తెలుగు సినిమా పరిశ్రమలో "ఆ నలుగురు" ఎవరు?

September 27, 2010 8 comments

తెలుగు సినిమా దశ దిశ గురించి శనివారం నాడు హెచ్చెమ్ టీవీ ఒక చర్చా కార్యక్రమం చేసింది. అనేకమంది నిర్మాతలు, దర్శకులు ఇతర సాంకేతికులూ ఈ అమావేశంలో పాల్గొని తమ గోడు వెళ్ళబోసుకున్నారు.  పరిశ్రమ గురించి చర్చ పెడితే, పెద్ద నటులెవరూ రాలేదు. పెద్ద నిర్మాతలు, దర్శకులూ కూడా ఎవరూ రాలేదు.  -వాళ్ళను పిలవలేదో, పిలిచినా రాలేదో, వాళ్ళకు లాభం కలిగే సంగతులు ఇక్కడ లేవో, మరింకేంటో!  రామచంద్రమూర్తి  మన ఉద్దేశం ఫాల్ట్ ఫైండింగు కాదు ఫ్యాక్ట్ ఫైండింగ్! అని చెప్పాడు.  పాల్గొన్నవాళ్లలో కొందరు:  ప్రసన్న కుమార్,  సాగర్, విజయచందర్, విజేందర్ రెడ్డి, ఏవీయెస్.

అనేక విషయాలు చర్చకు వచ్చాయి.  ముఖ్యమైనవివి:

 1. ఆ నలుగురు:  థియేటర్ల గుత్తాధిపత్యం గురించి మాట్టాడడంతో చర్చ మొదలైంది. ప్రసంగాలు ఆటోమాటిగ్గా ఆ నలుగురి చుట్టూరా తిరిగాయి. ఎవరు ఏ విషయం గురించి మాట్టాడినా, విషయం ఆ నలుగురి మీదుగా పోకుండా ప్రసంగం ముగియలేదు.   కొందరు మృదువుగా చెప్పారు. కొందరు కుసింత ఘాటుగా చెప్పారు. కొందరు జాగర్తగా, వాళ్ళకి కోపం రాకుండా  ఉండేట్టుగా మాట్టాడారు. కానీ చాలామంది ఈ విషయాన్ని మాత్రం కదిలించారు. 
 2. డబ్బింగు సినిమాల నిషేధం: ఇది కూడా అందరి అభిమాన  టాపిక్కే! 
 3. చిన్న సినిమాలకు తొలి మూడు నాలుగు వారాలకు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలి: ఇది కొందరు అడిగారు. 
 4. నటీనటుల రెమ్యునరేషన్స్ తగ్గించుకోవాలి.
 5. నిర్మాణ ఖర్చు తగ్గించాలి
 6. సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గించాలి/పెంచాలి
 7. టెక్నాలజీని పెంపొందించాలి
 8. అవార్డులొచ్చిన సినిమాలకు సబ్సిడీ ఇవ్వాలి
 9. తెలుగు నటులకు ప్రాముఖ్యత ఇవ్వాలి

ఎక్జిబిటర్ల నాయకుడు విజేందర్ రెడ్డి ’నిర్మాతలు ఖర్చులు తగ్గించుకోవాలి, వాళ్ళు ఈ పని చెయ్యాలి, ఆ పని చెయ్యాలి’ అంటూ సలహాలు ఇచ్చాడు.  సినిమా హాళ్ళ వాళ్ళు మాత్రం టిక్కెట్ల రేట్లు  పెంచాలని కోరబోతున్నట్టు చెప్పాడు.  బెంగాలు, కర్ణాటక, తమిళనాడు,..  వగైరా చోట్ల రేట్లు మనకంటే చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు. ఇక, ఆ తరవాత మాట్టాడినవాళ్ళు ఆయన్ను విమర్శించారు. ఈమధ్యే రేట్లు పెంచారు మళ్ళీ ఎందుకు పెంచాలి అని ప్రశ్నించాడొకాయన. అసలు రేట్లు పెంచాల్సిన అవసరం మీకేముంది అన్నాడొకాయన. సినిమా విడుదలైన మొదటి రెండు వారాల్లో టిక్కెట్లను పెంచే జీవోను ఎక్జిబిటర్లే తెచ్చారని ఎవరో అన్నారు. విజేందర్ రెడ్డి  అబ్బే, అది అడిగింది నిర్మాతలేగానీ, మేం కాదని చెప్పాడు. ఛాంబర్లో నిర్మాతలే కాదు మీరూ ఉన్నారు అంటూ ఎదురు వాదన వచ్చింది. ఇలా కాసేపు వాళ్ళ వాదన సాగింది.

తెలుగు నటులకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదని చెప్పారు కొందరు.  ఇతర భాషా నటుల్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ప్రకాష్ రాజ్ ను బహిష్కరించాలని అనుకున్న తరవాత కూడా ఎందుకు అతడికి పాత్రలు ఇస్తున్నారు? అని అడిగాడు. “ఈ మాటే ప్రకాష్ రాజ్ ను ఎవరో అడిగితే, తెలుగు నిర్మాతలకు నన్ను బహిష్కరించేంత దమ్ము లేదు అని చెప్పాడంట” అని అతడే అన్నాడు.

ఒక అవార్డు సినిమా తీసిన దర్శకుడొకాయన, తన సినిమాకు ప్రభుత్వ సబ్సిడీ ఇవ్వలేదు, మంత్రి, అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం కానీ పనికాలేదు.  సబ్సిడీలను వెంటనే విడుదల చెయ్యాలని కోరాడాయన.  తెలంగాణ సినిమా జెయేసీ ప్రస్తావన తెచ్చాడొకాయన. తెలంగాణ ఉద్యమాన్ని ఇందులోకి దూర్చడానికి ఇది సమయం కాదు అని రెండు మూడు సార్లు వారించాక, ఊరుకున్నాడు.

టెక్నాలజీని మనవాళ్ళు సరిగ్గా వాడుకోవడం లేదు, అసలు టెక్నాలజీ గురించిన అవగాహన కూడా సరిగ్గా లేదు అని మరొకాయన  అన్నాడు. డిజిటల్ ప్రింట్లు రావాలి అని గుడివాడకు చెందిన డిస్ట్రిబ్యూటరు ఒకతడు అన్నాడు.

