున్నాడనీ, కర్నూలు మునిగిపోయిందనీ.. మీటింగుల్లో ఉన్నవాడికి ఎలా తెలుస్తుందయా? అసలేమీ తెలియనిదాని గురించి వ్యాఖ్యానించమంటావేంటి? మాట్టాడేదానికి అర్థముండక్కర్లా?’ అంటూ విలేఖరిపై బక్కకోపం చూపించేటపుడు ఉక్రోశయ్య
 • సంక్షేమ పథకాలకు నిధులను అడ్డంగా, నిలువుగా, ఐమూలగా కోసిపారేసేవేళ ’కట్ కరో’శయ్య, ’మరోమారు మారో’శయ్య
 • ’ఏమయ్యా అరుణ్ కుమారూ, నువ్వేం పెద్దమనిషివయ్యా?’ అంటూ ఉగ్రమూర్తి ఐనపుడు ఉగ్రోశయ్య
 • పరిపాలన గురించి గవినీరు దొర ఇంకో కొత్త కామెంటు విడుదల చేసినపుడు మూగ’రో’శయ్య
 • మేడమ్మ మంత్రివర్గ విస్తరణను మరోసారి వాయిదా వేసినపుడు ఢిల్లీ నుంచి తిరిగొస్తూ ’ఈసురో’శయ్య
 • బాబును ఎగతాళి చేస్తూ ఎడాపెడా బ్యాటింగు చేసేవేళ సిక్సరోశయ్య
 • నాగం జనార్దనుడి చెయ్యి తీసేస్తానని అనుచుండ, ఆతడు రోశయుండ!
 • తప్పనిసరై హెలికాప్టరు ఎక్కాల్సినవేళ ’డరో’శయ్య
 • రెణ్ణెల్లకొకటి చొప్పున ఏదో ఒక సమస్య వచ్చిపడి, జగనుడికడ్డంపడి, తాను తెరపినపడి, మనసులోనే ఆనందపడి.. హుషారోశయ్య
 • ఆయా సందర్భాల్లో ఆయా విధాలుగా కాక, ఇంకేయే విధాలుగా ఉన్నా.., ఆయన ’అన్’రోశయ్య, ’మరో’శయ్య

పోతే, బాపురమణలను ఇలా ఎందుకు అనుకరించావని అడిగితే.. నిజాయితీగా ఓ మాట చెప్పుకోవాలి. అనుకరిద్దామని మొదలెట్టలేదు, ఓ మూణ్ణాలుగు  రాసాక, అది గుర్తొచ్చింది. నాకే గుర్తుకు రాగా లేంది, మీకు మొదటిది చదవగానే గుర్తొచ్చేస్తదని నాకు తెలుసు. అంచేత కాపీ కొట్టేసానని మీరు అనకముందే నేనే అనేసుకుంటన్నానన్నమాట.
————–
అన్నట్టు, భారతీయ అమెరికనులు చేసిన యజ్ఞం వివరాలు చదివారా?

ఐఐఐయో.. ఐఐఐటీ!

రాష్ట్ర ఐఐఐటీల్లో ప్రభుత్వం సీట్లను తగ్గించేసింది. రెండేళ్ళ కిందట మొదలుపెట్టిన ఈ ఐఐఐటి వ్యవస్థను మొక్కగా ఉండగానే కత్తిరించడం మొదలుపెట్టింది. ఈ కత్తిరింపు, మొక్క ఏపుగా ఎదగడానికని ప్రభుత్వం చెబుతోంది.

పదోతరగతి చదివిన పిల్లలను (ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో) ఐఐఐటి కోర్సులో చేర్చుకుని, ఆరేళ్ళ తరవాత ఏకంగా రెండు డిగ్రీలతో బయటికి పంపించడమనేది ఈ సంస్థల ఆశయం. మొత్తం మూడు చోట్ల పెట్టారు – బాసర, నూజివీడు, ఇడుపులపాయ. ఒక్కోదానిలో సంవత్సరానికి 2,000 మందిని చేర్చుకునే ఆలోచనతో మొదలుపెట్టారు. మొదటి రెండేళ్ళూ బాగానే తీసుకున్నారు. ఈ యేడు మాత్రం, అంతమందిని తీసుకోలేమని చెబుతూ దాన్ని వెయ్యికి కుదించారు.