వెంకటేశ్వరరావనే ఒక ప్రేక్షకుడు చక్కగా మాట్టాడారు. అసలు తెలుగు సినిమాకు ఎందుకెళ్ళాలని అడిగారు.. చక్కటి తెలుగు భాష వాడుతున్నారని వెళ్ళాలా? తెలుగు సంస్కృతిని చక్కగా చూపిస్తున్నారని వెళ్ళాలా? అంటూ ప్రశ్నించాడు. 

ఒకాయన, చిన్న నిర్మాత అనుకుంటాను, “ఆ నలుగురు” మారితే తప్ప, చిన్న నిర్మాతలకు మనుగడ లేదు అని చెప్పాడు. వాళ్ళు మారాలి, లేదా “మనలోంచి నక్సలైట్లు ఎవరో పుట్టుకొచ్చి ..” అని మాట్టాడుతూ, తమాయించుకుని, మామూలుగా చెప్పుకుపోయాడు. 

విజయచందర్ ఘాటుగా మాట్టాడాడు..  ఆ నలుగురినీ గట్టిగా విమర్శించాడు. పేర్లు చెప్పొద్దని రామచంద్రమూర్తి గారు ముందే చెప్పారని ఆగాను గానీ, వాళ్ళ పేర్లు చెప్పేందుకు నేనేమీ వెనకాడను అని అన్నాడు. చిన్న సినిమాలను విడుదల చేసేందుకు థియేటర్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని చెబుతూ, “కరుణామయుడు” సినిమాను ఆ రోజుల్లో కాబట్టి, దాన్ని విడుదల చెయ్యగలిగాను గానీ, ఇవ్వాళ అది నా తరం కాదు, అన్నాడు.చిన్న సినిమాకు రోజులు కావివి అని ఆవేశంగా ప్రసంగించాడు.

చర్చలో కులం గురించిన  ప్రస్తావన ఎవరూ తేలేదుగానీ, ఒకాయన మాత్రం కులం పొలిమేర దాకా వెళ్ళి వచ్చినట్టనిపించింది.

చర్చ జరుగుతున్నంతసేపూ “ఆ నలుగురూ” ఎవరో ఎవరూ చెప్పలేదు. ఒకతను చెప్పాడుగానీ సరిగ్గా వినబడలేదు. ఎవరా నలుగురు ఏరా నలుగురు అంటూ మథన పడిన నాబోటిగాళ్ళు హమ్మయ్య అనుకునేలా, చివర్లో  ఆ నలుగురు ఎవరో చెప్పారు. ఆ పేర్లు చెప్పిన  వ్యక్తి త్రిపురనేని చిట్టి అనే దర్శకుడు. పేర్లు చెప్పాక, వీళ్లపై మనకు వ్యతిరేకత ఏమీ లేదు, కేవలం చిన్న సినిమాలను బతికించాలనే చెబుతున్నాం అని చెప్పాడు. ఆ పని చేసేలా దేవుడు వాళ్ళకు మంచి మనసు ఇవ్వాలని కోరుకుంటున్నాం  అని కూడా అన్నాడు.

 1. దగ్గుబాటి సురేష్
 2. అల్లు అరవింద్
 3. సునీల్
 4. దిల్ రాజు

ఇందులో ముగ్గురు తెలిసినవారే. ఆ సునీల్ ఎవరో మాత్రం నాకు తెలీలేదు. మీకు తెలుసా?

Advertisements

వంచన దినం! వంచకుల దినం!!

September 18, 2010 14 comments

ఈయేడు సెప్టెంబరు 17 నాడు ఏం చేసుకోవాలో తెలీలేదు మన రాజకీయ నాయకులకు.  పదిహేను రోజుల ముందుదాకా ఒక్కోడు పెద్దపెద్ద కబుర్లు చెప్పారు. వీర తెవాదులు విమోచనమన్నారు. అంత వీరులుకానివారు విలీనమన్నారు. సరే.., కొందరు మూర్ఖవాదులు విద్రోహమన్నారు – వీళ్ళని పక్కన పెట్టెయ్యొచ్చు ప్రస్తుతానికి.  వీళ్ళంతా ఇట్టా పోసుకోలు కబుర్లు చెబుతూ ఉన్నప్పుడు ముస్లిములు అడ్డు చెప్పలేదు, వాగనిచ్చారు. తరవాత ఒక ఇఫ్తారు పార్టీ పెట్టారు.  వీళ్ళు తమను ముస్లిములు అని పిలుచుకోరు మూవ్‍మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అనో మరోటో పిలుచుకుంటారు తమను.  రాజకీయ నాయకులు  కొందరు రూమీ టోపీలు పెట్టేసుకుని ఇఫ్తారుకెళ్ళారంట. అక్కడ ఆ ముస్లిములు తమ (అభి)మతాన్ని బైటపెట్టారు.  అంథే…! అప్పటి దాకా ఓ.. థెగ మాట్టాడేసిన పోసుకోలు రాయుళ్ళ నోళ్ళకు తాళాలు పడ్డాయి. నోటమాట రాలేదు.  కొందరు ద్రోహులైతే అసలు పదిహేడో తేదీన  బైటికే రాలేదు.

1948 సెప్టెంబరు 17న  హైదరాబాదు సంస్థానం భారత్ లో విలీనమైపోయింది. నిజాము, రజాకార్ల దుష్కృత్యాల నుంచి ప్రజలు విముక్తులయ్యారు.  ఈ సందర్భాన్ని తెలంగాణ విమోచన దినంగానే ఇన్నాళ్ళుగా జరుపుకుంటూ వస్తున్నారు. ఈయేడు మాత్రం మొత్తం అన్ని పార్టీలవాళ్ళూ మాట మార్చేసి విమోచన దినం కాదు, విలీనదినం అని పేరు మార్చారు – భాజపా,  లోక్ సత్తాలు తప్ప. ప్రభుత్వమే అధికారికంగా విమోచన దినాన్ని జరపాలని డిమాండిన తెరాస ఇప్పుడు గప్ చుప్ ఐపోయింది.

ఇక కేసీయారు సంగతి.. ఈయన  నాయకులందరి తల్లోంచి దూరెళ్ళినవాడు.  దంచుటకైనా, ముంచుటకైనా..  సారు  చాలా పెద్దవారు. గతంలో విమోచన దినమంటూ దంచిన కేసీయారు ఈసారి విలీనదినంగా చేసుకోవాలని మాటమార్చాడు. పాపం, మార్చక ఏం చేస్తాడులే – నిజామంటే భయభక్తులు ఉన్న వాడు, నిజాము కీర్తిగానం చేసేవాడూ గదా!  ముస్లిములు ఇచ్చిన షాకుతో  కేసీయారు మాట మార్చడమే కాదు, అసలు తమ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉత్సవానికి హాజరే కాలేదు.  వంచన ఎరిగిన తన మనసునకు ముంచుట యన్నది సహజమెగా!

తెరాస వారి తోక ఐన తెలంగాణ రాజకీయ జేయేసీ కూడా మాటమార్చేసి ఇది విమోచన కాదు, విలీనమని ప్రకటించింది. ఎందుకు విలీనమో, విమోచనమెందుక్కాదో వివరించి చెప్పేందుకు పాపం కోదండరామ్ కు తలప్రాణం తోకలోకొచ్చింది.  సారు గూడా ఆ ఇఫ్తారు పార్టీలో ఉన్నాడని భోగట్టా!

నవంబరు 1 నాడు రాష్ట్రావతరణ దినోత్సవం కదా!  ఆరోజున వీళ్ళేం చేస్తారో చూడాలి. రాష్ట్రావతరణకు ఏం పేరు పెట్టడానికైనా వీళ్ళు ఎనకాడరు. ఎంత గొడవ చెయ్యడానికైనా తయారు. ’ఆంద్రోళ్ళ’ మీద విషం గక్కడమే కదా వాళ్ళ లక్ష్యం. కోస్తా సీమల ప్రజలను  తిట్టడమే వాళ్ళ ధ్యేయం.  ఇలాంటి అవకాశాన్ని ఎందుకొదులుకుంటారు? ముస్లిముల మనోభావాలంటే బయ్యంగానీ ఆంద్రోళ్ళ మనోభావాలంటే వాళ్ళకేం పట్టింది?

మరో సారుండారు.. వరవరరావు!  వీరు అసలు మాట మాత్రమైనా విమోచన దినం గురించి చెప్పినట్టు లేదు. ముస్లిములకు వ్యతిరేకమైన విషయంపై మాట్టాడ్డమంటే అది దేశద్రోహమే గదా! అంచేత వారు మాటాడ్రు. కానీ రేపు సెప్టెంబరు 24  న అయోధ్య వివాదంపై కోర్టు తీర్పొచ్చాక మాత్రం బైటికొస్తారు.  అయోధ్యలో  మసీదు కట్టించాల్సిందేనని డిసెంబరు 6 న డిమాండేందుకు మాత్రం  నోళ్ళొస్తాయ్, ఉద్యమాలు చేసేందుకు కాళ్ళొస్తాయ్! ఇస్లామిక్ మార్క్సిజమ్  ప్రత్యేకతే అంత మరి!  ముస్లిము మార్కు మార్క్సిస్టుల వ్యవహారశైలే అంత!

 మొత్తమ్మీద విమోచనం , విలీనం అంటూ మాటలు మార్చి వీళ్ళంతా ఆత్మవంచన చేసుకున్నారు, జనాన్ని వంచించారు.

Categories: తెలంగాణ

పొద్దులో నేను..

September 15, 2010 5 comments

ఈమధ్య మా స్నేహితుడొకణ్ణి కలిసినపుడు, పొద్దు చూసావా అని అడిగాను.  వాడు నన్నోసారి వింతగా చూసి, ’నేను చూసేసరికి నడినెత్తిన ఉంటది, ఇంకేం చూస్తాను?’ అన్నాడు. అది కా దది కాదు..  పొద్దు, పొద్దు పత్రిక! చదివావా? అని అడిగాను. నన్నొక పిచ్చివాణ్ణి చూసినట్టు చూసాడు. వాడికి ముందే పత్రికలు, పుస్తకాలు, చదవడం లాంటివంటే ఎలర్జీ.  చిన్నప్పుడెప్పుడో చందమామ చదివితే, ఒళ్ళంతా దద్దుర్లు వచ్చాయంట. సైన్సు పుస్తకం చదవబోతే కళ్ళు వాచిపోయినై. అప్పటినుంచీ, పుస్తకాల జోలికి వెళ్ళకుండా జాగర్తగా నెట్టుకొస్తున్నాడు. అలాంటివాణ్ణి పొద్దు చదివావా అని అడిగితే, వాడు నావంక అయోమయంగా చూడ్డూ మరి!

వాడి సంగతి తెలిసీ అలా ఎందుకడిగానంటే దానికీ కారణముంది మరి.  పొద్దు పత్రికలో చిన్నదో చితకదో పని చేస్తూ ఉన్నాను కాబట్టి, ఆ ముక్క చెప్పుకోవాలన్న దురదొకటి నాకుంది కాబట్టి, అదేదో మనోళ్ళకి చెప్పుకుంటే కుసింత గౌరవంగా ఉంటదని కాబట్టిన్నీ వాడికి చెప్పుకున్నాను. దురద పుట్టినపుడు దేనితో గోక్కుంటన్నామో పట్టించుకోం గాబట్టి, పోయిపోయి మావాడితో గోక్కోబోయాను. వాడు లాబం లేదని తెలిసిపోయాక, ఇహ నా బ్లాగులో రాసేసుకుంటే మీరన్నా చదవకపోతారా అని ఇదిగో, ఇలా..

పొద్దులో వచ్చిన గొప్ప రచనల గురించి కాదీ టపా. వాటి గురించి రాస్తే నాకేమొస్తది, నా రచనల గురించి రాసుకుంటే కుసింత సమ్మగా ఉంటది గాని. 🙂 అంచేత గొప్పవాటి జోలికి పోకుండా నా రచనల గురించి నాలుగు ముక్కలు చెబుతా.

నెలకోటి చొప్పున బ్లాగుల సింహావలోకనాలు రాసేవాణ్ణి. ఈ మధ్య రాయడం లేదులెండి. వాటిల్లో అప్పుడప్పుడూ నా వ్యాఖ్యలు కూడా ఒహటో రెండో పడేసేవాణ్ణి. దాంతో ఓసారి చిన్నపాటి రభసైంది బ్లాగుల్లో. 🙂

అప్పుడెప్పుడో బ్లాగుల పేరడీ అని ఒకటి రాసాను. దాని రెండో భాగం కూడా రాసానుగానీ, అది చదవనక్కర్లేదు. 🙂 డా. కేశవరెడ్డి గారి అతడు అడవిని జయించాడు పుస్తక సమీక్ష కూడా రాసాను. ఈ ముక్క రాస్తూంటే నాకు ఆ నవల మళ్ళీ చదవాలనిపిస్తోంది. మీరు నా సమీక్ష చదువుతారో లేదోగానీ, ఆ నవల చదివి ఉండకపోతే మాత్రం, తప్పక చదవండి. 