ఐఐఐటీలను పెద్ద యెత్తున ఆర్భాటంగా మొదలుపెట్టారు. చిన్న స్థాయిలో మొదలుపెట్టి, వ్యవస్థ సరిగ్గా ఏర్పడేలా జాగర్తపడుతూ, నిదానంగా విస్తరించుకుంటూ పోతే బాగుండేది. ఏడాదికి 2000 మంది చొప్పున ఆరేళ్ళ కోర్సుకుగాను మొత్తం 12,000 మంది ఒక్కోచోట చదువుకునే సామర్థ్యం కలిగిన సంస్థలివి. మొదటి రెండేళ్ళు ఇంటరు చదువుతారు. తరువాతి నాలుగేళ్ళలో రెండు ఇంజనీరింగు డిగ్రీలు వస్తాయి. ఈ మూడు ఐఐఐటీలు కొత్తగా ఏర్పరచిన ఒక యూనివర్సిటీకి అనుబంధంగా ఉంటాయి. ఆ యూనివర్సిటీ పేరు -మామూలే- రాజీవ్ గాంధీ…గట్రా గట్రా! ఈ యూనివర్సిటీకి చాన్సెలర్ గవర్నరు కాదు, డా. రాజ్ రెడ్డి. డా. రాజ్ రెడ్డి అంటే.. ఫ్రెంచి లీజియన్ ఆఫ్ ఆనర్, ఓయెమ్సీ కంప్యూటర్స్ (ఇప్పుడీ కంపెనీ లేదు), మిలియన్ బుక్స్ కార్యక్రమంలో భారతీయ భాషాపుస్తకాల సాంఖ్యీకరణం (డిజిటైజేషన్) మొదలైనవాటితో ముడిపడ్డ ప్రసిద్ధ వ్యక్తి. వైస్ చాన్సెలరు ఐఐటీ నుంచి వచ్చారు. ప్రో చాన్సెలరని ఇంకో హోదా ఉంది. మొన్నటిదాకా వైసు గా ఉన్నాయన్ను నైసుగా ఇప్పుడు ఈ పదవిలో పెట్టారు. నిరూపణ కాని ఆరోపణలు ఈయన మీద చాలానే ఉన్నాయి.

ఈ ఐఐఐటీల పనిలో కొన్ని లోపాలున్నాయి. ప్రవేశాలను వ్యవస్థీకరించకపోవడం, దానిలో తప్పులు జరగడం ఈ వీటిలో ఒక పెద్ద లోపం. లోపాలు జరిగాయని ఆరోపణలు, ప్రవేశాల రద్దు, తిరిగి జరపడం,.. ఇవన్నీ కలిసి నిరుడు పాఠాలు చెప్పడం మొదలయ్యే సరికి సెప్టెంబరు గడిచిపోయింది (ఇంటర్మీడియెటు కాలేజీలు మాత్రం జూన్ లోనే మొదలౌతాయి). సహజంగానే పదో తరగతిలో మెరుగ్గా ఉన్న కుర్రాళ్ళకే ఐఐఐటీల్లో అవకాశాలొస్తాయి. ఇలాంటి పిల్లలకు ఇంటర్లో చేరేందుకు వలవేసే కార్పొరేటు కాలేజీలవాళ్ళుంటారు. వాళ్ళు, “మీ కుర్రాడికి, అమ్మాయికి ఊరికినే సీటిస్తాం మాదగ్గర చేర్చండి, ఆలస్యమైతే సీట్లయిపోతాయి” అంటూ వెంటపడతారు. ఇటు, ఈ ఐఐఐటీ సీటు సంగతేదో తేలితే వేరేదారి చూసుకోవచ్చుగదా అని అనుకునే పిల్లలకు ఐఐఐటిలు చేసే ఆలస్యం చాలా ఇబ్బంది కలిగిస్తుంది. దానికితోడు, ఈ యేడు చూస్తే ఇదిగో ఈ సీట్ల కోత!


డబ్బుల్లేవని ప్రభుత్వం సీట్ల సంఖ్యలో కోత పెట్టింది. ఇలాంటి చర్యలు తీసుకుంటూంటే వాటిలో చేరాలంటే విద్యార్థులకు ఆందోళనగా ఉండదా? పైగా వాటిలో చేరితే ఆరేళ్ళు కట్టుబడి ఉండాలి. ప్రభుత్వం మధ్యలో చేతులెత్తేస్తే? ప్రభుత్వం కాబట్టి చేతులెత్తెయ్యదులెమ్మనుకున్నా.., సరిగ్గా పట్టించుకోకపోతే? పైగా ఈ పిల్లలేమీ అల్లాటప్పా సరుకు కాదు, ఎక్కడ చదివినా మంచి స్థాయికి పోగలవాళ్ళు. చాకుల్లాంటివాళ్ళు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల నెదుర్కొంటూ కూడా చదూకుంటున్నవాళ్ళు. ప్రతిభావంతులైన ఈ పిల్లలు సెప్టెంబరు దాకా వీటి కోసం ఆగటమా లేక, ఏదో ఒక మంచి కాలేజీలో ఇంటరులో చేరటమా అనేది నిశ్చయించుకోవాల్సిన తరుణమిది.