ఒకటో రెండో సంపాదకీయాలు రాసాను. ఇస్రో గురించి ఒకటి, ప్రాథమిక విద్య మీదొకటీ రాసాను. ఈ మధ్య ఒక గళ్ళనుడికట్టు కూడా కూర్చి, మిగతా సంపాదకుల కళ్ళుగప్పి ప్రచురించేసాను కూడా. 🙂

ఇవేగాక మంచి రచనలు కూడా వచ్చాయి పొద్దులో, వీలైనప్పుడు చదవండి. నే రాసినవాటిని మాత్రం వీల్లేకపోయినా చదవండి.

——————————-

పొద్దు పొడిచిన నాలుగేళ్ళ తరవాత, దానికి ఒక కొత్త రూపాన్ని ఇస్తే బాగుంటుందని తలచాం. ప్రస్తుత రూపానికి తెచ్చాం. ముఖ్యమైన విశేషమేంటంటే.. పాత వ్యాసాలు చక్కగా అందుబాటులో కొచ్చాయి. మమ్చిమమ్చి రచనలను చప్పుచప్పున వెతికి పట్టుకుని చదివేసెయ్యొచ్చు. పొద్దును క్రమం తప్పకుండా చదువుతూండే పాఠకులు కూడా కొన్ని పాత వ్యాసాలు చదివి ఉండరు. పాతరూపంలో ఆ వసతి సరిగ్గా ఉండేది కాదు మరి.

  కొత్త పొద్దును ఇంకా చూసి ఉండకపోతే ఓసారి చూసి, ఓ మాట అనండి.

   పోయినోళ్ళందరూ మంచోళ్ళే..

   September 10, 2010 27 comments

   పోయినోళ్ళందరూ… మంచోళ్ళు! ఉన్నోళ్ళూ పోయినోళ్ళ తీపి గురుతులు!!  -ఆత్రేయ చెప్పాడంట.

   రాశేరె కూడా పోయాడు. కాబట్టి చాల మంచోడు! 

   రింగురోడ్డు వ్యవహారంలో  స్వజనుల కోసం, స్వలాభం కోసం  రాశేరె ప్రభుత్వం మెలికెలు తిరిగిందనీ, రింగురోడ్డును మెలికెలు తిప్పిందనీ ఇప్పుడు తేలిపోయింది.  అది రింగురోడ్డు కాదు, రాంగురోడ్డని తేలిపోయింది. అయినా సరే.., చచ్చిపోయాడు కాబట్టి, మంచోడే! స్టాంపులు వెయ్యొచ్చు!

   ముఖ్యమంత్రిగా ఉండగా బాగా డబ్బు సంపాదించుకున్నాడని, పాపం సోనియా కూడా చెప్పుకుని వాపోయిందంట. ఆ సంగతి తెలిసి  కూడా, అతడు “పార్టీకి చేసిన సేవల”ను  దృష్టిలో ఉంచుకొని రెండుసార్లు ముఖ్యమంత్రిని చేసానని చెప్పిందంట.   “పార్టీకి సేవ” చెయ్యడంలో అంతరార్థం ఏమిటో, అతడు చేసినది పార్టీ సేవో, సోనియా సేవో జనపథికులకెరుక! మనకు మాత్రం ఒక సంగతి తెలిసింది – “పార్టీ” సేవలో భాగంగా మన డబ్బు మింగేసాడని! “పార్టీ”కి సేవ చేస్తున్నాడు కాబట్టి సోనియాకు సమ్మగానే ఉండేది కాబోలు!

   ఏదేమైనప్పటికిన్నీ.., రాశేరె చచ్చిపోయాడు కాబట్టి, అతడు చాల మంచోడు. వీధివీధికీ విగ్రహాలు పెట్టొచ్చు.

   అల్లుడికి ఎకరాలు రాసియ్యడం చూసాం. కానీ ఊళ్ళు రాసిచ్చెయ్యడం మాత్రం బయ్యారంలో చూసాం. ఊరుమందే తోసెయ్ అన్న సినిమా డైలాగు విన్నాం. కానీ ఊరు మందే తవ్వేయ్ అని చెప్పి, అప్పజెప్పేసినవాణ్ణి చూసాం మనం. మన ఖర్మ అది!  అయినా సరే… అతడు చచ్చిపోయాడు కాబట్టి రాశేరె  చాల మంచోడే! అతడి పేరు జిల్లాకి పెట్టెయ్యొచ్చు.

   సిమెంటు  ఫ్యాక్టరీ, స్టీలు ఫ్యాక్టరీ, విద్యుత్తు ప్రాజెక్టులు, రియలెస్టేటు,  పేపరు, టీవీ,..  ఐదంటే ఐదే ఏళ్ళలోపు ఇవన్నీ సాధ్యపడ్డాయి. మన డబ్బుల్ని అడ్డంగా దోచేస్తే ఇవేంటి, ఇంకేమైనా సాధ్యమే!  వీటన్నిటికీ మూలధనం కింద సెజ్జుల పేరుతో భూములు, జలయజ్ఞాలు, (అ)సత్యాలు మొదలైనవి ఆహుతయ్యాయి.

   ఐనా సరే…   

   రాశేరె ముఖ్యమంత్రిగా ఉండగా పనిచేసి రిటైరైన అయ్యేయెస్ అధికారి రామచంద్ర సమాల్ ఇలా అన్నాడు..
   “ఆంధ్రప్రదేశ్ భూగర్భాన్ని సముద్రంలోపల, సముద్రం బయటా ఇంత వ్యవస్థీకృతంగా దోపిడి చేయటం ఎప్పుడూ చూడలేదు.”
   “..అన్ని ఇంజినీరింగ్ విభాగాల్లో ప్రస్తుత నాణ్యత నియంత్రణ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ప్రత్యామ్నాయం ఒక భ్రమ. అందరూ కాంట్రాక్టర్లుగా మారిపోయారు.”

   ఐనా సరే… చచ్చిపోయాడు కాబట్టి అతడు చాల మంచోడే!

   పోయినోళ్ళందరూ మంచోళ్ళే.. ఉన్నోళ్ళం మాత్రం వాళ్ళ కాటుకు, వాళ్ళ వేటుకు , వాళ్ళ  మేళ్ళకూ బలైన వాళ్ళం.

   మబ్బులు చూపించి.. ముంత ఒలకబోయించి..

   September 6, 2010 14 comments

   కొందరు తెవాదుల అకృత్యాలు ఉండేకొద్దీ వికృత రూపాన్ని తీసుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. డిసెంబరు తరవాత ’అలజడి సృష్టించడానికి’ ఇప్పటినుండే రిహార్సళ్ళు చేసుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. మొన్న ఉస్మానియాలో తెవాదులు పేపర్లు దిద్దే పంతుళ్ళను వెంటబడి మరీ దాడి చేసి కొట్టారు.  అప్పుడు చేసిన తప్పును కప్పిపుచ్చే అవకాశం గ్రూప్ వన్ పరీక్షల రూపంలో ఇప్పుడు వచ్చింది. వెంటనే అవకాశాన్ని అందుకున్నారు. ప్రజలకు అబద్ధాలు చెప్పి, వాళ్ళ మనసులను విషపూరితం చేసే ఏ అవకాశాన్నీ ఈ దుష్ట తెవాదులు ఒదులుకోరు. గ్రూప్ వన్ పరీక్షలు ఆపెయ్యాల్సిందేనంటూ గోల చేసారు.

   అసలు ఏ కారణంతో ఈ పరీక్షలు ఆపాలనే ప్రశ్నకు తెవాదుల దగ్గర సరైన సమాధానం లేదు. ఆ ఉద్యోగాల్లో తమకు 42% రిజర్వేషన్లు కావాలని వాళ్ళ డిమాండు. గ్రూప్ వన్ ఉద్యోగాలకు ప్రాంతీయ రిజర్వేషన్లు లేవు.  అయినా  అడుగుతున్నారు.  అలా మొదలుపెట్టినప్పటికీ, తమ వాదనలో పస లేదని గ్రహించాక, దాన్ని మార్చారు. కమిషను చైర్మను వెంకట్రామిరెడ్డిని తీసేసాక మాత్రమే పరీక్షలు పెట్టాలంట.  ఎందుకూ? అతడు ఇంటర్వ్యూల్లో తెలంగాణ వాళ్ళకి అన్యాయం చేసాడంట,  ఇప్పుడూ చేస్తాడంట.

   వెంకట్రామిరెడ్డికి అన్యాయం చేసే అవకాశం ఎప్పుడొస్తది? ఈ మొదటి అంచె  ఫలితాలు రావాలి, ఆ తరవాత రెండో అంచె జరగాలి, వాటి ఫలితాలు రావాలి, ఆ పైన ఇంటర్వ్యూలు జరగాలి. ఇవన్నీ జరిగేటప్పటికి అతడెలాగూ ఉండడు. ఒకవేళ ఉన్నా, ఈ లోగా అతణ్ణి తప్పించమని వత్తిడి చెయ్యొచ్చు.  ఇదంతా  దాచిపెట్టేసి,  పరీక్షలను అడ్డుకోవాలని, రాసేవాళ్ళను చెల్లాచెదురు చెయ్యాలని ప్రయత్నించారు. ఉస్మానియా బియ్యీడీ కాలేజీ సెంటరులో పరీక్షలను రద్దు చేయించడంలో విజయులయ్యారు కూడాను. (అసలు రౌడీమూకల మధ్య పరీక్ష పెట్టి, వాళ్ళ నుండి రక్షణ కోసం వందల మంది పోలీసులను పెట్టడం ఎందుకు?)

   ఈ డ్రామాలో  విలన్లే కాదు, జోకర్లూ ఉన్నారు -కాంగ్రెసు ఎంపీలు! వాళ్ళు బియ్యీడీ కాలేజీని ముట్టడించడానికి పోతూంటే పోలీసులు అరెస్టు చేసి వానులో తీసుకెళ్తుండగా, టీవీల్లో చూపించారు. ఆ పిచ్చి సన్నాసులను  చూస్తే నవ్వొచ్చింది. తోలుబొమ్మలాటలో బొమ్మల్లాగా ఉన్నారు. కోతులాటలో కోతుల్లాగా ఉన్నారు. అయ్యగారికి దణ్ణంపెట్టూ అని ఆడించేవాడు అనగానే నెత్తిన చేతులు పెట్టుకునే కోతిలాగా అనిపించారు. ఈ చవటాయిల్ని, ఈ తోలుబొమ్మల్ని ఒక ఆట ఆడిస్తున్నాడు కేసీయారు. అతడాడిస్తూంటే ఈ కేతిగాళ్ళు తైతక్కలాడుతున్నారు.  ఒకళ్ళిద్దరు కాదు..,  నలుగురో ఐదుగురో ఎంపీలు.  ఒకవేళ కేసీయారు చెప్పినట్టు వీళ్ళు ఆడలేదనుకోండి.. ’చూడండి,  మనమంటే వీళ్ళకు లెక్ఖలేదు, తెలంగాణ పట్ల వీళ్లకి  శ్రద్ధలేదు’ అని తిట్టి, ప్రజలచేత తిట్టిస్తాడేమోనని ఈళ్ళ భయం!

   ఆ ఎంపీల్లోనే ఒకతడు మొన్నొక నాటకం కూడా ఆడాడంట.. ఈ పరీక్షల అక్రమం గురించి సోనియాతో మాట్టాడాను, అహ్మద్ పటేలుతో మాట్టాడాను, వీరప్పతోటీ, దారిన పోయే దానప్పతోటి మాట్టాడాను అంటూ టీవీ వాళ్ళకి అబద్ధాలు చెప్పాడంట. వెంటనే ఆ దానప్పలు అబ్బెబ్బే , మాతో టెవడూ మాట్టాడలేదు, అసలు మాకు ఆ పరీక్షలతో సంబంధమేమీ లేదు అంటూ తేల్చేసారు.

   ఇలా అబద్ధాలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆ ఎంపీకి? ఇలా తోలుబొమ్మల్లాగా తైతక్కలాడాల్సిన ఖర్మ ఎందుకు పట్టింది వీళ్ళకి? తమ డిమాండు తెలివితక్కువదనీ, దాన్ని అడ్డం పెట్టుకుని ఇలా పరీక్షను అడ్డుకుంటే  కుర్రాళ్ళకు నష్టమనీ తెలిసి కూడా వీళ్ళీ దౌష్ట్యానికి ఎందుకు ఒడిగట్టినట్టు?  ’నీకంటే పెద్ద తెవాదిని నేనూ, ఒట్ఠీ తెవాదిని నేనూ’  అని చెప్పుకోవాలనే దురద కాకపోతే ఇంకేంటి?