పైగా ఈ యేడు చూడండి.. ప్రవేశార్హతను నిర్ణయించడంలో జాప్యం జరిగింది. గతంలో ఉన్న నిబంధనను మార్చి , ఒక్క పదో తరగతి మాత్రం గ్రామీణ పాఠశాలలో చదివితే చాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం మొన్నమొన్నే జరిగింది. అర్హతలను మార్చాలనుకున్నపుడు ముందే సదరు ఏర్పాట్లు చేసి పెట్టుకోవాలి. తీరా చివరి నిముషంలో ఇప్పుడు మారిస్తే తగువిధంగా దరఖాస్తులనూ మార్చాలి. ఇదీ, సీట్ల కోత నిర్ణయమూ – ఈ రెండూ కలిసి, ఇదిగో ఇంతవరకూ ప్రవేశానికి సంబంధించిన ప్రకటనే రాలేదు. ఈ వ్యవహారాలన్నీ చూసాక, ఐఐఐటిల మీద మనకు నమ్మకం సడలటం సహజం. పూర్తిగా ఆరేళ్ళూ సరిగ్గా చదువు చెబుతారా అనే సందేహం తలెత్తే అవకాశం లేకపోలేదు. ఈ యేడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి చూస్తే ఐఐఐటీల్లో చేరాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం ఏర్పడేట్టుంది.

ఐతే ఐఐఐటీలను మరీ తోసిపుచ్చనక్కర్లేదేమో! వాటి భవిష్యత్తు ఆందోళనకరంగా ఉందన్నమాట నిజమే అయినప్పటికీ, ఇప్పటికిప్పుడు ఐఐఐటీలకొచ్చిన ముప్పు ఏమీ లేదని నా ఉద్దేశం. ఇవ్వాళ ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే, ఐఐఐటీల్లో చేరేందుకు ప్రతికూలతల కంటే అనుకూలతలే కొద్దిగా ఎక్కువ ఉన్నాయనిపిస్తోంది. ఈ అనుకూల ప్రతికూలతలేంటో చూద్దాం..

 1. డా. రాజ్ రెడ్డి ఇంకా తప్పుకోలేదు .అంటే -ఆయన ఇంకా వాటిమీద ఆశ కోల్పోలేదన్నమాట. (తప్పుకుంటారన్న వార్తలు మాత్రం వచ్చాయి) . ఆయన వంటి వారి వలన , పరిశ్రమతో సంబంధాలు పెట్టుకుని, పిల్లలకు ఉద్యోగావకాశాలు ఏర్పరచే నేర్పు కూడా ఐఐఐటీలకు ఏర్పడుతుంది. ఆయన తప్పుకుంటే అది పెద్ద దెబ్బే!
 2. ఇప్పుడు సీట్లు తగ్గించారు కదా, అంటే తిరోగమనం మొదలైనట్లేనేమో.. నిజమే. సీట్లు తగ్గించారు. మిగిలిన ఈ సీట్లనైనా చక్కగా పద్ధతి ప్రకారం నింపి, పిల్లలకు చక్కటి చదువు చెబుతారని కోరుకుందాం. పైగా ఈ కోత వల్ల చేరే పిల్లలకు నష్టమేమీ లేదు, ఎంతో కొంత ఉపయోగమే.
 3. ముందుముందు ఎలా ఉండబోతోందో, ప్రభుత్వం ఇంకా ఏయే నిర్వాకాలు చేస్తుందో .. ఇప్పుడు ఈ చర్యలు తీసుకున్న ప్రభుత్వం, ముందుముందు అసలే మూసేసే ఆలోచనలు చెయ్యదని ఎలా చెప్పగలం.? ఈ సంస్థలపై ప్రజలు పెంచుకున్న ఆశలను బట్టి చూసినా, ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని బట్టి చూసినా, ప్రభుత్వం వాటిని మూసెయ్యకపోవచ్చు. పైగా, కోర్సు ఆరేళ్ళది అయినప్పటికీ, రెండేళ్ళ తరవాత బయటికి వచ్చే సౌకర్యం ఉంది. బైటికొచ్చి, ఎమ్సెట్ రాసుకుని ఏదైనా ఇంజనీరింగు కోర్సులో చేరే అవకాశం ఉంది.
 4. మరి సెప్టెంబరు దాకా ఆగేదెలా? అప్పుడు సీటు రాకపోతే రెంటికి చెడ్డ రేవడ కాదూ? నిజమే, అందుగ్గాను, ఐఐఐటీ సీటు కోసం ఎదురు చూడకుండా, ఏదో ఒక కాలేజీలో ఇంటరులో చేరి చదువుకోవాలి. ఆనక ఐఐఐటీలో సీటొస్తే ఇక్కడ మానేసి, వెళ్ళటమే. కాకపోతే ఈ కాలేజీవాళ్ళకు ముందుగానే ఆ సంగతి చెప్పి, ఫీజు కట్టడం వాయిదా వేసుకోవాలి.

ఐఐఐటీల పట్ల ప్రభుత్వం మరింత బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. వాటిపట్ల తమ నిబద్ధతను చూపిస్తూ, ప్రజలకు భరోసా ఇస్తే ఇప్పుడు చేరదలచిన పిల్లలకు ధైర్యంగా ఉంటుంది.

  Categories: సమాజం