   కేసీయారు చూడండి ఏమంటున్నాడో..  ఇప్పటికైనా ప్రభుత్వం ’చెంపలేసుకుని, పరీక్షను రద్దు చేసి మళ్ళీ పెట్టాలం’ట!  తప్పు చేసింది తామైతే, ప్రభుత్వం ఎందుకు చెంపలేసుకోవాలి?  ’ఈ రకంగా పరీక్ష పెట్టడం ప్రపంచంలో ఇంకెక్కడా జరగలేదం’ట.  ఇలాంటిది ప్రపంచంలో ఇంకెక్కడైనా జరిగి ఉంటుందో ఉండదో తెలవదు గానీ, ఈ తెవాదుల వంటి ఉద్యమకారులు మాత్రం ప్రపంచంలో ఎక్కడా ఉండి ఉండరు.   వీళ్ళలాగా ప్రజల గుండెల్లో విషం గక్కినవాళ్ళు, వీళ్ళలాగా మబ్బుల్ని చూపించి, ముంతలో నీళ్ళను ఒలకబోయించేవాళ్ళు మాత్రం ఇంకెక్కడా ఉండరు.  వస్తదో రాదో తెలీని, వచ్చినా ఎప్పుడొస్తదో తెలీని, తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పి, ఇవ్వాళ కుర్రాళ్ళ నోట మట్టిగొట్టారు.

   తెలుగు  ప్రజలకు పట్టిన  చీడ, ఈ దుష్ట తెవాద రాజకీయ నాయకులు.  తమ రాజకీయ ప్రయోజనాల కోసం  వీళ్ళు అమాయక ప్రజలకు చేస్తున్న అన్యాయం  అనన్య సామాన్యం!

   Categories: తెలంగాణ

   తెలుగులో వెతకటం అంత వీజీ కాదు గురూ!

   (ఈ వ్యాసంలో కొన్ని పదాల పక్కన బ్రాకెట్లలో అంకెలు చూపించాను. అవి – ఆగస్టు 2 రాత్రి ఆయాపదాల కోసం గూగిలించినపుడు వచ్చిన ఫలితాల సంఖ్య. మళ్ళీ వెతికితే ఈ ఫలితాలు కొద్దిగా అటూఇటూ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ రాసినదంతా గూగుల్లో వెతకడాన్ని దృష్టిలో పెట్టుకుని రాసినదే. గూగిలించడం అంటే google.com లో వెతకడం.) 

   —————————–

   జాలంలో ఏదైనా సమాచారం కోసం వెతకాలంటే సెర్చింజనే గతి. సెర్చింజనుకు మారోపేరు గూగులైపోయింది కాబట్టి, గూగులే గతి అన్నమాట. ఆ గూగులుకేమో తెలుగు రాదు. పదం తప్పుగా ఇచ్చినా దానికి తెలీదు. పైగా తెలుగు పదాలను రకరకాలుగా రాస్తూంటాం. (రాస్తూ ఉంటాం, రాస్తూ ఉంటాము, రాస్తూంటాం, రాస్తుంటాం, రాస్తుంటాము, ఇలా రకరకాలు, కొన్ని ఒప్పులు, కొన్ని తప్పులూను. ఇది కాకుండా ’వ్రా’సే గోల ఒకటుంది. దాని జోలికిపోతే బుర్ర ఖరాబౌద్ది కాబట్టి నే బోను). ఇహ, పదబంధాలను రాసే విధానాలు కొల్లలు. ఇతర భాషల నుంచి తెచ్చుకున్న పదాలూ అంతే. ఫలానాది రైటనీ మరో ఫలానాది తప్పనీ అంటానికి లేదు. ఇన్ని బాధలకు తోడు, ఆయా పదాల కోసం వెతికేవాడి బాధ చూడండిక! ఈమధ్య కొత్తపాళీ గారు ఒక వ్యాఖ్యలో రాసిన ఒక పదబంధం కోసం వెతికాను. ఆ కథ చెబుతాను, చిత్తగించండి. అసలా కథ కోసమే ఈ ఉపోద్ఘాతం.

   మాలతిగారి బ్లాగులో కొత్తపాళీగారు వ్యాఖ్య రాస్తూ ’కుప్పుస్వామయ్యరు మేడ్దిఫికల్టు’ అని రాసారు.  అది చాలా ప్రసిద్ధమైన  చెతురు, గురజాడ కన్యాశుల్కంలో రాసినది.  గూగుల్లో వెతకబోయాను దాని కోసం. వెతికాక, జాలంలో అదేమంత ప్రసిద్ధమైనది కాదని తెలిసింది. ఎందుకంటే, దీనికి రెండంటే రెండే ఫలితాలొచ్చాయి. ఫలితాలు రెండైనా, రెంటిలోనూ  టెక్స్టు ఒకటే -ఆయన రాసినదే!  ఒకటి ఒరిజినలు, రెండోది దాన్ని చూపించిన అగ్రిగేటరు.

   ఇదేంటి, ఇంత ప్రసిద్ధమైన ప్రయోగాన్ని మనవాళ్ళు అసలు వాడటం లేదా అని అనుమానం వచ్చి,  కొద్దిగా మార్చి,  కుప్పుసామయ్యరు, కుప్పుసామయ్యర్, కుప్పుస్వామయ్యరు, కుప్పుస్వామయ్యర్ ఇలా వివిధ వికల్పాలతో వెతికితే, కింది ఫలితాలొచ్చాయి:

   కుప్పుసామయ్యరు మేడ్డిఫికల్టు — 1
   కుప్పుసామయ్యర్ మేడ్డిఫికల్టు — 2
   కుప్పుస్వామయ్యరు మేడ్డిఫికల్టు — 2
   కుప్పుస్వామయ్యర్ మేడ్డిఫికల్ట్ — 2
   ఆశ చావక, మళ్ళీ కొద్ది మార్పుచేర్పులతో వెతికాను.  ఇంకోటి దొరికింది.
   “కుప్పుసామయ్యర్ మేడ్ డిఫికల్ట్” – (ముందు 109 అని చెప్పింది, తరవాత 10 అని చూపించింది. ఏంటో మరి!)

   అంటే ఏంటనమాటా..? వెతికేటపుడు ఆయా పదాలకు సంబంధించిన  ఇతర రూపాల కోసం కూడా వెతకాలి. అప్పుడే మనకు అవసరమైన దాన్ని పట్టుకోగలుగుతాం. అలాగే, రాసేవాళ్ళు కూడా పదాలను రాసేటపుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సందేహం వచ్చినపుడు ఒకసారి గూగులించి చూస్తే, తప్పులను నివారించవచ్చు.

   (ఇలా వెతుకుతూండగా.. నా బ్లాగులోనే నేను దీన్ని రెండుచోట్ల రెండు రకాలుగా – కుప్పుసామయ్యర్ మేడ్డిఫికల్టు అనీ, కుప్పుసామయ్యరు మేడ్డిఫికల్టు అనీ –  రాసినట్టు గ్రహించాను. అసలందుకే ఈ వ్యాసం రాయాలనిపించింది. నేను చేసిన తప్పును మనందరం చేస్తున్నట్టుగా కతల్జెబుతున్నాను చూసారా? తెల్లోడి తెలివితేటలు!)

   సరే, వెతికేటపుడు మనక్కావల్సిన పదం కోసమే కాక, దానికి కాస్త అటూ ఇటూగా ఉండే తప్పొప్పుల కోసం కూడా వెతకాలన్నమాట. స్థూలంగా, కొన్ని సూత్రాలు గుర్తెట్టుకోవాలి:

   1. పరాయిభాష – ముఖ్యంగా ఇంగ్లీషు – లోని మాటకోసం వెతుకుతూంటే,  ఆ పదం యొక్క అజంత, హలంత రూపాలు రెండింటి కోసమూ వెతకండి. ఉదాహరణకు, డిఫికల్ట్ (136) కోసం వెతుకుతూంటే డిఫికల్టు (1) కోసం కూడా వెతకండి.
   2. అనుస్వారంతో అంతమయ్యే పదాల కోసం వెతుకుతున్నపుడు, ’ము’ తో అంతమయ్యే రూపం కోసం కూడా వెతకండి. ’భయం’ (2,21,000)  కోసం వెతికేటపుడు, ’భయము’ (9,010)  కోసం కూడా చూడండి.
   3. పదబంధం కోసం వెతుకుతున్నపుడు, అందులోని పదాలను విడదీసి, కలిపేసి -రెండు రకాలుగానూ వెతకండి.  ఉదాహరణకు  బట్టతల  (4,790) కోసం వెతకబోయినపుడు “బట్ట తల”  (2,020) కోసం కూడా వెతకండి (డబులు కోట్‍లు పెట్టండి, లేకపోతే బట్టల్నీ తలల్నీ కూడా చూపించేస్తది)
   4. ఇహ మధ్యలో పొల్లు వచ్చే పదాలుంటాయి. వాటి కథ భిన్నంగా ఉంటది. అది మరోసారి.

    కంప్యూటరు కీబోర్డు మీద ఎడాపెడా వాయించేటపుడు ఒక అక్షరం బదులు మరో అక్షరం పడుతూంటుంది.  ఇది అందరికీ పడదులెండి,  వేళ్ళు మందంగా ఉన్న నాబోటి వాళ్ళకి మాత్రమే ఇది జరుగుతుంది. ముఖ్యంగా తెలుగు టైపించేటపుడు గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘమూ తప్పులు పడుతూంటాయి. ’కు’ బదులు ’కి’, ’కీ’ బదులు ’కూ’ ఇలాంటి టైపాట్లు పడుతూంటాయి.  ఏం చేస్తాం, మనిషికో వైకల్యం మహిలో సుమతీ!

   ఇవీ, ఇలాంటి ఇతర తప్పులనూ అలాగే ఉంచి ప్రచురించడం వలన, అవి జాలంలోకి చేరుకుంటున్నాయి. బద్ధకించి కొందరు, తప్పులు కనబడక కొందరు, అవి తప్పులని తెలీక కొందరూ వదిలేస్తారు. కొందరుంటారు, ’ఏఁ, తప్పు రాస్తే ఏంటంట? కొంపలంటుకుంటాయా? ’అని వదిలేస్తారు . ఎలాగన్నా వదిలెయ్యనీండి, తప్పులు జాలంలోకి దొర్లుకొస్తాయి. 

   మరి గూగులు తెలివైన దంటారే…? 
   నిజమే, గూగులు తెలివైనదే. ఒక్కోసారి మనం పదాన్ని కొద్దిగా అటూ ఇటూగా, స్పెల్లింగులు తేడాగా  ఇచ్చినా, ’ఏంటి బాబూ, నువ్వు అడగదలిచింది ఇదిగానీ కాదు గదా : ’అంటూ అసలుదాన్ని చూపిస్తుంది. అయితే ఇంగ్లీషు భాషకో, మరోదానికో చూపిస్తుందిగానీ, తెలుక్కి చూపించదు.  పాపం దానికింకా పూర్తిగా తెలుగు రాదు.

   పదబంధాల్లోని పదాలను కలిపి రాయాల్సిన చోట విడదీసి, విడదీసి రాయాల్సిన చోట కలిపీ రాస్తూంటాం కదా.. ఉదాహరణకు వేటగాడు అనే మాట చూడండి, దీనిలోని వేట గాడు అనేవి మాటలను విడిగా రాయకూడదు. కానీ వీటిని విడదీసి రాస్తూంటారు.  వెతుకులాటలో తేడాలొస్తాయి. వేటగాడుకు 5,390 ఫలితాలొస్తే, “వేట గాడు”కు 4 ఫలితాలొచ్చాయి.  ఇలాంటి మాటలు రాసేటపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. విశేషమేంటంటే, వేటకాడు అని కూడా కొన్నిచోట్ల రాసారు. వెతుకులాటలో దీనికి 29 ఫలితాలొచ్చాయి.

   మనుషుల పేర్లను కూడా రకరకాలుగా రాస్తూంటాం. ఉదాహరణకు నందమూరి తారకరామారావు, నందమూరి తారక రామారావు, నందమూరి తారక రామా రావు అని రకరకాలుగా రాస్తూంటాం. అంతెందుకు.., ఉత్త నందమూరి అనే పేరును నంద మూరి అని విడగొట్టి రాస్తున్నారని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. నందమూరికి  2,71,000 ఫలితాలొస్తే, “నంద మూరి” కి 123 ఫలితాలొచ్చాయి.  చిత్రమేంటంటే, క్షమాపణ (87,700)ను “క్షమా పణ ” (47) అని కూడా రాస్తున్నారు.

   ఇంకో చిన్న పరిశీలన. తెలంగాణ ను ఎన్ని రకాలుగా రాస్తామో చూడండి:

   • తెలంగాణ (4,37,000)
   • తెలంగాణా (4,34,000)
   • తెలంగానా (26,300)
   • తెలంగాన (14,400)
   • తెలింగాణా (47)
   • తెలింగాణ (7)
   • తెలింగానా (44)
   • తెలింగాన (2)
   • తెలగాణ (2,230) 
   • తెలగాన (6)
   • తెలగానా (3)
   • తెలగాణా (59)

   తెలంగాణ కోసం వెతికేవాళ్ళు, తెలగాన  కోసం కూడా వెతికే అవకాశం చాలా తక్కువ.  మనం మన వ్యాసంలో  తెలగాన అని రాసి ఉంటే, గూగులు ద్వారా అది చదువరులకు అందే అవకాశం దాదాపు లేనట్టే – ఇహ,  ప్రత్యేకించి లింకులిచ్చుకుంటూ ప్రచారం చేసుకోవాల్సిందే.

   ఒక్కమాట – ’ఆ, ఇప్పుడు నేను రాసే బోడి రాతలు వెతుకులాటలో కనబడకపోతే మాత్రమేంటిలెండి ’ అని మాత్రం అనకండి.  ఎక్కడినుంచో కాపీకొట్టి, దించిపారెయ్యనంతవరకు ఏదీ బోడిరాత కాదు. అన్నీ అవసరమే!  కాదేదీ సెర్చి కనర్హం!  ఇంకోటి – మనం రాసేది, పాఠకులను చేరటానికి.  పాఠకుణ్ణి చేరాలంటే జనం గూగిలించినపుడు మనమూ ఫలితాల్లో కనబడాలి.

   మనం తప్పులు దిద్దుకోవాలని చెప్పకుండా గూగులుకు తెలుగు నేర్పమంటావేంటయా అని నన్నడగొద్దండి. ఆ రెండోదే తేలిక.  ఎందుకంటే,  తెలుగు ఎట్టా ఏడ్చినా ఫర్లేదులెమ్మని మనలో చాలామందిమి అనుకుంటాం. అదే.., ఇంగ్లీషులో చిన్నవెఁత్తు తప్పు దొర్లితే భ్రూణహత్య చేసినంత పాపంగా భావించి, తల్లడిల్లిపోతాం.

   ————————————————–

   (బ్రాకెట్లలో ఇచ్చినవి – ఆగస్టు 2 న ఆయాపదాల కోసం గూగిలించినపుడు వచ్చిన ఫలితాల సంఖ్య. మళ్ళీ వెతికితే ఈ ఫలితాలు కొద్దిగా అటూఇటూ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ రాసినదంతా గూగుల్లో వెతకడాన్ని దృష్టిలో పెట్టుకుని రాసినదే. గూగిలించడం అంటే google.com లో వెతకడం.)

   శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణ ప్రజల అభిప్రాయం

   తెలంగాణ ప్రజలు తమకు తెలంగాణ కావలసిందేనంటూ తమ అభిప్రాయం స్పష్టంగా చెప్పారు. వివిధ వేదికల మీద ఇన్నాళ్ళుగా చెబుతూ వచ్చిందే ఇప్పుడు అది ఓటేసి – ఒట్టేసి – మరీ చెప్పారు.

   దాదాపుగా అందరూ ఊహించిన ఫలితమే ఇది. ఎన్నికలు పూర్తిగా తెలంగాణ వాదం ప్రాతిపదికగానే జరిగాయి. ప్రజలు తెలంగాణ కావాలని బలంగా కోరుకుంటున్నారనేది సర్వవిదితం. కాబట్టి, మొత్తమన్ని స్థానాల్లోనూ తెరాస, బీజేపీలే గెలుస్తాయని అనుకున్నదే. అయితే ఈ స్థాయిలో గెలుస్తారని, మెజారిటీలు ఇంత ఎక్కువగా ఉంటాయనీ, మిగతా పార్టీలను ఇలా ఊడ్చవతల పారేస్తారనీ ఊహించలేదు. ఆ విధంగా ఈ ఎన్నికల ఫలితాలు కొంత ఆశ్చర్యం కలిగించేవే!

   ఈ ఫలితాల ద్వారా కొత్తగా తెలంగాణ వాదానికి ఒనగూడిందేమీ లేదు. వచ్చే డిసెంబరు దాకా పరిస్థితిలో కొత్తగా వచ్చే మార్పులేమీ లేవు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చేంతవరకూ తెలంగాణ సమస్యలో కొత్తగా వచ్చే మలుపులేమీ ఉండవు. ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెసు, తెదేపాలు తమతమ విధానాలను సమీక్షించుకుని, కొత్త విధానాలను అనుసరిస్తారనో, మరేదైనా మార్పుచేర్పులు చేస్తారనో నాకైతే అనిపించడం లేదు. అయితే ఎంతో కొంత మథనం ఉండే అవకాశం లేకపోలేదు.

   అన్ని స్థానాలనూ గెల్చుకున్నందుకు తెరాస, బీజేపీలు సంతోషిస్తున్నారు. ప్రజలు తెలంగాణ పట్ల ఇంత తీవ్ర పట్టుదలతో ఉన్నారన్నది వాళ్లకు సంతోషం కలిగించవచ్చు. అయితే, ఈ గెలుపుకు వాళ్ళ సొంత బలమేమీ కారణం కాదు. ప్రజల్లో తెలంగాణ పట్ల ఉన్న బలమైన ఆకాంక్షే, అద్బుతమనిపించే మెజారిటీలతో వాళ్లను గెలిపించింది. వాళ్ళ స్థానంలో వేరే ఎవరున్నా గెలిచేవారే. ఆ సంగతి అందరితో పాటు వాళ్లకూ తెలుసు.

   నేపథ్యంలో ఉండి, ఈ గెలుపు కృషి చేసినవాళ్ళు ఉన్నారు. తెలంగాణ వాదాన్ని గెలిపించడం ఎంత కీలకమో ప్రచారం చేసి, ప్రజలకు ఉద్బోధించిన ఉద్యమకారులు వాళ్ళు -ఉద్యోగులు, లాయర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు వగైరాలు.

   ఈ ఎన్నికల ఫలితాల శ్రేయస్సులో సింహభాగం ప్రజలకే చెందుతుంది. తెలంగాణను కోరుకున్నారు కాబట్టే.. డబ్బు, మందులాంటివి ఈ ఎన్నికల్లో పనిచెయ్యలేదు. తెలంగాణ ఏర్పడితే అతి తక్కువ లాభపడే వర్గం ఈ ఓటర్లలోని దాదాపు 80 శాతం మంది. లాభమంతా పై రెండువర్గాల వాళ్లకే. ఈ వర్గమే, పై రెండువర్గాలకూ బలం.

   ఏదెలాగైనా ఉణ్ణీండి.., ఈ ఫలితాల ద్వారా శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణ ప్రజలు తమ అభిప్రాయం చెప్పేసినట్టే!

   Categories: తెలంగాణ